భగవద్గీత !!
ప్రథమాధ్యాయము !
శ్లోకాలు - అర్థతాత్పర్యాలతో
|| ఓమ్ తత్ సత్ ||
ధృతరాష్ట్ర ఉవాచ:
"ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవశ్చైవ కిమకుర్వతు సంజయా |"
"ఓ సంజయా! ధర్మభూమి అయిన కురుక్షేత్రములో యుద్ధము చేయదలచినవారై కూడినట్టి నా వారు పాండవులు ఏమి చేసిరి ?"
భగవద్గీత -
ఆర్జున విషాద యోగము
ప్రథమాధ్యాయము
శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః
భగవద్గీత ప్రారంభము కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుని ప్రశ్నతో మొదలు అవుతుంది. యుద్ధమునకై కౌరవపాండవ సైన్యములు ఇరువైపుల కురుక్షేత్రములో సంసిద్ధమై యున్నసమయములో ధృతరాష్ట్రునకు యుద్ధరంగమున ఏమి జరుగుచున్నదీ తెలుపుటకు గాను సంజయుడు ధృతరాష్ట్రుని వద్ద ఉండెను. ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు.
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః|
మామకాః పాండవశ్చైవ కిమకుర్వతు సంజయా ||1||
" ఓ సంజయా ! నా వారు, పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్దమునకు సమావేశమై ఏమి చేసిరి?" అని .
ఈ ప్రశ్న తరువాత "సంజయ ఉవాచ" అంటూ భగవద్గీత అంటే కృష్ణార్జున సంవాదము అంతా సంజయుని ద్వారా వింటాము.
ఈ ప్రశ్న ఎలా ఎందుకు వచ్చిందో విందాము.
భగవద్గీత మహాభారతములో భీష్మ పర్వములో అంతర్భాగము. ఈ ప్రశ్న భీష్మ పర్వములో 25 వ అధ్యాయములో మొదటి శ్లోకములా వస్తుంది.
భీష్మ పర్వములో మొదటి అధ్యాయములో మహాభారత యుద్ధము మొదలవుతుంది. రెండు పక్షముల వారు తయారుగా వుండి, యుద్ధములో పాటించవలసిన మర్యాదలు ,పరామర్శ చేసుకొని తయారు అయిన సమయము అది.
అప్పుడు వ్యాసభగవానుడు వస్తాడు.
వచ్చి ధృతరాష్ట్రుడికి యుద్ధమువలన వచ్చే అనర్థాలు చెపుతూ.సమస్యలను సాధించుకొనే మార్గములు గురించి ఈ విధముగా చెపుతాడు. రెండు కూటాల మధ్య ఏ సమస్య అయినా సాధించుకునే మార్గాలు మూడు. మొదటిది ఉత్తమమైన మార్గము పరస్పర భాషణలతో సాధించుకునే అంగీకారము. రెండవది సామదాన బేధ ఉపాయాలతో మతభేదాలు కలిగించి సాధించుకునే అంగీకారము. అది అశాశ్వతము. నిజానిజాలు తేలిన తరువాత ఆ అంగీకారము కూలిపోతుంది. మూడవ మార్గము యుద్ధము. ఇది అన్ని మార్గాలలో అధమమైన మార్గము. దీనివలన అందరికి నష్టమే.
అందువలన వ్యాసభగవానుడు యుద్ధము మంచిది కాదు అని చెపితే, ధృతరాష్ట్రుడు తన సంతానము తన మాట వినదని తను చేయగలిగినది ఏమీ లేదని చెపుతాడు. వ్యాసభగవానుడు అప్పుడు జరగబోవు యుద్ధము చూడడానికి. ధృతరాష్టృనికి దివ్య దృష్టి ఇస్తాడు, ధృతరాష్ట్రుడు తనకి ఆ దివ్యదృష్టి అక్కరలేదని వివరిస్తాడు. అప్పుడు వ్యాసుడు సంజయునకు ఆ దివ్యదృష్టి ఇస్తాడు.ఆ దృష్టి తో సంజయుడు ఎక్కడ ఏమి అవుతున్నా చూడగలుగుతాడు. ఇంకాపైగా ఆ యోద్ధుల మనస్సులో జరిగే అలోచనలు కూడా గ్రహించకలుగుతాడు. వ్యాసుడు తన దీవెనతో సంజయునకు గ్రహించలేనిది అన్న మాటలేకుండా వుండే గ్రహణ శక్తి ని ఇచ్చి , సంజయుడిని, ధృతరాష్ట్రునికి కావలసిన విషయములు విశదీకరించ మని చెపుతాడు.
ధృతరాష్ట్రుడికి యుద్ధము మీద ఆసక్తి లేదు. కాని సంజయుడు అన్నీ చూడకలడు కాబట్టి అనేకమైన ప్రశ్నలు అడుగాడు. సమాధానము గా సంజయుడు భూమి తూర్పు ఉత్తర పశ్చిమ దక్షిణ వున్న భాగాలని వర్ణిస్తాడు. ఆ భాగములలో వుండే వనములు , ఫలములు , పుష్పములు వర్ణిస్తాడు. అలాగే ఆకాశము నక్షత్రములు, సూర్యుడు అన్ని గ్రహాల గురించి వివరిస్తాడు. ఇవన్నీ విని ధృతరాష్ట్రుడు తన పిల్లలు యుద్ధములో ఎందుకు వెళ్ళారని బాధపడతాడు.ఈ విధముగా తొమ్మిది రోజులు గడిచిపోతాయి. ఈ తొమ్మిది రోజులలో యుద్ధముగురించి ధృతరాష్ట్రుడు అడగడు.సంజయుడు చెప్పడు.
పదవ రోజు యుద్ధము అయిన తరువాత, సంజయుడు అతి దుఃఖముతో, "అనర్ధము అయిపోయింది', భీష్ముడు పోయాడు" అన్నమాటతో ధృతరాష్ట్రునికి యుద్ధవార్త అందిస్తాడు. తన పుత్రుల విజయము తథ్యము అనే అంధవిశ్వాసములో వున్న ధృతరాష్ట్రుడు కూడా నిర్ఘాంతపోతాడు. ధృతరాష్ట్రుని మనస్సులో యుద్ధ సంరంభాలగురించి అనేక రకములైన ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. అప్పుడు అవన్ని సంజయుడు విశదీకరిస్తాడు. అలా యుద్ధానికి సన్నద్ధులు అయిన కౌరవపండవుల మధ్య, "కిమకుర్వతు సంజయా"అంటూ యుద్ధములో ఏమి అయినది అన్న ప్రశ్న వేస్తాడు.
ఆ ప్రశ్నకి సమాధానము, మనము కృష్ణార్జున సంవాద రూపములో భగవద్గీత వింటాము.
ధృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానముగా అప్పుడు సంజయుడు యుద్దరంగములో జరుగుతున్నది అంతా ధృతరాష్ట్రునికి విశదీకరిస్తాడు. సంజయుడు ముందుగా దుర్యోధనుడు పాండవసైన్యాన్ని చూస్తూ ద్రోణాచా ర్యునికి పాండవ సైన్యములోని యోధులగురించి అలాగే కౌరవ పక్షమునందలి యోధుల గురించి చెప్పినది ధృతరాష్ట్రునికి వినిపిస్తాడు.
||శ్లోకము 2||
సంజయ ఉవాచ
దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా|
ఆచార్య ముపసంగమ్య రాజా వచనమబ్రవీత్||2||
స|| తదా దుర్యోధనః పాణ్డవానీకం వ్యూఢం దృష్ట్వా ఆచార్య ముపసంగమ్య (ఇదం) వచనం అబ్రవీత్||2||
||శ్లోకార్థములు||
తదా దుర్యోధనః - అప్పుడు దుర్యోధనుడు
పాణ్డవానీకం వ్యూఢం దృష్ట్వా - పాండవుల సైన్యము యొక్క వ్యూఢము చూచి
ఆచార్య ముపసంగమ్య - ద్రోణాచార్యుని సమీపించి
(ఇదం) వచనం అబ్రవీత్ - ఈ మాటలు చెప్పెను.
||శ్లోక తాత్పర్యము||
"అప్పుడు దుర్యోధనుడుపాండవుల సైన్యము యొక్క వ్యూఢము చూచి,
ద్రోణాచార్యుని సమీపించి ఈ మాటలు చెప్పెను. ||2||
||శ్లోకము 3||
పశ్యైతాం పాణ్డుపుత్రాణాం
ఆచార్యమహతీం చమూం|
వ్యూఢాం ద్రుపద పుత్రేణ
తవశిష్యేణ ధీమతా|| 3||
స|| ఆచార్య తవ శిష్యేణ ధీమతా ద్రుపద పుత్రేణ వ్యూఢాం పాణ్డుపుత్రాణాం ఏతామ్ మహతీం చమూం పశ్య ||3||
||శ్లోకార్థములు||
ఆచార్య తవ శిష్యేణ - గురువర్యా నీ యొక్క శిష్యుడుచేత,
ద్రుపద పుత్రేణ వ్యూఢాం - ద్రుపద పుత్రునిచేత రచింపబడిన
పాణ్డుపుత్రాణాం ఏతామ్ మహతీం చమూం పశ్య -
పాండు పుత్రులయొక్క ఈ మహత్తరమైన సేనను చూడుము.
||శ్లోకతాత్పర్యము||
"ఓ గురువర్యా నీ యొక్క శిష్యుడగు, ద్రుపద పుత్రునిచేత రచింపబడిన పాండు పుత్రులయొక్క ఈ మహత్తరమైన సేనను చూడుము".||3||
||శ్లోకము 4||
అత్రశూరా మహేష్వాసా
భీమార్జున సమాయుధిః|
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః||4||
స|| అత్ర మహేష్వాసా భీమార్జున సమాయుధిః శూరాః యుయుధానః విరాటః చ మహారథః ద్రుపదశ్చ ( సన్తి)||4||
||శ్లోకార్థములు||
అత్ర మహేష్వాసా - ఇక్కడ గొప్ప ధనుర్ధారులు
భీమార్జున సమాయుధిః శూరాః - యుద్ధములో భీమార్జునులతో సమానమైన శూరులు
యుయుధానః విరాటః చ - యుయుధానుడు విరాటుడు అలాగే
మహారథః ద్రుపదశ్చ ( సన్తి)- మహారథుడు ద్రుపదుడు (కలరు)
||శ్లోకతాత్పర్యము||
"ఇక్కడ గొప్ప ధనుర్ధారులు యుద్ధములో భీమార్జునులతో సమానమైన శూరులు యుయుధానుడు విరాటుడు అలాగే
మహారథుడు ద్రుపదుడు (కలరు)".||4||
||శ్లోకము 5||
దృష్టకేతుశ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తీ భోజశ్చ
శైబ్యశ్చ నరపుఙ్గవః ||5||
||శ్లోకాతాత్పర్యము||
"వీరులు దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్ , కుంతీ భోజుడు, మనుజ శ్రేష్ఠుడగు శైబ్యుడు ( కలరు)
||శ్లోకము 6||
యుధామన్యుశ్చ విక్రాన్త
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభౌద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః ||6||
||శ్లోకతాత్పర్యము||
"పరా క్రమశాలి యగు యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు, వీరందరూ మహారథులు".||6||
ఇంకా మిగిలిన వాళ్ళందరిగురించి చెప్పి తన సైన్యములో వున్నవాళ్ళగురించి కూడా చెపుతాడు.
అస్మాకంతు విశిష్ఠా యే
తాన్నిబోధ ద్విజోత్తమ|
నాయకా మమసైన్యశ్చ
సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే||7||
స|| ద్విజోత్తమ అస్మాకం తు యే విశిష్ఠాః మమ సైన్యస్య నాయకాః తాన్ తే సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే||7||
||శ్లోకార్థములు||
ద్విజోత్తమ అస్మాకం - ఓ ద్విజోత్తమ మనలో
యే విశిష్ఠాః మమ సైన్యస్య నాయకాః - ఎవరు విశిష్ఠులో నా సైన్యమునకు నాయకులో
తాన్ తే సంజ్ఞార్థం - వారిని, నీజ్ఞాపకార్థము
తాన్ బ్రవీమి తే||- వాటిని చెప్పుచున్నాను.
||శ్లోక తాత్పర్యము||
"ఓ ద్విజోత్తమ మనసైన్యములో ఎవరు విశిష్ఠులో, సైన్యమునకు నాయకులో, వారిని నీజ్ఞాపకార్థము
చెప్పుచున్నాను"||7||
||శ్లోకము 8||
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితిఞ్జయః|
అశ్వత్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవచ ||8|
||శ్లోకతాత్పర్యము||
"మీరును, భీష్ముడు,కర్ణుడు, కృపుడు, సమితుంజయుడు, అలాగే అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి, కూడా".||8||
||శ్లోకము 9||
అన్యే చ బహవః శూరా
మదర్థే త్యక్త జీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః
సర్వే యుద్ధవిశారదాః ||9||
స|| అన్యే చ బహవః శూరాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః మదర్థే త్యక్త జీవితాః ||
||శ్లోకార్థములు||
అన్యే చ బహవః శూరాః - అన్యులు చాలామంది శూరులు
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః - అనేక శస్త్రముల అస్త్రములు కలవారు , అన్ని యుద్ధములలో ప్రవీణులు
మదర్థే త్యక్త జీవితాః - నాకొఱకై జీవితము వదులుటకు సిద్ధముగా వున్నవారు.
||శ్లోకతాత్పర్యము||
"అన్యులు చాలామంది శూరులు, అనేక శస్త్రముల అస్త్రములు కలవారు, అన్ని యుద్ధములలో ప్రవీణులు నా కొఱకై జీవితము వదులుటకు,
సిద్ధముగా వున్నవారు."||9||
||శ్లోకము 10||
అపర్యాప్తం తదస్మాకం
బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం
బలం భీమాభిరక్షితాం ||10||
స|| తత్ అస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ | అపర్యాప్తం ఏతేషాం ఇదం పర్యాప్తం బలంతు, భీమాభిరక్షితం ||10||
||శ్లోకార్థములు||
తత్ అస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ - ఈ మన బలము భీష్ముని చేత రక్షింపబడుచున్నది.
అపర్యాప్తం - అపరిమితముగా వున్నది.
ఏతేషాం ఇదం బలంతు - ఈ పాణ్డవుల బలము
పర్యాప్తం భీమాభిరక్షితం - పరిమితముగా నున్నది భీముని చే రక్షింపబడుచున్నది.
||శ్లోకతాత్పర్యము||
"ఈ మన బలము భీష్ముని చేత రక్షింపబడుచున్నది, అపరిమితముగా వున్నది.
ఈ పాణ్డవుల బలము పరిమితముగా నున్నది భీముని చే రక్షింపబడుచున్నది"
కౌరవ బలము అపరిమితము. పాండవుల బలము పరిమితము అని.
||శ్లోకము 11||
అయనేషు చ సర్వేషు
య్ధాభాగమవస్థితాః|
భీష్మమేవాభి రక్షన్తు
భవన్తః సర్వఏవహి||11||
స|| భవన్తః సర్వఏవ సర్వేషు అయనేషు చ యథాభాగమ్ అవస్థితాః భీష్మమేవా అభిరక్షన్తు||11||
||శ్లోకార్థములు||
భవన్తః సర్వఏవ - మీరు అందరును
సర్వేషు అయనేషు - సమస్త వ్యూహములలో
యథాభాగమ్ అవస్థితాః - వారి వారి స్థానములలో ఉన్నవారై
భీష్మమేవా అభిరక్షన్తు- భీష్మునినే అన్నివిధములుగా కాపాడుదురుగాక
||శ్లోకతాత్పర్యము||
"మీరు అందరును సమస్త వ్యూహములలో వారి వారి స్థానములలో ఉన్నవారై
భీష్మునినే అన్నివిధములుగా కాపాడుదురుగాక".||11||
"దుర్యోధనుని మాటల విన్న భీష్మపితామహుడు, దుర్యోధనునికి ఉత్సహము కలిగించేందుకు యుద్ధ ప్రారంభానికి చిహ్నముగా తన శంఖము ఊదుతాడు".||11||
||శ్లోకము 12||
తస్య సంజనయన్ హర్షం
కురువృద్ధః పితామహః||
సంహనాదం వినోద్యోచ్చైః
శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్ ||12||
స|| ప్రతాపవాన్ కురువృద్ధః పితామహః తస్య హర్షం సంజనయన్ ఉచ్చైః సింహనాదమ్ వినద్య శంఖం దధ్మౌ||12||
||శ్లోకార్థములు||
ప్రతాపవాన్ కురువృద్ధః పితామహః - పరాక్రమవంతుడు కౌరవులలో పెద్ద అయిన, తాత ( భీష్ముడు)
తస్య హర్షం సంజనయన్ - అతనికి సంతోషము కలుగ చేయుచూ
ఉచ్చైః సింహనాదమ్ వినద్య - గట్టిగా సింహనాదము చేసి
శంఖం దధ్మౌ- తన శంఖమును వూదెను.
||శ్లోకతాత్పర్యములు||
"పరాక్రమవంతుడు కౌరవులలో పెద్ద అయిన తాత ( భీష్ముడు)
దుర్యోధనునికి సంతోషము కలుగ చేయుచూ గట్టిగా సింహనాదము చేసి తన శంఖమును వూదెను".||12||
||శ్లోకము 13||
తతః శంఖాశ్చ భేర్యశ్చ
పణవానక గోముఖాః |
సహసైవాభ్యహన్యంత
స శబ్దస్తుములోఽభవత్ ||13||
స|| తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవ అభ్యహన్యన్త| స శబ్దః తుములః అభవత్||
||శ్లోకార్థములు||11||
తతః శంఖాశ్చ భేర్యశ్చ - అప్పు డు శంఖములున్ను భేరులున్ను
పణవానక గోముఖాః సహసైవ అభ్యహన్యన్త- తప్పెటలు పలకలు ఈదుకొమ్ములు వెంటనే మ్రోగింపబడెను
స శబ్దః తుములః అభవత్- ఆ శబ్దముచే దిక్కులు మారుమోగెను.
||శ్లోకతాత్పర్యము||
"అప్పు డు శంఖములున్ను భేరులున్ను, తప్పెటలు, పలకలు, ఈదుకొమ్ములు వెంటనే మ్రోగింపబడెను.
ఆ శబ్దముచే దిక్కులు మారుమోగెను".||13||
||శ్లోకము 14||
తతః శ్వేతైః హయైర్యుక్తే
మహతి స్యన్దనే స్థితౌ |
మాధవః పాణ్డవశ్చైవ
దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః||14||
స|| తతః శ్వేతైః హయైః యుక్తే మహతి స్యన్దనే స్థితౌ మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః||
||శ్లోకార్థములు||11||
తతః శ్వేతైః హయైః యుక్తే - అప్పుడు తెల్లని గుఱ్ఱములతో కూడిన
మహతి స్యన్దనే స్థితౌ - మహత్తరమైన రథములో వున్న
మాధవః పాణ్డవశ్చైవ - కృష్ణుడు అర్జునుడున్ను
దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః- దివ్యమైన శంఖములను గట్టిగా వూదిరి.
||శ్లోకతాత్పర్యము||
"అప్పుడు తెల్లని గుఱ్ఱములతో కూడిన, మహత్తరమైన రథములో వున్న,
కృష్ణుడు అర్జునుడు కూడా దివ్యమైన శంఖములను గట్టిగా వూదిరి".||14||
||శ్లోకము 15||
పాఞ్చజన్యం హృషీకేశో
దేవదత్తం ధనంజయః|
పౌణ్డ్రం దధ్మౌ మహాశంఖం
భీమకర్మా వృకోద రః || 15||
స|| హృషీకేశః పాఞ్చజన్యం ధనంజయః దేవదత్తం భీమకర్మా వృకోదరః పౌణ్డ్రం మహాశంఖం దధ్మౌ||15||
||శ్లోకార్థములు||
హృషీకేశః పాఞ్చజన్యం - శ్రీకృష్ణుడు పాంచజన్యమును
ధనంజయః దేవదత్తం - అర్జునుడు దేవదత్తమను శంఖమును
భీమకర్మా వృకోదరః పౌణ్డ్రం - భయంకరమైన కార్యములు చేయగల భీముడు పౌండ్రము అనబడు
మహాశంఖం దధ్మౌ- మహాశంఖమును వూదిరి.
||శ్లోకతాత్పర్యము||
"శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమను శంఖమును
భయంకరమైన కార్యములు చేయగల భీముడు పౌండ్రము అనబడు మహాశంఖమును వూదిరి".||15||
||శ్లోకములు 16-18||
అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్టిరః |
నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ||16||
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీచ మహరథః |
ధృష్టద్యమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||17||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ||18||
స|| కున్తీ పుత్రః రాజా యుధిష్టిరః అనన్తవిజయం | తథైవ నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ| పరమేష్వాసః కాశ్యశ్చ మహారథః శిఖణ్డీ చ| దృష్టద్యమ్నః విరాటశ్చ అపరాజితః సాత్యకిశ్చ| ద్రుపదః ద్రౌపదేయాశ్చ మహాబాహుః అభిమన్యుశ్చ సర్వశః పృథక్ పృథక్ శంఖాన్ దధ్ముః||16-18||
||శ్లోకార్థములు||
కున్తీ పుత్రః రాజా యుధిష్టిరః అనన్తవిజయం - కున్తీపుత్రుడు రాజు అగు యుధిష్ఠిరుడు అనన్తవిజయమును (అనబడు శంఖమును)
తథైవ నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ- అదేవిధముగా నకుల సహదేవులు సుఘోషము మణిపుష్పకము ( అనబడు శంఖములను)
పరమేష్వాసః కాశ్యశ్చ మహారథః శిఖణ్డీ చ- గొప్పధనస్సు కల కాశీరాజు, అలాగే మహారథుడు శిఖండీ,
దృష్టద్యమ్నః విరాటశ్చ అపరాజితః సాత్యకిశ్చ- దృష్ఠద్యమ్నుడు విరాటుడు అపరాజితుడైన సాత్యకి ,
ద్రుపదః ద్రౌపదేయాశ్చ - ద్రుపదుడు ద్రౌపది కుమారులు
మహాబాహుః అభిమన్యుశ్చ - మహాబాహువులు కల అభిమన్యుడు
సర్వశః పృథక్ పృథక్ - సేనయందు అంతట వేరు వేరుగా
శంఖాన్ దధ్ముః - శంఖములను వూదిరి.
||శ్లోకతాత్పర్యము||
"కున్తీపుత్రుడు, రాజు అగు యుధిష్ఠిరుడు, అనన్తవిజయమును (అనబడు శంఖమును), అదేవిధముగా నకుల సహదేవులు సుఘోషము మణిపుష్పకము ( అనబడు శంఖములను, గొప్పధనస్సు కల కాశీరాజు, అలాగే మహారథుడు శిఖండీ, దృష్ఠద్యమ్నుడు, విరాటుడు, అపరాజితుడైన సాత్యకి , ద్రుపదుడు, ద్రౌపది కుమారులు,
మహాబాహువులు కల అభిమన్యుడు సేనయందు అంతట వేరు వేరుగా శంఖములను వూదిరి".
||శ్లోకము 19||
సఘోషో ధార్తరాష్ట్రాణాం
హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ
తుములో వ్యను నాదయన్ ||19||
స|| తుములః స ఘోషః నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణాంహృదయాని వ్యదారయత్||19||
||శ్లోకార్థములు||
తుములః స ఘోషః - అంతయు వ్యాపించినట్టి ఆ ధ్వని
నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్ - ఆకాశమును భూమిని మారుమ్రోగించుచూ
ధార్తరాష్ట్రాణాంహృదయాని వ్యదారయత్- ధృతరాష్టృని పుత్రుల హృదయములను చలింపచేసెను.
|| శ్లోకతాత్పర్యము||
"అంతయు వ్యాపించినట్టి ఆ ధ్వని, ఆకాశమును భూమిని మారుమ్రోగించుచూ ధృతరాష్టృని పుత్రుల హృదయములను చలింపచేసెను". ||19||
||శ్లోకము 20||
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా
ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృతే శస్త్రసమ్పాతే
ధనురుద్యమ్య పాణ్డవః ||20||
స|| అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే (సతి) కపిధ్వజః పాణ్డవః ధనురుద్యమ్య వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా||20||
||శ్లోకార్థములు||
అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే (సతి) -అంతట ఆయుధప్రయోగము ప్రారంభమగుచుండగా
కపిధ్వజః పాణ్డవః ధనురుద్యమ్య - ధ్వజములో హనుమ కల అర్జునుడుధనస్సు చేతబట్టి
వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా- యుద్ధసన్నద్ధులైన కౌరవులను చూచి ( ఇట్లు పలికెను)||20||
|| శ్లోకతాత్పర్యము||
"అంతట ఆయుధప్రయోగము ప్రారంభమగుచుండగా, ధ్వజములో హనుమ కల అర్జునుడు, తన ధనస్సు చేతబట్టి
యుద్ధసన్నద్ధులైన కౌరవులను చూచి ( ఇట్లు పలికెను)".||20||
||శ్లోకము 21||
హృషీకేశం తదా వాక్యం
ఇదమాహ మహీపతే |
అర్జున ఉవాచ:
సేనయోరుభయోర్మధ్యే
రథం స్థాపయమేఽచ్యుతా || 21 ||
స||మహీపతే తదా హృషీకేశం ఇదం వాక్యం ఆహ| అర్జున ఉవాచ:|| అచ్యుతా ఉభయోః సేనయోః మధ్యే రథం స్థాపయ||21||
||శ్లోకార్థములు||
మహీపతే తదా హృషీకేశం ఇదం వాక్యం ఆహ-
ఓ మహరాజా, అప్పుడు శ్రీకృష్ణునితో ( అర్జునుడు)ఈ వచనములు పలికెను.
అర్జున ఉవాచ- అర్జునుడు చెప్పెను.
అచ్యుతా ఉభయోః సేనయోః మధ్యే - ఓ అచ్యుతా, ఇద్దరి సైన్యముల మధ్యలో
మే రథం స్థాపయ - నా రథమును నిలబెట్టుము.
|| శ్లోకతాత్పర్యము||
"ఓ మహరాజా, అప్పుడు శ్రీకృష్ణునితో ( అర్జునుడు) ఈ వచనములు పలికెను.
అర్జునుడు చెప్పెను. ఓ అచ్యుతా ఇద్దరి సైన్యముల మధ్యలో నా రథమును నిలబెట్టుము"||21||
||శ్లోకము 22||
యావదేతాన్నిరీక్షేఽహం
యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయాసహ యోద్ధవ్యం
అస్మిన్ రణ సముద్యమే ||22||
స|| అస్మిన్ రణ సముద్యమే మయా కైః సహ యోద్ధవ్యం యోద్ధు కామాన్ అవస్థితాన్ యావత్ ఏతాన్ అహం నిరీక్షే||
||శ్లోకార్థములు||
అస్మిన్ రణ సముద్యమే - అరంభము అవుతున్న ఈ యుద్ధములో
మయా కైః సహ యోద్ధవ్యం - నేను ఎవరితో యుద్ధము చేయవలెనో
యోద్ధు కామాన్ అవస్థితాన్ - యుద్ధముచేయకోరి (ఎవరు) నిలబడి వున్నారో
యావత్ ఏతాన్ అహం నిరీక్షే- వీరందరిని నేను చూడగలనో
|| శ్లోకతాత్పర్యము||
"అరంభము అవుతున్న ఈ యుద్ధములో నేను ఎవరితో యుద్ధము చేయవలెనో, యుద్ధముచేయకోరి ఎవరు నిలబడి వున్నారో,
వారందరిని నేను ఎట్లు చూడగలనో అట్లు (చేయుము)".||22||
||శ్లోకము 23||
యోత్స్యమానా నవేక్షేఽహం
య ఏతేఽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః
యుద్ధే ప్రియ చికీర్షవః ||23||
స|| దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్యప్రియ చికీర్షవః యే ఏతే అత్ర సమాగతాః (తాన్) యోత్స్యమానాన్ అహం అవేక్షే||23||
||శ్లోకార్థములు||
దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్యప్రియ చికీర్షవః- దుర్బుద్ధిగల దుర్యోధనుని ప్రియము కోరి
యే ఏతే అత్ర సమాగతాః - ఏ వీరులు ఇక్కడ సమకూడియున్నారో
(తాన్) యోత్స్యమానాన్ అహం అవేక్షే- యుద్ధము చేయకోరుచున్నవారిని నేను చూచెదను.
|| శ్లోకతాత్పర్యము||
"దుర్బుద్ధిగల దుర్యోధనుని ప్రియము కోరి, ఏ వీరులు ఇక్కడ సమకూడియున్నారో,
అలాగ యుద్ధము చేయకోరుచున్నవారిని నేను చూచెదను".||23||
||శ్లోకము 24-25||
సంజయ ఉవాచ:
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||24||
భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ||25||
స|| భారత ఏవం గుడాకేశేన ఉక్తః హృషీకేశః ఉభయోః సేనయోః మధ్యే భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ ఉత్తమమ్ రథం స్థాపయిత్వా పార్థ సమవేతాన్ ఏతాన్ కురూన్ పశ్య ఇతి ఉవాచ ||
||శ్లోకార్థములు||
భారత ఏవం గుడాకేశేన ఉక్తః హృషీకేశః - ఓ రాజా ఈ విధముగా అర్జునుని చేత చెప్పబడిన కృష్ణుడు
ఉభయోః సేనయోః మధ్యే - ఉభయ సైన్యములమధ్య
భీష్మ ద్రోణ ప్రముఖతః - భీష్మ ద్రోణులకు ఎదురుగా
సర్వేషాం చ మహీక్షితామ్ -అందరు రాజులకు ఎదురుగను
ఉత్తమమ్ రథం స్థాపయిత్వా- ఆ ఉత్తమమైన రథమును నిలబెట్టి
పార్థ సమవేతాన్ ఏతాన్ కురూన్ పశ్య - ఓ పార్థ సమకూడియున్న ఈ కౌరవులను చూడుము
ఇతి ఉవాచ - అని చెప్పెను.
|| శ్లోకతాత్పర్యము||
"ఓ రాజా, ఈ విధముగా అర్జునుని చేత చెప్పబడిన కృష్ణుడు, ఉభయ సైన్యములమధ్య. భీష్మ ద్రోణులకు ఎదురుగా, అందరు రాజులకు ఎదురుగను
ఆ ఉత్తమమైన రథమును నిలబెట్టి , "ఓ పార్థ సమకూడియున్న ఈ కౌరవులను చూడుము", అని చెప్పెను".||24-25||
||శ్లోకము 26||
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రూన్ పుత్రాన్పౌత్రాన్ సఖీంస్తథా||26||
స|| అథ పార్థః తత్ర స్థితాన్ పిత్రూన్ పితామహాన్ అచార్యాన్ మాతులాన్ భాత్రూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ అపశ్యత్||
||శ్లోకార్థములు||
అథ పార్థః తత్ర స్థితాన్ - అప్పుడు అర్జునుడు అక్కడ వున్న
పిత్రూన్ పితామహాన్ అచార్యాన్ మాతులాన్ - తండ్రులను, తాతలను, గురువులను,మేనమామలను
భాత్రూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ అపశ్యత్- అన్నదమ్ములు , కొడుకులు, మనుమలను స్నేహితులను చూచెను.
|| శ్లోకతాత్పర్యము||
"అప్పుడు అర్జునుడు అక్కడ వున్న తండ్రులను, తాతలను, గురువులను,మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను స్నేహితులను చూచెను".||26||
||శ్లోకము 27||
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి|
తాన్ సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్ బన్ధూనవస్థితాన్||27||
కృపయా పరయాఽఽవిష్టో విషీదన్ ఇదమబ్రవీత్ |
స|| సః కౌన్తేయః సేనయోరుభయోరపి అవస్థితాన్ తాన్ శ్వశురాన్ సుహృదశ్చైవ సర్వాన్ బన్ధూన్ సమీక్ష్య పరయా కృపయా ఆవిష్టః విషీదన్ ఇదం అబ్రవీత్ |
||శ్లోకార్థములు||
సః కౌన్తేయః - ఆ కుంతీ పుత్రుడు
సేనయోరుభయోరపి అవస్థితాన్ తాన్ - రెండు సైన్యములలో వున్న ఆ
శ్వశురాన్ సుహృదశ్చైవ సర్వాన్ బన్ధూన్ సమీక్ష్య - మామలను , స్నేహితులను సమస్త బంధువులను చూచి
పరయా కృపయా ఆవిష్టః - అధికమైన దీనత్వముతోకూడినవాడై
విషీదన్ ఇదం అబ్రవీత్ - దుఃఖముతో ఈమాటలను చెప్పెను
|| శ్లోకతాత్పర్యము||
" ఆ కుంతీ పుత్రుడు రెండు సైన్యములలో వున్న ఆ మామలను , స్నేహితులను సమస్త బంధువులను చూచి,
అధికమైన దీనత్వముతోకూడినవాడై దుఃఖముతో ఈమాటలను చెప్పెను".||27||
||శ్లోకము 28-30||
అర్జున ఉవాచ ||
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితమ్||28||
సీదన్తి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి|
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చజాయతే ||29||
గాణ్డీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ||30||
స|| కృష్ణ యుయుత్సుమ్ సముపస్థితమ్ ఇమమ్ స్వజనమ్ దృష్ట్వా మమ గాత్రాణి సీదన్తి| ముఖం చ పరిశుష్యతి| మే శరీరే వేపథుశ్చ రోమహర్షశ్చ జాయతే| గాణ్డీవం హస్తాత్ సంస్రతే |త్వక్చైవ పరిదహ్యతే| అవస్థాతుం నశక్నోమి| మేమనః భ్రమతీవచ||28-30||
||శ్లోకార్థములు||
కృష్ణ యుయుత్సుమ్ సముపస్థితమ్ - ఓ కృష్ణా యుద్ధముచేయుటకు సమకూడియున్న
ఇమమ్ స్వజనమ్ దృష్ట్వా- ఈ బంధు జనమును చూచి
మమ గాత్రాణి సీదన్తి- నా అవయవములు పట్టుతప్పుచున్నవి
ముఖం చ పరిశుష్యతి- నోరు ఎండిపోవుచున్నది
మే శరీరే వేపథుశ్చ రోమహర్షశ్చ జాయతే- నా శరీరములో వణుకుగగుర్పాటు కలుగుచున్నవి
గాణ్డీవం హస్తాత్ సంస్రతే - గాండీవము చేతినుండి జారిపోవుచున్నది
త్వక్చైవ పరిదహ్యతి - చర్మము మండుచున్నది
అవస్థాతుం న శక్నోమి- నిలుచుటకు శక్తిలేనివాడుగా వున్నాను
మేమనః భ్రమతీవ చ - నా మనస్సు చలించిపోవుచున్నది
|| శ్లోకతాత్పర్యము||
"ఓ కృష్ణా యుద్ధముచేయుటకు సమకూడియున్నఈ బంధు జనమును చూచి, నా అవయవములు పట్టుతప్పుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది.
నా శరీరములో వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. చర్మము మండుచున్నది.
నిలుచుటకు శక్తిలేనివాడుగా వున్నాను. నా మనస్సు చలించిపోవుచున్నది".||28-30||
||శ్లోకము 31||
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ|
న చశ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ||31||
స|| కేశవా విపరీతాని నిమిత్తాని చ పశ్యామి| ఆహవే స్వజనం హత్వా అను శ్రేయః న పశ్యామి||
||శ్లోకార్థములు||
విపరీతాని నిమిత్తాని చ పశ్యామి- అనర్థకమైన శకునములను చూచుచున్నాను
ఆహవే స్వజనం హత్వా - యుద్ధములో స్వజనములను చంపి
అను శ్రేయః న పశ్యామి - పిమ్మట శ్రేయస్సును చూడజాలకున్నాను
||శ్లోకతాత్పర్యము||
"ఓ కేశవా, అనర్థకమైన శకునములను చూచుచున్నాను. యుద్ధములో స్వజనములను చంపిన పిమ్మట శ్రేయస్సును చూడజాలకున్నాను".||31||
||శ్లోకము 32||
న కాఞ్క్షే విజయం కృష్ణ న చ రాజ్యంసుఖాని చ|
కింనో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ||32||
స||కృష్ణ విజయం న కాఙ్క్షే | న చ రాజ్యం సుఖాని చ| గోవిన్దా నః రాజ్యేన కిమ్| భోగైః జీవితేన వా కిమ్||32||
||శ్లోకార్థములు||
కృష్ణ విజయం న కాఙ్క్షే - ఓ కృష్ణా, విజయమును కోరను.
న చ రాజ్యం సుఖాని చ- రాజ్యమును సుఖములను కూడా (కోరను)
గోవిన్దా నః రాజ్యేన కిమ్- ఓ గోవిందా మనకు రాజ్యముతో ఏమి (ప్రయోజనము)?
భోగైః జీవితేన వా కిమ్- భోగములతో కాని జీవితముతోకాని ఏమి (ఏమి (ప్రయోజనము)?
||శ్లోకతాత్పర్యము||
"ఓ కృష్ణా, విజయమును కోరను. రాజ్యమును సుఖములను కూడా (కోరను).
ఓ గోవిందా మనకు రాజ్యముతో ఏమి (ప్రయోజనము)? భోగములతో కాని జీవితముతోకాని ఏమి (ప్రయోజనము)?".||32||
||శ్లోకము 33-34||
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖానిచ |
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ || 33||
అచార్యాః పితరః పుత్రాః తథైవచ పితామహాః|
మాతులాః శ్వశురాః పౌత్రాః స్యాలాః సమ్బన్ధినస్తదా ||34||
స|| నః రాజ్యం భోగాః సుఖానిచ ఏషాం అర్థే కాఙ్క్షితమ్ తే ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః స్యాలాః తథా సంబన్ధినః ఇమే ప్రాణాన్ ధనానిచ త్యక్త్వా యుద్ధే అవస్థితాః||
||శ్లోకార్థములు||
నః రాజ్యం భోగాః సుఖానిచ - మనకు రాజ్యము భోగములు సుఖములు
ఏషాం అర్థే కాఙ్క్షితమ్ - ఎవరికొరకు కోరబడినవో
తే ఆచార్యాః పితరః పుత్రాః - ఆ అచార్యులు తండ్రులు పుత్రులు,
తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః - అలాగే తాతలు, మేనమామలు , మామలు
పౌత్రాః స్యాలాః తథా సంబన్ధినః - మనుమలు బావమరదులు అలాగే సంబంధము కలవారు
ఇమే ప్రాణాన్ ధనానిచ త్యక్త్వా- వీరందరు ప్రాణములను ధనమును త్యజించి
యుద్ధే అవస్థితాః- యుద్ధములో నిలబడియున్నారు.
||శ్లోకతాత్పర్యము||
"మనచేత రాజ్యము భోగములు సుఖములు ఎవరికొరకు కోరబడినవో , ఆ అచార్యులు తండ్రులు పుత్రులు,
అలాగే తాతలు, మేనమామలు , మామలు, మనుమలు, బావమరదులు అలాగే సంబంధము కలవారు,
వీరందరు ప్రాణములను ధనమును త్యజించి, యుద్ధములో నిలబడియున్నారు".||33-34||
||శ్లోకము 35||
ఏతాన్నహన్తుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||35||
స|| మధుసూదన ఘ్నతోఽపి ఏతాన్ త్రైలోక్యరాజ్యస్య హేతోః హన్తుం న ఇఛ్చామి| మహీకృతే కిం ను||
||శ్లోకార్థములు||
మధుసూదన ఘ్నతోఽపి - ఓ మధుసూదన చంపువారలై ననూ ( వారిని)
ఏతాన్ త్రైలోక్యరాజ్యస్య హేతోః - ముల్లోకాధిపత్యము కొరకు
హన్తుం న ఇఛ్చామి- చంపుటకు కోరను
మహీకృతే కిం ను- రాజ్యాధిపత్యము కొరకు చెప్పవలసినది ఏమి?
||శ్లోకతాత్పర్యము||
"ఓ మధుసూదన నన్నుచంపువారలైననూ, వారిని ముల్లోకాధిపత్యము కొరకు కూడా చంపుటకు కోరను
రాజ్యాధిపత్యము కొరకు చెప్పవలసినది ఏమి?".||35||
||శ్లోకము 36||
నిహత్య ధార్తరాష్ట్రాన్నః
కాప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయే దస్మాన్
హత్వైతానాతతాయినః ||36||
స|| జనార్దన ధార్తరాష్ట్రాన్ నిహత్య నః కా ప్రీతిః స్యాత్ | ఆతతాయినః ఏతాన్ హత్వా అస్మాన్ పాపమేవ ఆశ్రయేత్||
||శ్లోకార్థములు||
జనార్దన ధార్తరాష్ట్రాన్ నిహత్య - ఓ జనర్దనా, ధృతరాష్టృని పుత్రులని చంపి
నః కా ప్రీతిః స్యాత్ - మనకు ఏమి సంతోషము కలుగును
ఆతతాయినః ఏతాన్ హత్వా - దుర్మార్గులగు వీరిని చంపిన
అస్మాన్ పాపమేవ ఆశ్రయేత్ - మనలను పాపమే ఆశ్రయించును
||శ్లోకతాత్పర్యములు||
"ఓ జనర్దనా, ధృతరాష్టృని పుత్రులని చంపి మనకు ఏమి సంతోషము కలుగును?
దుర్మార్గులగు వీరిని చంపిన మనలను పాపమే ఆశ్రయించును".||36||
||శ్లోకము 37||
తస్మాన్నార్హా వయం హన్తుం
ధార్తరాష్ట్రాన్ స్వబాన్ధవాన్ |
స్వజనం హి కథం హత్వా
సుఖినః స్యామ మాధవః ||37||
స||మాధవా తస్మాత్ స్వబాన్ధవాన్ ధార్తరాష్ట్రాన్ హన్తుం వయం న అర్హాః | స్వజనం హత్వా సుఖినః కథం స్యామ హి||37||
||శ్లోకార్థములు||
మాధవా తస్మాత్ - మాధవా అందువలన
స్వబాన్ధవాన్ ధార్తరాష్ట్రాన్ హన్తుం - మన బంధువులైన దుర్యోధనాదులను చంపుటకు
వయం న అర్హాః - మనము అర్హులము కాము
స్వజనం హత్వా - మనవారిని చంపి
కథం స్యామ హి - ఎట్లు సుఖముకలవారము కాగలము
||శ్లోకతాత్పర్యములు||
"ఓ మాధవా, అందువలన బంధువులైన దుర్యోధనాదులను చంపుటకు మనము అర్హులము కాము.
మనవారిని చంపి ఎట్లు సుఖముకలవారము కాగలము".||37||
||శ్లోకము 38-39||
యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహత చేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్||38||
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్|
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||39||
స|| జనార్దన లోభోపహత చేతసః ఏతే కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే పాతకం చ యద్యపి న పశ్యన్తి కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిః అస్మాభిః అస్మాత్ పాపాత్ నివర్తితుమ్ కథం న జ్ఞేయమ్||38-39||
||శ్లోకార్థములు||
జనార్దన లోభోపహత చేతసః - ఓ జనార్దనా, లోభముచేత అపహరింపబడిన మనస్సుకల
ఏతే కులక్షయ కృతం దోషం - ఈ( దుర్యోధనాదులు) వంశనాశనము వలన కలుగు దోషమును
మిత్రద్రోహే పాతకం చ - మిత్ర ద్రోహము వలన కలుగు పాపమును
యద్యపి న పశ్యన్తి - తెలిసికొనలేకపోయిననూ,
కులక్షయ కృతం దోషం - కులనాశనము వలన కలుగు దోషమును
ప్రపశ్యద్భిః అస్మాభిః - చక్కగా తెలిసిన మనచేత
అస్మాత్ పాపాత్ నివర్తితుమ్ - ఈ పాపము నుండి బయటపడుటకు
కథం న జ్ఞేయమ్ - ఎట్లు తెలియబడదు.
||శ్లోకతాత్పర్యములు||
"ఓ జనార్దనా, లోభముచేత అపహరింపబడిన మనస్సుకల ఈ దుర్యోధనాదులు వంశనాశనము వలన కలుగు దోషమును,
మిత్ర ద్రోహము వలన కలుగు పాపమును, తెలిసికొనలేకపోయిననూ, కులనాశనము వలన కలుగు దోషమును
చక్కగా తెలిసిన మన చేత, ఈ పాపము నుండి విరమించుట ఎట్లు సాధ్యము కాదు ?"||38-39||
||శ్లోకము 40||
కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనః |
ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోఽభిభవత్యుత||40||
స|| కులక్షయే సనాతనః కులధర్మాః ప్రణశ్యన్తి | ధర్మే నష్థే కృత్స్నమ్ కులమ్ అధర్మః అభిభవతి ఉత||
||శ్లోకార్థములు||
కులక్షయే - కులక్షయము చేత
సనాతనః కులధర్మాః ప్రణశ్యన్తి - అనాదిగా వచ్చుచున్న కులధర్మములు నశించుచున్నవి
ధర్మే నష్థే కృత్స్నమ్ కులమ్ - ధర్మము నశించుట చేత సమస్త కులములో
అధర్మః అభిభవతి ఉత - అధర్మమే వ్యాపించును కదా|
||శ్లోకతాత్పర్యములు||
"కులక్షయము చేత, అనాదిగా వచ్చుచున్న కులధర్మములు నశించుచున్నవి.
ధర్మము నశించుట చేత సమస్త కులములో అధర్మమే వ్యాపించును కదా".||40||
||శ్లోకము 41||
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః ||41||
స|| కృష్ణ అధర్మాభిభవాత్ కులస్త్రియః ప్రదుష్యన్తి | వార్ష్ణేయా స్త్రీషు దుష్టాసు వర్ణ సంకరః జాయతే||41||
||శ్లోకార్థములు||
కృష్ణ అధర్మాభిభవాత్ - కృష్ణా, అధర్మము అభివృద్ధినొందుటవలన
కులస్త్రియః ప్రదుష్యన్తి - కులస్త్రీలు చెడిపోవుదురు
వార్ష్ణేయా స్త్రీషు దుష్టాసు -ఓ కృష్ణా, స్త్రీలు చెడినచో
వర్ణ సంకరః జాయతే - వర్ణ సంకరము కలుగుచున్నది.
||శ్లోకతాత్పర్యములు||
"ఓ కృష్ణా, అధర్మము అభివృద్ధినొందుటవలన కులస్త్రీలు చెడిపోవుదురు.
ఓ కృష్ణా, స్త్రీలు చెడినచో వర్ణ సంకరము కలుగుచున్నది".||41||
||శ్లోకము 42||
సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ|
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదక క్రియాః ||42||
స|| సంకరః కులఘ్నానాం కులస్య చ నరకాయైవ| ఏషాం పితరః లుప్తపిణ్డోదక క్రియాః పతన్తి || 42||
||శ్లోకార్థములు||
సంకరః కులఘ్నానాం కులస్య చ - సంకరము కులమును చెరిచినవారికి కులమునకు కూడా
నరకాయైవ - నరకమే
ఏషాం పితరః - వీరి యొక్కతండ్రులు
లుప్తపిణ్డోదక క్రియాః పతన్తి - పిండోదక క్రియలు లేనివారై అధోగతిని పొందెదరు-
||శ్లోకతాత్పర్యములు||
"సంకరము, కులమును చెరిచినవారికి, కులమునకు కూడా నరకమే.
అట్టివారి యొక్కతండ్రులు పిండోదక క్రియలు లేనివారై అధోగతిని పొందెదరు".||42||-
||శ్లోకము 43||
దోషేరేతైః కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః |
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||43||
స|| కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః ఏతైః దోషైః శాశ్వతాః జాతిధర్మాః కులధర్మాశ్చ ఉత్సాద్యన్తే ||43||
||శ్లోకార్థములు||
కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః - కులమును నాశనము చేయువారియొక్క జాతిని సంకరము చేయు వారియొక్క
ఏతైః దోషైః శాశ్వతాః - వారి దోషములచేత శాశ్వతములైన
జాతిధర్మాః కులధర్మాశ్చ- జాతి ధర్మములు, కులధర్మములు
ఉత్సాద్యన్తే - నశించిపబడుచున్నవి.
||శ్లోకతాత్పర్యములు||
"కులమును నాశనము చేయువారియొక్క, జాతిని సంకరము చేయు వారియొక్క, వారి దోషములచేత,
శాశ్వతములైన జాతి ధర్మములు, కులధర్మములు నశించిపబడుచున్నవి".||43||
||శ్లోకము 44||
ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||44||
స|| జనార్దన ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం నరకే నియతం వాసః భవతి ఇతి అనుశుశ్రుమ ||44||
||శ్లోకార్థములు||
జనార్దన ఉత్సన్న కులధర్మాణాం - ఓ జనార్దనా, నశించిన కులధర్మములు కల
మనుష్యాణాం - మనుజులకు
నరకే నియతం వాసః భవతి - నరకములోనే నివాసము కలుగును
ఇతి అనుశుశ్రుమ - అని వినియున్నాము.
||శ్లోకతాత్పర్యములు||
" ఓ జనార్దనా, నశించిన కులధర్మములు కల మనుజులకు,
నరకములోనే నివాసము కలుగును అని వినియున్నాము".||44||
||శ్లోకము 45||
అహో బత మహాపాపం కర్తుం వ్యవస్థితా వయం |
యద్రాజ్య సుఖలోభేన హన్తుం స్వజన ముద్యతాః ||45||
స||అహో బత | యత్ వయమ్ రాజ్య సుఖలోభేన స్వజనమ్ హన్తుం ఉద్యతాః మహత్ పాపం కర్తుంవ్యవసితాః||
||శ్లోకార్థములు||
అహో బత - అయ్యో ఆశ్చర్యము
యత్ వయమ్ రాజ్య సుఖలోభేన - ఏ రాజ్యసుఖముల లోభముతో .
స్వజనమ్ హన్తుం ఉద్యతాః - బంధువులను చంపుటకు ప్రయత్నించితిమో
(తత్) మహత్ పాపం కర్తుంవ్యవసితాః- అందువలన్ మహాపాతకము చేయుటకు సమకట్టినవారమైతిమి.
||శ్లోకతాత్పర్యములు||
"అయ్యో ఆశ్చర్యము. ఏ రాజ్యసుఖముల లోభముతో బంధువులను చంపుటకు ప్రయత్నించితిమో
అందువలన మహాపాతకము చేయుటకు సమకట్టినవారమైతిమి".||45||
||శ్లోకము 46||
యది మామప్రతీకార
మశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్ ||46||
స|| అశస్త్రం అప్రతీకారం మాం రణే శస్త్ర పాణయః ధార్తరాష్ట్రాః హన్యుః యది తత్ మే క్షేమ తరమ్ భవేత్||46||
||శ్లోకార్థములు||
అశస్త్రం అప్రతీకారం మాం - శస్త్రములు లేని ప్రతీకారము కోరని నన్నుఁ
రణే శస్త్ర పాణయః ధార్తరాష్ట్రాః - శస్త్రములను ధరించిన దుర్యోధనాధులు
హన్యుః యది - ఒకవేళ చంపినచో
తత్ మే క్షేమ తరమ్ భవేత్- అది నాకు క్షేమకరమైనది.
||శ్లోకతాత్పర్యములు||
"శస్త్రములు లేని, ప్రతీకారము కోరని నన్ను, శస్త్రములను ధరించిన దుర్యోధనాధులు,
ఒకవేళ చంపినచో అది నాకు క్షేమకరమైనది".||46||
||శ్లోకము 47||
సంజయ ఉవాచ:
ఏవముక్త్వా అర్జునః సంఖ్యే
రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం
శోక సంవిఘ్నమానసః ||47||
స|| సంజయ ఉవాచ| సంఖ్యే అర్జునః ఏవం ఉక్త్వా శోకసంవిగ్న మానసః సశరమ్ చాపం విసృజ్య రథోపస్థే ఉపావిశత్||47||
||శ్లోకార్థములు||
సంఖ్యే అర్జునః ఏవం ఉక్త్వా - యుద్ధభూమిలో అర్జునుడు ఈ విధముగా చెప్పి
శోకసంవిగ్న మానసః - శోకముతో మిక్కిలి చలించిన మనస్సు కలవాడై
సశరమ్ చాపం విసృజ్య - బాణములతో కూడ్ఇన ధనస్సును విడిచిపెట్టి
రథోపస్థే ఉపావిశత్- రథము మీద చతికిలబడెను
||శ్లోకతాత్పర్యములు||
"యుద్ధభూమిలో అర్జునుడు ఈ విధముగా చెప్పి, శోకముతో మిక్కిలి చలించిన మనస్సు కలవాడై
బాణములతో కూడ్ఇన ధనస్సును విడిచిపెట్టి, రథము మీద చతికిలబడెను".||47||
అప్పుడు సంజయుడు అర్జునుని స్థితిగురించి వర్ణిస్తో చెప్పిన మాట, "విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః" (1.47)
అంటే తన శస్త్రములను వదిలేసి శోకముతో కూడిన మనస్సు కలవాడై రథము మీద చతికిల పడతాడు అన్నమాట.
ఈ మాటతో అర్జున విషాదయోగము అనబడే ప్రథమాధ్యాయము సమాప్తము అవుతుంది.
అర్జున విషాద యోగములోని మొదటి శ్లోకములోనే ధృతరాష్ట్రుని దృష్టి కోణము " మామకాః" అన్న మాటతో తెలుస్తుంది. అదే అంధత్వానికి ప్రతీక.
రెండవ శ్లోకముకూడా మనకు అదే మాట తెలుపుతుంది. సంజయుడు యుద్దరంగములో జరిగినది ధృతరాష్ట్రునికి విశదీకరించాలి. యుద్ధరంగములో పితామహుడైన భీష్ముడు గురువైన ద్రోణుడు అలాగే పాండవ కౌరవులలో అగ్రజుడైన ధర్మరాజు అలాగే అనేక మంది పెద్దలున్నారు. వాళ్ళు కూడా ఎదో మాట్లాడుతూ ఉండవచ్చు. అవన్నీ వదిలేసి సంజయుడు దుర్యోధనుని మాటలే ధృతరాష్ట్రునికి వినిపిస్తాడు. ఏందుకు ?. ధృతరాష్ట్రునికి కావలసినది తనవారి విషయము. మిగిలిన సంభాషణలన్నిటికన్న ఆయనకి కావలిసినది దుర్యోధనుని మాటే. అందుకని సంజయుడు కూడా అదే చెపుతాడు!
అర్జున విషాదయోగములో మనకు ముఖ్యముగా కనపడేది కౌరవుల తండ్రి, పాండవులకు తండ్రి సమానుడైన ధృతరాష్ట్రుని " మామకాః" అంటూ చెప్పిన మమకార అంధత్వము. అలాగే "కథం భీష్మమహం సంఖ్యే" అంటూ చెప్పిన అర్జునుని బంధు ప్రేమ.అర్జునుడు "వీళ్ళు నావాళ్ళు" "నేను వాళ్ళవాడను" అనే భావాలచేత భ్రాంతి చేత తన స్వధర్మమైన క్షాత్ర ధర్మమును వదిలేసి యుద్ధము చేయను అన్నాడు. అంతే కాకుండా పరధర్మమైన భిక్షా జీవనము చేస్తానని అంటాడు (2.05). అంటే శోకమోహాలు కలిగిన ప్రతి వానికి స్వధర్మము వదిలి వైరుధ్యధర్మము ఆచరించడానికి తలపడడం సిద్ధము అవుతారు .అదే మనం అర్జునిలో చూసేది.
పెద్ద వారి పట్ల గౌరవము బంధువులనిన గౌరవము యుండుట అందరికీ సహజము. కానీ వారు అధర్మపరులైనపుడు వారిని అనుసరించకూడదు. సహజముగా కొందరు తల్లి తండ్రులు తమ సంతానము పై ప్రేమచే వారు తప్పు త్రొవలో నడచు చున్ననూ వారిని దండించక చూచి చూడనట్లు ఉందురు. అదియే మోహము అనబడును. తల్లి తండ్రులకు పిల్లలపై ప్రేమ యుండుట సహజము ధర్మము. కానీ ప్రేమ మితి మీరిన యడల మోహమగును. ధృతరాష్ట్రునకు దుర్యోధనుని యందు కల ప్రేమ అటు వంటి మోహమే. ఈ మోహము ప్రభావము వలన తల్లి తండ్రులు అధర్మమార్గమునకు అలవాటు పడుచు తమ సంతానమును ధర్మమార్గమునకు నడిపింపలేరు
.
అటువంటి మోహము చేతనే అర్జునుడు అధర్మపరులైన తన బంధుజనము నందు ప్రేమ కలిగి యున్నాడు.
కాబట్టి మోహము విడువతగినదని గ్రహించి మన పిల్లలు అధర్మ మార్గములో నున్నారని తెలిసినచో వారిని తగు రీతిలో శిక్షించి మంచి మార్గములో తీసుకురావలసి యున్నది. అట్లు శిక్షించుటకు తల్లితం డ్రులు వెనుకాడిననూ భగవంతుడి శిక్ష నుండితప్పించు కొనుట దుర్లభము.
ఈ అధ్యాయములో ఇంకో సూచన కనిపిస్తుంది.
పాండవులు కౌరవులు మనలోని సద్గుణములు దుర్గుణములతో సమానము. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో జరిగిన యుద్ధము సద్గుణముల దుర్గుణముల మధ్య ఎల్లప్పుడూ జరిగే యుద్ధమే. వీటితో కలిసినది మోహమనే అంధత్వము. ఆ అంధత్వము వలన మనకు మంచి చెడులో కూడా తేడా తెలియక తికమక పడుతూ వుంటాము
మోహము అంధత్వము ఆజ్ఞానములో ముఖ్యభాగాలు . భగద్గీతలో కృష్ణుడు ఉపదేశమంతా ఆ అజ్ఞానమును ఎలాదూరముగావుంచి మంచి మార్గములో పోవాలి అన్న విషయము !
ఇంకో మాట . ప్రతీ మనిషి జీవితము లో కొన్ని సమస్యలు ఎదుర్కొనుట అనివార్యము. అవి పెద్దవి కావచ్చు లేక చిన్నవి కావచ్చు. ఆ సమస్యలు వచ్చిన సమయములో అర్జునుని వలె ధైర్యము పోగొట్టుకొని బలహీన పడుట సహజము. కాబట్టి ఆసమయమున శ్రీ కృష్ణుడు అర్జునునకు ఏమి బోధించెనో తెలిసికొని అనుసరించుట వలన ఆపదలను సమస్యలను ధైర్యముతో ఎదుర్కొని విజయమును సాధించగలము అని.
ఇతి శ్రీమద్భవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగ శాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే
అర్జున విషాదయోగో నామ
ప్రథమోఽధ్యాయః |
||ఓమ్ తత్ సత్ ||
.
|