||సుందరకాండ ||
|| ఏడవ సర్గ తెలుగులో||
|| Om tat sat ||
స వేశ్మజాలం బలవాన్ దదర్శ
వ్యాసక్త వైఢూర్యసువర్ణజాలమ్|
యథామహత్ప్రావృషి మేఘజాలమ్
విదుత్పినద్ధం సవిహంగజాలమ్||1||
ఆ మహాబలవంతుడు వర్షాకాలములో విద్యుత్‍కాంతి తో మెరుస్తున్న మేఘసముదాయములవలె నున్న వైడూర్యములతో కూడిన బంగారు గవాక్షములు విహంగజాలములు కల భవనసముదాయము ను చూచెను
సుందరకాండ.
అథ సప్తమస్సర్గః
అప్పుడు మహాబలవంతుడు అగు హనుమంతుడు వర్షాకాలములో విద్యుత్‍కాంతి తో మెరుస్తున్న మేఘసముదాయములవలె నున్న వైడూర్యములతో కూడిన బంగారు గవాక్షములు విహంగజాలములు కల భవనసముదాయము ను చూచెను
ఆ హనుమంతుడు ఆ గృహములలో ముఖ్యమైన శంఖాయుధములు వుంచుటకు ఏర్పరచబడిన శాలలను చూచెను. మళ్ళీ ఆ శాలలో మిద్దెలపై మనోహరములైన విశాలమైన చంద్రశాలలూ కూడా ఉన్నాయి.
ఆ మహాకపి ఆ గృహములలో అందరు దేవతలూ సురులూ పూజింపతగిన, తన స్వంత బలములతో అర్జించిన, దోషములు లేని అనేకరకములైన సంపత్తులను చూచెను. ప్రయత్నముతో చక్కగా నిర్మితమైన అత్యుత్తమమైన గుణములతో తులతూగు ఆ రాక్షసాధిపతి భవనములు సాక్షాత్తు మయునిచే నిర్మింపబడిన భవనములలా వున్న భవనములను హనుమంతుడు దర్శించెను.
ఆ రక్షోధిపతి భవనము స్వర్ణమయమై మనోహరము గా అతని ఆత్మబలమునకు అనుగుణముగా పైకిలేచిన మేఘములా వున్నది. మహీతలము పై స్వర్గములాగ అనేక రత్నములతో ఇశ్వరముతో తులతూగుచూవున్న ఆ రాక్షసాధిపతి గృహము, అనేక విరబూచిన వృక్షముల రజస్సుతో నిండిన పర్వత శిఖరమువలె నుండెను. ఆ సుకృతమైన విమానము అత్యుత్తమమైన స్త్రీలు సిరులతో పూజించతగినదిగా వున్నది. నీటితో కూడి విద్యుత్కాంతితో మెరుస్తున్న మేఘములులా వున్నది. హంసలసముదాయము తో ఆకాశములో మోయబడినదా అన్నట్లు తేలియాడుచున్నది.
ఆ విమానరత్నము అనేకమైన రత్నములతో అలంకరింపబడియున్నది.అనేకమైన ధాతువులతో నిండిన నగాగ్రము పోలియున్నది , అనేక మేఘముల సముదాయమువలెనున్నది. చంద్రుడు తదితర గ్రహములో నిండిన ఆకాశమువలెనున్నది. అచటి తెల్లని భనములలో రమణీయమైన పూలతో వున్న సరోవరములు, పూలరేకులతో వున్న పద్మములు, దట్టముగా పెరిగిన వృక్షసముదాయముతో కూడిన అరణ్యములు చిత్రీకరింపబడి యున్నాయి.
ఆ మహాకపి అక్కడ విరాజిల్లు చున్న పుష్పకము అను పేరుగల మహావిమానము చూచెను. ఆ విమానము రత్న ప్రభలతో విరాజిల్లుచున్నది. ఆ విమానము ఉత్తమమైన భవనముల కన్న అత్యుత్తమమైనది. అక్కడ పక్షులు వైడూర్యములతో, వెండితో పగడాలతో చిత్రీకరింపబడినవి. అలాగే అనేకవిధములైన మణులతో రంగురంగుల సర్పాలు, శుభాంగములు కల ఉత్తమజాతి అశ్వములు చిత్రీకరింపబడినవి.
విహంగములు అందమైన రెక్కలతో, ఆ రెక్కలు బంగారపు పూతతో పగడాలతో కోంచెము లీలగా వంచబడినవి. ఆ విహంగములు సాక్షాత్తు మన్మధుని రెక్కలు లాగా ఉన్నవి. అచట సరోవరములో లక్ష్మీ దేవి పద్మములు ఉన్న శుభమైన పద్మహస్తములతో ఆ పద్మములు రేకులతో వున్నవి. అచట గజములు నీలికమలములతో గల తొండములతో పూజిస్తున్నవా అనట్లు నియోజింపబడినవి.
హనుమంతుడు హిమఋతువులో సుందరమైన గుహలతో ఒప్పారు పర్వతమువలెనున్న సుందరముగా శుభప్రదము గా ఉన్న, పర్వతము వలెనున్న ఆగృహమును చూచి అశ్చర్యచకితుడాయెను.
ఆప్పుడు ఆ హనుమంతుడు రావణాసురినిచే పాలింపబడు , ఆ నగరము లో తిరుగుచూ భర్తయొక్క గుణసంపత్తిచే జయింపబడిన పూజనీయమైన ఆ జనక సుతను కానక అత్యంత దుఃఖము కలవాడయ్యెను. ఆ జనకసుతను చూడలేక అనేకవిధములైన ఆలోచనలు కల, అనుకున్నపని సాధింపకల, సునిశిత దృష్టికల, మహాత్ముడి మనస్సు అతి దుఃఖముకలదాయెను.
ఈ విధముగా వాల్మీకి రామాయణములోని సుందరకాండలో ఏడవ సర్గ సమాప్తము.
తత్త్వ దీపిక:
అంత అత్యంత సుందరమైన వస్తువు చూశిన ఎవరికైన బాహ్యమైన ఆనందము కలుగుతున్నది. ఆ ఆనందముతో కొందరు మరి ఆ ఆనందమమే ధ్యేయముగా ఉన్న మార్గము పట్టవచ్చు. కాని అత్మ అన్వేషణలో నున్న వారికి ఈ బాహ్యమైన ఆనందము గమ్య స్థానము కాదు. వారి అంతర్గతమైన పరమానందము కొసము తపనపడుతూ ఇంకా ముందుకు పోతారు. అలాగే ఇక్కడ హనుమంతుడు గూడా అంతా చూసినా చ్వరికి సాధ్వి సీతాదేవి కనపడలేదని దుఃఖపడతాడు.
ఇక్కడ హనుమంతుని స్వరూపము చిత్రీకరిస్తూ వాల్మీకి ఇలా రాస్తాడు.
బహువిధ భావితాత్ముడూ - బహువిధములుగా ఆత్మగురించే భావన చేయువాడు.
కృతాత్ముడు- దానినే తప్పక పొంద వలనని ప్రయత్నము చేయువాడు
సువర్త్ముడు: సదాచార సంపన్నుడు, నీతి తప్పని మార్గమున నడచువాడు.
సుచక్షువు- ఆత్మను చూడగలగిన సూక్ష్మ దర్శి అగు అంతరనేత్రములు కలవాడు.
ఇవన్నీ హనుమంతుని వర్ణనలు.
|| ఓమ్ తత్ సత్||