సుబ్బలక్ష్మిగారి కలం నుంచి
దసరా శుభాకాంక్షలతో
*
యజ్ఞము - తపస్సు - త్యాగము
సామాన్యముగా యజ్ఞమనే మాటవినగానే ఇది ఆందరికి సాధ్యమయినది కాదని, ఇది చాలా తతంగముతో కూడినదని , అంతేగాక ఇది వ్యయముతోకూడి ధనవంతులమాత్రమే చేయగల వ్యవహారమని అని అందరూ అనుకుంటారు. ఆలాంటి పేరుగల యజ్ఞమును శ్రీ కృష్ణ భగవానుడు నిజమైన అర్థమును వివరించి జనుల అపొహలను పోగొట్టెను .
నిష్కామ కర్మయే ఆ యజ్ఞము.
నిష్కామ కర్మ అనబడు యజ్ఞము శ్రమలేనిది, డబ్బు ఖర్చు లేనిది ఏంతో సులభమైనది . ...! అహంకారబుద్ధి అనగా నేనే చే యుచున్నానను అనబడు బుద్ధి వదిలి చేయబడు ప్రతీ పనీ ఒక యజ్ఞమే అగును.
అలాగే దైవస్మృతితో చేయబడు ప్రతీ పని ఒక యజ్ఞమే అగును !!
అదేవిధముగా శ్రీకృష్ణ భగవానుడు త్యాగము , సన్యాసము అనే పదములకు గూడా అర్ధము విస్తరించి సులభతరము చేసెను . త్యాగమనగా అంతయు వదలివేయు టయు, సన్యాసమనగా ఇల్లు వాకిలి భార్యా పుత్రులు ఆస్తిపాస్తులు అన్నీ వదలి అరణ్యములకు పొవుట అని తలంచు చుండిరి. కానీ ఈరెండు పదములకు శ్రీకృష్ణ భగవానుడు నూతనార్ధములను సృష్టించెను :
త్యాగము అంటే
శ్లో|| సర్వకర్మఫలత్యాగమ్ ప్రాహుత్యాగం విచ క్షణాః
- "ఫలము నాశ్రయించక పనులు చేయుటయే త్యాగము" అని
సన్యాసము అంటే
స్లొ|| " కామ్యానాం కర్మణాంన్యాసం సన్యాసం కవయోః విదుః"
- "మనము చేయు పనులు అహంభావముతో నేనే చేస్తున్నాను
అని ఆలోచన వదలు ట యే సన్యాసము అందురు "
యజ్ఞము :
యజ్ఞము గురించి భగవానుడు జ్ఞానయోగములో చెప్పిన మాట :
శ్లో || గతసజ్గస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః|
యజ్ఞాయాచరతః కర్మసమగ్రం ప్రవిలీయతే ||
దేనియందు అనగా ఫలమునందు ఆశక్తి లేనివాడు , అనురాగమూ ద్వేషము కోరిక కోపమూ మొదలయిన వానిని లక్ష్యపెట్టని వాడును , తన మనస్సునందే అనగా తన ఆత్మ యందే నిలకడ కలవాడును, భగవంతుని ప్రీతి కొరకు ధర్మము కొరకు ఇతరుల శ్రేయస్సు కొరకు పనులు చేయు వాని యొక్క కర్మలు సత్కర్మలగును.
ఇట్టి కర్మలు అనగా పనులు మనము భగవంతుని గురించి జ్ఞానము పొంద డానికి కారణమగును.
యజ్ఞమనగా భగవంతుని ప్రీతి కొరకు అందరి శ్రేయస్సు కొరకు చెయు పనులు అని అర్థము.
యజ్ఞములు పన్రెండు రకములు .
ఇది జ్ఞానయోగములో చెప్పినమాట
దైవమేపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే |
బ్రహ్మాగ్నా వపరే యజ్ఞం యజ్ఞేనై వోపజుహ్వతి ||
దైవయజ్ఞము అనగా దేవతారాధన దేవతాధ్యానము చేయుచు భక్తి భావముగా ఉండుట. అది దైవ యజ్ఞము
బ్రహ్మయజ్ఞము. కొందరు మనలో నుండే ఆత్మయే బ్రహ్మమని ఆత్మ విచారణ చేయుచు నుందురు. ఇదియే బ్రహ్మ యజ్ఞము
ఇంద్రియ నిగ్రహము ____ చెవి కన్ను మొదలగు ఇంద్రియములను ఇతర బాహ్య విషయముల మీదకు పోనీయక వాటి ద్వారా కలుగు దోషములను గ్రహించి వాటి పై ప్రీతిని వదలివేయుట
శబ్దాది విషయ త్యాగము __అనగా ఇంద్రియములు అనేక విషయముల కోరికల వెంట పరుగిడు చుండును ఇంద్రియములు ఎప్పుడు నిలకడగా నుండునో అప్పుడు మనస్సు నిలకడగా నుండును. అదియే శబ్దాది విషయ త్యాగము. మనస్సు నిలకడగా నున్నప్పు డు శాశ్వతమగు ఆత్మ ప్రకాశించును అదియే మోక్షము
ద్రవ్య యజ్ఞము ; జ్ఞానయోగము లోనే ద్రవ్య యజ్ఞము గురించి చెప్పబడినది
స్లొ || ద్రవ్యయజ్ఞా స్తపో యజ్ఞా స్తధాపరే
స్వాధ్యాయ జ్ఞాన యాజ్ఞాశ్చ యతయః సంశిత వ్రతాః
ద్రవ్యయజ్ఞము ధనమును వస్తువులను సత్పాత్రులకు దానము చేయుట
తపోయజ్ఞము వ్రత ఉపవాసాదులచే దేహమును తపింపచేసి స్వాధీనపరచుట. ఇది కూడా యజ్ఞమే యగును
యోగయజ్ఞము : యమ నియమ ఆది అస్టాంగయోగము తో మనస్సును నిగ్రహించుటయే యోగ యజ్ఞము.
స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము : శాస్త్రములను చదువుట అందలి అర్ధమును బాగుగా అనుష్టించుట స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అందురు.
ఆహార నియమ యజ్ఞము మితముగను న్యాయార్జితము గను భగదర్పితముగను సాత్వికముగను నియమిత కాలసేవితముగను అహారము ను భుజించవలెను ఇది ఆహారనియమ యజ్ఞము . అహారము యొక్క సూక్ష్మాంశ చే మనస్సు ఏర్పడుచున్నది
జ్ఞానయజ్ఞము _ అత్మ విచారణ చేయుట
ప్రాణాయామ యజ్ఞము _ ప్రాణాయామము చేయుట
ఈ విధముగా అనేక యజ్ఞములను భగవానుడు చెప్పి, ఈ అన్నియజ్ఞములు గాని ఏ ఒక్కటి గాని వారి వారి కొరిక ననుసరించి చెయవఛ్చునని చెప్పేను..
యజ్ఞమువలన పాపము నశించును
క్షపిత కల్మషాః __ అనేక జన్మలనుండియు మనస్సుకి పట్టిన కల్మషములు పాపములు తొలగి పోవును. యజ్ఞమనబడు పుణ్యాచరణము వలననే పాపము నశించి మనస్సు నిష్కల్మషముగనుండును. చిత్తమున ఆత్మ ప్రకాశించి మోక్షమును పొందవచ్చును .
అల్పవిషయ సుఖ త్యాగము చేయవలెను ప్రతి జీవి అఖరి లక్ష్యము మరచిపోయిన తన నిజ స్వరూపము తిరిగి జ్ఞాపకము పెట్టుకొనుటయే యగును
జ్ఞానము ఆకస్మికముగా లభించు వస్తువు కాదు నిరంతర దైవ చింతనచే భగవదారాధనచే భగవానుడు కరుణించి జీవునకు జ్ఞానమును అనగా బుద్ధియోగమును ప్రసాదించును. దానిచే అతడు ముక్తి పొందును
ఈ ప్రకారము భగవద్గీత యజ్ఞాది నూతనపదములకు నూతనార్ధము సృజించి జనుల కు సులభతర సాధనలు చూపించి వేదాంతమును చూసి భయపడి పారిపోయిన జనులను తిరిగి రాబట్టు కొని ఆధ్యాత్మిక క్షేత్రమును భక్తి బృందములచే కళకళ లాడునట్లు కావించెను.
గీత చేసిన ఇట్టి మేలు మరువరానిది !!
ఒమ్ తత్ సత్
info@kasarabada.org
|