||సుందరకాండ ||

|| అరవై మూడవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో ||

|| Sarga 63 || with Slokas and meanings in Telugu

                                         

||ఓమ్ తత్ సత్||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.

అథ  శ్లోకార్థ తత్త్వదీపికా సహిత

 త్రిషష్టితమస్సర్గః||


 - ’దృష్టా దేవీ న సందేహో’-



’దృష్టా దేవీ న సందేహో’, అంటే ’దేవిని తప్పక చూశారు , సందేహము లేదు’, అని. అది సుగ్రీవుని మాట. అంటే హనుమ అంగదాదులు వచ్చి, ’సీతమ్మ కుశలము’, అని చెప్పక ముందే సుగ్రీవునికి ఈ సంగతి తెలిసిపోయిందన్న మాట.  వెదకడానికి వెళ్ళిన వానరులు విజయము సాధించి వచ్చుచున్నారు అని. అందులోనే మనకు వినిపించే ఇంకో ధ్వని , హనుమంతునిపై సుగ్రీవునికి వున్న నమ్మకము. పునరాగమన సాగర లంఘనములో హనుమంతుని ఘోష విని, జాంబవంతుడు హనుమంతుని చేత సీతమ్మ చూడబడినది అని ఎలా ఊహించాడో, అలాగే ఇక్కడ సుగ్రీవుని ఆలోచన. హనుమంతుని గురించి ఎక్కడ ఎప్పుడు ఏమి చెప్పబడినా, రాయబడినా, ఈ రెండు సన్నివేశాలు తప్పక గణనలోకి వస్తాయి.


ఈ సర్గలో ఇంకోమాట. ’బాహ్వోరాసన్నాం’ , ’కర్మసిద్ధిం విదిత్వా’ - చేతిలోకి రాబోతున్న, కర్మ సిద్ధిని తెలిసికొని సుగ్రీవుడు   అమిత ఆనందము పొందాడుట. రామలక్ష్మణులతో చేసుకున్న ఒప్పందములో, సీతమ్మని వెదికి తీసుకు వస్తాను అనే తన భాధ్యత తీర్చుకొనే సమయము ఆసన్నమైనది అని సుగ్రీవుడు గ్రహిస్తాడు అన్నమాట. అది ఎలాజరిగిందో ఈ సర్గలో వింటాము.


ఇక అరవైమూడవ సర్గలో శ్లోకాలు అర్థతాత్పర్యాలతో.


||శ్లోకము 63.01||


తతో మూర్ధ్నా నిపతితం వానరం వానరర్షభః |

దృష్ట్వైవో ద్విగ్నహృదయో వాక్తమేత దువాచ హ ||63.01||


స|| తతః వానరర్షభః మూర్ధ్నా నిపతితం వానరం దృష్ట్వా ఉద్విగ్న హృదయః ఏతత్  వాక్యం ఉవాచ హ ||


||శ్లోకార్థములు||


తతః వానరర్షభః - అప్పుడు ఆ వానరేంద్రుడు

మూర్ధ్నా నిపతితం వానరం దృష్ట్వా - 

తన కాళ్ళమీద శిరస్సు పెట్టిన ఆ వానరుని  చూచి

ఉద్విగ్న హృదయః - అదుర్దాగావున్న హృదయముతో

ఏతత్ వాక్యం ఉవాచ హ- ఈ మాటలు పలికెను


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు ఆ వానరేంద్రుడు తన కాళ్ళమీద శిరస్సు పెట్టిన ఆ వానరుని  చూచి, అదుర్దాగావున్న హృదయముతో ఈ మాటలు పలికెను. ||63.01||


||శ్లోకము 63.02||


ఉత్తిష్టోత్తిష్ఠ కస్మాత్త్వం పాదయోః పతితో మమ |

అభయం తే భవేత్ వీర సర్వ మేవాభిదీయతామ్ ||63.02||


స|| వీర ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ కస్మాత్ మమ పాదయోః త్వం పతితః | తే అభయం భవేత్ | సర్వం ఏవ అభిధీయతామ్ || 


||శ్లోకార్థములు||


వీర ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ - ఓ వీరుడా లెమ్ము లెమ్ము

కస్మాత్ మమ పాదయోః త్వం పతితః - 

ఎందుకు నా కాళ్లమీద నీవు పడ్డావు

తే అభయం భవేత్ - నీకు భయము లేకుండు గాక 

సర్వం ఏవ అభిధీయతామ్ -

 అన్ని  విషయములు చెప్పుము


||శ్లోకతాత్పర్యము||


'ఓ వీరుడా లెమ్ము .లెమ్ము. ఎందుకు నా కాళ్లమీద నీవు పడ్డావు. నీకు అభయము ఇచ్చు చున్నాను. అన్ని  విషయములు చెప్పుము' అని. ||63.02||  


||శ్లోకము 63.03||


స తు విశ్వాసితః తేన సుగ్రీవేణ మహాత్మనా |

ఉత్థాయ సుమహాప్రాజ్ఞో వాక్యం దధిముఖోబ్రవీత్ ||63.03||


స|| సుమహాప్రాజ్ఞః దధిముఖః తేన సుగ్రీవేణ విశ్వాశితః ఉత్థాయ సః వాక్యః అబ్రవీత్||  


||శ్లోకార్థములు||


సుమహాప్రాజ్ఞః దధిముఖః - 

వివేకముగల దధిముఖుడు

తేన సుగ్రీవేణ విశ్వాశితః - 

ఆ సుగ్రీవునిచేత ఆవిధముగా అభయము ఇవ్వబడి

ఉత్థాయ సః వాక్యః అబ్రవీత్ - 

లేచి అతడు ఈ వాక్యములు చెప్పెను


||శ్లోకతాత్పర్యము||


ఆ వివేకముగల దధిముఖుడు ఆ సుగ్రీవునిచేత ఆవిధముగా అభయము ఇవ్వబడి  లేచి నిలబడి ఈ వాక్యములు చెప్పెను. ||63.03||


||శ్లోకము 63.04||


నైవర్‍క్షరజసా రాజన్ న త్వయా నాపి వాలినా |

వనం విసృష్టపూర్వం హి భక్షితం తచ్చ వానరైః ||63.04||


స|| రాజన్ ఋక్షరజసా నైవ  త్వయా న వాలినా అపి వనం విశ్రుష్టపూర్వం తచ్చ వానరైః భక్షితమ్||


తిలక టీకాలో - నైవ విశ్రుష్టపూర్వం వానరేభ్యో యథేచ్ఛభోగాయ కదాపి న అనుజ్ఞాతమ్ |

గోవిన్దరాజ టీకాలో- న విస్రుష్టపూర్వం యథేచ్ఛభోగాయ న దత్తం |


||శ్లోకార్థములు||


రాజన్ ఋక్షరజసా - ఓ రాజా  ఋక్షరజసుని చేత గాని

త్వయా న వాలినా అపి - వాలిచేతగాని నీ చేత గానీ

నైవ విశ్రుష్టపూర్వం వనం - 

యథేచ్చగా అనుభవించుటకు అనుమతి ఇవ్వబడని వనము 

తచ్చ వానరైః భక్షితమ్ హి- 

ఆది వానరులచేత తినబడినది


||శ్లోకతాత్పర్యము||


’ఓ రాజా ! ఋక్షరజసుని చేత గాని అందుకు ముందుగాని, వాలిచేతగాని నీ చేత గానీ అనుమతి ఇవ్వబడని ఆ వనము వానరులచేత తినబడినది’. ||63.04||


||శ్లోకము 63.05||


ఏభిః ప్రదర్షితాశ్చైవ వానరా వనరక్షిభిః | 

మధూన్యచిన్తయత్వేమాన్ భక్షయంతి పిబంతి చ ||63.05||


స|| ఏభిః వనరక్షిభిః ప్రధర్షితశ్చఏవ ఇమాన్ అచిన్తయిత్వా మధూని భక్ష్యన్తి పిబన్తి చ|| 


రామ టీకాలో - అచిన్తయిత్వా అపరిగణ్య


||శ్లోకార్థములు||


ఏభిః ఇమాన్ వనరక్షిభిః ప్రధర్షితశ్చఏవ - 

ఈ వనరక్షకులచేత నివారింపబడినప్పటికీ

అచిన్తయిత్వా - వినకుండా ( లెక్క చెయ్యకుండా)

మధూని భక్ష్యన్తి పిబన్తి చ- 

మధుభక్షణము చేసి మధుపానము కూడా చేసిరి


||శ్లోకతాత్పర్యము||


ఈ వనరక్షకులచేత నివారింపబడినప్పటికీ లెక్క చెయ్యకుండా, మధుభక్షణము చేసి మధుపానము కూడా చేసిరి. ||63.05||


||శ్లోకము 63.06||


శిష్టమత్రాపవిధ్యంతి భక్షయంతి తథాపరే |

నివార్యమాణాస్తే సర్వే భ్రువౌ వై దర్శయంతి హి ||63.06||


స||  శిష్టం అత్ర అపవిధ్యన్తి | అపరే తథా భక్షయన్తి| తే సర్వే నివార్యమాణః భృవః దర్శయన్తి చ||


తిలక టీకాలో - భ్రువౌ భృకుటీం వక్రౌ కుర్వన్తి।


రామ టీకాలో - అపరే భక్షయన్తి శిష్టమవిశిష్టం అపవిధ్యన్తి ప్రక్షిపన్తి చ నివార్యమాణాః సన్తః భ్రుకుటీం దర్శయన్తి చ।


||శ్లోకార్థములు||


శిష్టం అత్ర అపవిధ్యన్తి - 

తాగిన పిమ్మట మిగిలినది పారవేస్తున్నారు

అపరే తథా భక్షయన్తి - ఇతరులు ఇంకా తినుచున్నారు

తే సర్వే నివార్యమాణః - వారు ఆపబడినప్పుడు 

భృవః దర్శయన్తి చ - కనుబొమలు ఎత్తుచున్నారు


||శ్లోకతాత్పర్యము||


'తాగిన పిమ్మట మిగిలినది పారవేస్తున్నారు.  ఇతరులు ఇంకా తినుచున్నారు. వారు ఆపబడినప్పుడు కనుబొమలు ఎత్తుచున్నారు'. ||63.06||


||శ్లోకము 63.07||


ఇమే హి సంరబ్ధతరాః తథా తైః సంప్రధర్షితాః |

వారయంతో వనాత్ తస్మాత్ క్రుద్ధైర్వానరపుంగవైః ||63.07||


స|| తథా తస్మాత్ వనాత్ వారయన్తః సంరబ్ధతరాః  క్రుద్ధైః తైః వానరపుంగవైః ఇమే సంప్రధర్షితాః ||


తిలకటీకాలో - సంరబ్ధతరాః నివారణాయ అతియత్నవన్తః |

రామ టీకాలో - సంరబ్ధతరాః నివారణఫలక యత్నవన్తః|


||శ్లోకార్థములు||


తథా తస్మాత్ వనాత్ వారయన్తః - 

అప్పుడు ఆ వనమునుండి నివారింపబడిన

సంరబ్ధతరాః క్రుద్ధైః తైః వానరపుంగవైః - 

నివారించుటకు ప్రయత్నముచేయు వారిపై ఆ వానరపుంగవులు కోపించినవారై

ఇమే సంప్రధర్షితాః - 

ఈ రక్షకులను ఎదుర్కొనిరి.


||శ్లోకతాత్పర్యము||


'అప్పుడు ఆ వనమునుండి నివారింపబడిన ఆ వానరపుంగవులు కోపించినవారై, ఈ రక్షకులను ఎదుర్కొనిరి.' ||63.07||


||శ్లోకము 63.08||


తతస్తైర్బహుభిర్వీరైః వానరైర్వానరర్షభః |

సంరక్తనయనైః క్రోధాద్దరయః ప్రవిచాలితాః ||63.08||


స|| వానరర్షభ తతః క్రోధాత్ సంరక్తనయనైః వీరైః బహుభిః తైః వానరైః హరయః ప్రవిచాలితః||


రామ టీకాలో - హరయః మదనుయాయీ వానరాః (రక్షకః ఇత్యర్థః)


||శ్లోకార్థములు||


వానరర్షభ తతః - ఓ వానరేంద్ర అప్పుడు

క్రోధాత్ సంరక్తనయనైః వీరైః -

క్రోధముతో రక్తము నిండిన కళ్ళతో వున్న వీరులు

తైః వానరైః బహుభిః -  అనేకమంది వానరులచేత 

హరయః ప్రవిచాలితః- ఈ రక్షకులు తరిమికొట్టబడిరి. 


||శ్లోకతాత్పర్యము||


'ఓ వానరేంద్ర అప్పుడు క్రోధముతో రక్తము నిండిన కళ్ళతో వున్న ఆ వీరులు అనేకమందిచేత ఈ రక్షకులు తరిమికొట్టబడిరి.' ||63.08||


||శ్లోకము 63.09||


పాణిభిర్నిహతాః కేచిత్ కేచిత్ జానుభిరాహతాః |

ప్రకృష్టాశ్చ యథాకామం దేవమార్గం చ దర్శితాః ||63.09||


స|| కేచిత్ పాణిభిః నిహతాః| కేచిత్ జానుభిః ఆహతాః| యథాకామం ప్రకృష్టాః దేవమార్గం దర్శితాః చ||


||శ్లోకార్థములు||


కేచిత్ పాణిభిః నిహతాః - కొందరు చేతితో కొట్టబడిరి

కేచిత్ జానుభిః ఆహతాః - కొందరు మోకాళ్లతో తన్నబడిరి

యథాకామం ప్రకృష్టాః - ఇష్టమువచ్చినట్లు కొట్టబడి

దేవమార్గం దర్శితాః చ-  ఆకాశమార్గములోకి విసరబడిరి


||శ్లోకతాత్పర్యము||


'కొందరు చేతితో కొట్టబడిరి. కొందరు మోకాళ్లతో తన్నబడిరి. ఇష్టమువచ్చినట్లు కొట్టబడి, ఆకాశమార్గములోకి విసరబడిరి.' ||63.09||


||శ్లోకము 63.10||


ఏవ మేతే హతాః శూరాః త్వయి తిష్ఠతి భర్తరి |

కృత్స్నం మధువనం చైవ ప్రకామం తైః ప్రభక్ష్యతే ||63.10||


స|| త్వయి భర్తరి తిష్ఠతి ఏతే శూరాః ఏవం హతాః | తైః కృత్స్నం మధువనం చైవ ప్రకామం ప్రభక్ష్యతే||


||శ్లోకార్థములు||


త్వయి భర్తరి తిష్ఠతి - నీవు రాజుగా వున్నప్పుడే

ఏతే శూరాః ఏవం హతాః - ఈ శూరులు ఈ విధముగా కొట్టబడిరి

తైః కృత్స్నం మధువనం చ - నీ మధువనమును ధ్వంసముచేసి

ఏవ ప్రకామం ప్రభక్ష్యతే - ఇష్టము వచ్చినట్లు భక్షించుచున్నారు


||శ్లోకతాత్పర్యము||


'నీవు రాజుగా వున్నప్పుడే ఈ శూరులు ఈ విధముగా కొట్టబడిరి. నీ మధువనమును ధ్వంసముచేసి ఇష్టము వచ్చినట్లు భక్షించుచున్నారు'. ||63.10||


||శ్లోకము 63.11||


ఏవం విజ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరర్షభమ్ |

అపృచ్ఛ తం మహాప్రాజ్ఞో లక్ష్మణః పరవీరహ ||63.11||


స|| ఏవం విజ్ఞాప్యమానం తం వానరర్షభం సుగ్రీవం మహాప్రాజ్ఞః పరవీరహ లక్ష్మణః అపృచ్ఛత్||


||శ్లోకార్థములు||


 తం ఏవం విజ్ఞాప్యమానం - 

ఈ విధముగా విన్నవించబడుచున్న 

 వానరర్షభం సుగ్రీవం - 

వానరాధిపుడైన సుగ్రీవుని

మహాప్రాజ్ఞః పరవీరహ -

 మహాప్రాజ్ఞుడు శత్రువీర సంహారకుడూ 

లక్ష్మణః అపృచ్ఛత్ - 

అయిన లక్ష్మణుడు ఇలా అడిగెను


||శ్లోకతాత్పర్యము||


ఈ విధముగా విన్నవించబడుచున్న ఆ వానరాధిపుని మహాప్రాజ్ఞుడు శత్రువీర సంహారకుడూ అయిన లక్ష్మణుడు ఇలా అడిగెను. ||63.11||


||శ్లోకము 63.12||


కిమయం వానరో రాజన్ వనపః ప్రత్యుపస్థితః |

కం చార్థమభినిర్దిశ్య దుఃఖితో వాక్యమబ్రవీత్ ||63.12||


స|| రాజన్ కిం  వనపః అయః వానరః  ప్రత్యుపస్థితః | దుఃఖితః కిం | అర్థమ్ అభినిర్దిస్య వాక్యం అబ్రవీత్ ||


రామ టీకాలో - కిమితి। హే రాజన్ అయం వనపః కిం కిమర్థం ప్రత్యుపస్థితః । కిమర్థం అభినిర్దిస్య బొధయిత్వా దుఃఖితః సన్ అబ్రవీత్ ।


||శ్లోకార్థములు||


రాజన్ కిం  వనపః - ఓ రాజా వనపాలకుడు అయిన

అయః వానరః  ప్రత్యుపస్థితః- ఈ వానరుడు ఎందుకు ఇక్కడికి వచ్చెను?  

దుఃఖితః కిం అర్థమ్ - ఎందుకు దుఃఖములో ఉన్నాడు?

 అభినిర్దిస్య వాక్యం అబ్రవీత్ - దేనిని గురించి చెప్పుచున్నాడు?


||శ్లోకతాత్పర్యము||


'ఓ రాజా వనపాలకుడు అయిన వానరుడు ఎందుకు ఇక్కడికి వచ్చెను? ఎందుకు దుఃఖములో ఉన్నాడు?దేనిని గురించి చెప్పుచున్నాడు?' ||63.12||


||శ్లోకము 63.13||


ఏవముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మనా |

లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్యవిశారదః ||63.13||


స|| మహాత్మనా లక్ష్మణేన ఏవం ఉక్తః సుగ్రీవః వాక్యవిశారదః ఇదం వాక్యం లక్ష్మణం ప్రత్యువాచ||


||శ్లోకార్థములు||


మహాత్మనా లక్ష్మణేన ఏవం ఉక్తః- 

మహత్ముడైన లక్ష్మణునిచేత ఈవిధముగా అడగబడి

సుగ్రీవః వాక్యవిశారదః - 

వాక్య విశారదుడైన సుగ్రీవుడు

ఇదం వాక్యం లక్ష్మణం ప్రత్యువాచ - 

ఇట్టి వాక్యములను లక్ష్మణునికి ప్రత్యుత్తరముగా పలికెను


||శ్లోకతాత్పర్యము||


మహత్ముడైన లక్ష్మణునిచేత ఈవిధముగా అడగబడి వాక్య విశారదుడైన సుగ్రీవుడు ఇట్టి వాక్యములను పలికెను. ||63.13||


||శ్లోకము 63.14||


ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరో దధిముఖః కపిః |

అంగదప్రముఖైర్వీరైః భక్షితం మధు వానరైః ||63.14||

విచిత్య దక్షిణామాశాం ఆగతైర్హరిపుంగవైః |


స|| ఆర్య లక్ష్మణ వీరః దధిముఖః కపిః సంప్రాహ దక్షిణామ్ ఆశాం విచిన్త్య ఆగతైః  అంగద ప్రముఖైః వీరైః వానరైః మధు భక్షితం || 


||శ్లోకార్థములు||


ఆర్య లక్ష్మణ -ఓ ఆర్యా! లక్ష్మణా

వీరః దధిముఖః కపిః సంప్రాహ -  వానరవీరుడు దధిముఖుడు చెప్పుచున్నాడు

దక్షిణామ్ ఆశాం విచిన్త్య ఆగతైః  - దక్షిణదిశనుంచి వెదికి వచ్చిన 

అంగద ప్రముఖైః వీరైః - అంగదాదిప్రముఖులైన వీరుల చేత

వానరైః మధు భక్షితం - వానరుల చేత మధువు భక్షించబడినది


||శ్లోకతాత్పర్యము||


'ఓ ఆర్యా! లక్ష్మణా! వానరవీరుడు దధిముఖుడు దక్షిణదిశనుంచి వెదికి వచ్చిన అంగదాదిప్రముఖులైన వానరుల చేత మధువు భక్షించబడినది అని చెప్పుచున్నాడు'.||63.14||


||శ్లోకము 63.16||


నైషామకృతకృత్యానాం ఈదృశస్స్యాదుపక్రమః ||63.15||

అగతైశ్చ ప్రమథితం యథా మధువనం హి తైః |

ధర్షితం చ వనం కృత్స్నముపయుక్తం చ వానరైః ||63.16||


స|| ఆగతైః తైః వానరైః మధువనం యథా ప్రమథితం కృత్స్నం వనం ధర్షితం ఉపయుక్తం చ ఏషాం అకృతకృత్యానాం ఈదృశః ఉపక్రమః న స్యాత్ ||


||శ్లోకార్థములు||


ఆగతైః తైః వానరైః - 

ఆ వచ్చిన వానరులచేత

మధువనం యథా ప్రమథితం -

 ఏ విధముగా ఆ మధువనమును ధ్వంసము చేయబడినదో 

కృత్స్నం వనం ధర్షితం ఉపయుక్తం చ -

 వనము ఆక్రమించబడి ఉపయోగించబడినదో

ఏషాం అకృతకృత్యానాం - 

అది కృతకృత్యులు కాని వారి చేత 

ఈదృశః ఉపక్రమః న స్యాత్ - 

ఇటువంటి  పని చేయబడదు


||శ్లోకతాత్పర్యము||


’ఆ వచ్చిన వానరులచేత ఏ విధముగా ఆ మధువనమును ధ్వంసము చేయబడినదో వనము ఉపయోగించినబడినదో, (విని) అది కృతకృత్యులుకాని వారి చేత  ఇటువంటి పని చేయబడదు అనిపించుచున్నది’. ||63.15,16||


||శ్లోకము 63.17||


వనం యదఽభిపన్నాస్తే సాధితం కర్మవానరైః |

దృష్టా దేవీ న సందేహో న చాన్యేన హనూమతా ||63.17||


స|| తే యదా వనం అభిపన్నాః వానరైః కర్మ సాధితం | దేవీ దృష్టా | న సందేహః న అన్యేన స్వయం హనుమతా ||


||శ్లోకార్థములు||


తే యదా వనం అభిపన్నాః - 

వారు ఏ విధముగా వనమును చేరుకొనినారో

వానరైః కర్మ సాధితం - 

ఆ వానరులు చేత పని సాధించి బడినది 

దేవీ దృష్టా న సందేహః - 

దేవి చూడబడినది సందేహము లేదు

న అన్యేన ( స్వయం) హనుమతా - 

ఇంకెవరి చేతనో కాదు ( స్వయముగా) హనుమంతుని చేతనే


||శ్లోకతాత్పర్యము||


'వారు ఏ విధముగా వనమును చేరుకొనినారో దాని బట్టి ఆ వానరులచేత పని సాధింపబడినది.  దేవి చూడబడినది సందేహము లేదు. ఇంకెవరి చేతనో కాదు హనుమంతుని చేతనే'. ||63.17||


||శ్లోకము 63.18||


న హ్యన్యః సాధనే హేతుః కర్మణోఽస్య హనూమతః |

కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్వానరపుంగవే ||63.18||

వ్యవసాయశ్చ వీర్యం చ శ్రుతం చాపి ప్రతిష్టితమ్ |


స|| అస్య కర్మనః సాధనే హనూమతః అన్యః హేతుః న హి కార్యసిద్ధిః మతిశ్చైవ వ్యవసాయశ్చ వీర్యం చ  శ్రుతం చాపి తస్మిన్ వానరపుంగవే ప్రతిష్ఠితామ్ ||


||శ్లోకార్థములు||


అస్య కర్మనః సాధనే హనూమతః - 

ఈ కార్య సిద్ధికి హనుమంతుడు 

అన్యః హేతుః న హి - 

ఇతరులకు సాధ్యముకాదు.

కార్యసిద్ధిః మతిశ్చైవ - 

కార్య దక్షత బుద్ధి 

వ్యవసాయశ్చ వీర్యం చ  శ్రుతం చాపి - 

పరాక్రమము శాస్త్రజ్ఞానము అన్నీ 

తస్మిన్ వానరపుంగవే ప్రతిష్ఠితామ్ - 

ఆ వానరపుంగవునిలో ప్రతిష్టించబడినాయి


||శ్లోకతాత్పర్యము||


’ఈ కార్య సిద్ధికి హనుమంతుడి వలననే.  ఇతరులకు సాధ్యముకాదు. ఆ వానరపుంగవునిలో తగిన కార్య దక్షత బుద్ధి పరాక్రమము శాస్త్రజ్ఞానము అన్నీ ప్రతిష్టించబడినాయి’. ||63.18|| 


||శ్లోకము 63.19||


జాంబవాన్యత్ర నేతాస్యాదంగదశ్చ మహాబలః ||63.19|| 

హనుమాంశ్చాప్యధిష్ఠాతా న తస్య గతి రన్యథా |


స|| యత్ర జామ్బవాన్ నేతా స్యాత్ మహాబలః అంగదస్య చ హనుమాంశ్చ అధితిష్ఠతా తస్య గతిః అన్యథా న||


||శ్లోకార్థములు||


యత్ర జామ్బవాన్ నేతా స్యాత్ - 

ఎక్కడైతే జాంబవంతుడు నేతగా వుండునో

మహాబలః అంగదస్య చ - 

మహాబలుడు అంగదుడు

హనుమాంశ్చ అధితిష్ఠతా - 

హనుమంతుడుల అధిపత్యము వున్నదో

తస్య గతిః అన్యథా న - 

అక్కడ విజయము తథ్యము


||శ్లోకతాత్పర్యము||


'ఎక్కడైతే జాంబవంతుడు నేతగా వుండునో, మహాబలము కల అంగదుడు హనుమంతుడుల అధిపత్యము వున్నదో, అక్కడ విజయము తథ్యము'. ||63.19||


||శ్లోకము 63.20||


అంగదప్రముఖైర్వీరైః హతం మధువనం కిల ||63.20||

వారయంతశ్చ సహితాః తథా జానుభిరాహతాః |


స|| అంగదప్రముఖైః వీరైః మధువనం హతం కిల|  సహితాః వారయన్తశ్చ తదా జానుభిః ఆహతాః||



||శ్లోకార్థములు||


అంగదప్రముఖైః వీరైః - 

అంగదాది ప్రముఖులు వీరులు

మధువనం హతం కిల  - 

మధువనమును తప్పక ధ్వంశము చేసి ఉండవచ్చు

తదా సహితాః వారయన్తశ్చ - అప్పుడు నివారించినవారు

తదా జానుభిః ఆహతాః- అప్పుడు మోకాళ్లతో తన్నబడిరి 


||శ్లోకతాత్పర్యము||


'అంగదాది ప్రముఖులు వీరులు మధువనమును తప్పక ధ్వంశము చేసి ఉండవచ్చు. అప్పుడు నివరించినవారు మోకాళ్లతో తన్నబడిరి'. ||63.20||


||శ్లోకము 63.21||


ఏతదర్థమయం ప్రాప్తో వక్తుం మధురవా గిహ ||63.21||

నామ్నా దధిముఖో నామ హరిః ప్రఖ్యాతవిక్రమః |


స|| నామ్నా దధిముఖో నామ ప్రఖ్యాత్ విక్రమః హరిః ఏతత్ అర్థం వక్తుం మధురవాక్ ఇహ ప్రాప్తః||


||శ్లోకార్థములు||


నామ్నా దధిముఖో నామ -

 దధిముఖుడు అనబడు

ప్రఖ్యాత్ విక్రమః హరిః - 

ప్రఖ్యాతి చెందిన వానరుడు

ఏతత్ మధురవాక్ అర్థం వక్తుం - 

ఈ మధురమైన మాటను చెప్పుటకు

ఇహ ప్రాప్తః- ఇక్కడికి వచ్చినవాడు


||శ్లోకతాత్పర్యము||


'దధిముఖుడు అనబడు ప్రఖ్యాతి చెందిన వానరుడు ఈ మధురమైన మాటను చెప్పుటకు ఇక్కడికి వచ్చినవాడు'. ||63.21||


||శ్లోకము 63.22||


దృష్టా సీతా మహాబాహో సౌమిత్రే పశ్యతత్త్వతః ||63.22||

అభిగమ్య తథా సర్వే పిబంతి మధు వానరాః|


స|| మహాబాహో సౌమిత్రే సీతా తత్త్వతః దృష్టా|  పశ్య తథా వానరాః సర్వే అభిగమ్య మధు పిబన్తి||


||శ్లోకార్థములు||


మహాబాహో సౌమిత్రే - ఓ మహాబాహో లక్ష్మణా

సీతా తత్త్వతః దృష్టా - సీత నిజముగా చూడబడినది 

పశ్య తథా సర్వే  వానరాః - చూడుము. ఆ వానరులందరూ

అభిగమ్య మధు పిబన్తి - వచ్చి మధువు సేవించుచున్నారు


||శ్లోకతాత్పర్యము||


'ఓ మహాబాహో, సీత నిజముగా చూడబడినది. చూడుము. ఆ వానరులందరూ వచ్చి మధువు సేవించుచున్నారు'. ||63.22||


||శ్లోకము 63.23||


న చాప్యదృష్ట్వా వైదేహీం విశ్రుతాః పురుషర్షభ ||63.23||

వనం దత్తవరం  దివ్యం ధర్షయేయుర్వనౌకసః |


స|| పురుషర్షభ విశ్రుతాః వనౌకసః వైదేహీం అదృష్ట్వా దత్తవరం దివ్యం వనం న ధర్షయేయుః||


||శ్లోకార్థములు||


పురుషర్షభ  - ఓ పురుషులలో వృషభము వంటి వాడా

విశ్రుతాః వనౌకసః వైదేహీం అదృష్ట్వా - 

విశ్రుతులైన వానరులు వైదేహిని చూడకుండా

దత్తవరం దివ్యం వనం - 

వరముగా వచ్చిన దివ్యమైన వనమును

న ధర్షయేయుః - ధ్వంశము చేయలేరు


||శ్లోకతాత్పర్యము||


'ఓ పురుషులలో వృషభము వంటి వాడా !  విశ్రుతులైన వానరులు, వైదేహిని చూడకుండా వరముగా వచ్చిన దివ్యమైన వనమును ధ్వంశము చేయలేరు'. ||63.23||


||శ్లోకము 63.24,25||


తతః ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణః సహ రాఘవః ||63.24||

శ్రుత్వా కర్ణసుఖాం వాణీం సుగ్రీవ వదనాచ్చ్యుతామ్ |

ప్రాహృష్యత భృశం రామో లక్ష్మణశ్చ మహాబలః ||63.25||


స|| తతః సహ రాఘవః ధర్మాత్మా లక్ష్మణః ప్రహృష్టః సుగ్రీవవదనాత్ చ్యుతం కర్ణసుఖాం వాణీం శ్రుత్వా  ప్రాహృష్యత| రామః లక్ష్మణః మహాబలః చ భృశం ప్రాహృష్యత ||


||శ్లోకార్థములు||


తతః సహ రాఘవః - అప్పుడు రాఘవునితో కూడిన

ధర్మాత్మా లక్ష్మణః  - ధర్మాత్ముడు అగు లక్ష్మణుడు

ప్రహృష్టః సుగ్రీవవదనాత్ చ్యుతం కర్ణసుఖాం  - 

సంతోషముతో వున్న సుగ్రీవుని చెవులకు సుఖము ఇచ్చు నోటినుంచి వచ్చిన 

 వాణీం శ్రుత్వా ప్రాహృష్యత - 

వాక్యములను విని అనందభరితులైరి

రామః లక్ష్మణః మహాబలః చ - 

మహాబలురైన రాముడు లక్షమణులు కూడా

భృశం ప్రాహృష్యత- అధికముగా ప్రసన్నులైరి


ప్రాహృష్యత- were very delighted 


||శ్లోకతాత్పర్యము||


'అప్పుడు రాఘవునితో కూడిన ధర్మాత్ముడు అగు లక్ష్మణుడు సంతోషముతో వున్న సుగ్రీవుని నోటినుంచి వచ్చిన వాక్యములను విని అనందభరితులైరి. రాముడు లక్ష్మణులు కూడా అధికముగా ప్రసన్నులైరి'. ||63.24,25||


||శ్లోకము 63.26||


శ్రుత్వా దధిముఖస్యేదం సుగ్రీవస్తు ప్రహృష్య చ |

వనపాలం పునర్వాక్యం సుగ్రీవః ప్రత్యభాషత ||63.26||


స|| సుగ్రీవః దధిముఖస్య ఇదం శ్రుత్వా సంప్రహృష్య చ పునః వనపాలం వాక్యం ప్రత్యభాషత||


||శ్లోకార్థములు||


సుగ్రీవః దధిముఖస్య ఇదం శ్రుత్వా - 

సుగ్రీవుడు దధిముఖుని ఈ వచనములను విని

సంప్రహృష్య చ - సంతోషముతో

పునః వనపాలం - మళ్ళీ వనపాలునికి

వాక్యం ప్రత్యభాషత- ఈ వాక్యములతో సమాధానమిచ్చెను


||శ్లోకతాత్పర్యము||


'సుగ్రీవుడు, దధిముఖుని ఈ వచనములను విని సంతోషముతో మళ్ళీ వనపాలునికి ఈ వాక్యములతో సమాధానమిచ్చెను.' ||63.26||


||శ్లోకము 63.27||


ప్రీతోఽ స్మి సోఽహం యద్భుక్తం వనం తైః కృతకర్మభిః |

మర్షితం మర్షణీయం చ చేష్టితం కృతకర్మణామ్ ||63.27||


స|| కృతకర్మభిః తైః వనం యత్ భుక్తం సః అహం ప్రీతః | కృతకార్యమాణామ్ మర్షణీయం చేష్టితం మర్షితామ్||


||శ్లోకార్థములు||


కృతకర్మభిః తైః - కార్యసిద్ధి సాధించినవారిచేత    

వనం యత్ భుక్తం స అహం ప్రీతః - 

భుజింపబడిన ఆ వనము గురించి (విని) నాకు సంతోషము గా వున్నది.

కృతకార్యమాణామ్ - కృత కృత్యులైనవారిచేత

మర్షణీయం చేష్టితం మర్షితామ్- 

చేయబడిన చేయకూడని కార్యము క్షమించబడినది


||శ్లోకతాత్పర్యము||


'కార్యసిద్ధి సాధించినవారిచేత భుజింపబడిన ఆ వనము గురించి (విని) నాకు సంతోషము గా వున్నది. కృత కృత్యులైనవారిచేత చేయబడిన, చేయకూడని కార్యము క్షమించబడినది.'||63.27|| 


||శ్లోకము 63.28||


ఇచ్ఛామి శీఘ్రం హనుమత్ప్రధానాన్

 శాఖామృగాం స్తాన్ మృగరాజ దర్పాన్|

ద్రష్టుం కృతార్థాన్ సహ రాఘవాభ్యాం 

 శ్రోతుం చ సీతాధిగమే ప్రయత్నమ్ ||63.28||


స|| హనుమత్ప్రధానాన్ మృగరాజదర్పాన్ కృతార్థాన్ తాన్ శాఖామృగాన్ రాఘవాభ్యాం సహ ద్రష్టుం  సీతాధిగమేన ప్రయత్నం శ్రోతుం చ ఇచ్ఛామి ||


||శ్లోకార్థములు||


హనుమత్ప్రధానాన్ - హనుమదాది ప్రముఖుల

మృగరాజదర్పాన్ కృతార్థాన్ - 

కృతార్థులైన సింహపరాక్రమము గల

తాన్ శాఖామృగాన్ - ఆ వానరులను 

రాఘవాభ్యాం సహ ద్రష్టుం - 

రాఘవునితో సహా చూచుటకు

సీతాధిగమేన ప్రయత్నం శ్రోతుం చ - 

సీతను కనుగొనుటకై చేసిన ప్రయత్నము గురించి వినుటకు

ఇచ్ఛామి - కోరికగా వున్నది


||శ్లోకతాత్పర్యము||


'కృతార్థులైన సింహపరాక్రమము గల హనుమదాది ప్రముఖుల ను వెంటనే చూడాలని , సీతను కనుగొనుటకై చేసిన ప్రయత్నము గురించి వినాలని కోరికగా వున్నది'. ||63.28||


||శ్లోకము 63.29||


ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ కుమారౌ

దృష్ట్వా సిద్దార్థౌ వానరాణాం చ రాజా |

అంగైః సంహృష్టైః కర్మసిద్ధిం విదిత్వా

బాహ్వోరాసన్నాం సోఽతిమాత్రం ననంద ||63.29||


స|| సః వానరాణాం రాజా ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ సిద్ధార్థౌ కుమారౌ దృష్ట్వా సంహృష్టైః అంగైః కర్మసిద్ధిం బాహ్వోః ఆసన్నాం విదిత్వా అతిమాత్రం ననన్ద ||


గోవిన్దరాజ టీకాలో - అథ ప్రత్యుపకారార్థం సుగ్రీవః స్వ ఉద్యోగసాఫల్య దర్శనాత్ భృశం ననన్ద ఇత్యాహ ప్రీతిస్ఫీతాక్షౌ | సంపహృష్టౌ కుమారౌ దృష్ట్వా సిద్ధార్థో వానరాణాం చ రాజా| అంగైః సంహృష్టై కర్మసిద్ధిం విదిత్వా బాహ్వోరాసనాం స అతిమాత్రం ననన్ద|ప్రీత్యా సంతోషేణ| సంప్రహృష్టౌ రోమస్వితి శేషః| కర్మసిద్ధిం బాహ్వోరాసన్నాం హస్త ప్రాప్తాం విదిత్వా నిశ్చిత్యేత్యర్థః |


||శ్లోకార్థములు||


సః వానరాణాం రాజా - ఆ వానరులరాజు 

ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ - 

సంతోషముతో నిండిన కళ్ళుకలవాడై

సిద్ధార్థౌ కుమారౌ దృష్ట్వా -

 సిద్దిపొందిన ఆ రాజకుమారులను చూచి

సంహృష్టైః అంగైః బాహ్వోః ఆసన్నాం- 

అంగములన్నీ సంతోషముతో పులకిరించగా

బాహ్వోః ఆసన్నాం కర్మసిద్ధిం  విదిత్వా - 

చేతిలోకి అందబోతున్న కర్మసిద్ధి ని గ్రహించి

అతిమాత్రం ననన్ద - అతి ఆనందము పొందెను


||శ్లోకతాత్పర్యము||


ఆ వానరులరాజు సంతోషముతో నిండిన కళ్ళుకలవాడై , సిద్దిపొందిన ఆ రాజకుమారులను చూచి చేతిలోకి అందబోతున్న కర్మసిద్ధిని  గ్రహించి  అంగములన్నీ సంతోషముతో పులకిరించగా అతడు అతి ఆనందము పొందెను. ||63.29||


అంటే సుగ్రీవుడు సంతోషముతో నిండిన కళ్ళుకలవాడై , సిద్దిపొందిన ఆ రాజకుమారులను చూచి, తను ప్రతిజ్ఞచేసిన కార్యము ఫలసిద్ధి కాబోతున్నదని గ్రహించి  అతిశయ ఆనందము పొందెను అన్నమాట.


ఈ మాట తో అరవై మూడవ సర్గ సమాప్తము.


 ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే 

చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్

శ్రీమత్సుందరకాండే త్రిషష్టితమస్సర్గః ||


|| ఓమ్ తత్ సత్||