సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

శాంతి మంత్రం !

శాంతి మంత్రం !

శాంతి మంత్రాలు అని వింటాము అవి ఏమిటి అనే ప్రశ్న వస్తోవుంటుంది
వేదాలలో , వేదాలలోని ఉపనిషత్తులలో ఈ శాంతి మంత్రాలు వస్తోవుంటాయి.
కథోపనిషద్ ఒక శాంతి మంత్రముతో ప్రారంభమవుతుంది.
అది గురువు శిష్యులు కలిసి చదివే శ్లోకము .
ఆ శ్లోకము ఇది :

ఓమ్ సహనవవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై |
ఓమ్ శాంతిః శాంతిః శాంతిః |

మన ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక
మన ఇద్దరినీ భగవంతుడు పోషించుగాక
మన ఇద్దరము శక్తితో పరశ్రమిద్దాముగాక
మన స్వాధ్యాయము మనకు తేజోవంతమగుగాక
మనము ఇద్దరము ద్వేషము లేకుండా ఉండెదము గాక|

ఏ పనిచేస్తున్నప్పటికీ అందుకు అనుకూలమైన మానసిక స్థితి ఉండడం అవసరము. ఏ పనిచేస్తున్నామో అందుకు తగిన మానస స్థితిని పెంపొందించుకొని ఆ తరువాతనే ఆ పనికి ఉపక్రమించడంవలన చక్కని ఫలితాన్ని పొందవచ్చు

ఇందులో గురు శిష్యులు విద్య విజయవంతము కావడము కోసము ప్రార్థనచేస్తారు. గురువు అన్నీ ఇద్దరికొరకు అని చెప్పి ప్రార్థనచేయిస్తాడు. దీనిలో స్వార్థము లేకుండా ఇద్దరికొరకు ప్రార్థన చేయడములోనే గురువు చెప్పే ప్రథమ పాఠము !
వేదమంత్రాలు చివరన ఓమ్ శాంతిః అని మూడు సార్లు చెపుతారు.
మూడు సార్లు చెఫ్ఫడములో విశేషము మూడురకముల ఆటంకములనుంచి బయటపడాలని.

ఆ మూడురకముల ఆటంకములు ఏమిటంటే

అధ్యాత్మికం - అంటే మనవలన వాటిల్లే ఆటంకాలు శారీరిక మానసిక రుగ్మతలు
ఆది భౌతిక - అంటే ఇతర జీవరాసులవలన వాటిల్లే ఆటంకాలు
ఆది దైవికం - ప్రకృతివలన కలిగే ఆటంకాలు

ఫ్రార్థన ఈ మూడురకముల ఆటంకాలనుంచి బయట పడాలని !

ఇంకో సంగతి ; ప్రార్థనలో " మనమిద్దరము ద్వేషములేకుండా ఉండుదము గాక" అంటాము.
ఇది కలిసి పనిచేసేవిషయాలలో చాలాముఖ్యము .
అధ్యయనము కూడా ఒక కార్యము. ఈ కార్యములో ద్వేషము కూడా చేర్చితే జరిగే పని శూన్యమని ఇది చెపుతోంది.
ఆధ్యయనంలో ద్వేషపూరిత వాదవివాదములతో కాలము దురుపయోగమౌతుంది
పని చేసేకార్యములో కూడా ద్వేషముతో కూడిన వాదవివాదములతో కాలము దురుపయోగమౌతుంది.
గురువు చెపుతున్నది ద్వేషములేకుండా ఉండాలని !!

ఒమ్ తత్ సత్
ఓమ్ శాంతిః శాంతిః శాంతిః !