||సుందరకాండ ||

||అరువది నాలుగవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||
శ్లో|| సుగ్రీవేణేవ ముక్తస్తు హృష్టో దధిముఖః కపిః|
రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చాఽభ్యవాదయత్||1||
స|| హృష్ఠః సుగ్రీవేణ ఏవం ఉక్తః తు దధిముఖః రాఘవం లక్ష్మణం చ సుగ్రీవం అభ్యవాదయత్||
తా|| ఆ విధముగా ఆనంద భరితుడైన సుగ్రీవునిచే చెప్ప బడిన దధిముఖుడు, రాముడు లక్ష్మణుడు అలాగే సుగ్రీవునకు అభివాదము చేసెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ చతుష్షష్టితమస్సర్గః||

వానరులు మధువనమును ధ్వంశము చేసితిరని వినినప్పటికీ , సీతాన్వేషణ విజయవంతమైనది అని ఊహించిన సుగ్రీవుడు అనందభరితుడాయెను. దధిముఖుని తో వారినందరిని వెంటనే కిష్కింధకు పంపమని చెప్పెను. ఆ విధముగా సుగ్రీవునిచే చెప్ప బడిన దధిముఖుడు, రామ లక్ష్మణులకు అలాగే సుగ్రీవునకు అభివాదము చేసెను. ఆ దధిముఖుడు రామలక్ష్మణులకు సుగ్రీవునకు ప్రణమిల్లి తన సహచరులతో కలిసి అకాశములోకి ఎగిరెను.

అప్పుడు అతడు పూర్వము ఏవిధముగా వచ్చెనో, ఆవిధముగనే త్వరగా వెళ్ళి, ఆకాశమునుండి భూమి మీద దిగి, ఆ మధువనమును ప్రవేశించెను. అతడు మధువనము ప్రవేశించి మత్తుతొలగి మధూదకము పోగా లేచివున్న, వానర గణములను చూచెను. అతడు తిరిగి మధువనము వచ్చినవాడై, వీరుడైన అంగదునకు చేతులు జోడించి నమ్రతతో, మృదువైన మాటలతో ఇట్లు పలికెను.

"ఓ సౌమ్యుడా నీకు రోషము వలదు. రక్షకులచేత అడ్డగించబడడము ఆజ్ఞానము వలన, క్రోధము వలన జరిగినది. ఓ మహాబలుడా నీవు యువరాజువు. ఈ వనమునకు అధిపతివి. మూర్ఖత్వముతో పూర్వము చేసిన దోషమును క్షమించుటకు నీవే తగినవాడవు. ఓ అనఘా ! నేను వెళ్ళి నీ పినతండ్రికి ఈ వానరులందరూ ఇక్కడికి వచ్చితిరని చెప్పితిని. అతడు మీ ఆగమనము విని సంతోషభరితుడాయెను. నీ పినతండ్రి వానరేశ్వరుడు అగు సుగ్రీవుడు ఈ వనము ధ్వంశము అయినది అని విని కోపగించుకో లేదు. మీ అందరినీ శీఘ్రముగా అక్కడికి పంపమని ఆ రాజు నాతో చెప్పెను."

దధిముఖుని చేత ఈ నమ్రతతో పలుకబడిన మాటలను విని, వాక్య విశారదుడైన వానరశేష్ఠుడు అగు అంగదుడు ఇతర వానరులతో ఇట్లు పలికెను." శత్రువులను తపింపచేయువారా ! వానర వీరులారా ! ఈ వృత్తాంతము అంతా రామునిచే వినబడెను. చేయ వలసిన కార్యము చేసి ఇక్కడ వుండిపోవడము తగినది కాదు".

"ఓ వనచరులారా ! కావలిసినట్లు మధువును తాగి విశ్రాంతి తీసు కొనిన మనకి మిగిలినది కార్యము ఏమి? నాగురువు సుగ్రీవుడు ఎక్కడవుండునో అక్కడికి వెంటనే పోయెదము. వానరయోధులారా మీరు అందరూ కలిసి మనకర్తవ్యము గురించి నాకు ఏమి చెప్పెదరో నేను ఆవిధముగా చేసెదను. నేను మీ అధీనములో ఉన్నవాడిని. నేను యువరాజునే. కాని కృతకృత్యులైన మిమ్మలను ఆజ్ఞాపించుటకు తగినవాడను కాను. నాచేత మీరు అజ్ఞాపించబడుట యుక్తము కాదు".

ఈ విధముగా చెప్పబడిన, అంగదుని అవ్యయమైన మాటలను వినిన, ఆ వానరులందరూ సంతోషపడినవారై ఈ వాక్యములను చెప్పితిరి. " ఓ వానరోత్తమా! రాజా ! ఇటువంటి మాటలు ఎవరు చెప్పెదరు? ప్రభువులు, ఇశ్వర్య మదమత్తముతో సర్వము తామే అని భావిస్తారు. ఈ వాక్యములు నీకే తగును ,ఇంకెవరూ ఇలా చెప్పలేరు. నీ నమ్రత భవిష్యత్తులో కలుగు శుభయోగమును సూచించున్నవి. మేము అందరము, వానరుల అవ్యయమైన అధిపతి, సుగ్రీవుడు వున్న చోటుకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాము. ఓ వానరోత్తమా నీచేత ఆదేశించ బడకుండా ఈ వానరులకు ఒక్క అడుగుకూడా ముందుకు వేయుటకు శక్యము కాదు. నీకు సత్యముగా చెప్పుచున్నాము" అని. వానరులు ఈవిధముగా పలుకగానే అంగదుడు వెంటనే బయలుదేరుదాము అని వారికి చెప్పెను. ఇలా చెప్పి ఆ మహబలులు ఆకాశములోకి ఎగిరిరి.

అప్పుడు ఆకాసములో ఎగిరిన ఆ హరియూథపులు యంత్రములోనుంచి విసరబడిన అచలమైన రాళ్లవలె ఆకాశమును కప్పివేస్తూ ఆకాశములోకి లేచిరి. వేగవంతులైన ఆ వానరప్లవంగములు ఆకాశములోకి లేచి నీటితో నిండిన మేఘములవలె మహానాదము చేసిరి.

అంగదుడు సమీపించు ముందర ఆ వానరాధిపుడు అగు సుగ్రీవుడు శోకములో మునిగియున్న కమలలోచనునితో ఇట్లు పలికెను. 'ఓ రామా దుఃఖమునుంచి తేరుకొనుము. నీకు శుభము అగు గాక. దేవి చూడబడినది. సంశయము లేదు. అట్లు కానిచో గడువు దాటిన ఈ సమయములో వానరులకు ఇక్కడికి రావడము అశక్యము. యువరాజు మహాబాహువులు కలవాడు వానరశ్రేష్ఠుడూ అయిన అంగదుడు కార్యము సాధించకుండా నాముందుకు రాడు. కృతకృత్యులు కానివారు అయినచో, వారు ఈ విధముగా వుండరు. ఆ అంగదుడు దీనవదనముతో భ్రాంత చిత్తుడై వుండును. ఆ ప్లవగేశ్వరుడు సంతోషము లేని వాడు అయితే పితృలు పితామహులచే పూర్వము రక్షించ బడిన ఆ మధువనమును ధ్వంసము చేయడు. ఓ కౌసల్యాదేవికి ఆనందము కలిగించు రామా కనుక ఊరడిల్లుము. దేవి చూడబడినది. అందులో సందేహము లేదు. ఇంకెవరిచేతనో కాదు. హనుమంతునిచేతనే. ఈ పని సాధించుటకు కారణము హనుమంతుడే. ఓ మతిసత్తమా! సూర్యునిలో తేజము వలె హనుమంతునిలో కార్యదక్షత బుద్ధి నిరంతరము ప్రయత్నము చేయగల సామర్థ్యము, పరాక్రమము వెలిసి ఉన్నాయి. ఓ అమితమైన పరాక్రమము కలవాడా ఇంక చింతా యుక్తుడవు కాకుము."

అప్పుడు హనుమంతుడు సాధించిన దుస్సాధ్యమైన కార్యమునకు గర్వించి , తమ కార్యసిద్ధిని ప్రకటిస్తున్నారా అన్నట్లు కిష్కింధకు చేరుతున్నవానరుల కిలకిలారావములు ఆకాశములో మారుమోగుతున్న శబ్దము వినవచ్చెను. అప్పుడు ఆ కపిసత్తముడు వానరులయొక్క ఆ నినాదము విని తన తోకను నిటారుగా ఎత్తి సంతోషముతో నిండిన మనస్సు కలవాడయ్యెను. ఆ వానరులు అంగదుని హనుమంతుని ముందర ఉంచుకొని రామదర్శన కాంక్షతో అచటికి చేరిరి. అంగదప్రముఖులు వీరులు సంతోషముతో వానరాధిపతి కి రాఘవునకు సమీపములో దిగిరి.

అప్పుడు మహాబాహువులు కల హనుమంతుడు నమస్కరించి " దేవి నియమబద్ధురాలై క్షేమముగా ఉన్నది" అని రాఘవునకు నివేదించెను.

లక్ష్మణునితో కూడిన రాముడు, హనుమంతుని వదనమునుండి అమృతముతో సమానమైన "సీతను చూచితిమి " అన్న మాటలను విని ఆనంద భరితుడయ్యెను. అప్పుడు లక్ష్మణుడు, ఆ పవనాత్మజునిపై నమ్మకము చూపిన, సుగ్రీవుని అతి గౌరవముతో చూచెను.

అప్పుడు శత్రువీరసంహారకుడైన రాముడు అమితమైన ఆనందములో ఓలలాడితూ అత్యంత ఆదరభావముతో హనుమంతుని సాదరముగా చూచెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది నాలుగవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్||
శ్లో|| ప్రీత్యా రమమాణోఽథ రాఘవః పరవీరహ||
బహుమానేన మహతా హనుమంత మవైక్షతా||39||
స|| పరవీరహ రాఘవః రమమాణః ఉపేతః మహతా బహుమానేన హనుమన్తం అవైక్షత||
తా|| అప్పుడు శత్రువీరసంహారకుడైన రాముడు అమితమైన ఆనందములో ఓలలాడితూ అత్యంత ఆదరభావముతో హనుమంతుని సాదరముగా చూచెను.
||ఓమ్ తత్ సత్||