||సుందరకాండ ||

|| ఏడవ సర్గ శ్లోకార్థ తాత్పర్యముతో||

|| Sarga 7 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ సప్తమస్సర్గః

ఈ ఏడవ సర్గ లో ముఖ్యముగా మనము చూచేది వినేది రావణ ఐశ్వర్యము. అందులో స్వర్ణమయమై మనోహరముగా అతని ఆత్మబలమునకు అనుగుణముగా పైకిలేచిన, మేఘములా వున్న ఆ రక్షోధిపతి భవనము. ఆ భవనము "అప్రతిరూపరూపం" అంటే అసమానమైన రూపము కలది. ఆ ఐశ్వర్యమంతా "స్వబలార్జితాని", అంటే రావణుడు సంపాదించినదే అని. అవన్నీ "దోషైః పరివర్జితాని" అంటే దోషములు లేనివి. అక్కడ ఇంకొకటి కనిపిస్తుంది. అక్కడే విరాజిల్లు చున్న , అనేకమైన రత్నములతో అలంకరింపబడియున్న, పుష్పకము అను పేరుగల మహావిమానము. ఇవన్నీ చూస్తూ హనుమంతుడు "సవిశ్మయః" అశ్చర్యచకితుడాయెను. కాని ఆ హనుమంతుడు రావణాసురునిచే పాలింపబడు ఆ నగరములో సీతాన్వేషణకై తిరుగుతూ, "పతిగుణవేగనిర్జితామ్" అంటే భర్తయొక్క గుణసంపత్తిచే జయింపబడిన, "సుపూజితామ్" పూజనీయమైన ఆ జనక సుతను కానక అత్యంత దుఃఖము కలవాడయ్యెను. ఇది ఈ సర్గలో జరిగిన కథ. ఈ సర్గలో కూడా శ్లోకాలు చదవడానికి వినడానికి అతి మధురముగా వుంటాయి.

ఇక శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.

॥శ్లోకము 7.01॥

స వేశ్మజాలం బలవాన్ దదర్శ
వ్యాసక్త వైఢూర్యసువర్ణజాలమ్|
యథామహత్ప్రావృషి మేఘజాలమ్
విదుత్పినద్ధం సవిహఙ్గజాలమ్||7.01||

స||బలవాన్ సః హనుమాన్ వ్యాసక్త వైఢూర్యసువర్ణజాలం సవిహఙ్గజాలం వేశ్మజాలం ప్రావృషి విద్యుత్పినద్ధమ్ మహత్ మేఘజాలం ఇవ దదర్శ ||

రామ టీకాలో - బలవాన్ స హనుమాన్ వ్యాసక్తాని ఖచితాని వైఢూర్యాణి యేషు తాన్యేవ సువర్ణ జాలాని స్వర్ణమయ గవాక్షాణి యస్మిన్ సవిహఙ్గజాలం విహఙ్గ సమూహితం వేశ్మ జాలం గృహసమూహం విద్యుత్ పినద్ధం ప్రావృషి మేఘజాలమివ దదర్శ|

॥శ్లోకార్థములు॥

బలవాన్ సః హనుమాన్ -
బలవంతుడైన ఆ హనుమంతుడు
వ్యాసక్త వైఢూర్యసువర్ణజాలం-
వైఢూర్యములతో కూడిన సువర్ణ గవాక్షములుకల
సవిహఙ్గజాలం వేశ్మజాలం -
విహంగసమూహములతో కూడిన గృహ సమూహమును
విద్యుత్ పినద్ధం ప్రావృషి మేఘజాలమివ -
వర్షాకాలములో విద్యుత్‍కాంతి తో మెరుస్తున్న మేఘసముదాయములవలె
దదర్శ - చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

"ఆ మహాబలవంతుడు వైడూర్యములతో కూడిన బంగారు గవాక్షములు విహంగజాలములు కల భవనసముదాయమును వర్షాకాలములో విద్యుత్‍కాంతి తో మెరుస్తున్న మేఘసముదాయములవలె చూచెను". ||7.01||

॥శ్లోకము 7.02॥

నివేశనానాం వివిధాశ్చశాలాః
ప్రధానశఙ్ఖాయుధచాపశాలాః|
మనోహరాశ్చాపిపునర్విశాలాః
దదర్శ వేశ్మాద్రిషు చన్ద్రశాలాః||7.02||

స||(సః హనుమాన్) ప్రధానశఙ్ఖాయుథచాపశాలాః వివిధాః శాలాః నివేశనానామ్ దదర్శ|పునః వేశ్మాద్రిషు మనోహరాః విశాలాః చన్ద్రశాలాః చ దదర్శ||

రామ తిలకలో - ప్రధానైః శఙ్ఖాయుధచాపైః శాలన్తే శోభన్తే తాః నివేశనానాం గృహాణాం వివిధాః శాలాః ఆవాన్తరగృహాణి మనోహరాః విశాలాశ్చ వేశ్మాద్రిషు అద్రిసదృశ వేశ్మసు చన్ద్రశాలాః శిరోగృహాణి చన్ద్రకాన్తమణిసంబద్ధావాన్తర గృహాణి వా పునః దదర్శ।

॥శ్లోకార్థములు॥

ప్రధానశఙ్ఖాయుథచాపశాలాః -
ముఖ్యమైన శంఖాయుధములు వుంచుటకుతగిన
వివిధాః శాలాః నివేశనానామ్ దదర్శ -
వివిధరకములైన శాలలు గల భవనములను చూచెను
పునః వేశ్మాద్రిషు మనోహరాః -
ఇంకా భవనపు మిద్దెలలో మనోహరమైన
విశాలాః చన్ద్రశాలాః చ దదర్శ -
విశాలమైన చంద్రదర్శనానికి అనువైన శాలలను చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

"ఆ హనుమంతుడు ఆ గృహములలో ముఖ్యమైన శంఖాయుధములు వుంచుటకు తగిన శాలలను చూచెను. ఇంకా భవనపు మిద్దెలలో మనోహరమైన విశాలమైన చంద్రదర్శనానికి అనువైన శాలలను కూడా చూచెను"||7.02||

॥శ్లోకము 7.03॥

గృహాణి నానావసురాజితాని
దేవాసురైశ్చాపి సుపూజితాని|
సర్వైశ్చ దోషైః పరివర్జితాని
కపిర్దదర్శ స్వబలార్జితాని||7.03||

స|| (సః మహా) కపిః (తత్) గృహాణి సర్వైశ్చ దేవాః అసురైః చాపి సుపూజితాని స్వబలార్జితాని దోషైః పరివర్జితాని నానావసురాజితాని దదర్శ||

రామ టీకాలో - నానావసుభిః అనేక విధ ధనైః రాజితాని దేవాః అసురైరపి సుపూజితాని ఆతి ప్రశంసితాని స్వ బలార్జితాని కుబేరాత్ప్రాప్తాని గృహాణి కపిః దదర్శ।

॥శ్లోకార్థములు॥

సర్వైశ్చ దేవాఃఆసురైః చాపి సుపూజితాని -
దేవతలు అసురులు అందరిచే కూడా పూజింపతగిన
స్వబలార్జితాని దోషైః పరివర్జితాని -
తనబలముతో సంపాదించబడిన దోషములు లేని
నానావసురాజితాని - అనేకవిధములైన సంపత్తులను
కపిః (తత్) గృహాణి దదర్శ - వానరుడు ఆ భవనములలో చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

"ఆ మహాకపి ఆ గృహములలో అందరు దేవతలూ సురులూ పూజింపతగిన, తన బలములతో సంపాదించబడిన, దోషములు లేని అనేకరకములైన సంపత్తులను చూచెను." ||7.03||

॥శ్లోకము 7.04॥

తాని ప్రయత్నాభిసమాహితాని ||
మయేవ సాక్షాదివ నిర్మితాని|
మహీతలే సర్వ గుణోత్తరాణి
దదర్శ లఙ్కాధిపతేర్గృహాణి||7.04||

స|| ప్రయత్నాభి సమాహితాని సర్వగుణోత్తరాణి లంకాధిపతేః గృహాణి సాక్షాత్ మయేవ నిర్మితాని భవనాని ఇవ హనుమాన్ దదర్శ||

రామ టీకాలో - ప్రయత్నేన అభిసమాహితాని చతుర్దిక్షు క్రమేణ సంనివేశితాని మయేన సాక్షాత్ నిర్మితాని ఇవ విశ్వకర్మణా నిర్మితత్వేపి అనేక మాయామయత్వాన్ మయనిర్మిత సదృశాని ఇత్యర్థః, సర్వగుణోత్తరాణి సర్వగుణైః శ్రేష్ఠాని గృహాణీ దదర్శ।

॥శ్లోకార్థములు॥

ప్రయత్నాభి సమాహితాని - ప్రయత్నముతో చక్కగా నిర్మితమైన
సర్వగుణోత్తరాణి లంకాధిపతేః గృహాణి - అత్యుత్తమమైన గుణములతో తులతూగు ఆ రాక్షసాధిపతి భవనములు
సాక్షాత్ మయేవ నిర్మితాని భవనాని ఇవ -
సాక్షాత్తు మయునిచే నిర్మింపబడిన భవనములలా వున్న భవనములను
హనుమాన్ దదర్శ - హనుమంతుడు చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

"ప్రయత్నముతో చక్కగా నిర్మితమైన అత్యుత్తమమైన గుణములతో తులతూగు ఆ రాక్షసాధిపతి భవనములు సాక్షాత్తు మయునిచే నిర్మింపబడిన భవనములలా వున్న భవనములను హనుమంతుడు దర్శించెను." ||7.04||

॥శ్లోకము 7.05॥

తతో దదర్శోచ్ఛ్రితమేఘరూపమ్
మనోహరం కాఞ్చనచారురూపమ్|
రక్షోఽధిప స్యాత్మబలానురూపమ్
గృహోత్తమం హ్యప్రతిరూపరూపమ్||7.05||

స|| (తత్) రక్షోధిపస్య ఉత్తమమ్ గృహమ్ దదర్శ | (తత్ గృహమ్) మనోహరం కాంచనచారురూపం అప్రతిరూపరూపం రక్షోధిపస్య ఆత్మబలానురూపం అస్తి| తత్ గృహం ఉచ్ఛ్రితమేఘరూపం ఇవ అస్తి||

॥శ్లోకార్థములు॥

మనోహరం కాంచనచారురూపం - మనోహరము గా స్వర్ణమయమైన
అప్రతిరూపరూపం - అప్రతిమమైన రూపముగల
రక్షోధిపస్య ఆత్మబలానురూపం - రాక్షసరాజుయొక్క బలమునకి దీటైన
ఉచ్ఛ్రితమేఘరూపం ఇవ - పైకి లేచిన మేఘమువలెనున్న
ఉత్తమమ్ గృహమ్ దదర్శ - ఉత్తమమైన గృహమును చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

తా|| మనోహరము గా స్వర్ణమయమైన అప్రతిమమైన రూపము గల, పైకి లేచిన మేఘమువలెనున్న రాక్షసరాజుయొక్క బలమునకు దీటైన, ఉత్తమమైన గృహమును చూచెను ||7.05||

॥శ్లోకము 7.06॥

మహీతలే స్వర్గమివ ప్రకీర్ణమ్
శ్రియాజ్వలన్తం బహురత్న కీర్ణమ్|
నానాతరూణాం కుసుమావకీర్ణమ్
గిరేరివాగ్రం రజసావకీర్ణమ్||7.06||

స|| శ్రియా జ్వలన్తం బహురత్న కీర్ణమ్ (తత్ గృహమ్) మహీతలే ప్రకీర్ణమ్ స్వర్గమివ (అస్తి)| నానాతరూణాం కుసుమావకీర్ణం రజసా గిరేః అగ్రం ఇవ (తత్ గృహమ్ అస్తి)||

రామ తిలకలో- మహీతలే ప్రకీర్ణమ్ పతితం స్వర్గమివ; కుమావకీర్ణం కుసుమైః వ్యాప్తం;రజసావకీర్ణం రజసా పుష్పాణాం ఇతి శేషః।

గోవిందరాజ తమ టీకాలో - తదన్తర్వర్తి పుష్పకవిమానం దర్సయతి- అంటే ఇక హనుమ ఆ భవనముల మధ్యలో నున్న పుష్పక విమానముచూచుచున్నాడు

॥శ్లోకార్థములు॥

శ్రియా జ్వలన్తం బహురత్న కీర్ణమ్ -
అనేక రత్నములతో ఐశ్వర్యముతో తులతూగుచూవున్న
మహీతలే స్వర్గమివ ప్రకీర్ణమ్-
భూమిపై పడిన స్వర్గములా వున్న
నానాతరూణాం కుసుమావకీర్ణమ్-
అనేకమైన వృక్షముల కుసుమములతో నిండిన
గిరేరివాగ్రం రజసావకీర్ణమ్ -
పుష్పములతో నిండిన గిరి శిఖరము వలెనున్న
( ఆ విమానమును చూచెను)

॥శ్లోకతాత్పర్యము॥

తా|| మహీతలము పై స్వర్గములాగ అనేక రత్నములతో ఐశ్వర్యముతో తులతూగుచూవున్న ఆ రాక్షసాధిపతి గృహము, అనేక విరబూచిన వృక్షముల రజస్సుతో నిండిన పర్వత శిఖరమువలె నుండెను.||7.06||

॥శ్లోకము 7.07॥

నారీప్రవేకైరివ దీప్యమానమ్
తటిద్భి‍రమ్భోదవ దర్చ్యమానమ్|
హంసప్రవేకైరివ వాహ్యమానమ్
శ్రియాయుతం ఖే సుకృతాం విమానమ్||7.07||

స|| తత్ సుకృతాం విమానమ్ అర్చమానమ్ నారీప్రవేకైః శ్రియా యుతం (అస్తి)| అమ్భోదవత్ దీప్యమానం తటిద్భిః ఇవ అస్తి| ఖే హంసప్రవైకైః వాహ్యమానమ్ ఇవ అస్తి||

॥శ్లోకార్థములు॥
తత్ విమానమ్ - ఆ విమానము
సుకృతాం - పుణ్య పురుషుల
నారీప్రవేకైరివ దీప్యమానమ్-
స్త్రీరత్నములతో దేదీప్యమానముగా నున్నది
తటిద్భి‍రమ్భోదవ దర్చ్యమానమ్ -
విద్యుత్కాంతితో ప్రకాశమైన నీటితో కూడిన మేఘములా వున్నది, పూజింపతగినది
హంసప్రవేకైరివ ఖే వాహ్యమానమ్ -
హంసలసముదాయముచేత ఆకాశములో మోయబడినదా అన్నట్లు వున్నది

॥శ్లోకతాత్పర్యము॥

తా|| ఆ సుకృతమైన విమానము అత్యుత్తమమైన స్త్రీలు సిరులతో దేదీప్యమానముగా నున్నది, పూజించతగినదిగా వున్నది. విద్యుత్కాంతితో మెరుస్తున్న నీటితో కూడిన మేఘములులా వున్నది. హంసలసముదాయము చేత ఆకాశములో మోయబడినదా అన్నట్లు వున్నది. ||7.07||

॥శ్లోకము 7.08॥

యథా నగాగ్రం బహుధాతుచిత్రమ్
యథా నభశ్చ గ్రహచన్ద్రచిత్రమ్|
దదర్శయుక్తీకృత మేఘచిత్రమ్
విమానరత్నం బహురత్న చిత్రమ్||7.08||

స|| తత్ విమానరత్నం బహురత్న చిత్రం అస్తి| (తత్ విమానమ్) యథా బహుధాతుచిత్రమ్ నగాగ్రం ఇవ యథా యుక్తీకృత మేఘచిత్రం ఇవ యథా నభశ్చ గ్రహచన్ద్ర చిత్రం ఇవ అస్తి ||

॥శ్లోకార్థములు॥

విమానరత్నం బహురత్న చిత్రమ్ -
ఆ విమానరత్నము అనేకమైన రత్నములతో అలంకరింపబడియున్నది
బహుధాతుచిత్రమ్ నగాగ్రం ఇవ -
అనేకమైన ధాతువులతో నిండిన నగాగ్రము పోలియున్నది
యుక్తీకృత మేఘచిత్రం-
అనేక వర్ణములు కల మేఘముల సముదాయమువలెనున్నది
నభశ్చ గ్రహచన్ద్ర చిత్రం ఇవ-
గ్రహ చంద్రాదులతో కూడిన ఆకాఅశము వలె నున్నది

॥శ్లోకతాత్పర్యము॥

"ఆ విమానరత్నము అనేకమైన రత్నములతో అలంకరింపబడియున్నది.అనేకమైన ధాతువులతో నిండిన నగాగ్రము పోలియున్నది. అనేక అనేక వర్ణములు కల మేఘముల సముదాయమువలెనున్నది. చంద్రుడు తదితర గ్రహములో నిండిన ఆకాశమువలెనున్నది." ||7.08||

॥శ్లోకము 7.09॥

మహీకృతా పర్వతరాజిపూర్ణా
శైలాః కృతా వృక్షవితానపూర్ణా|
వృక్షాః కృతా పుష్పవితానపూర్ణాః
పుష్పం కృతం కేసర పత్ర పూర్ణమ్||7.09||

స|| యత్ర పర్వత రాజి పూర్ణా మహీ (చిత్రీ) కృతా | యత్ర వృక్ష వితానపూర్ణా శైలాః (చిత్రీ) కృతా | యత్ర వృక్షాః పుష్పవితానపూర్ణా (ఇవ చిత్రీ ) కృతా | యత్ర పుష్పమ్ కేసరపత్రపూర్ణమ్ చిత్రీకృతా | (తత్ విమానం హనుమాన్ దదర్శ) ||

రామ తిలక టీకాలో - యత్ర విమానే మహీ స్థితి భూమిః పర్వతరాజిపూర్ణా కృతా నిర్మిత పర్వతైః పూరితేత్యర్థః, శైలాస్తు వృక్షవితానైః తరుసమూహైః పూర్ణాః కృతాః ; పుష్పం చ కేసర పత్రాభ్యాం పూర్ణ కృతమ్।

॥శ్లోకార్థములు॥

పర్వత రాజి పూర్ణా మహీ (చిత్రీ) కృతా-
అక్కడ మహీతలము పర్వతరాజములతో
వృక్ష వితానపూర్ణా శైలాః (చిత్రీ) కృతా -
పర్వతములు వృక్షసంపత్తితో,
వృక్షాః కృతా పుష్పవితానపూర్ణాః -
వృక్షములు పుష్పములతో
పుష్పం కృతం కేసర పత్ర పూర్ణమ్- పుష్పములు కేసరపత్రములతో చిత్రీకరింపబడియున్నవి

॥శ్లోకతాత్పర్యము॥

"అక్కడ మహీతలము పర్వతరాజములతో, పర్వతములు వృక్షసంపత్తితో, వృక్షములు పుష్పములతో, పుష్పములు కేసరపత్రములతో చిత్రీకరింపబదియున్నవి." ||7.09||

॥శ్లోకము 7.10॥

కృతాని వేశ్మానిచ పాణ్డురాణి
తథా సుపుష్పాణ్యపి పుష్కరాణి|
పునశ్చ పద్మాని స కేసరాణి
ధన్యాని చిత్రాణి తథా వనాని||7.10||

స|| యస్మిన్ పాండురాణి వేశ్మాని చ (చిత్రీ) కృతాని | తథైవ యస్మిన్ పుష్పాణి సహ పుష్కరాణి (చిత్రీకృతాని)| పునః యస్మిన్ కేసరాణి సః పద్మాని (చిత్రీ కృతాని) | యస్మిన్ ధన్యాని వనాని చిత్రాణి చిత్రీకృతాని (తత్ విమానమ్ దదర్శ)||

రామ టీకాలో - యస్మిన్ పాణ్డురాణి వేశ్మాని కృతాని; సుపుష్పాః శోభనపుష్ఫ విశిష్ఠాః పుష్కరిణ్యః సరస్యః కృతాః సకేశరాణి పద్మాని కృతాని;చిత్రాణి సరోవరాణి వరసరోయుక్తాని వనాని కృతాని।

॥శ్లోకార్థములు॥

వేశ్మానిచ పాణ్డురాణి కృతాని -
భవనములు తెల్లవిగా చిత్రీకరింపబడినవి
తథా సుపుష్పాణ్యపి పుష్కరాణి -
అలాగే సరోవరములు పుష్పములతో (చిత్రీకరింపబడినవి)
పునశ్చ పద్మాని స కేసరాణి -
మళ్ళీ పుష్పములు పూల రేకులతో (చిత్రీకరింపబడినవి)
ధన్యాని చిత్రాణి తథా వనాని -
అలాగే వీటి అన్నిటితో కూడిన వనములు (చిత్రీకరింపబడినవి)

॥శ్లోకతాత్పర్యము॥

"అచట భవనములు తెల్లవిగా చిత్రీకరింపబడినవి.అలాగే సరోవరములు పుష్పములతో (చిత్రీకరింపబడినవి). మళ్ళీ పుష్పములు పూల రేకులతో (చిత్రీకరింపబడినవి). అలాగే వీటి అన్నిటితో కూడిన వనములు (చిత్రీకరింపబడినవి)." ||7.10||

॥శ్లోకము 7.11॥

పుష్పాహ్వయం నామ విరాజమానం
రత్నప్రభాభిశ్చ వివర్థ మానమ్|
వేశ్మోత్తమానా మపి చోచ్చమానమ్
మహాకపిస్తత్ర మహావిమానమ్||7.11||

స|| మహాకపిః తత్ర పుష్పాహ్వయం నామ విరాజమానం మహా విమానం (దదర్శ)| తత్ విమానం రత్న ప్రభాభిః చ వివర్ధమానం | తత్ విమానం వేశ్మోత్తమానాం అపి ఉచ్చ్యమానం అస్తి|

॥శ్లోకార్థములు॥

మహాకపిః తత్ర - ఆ మహా వానరుడు
పుష్పాహ్వయం నామ- పుష్పకము అను పేరుగల
విరాజమానం మహా విమానం -
విరాజిల్లుచున్న మహావిమానమును ( చూచెను)
రత్నప్రభాభిశ్చ వివర్థ మానమ్ -
రత్న ప్రభలతో విరాజిల్లుచున్నది.
వేశ్మోత్తమానా మపి చోచ్చమానమ్ -
ఉత్తమమైన భవనముల కన్న అత్యుత్తమమైనది

॥శ్లోకతాత్పర్యము॥

తా|| ఆ మహాకపి అక్కడ విరాజిల్లు చున్న పుష్పకము అను పేరుగల మహావిమానము చూచెను. ఆ విమానము రత్న ప్రభలతో విరాజిల్లుచున్నది. ఆ విమానము ఉత్తమమైన భవనముల కన్న అత్యుత్తమమైనది. ||7.11||

॥శ్లోకము 7.12॥

కృతాశ్చ వైఢూర్యమయా విహఙ్గాః
రూప్యప్రవాళైశ్చ తథా విహఙ్గాః|
చిత్రాశ్చ నానావసుభిర్భుజఙ్గాః
జాత్యానురూపాస్తురగా శ్శుభాఙ్గాః||7.12||

స|| వైఢూర్యమయాః విహఙ్గాః కృతాః | తథైవ రూప్యప్రవాళైశ్చ కృతాః విహఙ్గాః | చిత్రాః భుజఙ్గాః నానావసుభిః కృతాః | తురంగాః జాత్యానురూపాః శుభాఙ్గాః అపి కృతాః||

రామ తిలక టికాలో - 'తస్మిన్ విమానే వైఢూర్యమయాః విహఙ్గాః కృతాః; రూప్యప్రవాలైశ్చ విహఙ్గాః కృతాః;నానా వసుభిః అనేక విధ మణిభిః చిత్రాః భుజఙ్గాః కృతాః ; అనురూపాః విమాన స్థితి యోగ్యాః జాత్యా శోభనజాత్యోపలక్షితాః శుభాఙ్గాః తురగాః అశ్వాః కృతాః'।

॥శ్లోకార్థములు॥

వైఢూర్యమయాః విహఙ్గాః కృతాః -
పక్షులు వైడూర్యములతో చిత్రీకరింపబడినవి
తథైవ రూప్యప్రవాళైశ్చ విహఙ్గాః (కృతాః) -
అలాగే వెండితోనూ పగడములతోనూ పక్షులు (చిత్రీకరింపబడినవి)
చిత్రాః భుజఙ్గాః నానావసుభిః కృతాః -
రంగురంగుల సర్పములు అనేక విధములైన మణులతో చిత్రీకరింపబడినవి
జాత్యానురూపాః శుభాఙ్గాః తురంగాః అపి కృతాః-
శుభాంగములు కల ఉత్తమజాతి అశ్వములు కూడా చిత్రీకరింపబడినవి

॥శ్లోకతాత్పర్యము॥

"అక్కడ పక్షులు వైడూర్యములతో, వెండితో పగడాలతో చిత్రీకరింపబడినవి. అలాగే అనేకవిధములైన మణులతో రంగురంగుల సర్పాలు, శుభాంగములు కల ఉత్తమజాతి అశ్వములు చిత్రీకరింపబడినవి". ||7.12||

॥శ్లోకము 7.13॥

ప్రవాళజామ్బూనదపుష్పపక్షాః
సలీల మావర్జితజిహ్మపక్షాః|
కామస్య సాక్షాదివ భాన్తి పక్షాః
కృతావిహఙ్గా స్సుముఖాస్సుపక్షాః||7.13||

స|| విహఙ్గాః సుపక్షాః ప్రవాలజామ్బూనద పుష్పపక్షాః స లీలం ఆవర్జితజిహ్మ పక్షాః కృతాః| సా విహఙ్గాః సాక్షాత్ కామస్య పక్షాః ఇవ భాన్తి||

రామ తిలక టీకా లో- ప్రవాలైః జామ్బూనద పుష్పైశ్చ యుక్తాః పక్షాః యేషాం అత ఏవ సుపక్షాః ;శోభనపక్షవిశిష్ఠాః సలీలం లీలాపూర్వకమ్ ఆవర్జితాః శిల్పావిశేషేణ మక్షికాది వర్జన క్రియా విశిష్ఠాః జిహ్మపక్షాః యేషాం తే సునుఖాః విహఙ్గాః కృతాః ;అత ఏవ తేషాం పక్షాః కామస్య కామాశ్రయీభూతమనసః పక్షాః ప్రగ్రహీతార ఇవ భాన్తి। తత్ పక్ష దర్శన మాత్రేణ విమానే స్థితిః ప్రతీయత ఇత్యర్థః॥

॥శ్లోకార్థములు॥

విహఙ్గాః సుపక్షాః-
అందమైన రెక్కల విహంగములు,
ప్రవాలజామ్బూనద పుష్పపక్షాః-
రెక్కలు పగడాలతో బంగారపు పూతతో వున్నవి
స లీలం ఆవర్జితజిహ్మ పక్షాః కృతాః -
లీలామాత్రముగా వంచబడిన రెక్కలవలె చేయబడినవి
సా విహఙ్గాః సాక్షాత్ -
ఆవిహంగమును సాక్షాత్తుగా
కామస్య పక్షాః ఇవ భాన్తి -
కామదేవుని పక్షములో వున్నాయా అని అనిపిస్తోంది

॥శ్లోకతాత్పర్యము॥

"విహంగములు అందమైన రెక్కలతో, ఆ రెక్కలు బంగారపు పూతతో పగడాలతో కోంచెము లీలగా వంచబడినవి. ఆ విహంగములు సాక్షాత్తు మన్మధుని రెక్కలు లాగా ఉన్నవి". ||7.13||

॥శ్లోకము 7.14॥

నియుజ్యమానాస్తు గజాస్సుహస్తాః
స కేసరాశ్చోత్పలపత్త్రహస్తాః|
బభూవ దేవీ చ కృతా సుహస్తా
లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా||7.14||

స|| లక్ష్మీః పద్మినీ పద్మహస్తా సుహస్తా చ సకేసరాశ్చ దేవీ చ కృతా బభూవ| తథా ఉత్పలపత్రహస్తాః నియుజ్యమానాః గజాః అస్తు ||

రామ తిలక లో- పద్మిని పద్మ విశిష్ఠే విమాన సరసి ఉత్పల పత్ర హస్తాః అత ఏవ సకేశరాః గజా నియుజ్యమానాః నిర్మితా బభూవుః; పద్మహస్తా పద్మయుక్త కరా;అత ఏవ సుహస్తా;శోభనహస్త విశిష్ఠాః దేవీః అతి ప్రకాశవిశిష్ఠా లక్ష్మీః కృతా నిర్మితా బభూవ; బభూవేతి వచన విపరిణామేన పూర్వాన్వయః అపి।

॥శ్లోకార్థములు॥

పద్మినీ పద్మహస్తా సుహస్తా లక్ష్మీః కృతా -
సరోవరములో పద్మము చేతిలో వున్న మంచి చేతులతో గల లక్ష్మీదేవి చెయబడినది
సకేసరాశ్చ - ఆపద్మములు రేకులతో వున్నవి
తథా ఉత్పలపత్రహస్తాః - అలాగే పద్మములు తొండములతో వున్న
గజాః నియుజ్యమానాః - గజములు నియోగింపబడినవి

॥శ్లోకతాత్పర్యము॥

"అచట సరోవరములో లక్ష్మీ దేవి పద్మములు ఉన్న శుభమైన పద్మహస్తములతో ఆ పద్మములు రేకులతో వున్నవి. అచట గజములు నీలికమలములతో గల తొండములతో పూజిస్తున్నవా అనట్లు నియోజింపబడినవి." ||7.14||

॥శ్లోకము 7.15॥

శ్లో|| ఇతీవ తద్గృహమభిగమ్య శోభనమ్
సవిశ్మయో నగమివ చారు శోభనమ్|
పునశ్చ తత్పరమసుగన్ధి సున్దరమ్
హిమాత్యయే నగమివ చారుకన్దరమ్||7.15||

స|| హనుమాన్ ఇతీవ శోభనమ్ చారుశోభనమ్ నగమివ తత్ గృహం అభిగమ్య సవిస్మయః భవతి|| (తతః) పునశ్చ తత్ (గృహం) హిమాత్యయే నగమివ పరమసుగన్ధి సున్దరమ్ చారుకన్దరం దదర్శ||

తిలక టీకాలో- ఇతీవ ఏవం ప్రకారం చారుకన్దరమ్ చారు గృహమ్;నగమివ పర్వత మివ;చారు దర్శనమ్ తద్గృహమ్ అభిగమ్య సవిస్మయః భభూవ ఇతి శేషః। హిమాత్యయే వసన్తే పరమసుగన్ధి చారు కన్దరమ్ నగమివ వృక్షమివ కన్దరోఽత్ర కోటరః। పునశ్చాభిగమ్య సవిస్మయో అభూత్ ఇతి శేషః ।

॥శ్లోకార్థములు॥

ఇతీవ శోభనమ్ చారుశోభనమ్ నగమివ-
ఈవిధముగా శుభప్రదము సుందరమూ అయిన పర్వతము వలె నున్న
తత్ గృహం అభిగమ్య స విస్మయః భవతి -
ఆ రావణ గృహము తిలకించి ఆ హనుమంతుడు విస్మయముతో చకితుడాయెను.
పరమసుగన్ధి సున్దరమ్ చారుకన్దరం -
సుగంధములతో సుందరమైన గుహలు కల
పునశ్చ తత్ హిమాత్యయే నగమివ -
వసంత ఋతువులోను పర్వతమువలె నున్న ఆ గృహము మళ్ళీ ప్రవేశించెను

॥శ్లోకతాత్పర్యము॥

"హనుమంతుడు పర్వతమువలెనున్న సుందరముగా శుభప్రదముగా ఉన్న, పర్వతము వలెనున్న ఆగృహమును చూచి అశ్చర్యచకితుడాయెను. మళ్ళీ హిమఋతువులో సుందరమైన గుహలతో ఒప్పారు పర్వతమువలెనున్న ఆ గృహము ప్రవేశించెను." ||7.15||

॥శ్లోకము 7.16॥

తతః స తాం కపిరభిపత్య పూజితాం
చరన్ పురీం దశముఖబాహుపాలితామ్ |
అదృశ్యతాం జనకసుతాం సుపూజితామ్
సుదుఃఖితః పతిగుణవేగవర్జితామ్||7.16||

స|| తతః స కపిః దశముఖబాహుపాలితాం పూజితాం తాం పురీం అభిపత్య చరన్ పతిగుణవేగవర్జితాం సుపూజితాం తాం జనకసుతాం అదృశ్యతాం సుదుఃఖితః బభూవ||

రామ తిలకలో - దశముఖబాహు నిర్జితామ్ రావణేన వశీకృతాం ఇతి; పూజితాం అతిప్రశంసా విశిష్ఠాంపురీం అభిపత్య ప్రాప్య
చరన్ సీతాన్వేషణార్థంఇతః తతః విచరన్ సన్ ; సుపూజితాం మహాత్మాభిః అతి ప్రశంశితాం ; సుదుఃఖితాం వియోగదుఃఖం ప్రాప్తమ్; పతిగుణ వేగ నిర్జితామ్ పతిగుణానాం సమాధికరహితవాత్సల్యాదీనాం వేగేన స్మరణ జనిత ఉద్వేగేన నిర్జితాం జనకసుతాం అదృశ్య అదృష్ట్వా దుఃఖితో అభవత్ ||

॥శ్లోకార్థములు॥

దశముఖబాహుపాలితాం పూజితాం -
రావణుని బాహుబలముతో రక్షింపబడుతూ, పూజనీయమైన
తాం పురీం అభిపత్య చరన్ -
ఆ నగరము చేరు సీతను అన్వేషించుచూ
పతిగుణవేగనిర్జితామ్-
భర్తసద్గుణసంపత్తిచే జయింపబడిన
అదృశ్యతాం జనకసుతాం సుపూజితామ్ -
పూజనీయమైన జనకుని కూతురుని గానక
తతః స కపిః సుదుఃఖితః బభూవ-
ఆ వానరుడు ఎంతో దుఃఖము కలవాడు అయ్యెను

॥శ్లోకతాత్పర్యము॥

"ఆప్పుడు ఆ హనుమంతుడు రావణాసురిని బాహుబలముచే పాలింపబడు, ఆ నగరము లో తిరుగుచూ భర్తయొక్క గుణసంపత్తిచే జయింపబడిన పూజనీయమైన ఆ జనక సుతను కానక అత్యంత దుఃఖము కలవాడయ్యెను." ||7.16||

॥శ్లోకము 7.17॥

తతస్తదా బహువిధభావితాత్మనః
కృతాత్మనో జనకసుతాం సువర్త్మనః|
అపశ్యతోఽభవ దతిదుఃఖితం మనః
సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః||7.17||

స|| తతః జనకసుతాం అపశ్యతః బహువిధభావితాత్మనః కృతాత్మనః సుచక్షుషః సువర్త్మనః మహాత్మనః మనః అతిదుఃఖితం అభవత్ ||

రామ తిలకలో - బహువిధభావితాత్మనో నానాప్రకారేణ సర్వ జగత్ పూజిత స్వభావస్య; స్వభావవాచ్యాత్మ శబ్దః; కృతాత్మనో శిక్షితాంతః కరణస్య; సువర్త్మనః శోభన నీతి మార్గ వర్తినః; సుచక్షుషః శృతి స్మృతి న్యాయ రూప చక్షుః సహితస్య;||

॥శ్లోకార్థములు॥

తతః జనకసుతాం ప్రవిచరతః అపశ్యతః -
అప్పుడు అన్వేషణలో జానకీ మాతను కనుగొనలేక
బహువిధభావితాత్మనః కృతాత్మనః -
అనేకవిధములైన ఆలోచనలు కల,అనుకున్నపని సాధింపకల
సుచక్షుషః సువర్త్మనః మహాత్మనః -
సునిశిత దృష్టికల,శక్తివంతుడు మహాత్ముడు (అయిన హనుమ)
మనః అతిదుఃఖితం అభవత్ - మనస్సు అతిదుఃఖము కలదాయెను

॥శ్లోకతాత్పర్యము॥

"ఆ జనకసుతను చూడలేక అనేకవిధములైన ఆలోచనలు కల, అనుకున్నపని సాధింపకల, సునిశిత దృష్టికల, మహాత్ముడి మనస్సు అతి దుఃఖముకలదాయెను." ||7.17||

ఇక్కడ ఆ జనకసుతను కనుగొనలేక, "బహువిధాత్మనః" అనేకవిధములైన ఆలోచనలు కల, "కృతకార్యః"అనుకున్నపని సాధింపగల,
సునిశిత దృష్టికల, మహాత్ముడు హనుమ "అతి దుఃఖితం మనః" అంటే అతి దుఃఖముకల మనస్సు కలవాడయ్యెను అని కవి చెప్పిన మాట..

ఇక ఇక్కడి అంతరార్థము చూద్దాము. :

అంత అత్యంత సుందరమైన వస్తువు చూసినపుడు ఎవరికైన బాహ్యమైన ఆనందము కలుగుతుంది. ఆ ఆనందముతో కొందరు ఆ ఆనందమే ధ్యేయముగా ఉన్న మార్గము పట్టవచ్చు. కాని అత్మ అన్వేషణలో నున్న వారికి ఈ బాహ్యమైన ఆనందము గమ్య స్థానము కాదు. వారు అంతర్గతమైన పరమానందము కొసము, తపనపడుతూ ఇంకా ముందుకు పోతారు. అలాగే ఇక్కడ హనుమంతుడు గూడా అంతా చూసినా, చివరికి సాధ్వి సీతాదేవి కనపడలేదని దుఃఖపడతాడు. కాని అన్వేషణలో ముందుకు పోతాడు.

మనకు అదే మాట, అంటే ఆత్మాన్వేషణలో ఉన్నవారికి బాహ్యమైన అనందము గమ్యస్థానము కాదు అన్నమాటే, కథోపనిషత్తులో యమ నచికేతుల సంవాదములో వినిపిస్తుంది. యముడు నచికేతునికి చెపుతాడు. ప్రతి మార్గములో "శ్రేయము" "ప్రేయము" అనబడే మార్గములు కనిపిస్తాయి. ఆత్మ అన్వేషణలో ఉన్నవాడు శ్రేయో మార్గములో వెళ్ళును. ప్రియమైన వస్తువులపై ధ్యానము కలవాడు ఆత్మాన్వేషణలో విఫలుడు అవుతాడు అని.

ఇక్కడ హనుమంతుని స్వరూపము చిత్రీకరిస్తూ వాల్మీకి ఇలా రాస్తాడు.

హనుమంతుడు - బహువిధ భావితాత్ముడూ - 'బహువిధం యథా భవతి తథా చింతితాత్మనః". అంటే బహువిధములుగా ఎలా జరుగునో అది చింతించగలిగినవాడు. అదే బహువిధములుగా ఆత్మగురించే భావన చేయువాడు. బహు విధములుగా పుష్పక విమాన వర్ణన చేసిన వాల్మీకి,
హనుమంతుడు అంతకన్నా ఎక్కువగా, బహువిధములుగా ఆత్మగురించి భావన చేయువాడు అని ప్రశంసాత్మకముగా అంటాడు

- కృతాత్ముడు- ' శిక్షితాంతఃకరణః'; అంతఃకరణమును శిక్షణలో ఉంచినవాడు. ఆత్మనే తప్పక పొంద వలనని ప్రయత్నము చేసినవాడు, చేయుచున్నవాడు. సముద్ర లంఘనములో మైనాకుడు విశ్రాంతికోసము ఆగమంటే, "ప్రతిజ్ఞా చ మయా దత్తా న స్థాతవ్యమిహాంతరే" అంటూ,
అంటే తన అన్వేషణ అయ్యేదాకా మధ్య లో ఆగనని ప్రతిజ్ఞచేసినవాడను అని అంటాడు. అదే కృతాత్ముడు.

- సువర్త్ముడు - 'శోభనమార్గావలమ్బినః' శుభకరమైన మార్గమునందు నడుచువాడు. నీతి తప్పని మార్గమున నడచువాడు. మొదటి సర్గలో మొదటి శ్లోకములో "చారణా చరితే పథి" అంటూ చెప్పిన మాటకూడా అదే, గురుతుల్యులు వెళ్ళు మార్గములో వెళ్ళువాడు. తను సాగరలంఘనము చేయు ముందర , సదా చార సంపన్నుడగు హనుమ సూర్యుడు మున్నగు దేవతలకు నమస్కరించి, అప్పుడు సాగర లంఘనముకు ఉద్యమించును.
అదే సువర్త్ముడు అన్నమాట.

- సుచక్షువు- దేహము ఆత్మ వేరు అని తెలిసికొని, ఆత్మను చూడగలగిన సూక్ష్మ దర్శి అగు అంతర నేత్రములు కలవాడు. హనుమంతుడు లంకలో దిగి త్రికూట శిఖరముపై నుంచుని దేదీప్యమానముగా దివిదేవపురిలాగా వెలుగుతున్న,భోగలాలసలకు స్థానమైన లంకను, భోగలాలసలకు స్థానమైన శరీరమును చూడగలిగినట్లు చూడగలిగిన చక్షువులు కలవాడు. అదే సుచక్షువు అంటే.

ఇవన్నీ హనుమంతుని గుణములు.

సుందరే సుందరో కపిః, అన్నలోకోక్తికి ఇవే నిదర్శనము అని కూడా అనుకోవచ్చు.
సుందరకాండ సుందరుని ఈ గుణముల వలనే సుందర కథ అని అనబడినది కాబోలు.

ఏడవ సర్గ ఇంతటితో సమాప్తము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే సప్తమస్సర్గః||
|| ఓమ్ తత్ సత్||