||సుందరకాండ ||

||అరువది ఎనిమిదవ సర్గ తెలుగులో||


|| ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ అష్టషష్టితమస్సర్గః||

హనుమంతుడు సీతా దేవి చెప్పిన మాటలను రామునికి చెప్పసాగెను.

' ఓ పురుషులలో పులి వంటి వాడా!ఓ రామా నీ పై ప్రేమానురాగములతో బయలుదేరుతున్ననాతో సీతా దేవి తన మాటలు మళ్ళీ చెప్పెను'.

"ఓ హనుమా! శీఘ్రముగా రావణుని హతమార్చి ఏ విధముగా నన్ను పొందునో ఆ విధమును దాశరథి కి బహువిధములుగా చెప్పుము. ఓ అరిందమ! వీరుడా ! అది తగును అనుకొనినట్లయితే ఎక్కడో ఒక నిరాటంకమైనచోట విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళుము. నీ సాన్నిధ్యముతో అల్పభాగ్యముకల నాకు ఈ శోకసముద్రమునుంచి ఒక క్షణము విముక్తి కలిగినది. ఓ విక్రాంతుడా నీవు వెళ్ళిన పిమ్మటమళ్ళీ వచ్చువరకు నాప్రాణములు ఉండునో లేదో సందేహమే. దానిలో ఏమీ సంశయము లేదు. దుఃఖములో వున్నఈ దురదృష్ఠవంతురాలగు నాకు నీవు కనపడక మళ్ళీ శోకము కలుగును."

హనుమంతుడు సీత మాటలు ఇంకా చెప్పెను

"ఓ వీరుడా ! వానరేశ్వరుడా ! నీ కు గల మహా సమర్థకుల మీదా నాకు ఈ సందేహము కలదు. దుష్కరమైన ఈ మహోదధిని ఆ వానరసైన్యములు ఎలా దాటెదరు? ఆ సాఘర లంఘనము నకు తగిన శక్తి భూతములలో ముగ్గురికే కలదు. వారు వైనతేయుడు, మారుతీ మరియు నీవు మాత్రమే. ఓ వీరుడా ! కార్యము సాధించువారిలో శ్రేష్ఠుడా !అలాంటి ఈ దుష్కరమైన కార్యము సాధించుటకు సమాధానము కనపడు చున్నదా చెప్పుము. శత్రువులను క్షితించువాడా ! ఈ కార్యము సాధించుటకు నీవొక్కడివే తగినవాడివి. నీవు ఈ కార్యము సాధించినచో యశస్సు పొందెదవు."

"ఆ రాముడు రావణుని రావణునిసమస్త బలములతో యుద్ధములో జయించి తనపురమునకు నన్ను తీసుకొనిపోయినచో అది ఆయనకు యశస్కరము గా వుండును. నేను రాక్షసవీరుని చే ఏవిధముగా అపహరింపబడితినో ఆ విధముగా రహస్యముగా రాఘవుడు తీసుకొనిపోవుట తగదు. శత్రువులను మర్దించు కాకుత్‍స్థుడు లంకానగరమును తన శరములతో సంకులము చేసి నన్ను తీసుకు పోయినచో అది ఆయనకు తగును. ఆ మహాత్ముడు యుద్దవీరుని యొక్క శక్తి కి అనుగుణముగా ఏది తగునో అది నీవు ప్రతిపాదించుము".

'ఓ రామా ఆ అర్థసహితమైన హేతువులతో కూడిన సీతా దేవి వాక్యములను విని నేను ఈ విధముగా మాట్లాడితిని. "ఓ దేవీ వానర సైన్యములకు అధిపతి , ఆకాశములో ఎగురువారిలో శ్రేష్ఠుడు, సత్వ సంపన్నుడు అగు సుగ్రీవుడు నిన్ను రక్షించుటకు కృత నిశ్చయుడై ఉన్నాడు. అమితమైన పరాక్రమము కలవారు, వీరులు మనోనిశ్చయము కలవారు ఆయన పాలనలో ఉన్నారు. వారు పైకి ఎగరకలరు. క్రిందకి పోగలరు. వారు ఏదిశలొనైన పోగలరు. వారు ఎట్టి కార్యమైన సాధించ కల శక్తి కలవారు. ఆ మహాభాగులు బలదర్పము కలవారు వారు వాయుమార్గములో భూమి ని ప్రదక్షణము చేయగలవారు. సుగ్రీవుని సన్నిధిలో నాకన్నా విశిష్ఠులు , నాతో సమానులు ఉన్నారు. కాని నాకన్నా తక్కువ వారు లేరు. నేనే ఇక్కడి కి రాగలిగితిని. మహాబలురైన వారి సంగతి చెప్ప నేల. మహాబలవంతులను ఇట్టి కార్యమునకు పంపరు. ఇతర జనులనే పంపెదరు. ఓ దేవీ ఆ విషయము గురించి చింతించ వద్దు. నీ శోకము చాలును. ఆ వానర యోధులు ఒక్క గంతులో ఇచటికి చేరెదరు".

హనుమంతుడు తను సీతతో చెప్పిన మాటలు చెప్పసాగెను.

"ఓ పూజ్యురాలా ! నరసింహులగు రామలక్ష్మణులు ఇద్దరూ నా పృష్ఠము మీద కూర్చుని ఉదయించిన చంద్ర సూర్యులవలె త్వరలో ఇచటికి వచ్చెదరు. లంకాద్వారము దగ్గర ధనస్సు చేతిలో పట్టుకొని నిలబడిన సింహస్వరూపులైన రాముని లక్ష్మణుని త్వరలో చూచెదవు. నఖములు దంతములు ఆయుధములుగా గల, సింహ శార్దులములతో సమానమైన పరాక్రమము గల, వానరులను వానరేంద్రులను త్వరలో చూచెదవు. లంకా మలయ పర్వతములపై తిరుగుచున్నకొండలతో మేఘములతో సమానులైన వానరులను నీవు త్వరలో చూచెదవు. వనవాసమునుంచి తిరిగివచ్చిన శత్రుమర్దనుడు, అయోధ్యలో అభిషిక్తుడైన రాఘవుని నీవు త్వరలో చూచెదవు".

హనుమంతుడు రామునికి చెప్పసాగెను

'ఓ రామా అప్పుడు నీయొక్క వియోగశోకముతో పీడించబడి దుఃఖములో నున్న మిథిలాకుమారి నా సంప్రీతికరమైన శుభకరమైన సముచితమైన మాటలతో ఊరడిల్లి శాంతిని పొందెను'

ఆ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఎనిమిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||

 

 

 

 

 ||ఓమ్ తత్ సత్||