సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

శ్రీవిద్యా గద్యము ( తెలుగు అనువాదము)
లలితాంబికా పరదేవతా స్తుతి

 

సచ్చిదానంద స్వరూపిణీ శరణు శరణు
సన్నితాశ్రితనికురంబ శరణు శరణు
శంకరార్ధాంగి భయనాశీ శరణు శరణు
శరణు త్రిపురాంతకేశ్వరీ శరణు శరణు

 

కనకగిరియందలి ఎత్తగు ప్రదేశమందుండు జగన్మాతా
అమృతోపమ సాగరముతో నలరారుచున్న రత్నద్వీపనివాశినీ
పంచలోహములు రత్నములచే నిర్మించబడి నటువంటి ఇరువదిఇదుప్రాకారములందు ఆరు నానా ఫలవృక్ష ఉద్యానములు గలదానా
వేలకొలదీ నవరత్న ఖచిత మండపాదులతో నలరారుదానా
అమృతమయమగు మూడుకూపములతో నలరారుదానా
బాలతపస్వీనీ
చంద్రవదనా
మహాపద్మమయమై చింతామణులతో నిర్మించబడిన రాజభవనమందు శోభిల్లుమాతా
శ్రీపురనివాసినీ
భూమియందలి బంగారు కాంతిచే ప్రకాశించు కాంచీపురనివాశినీ
ఆయా చాతుర్వర్ణములవారిచే కర్మ విధిని నుతింపబడుదానా
విధి ననుసరించి చేయు యజ్ఞములద్వారా పవిత్రతనందినదానా
మహిమాన్వితరూపిణీ
హయగ్రీవరూపమున శ్రీ విష్ణుమూర్తిచే అగస్త్యమునికి ఉపదేశింపబడిన లలితాచరిత రూపమున సంతుష్టాంతరంగివై శోభిల్లుమాతా
కంపానదీతీరమందు ఓక మామిడిచెట్టుమూలప్రదేశమందుపవిష్టవై తపమొనరించిన కామాక్షిరూపిణీ
ఏకామ్రనాధుని మనోనాయికగా శోభిల్లుదానా
నిర్గుణత్వముతో నిశ్చలముగా దూర్వాస మహర్షిచే ఆరాధింపబడిన మాతా
అభీష్ట సిద్ధినొసగు శ్రీచక్రమేరుపురనివాశినీ
గౌడపాదాది ఆచార్యవర్యులచే పోషింపబడిన అద్వైత సిద్ధాంత రూపిణీ
ముముక్షుజన ఆశ్రదాయినీ
ఆత్మజ్ఞానరూపిణీ
ద్వైతసిద్ధాంత సింహరూపీ
శ్రీశంకర భగవత్పాదులచే ప్రతిష్ఠింపబడిన కాంచీపుర శ్రీచక్ర నివాశినీ
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

పృథ్వీబీజ నివాసినీ
భూమిరూపిణీ
మూడుపురములందు వశించు శ్రీచక్ర రూపిణీ
యోగినీరూపిణీ
అణిమాది పదిసిద్దులను బ్రాహ్మీ మున్నగు ఎనిమిది శక్తులనూ సర్వసంక్షోబిణి మున్నగు పదిముద్రలు మొదలుగాగల
అణిమాసిద్ధి సంక్షోబిణిముద్రలతో విరాజిల్లుమాతా
ముల్లోకములను మోహింపజేయు శ్రీచక్ర నివాసినీ
జాగ్రదావస్థకు సాక్షీభూతురాలగు మాతా
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

శివబీజాంశీ భూతా మాతా
అష్టపద్మదళమందలి త్రిపురసుందరీరూప శ్రీచక్రనివాసినీ
అనంగకుసుమాది ఎనిమిదిమంది గుప్త యోగినులచే సేవింపబడుదానా
మహిమాసిద్ధితోగూడి సర్వులనాకర్షించు సర్వాకర్షిణీ
ముద్రతో శోభిల్లుమాతా
సర్వసంక్షోబిణ శ్రీచక్రనివాసినీ
సుషుప్తికి సాక్షీభూతురాలా మాతా !
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము.

 

కామకళాబీజ రూపిణీ మాతా
పదునాలుగు భువనములందలి మూడుపురములందు నివసించు శ్రీచక్రరూపిణీ
సంప్రదాయయోగినీ రూపిణీ
సర్వసంక్షోబిణీ మున్నగు పదునాలుగు దేవతలచే పరివేష్ఠింపబడిన ఈశిత్వ సిద్ధరూపిణీ
సర్వులనూ వశముచేసుకొను శక్తిగల సర్వ వశంకరీ ముద్రతో విరాజిల్లుమాతా
సర్వసౌభాగ్యములను ప్రసాదించు చక్రవాసినీ
మంగళప్రదాయినీ !
బ్రహ్మజ్ఞాన చైతన్యమూర్తీ
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

విష్ణుబీజ రూపిణీ మాతా
బహిఃద్వారవాసినీ
త్రిపురా చక్రనిలయా
కులోత్తీర్ణ యోగ మాతా
స్రర్వసిద్దులనిచ్చు సర్వ సిద్ధిప్రదాదీ
పదిమంది దేవతలతో కూడినదానా
వశిత్వసిద్ది రూపిణీ
అందరినీ పిచ్చివాళ్ళను చేయు సర్వోన్మాదినీ!
విద్యాదేవతా
భక్తులకభీష్ఠములనిచ్చు సర్వార్థసాథకమగు శ్రీచక్ర నివాసినీ
గురూపదేశముద్వారా సిద్ధించు చైతన్య రూపీ ! మాతా !
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

అగ్నిబీజరూపధారిణీమాతా
ప్రకృతి స్వరూపిణీ మాతా
త్రిపురమాలినీ చక్రరూపిణీ
నిగర్భయోగినీ దేవతా
కోరినకోరికలనిచ్చుప్రాకామ్య సిద్ధి స్వరూపిణీ
మహాంకుశముద్రధారిణీ సమస్తభక్తరక్షకమగు శ్రీచక్రనివాసినీ
శ్రవణేంద్రియరూపిణీ
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

కామేశ్వరబీజనివాసినీ మాతా
అష్ఠకోణాంతరమందున్న త్రిపురాసిద్ధి చక్రవాసినీ
రహస్యయోగినీమాతా
పశిన్యాది ఎనిమిదిమంది దేవతలచే పరివేష్ఠింపబడినదానా
భుక్తినిచ్చు భుక్తిసిద్ధి స్వరూపిణీ
సర్వఖేచరీ ముద్రతో శోభిల్లుదానా
సమస్తరోగ వినాశకారియగు శ్రీచక్రనివాసినీ
మననవృత్తి చైతన్యరూపిణీ
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

 

సృష్ఠి స్థితి లయములను త్రిశక్తి బీజరూపిణీమాతా
త్రిపురాంబా శ్రీచక్రనివాసినీ
అతిరహస్యయోగినీ
బాణాదులగు నాలుగు విధాయుధములను ధరించినదానా మహాకామేశ్వరీ !
మహాత్రిపురసుందరీ మున్నగు నలుగురు దేవతల ఇచ్చాసిద్దిరూపిణీ
సమస్తబీజములందు వసించుమాతా
సర్వసిద్దులనిచ్చు శ్రీచక్రనివాసినీ
సవికల్ప సమాధి చైతన్యరూపీ జగన్మాతా
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

సమస్త కోరికలనూ సిద్ధింపజేయు సర్వకామసిద్ధిరూపిణీ మాతా
సర్వత్రిఖండముద్రిణీ
నానాచక్రములకధీశ్వరియగు మాతా
తురీయ విద్యా రూపిణీ
నిర్వికల్ప సమాధిస్ఠితా
సహజరూపిణీ మాతా
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

 

నీ అంశముచే ఆవిర్భవించిన హృదయాది షడంగ దేవతలచే నుపాశింపబడుదేవీ
కాలస్వరూపీ
కామేశ్వర్యాదిపదునైదు నిత్యతిధులచే సేవింపబడెడి మహనిత్యా దేవతా
శ్రీచక్రబిందునివాసినీ
శ్రీవిద్యానందనాధాధుల ఆత్మ రూపిణీ
తూర్పు కుడిరేఖలుగల త్రికోణమునందు వశించుమాతా
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

 

ప్రకాశానందాది తొమ్మిది దినాధిపతులచే సేవింపబడు తల్లీ
త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగములందు వశించు ఆయా ఈ యుగ రూపిణీ
ఉడ్డీశ షష్ఠిశాది దేవతలచే పరివేష్ఠింపబడి సేవింపబడూ జగన్మాతా
మునులచేతనూ నాగుల చేతనూ మానవులచేతనూ దివ్య సిద్ధులచేతనూ సేవింపబడు జననీ
వంశపారంపర్య గురుత్రయమండలము చే నారాధింపబడు జగన్మాతా
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

 

పృధ్వీ మొదలు శివునివరకూగల ముప్పది సోపానములుగల సింహాసనమందాసీనురాలైన మాతా
పంచబ్రహ్మలు ఆధారముగా గల మంచయందు వశించెడిదానా
నిరవధికమగు బ్రహ్మ్తత్వరూపీ
మహాకామేశ్వరుని ప్రాణనాయినా
శివపత్నీ
సవికల్ప సమాధియందలి ఇదు భూమికలరూపిణీ
సృష్ఠి స్ఠితి లయకారిణీ
ఇరువది ఇదు అధిష్థాన దేవతల రూపమున విరాజిల్లు మహాప్రకాశ శాలినీ
షడామ్నాయ దేవతారూపిణీ
మహావిమర్శ రూపిణీ
బ్రహ్మాండమే గాత్ర నాదములుగాగలదానా
జీవకోటిచే గానముచేయబదుదానా
బ్రహ్మాండ మందలి కందుకీ భూతాదులను దునుమాడు వజ్రాయుధము వంటి మాతా
స్వేఛ్ఛావిహారిణీ సృష్ఠియందలి సమస్త జీవకోటి కాధారభూతురాలా
అహంకారులను శిక్షించుమాతా
బుద్ధిరూపిణులగు మంత్రిణులచే సేవింపబడుదానా
అవిద్యయు మలత్రయములతోగూడిన , శరీరమునుండి వెలువడు దూర్వాసనల నాశనకారీ
భండాద్యసుర సంహారిణీ
స్వాంగశృష్ఠ సద్వాసనలచేతను కదంబము చేతనూ సేవింపబడు మాతా
భక్తులచే సేవింపబడెడి స్వేచ్చావిహారిణి
దివ్యసుందరరూపిణీ
అరువది నాలుగు ఉపచారములచే సేవింపబడుదానా
నవావరుణ పూజా సంతుష్థకారిణీ
చిదానందరస పరిపూర్ణా
అనంతానంద రూపిణీ
సామరస్య పరిపూర్ణా పరబ్రహ్మ రూపిణీ
అనంత అమృతదాయిని
సర్వమంత్రాధిష్ఠాత్రి
సమస్త తంత్రాధిష్ఠాన దేవీ
సర్వ యంత్ర రూపిణీ
సర్వపీఠములకధినేత్రి
సర్వ యోగములకధిపతి
సమస్త వాగ్రూపిణీ
సమస్త సిద్ధుల కధిధాత్రి
సమస్త వీరమాతా
సమస్త జీవకోటికి మాత్రు దేవతా
శ్రీచక్ర రూపిణి
అసనము ఆయుధముల పరివారము పరా పర రూపములచే కూడినదానా
ఉపచారముల నందు మాతా
పూజాతర్పణ సంతుష్టా
శ్రీకామకళా స్వరూపిణీ
పరాశక్తి
కామాక్షి దేవతా మాతా
నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము

 

 

శ్రీ లలితా త్రిపురసుందరీ దేవతార్పణమస్తు
శ్రీవిద్యా గద్యము ( తెలుగు అనువాదము)
లలితాంబికా పరదేవతా స్తుతి
సమాప్తము

వరలక్ష్మి వ్రత సందర్భంగా ఇది సమర్పిస్తున్నాము !!

( ఇది కూడా అమ్మ రాసుకున్న notes లోనుంచే ! 14-9-1986 దండకారణ్యంలో రాసి ఇచ్చినది అన్నమాట.
దీని మూల గ్రంధము మాకు తెలియదు. కాని వారికి మా కృతజ్ఞతలు)