సుబ్బలక్ష్మిగారి కలం నుంచి


సుబ్బలక్ష్మి మా అమ్మమ్మ పేరు

మాకు గుర్తున్నవఱకు ఆవిడ చాలాభాగం ఎప్పుడు ఎదో పుస్తకము తన చేతిలో వుంచుకొనేది. లేకపొతే ఆవిడ వడిలో రాసుకోడం కోసము వత్తుగా వుండే చిన్న చెక్క తో చేసిన పేడ్ మీద పుస్తకముతో ఇంకా చేతిలో కలంతో కనపడేది.

ఆవిడకు తోడు సీతారవణమ్మగారు.

ఆవిడ ఎప్పుడూ తెల్లని చీరతో చిరునవ్వుతో కనిపిస్తుంది . తలుచుకుంటే ఇప్పుడు కూడా ఆవిడ చిరునవ్వు గుర్తుకు వస్తుంది. ఇంకా పైన మాటలో తీపితో కలిసిన అత్మీయత. అన్నిటికీమించి ఆవిడ అసలు సిసలైన వేదాంతి. ఆవిడ చెప్పే విషయాలు గురించి అమ్మచెప్పేది , ఆవిడ గురించి అమ్మద్వారా విన్నవిషయాలు అన్నీ కలిపితే ఆవిడ ఎంత జ్ఞానియో అనిపిస్తుంది !!

సీతారవణమ్మగారి ఇల్లు ఒక ఆశ్రమములాగా వుండేది. ఒక మామిడి చెట్టు. రెండు సపోటా చెట్లు. ఓక జామ చెట్టు. నాలుగో అయిదో కొబ్బరి చెట్లు. అలాగే ఇంకొన్ని తాటి చెట్లు. ఆశ్రమంలాంటి ఆ ఇంటి ముందు తులసీ మొక్క . ఇంకా ఒక పక్కగా ఒక చిన్న బావీ. ఆ బావి పక్కన నీళ్ళు తీసుకోవడం కోసం ఒక తాడుతో కట్టిన చిన్న బక్కెట్టు !! ఆ ఇంటికి ఒక పక్క శివాలయము . ఆ శివాలయములోనే రామాలయము కూడా. రెండో పక్కన మా అమ్మమ్మ గారి ఇల్లు. శివాలయముకోసం సీతారవణమ్మగరి ఇంట్లో నించే దగ్గఱ దారి . ఆమ్మమ్మగారింట్లోంచి బయట పడితే సీతారవణమ్మగారి ఇల్లు దాట కుండా వెళ్ళలేము . ఆవిడ ఇచ్చే సపోటా కోసం తప్పకుండా ఆ ఇంట్లోంచే శివాలయముకి వెళ్ళేవాళ్ళము.

ఇప్పుడు కళ్ళుమూసుకొంటే ఇవన్ని ఒక చిత్రపటము లాగా కనిపిస్తాయి.

ఈ ప్రయత్నం ఆ చిత్రపటం లోనించి వచ్చే విషయాలను అంటే అమ్మ చెప్పిన మాటలను గురించి రాద్దామని !!
.
ఇది మాస పత్రికలా తీసుకురావాలని మా చిన్న ప్రయత్నము

ఇవన్నీ " సుబ్బలక్ష్మి గారి కలంలోనించి "

సుబ్బలక్ష్మిగారి కలంలోంచి వచ్చినవి అన్నీ ఒక లిస్టు లాగా లింకు తో సహా ఈ పేజీ లోనే ఎడమ పక్క భాగములో అందిస్తున్నాము. ఇదే పేజిలో కుడి పక్కన ఇంకో మాట రూపం లో ప్రస్తుత కధనాన్ని అందిసున్నాము

ఇవన్నీ మాకు ఆనందము కలగచేశాయి.

మీకు కూడా ఆనందం కలిగిస్తాయి అన్న భావనతో ..!!

||ఓమ్ తత్ సత్ ||


.