||సుందరకాండ ||

||అరువది రెండవ సర్గ తెలుగులో||



||ఓమ్ తత్ సత్||
శ్లో|| తానువాచ హరిశ్రేష్ఠో హనుమాన్ వానరర్షభః|
అవ్యగ్రమనసో యూయం మధుసేవత వానరాః||1||
అహమావారయిష్యామి యుష్మాకం పరిపంథినః|
స|| హరిశ్రేష్ఠః వానరర్షభః హనుమాన్ తాన్ ఉవాచ|వానరాః యూయం అవ్యగ్రమనసః మధుసేవత||యుష్మాకం పరిపన్థినః అహం ఆవారయిష్యామి ||
తా|| వానరులలో శ్రేష్ఠుడు వృషభము వంటి వాడు అగు హనుమంతుడు ఆ వానరులతో ఇట్లు పలికెను. 'ఓ వానరులారా మీరు నిశ్చింతగా మధువ్హును సేవించుడు.మిమ్ములను ఆపువారిని నేను ఆపెదను'.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ద్విషష్టితమస్సర్గః||

రామునికి సీతమ్మవార్త చెప్పి రాముని అనుసరించి తదుపరి కార్యము చేయుదము అని జాంబవంతుడు చెప్పిన సలహా విని వానరులు రాముడు ఉన్నచోటికి బయలుదేరిరి. ఆ దారిలో వారు మధువనము చూచిరి. అంగదుని అనుమతితో అచట ఆగుటకు నిశ్ఛయించిరి.

అప్పుడు వానరులలో శ్రేష్ఠుడు, వృషభము వంటి వాడు అగు హనుమంతుడు ఆ వానరుల తో ఇట్లు పలికెను. 'ఓ వానరులారా మీరు నిశ్చింతగా మధువ్హును సేవించుడు. మిమ్ములను ఆపువారిని నేను ఆపెదను'.

హనుమంతుని ఈ వాక్యములను విని ప్రవరుడు అంగదుడు వానరులతో ఇట్లు పలికెను. 'ఓ వానరులారా ! ప్రసన్నాత్ములై మధువును సేవించుడు. కృతకృత్యుడైన హనుమంతుని మాటలతో చేయతగని కార్యము కూడా చేయతగును. అప్పుడు ఇలాంటి కార్యమునకు చింతించ నవసరము లేదు'. వానర శ్రేష్ఠులు అంగదుని ఈ వచనములను విని సంతోషపడినవారై మంచిది మంచిది అని అంగదుని పూజించిరి. ఆ వానరులందరూ అంగదుని ఆ విధముగా పూజించి, నదీ ప్రవాహములో కొట్టుకు పోతున్న వృక్షముల వలె వారు మధువనములోకి దిగిరి.

'మైథిలిని చూచితిని' అన్న మాటవిని కలిగిన అత్యంత సంతోషముతో వారు మధువనము ప్రవేశించిరి. అక్కడి వనపాలకులను తమ బలముతో అధిగమించి మధువును సేవించిరి. రసములుగల ఫలములని తినిరి. అక్కడ వచ్చిన వానరులందరూ ఎగిరి అక్కడి వనపాలకులను అనేక సార్లు కొట్టిరి.

ఆ వానరులందరూ అనేకమైన దోసెడలతో మధువును సేవించిరి. కొందరు వారిని వారించిరి కూడా. వానరులు కొందరు మధువును సేవించి ఆ మధువ్హుతో మత్తుపోయి ఒకరినొకరు తోసుకొనుచుండిరి. మరి కొందరు వృక్ష శాఖలను తీసుకొని వృక్షమూలములో విశ్రమించిరి. కొందరు తాగిన మత్తుతో ఆకులను పరచి వాటిపై విశ్రమించిరి. మధువుతో మత్తెక్కిన వానరులు ఉన్మత్తులై సంతోషముతో ఒకరినొకరు తోసుకొనుచుండిరి. మరికొందరు మధుమత్తముతో తూలుచుండిరి. కొందరు ఆనందముతో సింహనాదములు చేయుచుండిరి. కొందరు పక్షులవలె కూతలు కూయు చుండిరి. మధువుతో మత్తెక్కిన కొందరు నేలమీద పడుకొని నిద్రలోకి జారుకున్నారు. కొందరు ఎదో చేసి నవ్వుచుండిరి. ఇంకా కొందరు ఇంకేదో పని చేయుచుండిరి. కొందరు ఎదో చేసి చెప్పుచుండిరి. కొందరు ఇంకేదో ఆలోచనలో ఉండిరి.

అక్కడ దధిముఖునిచే పంపబడిన మధువన రక్షకులు భీమబలముకల వానరులచేత ప్రతిఘటించబడి వారు అన్ని దిక్కులలో పారి పోయిరి. వారు మదాంధులైన వానరులచేత కాళ్ళతో లాగబడి ఆకాశమార్గములోకి విసరబడిరి. వారు అతి దుఃఖితులై దధిముఖునివద్దకు పోయి ఇట్లు పలికితిరి.

'హనుమంతునిచేత అనుమతింపబడిన వానరులచేత మేము హతులమైతిమి. మధువనము ధ్వంసమయ్యెను. మాకాళ్ళు పట్టుకొని ఆకాశములోకి విసరవేయబడిన వారము'. అప్పుడు అక్కడ వానరుడగు దధిముఖుడు మధువనము ధ్వంసమైనట్లు విని ఆ వచ్చిన వానరులను ఓదార్చెను." రండు.మనము బలదర్పముతో విర్ర వీగుతున్న మధుభక్షకులగు వానరులను బలప్రయోగముతో వారించుదము',అని.

ఆ దధిముఖుని వచనములను వినిన వానరులు వెంటనే మళ్ళీ మధువనము వెళ్ళితిరి. వీరి మధ్యలో దధిముఖుడు ఒక వృక్షమును పెకలించి తీసుకొని వేగముగా వెళ్ళెను. అతని అనుచరులగు వానరులందరూ అతనిని అనుసరించిరి. ఆ వనపాలకులు కుపితులై రాళ్లను చెట్లనూ తీసుకొని ఆ దక్షిణ దిశనుంచి వచ్చిన కపికుంజరులు ఉన్నచోటికి పోయిరి. వీరులైన వనపాలకులు తమ నాయకుడైన దధిముఖుని అనుసరిస్తూ తాటిచెట్లను శిలలనూ అయుధములు గా పట్టుకొని అనుసరించిరి. అప్పుడు ఆ వీరులైన వనపాలకులు చెట్లమీద చెట్లకిందా బలదర్పముతో వీగుచున్న వానరులను ఎదుర్కొనిరి.

అప్పుడు క్రోధముతో వచ్చిన దధిముఖుని చూచి హనుమదాది ప్రముఖులు వెంటనే పరుగెత్తుకోని వచ్చిరి.వృక్షముచేత పట్టుకొని వచ్చిన మహాబలుడు గౌరవించదగిన దధిముఖుని చూచి అంగదుడు కోపముతో తన బాహువులతో అతనిని పట్టుకొనెను. అంగదుడు మదాంధుడై 'ఇతడు తన నా పెద్దవాడు' అని తెలిసికొనలేకపోయెను. ఆ కోపములో దధిముఖుని వేగముగా భూమిమీద పడవేసెను. రక్తముతో తడిసిన విరిగిన బాహువులు భుజములు ఊరువులు కల ఆ వీరుడు కపికుంజరుడు క్షణకాలము మూర్ఛపోయెను. రాజుయొక్క మేన మామ అయిన దధిముఖుడు వెంటనే తేరుకొని కోపముతో ఉగ్రుడై తన దండముతో వానరులను చెదరగొట్టసాగెను.

పిమ్మట ఆ వానరులనుంచి ఎలాగో బయటపడి ఆ వానర ముఖ్యుడు ఏకాంతప్రదేశములో తన అనుచరులతో ఇట్లు చెప్పెను.'వాళ్ళను అక్కడే ఉండనిద్దాము.మనము వానర మహరాజు సుగ్రీవుడు రామునితో సహా ఎక్కడవుండునో అచటికి వెళ్ళుదము. అంగదుని అన్ని దోషములు మహరాజునకి వినిపించెదము. ఆ మాటలు విని మహారాజు ఆ వానరులను దండించును. పితృపైతామహులదివ్యమైన మధువనముదేవతలకు సైతము అందుబాటులో లేని ఆ మధువనము మహాత్ముడైన మహరాజుది. ఆ సుగ్రీవుడు మధువుమీద దురాశకలిగిన అయుస్సు మూడిన వానరులు వారి మిత్రులకు అందరికి దండన విధించును. ఈ దురాత్ములు నృపాజ్ఞని ఉల్లంఘించినవారు. వధార్హులే. సహించలేని మన రోషమునకు సఫలము కూరును' అని.

మహబలుడైన దధిముఖుడు వలపాలకులకు ఈ విధముగా చెప్పి వెంటనే ఆ వనపాలకులతో కూడి అకాశములోకి ఎగిరి వెళ్ళెను. ఒక నిమిషమాత్రములో ఆ సహస్రకిరణములు గల వాని పుత్రుడు ధీమంతుడు అగు సుగ్రీవుని వద్దకు చేరెను.

ఆకాశములో నుంచి రాముని లక్ష్మణుని సుగ్రీవులను చూచి, దధిముఖుడు తన అనుచరులతో సహా భూమిమీద సమతలప్రదేశములో దిగెను.

అ ఆందరి వనపాలకులతో కలిసి ఆ వనపాలకుల అధిపతి మహాబలవంతుడు అయిన దధిముఖుడు దీనవదనము తో శిరస్సు తో అంజలి ఘటించి సుగ్రీవుని సమీపించి అతని శుభ చరణములపై తన తలను పెట్టెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది రెండవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

శ్లో|| సన్నిపత్య మహావీర్యః సర్వైః తైః పరివారితః|
హరిర్దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః||
స దీనవదనో భూత్వా కృత్వా శిరసి చాంజలిమ్|
సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణౌ ప్రత్యపీడయత్||40||
స|| సర్వైః తైః పాలైః పరివారితః పాలానామ్ పరమేశ్వరః హరిః మహావీర్యః దధిముఖః దీనవదనః శిరసి అంజలిమ్ కృత్వా సన్నిపత్య సుగ్రీవస్య శుభే చరణౌ మూర్ధ్నా ప్రత్యపీడయత్ ||
తా|| అ ఆందరి వనపాలకులతో కలిసి ఆ వనపాలకుల అధిపతి మహాబలవంతుడు అయిన న్దధిముఖుడు దీనవదనము్తో శిరస్సుతో అంజలి ఘటించి సుగ్రీవుని సమీపించి అతని శుభ చరణములపై తన తలను పెట్టెను.
||ఓమ్ తత్ సత్||