||భగవద్గీత ||
||ఏకాదశోధ్యాయము||
||విశ్వరూపసందర్శనయోగమ||
ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః
విశ్వరూపసందర్శనయోగము
ఏకాదశోధ్యాయః
శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు చేసిన అధ్యాత్మ బోధతో అర్జునుని మోహము్ తొలగి పోయినది. ఏ అవివేకమువలన మొట్టమొదట ఈ జగత్తు నిత్యమని బంధువులు నావారనీ దేహమునాదనీ దుఃఖము నొందుచుండెనో ఆ మోహము పోయి " మోహోయం విగతోమమ " అనువాక్యము ద్వారా ఒప్పుకొనెను. భగవానుడు ఇచ్చిన ఔషధము గీతామృతమనెడిది. అది శ్రేష్టమైనది . దాని వలన అంధకారము తోలగిపోయినది.
ప్రపంచములో ఎన్నియో విద్యలు కలవు. అంధకార వినాశమునకు అవి అన్నీ సమర్ధులు కావు. రహస్యమైనది శ్రేష్టమైనదీ బ్రహ్మవిద్య . గురువులు అందరికి అట్టి విద్య చెప్పరు. ఎవరియందు వారికి అనుగ్రహము కలదో వారికే చెప్పుదురు.
అర్జునుడు చెప్పెను. నీ మహిమలన్నిటినీ వింటిని. చూచుటకు సాధ్యమైన నీ రూపము చూడవలెనని యున్నది అని అడిగెను. సమస్త బ్రహ్మాండము తో గూడిన జగత్తంతయూ పరమాత్మ ఒక అంశ మందే ఇమిడి యున్నదగును. ఆత్మయందు ఒకానొక మూల సమస్త ప్రపంచము అణగియున్నది . ద్వాదశాదిత్యులు అష్ట వసువులు పన్నెండు ఆదిత్యులు ఎనిమిది వసువులు పదకొండు రుద్రులు ఇద్దరు అశ్విని దేవతలు మరుత్తు గణములు నలభైతొమ్మిది అందరు ఆ విశ్వరూప మునందుండిరి.
సర్వశక్తివంతమైన పరమాత్మను అల్పుడగు ఈ జీవుడు భక్తి ప్రపత్తులు కలిగి విధేయుడుగా నుండుట ధర్మము. మనుజునకు ఎప్పుడైన తనయొక్క ధన జన క్షేత్ర అధికారమందు గర్వము కలిగినచో ఈ శ్లోకము చదివిన గర్వము ఉడిగిపోగలదు.
శ్లో|| ఇహైకస్థంజగత్కృత్స్నం పశ్యాద్యసచరాచరమ్|
మమ దేహేగుడాకేశా యచ్చాన్యద్ద్రష్టుమిచ్చసి ||
తత్వవేత్తలు భగవానుని సూక్ష్మమగు ఏకాగ్ర బుద్ధితో విశ్వరూపమును జూచుదురు. భగవానుడు అర్జునకు జ్ఞానదృష్టిని ఇచ్చెను. దేముడు మాకు కనపడుట లేదు కావున అతను లేడు వాదించువారు గ్రుడ్డివాడు సూర్యుడు లేడని వాదించుట వంటిది. భగవద్దర్శనమునకు దైవాను భూతికిని జ్ఞాననేత్రమను దివ్యదృష్టిని సంపాదించవలెను.
దానిని ఆ భగవానుడు ఇవ్వవలసినదే. అర్జునినికి " దదామి తే చక్షుః " అంటూ కృష్ణ భగవానుడు విశ్వరూపము చూచుటకు ఆ దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు.
ఎవడు అనన్య భక్తి కలిగి ఆయనను సేవించుదురో అట్టివారికి "నేను బుద్ధి యోగమును ఇచ్చెదును" అని భగవానుడే చెప్పెను (10 అ 10 శ్లో). భూతద్దము అమర్చిన కళ్ళజోడుతో జలచరములు ఆకాశమందు భూమి యందు సూక్ష్మ పదార్ధములు గోచరించినట్లు అవి ఎవరు ధరించినను చండాలుడుగాని బీదవాడుగానీ స్త్రీగాని చదువురానివాడుగాని అది గోచరించినట్లు జాతితో సంబంధము లేక అదికనబడును. కనుక కనబడ పొవుటకు వారి వారి ప్రయత్న రాహిత్యమే యగును.
అప్పుడు భగవానుడు సర్వోత్తమమైన విశ్వరూపమును జూపించెను. అనేక నేత్రములు గలదీ ముఖములు గలదీ ఆభరణములు పుష్పమాలికలు వేలకొలది సూర్య కాంతులవంటి కాంతులుకలది ఇట్టి మహాధ్బుతమును చూ చి పులకితుడై అర్జునుడు శిరసు వంచి నమస్కరించెను. బ్రహ్మసమస్త ఋషులు , దివ్యసర్పములు అనేకహస్తములు ఉదరము అనన్తరూపునిగ చూచెను. "నీవే అక్షరపరబ్రహ్మవు నాశరహితుడవు పురానపురుషుడవు" అని భూమియాకాశములు యొక్క మధ్య ప్రదేశము అంతయు దిక్కులును అంతయు భగవంతుని చే వ్యాపించబడి యుండెను. "స్వస్తిప్రజాభ్యాం” అని మహర్షులు సిద్ధులు అనేకదేవతాసమూహములు నిన్ను స్తోత్రము చేయుచున్నారు. ప్రకాశము కలవాడవు తెరవబడిన నోరులు కలవాడును నిన్నుచూసి భీతిల్లి శాంతిని పొందలేక పోవుచున్నాను నన్నుఅనుగ్రహింపుము దేవా | అనెను అర్జునుడు .
భగవంతుడికి కాలబేధము లేదు అందుకని భూతభవిష్యత్వర్తమానములు వి శ్వరూపమున గోచరించెను. భీష్మ ద్రోణకర్ణాదులు సైనికులు భగవానుడి నోటి యందు ప్రవేశించుచుండుట అర్జునుడు ప్రత్యక్షముగ చూసెను. దీనివలన ఈ బంధుమిత్రాదులు ధన ధాన్యాలు భవనములు సంపదలు నశించి పోయేవే అని జీవుడు భావించవలెను. కాబట్టి అర్జునుడు చూసిన భవిష్యత్ కాల దర్శనము ప్రతి జీవియు చిత్రించుకొని వైరాగ్యమును పొందవలెను. ఆర్జునుడు విశ్వరూపము చూచి " ఏప్రకారము నదీప్రవహము సముద్రము వైపు ప్రయాణము చేయుచున్నదో ఆ ప్రకారమున మనుష్యలోకమున వీరులు నీ నోళ్ళ యందు ప్రవేసించు చున్నారు. ఆదిపురుషుడవగు నిన్ను గురించి తెలిసికొనదల్చాను నన్ను అనుగ్రహింపుము" అని అనెను . అప్పుడు భగవానుడు "నేను లోకసంహారకుడవైన కాలుడను కాబట్టి లేచి శత్రువులను జయించికీర్తిని పొందుము" అని చెప్పెను .
కాబట్టి భయపడకుండా సర్వేశ్వరుని శరణు పోంది కర్తవ్యమును ధర్మపూర్వకముగా " మావ్యధిష్టాః " భయపడవలదనీ జీవిత రంగమున తమ నిత్యవ్వవహారములందు అనేకవొడుదుడుకులు క్లేశములును ఎదుర్కొనవలసి యున్ననూ అపుడు ఈవాక్యమును స్మరించుకొనీ ధైర్యము తెచ్చుకొనవలెను. అర్జునునివలె సమస్తము భగవదర్పణము చేసి నిర్మల చిత్తముతో "జేతాసి" అంటే జయించగలవు అన్నమాట. ఉత్తమ ఫలితమును తప్పకబొందగలము. ఎక్కడ భగవద్భావనయుండునో అక్కడ విజయము తధ్యము.
అర్జునుడు చేతులు జోడించి వణకుచు భగవంతుడికి నమస్కరించెను. " నీ నామ సంకీర్తనము చేతను మహాత్మ్యము కీర్తించుట చేతను లోకములు మిగుల సంతోషించుచున్నది. రాక్షసులు పరుగిడుచున్నారు సిద్ధసమూహములు నిన్ను నమస్కరించుచున్నారు. ఎక్కడ సద్గుణములు విరాజిల్లునో అచట భూతప్రేత పిశాచములు కామాదిదుష్ట ప్ర వృత్తులు పరుగెత్తిపారిపోవును" అని ప్రతుతించెను.
"స్థూలసూక్ష్మపదార్ధములు మనస్సు దేహము మిధ్యాభూతములే. పరమాత్మఒక్కడె సత్య వస్తువు ఆదిదేవుడు,సనాతనుడు , వరుణుడు అగ్ని వాయువు చంద్రుడు బ్రహ్మఆన్నిటికీ తండ్రి అయిన నీకు నమస్కారము నీవు సర్వ స్వరూపుడవు అపరిమిత సామర్ధ్యము పరాక్రమమూ కలవాడివి. నీమహిమను తెలియక ఓకృష్ణా యాదవా సఖా చనువువల్ల పరిహాసము చేసానేమో అపరాధములన్ని క్షమించ ప్రార్ధన. నీవు పరమపూజ్యుడవు ఉత్తమగురువు నీతోసమానము గాని అధికుడుకాని ఈప్రపంచమునలేడు" అని ప్రస్తుతించి భూమి పై బడి సాష్టాంగనమస్కారము త్రికరణశుద్ధిగా అచరించెను అర్జునుడు.
విశ్వరూపమును దర్శించిన అర్జునుడు "మునుపటివలె కిరీటము గద చక్రము ధరించినవాని వలె తన ప్రసన్న రూపము చూపమనెను".
అప్పుడు కృష్ణమూర్తి తన శాంతమైన మనుష్యరూపము చూపెను .
దుర్లభమైన ఈ రూపమును నిత్యము దేవతలు కాంచుచుందురు
అనన్యభక్తి చేతనే భగవానుని 1 తెలిసికొనుటకు 2 చూచుట కు 3 ప్రవేసించుటకు- "జ్ఞాతుం, ద్రష్టుం , ప్రవేష్టుం", మూడు సోపానాలు. అనగా భగవంతుడు ఇట్టివాడని పరిజ్ఞానము కలుగుట మొదటి అంతస్తు. భగవంతుడిదగ్గరకు వచ్చి భక్తుడు అతి సమీపముగా దర్శింపగలుగును. ఇది రెండవ అంతస్తు. కరమునందలి అమలకముగా ప్రత్యక్షరముగా జూచునట్లు చూడగలుగును. విశిష్టాద్వైత స్థితి అతనిని చూసి ప్రవేసించి అతని లో ఐక్యమైపోవును. అదే పూర్ణ అద్వైత స్థితి.
మొదటిది సామీప్యము రెండవది సారూప్యము మూడవది సాయుజ్యము
ఇదియే మోక్షము ..
ఇంకా కృష్ణభగవానుడు చెపుతాడు:
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తసంగవర్జితః|
నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాణ్డవ||55||
"ఎవరు నాకొరకే పనులు చేయునో నేనే పరమప్రాప్యమని నమ్మి భక్తి కలిగి యుండి సమస్త పదార్ధములయందు ఆ శక్తిని విడచునో సర్వులయందు ద్వేషము లేకయుండునో అట్టివారు భగవంతుని పొందగలుగుదురు".
కర్మచేయుట కర్మయోగము.
భగవంతుని యందు తత్పరత ధ్యానయోగము
భగవంతుని యందు భక్తి కలిగి యుండుట భక్తి యోగము.
దృశ్యపదార్ధములయందు సమత్వము జ్ఞానయోగము
భూతదయకలిగి ఈ జన్మమందే పరమాత్మ సాయుజ్యము పొందవలెను
||ఓం తత్ సత్ ||
||ఓం తత్ సత్ ||