||సుందరకాండ ||

|| ఆఱవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
శ్లో|| స నికామం విమానేషు విషణ్ణః కామరూపధృత్|
విచచార పునర్లఙ్కాం లాఘవేన సమన్వితః||1||
స|| ( సీతాం అదృష్ట్వా) విషణ్ణః సః కామరూపధృత్ హనుమాన్ పునః సమన్వితః విమానేషు లాఘవేన నికామం లఙ్కాం విచచార ||
తా|| అప్పుడు విషణ్ణవదనముతో కామరూపి అగు హనుమంతుడు మళ్ళీసీతాన్వేషి అయి మహావేగముతో మరల లంకానగరములో తిరగసాగెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షష్టస్సర్గః

సీత కనపడక పోవడముతో దుఃఖముకలవాడై విషణ్ణవదనముతో కామరూపి అగు హనుమంతుడు మళ్ళీ సీతాన్వేషి అయి మహావేగముతో లంకానగరములో తిరగసాగెను.

అప్పుడు లక్ష్మీ సంపన్నుడగు హనుమంతుడు ఎఱ్ఱని రంగుతో ప్రకాశిస్తున్న ప్రాకారము గల మధ్యాహ్నపు సూర్యుని వలే ప్రకాశిస్తున్న రాక్షసాధిపతి భవనము చేరెను. ఆ కపికుంజరుడు సింహములచే రక్షింపబడిన వనము వలె భయంకరమైన రాక్షసుల చేత రక్షింపబడిన భవనమును చూచి చకితుడాయెను.

ఆ రాక్షసేంద్రుని భవనము విచిత్రమైన వాకిళ్ళతో అందమైన వెండి బంగారపు ముఖ ద్వారములతో చుట్టబడి విరాజిల్లు చున్నది. అక్కడ గజములమీద కూర్చుని ఉన్న శ్రమ ఎరగని వీరులు గజపాలకులను, అజేయములైన గుఱ్ఱములుపూన్చిన రథము పై సంచరిస్తున్న వీరులను చూచెను.

అక్కడ సింహము పులుల చర్మములతో చేయబడిన అస్త్ర కవచములు బంగారు వెండి దంతాలతో అలంకరింప బడి విచిత్రమైన రథములు లో ఉన్నాయి. ఆ రథములు రథధ్వనితో అచట సంచరిస్తూ ఉన్నవి. అలాగ అమూల్యమైన రత్నములతో అలంకరింపబడిన అనేక మంచి ఆసనములతో పాత్రలతో, మహారథులకి ఆవాసముగా ఉన్న , మహారథముల ఘోషతో నిండి ఉన్న, ఆ భవనము హనుమ చూచెను.

ఆ భవనము చూచుటకు అందముగానున్నఅనేకరకముల అందమైన వేలకొలది పక్షులు మృగములు నిండియుండెను. సుశిక్షులూ వినీతులూ అయిన రాక్షసులచేత రక్షింపబడుతూ ఆ భవనము ముఖ్యమైన వరస్త్రీలతో నిండి ఉన్నది. ఆ రాక్షసేంద్రుని నివాసము లో సంతోషముతోనున్నవారు ధరించిన మంచి ఆభరణముల ధ్వనులు అక్కడ సముద్రపు ధ్వని వలె నుండెను. ఆ భవనము అగరు చందనాది సుగంధ ద్రవ్యములతో రాజగుణములు కల ముఖ్యులు మహాజనులతో నిండి సింహములతో కూడిన వనము వలెనుండెను. ఆ భవనము భేరీమృదంగముల ధ్వనులతో శంఖారావములతో వున్నది. నిత్యము అర్చనలతో, పర్వదినములలో రాక్షసులచేత ఎల్లప్పుడు పూజింపబడుతూ వున్నది. సముద్రములాగ గంభీరమైన ధ్వనులతో , సముద్రములాగా మహారత్నములతో కూడి యున్న మహాత్ముల మహత్తరమైన ఆ భవనమును ఆ మహాకపి చూచెను.

ఆ మహాకపి గజాశ్వరథసంకులముతో విరాజిల్లుచున్న ఆ భవనము లంకకే ఆభరణము అని తలచెను. అక్కడ ఆ రావణుని భవనము దగ్గరే ఆ హనుమంతుడు సంచరించసాగెను. రాక్షసుల ప్రతి గృహము ఉద్యానములు ప్రాసాదములు చూస్తూ జంకులేకుండా ఆ హనుమంతుడు తిరుగసాగెను.

మహావీరుడు మహావేగముతో ప్రహస్తుని గృహము లోకి దూకి తరువాత మహపార్స్వుని భవనములో కి దూకెను. అప్పుడు ఆ మహాకపి మేఘములతో సమానముగా ప్రకాశించు కుంభకర్ణుని గృహము అలాగే విభీషణుని గృహములో కి దూకెను. ఆ వానరుడు మహోదరుని గృహము, విరూపాక్షుని గృహము , విద్యుజ్జిహ్వుని గృహము , అలాగే విద్యుమాలి గృహము, వజ్రదంష్ట్రుని గృహములోకి దూకెను. మహాతేజోవంతుడైన ఆ వానరోత్తముడు ధీమంతులైన శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు భవనములకు వెళ్ళెను. ఆ హరిసత్తముడు జంబుమాలి, సుమాలి గృహములు వెదెకెను. ఆ మహాకపి రశ్మికేతుడు అలాగే సూర్యశత్రుడు , వజ్రకాయుడు భవనములను వెదెకెను. పిమ్మట ధూమ్రాక్షుడు అలాగే సంపాతి విద్యుద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు మున్నగు వారి భవనములో వెదెకెను. అలాగే శుకనాసుడు, వక్రుడు, వికటుడు, బ్రహ్మకర్ణుడు దంష్ట్రుడు రోమశుడుమున్నగు రాక్షసులభవనములు చూచెను. అలాగే యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు హస్తిముఖుడు మున్నగు వారి భవనములు చూచెను.

అలాగే వరుసగా కరాళుడు, పిశాచుడు శోణితాక్షుడు మున్నగు వారి భవనములను ఆ మారుతాత్మజుడు వెదెకెను.

అ మహాయశోవంతుడు వారి వారి భవనములలో ఐశ్వర్యవంతులగు వారి ఐశ్వర్యము చూసెను.

అ ఐశ్వర్యవంతుడైన హనుమంతుడు అందరి భవనములు దాటి రాక్షసేంద్రుని నివాసము చేరెను.

ఆ హరి శార్దూలము వంటి వానరసత్తముడు రావణుని భవనములో సంచరిస్తూ వికృతమైన కళ్ళుగల శూలములు ముద్గరాలు చేతిలో పట్టుకుని ఉన్న, శక్తులు తోమరాలు మున్నగు ఆయుధములను ధరించిన రాక్షసస్త్రీలను చూచెను. ఆ రాక్షసాధిపతి గృహములో మహాకాయము గలవారు అనేక రకముల ఆయుధములను ప్రయోగించు వారితో కల సైనిక విభాగములను రాక్షసులను చూచెను.

ఆ భవనములో ఎఱుపు తెలుపు చామచాయ రంగుల వేగముగాపోగల గుఱ్ఱములను చూచెను. మంచికులములో పుట్టిన, రూపసంపన్నముగల, శత్రుగజములను పీడించగల గజములను, ఐరావతముతో సమానమైన గజములను, యుద్ధములో పరసైన్యమును హతమార్చగలిగిన, పర్వతములమీద వర్షించు మేఘములవలె మదోదకాన్ని స్రవిస్తూ ఉన్న, యుద్ధములో ఎవరూ ఎదురుకోనలేని గజములను చూచెను.

ఆ రావణుని భవనములో బంగారముతో అలంకరింపబడి బంగారు కవచములతో నున్న సేనావాహినులను చూచెను.

ఆ మారుతాత్మజుడు ఆ రాక్షసరాజు భవనములో వివిధాకారములు గల పల్లకీలు, చిత్రవిచిత్రములైన క్రీడాగృహములు , కొయ్యతో నిర్మించబడిన పర్వతములు, కామక్రీడలకు తగు భవనములు, అందమైన పగటి గృహములు చూచెను. మందరపర్వతముతో సమానమైన ఆభవనము , మయూరములుగల స్థానములతో , ధ్వజములు కట్టబడు దండములతో నిండియుండెను. ధీరుల పర్యవేక్షణలో భూతపతి గృహములాగా వున్న ఆ భవనోత్తమము లో అనేక రత్నముల నిధులను చూచెను.

ఆ భవనము అనేక రకములైన వజ్రములు రత్నములతో నిండియున్ననూ, సూర్యకిరణముల తేజస్సులాగావున్న రావణుని తేజస్సుతో విరాజిల్లెను. ఆ వానరోత్తముడు అక్కడ బంగారము తో చేయించబడిన శయనములు ఆసనములు , ఇంకా ముఖ్యమైన పాత్రలను చూచెను,

అప్పుడు మణులతో చేయబడి పానములతో నిండిన పాత్రలతో గల, బంగారపు నూపురముల నాదనినాదములతో నిండిన, మృదంగముల ధ్వనులతో నిండిన, ప్రాసాదముల సముదాయములో కుబేరభవనములాంటి మహాగృహమును హనుమంతుడు ప్రవేశించెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఆఱవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
మృదఙ్గతలఘోషైశ్చ ఘోషవద్భిర్వినాదితమ్|
ప్రాసాదసంఘాతయుతం స్త్రీరత్నశతసంకులమ్||
సుపూఢ్యకక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహమ్||44||
స|| మృదఙ్గతలఘోషైశ్చ వినాదితమ్ నినదేన ఘోషవద్భిః ప్రాసాదసంఘాతయుతమ్ స్త్రీరత్నశతసంకులమ్ (కుబేర భవనం యథా )మహాగృహం హనుమాన్ ప్రావివేశ||
తా|| (హనుమంతుడు) మృదంగముల ధ్వనులతో నిండిన , ఆ ధ్వనులతో ప్రతిధ్వనిస్తున్న, ప్రాసాదముల సముదాయములో, వందలాది స్త్రీరత్నములతో నిండిన (కుబేర భవనములాంటి) మహా గృహమును ప్రవేశించెను.
||ఓమ్ తత్ సత్||