||సుందరకాండ ||

||తొమ్మిదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ నవమస్సర్గః

మారుతాత్మజుడగు హనుమంతుడు ఆ వరిష్ట ఆలయముల మధ్యలో పెద్ద విశాలమైన శ్రేష్టమైన భవనమును చూచెను. ఒక యోజనము పొడవు అర యోజనము వెడల్పు గల ఆ రాక్షసేంద్రుని భవనము అనేకమైన ప్రాసాదములతో కూడియున్నది.

శత్రువులను మర్దించగల ఆ హనుమంతుడు విశాలమైన కళ్ళుగల ఆ సీతాదేవి వెదుకుతూ అ భనములో అన్నిచోట్లా తిరిగెను.

అప్పుడు లక్ష్మీవంతుడైన హనుమంతుడు ఆ ఉత్తమమైన రాక్షస ఆవాసమును చూచి రాక్షసేంద్రుని భవనములోకి ప్రవేశించెను. ఆ భవనము రెండు , మూడు నాలుగు దంతములు ఉన్న ఏనుగుల తోను , అప్రమత్తముగానున్న ఆయుధములు ధరించి ఉన్న రాక్షసులచేతను రక్షింపబడి యున్నది. ఆ రాక్షసభవనము భార్యలతోనూ , జయించి తీసుకురాబడిన రాజకన్యలతోనూ నిండివుంది. ఆ భవనము మొసళ్ళు తిమింగిళములు పాములతో నిండి యున్న మహా సాగరము వలెనుండెను. కుబేరునికి ఎంత ఇశ్వర్యము ఉందో, ఆకుపచ్చని గుఱ్ఱముల రథము వాహనముగాగల ఇంద్రుని దగ్గర ఎంత ఇశ్వర్యము కలదో, అంత ఇశ్వర్యము ఆ రాక్షసరాజు భవనములో కలదు.

ఆ పవనాత్మజుడు భనముల మధ్యలో ఇంకొక అందముగా నిర్మించబడిన అనేక ప్రాసాదములు గల భవనమును చూచెను. అది పుష్పకమనబడు విమానము. అన్నిరకముల రత్నములతో అలంకరింపబడిన దివ్యమైన ఆ విమానము బ్రహ్మకోసము నిర్మింపబడినది. అ పితామహుడు ఆ విమానమును కుబేరునికి ఇచ్చెను. కుబేరుని జయించి రాక్షసేస్వరుడు ఆ విమానమును సంపాదించెను.

ఆ భవనము బంగారముతోపూయబడిన ఈహామృగమల ప్రతిమలతో, స్తంభములతో శోభాయమానముగా జ్వలిస్తూ, మేరు మందర పర్వతములతో సమానముగా అకాశమునంటుతూ వున్న శుభకరమైన కూటాగారములతో నున్నది. బంగారు సోపానములతో అందమైన శ్రేష్టమైన వేదికలతో, వెలుగుతున్న సూర్యకిరణములలా ప్రకాశించుచున్న ఆ విమానము విశ్వకర్మచేత చేయబడినది. బంగారముతో స్ఫటికముల జాలల తో గల కిటికీలతోనున్న, ఇంద్రనీల మహానీల మణులతో అలంకరింపబడిన వేదికలతో ఉన్నది ఆ విమానము. ఆ విమానములో నేల విచిత్రమైన పగడలతో అమూల్యమైన మణులతోనూ అలంకరింపబడి అద్భుతముగా విరాజిల్లుచున్నది. పుణ్యగంధములతో కూడి ఎఱ్ఱని చందనముతో, కరిగించిన బంగారముతో ఆలకబడి ఉదయిస్తున్న సూర్యుని కాంతితో ప్రకాశిస్తున్నది.

అనేరకములైన అద్భుతమైన ఆకారముగల కూటాగారములతో అలంకరింపబడిన దివ్యమైన విమానమును ఆ మహాకపి ఎక్కెను. అక్కడ దివ్యమైన సువాసనలను ఆఘ్రాణించెను. ఆ పానభక్ష్యాన్నములతో కూడిన వాసన చాలా కమ్మగా మూర్చింప చేయు నట్లు ఉన్నది. ఆ వాసన ఆ మహాకపిని ఒక బంధువు తన ఆప్తబంధువుని అహ్వానించినట్లు హనుమంతుని రావణుడున్నచోటికి అహ్వానిస్తున్నట్లుండెను.

అక్కడకి బయలుదేరిన హనుమంతుడు రావణునికి ప్రీతికలిగించు కాంతామణి లాగా ప్రియమైన విశాలమైన అందమైన శాలను చూచెను. ఆ శాలలో మణులచే అలంకరింపబడిన సోపానములు కలవు. బంగారు జాలలతో అలంకరింపబడిన కీటికీలు , స్ఫటికముతో మణులతో దంతములు కల ఏనుగుల బొమ్మలతో అలంకరింపబడిన నేల కలవు. ఆ శాల ముత్యాలతోనూ పగడాలతోనూ బంగారముతోనూ అలంకరింపబడిన స్తంభములతో అలంకరింపబడిన అనేక స్తంభములతో ఉన్నది. వంకరటింకరలేని అతుత్తమమైన ఉన్నతమైన స్తంభాలపై అ విమానము విరాజిల్లుచూ రెక్కలు చాపి ఆకాశములోకి ఎగురుటకు సిద్ధముగా వున్నట్లు వుండెను.

ఆ శాలలో భూమియొక్క లక్షణములతో దేశములతో గృహములతో చిత్రీకరింపబడిన భూమిలాగవున్నతివాసీ ఉండెను. రాక్షసేంద్రునిచే తరచు ఆతిధ్యము స్వీకరింపబడిన ఆ శాల
మత్తెక్కిన పక్షుల కిలకిలారావముతో నిండి, దివ్యమైన గంధముల వాసనలతో నిండి , అమూల్యమైన ఆసనములతో కూడి ఉన్నది. ఆ శాల హంస వలె తెల్లగానున్నప్పటికి అగరు ధూపము వలన ధూమము రంగు కలిగి యున్నది. చిత్రమైన పుష్పములతో కామధేనువు వలె మంచి వర్చస్సు తో వెలుగుతోంది. మనస్సుకు ఆహ్లాదము కలిగిస్తూ, రంగును పెంపొందిస్తూ, శోకము నాశనము చేస్తూ , శ్రియమును పెంపొందిస్తూ నట్లుగా దివ్యముగానున్నది.

ఆ శాల తల్లి లాగా పంచేంద్రియాలకు తగు పదార్ధములను తర్పణములాగా సమకూర్చుచున్నది. ఆ శాల వైభవమును చూచి ఇది స్వర్గమా ? దేవలోకమా? ఇంద్రుని రాజధాని అయిన అమరావతి యా? అని హనుమంతుడు చూచి అనుకొనెను. అక్కడవెలుగుతూవున్న బంగారు దీపములు జూదములో నిపుణులైన జూదరి చేతులలో ఓడిపోయి, మౌనముగా నున్న జూదరులులాగా నిశ్చలముగా వున్నాయి. ఆ దీపముల ప్రకాశము వలన, రావణుని తేజస్సు వలన, ఆ అభరణముల కాంతి వలన, ఆశాల ప్రజ్వలిస్తున్నట్లు ఉండెను.

అప్పుడు హనుమంతుడు తివాచీలపై కూర్చుని ఉన్న అనేక రంగుల వస్త్రములు ధరించిన, అనేక రకములైన వేషములు ధరించిన, వేలకొలదీ వరనారీమణులను చూచెను. ఆ స్త్రీలు రాత్రి క్రీడలలో పాల్గొని పానము వలన కలిగిన నిద్రకు వశులై, అర్ధరాత్రి గడిచిన తరువాత గాఢనిద్రలో వున్నారు. నిశ్శబ్దముగా వున్న ఆభరణములు కల ఆ స్త్రీలతూ నున్న ఆ శాల , నిశ్శబ్దముగా వున్న భ్రమరములు హంసలు ఉన్న పద్మవనము లాగా విరాజిల్లెను.

మీలితాక్షములతో దంతములు కనపడకుండా వున్న, పద్మగంధము వెదజల్లుతున్న ఆ వర స్త్రీల ముఖములను మారుతు చూచెను. సూర్యోదయమునుండి పద్మముల వలె నున్నా ఆ స్త్రీలు రాత్రి ముడుచుకున్న పద్మములవలె ఉన్నారు. ఆ మహాకపి గుణములు ఆధారముగా ఆ స్త్రీల ముఖములు సలిలములో జనించిన పద్మముల సమానముగా ఎంచి మత్తెక్కిన తుమ్మెదలు మళ్ళి మళ్ళీ ఆ ముఖారవిందములను పద్మములని భ్రమతో నిశ్చయముగా వాలగోరతాయి అని అనుకొనెను.

ఆ రాక్షసేంద్రుని యొక్క ఆ శాల ఆలాగ స్త్రీలతో్, తారలతో కూడి శోభిస్తున్న నిర్మలమైన శరత్ రాత్రివలె, విరాజిల్లెను. ఆ స్త్రీలతో చుట్టబడి ఆ రావణుడు తారలతో చుట్టబడి వెలుగుచున్న చంద్రుడిలా వెలుగుచుండెను. ఆ స్త్రీలు పుణ్యము క్షీణించిపోగా భూమి మీద పడిన తారలవలె నున్నారని హనుమంతుడు తలచెను. అక్కడ ఆ వరస్త్రీల రంగులు, కాంతి, ప్రసన్నతా, శుభమైన కాంతి ని ప్రసరించే మహత్తరమైన తారల వలె ప్రకాశిస్తున్నవి.

పానక్రీడల సమయములో ధరించిన ఆభరణములు చెల్లాచెదరై వున్న ఆ స్త్రీలు అదమరచి నిద్రిస్తున్నారు. కొందరు వరస్త్రీల తిలకము రేగి పోయి ఉన్నది. కొందరి నూపురములు స్థానము తప్పాయి. కొందరి హారములు పక్కకి జారి పడి ఉన్నాయి. మరికోందరు తెగిన ముత్యాలహారముల కలవారై ఉన్నారు. కొందరి వస్త్రములు జారిపోయి ఉన్నాయి. కొందరి మొలనూళ్ళు తెగి పోయిఉన్నాయి. కొందరు అలసటతీర్చుకోడాఅనికి శయినిస్తున్న ఆడ గుఱ్ఱములవలె నున్నారు. మంచికుండలములను ధరించిన అస్త్రీలు కొందరు మహారణ్యములో గజేంద్రునిచే చెల్ల చెదరు చేయబడినా కాని వికసిస్తున్న లతల వలె నున్నారు.

కొందరు వరస్త్రీలు స్థనముల మధ్య వెలుగుచున్న హారములతో చంద్రకిరణముల కాంతిలో నిద్రిస్తున్న హంసల వలె ఉన్నారు. కొందరు స్త్రీలు ధరించిన వైఢూర్యములు కాదంబపక్షుల వలెను, కొందరు ధరించిన సువర్ణ సూత్రాలు చక్రవాక పక్షులవలెను కనిపిస్తున్నాయి. ఇసుకతిన్నెలవలె విశాలమైన జఘనములు కల ఆ స్త్రీలు హంసకారండవ చక్రవాక పక్షులచే విరాజిల్లు నదులవలె శోభిస్తున్నారు. చిరుమువ్వలుగల మొలతాళ్ళను, బంగారు ఆభరణములు ధరించి నిద్రిసున్న ఆ స్త్రీలు పెద్ద పద్మములు లాగా, శృంగార చేష్టలలో ఏర్పడ్డ నఖగాట్లే మొసళ్ల గా, వారి యశస్సులే తీరాలుగా, గలిగిన నదులవలె ఒప్పారు.

మృదువైన అంగములు కల కొందరు వారి అంగముల మీద కుఛములమీద పడిన ఆభరణముల ముద్రలతో వారే ఆభరణముల వలె ఒప్పారుచున్నారు. కొందరు స్త్రీల ముఖములపై శ్వాస నిశ్వాసల గాలితో వారి పయ్యెద కొంగులు మళ్ళీ మళ్ళీ పడుతున్నాయి. అనేకమైన మంచి రంగులు కల అ స్త్రీల ముఖములపై వస్త్రాంతములు రెపరెపలాడుచూ ఎగురుచున్న పతాకములవలె నున్నవి. కోందరి స్త్రీల కర్ణాభరణములు ఊచ్చ్వాస నిశ్వాసాలతో మెల్లిగా మెల్ల్లిగా ఊగుచూఉన్నాయి.

అప్పుడు స్వాభావికముగా పరిమళభరితమైన ముఖమునుంచి వచ్చువారి శ్వాసలు రావణుని కి సేవచేస్తున్నాయి. కోందరు రావణ స్త్రీలు రావణుడే అనుకొని మళ్ళీ మళ్ళీ సపత్నుల ముఖములను ముద్దుపెట్టుకొనసాగిరి. రావణునిపై అమితమైన ప్రేమగల ఆ వర స్త్రీలు భ్రమతో చెంతనున్న సపత్నులకు ప్రేమను చేకూర్చారు. ఇంకా కొందరు ఆభరణములతో నున్న తమ బాహువులను తలగడగా చేసుకొని నిద్రిస్తున్నారు. ఒకరు ఇంకొకరి వక్షస్తలముపై , కొందరు మళ్ళీ ఇంకొకరి భుజముపై, ఇంకొకరు ఇంకొకరి తోడపై తల పెట్టి నిద్రిస్తున్నారు. మద్యపానము వలన స్నేహము కలవారై, స్త్రీలు ఒకరికొకరి తలలు ఇతరుల వక్షములు భుజములు తోడలపై ఆన్చి చేతులు పెట్టి పడుకుని ఉన్నారు. ఒకరికొకరి భుజములు మాలలాగా కట్టబడినట్లున్న ఆ స్త్రీలు మదించిన తుమ్మెదలతో దారముతో గుచ్చబడిన పుష్పహారము వలె ప్రకాశిస్తున్నారు.

ఒకరిపైనొకరు పెనవేసికొనిన కుసుమముల వలె భుజములు పరస్పరము చుట్టుకొని భ్రమరములవలె నున్న అ రావణుని స్త్రీల వనము మాఘమాసములో వాయుసంచారముచే పుష్పించిన భ్రమరములతో నిండిన, లతావనములో కలిసిన తీగలవలెనున్న వనమును తోపింపచేయుచున్నది. అప్పుడు ఆ వరాంగనల ఆభరణములు అంగములు వస్త్రములు వివేకముకలవాడు కూడా ఎవరివో ఏవో చెప్పడానికి శక్యము కాదు. రావణుడు సుఖముగా నిద్రిస్తూ ఉన్నప్పుడు జ్వలిస్తున్న ఆదీపములు తదేకముగా ఆ స్త్రీలను చూస్తున్నవా అన్నట్లు ఉన్నవి.

రాజర్షుల స్త్రీలు, పితరుల అతివలు, దైత్యాంగనలు, గంధర్వ కాంతలు, రాక్షస కన్యలు అతని పై కామము చే వశులై ఉన్నారు. ఆ స్త్రీలు యుద్దములో జయించి తీసుకు రాబడిన వారు, కొందరు మదనోన్మత్తముచే ప్రేరేపింపబడినవారు ఉన్నారు.

అత్యుత్తమురాలైన సీత తప్ప ఆ స్త్రీ సమూహములో తన పరాక్రమముచే బలాత్కారముగా తీసుకువచ్చినవారు ఎవరూ లేరు, ఇతరులపై కామము ఉన్నవారు ఎవరూ లేరు, పూర్వమే ఇంకొకరి ప్రియురాలిగా ఉన్నవారు ఎవరూ లేరు.

అతని భార్యలలో అకులీనులు లేరు. రూపము లేని వారు లేరు. యోగ్యతలేని వారు లేరు. ఉపచారము చేయతగని వారు లేరు. బుద్ధిహీనులు లేరు. ఆకాంతలలో ఎవరూ కామించతగని వారు లేరు.

'ఈ రాక్షస భార్యలలాగా రాఘవపత్ని కూడా ఇలాగే ఉంటే ఇతని జన్మ శోభనమై యుండును', అని ఆ వానరోత్తముని మదిలో ఆలోచన వచ్చెను.

హనుమంతుడు మళ్ళీ దుఃఖిస్తూ ఇలా అనుకొన్నాడు." సీతాదేవి నిస్సంశయముగా సద్గుణ సంపన్నురాలు. అయినప్పటికీ లంకాధిపతి అయిన రావణుడు ఆమె విషయములో హీనముగా వ్యవహిరించెను.ఎంత కష్టము"

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో తొమ్మిదవ సర్గ సమాప్తము.

తత్త్వ దీపిక:

హనుమ రావణభనములో రావణుని భార్యలను చూచి "వారిలో ఏ ఒకత్తెను అమె కి ఇష్టము లేనిదే బలాత్కరించి ఆమెను పొందలేదు,పరాక్రమముచే కాక కేవలము గుణములచేతనే పొందెను. ఇంతకుముందు ఒకరిని ప్రేమించి తప్పక వచ్చినది గాని, ఇచటవుండి వేరోకరిపై ఆసక్తి ఉన్నది గాని, కులవతి కానిది, మర్యాద లేనిది, దాక్షిణ్యములేనిదిగాని,విహీనస్వభావము లేనిది, కామింపతగనిది లేదు" అని అనుకొనెను. ఇది అంతా అతిశయమైన ఇశ్వర్య దర్శనము అయి విస్మయము లో నున్న హనుమంతుని భావము ( ఇది గోవిందరాజవిరచిత శృంగార తిలక అనబడు సుందరకాండ వ్యాఖ్యానలో కుడా వుంది)

ఈవిధముగా రావణునిపై సాదుబుద్ధితో ఆలోచించిన హనుమంతుని సాదుబుద్ధికి " శ్రీరాముని ధర్మపత్ని కూడా ఈ రాక్షసరాజు భార్యలెటుల ఉండిరో అట్లున్నచో ఈతని జన్మ శోభనమై యుండును" అని తోచెను.

ఈ ఊహలో మూడురకముల భావము వచ్చుటకు వీలు ఉన్నది.

(౧) "స్వయంవరమునకు ముందే రాముని పొందకుండా ఈ రావణునే పొందియున్నచో ఈ రాక్షసరాజుల భార్యలానే ఈమె కూడా రావణునితో రమించై అతని జన్మ "సుజాతమ్" అయ్యేది" అని. హనుమను సాదుబుద్ధి అనబడ్డాదు కాబట్టి ఈ భావము హనుమకి కలిగి యుండదు

(౨) "ఈ రాక్షస రాజు భార్యలు తమ భర్తతో ఎట్లు అనందముగా పరుండి యున్నారో అట్లు మా రాముని భార్యకూడా మా రామునితీ పరుండి యున్నచో ఈ రావణుని జన్మ "సుజాతమ్" అయ్యేది " అని హనుమకు తోచెను.

(౩) మూడో భావము - "మా రాఘవపత్ని వీనిచే అపహరింపబడి ఈ విధముగా నెట్లున్నదోఅట్లు వీని భార్యలు మరియొకని చే అపహరింపబడి యున్నచో వీని జన్మకు తగిన పని ( సుజాతమ్) "

ఈ విధముగా హనుమ తలచిన తలపులో దోషము లేకున్ననూ దోషము స్ఫురించు టకు అవకాశమున్నది. రావణుడు తన స్త్రీలతో ఎలా కలిసి ఉన్నాడో ,రాముడు కూడా సీతతో కలిసినచో వీని ఇశ్వర్యము విచ్ఛిన్నమై వీని జన్మ ధన్యమై యుండును గదా అని హనుమ భావించెను.

కాని వాక్య నిర్మాణమున అశ్లీలమగు అర్థము కూడా స్ఫురించుటకు అవకాశమున్నది అని హనుమకు వెంటనే స్ఫురించెను. అప్పుడు
'పునశ్చ సో sచింతయదార్తరూపః
ధృవం విశిష్టాగుణతో హి సీతా '
అని బాధపడి " ఈ రాక్షస్త్రీలతో పోలిక చెప్పుటకు కూడా సీత తగదు. వీరికంటె గుణములలో పాతువ్రత్య ధర్మములో సీత ప్రత్యేకత గలది" అని అనుకొనెను.
" ఈ లంకేశ్వరుడు మహతపశ్శాలియై యుండియు యుక్తానుక్తము ఆలోచించక అనార్యులు చేయవలసిన క్రూరమైన పని ఈ మహాపతివ్రత విషయమున చేసెను! అహా ! ఏమి ఇద్ !" అని బాధపడెను.

భవద్గీతలో ఒకచోట
"మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధయే
యతతామపి సిద్ధానాం కశ్చిన్మా వేత్తి తత్త్వతః"
వేలకొలది మనుష్యులలో ఒక్కడు సిద్ధికి యత్నించును. యత్నించినవారిలో కొందరే సాగుదురు.అట్లు సాగ్న వారిలో ఏఒక్కడో భగవత్ స్వరూపము నెరుంగ జాలును.

అట్లే లంకలో రావణునిచే బంఢింపబడిన కొన్ని వేలమందిలో ఒక్కరికికూడా వానినివదలి వేరొకనిని పొందవలెనను కోరిక కలుగలేదు. వేరొకడు పొందదగిన వాడు ( పరమాత్మ) ఉన్నాడని భావనయే లేక హాయిగా ఉన్నారు.

ఓక్క సీతామ్మ మాత్రమే రావణుమి ఇశ్వర్యమును ధనమును కాదని శ్రీరామచంద్రుని కోరుకొనును.

ముముక్షువు ( మోక్షమందు కోరిక గలవాడు) అగుత ఎంత దుర్లభమో దీనిచే తెలియబడుచున్నది. ఈ సర్గలో ముముక్షువు కు గల అడ్డంకులు అన్నీ విశదీకరముగా వర్ణింపబడినవి.

||ఓమ్ తత్ సత్||