భగవద్గీత !!

ప్రథమాధ్యాయము !

 

 

 

|| ఓమ్ తత్ సత్ ||
ధృతరాష్ట్ర ఉవాచ:
"ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవశ్చైవ కిమకుర్వతు సంజయా |"
"ఓ సంజయా! ధర్మభూమి అయిన కురుక్షేత్రములో యుద్ధము చేయదలచినవారై కూడినట్టి నా వారు పాండవులు ఏమి చేసిరి ?"

|| ఓమ్ తత్ సత్ ||
భగవద్గీత -
ఆర్జున విషాద యోగము
ప్రథమాధ్యాయము
శ్రీకృష్ణపరబ్రహ్మనే నమః

భగవద్గీత ప్రారంభము కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుని ప్రశ్నతో మొదలు అవుతుంది. యుద్ధమునకై కౌరవపాండవ సైన్యములు ఇరువైపుల కురుక్షేత్రములో సంసిద్ధమై యున్నసమయములో ధృతరాష్ట్రునకు యుద్ధరంగమున ఏమి జరుగుచున్నదీ తెలుపుటకు గాను సంజయుడు ధృతరాష్ట్రుని వద్ద ఉండెను. ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు.
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః|
మామకాః పాండవశ్చైవ కిమకుర్వతు సంజయా ||1||

" ఓ సంజయా ! నా వారు, పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్దమునకు సమావేశమై ఏమి చేసిరి?" అని .
ఈ ప్రశ్న తరువాత "సంజయ ఉవాచ" అంటూ భగవద్గీత అంటే కృష్ణార్జున సంవాదము అంతా సంజయుని ద్వారా వింటాము.
ధృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానముగా అప్పుడు సంజయుడు యుద్దరంగములో జరుగుతున్నది అంతా ధృతరాష్ట్రునికి విశదీకరిస్తాడు. సంజయుడు ముందుగా దుర్యోధనుడు పాండవసైన్యాన్ని చూస్తూ ద్రోణాచర్యునికి పాండవ సైన్యములోని యోధులగురించి అలాగే కౌరవ పక్షమునందలి యోధుల గురించి చెప్పినది ధృతరాష్ట్రునికి వినిపిస్తాడు.
సంజయ ఉవాచ
దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా|
ఆచార్య ముపసంగమ్య రాజా వచనమబ్రవీత్||2||
దుర్యోధనుని మాటల విన్న భీష్మపితామహుడు , దుర్యోధనునికి ఉత్సహము కలిగించేందుకు యుద్ధ ప్రారంభానికి చిహ్నముగా తన శంఖము ఊదుతాడు. అప్పుడు అందరూ కూడా తమ తమ శంఖములను ఊదుతారు. ఆ శంఖము ఊదడములో కృష్ణార్జులు కూడా పాల్గొంటారు.
"పాంచజన్యం హృషీకేశో
దేవదత్తం ధనంజయః||15||
కృష్ణుడు పాంచజన్యమును , ధనంజయుడు అంటే అర్జునుడు దేవదత్తము అనబడు శంఖములను ఊదుతారు.
అంటే అప్పుడు రెండు పక్షాలు యుద్ధానికి తయారుగావున్న సమయమది.
అప్పుడు యుద్ధప్రారంభానికి శంఖభేరి మోగించినా అర్జునుడు తన సారధి అయిన కృష్ణుని ఇలా అడుగుతాడు
అర్జున ఉవాచ:
సేనయోః ఉభయోః మధ్యే
రథం స్థాపయ మే అచ్యుతా ||21||

అంటే అర్జునుడు "ఓ అచ్యుతా ! రెండు సేనలను నేను చక్కగా చూడగలుగునట్లు నా రధమును రెండు సేనల మధ్య ఆపుము" అని ! అర్జునుడు అలా శ్రీకృష్ణుని కోరగా కృష్ణుడు భీష్మ ద్రోణాదులైన కౌరవసేనకు ఎదుటగా అర్జునుని రధము నిలుపుతాడు. అంతట అర్జునుడు కౌరవసేన లోని గురువులూ తాతలూ తండ్రులూ కొడుకులూ మనుమలూ స్నేహితులు మొదలగు వారి నందరిని పరికించి చూచి దయార్ద్ర హృదయుడై దుఃఖించుచూ " ఓ కృష్ణా యుద్ధమునకై వచ్చిన ఈ బంధుజనమును చూచి నా అవయవములు పట్టు తప్పుచున్నవి. నోరు ఎండిపోయి శరీరము వణకుచు గగుర్పాటు కలుగుచున్నది. గాండీవము జారిపొవుచున్నది. మనసు తిరిగి పోవుచున్నది. విపరీతమైన్ దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. యుద్ధములో స్వజనాని చంపడములో కలిగే మేలు నాకు కనపడడం లేదు' అని తన దీన స్థితిని కృష్ణునకు చెపుతాడు.
అంతేకాదు ఇంకా ఇలాగ అంటాడు.
అర్జున ఉవాచ:
నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ||32||
అర్జునుడు "నేను విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని కొరను. మనకు వాటితో పని ఏమి? మనవారిని మనమే చంపి మనము ఎట్లు సుఖపడగలము? వారిని చంపిన తర్వాత కలిగే సుఖము నాకు అవసరము లేదు " అని చెప్పి తాను యుద్ధము నుండి విరమింప తలచుచున్నానని కృష్ణునితో అంటాడు.
అప్పుడు సంజయుడు అర్జునుని స్థితిగురించి వర్ణిస్తో ఇలా చెపుతాడు
సంజయ ఉవాచ:
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||47||
తన శస్త్రములను వదిలేసి శోకముతో కూడిన మనస్సు కలవాడై రథము మీద చతికిల పడతాడు!
అంతటితో అర్జున విషాదయోగము అనబడే ప్రథమాధ్యాయము సమాప్తము అవుతుంది.
అర్జున విషాద యోగములోని మొదటి శ్లోకములోనే ధృతరాష్ట్రుని దృష్టి కోణము " మామకాః" అన్న మాటతో తెలుస్తుంది. అదే అంధత్వానికి ప్రతీక.
రెండవ శ్లోకముకూడా మనకు అదే మాట తెలుపుతుంది. సంజయుడు యుద్దరంగములో జరిగినది ధృతరాష్ట్రునికి విశదీకరించాలి. యుద్ధరంగములో పితామహుడైన భీష్ముడు గురువైన ద్రోణుడు అలాగే పాండవ కౌరవులలో అగ్రజుడైన ధర్మరాజు అలాగే అనేక మంది పెద్దలున్నారు. వాళ్ళు కూడా ఎదో మాట్లాడుతూ ఉండవచ్చు. అవన్నీ వదిలేసి సంజయుడు దుర్యోధనుని మాటలే ధృతరాష్ట్రునికి వినిపిస్తాడు. ఏందుకు ?. ధృతరాష్ట్రునికి కావలసినది తనవారి విషయము . మిగిలిన సంభాషణలన్నిటికన్న ఆయనకి కావలిసినది దుర్యోధనుని మాటే. అందుకని సంజయుడు కూడా అదే చెపుతాడు!
అర్జున విషాదయోగములో మనకు ముఖ్యముగా కనపడేది కౌరవుల తండ్రి, పాండవులకు తండ్రి సమానుడైన ధృతరాష్ట్రుని " మామకాః" అంటూ చెప్పిన మమకార అంధత్వము. అలాగే "కథం భీష్మమహం సంఖ్యే" అంటూ చెప్పిన అర్జునుని బంధు ప్రేమ.అర్జునుడు "వీళ్ళు నావాళ్ళు" "నేను వాళ్ళవాడను" అనే భావాలచేత భ్రాంతి చేత తన స్వధర్మమైన క్షాత్ర ధర్మమును వదిలేసి యుద్ధము చేయను అన్నాడు. అంతే కాకుండా పరధర్మమైన భిక్షా జీవనము చేస్తానని అంటాడు (2.05). అంటే శోకమోహాలు కలిగిన ప్రతి వానికి స్వధర్మము వదిలి వైరుధ్యధర్మము ఆచరించడానికి తలపడడం సిద్ధము అవుతారు .అదే మనం అర్జునిలో చూసేది.

పెద్ద వారి పట్ల గౌరవము బంధువులనిన గౌరవము యుండుట అందరికీ సహజము. కానీ వారు అధర్మపరులైనపుడు వారిని అనుసరించకూడదు. సహజముగా కొందరు తల్లి తండ్రులు తమ సంతానము పై ప్రేమచే వారు తప్పు త్రొవలో నడచు చున్ననూ వారిని దండించక చూచి చూడనట్లు ఉందురు. అదియే మోహము అనబడును. తల్లి తండ్రులకు పిల్లలపై ప్రేమ యుండుట సహజము ధర్మము. కానీ ప్రేమ మితి మీరిన యడల మోహమగును. ధృతరాష్ట్రునకు దుర్యోధనుని యందు కల ప్రేమ అటు వంటి మోహమే. ఈ మోహము ప్రభావము వలన తల్లి తండ్రులు అధర్మమార్గమునకు అలవాటు పడుచు తమ సంతానమును ధర్మమార్గమునకు నడిపింపలేరు
.
అటువంటి మోహము చేతనే అర్జునుడు అధర్మపరులైన తన బంధుజనము నందు ప్రేమ కలిగి యున్నాడు.
కాబట్టి మోహము విడువతగినదని గ్రహించి మన పిల్లలు అధర్మ మార్గములో నున్నారని తెలిసినచో వారిని తగు రీతిలో శిక్షించి మంచి మార్గములో తీసుకురావలసి యున్నది. అట్లు శిక్షించుటకు తల్లితం డ్రులు వెనుకాడిననూ భగవంతుడి శిక్ష నుండితప్పించు కొనుట దుర్లభము.
ఈ అధ్యాయములో ఇంకో సూచన కనిపిస్తుంది.
పాండవులు కౌరవులు మనలోని సద్గుణములు దుర్గుణములతో సమానము. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో జరిగిన యుద్ధము సద్గుణముల దుర్గుణముల మధ్య ఎల్లప్పుడూ జరిగే యుద్ధమే. వీటితో కలిసినది మోహమనే అంధత్వము. ఆ అంధత్వము వలన మనకు మంచి చెడులో కూడా తేడా తెలియక తికమక పడుతూ వుంటాము
మోహము అంధత్వము ఆజ్ఞానములో ముఖ్యభాగాలు . భగద్గీతలో కృష్ణుడు ఉపదేశమంతా ఆ అజ్ఞానమును ఎలాదూరముగావుంచి మంచి మార్గములో పోవాలి అన్న విషయము !
ఇంకో మాట . ప్రతీ మనిషి జీవితము లో కొన్ని సమస్యలు ఎదుర్కొనుట అనివార్యము. అవి పెద్దవి కావచ్చు లేక చిన్నవి కావచ్చు. ఆ సమస్యలు వచ్చిన సమయములో అర్జునుని వలె ధైర్యము పోగొట్టుకొని బలహీన పడుట సహజము. కాబట్టి ఆసమయమున శ్రీ కృష్ణుడు అర్జునునకు ఏమి బోధించెనో తెలిసికొని అనుసరించుట వలన ఆపదలను సమస్యలను ధైర్యముతో ఎదుర్కొని విజయమును సాధించగలము.
|| ఓమ్ తత్ సత్ ||
సంజయ ఉవాచ:
ఏవముక్త్వా ర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్|
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః||47||
"యుద్ధభూమి యందు అర్జునుడు ఈ ప్రకారముగా చెప్పి దుఃఖముచే మిక్కిలి చలించిన మనస్సు కలవాడై బాణముతో కూడిన ధనస్సు ను విడిచిపెట్టి రథము మీద చతికిలబడెను.
||ఓమ్ తత్ సత్||

.