||భగవద్గీత ||

||దశమోధ్యాధ్యాాయము||

||విభూతి యోగము- శ్లోకాలు - అర్థతాత్పర్యాలతో ||


|| ఓమ్ తత్ సత్||

|| ఓమ్ తత్ సత్||
శ్రీభగవానువాచ:
భూయ ఏవ మహాబాహో శ్రుణుమే పరమం వచః|
యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా||1||

"ఓ అర్జునా! (నా మాటలచే) సంతసించుచున్న నీ హితము కోరి మరల ఏ ఉత్తమమైన వాక్యమును చెప్పుచున్నానో అది వినుము."

ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీమద్ భగవద్గీత
విభూతి యోగము
పదియవ అధ్యాయము

విభూతి అనగా ఐశ్వర్యము మహిమాతిశయము.

జగమే పరమాత్మమహిమ అయినప్పుడు, పరమాత్మ మహిమ లేనిది ఏదీ వుండదు. అప్పుడు మహిమ గురించి చెప్పవలసిన అవసరము ఉందా అని అనిపించవచ్చు. అయితే గీత ప్రపంచములో అందరికోసము. అందులో పరమాత్మ మహిమ తెలిసిన వారు, అలాగే తెలియని వారు కూడా ఉంటారు. అందుకనే భగవంతుని విభూతుల మీద ఈ అధ్యాయము.

భగవత్ మహిమ గురించి ఏడు ఏనిమిది అలాగే తొమ్మిదవ సర్గలలో కొంచెము కృష్ణ భగవానుడు చెప్పాడు. తొమ్మిదవ అధ్యాయము చివరిలో " మన్మనాభవ మద్బక్తో మద్యాజీమాం నమస్కురు", అంటూ "నాయందే మనస్సుగలవాడవు అగుము . నాకు నమస్కరింపుము. నాయందే మనస్సునిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకొనినవాడై తుదకు నన్నే పొందగలవు" అని అంటాడు.

అయితే అలాంటి నిరంతర ఆత్మ దృష్టికొరకు, భగవంతునియొక్క మహిమ గురించిన అంటే భగవద్విభూతి గురించిన జ్ఞానము సహాయకారిగా వుండగలదు . అందుకని భగవంతుడు పరమప్రీతితో భగవంతుని మహిమగురించిన పరమార్ధ జ్ఞానము బోధించెను.

శ్లోకము 1

భూయ ఏవ మహాబాహో శ్రుణుమే పరమం వచః|
యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా||1||

స|| హే మహాబాహో ! ప్రీయమాణాయ తే హితకామ్యయా భూయః ఏవ యత్ పరమం వచః అహం వక్ష్యామి ( తత్ వచః) శృణు||1||

ప్రతిపదార్థాలు:

ప్రీయమాణాయ - సంతసించుచున్న
తే హితకామ్యయా - నీకు హితము చేయ కోరికతో
భూయః ఏవ - మళ్ళీ
యత్ పరమం వచః అహం వక్ష్యామి -
ఎట్టి శ్రేష్ఠమైన వచనములను చెప్పబోతున్నానో
( తత్ వచః) శృణు - (ఆ వచనములను ) వినుము.

శ్లోకతాత్పర్యము:

"ఓ అర్జునా! (నా మాటలచే) సంతసించుచున్న నీ హితము చేయ కోరి, మరల ఏ శ్రేష్ఠమైన వాక్యములను చెప్పుచున్నానో అది వినుము."||1||

కృష్ణుడు చెప్పే ఆ ఉత్తమ వాక్యము ఏమిటి?
ఆ ఉత్తమ వాక్యము భగవంతుని మహిమగురించి.
ఇది అందరికీ తెలిసిన విషయము కాదు.

శ్లోకము 2

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః|
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః||2||

స||మే ప్రభవమ్ ( ప్రభావం అపి) సురగణాః న విదుః| మహర్షయః న| అహం దేవానామ్ మహర్షీణాం చ సర్వశః ఆదిః హి ||2||

ప్రతిపదార్థాలు ||

మే ప్రభవమ్ ( ప్రభావం అపి) సురగణాః న విదుః -
నాప్రభావమును సురగణములు కూడా ఎఱుంగవు
మహర్షయః న - మహర్షులు కూడా (ఎఱుగరు)
అహం దేవానామ్ మహర్షీణాం చ సర్వశః -
నేను దేవతలకు మహర్షులు అందరికూడా
ఆదిః హి - కారణభూతుడను

శ్లోక తాత్పర్యము:

"నాప్రభవమును సురగణములు కూడా ఎఱుంగవు. మహర్షులు కూడా (ఎఱుగరు).
నేను దేవతలకు మహర్షులు అందరికీ కారణభూతుడను."||2||

ఇక్కడ "ప్రభవమ్" అంటే ఉత్పత్తి అని అర్థము. అంటే భగవంతుడు చెప్పుచున్నది "నా ఉత్పత్తిని గురించి " ఎవరికి తెలియదు అని. ఎందుకు ఆయన మొదటివాడు కనుక. అంతే కాదు ఆయన సమస్త జగత్తు ఉత్పత్తికి కారణభూతుడు. అందుకని ఆ తరువాత వచ్చినవారికి ముందుగా వచ్చిన ఆది పురుషుని గురించి తెలియదు అని.

శ్లోకము 3

యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్|
అసమ్మూఢస్య మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే||3||

స|| యః మాం అజం అనాదించ లోకమహేశ్వరం ( చ) వేత్తి సః మర్త్యేషు అసమ్మూఢః సర్వపాపైః ప్రముచ్యతే||3||

ప్రతిపదార్థాలు:

యః మాం అజం అనాదించ - ఎవరు నన్ను పుట్టుకలేనివానినిగా ఆదిలేనివానిగా
లోకమహేశ్వరం ( చ) వేత్తి - లోకములకు ఈశ్వరునిగా తెలిసికొందురో
సః మర్త్యేషు అసమ్మూఢః - వాడు మనుష్యులలో అజ్ఞానములేనివాడై ( జ్ఞానము కలవాడై)
సర్వపాపైః ప్రముచ్యతే- సమస్త పాపములనుంచి విడువబడుచున్నాడు

శ్లోక తాత్పర్యము:

"ఎవరు నన్ను పుట్టుకలేనివానినిగా, ఆదిలేనివానిగా, లోకములకు ఈశ్వరునిగా తెలిసికొందురో,
అట్టి వాడు మనుష్యులలో జ్ఞానముకలవాడై, సమస్త పాపములనుంచి విడువబడుచున్నాడు."|| 3||

అంటే ఇక్కడ, "సర్వపాపైః ప్రముచ్యతే" అంటే సమస్తపాపములనుండి విడువబడును అంటూ, మానవుడు పాపములనుంచి బయటపడే మార్గము, భగవంతుని నిజస్వరూపము తెలిసికొనగలగడమే అని చెపుతున్నాడు. ఇది విన్నమాటే అయినా మళ్ళీ మళ్ళీ వినవలసిన మాట..

శ్లోకము 4

బుద్ధిర్‍జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమశ్శమః|
సుఖం దుఃఖం భవోఽభావో భయం చ అభయమేవ చ||4||

స|| బుద్ధిః జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవః అభావః భయం చ అభయం ఏవ చ ( మత్త ఏవ భవన్తి)|| 4||

ప్రతిపదార్థాలు:

బుద్ధిః జ్ఞానం అసమ్మోహః -
బుద్ధి, జ్ఞానము, మోహము లేకుండా వుండడము,
క్షమా సత్యం దమః శమః -
ఓర్పు , సత్యము, బాహ్య ఇంద్రియనిగ్రహము , అంతరింద్రియ నిగ్రహము
సుఖం దుఃఖం భవః అభావః -
సుఖము దుఃఖము, పుట్టుక నాశనము,
భయం చ అభయమేవ చ-
భయము, భయము లేకుండుట,
(మత్త ఏవ భవన్తి- నావలననే కలుగుచున్నవి)

శ్లోక తాత్పర్యము:

బుద్ధి, జ్ఞానము, మోహము లేకుండా వుండడము,
ఓర్పు , సత్యము, బాహ్య ఇంద్రియనిగ్రహము , అంతరింద్రియ నిగ్రహము
సుఖము దుఃఖము, పుట్టుక నాశనము, భయము, భయము లేకుండుట,
(ఇవన్నీ నా వలననే కలుగుచున్నవి)||4||

ఇక్కడ నాలుగొవ శ్లోకము ఐదవ శ్లోకములలో చెప్పే మనప్రకృతికి సంబంధించిన గుణములన్నీ తనవలనవచ్చినవే, - 'మత్త ఏవ భవన్తి'- అని భగవంతుని ఉపదేశము.

శ్లోకము 5

అహింసా సమతా తుష్టిః తపో దానం యశోఽయశః|
భవన్తి భావా భూతానాం మత్తఏవ పృథగ్విధాః||5||

స|| అహింసా సమతా తుష్టిః తపః దానం యశః అయశః భూతానాం పృథక్విధాః ( నానావిథాః) భావాః మత్త ఏవ భవన్తి ||5||

ప్రతిపదార్థాలు:

అహింసా సమతా తుష్టిః - అహింస, సమత్వము, సంతుష్ఠి
తపః దానం యశః అయశః - తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి
భూతానాం పృథక్విధాః ( నానావిథాః) భావాః -
ప్రాణులయొక్క అనేక విధములైన భావములు,
మత్త ఏవ భవన్తి -
నావలననే కలుగుచున్నవి.

శ్లోకతాత్పర్యము:

"అహింస, సమత్వము, సంతుష్ఠి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి,
ప్రాణులయొక్క అనేక విధములైన భావములు, నావలననే కలుగుచున్నవి." ||5||

ఇక్కడ కృష్ణుడు చెప్పినది, ప్రాణుల సమత్వము అసమత్వము భగవంతుని వలననే కలుగుచున్నవి అన్నమాట. అవి ముందు చెప్పిన భగవంతునియొక్క "అపరా ప్రకృతి" వలననే కలిగినవి అని అర్థము అవుతుంది. ఆ ప్రకృతి మన స్వభావము. దానిని అదుపులో వుండడానికి కావలసి బుద్ధి మన దగ్గరనే వుంది. భగవంతుడు "నావలననే" అన్నమాటలో, మనవలనే అన్నమాట స్ఫురిస్తే, మనలోనే భగవంతుడు ఉన్నాడు అన్న ఉపనిషదుల మహావాక్యము మనకి తెలిసినట్లే.

శ్లోకము 6

మహర్షయస్సప్త పూర్వే చత్వారో మనవస్తథా|
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః||6||

స|| లోకే ఇమాః ప్రజాః యేషాం ( సంతతిః) పూర్వే సప్త మహర్షయః తథా చత్వారః( సనకాదయః) మనవః (తే) మద్భావాః మానసా జాతాః||

ప్రతిపదార్థాలు:

లోకే ఇమాః ప్రజాః - లోకములో ఈ ప్రజలు
యేషాం ( సంతతిః) - ఎవరి సంతతి యో అట్టి
పూర్వే సప్త మహర్షయః - పూర్వీకులైన ఏడుగురు మహర్షులు
తథా చత్వారః మనవః -
అలాగే నలుగురు మనువులు
తే మద్భావాః మానసా జాతాః-
వారందరు నా మనస్సంకల్పము వలన పుట్టిన వారే.

శ్లోకతాత్పర్యము:

"లోకములో ఈ ప్రజలు, ఎవరి సంతతి యో అట్టి పూర్వీకులైన ఏడుగురు మహర్షులు, అలాగే నలుగురు మనువులు, వారందరు నా మనస్సంకల్పము వలన పుట్టిన వారే."||6||

సప్త మహర్షులు సనకాదులు మనువులు పదునలుగురున్నూఅదిపురుషునివలనే వలననే పుట్టిరి. అంటే సమస్త ప్రజానీకము అదిపురుషుని ద్వారా వచ్చినదే. ఏ జాతికి మతమునకు వర్ణమునకు చెందినవారైనను మహర్షులసంతానమని మహర్షుల రక్తము అందరియందు ప్రవహించు చున్నదనీ పరమశాంతిని పొందవచ్చును, పొందవలెను కూడా. అందరూ మా పూర్వీకులు మహర్షులు మనువులు సనకాదులని ఘంటాపధముగా చెప్పుకొనవచ్చును.

శ్లోకము 7

ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః|
సోఽవికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః||7||

స||మమ ఏతాం విభూతిం యోగం చ యః వేత్తి తత్త్వతః సః అవికంపేన యోగేన యుజ్యతే | అత్ర సంశయః నాస్తి ||7||

ప్రతిపదార్థాలు:

మమ ఏతాం విభూతిం - నాయొక్క ఈ ఐశ్వర్యమును
యోగం చ - యోగము కూడా
యః వేత్తి తత్త్వతః - - ఎవరు యదార్థముగా తెలిసికొనుచున్నారో,
సః అవికంపేన యోగేన యుజ్యతే - అతడు చలింపని యోగముతో కూడుకొనుచున్నాడు.
అత్ర సంశయః నాస్తి - దీనిలో ఏ మాత్రము సంశయము లేదు.

శ్లోకతాత్పర్యము:

"నాయొక్క ఈ ఐశ్వర్యమును, యోగము కూడా, ఎవరు యదార్థముగా తెలిసికొనుచున్నారో,
అతడు చలింపని యోగముతో కూడుకొనుచున్నాడు. దీనిలో ఏ మాత్రము సంశయము లేదు."||7||

ఇక్కడ ఐశ్వర్యము అంటే మహిమ. భగవంతుడు గురించి ఏడవ అధ్యాయములో విన్నది- "బీజం మాం సర్వ భూతానాం విద్ధి పార్థ సనాతనమ్"(7.10) అంటే సమస్త ప్రాణులలో వున్న బీజము తనే అని. సమస్తప్రాణులలో వున్న బీజము బ్రహ్మమే అన్న యదార్థము ఎఱిగిన వాడు సమస్తప్రాణులతో సమత్వముతో వర్తిస్తాడు. అట్టివాడు , "సమత్వం యోగముచ్యతే" అన్నమాటతో, యోగము తద్వారా బ్రహ్మసాక్షాత్కారము పొందుతాడు. దానిలో సందేహము లేదు, అని ఇక్కడ కృష్ణభగవానుడు మళ్ళీ చెప్పుచున్నాడు.

శ్లోకము 8

అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే|
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితాః||8||

స|| అహం సర్వస్య ప్రభవః | మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా బుధాః భావ సమన్వితాః మామ్ భజన్తే||8||

ప్రతిపదార్థాలు:

అహం సర్వస్య ప్రభవః - నేను సమస్త జగత్తుయొక్క ఉత్పత్తికి కారణము,
మత్తః సర్వం ప్రవర్తతే - నా వలన సర్వము ప్రవర్తించుచున్నది
ఇతి మత్వా బుధాః - అని తెలిసికొని బుధులు
భావ సమన్వితాః - సత్య భావముతో కూడినవారై
మామ్ భజన్తే- నన్ను పూజించుచున్నారు.

శ్లోకతాత్పర్యము:

"నేను సమస్త జగత్తుయొక్క ఉత్పత్తికి కారణము, నా వలన సర్వము ప్రవర్తించుచున్నది ,
అని తెలిసికొని బుధులు సత్య భావముతో కూడినవారై నన్ను పూజించుచున్నారు."||8||

భగవత్ తత్త్వము, భగవంతుని విభూతి బాగుగా తెలిసినప్పుడు, అంటే భగవంతుడే సమస్త జగత్తు కి కారణభూతుడు అని, భగవంతుని వలననే సమస్త జగత్తు ప్రవర్తించుచున్నది అని ఎఱిగినప్పుడు, భగవంతునిపై శ్రద్ధ భక్తులు మరింత పఠిష్ఠమౌతాయి. అదే ఈ శ్లోకములో చెప్పబడిన మాట.

శ్లోకము 9

మచ్ఛిత్తా మద్గతాప్రాణా బోధయన్తః పరస్పరమ్|
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ||9||

స|| తే మచ్చిత్తా మద్గతప్రాణాః మామ్ పరస్పరం బోధయన్తః కథయన్తః చ నిత్యం త్తుష్యంతి రమన్తి చ ||9||

ప్రతిపదార్థాలు:

మచ్చిత్తా - నాయందు చిత్తము కలవారు,
మద్గతప్రాణాః- నన్ను పొందిన ప్రాణము కలవారు
మామ్ పరస్పరం బోధయన్తః - నన్ను గురించి ఒకరికొకరు బోధించుకొనుచు
కథయన్తః చ - చెప్పుకొనుచు
నిత్యం తుష్యన్తి చ రమన్తి చ -
ఎల్లప్పుడు సంతృ ప్తి చెందుచున్నారు ఆనందించుచున్నారు కూడా .

శ్లోకతాత్పర్యము:

"నాయందు చిత్తము కలవారు, నన్ను పొందిన ప్రాణము కలవారు, నన్ను గురించి ఒకరికొకరు బోధించుకొనుచు,
చెప్పుకొనుచు, ఎల్లప్పుడు సంతృప్తి చెందుచున్నారు ఆనందించుచున్నారు కూడా" ||9||

సాధకులు ఎలా ప్రవర్తిస్తారు అన్నది ఈ శ్లోకములో భగవంతుని ద్వారా వింటాము. సాధకులు పరస్పరము అధ్యాత్మిక చింతన గురించి పరస్పరము మాట్లాడుకొనుచు, బోధించుకొనుచు ఉండవలెను అన్నమాట. నిరంతరము ఆధ్యాత్మిక చింతనతో మనస్సు నిర్మలమౌతుంది. అదే సంతృప్తి ఆనందమునకు దారి.

"నిత్యం తుష్యన్తి చ రమన్తి చ" - ఎల్లప్పుడు సంతృ ప్తి చెందుచున్నారు ఆనందించుచున్నారు అన్నమాటలో భగవంతుని మహిమ తెలిసిన వారికి కలిగే అనుభూతి, సంతృప్తి, ఆనందము అన్నమాట.!


శ్లోకము 10

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతి పూర్వకమ్|
దదామి బుద్ధి యోగం తం యేన మాముపాయాన్తి తే||10||

స|| సతతయుక్తానాం ప్రీతిపూర్వకమ్ ( మాం) భజతాం తేషాం యేన తే మామ్ ఉపయాన్తి తం బుద్ధియోగమ్ దదామి||10||

ప్రతిపదార్థాలు:
సతతయుక్తానాం- ఎల్లప్పుడు భగవత్ ధ్యాసలో వుండి
ప్రీతిపూర్వకమ్ భజతాం - ప్రీతితో భజించునట్టి
తేషాం- వారికి
యేన తే మామ్ ఉపయాన్తి - దేని చేత వారు నన్ను పొందగలరో
తం బుద్ధియోగమ్ దదామి- అటువంటి బుద్ధియోగము ఇచ్చుచున్నాను.

శ్లోకతాత్పర్యము:

"ఎల్లప్పుడు భగవత్ ధ్యాసలో వుండి, ప్రీతితో భగవంతుని భజించునట్టి వారికి,
దేని చేత వారు నన్ను పొందగలరో అటువంటి బుద్ధియోగము ఇచ్చుచున్నాను."||10||

అంటే అట్టివారికి భగవంతుడు బుద్ధి యోగము అంటే జ్ఞానయోగము "ప్రసాదించుచున్నాను" అంటాడు. ఎందుకు ఎలా అన్నది 11వ శ్లోకములో వింటాము.

శ్లోకము 11

తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః|
నాశయామ్యాత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వతా||11||

స|| తేషాం అనుకంపార్థమ్ అహమేవ ఆత్మభావస్థః భాస్వతా జ్ఞానదీపేన అజ్ఞానజం తమః నాశయామి||

ప్రతిపదార్థము:

తేషాం అనుకంపార్థమ్ - వారికి అనుగుణముగా ప్రవర్తించుటకు
అహమేవ ఆత్మభావస్థః - నేనే వారి అంతఃకరణ యందు నిలిచినవాడనై
భాస్వతా జ్ఞానదీపేన - ప్రకాశించుచున్న జ్ఞాన దీపముతో
అజ్ఞానజం తమః నాశయామి- అజ్ఞానముతో కూడిన తమస్సుని నాశనము చేయుచున్నాను.

శ్లోక తాత్పర్యము:

"వారికి అనుగుణముగా ప్రవర్తించుటకు, నేనే వారి అంతఃకరణ యందు నిలిచినవాడనై
ప్రకాశించుచున్న జ్ఞాన దీపముతో, అజ్ఞానముతో కూడిన తమస్సుని నాశనము చేయుచున్నాను."||11||

ఇది భక్తులమీద వున్న ప్రేమతో, దయతో భగవానుడు జ్ఞానయోగము ప్రసాదిస్తున్నాడన్నమాట. ఇక్కడ భక్తులు ఎలాంటివారు అన్నది, "మచ్చిత్తా మద్గతా ప్రాణా" అన్నమాటలో మనకి తెలుస్తుంది. అంటే ఆ భక్తులు భగవంతునిపై మనస్సు కలవారు, భగవంతునిపై ప్రాణములు నిలుపుకున్నవారు. అట్టివారికి భగవంతుడు జ్ఞానయోగము ప్రసాదిస్తున్నడన్నమాట.

ఇక్కడ తెలిసికొనవలసిన మాట. అజ్ఞానమును నశింపచేయటమే జ్ఞానయోగము ప్రసాదించే మార్గము.

శ్లోకము 12

అర్జున ఉవాచ

పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాది దేవమజం విభుమ్||12||

స|| భవాన్ పరం బ్రహ్మ పరంధామ పరమం పవిత్రం త్వామ్ శాశ్వతం దివ్యం పురుషం ఆదిదేవం అజం విభుం||12||

ప్రతిపదార్థము:

భవాన్ పరం బ్రహ్మ పరంధామ - నీవు పర బ్రహ్మవు. పరంధాముడవు.
పరమం పవిత్రం త్వామ్ - పరమపవిత్రుడవు అయిన నిన్ను,
శాశ్వతం దివ్యం పురుషం - శాశ్వతమైన వాడివిగా, ప్రకాశ స్వరూపునిగను, పరమ పురుషునివిగను
ఆదిదేవం - దేవతాదులలో మొదటివాడివిగను
అజం విభుం- పుట్టుకలేనివానిగా , సర్వవ్యాపకునిగా
( అందరూ చెప్పుచున్నారు.)

శ్లోక తాత్పర్యము:

అర్జునుడు చెప్పుచున్నాడు:
" నీవు పర బ్రహ్మవు. పరంధాముడవు. పరమపవిత్రుడవు అయిన నిన్ను,
శాశ్వతమైన వాడివిగా, ప్రకాశ స్వరూపునిగను, పరమ పురుషునివిగను, దేవతాదులలో మొదటివాడివిగను
పుట్టుకలేనివానిగా , సర్వవ్యాపకునిగా ( చెప్పుచున్నారు.)"||12||

శ్లోకము 13

అహుస్త్వాం ఋషయస్సర్వే దేవర్షిర్నారదస్తథా|
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే||13||

స|| సర్వే ఋషయః దేవర్షిః నారదః అసితః దేవలః వ్యాసః ఆహుః| స్వయం చ తథా ఏవ మే బ్రవీషి||

ప్రతిపదార్థము:

సర్వే ఋషయః దేవర్షిః నారదః - సమస్త ఋషులు అందరూ, దేవర్షి నారదుడు
అసితః దేవలః వ్యాసః ఆహుః- అసితుడు, దేవలుడు, వ్యాసుడు, చెప్పుచున్నారు.
స్వయం చ - స్వయముగా (నీవు) కూడా
తథా ఏవ మే బ్రవీషి- అవిధముగా చెప్పుచున్నావు.

శ్లోక తాత్పర్యము:

" ( నీవు పరబ్రహ్మవు పరంధాముడవని.. , ) సమస్త ఋషులు అందరూ, దేవర్షి నారదుడు అసితుడు, దేవలుడు, వ్యాసుడు, చెప్పుచున్నారు
స్వయముగా (నీవు) కూడా అవిధముగా చెప్పుచున్నావు." ||13||

ఇక్కడ 12 13 శ్లోకాలు కలిపి చదవాలి. ఇవి అర్జునుడు పలికిన మాటలు. ఇప్పటిదాకా మహర్షులు చెప్పినమాటే నువ్వు చెపుతున్నావు అని కృష్ణుడిని సంభోధిస్తూ అర్జునుడు చెపుతాడు. ఇది పూర్తిగా నమ్మకము కలిగిన శిష్యుడు గురువునకు చెపుతున్నమాట.

శ్లోకము 14

సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ|
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః||14||

స||హే కేశవా! యత్ మామ్ వదసి ఏతత సర్వం ఋతమ్ ( సత్యం) మన్యే| భగవన్ తే వ్యక్తిం దేవాః న విదుః | దానవాః చ న హి ( విదుః)||

ప్రతిపదార్థము:

యత్ మామ్ వదసి - ఏది నాకు చెప్పుచున్నావో
ఏతత సర్వం ఋతమ్ మన్యే - అది అంతా సత్యము అని తలచుచున్నాను.
భగవన్ తే వ్యక్తిం - ఓ భగవాన్ నీ వ్యక్తిత్వ స్వరూపమును
దేవాః న విదుః - దేవతలకు తెలియదు.
దానవాః చ న హి ( విదుః)- దానవులకుకూడా తెలియదు.

శ్లోక తాత్పర్యము:

"ఓ కేశవా , ఏది నాకు చెప్పుచున్నావో అది అంతా సత్యము అని తలచుచున్నాను.
ఓ భగవాన్, నీ వ్యక్తిత్వ స్వరూపమును దేవతలకు తెలియదు.
దానవులకు కూడా తెలియదు." ||14||

శ్లోకము 15

స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ|
భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే||15||

స|| పురుషోత్తమా ! భూతభావన భూతేశ దేవ దేవ జగత్పతే త్వం ఆత్మానం ఆత్మనా స్వయం ఏవ వేత్థ ||

ప్రతిపదార్థము:

భూతభావన - సమస్తప్రాణులను సృష్టించువాడా
భూతేశ- సమస్త ప్రాణులకు ఈశ్వరుడా
దేవ దేవ జగత్పతే - దేవతలకు దేవుడైనవాడా, జగత్తును పాలించువాడా,
త్వం ఆత్మానం - నీవు నీ స్వరూపమును
ఆత్మనా స్వయం ఏవ వేత్థ - నీవే స్వయముగా ఎరుగుదువు.

శ్లోక తాత్పర్యము:

"ఓ పురుషోత్తమా , సమస్తప్రాణులను సృష్టించువాడా, సమస్త ప్రాణులకు ఈశ్వరుడా
దేవతలకు దేవుడైనవాడా, జగత్తును పాలించువాడా,
నీవు నీ స్వరూపమును నీవే స్వయముగా ఎరుగుదువు."||15||

 

శ్లోకము 16

వక్తుమర్హస్యశేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః|
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి||16||

స|| హి యాభిః విభూతిః త్వం ఇమాన్ లోకాన్ వ్యాప్య తిష్టసి (తాన్) దివ్యాః విభూతయః అశేషేణ వక్తుం అర్హసి ||16||

ప్రతిపదార్థము:

యాభిః విభూతిః - ఏ విభూతులచేత
త్వం ఇమాన్ లోకాన్ వ్యాప్య తిష్టసి -
నీవు ఈ లోకములనో వ్యాపించి వున్నావో
(తాన్) దివ్యాః విభూతయః- ఆ దివ్యమైన విభూతులను
అశేషేణ వక్తుం అర్హసి - సంపూర్ణముగా చెప్పుటకు తగుదువు.

శ్లోక తాత్పర్యము:
" ఏ విభూతులచేత , నీవు ఈ లోకములనో వ్యాపించి వున్నావో
ఆ దివ్యమైన విభూతులను సంపూర్ణముగా చెప్పుటకు తగుదువు."||16||

శ్లోకము 17

కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్|
కేషు కేషు చ భావేషు చిన్త్యోఽసి భగవన్మయా||17||

స|| యోగిన్ ! అహం సదా కథం పరిచిన్తయన్ త్వాం విద్యాం ? భగవన్ కేషు కేషు భావేషు చ చిన్త్యః అపి||17||

ప్రతిపదార్థము:

అహం సదా కథం పరిచిన్తయన్ - నేను ఎల్లప్పుడూ ఏవిధముగా ధ్యానించుచూ
త్వాం విద్యాం - నిన్ను తెలిసికొన గలను.
కేషు కేషు భావేషు - ఏ ఏ భావములతో
చిన్త్యః అపి- ధ్యానింప తగినవాడవు.

శ్లోక తాత్పర్యము :

"ఓ యోగీశ్వరా, నేను ఎల్లప్పుడూ ఏ విధముగా ధ్యానించుచూ, నిన్ను తెలిసికొన గలను?
నీవు ఏ ఏ భావములతో ధ్యానింప తగినవాడవు?"||17||

శ్లోకము 18

విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన|
భూయం కథయ తృప్తిర్హి శ్రుణ్వతో నాస్తి మేఽమృతమ్||18||

స|| హే జనార్దన ! ఆత్మనః యోగం విభూతిం చ విస్తరేణ భూయః కథయ | హి అమృతం శృణ్వతః మే తృప్తిః నాస్తి||18||

ప్రతిపదార్థము:

ఆత్మనః యోగం విభూతిం - నీ యొక్క యోగమహిమను విభూతులను
విస్తరేణ భూయః కథయ - విస్తారముగా మళ్ళీ చెప్పుము.
అమృతం శృణ్వతః - అమృతవాక్కును వినుచున్న
మే తృప్తిః నాస్తి- నాకు సంతృప్తి కలుగుటలేదు.

శ్లోక తాత్పర్యము:

"నీ యొక్క యోగమహిమను విభూతులను విస్తారముగా మళ్ళీ చెప్పుము.
ఏల అనగా , అమృతవాక్కును వినుచున్న నాకు సంతృప్తి కలుగుటలేదు."||18||

ఇప్పటి దాకా కర్మయోగము జ్ఞానయోగము, మోక్షసన్యాస యోగము విజ్ఞానయోగము రాజవిద్యా రాజగుహ్యయోగము గురించి వినిన అర్జునుడు కృష్ణుడే పరబ్రహ్మమూ, కృష్ణుడు చెప్పినది అంతా నమ్ముతున్నానని చెప్పి, నిరంతర ఆత్మ దృష్టికొరకు భగవంతునియొక్క మహిమ గురించిన అంటే ఆ భగవద్విభూతి గురించి విజ్ఞానము సహాయకారిగా నుండగలదు అని తెలిసికొని, ఆ మహిమ గురించి చెప్పమని భగవంతుని ప్రార్థిస్తాడు.

సామాన్యముగా అధ్యాత్మిక చింతన ఒక క్షణములో పుట్టే ఆలోచనకాదు. ప్రారంభస్థితిలో భక్తుడు భగవత్సంబంధమైన మూర్తిమీద గాని పవిత్ర వస్తువు మీదా గాని తన మనస్సు కేంద్రీకరించ వలెను. క్రమముగా ధ్యానము అభ్యసించి, ధ్యానముతో చిత్తశుద్ధి ఏకాగ్రత పొందవలెను. పిమ్మట నిరాకార నిర్గుణ తత్త్వము గురించి విచారించవచ్చు. ఈ మార్గములో పోవడానికి భగవంతుని మహిమల జ్ఞానము అవసరము. ఇక్కడ అర్జునిని ప్రార్థన అదే.

శ్లోకము 19

శ్రీ భగవానువాచ||

హన్త తే కథయిష్యామి దివ్యాః ఆత్మ విభూతయః|
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే||19||

స||కురుశ్రేష్ఠ! హన్త దివ్యాః ఆత్మ విభూతయః ప్రాధాన్యతః కథయిష్యామి ! హి మే విస్తరస్య (విభూతి) అన్తః నాస్తి||19||

ప్రతిపదార్థము:

దివ్యాః ఆత్మ విభూతయః - దివ్యమైన నా యొక్క విభూతులను
ప్రాధాన్యతః కథయిష్యామి - ప్రాధాన్యతను అనుసరించి చెప్పెదను.
హి మే విస్తరస్య (విభూతి) - ఏలయనగా నా విస్తరమైన (విభూతులు)
అన్తః నాస్తి - అంతము లేదు.

శ్లోక తాత్పర్యము:

భగవానుడు చెప్పెను:
"ఓ కురుశ్రేష్ఠా, దివ్యమైన నా యొక్క విభూతులను ప్రాధాన్యతను అనుసరించి చెప్పెదను.
ఏలయనగా నా విస్తరమైన విభూతులకు అంతము లేదు."||19||

ఇక్కడ అర్జునునిలో ఆసక్తి రేకెత్తించిన కృష్ణుడు, అంతము లేని - "నాస్త్యన్తో" - తన మహిమ గురించి అర్జునునికి చెప్పుతాడు. అంటే ముందుగానే కృష్ణుడు తన మహిమ అంతము లేనిది అని. అలాంటి అంతములేని మహిమ అంతా చెప్పడమన్నది కష్టము కనుక, ప్రాధన్యతను అనుసరించి చెపుతాను విను అని చెప్పి తన విభూతి గురించి విస్తరిస్తాడు.

శ్లోకము 20

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ||20||

స|| గుడాకేశ! సర్వభూతాశయస్థితః ఆత్మా అహం ఏవ| భూతానాం ఆదిః చ మధ్యం చ అన్తః ఏవ చ అహం అస్మి||20||

ప్రతిపదార్థము:

సర్వభూతాశయస్థితః ఆత్మా- సమస్త భూతముల హృదయములో వున్న ఆత్మ
అహం ఏవ- నేనే
భూతానాం ఆదిః చ - సమస్త భూతముల ఆదియు,
మధ్యం చ అన్తః ఏవ చ - మధ్యమును అలాగే అంతమును
అహం అస్మి- నేనే

శ్లోక తాత్పర్యము:

"ఓ గుడాకేశా , సమస్త భూతముల హృదయములో వున్న ఆత్మ నేనే.
సమస్త భూతముల ఆదియు, మధ్యమును అలాగే అంతమును కూడానేనే."||20||

"ఓ అర్జునా సమస్త ప్రాణులయొక్క హృదయమందున్న ఆత్మను నేనే. ప్రాణులయొక్క అది మధ్య అంతములు కూడా నేనే" అని చెప్పడములో, ఉపనిషత్తులద్వారా జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న విషయము కృష్ణుడు ప్రప్రథమంలో ఒక్కమాటలో చెప్పాడన్నమాట. పరమాత్మ అంటే ఇంకెక్కడో వెదకనక్కరలేదు అది మన హృదయములో ఉన్న ఆత్మయే పరమాత్మ స్వరూపము. ఇది ప్రాధాన్యత ప్రకారము మొదటి మాట. ఇది చెప్పినతరువాత మిగలిన విషయాలు అనవసరమేమో అనిపించవచ్చు. నిజానికి మిగిలినవన్నీ ఆ సిద్ధాంతానికి ఉపసిద్ధాంతములు పరిణామములు అనుకోవచ్చు.

ఇంకోమాట. ఇక్కడ సమస్త భూతముల ఆది అంటే సృష్ఠి, మధ్యము అంటే స్థితిని జరిపించువాడు, అంతము అంటే లయము, అంటే సృష్ఠి స్థితి లయములు అన్నీ కూడా పరబ్రహ్మమే అని భావము.

శ్లోకము 21

అదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్|
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణాంమహం శశీ||21||

స|| అహమ్ అదిత్యానాం విష్ణుః | జ్యోతిషాం అంశుమాన్ రవిః| మరుతామ్ మరీచిః|అహం నక్షత్రాణాం శశీ||21||

ప్రతిపదార్థము:

అహమ్ అదిత్యానాం విష్ణుః - నేను ఆదిత్యులలో విష్ణువును.
జ్యోతిషాం అంశుమాన్ రవిః - ప్రకాశింపచేయు వారిలో కిరణములు గల సూర్యుడను.
మరుతామ్ మరీచిః - మరుత్తులను దేవతలలో మరీచిని.
అహం నక్షత్రాణాం శశీ - నేను నక్షత్రములలో చంద్రుడను.

శ్లోక తాత్పర్యము:

"నేను ఆదిత్యులలో విష్ణువును.
ప్రకాశింపచేయు వారిలో కిరణములు గల సూర్యుడను
మరుత్తులను దేవతలలో మరీచిని.
నేను నక్షత్రములలో చంద్రుడను." ||21||

ఇక్కడ ఆదిత్యులలో అంటే అదితి పుత్రులు పన్నెండు మందిలో అని. అదితి పుత్రులు ధాత, మిత్రుడు, అర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశువు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు మున్నగువారు అదితి పుత్రులు.

మరుత్తులలో అంటే ఏడుగురు మరుత్తులలో అని అర్థము. అవహుడు, ప్రవహుడు, నివహుడు,ప్రాహుడు, ఉద్వహుడు, సంవహుడు, పరివహుడు మున్నగు వారు ఏదుగురు మరుత్తులు.

 

శ్లోకము 22

వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః|
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానమపి చేతనా||22||

స|| వేదానాం సామవేదః అస్మి| దేవానాం వాసవః అస్మి| ఇన్ద్రియాణాం మనః చ| భూతానాం చేతనా అస్మి||

ప్రతిపదార్థము:

వేదానాం సామవేదః అస్మి - వేదములలో సామవేదము అయివున్నాను
దేవానాం వాసవః అస్మి - దేవతలలో ఇంద్రుడను అయివున్నాను
ఇన్ద్రియాణాం మనః చ - ఇంద్రియములలో మనస్సు
భూతానాం చేతనా అస్మి -ప్రాణులలో వాటి చైతన్యము అయివున్నాను.

శ్లోక తాత్పర్యము:

"వేదములలో సామవేదము అయివున్నాను
దేవతలలో ఇంద్రుడను అయివున్నాను
ఇంద్రియములలో మనస్సు,
ప్రాణులలో వాటి చైతన్యము అయివున్నాను." || 22||

ఇంద్రుడు దేవతలలో ముఖ్యుడు. ఋగ్వేద కాలములో ఇంద్రుడే ముఖ్యమైన దేవత. ఋగ్వేదములో ఇంద్రుడి మీద అందరికన్న ఎక్కువ సూక్తములు ( 250) వున్నాయి. ద్వాపరయుగములో ప్రజలు ఇంద్రుడికి పూజలు చేసేవారు. భాగవతములో గోవర్థనపర్వత ఎత్తడములో కృష్ణుడు ప్రజలకు చెప్పినది ఇంద్రుడు ముఖ్యము కాదు అని.

శ్లోకము 23

రుద్రాణాం శంకరశ్చాస్మి మేరుశ్శిఖరిణామహమ్|
వుసూనాం పావకశ్చాస్మి మేరుశ్శిఖరిణామహమ్|| 23||

స|| (అహం) రుద్రాణాం శంకరః అస్మి| యక్షరక్షసామ్ విత్తేశః | శిఖరిణామ్ మేరుః అస్మి||23||

ప్రతిపదార్థము:

రుద్రాణాం శంకరః అస్మి - రుద్రులలో శంకరుడను
యక్ష రక్షసామ్ విత్తేశః - యక్షులలో రాక్షసులలో నేను- కుబేరుడను.
వసూనాం పావకః చ - వసువులలో అగ్నిని
శిఖరిణామ్ మేరుః అస్మి -శిఖరములలో నేను మేరు పర్వతము అయి వున్నాను.

శ్లోక తాత్పర్యము:

"రుద్రులలో శంకరుడను
యక్షులలో రాక్షసులలో నేను కుబేరుడను
వసువులలో అగ్నిని
శిఖరములలో నేను మేరు పర్వతము అయి వున్నాను."||23||

రుద్రులు అంటే ఏకాదశ రుద్రులు అని. అంటే పదకొండుమంది రుద్రులు అని. ఆ పదకొండు - హరుడు , బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషా కపి, శంభువు, కపర్ది, రైవతుడు, మృగవయాధుడు, శర్వుడు, కపాలి .

వసువులు అంటే అష్టవసువులు అని. అంటే ఎనిమిదిమంది వసువులు అన్నమాట. ధరుడు, ధృవుడు, సోమరుడు, అహుడు, అనిలుడు, అనలుడు,ప్రత్యూషుడు, ప్రభాసుడు ఎనిమిదిమంది వసువులు.

శ్లోకము 24

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్||
సేనానీమహం స్కన్దః సరసామస్మి సాగరః||24||

స|| హే అర్జునా! పురోధసాం ముఖ్యం బృహస్పతిం చ మామ్ విద్థి| అహం సేనానీనాం స్కన్ధః | సరసాం సాగరః అస్మి||24||

ప్రతిపదార్థము:
పురోధసాం ముఖ్యం - పురోహితులలో ముఖ్యుడు అయిన
బృహస్పతిం చ మామ్ విద్థి- బృహస్పతిగా నన్ను తెలిసికొనుము.
అహం సేనానీనాం స్కన్ధః - నేను సేనాపతులలో స్కంధుడను.
సరసాం సాగరః అస్మి- సరస్సులలో సాగరుడను,

శ్లోక తాత్పర్యము:

" ఓ అర్జునా, పురోహితులలో ముఖ్యుడు అయిన బృహస్పతిగా నన్ను తెలిసికొనుము.
నేను సేనాపతులలో స్కంధుడను.
సరస్సులలో సాగరుడను."||24||

శ్లోకము 25

మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్|
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః||25||

స|| మహర్షీణాం అహం భృగుః అస్మి| గిరాం ఏకం అక్షరమ్ అస్మి| యజ్ఞానాం జప యజ్ఞః అస్మి | స్థావరాణాం హిమాలయః అస్మి||25||

ప్రతిపదార్థము:

మహర్షీణాం భృగురహం - మహర్షులలో భృగుమహర్షిని,
గిరాం ఏకం అక్షరమ్ అస్మి- వాక్కులో ఒక అక్షరము ( అగు ఓం కారమును )
యజ్ఞానాం జప యజ్ఞః అస్మి - యజ్ఞములలో జప యజ్ఞమును.
స్థావరాణాం హిమాలయః అస్మి- స్థిర ప్రదేశములలో హిమాలయమును.

శ్లోక తాత్పర్యము:

"ఓ పార్థా, మహర్షులలో భృగుమహర్షిని,
వాక్కులో ఒక అక్షరము ( అగు ఓం కారమును )
యజ్ఞములలో జప యజ్ఞమును.
స్థిర ప్రదేశములలో హిమాలయమును"||25||

అక్షరపరబ్రహ్మయోగములో ,"ఓమిత్యేకాక్షరం బ్రహ్మన్ వ్యాహరన్ మామ్ అనుస్మరన్"(8.13) అంటూ చెప్పడమైనది. "ఓమ్ కారము" తనే చెప్పడములో ఓమ్కారమునకు గల ప్రాముఖ్యత మనకి తెలుస్తుంది. సమస్త మంత్రములకు అది ప్రాణము. సమస్త వేదాలకి అదే సారము. కథోపనిషత్తులో కూడా యముడు నాచికేతునికి ఇదే మాట చెపుతాడు.

అన్ని యజ్ఞములలో జపము , అంటే అట్టహాసముగా చేయబడే యజ్ఞాలకన్నా, చిత్తశుద్ధి కలిగించే సులభమైన జపమునే , జప యజ్ఞము అంటూ అదే తను అని చెప్పడములో కృష్ణుడు, జపమునకు ప్రాముఖ్యత కలిగించాడు. దీని అర్థము జపము సాక్షాత్ భవత్స్వరూపము.

శ్లోకము 26

అశ్వత్థః సర్వ వృక్షణాం దేవర్షీణాం చ నారదః|
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః||26||

స|| అహం సర్వవృక్షాణాం అశ్వత్థః దేవర్షీణాం నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలః మునిః ||26||

ప్రతిపదార్థము:

అహం సర్వవృక్షాణాం అశ్వత్థః - నేను వృక్షములలో రావి చెట్టును.
దేవర్షీణాం నారదః - దేవఋషులలో నారదుడను
గంధర్వాణాం చిత్రరథః - గంధర్వులలో చిత్రరథుడను
సిద్ధానాం కపిలః మునిః -సిద్ధులలో కపిల మునిని.

శ్లోక తాత్పర్యము:

"నేను వృక్షములలో రావి చెట్టును.
దేవఋషులలో నారదుడను.
గంధర్వులలో చిత్రరథుడను.
సిద్ధులలో కపిల మునిని."||26||

అశ్వత్థ వృక్షము కథోపనిషత్తులో కూడా వస్తుంది. ఆశ్వత్థ వృక్షము గురించి చాలా పురాణాలలో చెప్పబడినది. పురాణాలలో "మూలే విష్ణుః స్థితో నిత్యం " అంటూ, ఈ చెట్టు మూలములో విష్ణువు, బొదెయందు కేశవుడు, కొమ్మలలో నారాయణుడు, ఆకులలో శ్రీహరి, ఫలములలో అచ్యుతుడు, సమస్త దేవతలతో కూడి విరాజిల్లుచుండును అని చెప్పబడినది. ఈ ఆశ్వత్థ వృక్షము గురించి పురుషొత్తమ ప్రాప్తి యోగములో మళ్ళీ వింటాము.

శ్లోకము 27

ఉచ్ఛైశ్శ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్|
ఇరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్||27||

స|| అశ్వానాం అమృతోద్భవమ్ఉచ్ఛైశ్రవసమ్ | గజేంద్రాణాం ఇరావతమ్|నరాణాం నరాధిపమ్ మాం విద్థి||27||

ప్రతిపదార్థము:

అశ్వానాం - అశ్వములలో
అమృతోద్భవమ్ ఉచ్ఛైశ్రవసమ్ - అమృతముతో పాటు జనించిన ఉచ్చైశ్రవమనబడు అశ్వమును
గజేంద్రాణాం ఇరావతమ్ - గొప్పఏనుగులలో ఐరావతమును
నరాణాం - నరులలో
నరాధిపమ్ మాం విద్థి - నరాధిపతిగా నన్ను తెలిసికొనుము.

శ్లోక తాత్పర్యము:

"అశ్వములలో అమృతముతో పాటు జనించిన ఉచ్చైశ్రవమనబడు అశ్వమును గను,
గొప్పఏనుగులలో ఐరావతమును గను,
నరులలో నరాధిపతిగను నన్ను తెలిసికొనుము." ||27||

"నరాణాం నరాధిపము" అంటే నరులకు అధిపతిని అని అన్నాడు. నరాధిపం అనడములో నరులకు అధిపతి అని. రాజులలో కొందరూ ప్రజలగురించి, అంటే నరులగురించి అలోచించక, తమతమ వ్యామోహాలలో పడేవారు వుంటారు. అలాంటి రాజులు నరాధిపులు అవరు, అంటే బ్రహ్మస్వరూపులు అవరు. అందుకనే ఇక్కడ రాజు అనకుండా నరాధిపుడు అన్నాడు అని కోవచ్చు.

చార్వాక దర్శనము అనే నాస్తిక మతములో రాజే దేముడు అని నిర్థారణగా చెప్పుతారు. ఆ దర్శనములో వేదాలు, బ్రహ్మం అన్నప్రసక్తిలేదు.

శ్లోకము 28

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః||28||

స|| అహమ్ ఆయుధానాం వజ్రం ధేనూనాం కామధుక్ అస్మి| ప్రజనః కందర్ప చ అస్మి | సర్పాణాం వాసుకిః అస్మి||28||

ప్రతిపదార్థము:

అహమ్ ఆయుధానాం వజ్రం - నేను అయుధములలో వజ్రాయుధమును
ధేనూనాం కామధుక్ అస్మి- ధేనువులలో కామధేనువును.
ప్రజనః కందర్ప చ అస్మి - ప్రజల ఉత్పత్తికికారణభూతుడైన మన్మధుడను
సర్పాణాం వాసుకిః అస్మి- సర్పములలో వాసుకి అను సర్పమును అయివున్నాను.

శ్లోక తాత్పర్యము:

"నేను అయుధములలో వజ్రాయుధమును.
ధేనువులలో కామధేనువును అయివున్నాను.
ప్రజల ఉత్పత్తికికారణభూతుడైన మన్మధుడను అయివున్నాను.
సర్పములలో వాసుకి అను సర్పమును అయివున్నాను."||28||

శ్లోకము 29

అనన్తాశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి యమస్సంయమతామహమ్||29||

స||అహమ్ నాగానాం అనన్తః చ అస్మి | యాదసామ్ వరుణః పిత్రూణాం అర్యమాచ అస్మి| అహం సంయమతాం యమః||29||

ప్రతిపదార్థము:

అహమ్ నాగానాం అనన్తః చ అస్మి - నేను నాగులలో అనంతుడను
యాదసామ్ వరుణః - జలదేవతలలో వరుణుడను
పిత్రూణాం అర్యమాచ అస్మి- పితృదేవతలలో అర్యమయ అనబడు పితృదేవతను
అహం సంయమతాం యమః- నియంత్రించువారిలో యముడను.

శ్లోక తాత్పర్యము:

"నేను నాగులలో అనంతుడను
జలదేవతలలో వరుణుడను
పితృదేవతలలో అర్యమయ అనబడు పితృదేవతను
నియంత్రించువారిలో యముడను."|| 29||

శ్లోకము 30

ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రోఽహమ్ వైనతేయశ్చ పక్షిణామ్||30||

స|| అహం దైత్యానాం ప్రహ్లాదశ్చాస్మి |కలయతాం కాలః మృగాణాంచ మృగేంద్రః పక్షీణాం వైనతేయః చ అస్మి||30||

ప్రతిపదార్థము:

అహం దైత్యానాం ప్రహ్లాదశ్చాస్మి- నేను దైత్యులలో ప్రహ్లాదుడను
కలయతాం కాలః -లెక్కపేట్టు వారిలో కాలమును
మృగాణాంచ మృగేంద్రః -మృగములలో మృగేంద్రుడను
పక్షీణాం వైనతేయః చ అస్మి- పక్షులలో వైనతేయుడను అయి వున్నాను.

శ్లోక తాత్పర్యము:

"నేను దైత్యులలో ప్రహ్లాదుడను
లెక్కపేట్టు వారిలో కాలమును
మృగములలో మృగేంద్రుడను
పక్షులలో వైనతేయుడను అయి వున్నాను."||30||

దైత్యులు అంటే దితి సంతానములు అని. వాళ్ళు దైత్యులు. వాళ్ళు అసురులు. "మోఘాశా మోఘకర్మాణా మోఘజ్ఞాన విచేతసః" అని (9.12)రాజవిద్యారాజగుహ్యయోగములో ఆసురీ భావము అని చెప్పబడినది. దైత్యుల స్వభావము ఆ ఆసురీ స్వభావము. ప్రహ్లాదుడు ఆ ఆసురీస్వభావము అధిగమించి విష్ణు భక్తుడు అవుతాడు. దైత్యులలో ప్రహ్లాదుడు తనే అనడములో, కృష్ణభగవానుడు ఎవరైనా అంటే ఏజాతికి సంబంధించినవాడైనా తన భక్తుడు అవగలడు అని.

శ్లోకము 31

పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్|
ఝుషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ||31||

స|| అహం పవతామ్ పవనః అస్మి| శస్త్రభృతాం రామః| ఝుషాణాం మకరః చ అస్మి | స్రోతసాం జాహ్నవీ అస్మి||

ప్రతిపదార్థాలు:

అహం పవతామ్ పవనః అస్మి- పవిత్రమొనరించువారిలో నేను వాయువును.
శస్త్రభృతాం రామః-శస్త్రములు ధరించువారిలో రాముడను
ఝుషాణాం మకరః చ అస్మి - నీటి జంతువులలో మొసలిని
స్రోతసాం జాహ్నవీ అస్మి-నదులలో గంగానది అయివున్నాను.

శ్లోకతాత్పర్యము:

"పవిత్రమొనరించువారిలో నేను వాయువును.
శస్త్రములు ధరించువారిలో రాముడను.
నీటి జంతువులలో మొసలిని.
నదులలో గంగానది అయివున్నాను."||31||

శస్త్రములు ధరించువారిలో రాముడను, అంటూ రాముడు కృష్ణుడు ఇద్దరూ పరమాత్మ స్వరూపులే అన్నమాట.

శ్లోకము 32

సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున|
అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్||32||

స|| హే అర్జునా ! సర్గాణాం ఆదిః మధ్యం చ అన్తః చ అహమేవ |విద్యానాం అధ్యాత్మవిద్యా ప్రవదతాం వాదః అహం అస్మి||

ప్రతిపదార్థాలు:

సర్గాణాం ఆదిః అన్తః చ - సృష్ఠి యొక్క మొదలు అంతమును
మధ్యం చ అహమేవ - మధ్యమును కూడా నేనే
విద్యానాం అధ్యాత్మవిద్యా - విద్యలలో ఆధ్యాత్మ విద్య
ప్రవదతాం వాదః అహం అస్మి - వాదించువారిలో రాగద్వేషరహితమైన వాదిని నేనే.

శ్లోకతాత్పర్యము:

"సృష్ఠి యొక్క మొదలు అంతమును మధ్యమును కూడా నేనే.
విద్యలలో ఆధ్యాత్మ విద్య,
వాదించువారిలో రాగద్వేషరహితమైన వాదిని నేనే."||32||

శ్లోకము 33

అక్షరాణామకారోఽస్మి ద్వన్ద్వః సామాసికస్య చ|
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః||33||

స|| అక్షరాణాం అకారః అస్మి| సామసికస్య చ ద్వంద్వః చ | అక్షయః కాలః అహం ఏవ చ | విశ్వతోముఖః ధాతా అస్మి||33||

ప్రతిపదార్థములు:

అక్షరాణాం అకారః అస్మి - అక్షరములలో 'అ'కారము నేను
సామసికస్య చ ద్వంద్వః చ - సమాసములలో ద్వంద్వ సమాసము
అక్షయః కాలః అహం ఏవ చ - నాశనము లేని కాలము నేనే
విశ్వతోముఖః ధాతా అస్మి - సర్వత్ర ముఖములు కల బ్రహ్మ ను నేనే

శ్లోకతాత్పర్యము:

" అక్షరములలో 'అ'కారము నేను.
సమాసములలో ద్వంద్వ సమాసము,
నాశనము లేని కాలము నేనే.
సర్వత్ర ముఖములు కల బ్రహ్మను నేనే." ||33||

శ్లోకము 34

మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతామ్|
కీర్తిశ్శ్రీర్వాక్య నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా||34||

స|| సర్వ హరః మృత్యుః చ భవిష్యతాం ఉద్భవః చ హం అస్మి | నారీణాం కీర్తిః శ్రీః వాక్ స్మృతిః మేధా ధృతిః క్షమాచ అహమేవ||34||

ప్రతిపదార్థములు:

సర్వ హరః మృత్యుః చ - సర్వము హరించునట్టి మృత్యువును నేనే
భవిష్యతాం ఉద్భవః చ హం అస్మి- భవిష్యత్తులో ఉద్భవించు సమస్తము నేనే
నారీణాం కీర్తిః - స్త్రీల యొక్క కీర్తి
శ్రీః వాక్ - సంపద , వాక్కు
స్మృతిః మేధా - స్మృతి , మేధాసక్తి
ధృతిః క్షమాచ అహమేవ- ధైర్యము ఓర్పు కూడా నేనే

శ్లోకతాత్పర్యము:

"సర్వము హరించునట్టి మృత్యువును నేనే
భవిష్యత్తులో ఉద్భవించు సమస్తము నేనే
స్త్రీల యొక్క కీర్తి సంపద, వాక్కు, స్మృతి, మేధాశక్తి,, ధైర్యము, ఓర్పు కూడా నేనే."||34||

శ్లోకము 35

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్|
మాసానాం మార్గశీర్షోఽహం ఋతూనాం కుశుమాకరః||35||

స|| తథా అహం సామ్నాం బృహత్సామ చందాసాం గాయత్రి మాసానాం మార్గశీర్షః ఋతూనాం కుసుమాకరః అస్మి ||35||

ప్రతిపదార్థములు:

తథా అహం సామ్నాం బృహత్సామ - అలాగే నేను సామవేద గానములలో బృహత్సామము
చందాసాం గాయత్రి - చందస్సులో గాయత్రి
మాసానాం మార్గశీర్షః - మాసములలో మార్గశీర్షము
ఋతూనాం కుసుమాకరః అస్మి - ఋతువులలో - వసంత ఋతువును కూడానేనే అయివున్నాను.

శ్లోకతాత్పర్యము:

"నేను సామవేద గానములలో బృహత్సామము.
అలాగే చందస్సులో గాయత్రి,
మాసములలో మార్గశీర్షము,
ఋతువులలో - వసంత ఋతువును కూడా నేనే అయివున్నాను."||35||

శ్లోకము 36

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్||36||

స|| అహం ఛలయతాం ద్యూతం అస్మి| తేజస్వినాం తేజః అస్మి| జయః అస్మి| వ్యవసాయః అస్మి| అహం సత్త్వవతాం సత్త్వమ్ అస్మి||36||

ప్రతిపదార్థములు:

అహం ఛలయతాం ద్యూతం అస్మి- నేను వంచకవృత్తులలో జూదమును
తేజస్వినాం తేజః అస్మి- తేజోవంతులయొక్క తేజస్సు నేనే
జయః అస్మి- జయము నేనే
వ్యవసాయః అస్మి- ప్రయత్నము నేనే
అహం సత్త్వవతాం సత్త్వమ్ అస్మి- సాత్వికగుణము కలవారిలో సత్త్వగుణాము నేనే

శ్లోకతాత్పర్యము:

"నేను వంచకవృత్తులలో జూదమును
తేజోవంతులయొక్క తేజస్సు నేనే
జయము నేనే, ప్రయత్నము నేనే
సాత్వికగుణము కలవారిలో సత్త్వగుణము నేనే".||36||

"జయోఽస్మి" అన్న పదాలకి శంకరాచార్యుల వారు తమ భాష్యములో , 'జయః అస్మి జేతౄణాం| వ్యవసాయః అస్మి వ్యవసాయినాం| సత్త్వం సత్త్వతాం సాత్వికానాం అహమ్| అనిరాశారు. అంటే జయము పొందువారిలో జయమును , ప్రయత్నము చేయు వారిలో ప్రయత్నము, సాత్వికగుణము కలవారిలో సత్త్వగుణము నేనే అని రాశారు.

 

శ్లోకము 37

వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాణ్డవానాం ధనంజయః|
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః||37||

స||అహం వృష్ణీనాం వాసుదేవః| పాణ్డవానాం ధనంజయః మునీనాం అపి వ్యాసః|కవీనామ్ ఉశనాకవిః అస్మి ||37||

ప్రతిపదార్థములు:

అహం వృష్ణీనాం వాసుదేవః- నేను యాదవులలో వసుదేవుని కుమారుడను
పాణ్డవానాం ధనంజయః - పాండవులలో ధనంజయుడను
మునీనాం అపి వ్యాసః- మునులలో వ్యాసుడను
కవీనామ్ ఉశనాకవిః అస్మి - కవులలో శుక్రాచార్యుడను.

శ్లోకతాత్పర్యము:

"నేను యాదవులలో వసుదేవుని కుమారుడను
పాండవులలో ధనంజయుడను
మునులలో వ్యాసుడను
కవులలో శుక్రాచార్యుడను అయివున్నాను."||37||

ఇది వాసుదేవుడు ధనంజయునికి చెప్పినమాట

శ్లోకము 38

దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్|
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్||38||

స|| అహం దమయతాం దణ్డః అస్మి|జిగీషతాం నీతిః అస్మి|గుహ్యానాం మౌనం అస్మి| జ్ఞానవతాం జ్ఞానం అస్మి||38||

ప్రతిపదార్థములు:

అహం దమయతాం దణ్డః అస్మి - నేను శిక్షించువారియొక్క శిక్షను
జిగీషతాం నీతిః అస్మి - జయింప కోరికగలవారి యొక్క ఉపాయమును
గుహ్యానాం మౌనం అస్మి - రహస్యములలో మౌనము నేను
జ్ఞానవతాం జ్ఞానం అస్మి -జ్ఞానవంతులయొక్క జ్ఞానము నేను.

శ్లోకతాత్పర్యము:

"నేను శిక్షించువారియొక్క శిక్షను
జయింప కోరికగలవారి యొక్క ఉపాయమును
రహస్యములలో మౌనము నేను
జ్ఞానవంతులయొక్క జ్ఞానము నేను."||38||

శ్లోకము 39

యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున|
న తదస్తి వినా యత్స్యాన్ మయా భూతం చరాచరమ్||39||

స|| అర్జునా!సర్వభూతానాం యత్ బీజం తత్ అపి చ అహం అస్మి | చరాచరం భూతం యత్ స్యాత్ తత్ మయా వినా నాస్తి||39||

ప్రతిపదార్థములు:

సర్వభూతానాం యత్ బీజం - సమస్త ప్రాణులకు ఏది బీజమో
తత్ అపి చ అహం అస్మి - అది కూడా నేనే
చరాచరం భూతం యత్ స్యాత్ - చరాచర భూతములు ఏవి కలవో
తత్ మయా వినా నాస్తి - అవి నేను లేకుండా వుండవు.

శ్లోకతాత్పర్యము:

"ఓ అర్జునా సమస్త ప్రాణులకు ఏది బీజమో అది కూడా నేనే.
చరాచర భూతములు ఏవి కలవో అవి నేను లేకుండా వుండవు."||39||

అంటే ఇప్పటిదాకా అంతము లేని విభూతులలో కొన్ని చెప్పి, చివరికి సమస్తము భవత్స్వరూ పమే అని కృష్ణుడు చెపుతున్నాడన్నమాట.

శ్లోకము 40

నాన్తోఽస్తి మమ దివ్యానాం విభూతినాం పరన్తప|
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా||40||

స|| హే పరన్తప! మమ దివ్యానామ్ విభూతీనాం అన్తః న అస్తి | తు ఏషః విభూతేః విస్తరః ఉద్దేశతః మయా ప్రోక్తః||

ప్రతిపదార్థములు:

మమ దివ్యానామ్ - నా దివ్యమైన
విభూతీనాం - విభూతులకు
అన్తః న అస్తి - అంతము లేదు.
తు ఏషః విభూతేః విస్తరః - అయిననూ ఈ విభూతుల వివరణ
ఉద్దేశతః - సంగ్రహముగా
మయా ప్రోక్తః- నాచేత చెప్పబడినది.

శ్లోకతాత్పర్యము:

"ఓ అర్జునా , నా దివ్యమైన విభూతులకు అంతము లేదు.
అయిననూ ఈ విభూతుల వివరణ సంగ్రహముగా నాచేత చెప్పబడినది."||40||

ముందు చెప్పినమాటే ఒక చివరి మాటలాగ కృష్ణుడు మళ్ళీ చెపుతాడు. భగవంతుని ఐశ్వర్యములకు కొదవ లేదు. అయితే భగవంతుని విభూతి తెలుసుకోడానికి ఒక సూత్రము చెపుతాడు 41 వ శ్లోకములో.

శ్లోకము 41

యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా|
తత్తదేవావగచ్చ త్వం మమతేజోఽ‍ంశ సంభవమ్||41||

స||విభూతిమత్ శ్రీమత్ ఊర్జితం ఏవ వా సత్త్వం యత్ యత్ తత్ తత్ మమ తేజోంశ సంభవమ్ ఏవ | (ఇదం) త్వం అవగచ్ఛ ||41||

ప్రతిపదార్థము:

విభూతిమత్ - ఐశ్వర్యయుక్తమైనది
శ్రీమత్ - కాంతివంతమైనది
ఊర్జితం ఏవ వా - ఉత్సాహముతో కూడినది
సత్త్వం - అట్టి సత్త్వము ( ప్రాణి, వస్తువు)
యత్ యత్ - ఏది ఏది కలదో
తత్ తత్ - అవన్నీ
మమ తేజోంశ సంభవమ్ ఏవ - నాతేజస్సుయొక్క అంశము కలవే.
(ఇదం) త్వం అవగచ్ఛ - ఇది నీవు తెలిసికొనుము.

శ్లోకతాత్పర్యము:

"ఐశ్వర్యయుక్తమైనది, కాంతివంతమైనది, ఉత్సాహముతో కూడినది అట్టి సత్త్వము ( ప్రాణి, వస్తువు)
ఏవి ఏవి కలవో అవన్నీ నాతేజస్సుయొక్క అంశము కలవే.
ఇది నీవు తెలిసికొనుము."||41||

అంటే ఏక్కడైతే ఉత్తమ విభూతి, ఉత్సాహాది ఉత్తమ సద్గుణములు వుంటాయో వాటిలో భగవంతుని అంశ వున్నది అన్నమాట. మనకి అన్ని విభూతులు తెలిసికొన అవసరము లేదు. సద్గుణములకి హృదయములో స్థానము ఇచ్చి వాటి ద్వారా భవత్సానిధ్యమును భగవదనుభూతిని తమది గా చేసుకొనవలెను.

శ్లోకము 42

అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున|
విష్టభ్యాహమిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్||42||

స|| అర్జునా ! అథవా బహునా ఏతేన జ్ఞాతేన తవ కిమ్? అహం ఇదం కృత్స్నమ్ జగత్ ఏకాంశేన విష్టభ్య స్థితః||42||

ప్రతిపదార్థము:
అథవా బహునా ఏతేన - లేక విస్తారమైన ఈ
జ్ఞాతేన తవ కిమ్- తెలిసికొనడములో నీకు ఏమి ప్రయోజనము?
అహం ఇదం కృత్స్నమ్ జగత్ -
నేను ఈ సమస్తమైన జగత్తును
ఏకాంశేన విష్టభ్య స్థితః -
ఒక అంశముచేత వ్యాపించి వున్నాను>

శ్లోకతాత్పర్యము:

" ఓ అర్జునా , లేక విస్తారమైన ఈ జ్ఞానము తెలిసికొనడములో నీకు ఏమి ప్రయోజనము?
నేను ఈ సమస్తమైన జగత్తును ఒక అంశముచేత వ్యాపించి వున్నాను." ||42||

భగవంతుని విభూతులు అంతము లేనివి. ఏంత తెలిసికొన్నా ఇంకా తెలియని విభూతులు అనేకము ఉంటాయి. ఎందుకు అంటే సమస్త జగత్తులో పరమాత్మ వ్యాపించి వున్నాడు కాబట్టి. ఈ విభూతుల ద్వారా మనకి తెలిసేది భగవంతుని విరాట స్వరూపము. అదే పురుషసూక్తములో మనము వినేది. "పాదో అస్య విశ్వాభూతాని" అన్న పురుషసూక్తములో వినే వాక్యములో విరాటస్వరూపములో ఒక పావుభాగమే సమస్త విశ్వము అని చెప్పడమైనది.

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగోనామ
దశమోఽధ్యాయః
ఓం తత్ సత్