||భగవద్గీత ||

|| ఏకాదశోధ్యాయము||

||విశ్వరూపసందర్శనయోగము - శ్లోకాలు - అర్థతాత్పర్యాలతో ||

|| ఓమ్ తత్ సత్||
అర్జున ఉవాచ:
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితమ్|
యత్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ||1||

"నన్ను అనుగ్రహించుటకై ఉత్తమమైన రహస్యమైన అధ్యాత్మమను పేరుగల ఏ వాక్యమును నీచేత చెప్పబడినదో దాని చేత నా అజ్ఞానము తొలగి పోయినది".

ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః
శ్రీమద్ భగవద్గీత
విశ్వరూపసందర్శనయోగము
ఏకాదశోధ్యాయః

జ్ఞాన విజ్ఞానసహితమైన అతి గుహ్యమైన అంటే అతి రహస్యమైన బ్రహ్మజ్ఞానమును గురించి శ్రద్ధగా రాజవిద్యా రాజగుహ్య యోగములో వినిన అర్జునుడితో, "వక్ష్యామి హితకామ్యయా" అంటే "నీ హితముకోరి చెప్పుచున్నాను " అంటూ తన విభూతి అంటే మహాత్మ్యము గురించి శ్రీకృష్ణ భగవంతుడు విభూతి యోగములో చెపుతాడు. అలా చెపుతూ, "ప్రీయామాణాయ తే" అంటే "ప్రీతిచెందిన నీకు" అని సంబోధిస్తాడు అర్జునుడిని. అంటే అర్జునుడు ప్రీతిచెంది, కొత్త విషయాలు వినతగిన స్థితిలో వున్నాడన్నమాట.

శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు చేసిన అధ్యాత్మ బోధతో అర్జునుని మోహము తొలగి పోయినది. అలాగ మోహము తొలగి పోయిన అర్జునుడి భాషణతో ఈ విశ్వరూప సందర్శన యోగము మొదలవుతుంది. ప్రతిసారి ఏదో శంకతో ప్రశ్నలతో మొదలుపెట్టే అర్జునుడు, ఈ సారి శంక లేకుండా నిర్మొహమాటముగా మోహము తొలిగిపోయింది అన్న అర్జునుడి మాటతో అధ్యాయము మొదలవుతుంది.

శ్లోకము 1

అర్జున ఉవాచ:
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితమ్|
యత్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ||1||

స|| మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితమ్ యత్ వచః త్వయా ఉక్తం తేన అయం మోహః విగతః||1||

శ్లోక ప్రతిపదార్థాలు:

మదనుగ్రహాయ - నన్ను అనుగ్రహించుటకొఱకు
పరమం గుహ్యమ్ - పరమ రహస్యమైన
అధ్యాత్మ సంజ్ఞితమ్- అధ్యాత్మమనే విషయముపై
యత్ వచః త్వయా ఉక్తం - ఏ వచనములు చెప్పితివో
తేన - వాని చేత
అయం మోహః విగతః- ఈ మోహము తొలగిపోయినది.

శ్లోక తాత్పర్యము:

"నన్ను అనుగ్రహించుటకొఱకు పరమ రహస్యమైన, అధ్యాత్మమనే విషయముపై,
ఏ వచనములు చెప్పితివో వాని చేత ఈ మోహము తొలగిపోయినది."||1||

అర్జునునికి, ఏ అవివేకమువలన మొట్టమొదట ఈ జగత్తు నిత్యమని, బంధువులు నావారనీ, దేహమునాదనీ దుఃఖము నొందుచుండెనో, ఆ మోహము, ' మోహోయం విగతోమమ', అన్నమాటతో నిస్సందేహముగా తొలగి పోయింది అని మనకి తెలుస్తుంది.

భగవానుడు ఇచ్చిన ఔషధము గీతామృతము. అది శ్రేష్టమైనది. దాని వలన అర్జునుడికి అజ్ఞాన అంధకారము తోలగిపోయినది. ప్రపంచములో ఎన్నో విద్యలు ఉన్నాయి. అజ్ఞాన అంధకార వినాశానికి అవి అన్నీ ఉపయోగము కావు. రహస్యమైనది శ్రేష్టమైనదీ బ్రహ్మవిద్య. గురువులు అందరికి అట్టి విద్య చెప్పరు. ఎవరియందు వారికి తగిన శిష్యుడు అని నమ్మకము కలుగునో వారికే చెప్పుతారు.

కృష్ణభగవానుడు ఆ విద్య తన ప్రియతమ సఖుడగు అర్జునుని ద్వారా సమస్త ప్రజానీకానికీ అందిస్తాడు.

శ్లోకము 2

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశోమయా|
తత్త్వః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయమ్||2||

స|| హి కమలపత్రాక్ష ! త్వత్తః భూతానాం భవ అప్యయౌ విస్తరశః మయా శ్రుతౌ | అవ్యయం ( నాశ రహిత తే ) మహాత్మ్యం అపి చ ( మయా) శ్రుతం||

శ్లోక ప్రతిపదార్థాలు:

త్వత్తః- నీవలన
భూతానాం భవ అప్యయౌ - ప్రాణులయొక్క ఉత్పత్తి నాశనము గురించి,
విస్తరశః మయా శ్రుతౌ - సవిస్తరముగా నా చేత వినబడినది.
అవ్యయం మహాత్మ్యం- నాశరహితమైన మహాత్మ్యము కూడా
చ ( మయా) శ్రుతం- నాచేత వినబడినది.

శ్లోక తాత్పర్యము:

"ఓ కమలపత్రాక్ష, నీవలన ప్రాణులయొక్క ఉత్పత్తి నాశనము గురించి, సవిస్తరముగా నా చేత వినబడినది.
నీ యొక్క నాశరహితమైన మహాత్మ్యము కూడా నాచేత వినబడినది."|| 2||

శ్లోకము 3

ఏవమేతద్యథాఽఽత్థ త్వమాత్మానం పరమేశ్వర|
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ||3||

స||హే పరమేశ్వర! త్వం ఆత్మానం యథా అత్థ ఎవం ఏతత్ ( ఇతి మమ విశ్వాసః)| హే పురుషోత్తమ ! తే ఐశ్వరం రూపమ్ ద్రష్టుం ఇచ్చామి||

శ్లోక ప్రతిపదార్థాలు:

త్వం ఆత్మానం - నీవు నిన్నుగురించి
యథా అత్థ - ఏ ప్రకారముగా చెప్పితివో
ఎవం ఏతత్ - అది అట్లే (అని నావిశ్వాసము)
తే ఐశ్వరం రూపమ్ - నీ ఈశ్వర సంబంధమైన రూపమును
ద్రష్టుం ఇచ్చామి - చూచుటకు కోరుచున్నాను.

శ్లోక తాత్పర్యము:

"పురుషోత్తమ, నీవు నిన్నుగురించి ఏ ప్రకారముగా చెప్పితివో అది నిజము అని నావిశ్వాసము.
ఓ పరమేశ్వర, నీ ఈశ్వర సంబంధమైన రూపమును చూచుటకు కోరుచున్నాను." ||3||

శ్లోకము 4

మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో|
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మాన మవ్యయమ్||4||

స||హే ప్రభో! తత్ ( తే ఐశ్వరం రూపమ్ ) మయా ద్రష్టుం శక్యం ఇతి మన్యసే తతః హే యోగేశ్వర ! త్వం అవ్యయమ్ ( నాశరహిత) ఆత్మానమ్ మే దర్శయ||

శ్లోక ప్రతిపదార్థాలు:

తత్ మయా ద్రష్టుం - ఆ రూపము నాచేత చూడబడుటకు
శక్యం ఇతి మన్యసే - సాధ్యము అని తలచినచో
త్వం అవ్యయమ్ ఆత్మానమ్ - నీ నాశరహిత స్వరూపమును
మే దర్శయ- నాకు చూపుము

శ్లోక తాత్పర్యము:

"ఓ ప్రభో, ఆ రూపము నాచేత చూడబడుటకు సాధ్యము అని తలచినచో,
ఓ యోగేశ్వరా, నీ నాశరహిత స్వరూపమును నాకు చూపుము."||4||

రెండవ అధ్యాయములో అర్జునుడు కృష్ణునితో 'శిష్యస్తేహం శాధిమామ్' అంటే 'నీ శిష్యుడను నేను, నన్ను శాసించు' అని అన్నాడు. దానికి తగిన వినయ విధేయలతో, ఇప్పుడు విశ్వరూపము గురించి అడుగుతూ, 'యది మన్యసే తత్ శక్యం' (11.04) అంటే ఆ స్వరూపము చూచుటకు ( 'నాకు') శక్యము అని తలిచితే చూపుము అని కూడా అంటాడు.

కృష్ణుడు దానికి సమాధానముగా తన రూపము వివరిస్తాడు మూడు శ్లోకాలలో.

శ్లోకము 5

శ్రీభగవానువాచ

పశ్యమే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః|
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ|| 5||

స||హే పార్థ ! నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ శతశః అథ సహశ్రసః మే రూపాణి పశ్య||

శ్లోక ప్రతిపదార్థాలు:

నానావిధాని దివ్యాని - అనేకవిధములైన దివ్యమైన
నానావర్ణాకృతీని చ - అనేక రంగులు ఆకారములు గల
శతశః అథ సహశ్రసః - వందల అలాగే వేలకొలదీ వున్న
మే రూపాణి పశ్య -నా రూపములను చూడుము.

శ్లోక తాత్పర్యము:

"ఓ పార్థా, అనేకవిధములైన దివ్యమైన అనేక రంగులు ఆకారములు గల, వందల అలాగే వేలకొలదీ వున్న,
నా రూపములను చూడుము."||5||

శ్లోకము 6

పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రానశ్వినౌ మరుతస్తథా|
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత||6||

స||హే భారత! అదిత్యాన్ వసూన్, రుద్రాన్ ,అశ్వినౌ మరుతః పశ్య | తథా అదృష్టపూర్వాణి బహూని ఆశ్చర్యాణి పశ్య||6||

శ్లోక ప్రతిపదార్థాలు:

అదిత్యాన్ వసూన్, రుద్రాన్ - ఆదిత్యులను, వసువులను,రుద్రులను
అశ్వినౌ మరుతః పశ్య - అశ్వినులను, మరుత్తులను చూడుము
అదృష్ట పూర్వాణి బహూని - ముందు ఎప్పుడూ చూడబడని చాలా
ఆశ్చర్యాణి పశ్య- అశ్చర్యములను చూడుము.

శ్లోక తాత్పర్యము:

"ఓ భారత, ఆదిత్యులను, వసువులను, రుద్రులను
అశ్వినులను, మరుత్తులను చూడుము
ముందు ఎప్పుడూ చూడబడని చాలా
అశ్చర్యములను చూడుము."||6||

ఇక్కడ చెపుతున్నది, అదిత్యులు పన్నెండు, వసువులు ఎనిమిది, రుద్రులు పదకొండు మంది, అశ్విని దేవతలు ఇద్దరు, మరుత్తులు నలభైతొమ్మిది మంది గురించి.

శ్లోకము 7

ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య స చరాచరం|
మమదేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి||7||

స|| హే గుడాకేశ! సచరాచరమ్ కృత్స్నం జగత్ మమ ఇహ దేహే ఏకస్థం అద్య పశ్య | అన్యత్ యత్ ద్రష్టుమ్ ఇచ్ఛసి (తత్ ) చ (మమ ఇహ దేహే ఏకస్థమద్య పశ్య) ||7||

శ్లోక ప్రతిపదార్థాలు:

సచరాచరమ్ కృత్స్నం జగత్ - చరాచరములతో కూడిన సమస్త జగత్తును
మమ ఇహ దేహే - ఇక్కడ నా దేహములో
ఏకస్థం అద్య పశ్య - ఒకచోట ఇప్పుడు చూడుము.
అన్యత్ యత్ ద్రష్టుమ్ ఇచ్ఛసి చ - ఇంకా దేనిని చూడగోరుచున్నావో ( అది కూడా)

శ్లోక తాత్పర్యము:

"ఓ అర్జునా, ఇప్పుడు చరాచరములతో కూడిన సమస్త జగత్తును నా దేహములో ఒకచోట ఇప్పుడు చూడుము
ఇంకా దేనిని చూడగోరుచున్నావో అది కూడా ( చూడుము)."||7||

శ్లోకము 8

న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుసా|
దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరమ్||8||

స|| అనేన స్వచక్షుసా ఏవతు మాం ద్రష్టుమ్ న శక్యసే| తే దివ్యం చక్షుః దదామి | ఆఇశ్వరమ్ మే యోగమ్ పశ్య||8||

శ్లోక ప్రతిపదార్థాలు:

అనేన స్వచక్షుసా ఏవతు - ఈ నీ నేత్రములతో నే
మాం ద్రష్టుమ్ న శక్యసే- నన్ను చూచుటకు శక్తుడవు కావు.
తే దివ్యం చక్షుః దదామి - నీకు దివ్యమైన నేత్రములను ఇచ్చుచున్నాను.
ఐశ్వరమ్ మే యోగమ్ పశ్య- ఈశ్వరసంబంధమైన నా యోగమును చూడుము.

శ్లోక తాత్పర్యము:

"ఈ నీ నేత్రములతో నన్ను చూచుటకు నీవు శక్తుడవు కావు.
నీకు దివ్యమైన నేత్రములను ఇచ్చుచున్నాను.
ఈశ్వరసంబంధమైన నా యోగమును చూడుము."||8||

అంటే ఇంత సమస్త చరచరాత్మకముల స్థావర జంగమగు సమస్త ప్రపంచము తో కూడిన ఆశ్చర్యకరమైన అద్భుతమైన స్వరూపము - అట్టి స్వరూపమును అర్జునా ' నీ నేత్రములతో నా స్వరూపము చూడలేవు' అంటాడు. అందుకని దివ్య దృష్ఠి ని ప్రసాదిస్తాడు. దివ్య దృష్ఠి అంటే దివ్యనేత్రములను ప్రసాదించి, తరువాత కృష్ణుడు తన విశ్వరూపము చూపిస్తాడు.

ఆ దివ్యరూపమునే సంజయుడు మళ్ళీ అదేవిధముగా వర్ణిస్తాడు. ఆ దివ్యరూపమును వర్ణించిన శ్లోకాలు చదవడానికి అద్బుతముగా వుంటాయి

శ్లోకము 9

సంజయ ఉవాచ:

ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః|
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్||9||

స|| హే రాజన్ ! మహాయోగేశ్వరః హరిః ఏవమ్ ఉక్త్వా పార్థాయ పరమమ్ ఐశ్వరమ్ రూపమ్ దర్శయామాస||9||

శ్లోక ప్రతిపదార్థాలు:

రాజన్ - ఓ రాజా
మహాయోగేశ్వరః హరిః ఏవమ్ ఉక్త్వా - మహాయోగి అయిన కృష్ణుడు ఈ విధముగా చెప్పి
పార్థాయ - అర్జునునికి
పరమమ్ ఇశ్వరమ్ రూపమ్ -ఉత్తమమైన ఈశ్వర సంబంధమగు తన రూపమును
దర్శయామాస- చూపసాగెను.

శ్లోక తాత్పర్యము:

"ఓ ( ధృతరాష్ట్ర) మహారాజా,
మహాయోగి అయిన కృష్ణుడు ఈ విధముగా చెప్పి అర్జునునికి
ఉత్తమమైన ఈశ్వర సంబంధమగు తన రూపమును చూపసాగెను."||9||

శ్లోకాములు 10,11

అనేకవక్త్రనయనం అనేకాద్భుతదర్శనమ్|
అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుథమ్||10||
దివ్యమాల్యాంబరధరం దివ్యగన్ధానులేపనమ్|
సర్వాశ్చర్యమయం దేవం అనన్తం విశ్వతో ముఖమ్||11||

స|| (భగవాన్ హరిః) అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణమ్ దివ్యానేకోద్యతాయుధమ్ దివ్యమాలాంబధరమ్ దివ్యగన్ధానులేపనమ్ సర్వాశ్చర్యమయం దేవమ్ అనన్తమ్ విశ్వతోముఖమ్ (దర్శయామాస)|| 10,11||

శ్లోక ప్రతిపదార్థాలు:

అనేక వక్త్ర నయనం - అనేక ముఖములు కళ్ళు గల
అనేకాద్భుత దర్శనం - అనేక అద్భుతములను చూపు
అనేక దివ్యాభరణమ్ - అనేక దివ్యమైన ఆభరణములతో
దివ్యానేకోద్యతాయుధమ్ - దివ్యమైన అనేకమైన ఎత్తబడిన ఆయుధములతో కూడిన
దివ్యమాల్యాంబరధరం - దివ్యమైన మాలలు వస్త్రములు ధరించిన,
దివ్యగన్ధానులేపనమ్ - దివ్యమైన గంధములతో పూయబడిన
సర్వాశ్చర్యమయం దేవం - అనేక ఆశ్చర్యములతో నిండివున్న
అనన్తం విశ్వతో ముఖమ్- అంతములేని , అన్ని వేపుల ముఖములు కల

శ్లోక తాత్పర్యము:

"అనేక ముఖములు కళ్ళు గల, అనేక అద్భుతములను చూపునట్టి,
అనేక దివ్యమైన ఆభరణములతో, అనేకమైన ఎత్తబడిన ఆయుధములతో కూడిన,
దివ్యమైన మాలలు వస్త్రములు ధరించిన, దివ్యమైన గంధములతో పూయబడిన
అనేక ఆశ్చర్యములతో నిండివున్న, అంతములేని, అన్ని వేపుల ముఖములు కల
(తన విశ్వరూపమును కృష్ణుడు అర్జునునికి చూపెను)."||10,11||

శ్లోకము 12

దివిసూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా|
యది భాసః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః||12||

స|| దివి సూర్య సహస్రస్య భాః యుగపత్ యది ఉత్థితా భవేత్ సా తస్యమహాత్మనః భాసః సాదృశీ స్యాత్|| 12||

శ్లోక ప్రతిపదార్థాలు:

దివి సూర్య సహస్రస్య భాః - ఆకాశమందు వేలకొలదీ సూర్యుల కాంతి
యుగపత్ - ఒకే సారి
యది ఉత్థితా భవేత్ - ఒకవేళ వెలిగినచో
సా - అది
తస్యమహాత్మనః భాసః సాదృశీ స్యాత్- ఆ మహాత్ముని కాంతికి సాదృశముగా వుండును.

శ్లోక తాత్పర్యము:

"ఒకవేళ ఆకాశమందు వేలకొలదీ సూర్యుల కాంతి ఒకే సారి వెలిగినచో,
అది ఆ మహాత్ముని కాంతికి సాదృశముగా వుండును."||12||

శ్లోకము 13

తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా|
అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తథా||13||

స|| తదా పాణ్డవః ( అర్జునః) అనేకథా ప్రవిభక్తమ్ కృత్స్నం జగత్ దేవ దేవస్య శరీరే ఏకస్థమ్ అపశ్యత్||13||

శ్లోక ప్రతిపదార్థాలు:

తదా పాణ్డవః - అప్పుడు అర్జునుడు
అనేకథా ప్రవిభక్తమ్ - అనేకవిధములుగా విభజింపబడిన
కృత్స్నం జగత్ - సమస్త జగత్తును
దేవ దేవస్య శరీరే ఏకస్థమ్ అపశ్యత్- దేవ దేవుని శరీరములో ఒక్కచోట చూచెను.

శ్లోక తాత్పర్యము:

"అప్పుడు అర్జునుడు అనేకవిధములుగా విభజింపబడిన
సమస్త జగత్తును దేవ దేవుని శరీరములో ఒక్కచోట చూచెను."|| 13||

శ్లోకము 14

తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః|
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత||14||

స|| తతః సః ధనంజయః విస్మయావిష్ఠః హృష్టరోమా దేవమ్ శిరసా ప్రణమ్య కృతాంజలిః అభాషత||14||

శ్లోక ప్రతిపదార్థాలు:

తతః సః ధనంజయః - అప్పుడు ఆ ధనంజయుడు
విస్మయావిష్ఠః హృష్టరోమా - విస్మయము చెందినవాడై గగుర్పాటుతో
శిరసా ప్రణమ్య - శిరస్సుతో నమస్కరించి
కృతాంజలిః అభాషత - అంజలిఘటించి ఇట్లు పలికెను

శ్లోక తాత్పర్యము:

"అప్పుడు ఆ ధనంజయుడు విస్మయము చెందినవాడై గగుర్పాటుతో,
శిరస్సుతో నమస్కరించి, అంజలిఘటించి ఇట్లు పలికెను." ||14||

శ్లోకము 15

అర్జున ఉవాచ:

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంజ్ఞాన్|
బ్రహ్మాణమీశం కమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్||15||

స|| దేవా తవ దేహే సర్వాన్ దేవాన్ తథా భూతవిశేష సంఘాన్ ( పశ్యామి) కమలాసనస్థం ఈశం బ్రహ్మాణమ్ ( పశ్యామి) సర్వాన్ ఋషీన్ చ దివ్యాన్ ఉరగాంశ్చ చ పశ్యామి||

శ్లోక ప్రతిపదార్థాలు:

దేవా తవ దేహే సర్వాన్ దేవాన్ - ఓ దేవా నీ దేహములో సమస్త దేవతలను
తథా భూతవిశేష సంఘాన్ - అలాగే ప్రాణికోట్ల సమూహములను
కమలాసనస్థం ఈశం బ్రహ్మాణమ్ - కమలాసనుడగు అధిపతి బ్రహ్మను,
సర్వాన్ ఋషీన్ చ - సమస్త ఋషులను
దివ్యాన్ ఉరగాన్ చ పశ్యామి- దివ్యమైన సర్పములను చూచుచున్నాను.

శ్లోక తాత్పర్యము:

"ఓ దేవా, నీ దేహములో సమస్త దేవతలను, అలాగే ప్రాణికోట్ల సమూహములను, కమలాసనుడగు అధిపతి బ్రహ్మను, సమస్త ఋషులను, దివ్యమైన సర్పములను చూచుచున్నాను."

శ్లోకము 16

అనేక బాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోఽనన్తరూపమ్|
నాన్తం న మధ్యం నపునస్తవాదిమ్
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప||16||

స|| హే విశ్వేశ్వర! విశ్వరూప! అనేకబాహూదరవక్త్రనేత్రమ్ అనన్త రూపమ్ త్వామ్ సర్వతః పశ్యామి | పునః (తవ) ఆదిమ్ నపశ్యామి | మధ్యం న ( పశ్యామి) | అన్తమ్ తు న (పశ్యామి)||

శ్లోక ప్రతిపదార్థాలు:
అనేకబాహూదరవక్త్రనేత్రమ్ - అనేకమైన బాహువులు ఉదరములు, ముఖములు., నేత్రములు గల
అనన్త రూపమ్ - అంతములేని రూపముగలవాని
త్వామ్ సర్వతః పశ్యామి - నిన్ను అంతటయును చూచుచున్నాను
పునః (తవ) ఆదిమ్ నపశ్యామి - మళ్ళీ (నీ) మొదలును చూడలేకున్నాను.
మధ్యం న ( పశ్యామి) - మధ్యమును చూడలేకున్నాను
అన్తమ్ తు న (పశ్యామి) - అంతము కూడా చూడలేకున్నాను

శ్లోక తాత్పర్యము:

"ఓ విశ్వేశ్వరా విశ్వరూపా, అనేకమైన బాహువులు ఉదరములు, ముఖములు., నేత్రములు గల, అంతములేని రూపముగలవాని, నిన్ను అంతటయును చూచుచున్నాను. మళ్ళీ నీ మొదలును చూడలేకున్నాను. మధ్యమును చూడలేకున్నాను. అంతము కూడా చూడలేకున్నాను."||16||

శ్లోకము 17

కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్|
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తా
దీప్తానలార్కద్యుతి మప్రమేయమ్||17||

స|| త్వామ్ సమన్తాత్ ( సర్వతః) కిరీటినమ్ గదినమ్ చక్రిణమ్ చ తేజోరాశిమ్ సర్వతః దీప్తిమంతమ్ దీప్తానలార్కద్యుతిమ్ దుర్నిరీక్ష్యం అప్రమేయం పశ్యామి||17||

శ్లోక ప్రతిపదార్థాలు:

త్వామ్ సమన్తాత్ ( సర్వతః) - నిన్ను అంతటను
కిరీటినమ్ గదినమ్ చక్రిణమ్ చ - కిరీటము గలవానినిగా, గదను ధరించిన వానినిగా, చక్రము ధరించిన వానినిగా
తేజోరాశిమ్ సర్వతః దీప్తిమంతమ్ - తేజస్సుయొక్క రాశిగను, అన్నిచోట్లా ప్రకాశించువానినిగను,
దీప్తానలార్కద్యుతిమ్ - మండుతున్న అగ్నియొక్క కాంతిగలవానినిగను,
దుర్నిరీక్ష్యం- చూడశక్యముకానివానినిగను
అప్రమేయం పశ్యామి - పరిమితి లేనివానినిగా చూచుచున్నాను.

శ్లోక తాత్పర్యము:

"నిన్ను అంతటను కిరీటము గలవానినిగా, గదను ధరించినవానినిగా, చక్రము ధరించిఉనవానినిగా, తేజస్సుయొక్క రాశిగను, అన్నిచోట్లా ప్రకాశించువానినిగా, మండుతున్న అగ్నియొక్క కాంతిగలవానినిగా, చూడశక్యము కాని వానినిగా, పరిమితి లేనివానినిగా చూచుచున్నాను."||17||

శ్లోకము 18

త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
త్వం అవ్యయశ్శాశ్వత ధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే||18||

స|| త్వమ్ వేదితవ్యం పరమం అక్షరమ్ ( పరబ్రహ్మం) | త్వం అస్య విశ్వస్య పరం నిధానమ్ ( అధారభూతః) | త్వం అవ్యయః ( నాశరహితః) | (త్వం) శాశ్వత ధర్మగోప్తా| త్వం సనాతనః పురుషః ఇతి మే మతిః||18||

శ్లోక ప్రతిపదార్థాలు:

త్వమ్ వేదితవ్యం - నీవు తెలిసికొన తగినవాడవు,
పరమం అక్షరమ్ ( పరబ్రహ్మం) - సర్వోత్తమమైనవాడవు నాశనములేని వాడవు (పర బ్రహ్మము).
త్వం అస్య విశ్వస్య - నీవు ఈ జగత్తుకి
పరం నిధానమ్ ( అధారభూతః) - ఆధారభూతుడవు.
త్వం అవ్యయః - నీవు నాశరహితుడవు.
శాశ్వత ధర్మగోప్తా- శాశ్వతములగు ధర్మములను కాపాడువాడవు.
త్వం సనాతనః పురుషః - నీవు పురాణపురుషుడవు
ఇతి మే మతిః - అని నా అభిప్రాయము.

శ్లోక తాత్పర్యము:

"నీవు తెలిసికొన తగినవాడవు.
సర్వోత్తమమైనవాడవు. నాశనములేని వాడవు (పర బ్రహ్మము). నీవు ఈ జగత్తుకి ఆధారభూతుడవు.
నీవు నాశరహితుడవు. శాశ్వతములగు ధర్మములను కాపాడువాడవు.
నీవు పురాణపురుషుడవు అని నా అభిప్రాయము."||18||

శ్లోకము 19

అనాది మధ్యాన్తమనన్తవీర్య
మనన్తబాహుం శశిసూర్యనేత్రమ్|
పశ్యామిత్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపన్తమ్||19||

స|| అనన్తబాహుం (త్వాం పశ్యామి) శశి సూర్య నేత్రమ్ (త్వాం పశ్యామి) దీప్తహుతాశవక్త్రమ్ ( త్వాం పశ్యామి ) స్వతేజసా ఇదం విశ్వమ్ తపన్తమ్ త్వామ్ పశ్యామి||

శ్లోక ప్రతిపదార్థాలు:

అనాది మధ్యాన్తం - అది మధ్య అంతము లేనివానినిగను
అనన్త వీర్యం - అపరిమితమైన పరాక్రమము గలవానినిగను
శశి సూర్య నేత్రమ్ - చంద్రుడు సూర్యుడు కన్నులుగా గలవానిని
దీప్తహుతాశవక్త్రమ్- ప్రజ్వలించు అగ్నిహోత్రుని వంటి ముఖము కలవాడును
స్వతేజసా ఇదం విశ్వమ్ తపన్తమ్ - తన తేజస్సుతో సమస్త ప్రపంచమును తపింపచేయుచున్నవానినిగను
త్వామ్ పశ్యామి- నిన్ను చూచుచున్నాను.

శ్లోక తాత్పర్యము:

"అది మధ్య అంతము లేనివానినిగను, అపరిమితమైన పరాక్రమము గలవానినిగను, చంద్రుడు సూర్యుడు కన్నులు గాగలవానినిగను, ప్రజ్వలించు అగ్నిహోత్రుని వంటి ముఖము కలవాడుగను, స్వకీయ తేజస్సుతో సమస్త ప్రపంచమును తపింపచేయుచున్నవానినిగను, నిన్ను చూచుచున్నాను."||19||

శ్లోకము 20

ద్యావాపృథివ్యోరిదమన్తరమ్ హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదమ్
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్||20||

స||హే మహాత్మన్ ! ద్యావాపృథివ్యోః ఇదం అన్తరమ్ సర్వాః దిశాః చ త్వయా ఏకేన వ్యాప్తం హి| ఉగ్రం అద్భుతం ఇదం రూపమ్ దృష్ట్వా లోకత్రయమ్ ప్రవ్యధితమ్ ||20||

శ్లోక ప్రతిపదార్థాలు:

ద్యావాపృథివ్యోః - భూమి ఆకాశముల యొక్క
ఇదం అన్తరమ్ - ఈ మధ్య ప్రదేశము అంతయు,
సర్వాః దిశాః చ - సమస్త దిక్కులన్నియు
త్వయా ఏకేన వ్యాప్తం హి- నీవొక్కడి చేతనే వ్యాపింప బడినవి.
ఉగ్రం అద్భుతం ఇదం రూపమ్ - ఉగ్రమైన అద్భుతమైన ఈ రూపము
దృష్ట్వా- చూచి
లోకత్రయమ్ ప్రవ్యధితమ్ - ముల్లోకములు భయపడుచున్నవి.

శ్లోక తాత్పర్యము:

"ఓ మహాత్మ, భూమి ఆకాశముల యొక్క ఈ మధ్య ప్రదేశము అంతయు, సమస్త దిక్కులన్నియు, నీవొక్కడి చేతనే వ్యాపింపబడినవి.- ఉగ్రమైన అద్భుతమైన ఈ రూపము చూచి ముల్లోకములు భయపడుచున్నవి."||20||

శ్లోకము 21

అమీహి త్వాం సురసంఘా విశన్తి
కేచిత్భీతాః ప్రాంజలయో గృణన్తి|
స్వస్తీత్యుక్త్వా మహర్షి సిద్ధిసంఘాః
స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః||21||

స|| అమీ సురసంఘాః త్వామ్ విశన్తి హ ( ప్రవిశన్తి హ) | కేచిత్ భీతాః ప్రాంజలయః ( కృతాంజలిః) గృణన్తి | మహర్షి సిద్ధసంఘాః స్వస్తి ఇతి ఉక్త్వా పుష్కలాభిః స్తుతిభిః త్వాం స్తువన్తి ||

శ్లోక ప్రతిపదార్థాలు:

అమీ సురసంఘాః - ఈ దేవతా సంఘములు
త్వామ్ విశన్తి హ - నిన్ను ప్రవేశించుచున్నవి గదా
కేచిత్ భీతాః - కొందరు భయపడినవారై
ప్రాంజలయః గృణన్తి - చేతులు జోడించి స్తుతించుచున్నారు.
మహర్షి సిద్ధసంఘాః స్వస్తి ఇతి ఉక్త్వా -
మహర్షి సిద్ధ సంఘములు స్వస్తి పలికి,
పుష్కలాభిః స్తుతిభిః త్వాం స్తువన్తి -సంపూర్ణమైన స్తుతులతో నిన్ను పొగడుచున్నారు

శ్లోక తాత్పర్యము:

"ఈ దేవతా సంఘములు నిన్ను ప్రవేశించుచున్నవి గదా.
కొందరు భయపడినవారై చేతులు జోడించి స్తుతించుచున్నారు.
మహర్షి సిద్ధ సంఘములు స్వస్తి పలికి, సంపూర్ణమైన స్తుతులతో నిన్ను పొగడుచున్నారు." ||21||

శ్లోకము 22

రుద్రాదిత్య వసవో యే చ సాధ్యా
విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|
గన్ధర్వయక్షాసురసిద్ధసంఘా
వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే||22||

స|| రుద్రాదిత్యాః వసవః యే చ సాధ్యాః విశ్వే అశ్వినౌ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః (యే) చ సర్వే ఏవ విస్మితాః త్వాం వీక్ష్యన్తే ||22||

శ్లోక ప్రతిపదార్థాలు:

రుద్రాదిత్యాః వసవః - రుద్రులు ఆదిత్యులు, వసువులు
యే చ సాధ్యాః విశ్వే అశ్వినౌ - సాధ్యులు ఎవరో వారును, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలూ
గంధర్వయక్షాసురసిద్ధసంఘాః - గంధర్వులు, యక్షులు, సురులు సిద్ధుల సంఘములు
సర్వే ఏవ విస్మితాః - అందరూ ఆశ్చర్యముతో
త్వాం వీక్ష్యన్తే - నిన్ను చూచుచున్నారు.

శ్లోక తాత్పర్యము:

" రుద్రులు ఆదిత్యులు, వసువులు, సాధ్యులు ఎవరో వారును, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలూ
గంధర్వులు, యక్షులు, సురులు, సిద్ధుల సంఘములు
అందరూ ఆశ్చర్యముతో నిన్ను చూచుచున్నారు."||22||

శ్లోకము 23

రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్|
బహూదరం బహుదంష్ట్రాకరాలమ్
దృష్ట్వా లోకాః ప్రవ్యధితా స్తథాఽహమ్||23||

స|| హే మహాబాహో! బహువక్త్రనేత్రమ్ బహుబాహూరుపాదమ్ బహూదరమ్ బహుదంష్ట్రాకరాలమ్ తే మహత్ రూపమ్ దృష్ట్వా లోకాః ప్రవ్యధితాః | తథా అహం చ ప్రవ్యధితః||23||

శ్లోక ప్రతిపదార్థాలు:

బహువక్త్ర నేత్రమ్ - అనేక ముఖములు నేత్రములు కల
బహుబాహూరుపాదమ్- అనేక బాహువులు తొడవులు పాదములు కల
బహూదరమ్ - అనేక ఉదరములు కల
బహుదంష్ట్రాకరాలమ్ - అనేక కోరలతో భయంకరమైన,
తే మహత్ రూపమ్ దృష్ట్వా- నీ మహత్తరమైన రూపము చూసి
లోకాః ప్రవ్యధితాః - లోకులు భయపడుచున్నారు.
తథా అహం చ - అలాగే నేను కూడా

శ్లోక తాత్పర్యము:

"అనేక ముఖములు నేత్రములు కల, అనేక బాహువులు తొడవులు పాదములు కల, అనేక ఉదరములు కల, అనేక కోరలతో భయంకరమైన, నీ మహత్తరమైన రూపము చూసి, లోకులు భయపడుచున్నారు.
అలాగే నేను కూడా భయపడుచున్నాను"||23||

శ్లోకము 24

నభః స్పృశమ్ దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్|
దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో||24||

స|| హే విష్ణో! నభః స్పశం దీప్తం అనేకవర్ణమ్ వ్యాత్తాననమ్ దీప్తవిశాలనేత్రమ్ త్వాం దృష్ట్వా ప్రవ్యధితాన్తరాత్మా అహం ధృతిం శమం చ న విన్దామి||24||

శ్లోక ప్రతిపదార్థాలు:

నభః స్పృశం దీప్తం - ఆకాశము నంటుచున్నట్లు వున్న, ప్రకాశించుచున్న
అనేకవర్ణమ్ - అనేక రంగులు కలవాడవు
వ్యాత్తాననమ్- తెరవబడిన నోరు కలవాడవు
దీప్తవిశాలనేత్రమ్- జ్వలించుౘున్న విశాలమైన నేత్రములు కలవాడు అగు
త్వాం దృష్ట్వా - నిన్ను చూచి
ప్రవ్యధితాన్తరాత్మా అహం - వ్యధతో కూడిన మనస్సు కలవాడనై నేను
ధృతిం శమం చ న విన్దామి-ధైర్యమును శాంతిని పొందకున్నాను.

శ్లోక తాత్పర్యము:

"ఆకాశము నంటుచున్నట్లు వున్న, ప్రకాశించుచున్న, అనేక రంగులు కలవాడవు
తెరవబడిన నోరు కలవాడవు, జ్వలించుౘున్న విశాలమైన నేత్రములు కలవాడవు అగు నిన్ను చూచి
వ్యధతో కూడిన మనస్సు కలవాడనై, నేను ధైర్యమును శాంతిని పొందకున్నాను." ||24||

శ్లోకము 25

దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానల సన్నిభాని|
దిశో న జానే న లభే చ శర్మ
ప్రశీద దేవేశ జగన్నివాస||25||

స|| దంష్ట్రాకరాలాని కాలానలసన్నిభానిచ తే ముఖాని దృష్ట్వా దిశః న జానే | శర్మ చ న ఏవ లభే |దేవేశ జగన్నివాస ప్రసీద||25||

శ్లోక ప్రతిపదార్థాలు:

దంష్ట్రాకరాలాని - కోరలచే భయంకరమైన
దృష్ట్వైవ కాలానల సన్నిభాని - కాలాగ్నితో పోలియున్న -
తే ముఖాని దృష్ట్వా - నీ ముఖములను చూచి
దిశః న జానే - దిక్కులను తెలియకున్నాను.
శర్మ చ న ఏవ లభే - సుఖము కూడా పొందక యున్నాను.
దేవేశ జగన్నివాస ప్రసీద- ఓ దేవ దేవా జగన్నివాసా ప్రసన్నుడవగుము.

శ్లోక తాత్పర్యము:

"కోరలచే భయంకరమైన, కాలాగ్నితో పోలియున్న, నీ ముఖములను చూచి దిక్కులను తెలియకున్నాను.
సుఖము కూడా పొందక యున్నాను. ఓ దేవ దేవా జగన్నివాసా ప్రసన్నుడవగుము."

శ్లోకము 26

అమీచ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావని పాలసంఘైః|
భీష్మద్రోణస్సూత పుత్ర స్తథాఽసౌ
సహస్మదీయైరపి యోధముఖ్యైః||26||

స|| అమీ ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే భీష్మః ద్రోణః అసౌ సూతపుత్రః అవనిపాలసంఘైః సహ ఏవ తథా అస్మదీయైః యోధముఖ్యైః అపి ( త్వాం ప్రవిశంతి)||26||

శ్లోక ప్రతిపదార్థాలు:

అమీ ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే - ఈ ధృతరాష్ట్రు ని పుత్రులందరూ
భీష్మః ద్రోణః అసౌ సూతపుత్రః - భీష్మ ద్రోణులు, ఆ సూతపుత్రుడు
అవనిపాలసంఘైః సహ - ఇతర రాజుల సమూహములతో కూడి,
తథా అస్మదీయైః యోధముఖ్యైః అపి - అలాగే మన యోధులలో ముఖ్యులు
( త్వాం ప్రవిశంతి) - నిన్ను ప్రవేశించుచున్నారు. ||26||

శ్లోక తాత్పర్యము:

"ఈ ధృతరాష్ట్రుని పుత్రులందరూ
భీష్మ ద్రోణులు , ఆ సూత పుత్రుడు, ఇతర రాజుల సమూహములతో కూడి,
అలాగే మన యోధులలో ముఖ్యులు కూడా (నిన్ను ప్రవేశించుచున్నారు)."||26||

శ్లోకము 27

వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానికాని|
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సందృశ్యన్తే చూర్ణితైరుత్తమాంగైః||27||

స|| త్వరమానాః దంష్ట్రాకరాలాని భయానకాని ముఖాని ప్రవిశన్తి| కేచిత్ దశనాన్తరేషు విలగ్నాః చూర్ణితైః ఉత్తమాంగైః సందృశ్యన్తే||

శ్లోక ప్రతిపదార్థాలు:
త్వరమానాః - త్వరపడుచున్నవారై
దంష్ట్రాకరాలాని- భయంకరమైన కోరలు గల
భయానకాని ముఖాని - భయంకరమైన ముఖములను
ప్రవిశన్తి -ప్రవేశించుచున్నారు.
కేచిత్ దశనాన్తరేషు విలగ్నాః - కొందరు దంతముల మధ్య చిక్కుకొనినవారై్
చూర్ణితైః ఉత్తమాంగైః సందృశ్యన్తే - చూర్ణము చేయబడిన అంగములతో కనపడుచున్నారు||

శ్లోక తాత్పర్యము:

"(వారు) త్వరపడుచున్నవారై భయంకరమైన కోరలు గల భయంకరమైన ముఖములను ప్రవేశించుచున్నారు.
కొందరు దంతముల మధ్య చిక్కుకొనినవారై చూర్ణము చేయబడిన అంగములతో కనపడుచున్నారు." ||27||

ఈ రాజులు ఎలా ప్రవేసిస్తున్నారు అన్నది ఒక ఉపమానముతో 28, 29 శ్లోకములలో కృష్ణుడు చెపుతాడు.

శ్లోకము 28

యథానదీనాం బహవోఽమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవన్తి|
తథా త్వామీ నరలోకవీరా
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి||28||

స||యథా నదీనాం బహవః అంబు వేగాః సముద్రం ఏవ అభిముఖాః ద్రవన్తి తథా అమీ నరలోక వీరాః అభివిజ్వలంతి వక్త్రాణి విశన్తి (ప్రవిశంతి) ||28||

శ్లోక ప్రతిపదార్థాలు:

యథా నదీనాం బహవః అంబు వేగాః - ఏవిధముగా అనేకమైన నదుల జలప్రవాహములు
సముద్రం ఏవ అభిముఖాః ద్రవన్తి - సముద్రమువేపే ప్రవహించుచున్నవో
తథా అమీ నరలోక వీరాః - అలాగే ఈ నరలోకమందలి వీరులు
అభివిజ్వలంతి వక్త్రాణి - ప్రజ్వలించుచున్న ముఖములు గల
త్వాం విశన్తి - నిన్ను ప్రవేశించుచున్నారు ||28||

శ్లోక తాత్పరము:

"ఏ విధముగా అనేకమైన నదుల జలప్రవాహములు సముద్రమువేపే ప్రవహించుచున్నవో
అలాగే ఈ నరలోకమందలి వీరులు ప్రజ్వలించుచున్న ముఖములు గల నిన్ను ప్రవేశించుచున్నారు."||28||

శ్లోకము 29

యథా ప్రదీప్తం జ్వలనంపతంగా
విశన్తి నాశాయ సమృద్ధవేగాః|
తథైవ నాశాయ విశన్తి లోకా
స్తవాపి వక్త్రాణి సమృద్దవేగాః||29||

స||యథా పతంగాః నాశాయ సమృద్ధవేగాః ప్రదీప్తమ్ జ్వలనమ్ విశన్తి తథా ఏవ లోకాః అపి సమృద్ధవేగాః నాశాయ తవ వక్త్రాణి విశన్తి ( ప్రవిశన్తి)||29||

శ్లోక ప్రతిపదార్థాలు:

యథా పతంగాః నాశాయ సమృద్ధవేగాః- ఏ విధముగా మిడుతలు వినాశముకొఱకు వేగముగా
ప్రదీప్తమ్ జ్వలనమ్ విశన్తి - మండుచున్న అగ్నిలో ప్రవేశించునో
తథా ఏవ లోకాః అపి నాశాయ సమృద్ధవేగాః- అలాగే లోకులు కూడా వారి నాశనము కొఱకు వేగముగా
తవ వక్త్రాణి విశన్తి - నీ నోళ్ళలో ప్రవేశించుచున్నారు.

శ్లోక తాత్పర్యము:

" ఏ విధముగా మిడుతలు వినాశముకొఱకు వేగముగా మండుచున్న అగ్నిలో ప్రవేశించునో
అలాగే లోకులు కూడా వారి నాశనము కొఱకు వేగముగా నీ నోళ్ళలో ప్రవేశించుచున్నారు."||29||

ఇక్కడ 28 వ 29చ శ్లోకాలలో రెండు ఉపమానములు చెప్పబడినవి. నదులు సముద్రము వేపు ఎలా ప్రవహిస్తాయో అని ఒకటి. ఇక్కడ నదులు ఒకే దీక్షతో సముద్రము వేపు పోయినట్లు జనులు కాలుని నోటిలోకి పరిగెడుతున్నారు అని. అయితే నదులు వివేకము లేనివి. అలా అనుకునేటట్లు అయితే రెండవ ఉపమానము వస్తుంది. మిడుతలు జీవరాసులలో వుండేవి. ఏవిధముగా మిడుతలు తమ నాశనము కోసము అగ్నిజ్వాలల వేపు పరుగెడుతాయో అదే విధముగా జనులు కాలుని నోటిలోకి పరిగెడుతున్నారు అని.

శ్లోకము 30

లేలిహ్యసే గ్రసమానస్సమన్తా
ల్లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః|
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో||30||

స|| హే విష్ణో ! జ్వలద్భిః వదనైః సమగ్రాన్ లోకాన్ సమన్తాత్ గ్రసమానః లేలిహ్యసే | తవ ఉగ్రాః భాసః తేజోభిః సమగ్రం జగత్ ఆపూర్య ప్రతపన్తి |

శ్లోక ప్రతిపదార్థాలు:

జ్వలద్భిః వదనైః - మండుచున్న నోళ్ళతో
సమగ్రాన్ లోకాన్ సమన్తాత్ - సమస్త లోకములను అన్ని వేపులనుండి
గ్రసమానః లేలిహ్యసే - మింగుచున్నవాడవై ఆస్వాదించుచున్నావు
తవ ఉగ్రాః భాసః - నీ యొక్క ఉగ్రమైన కాంతులు
తేజోభిః - తమ తేజస్సులచేత
సమగ్రం జగత్ ఆపూర్య - సమస్త జగత్తును
ప్రతపన్తి - తపింపచేయుచున్నవి.

శ్లోక తాత్పర్యము:

"ఓ విష్ణుమూర్తి , మండుచున్న నోళ్ళతో సమస్త లోకములను అన్ని వేపులనుండిమింగుచున్నవాడవై ఆస్వాదించుచున్నావు. నీ యొక్క ఉగ్రమైన కాంతులు తమ తేజస్సులచేత సమస్త జగత్తును తపింపచేయుచున్నవి."||30||

శ్లోకము 31

అఖ్యాహి మే కో భవానుగ్ర రూపో
నమోఽస్తు తే దేవవర ప్రసీద|
విజ్ఞాతు మిచ్ఛామి భవన్తమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్||31||

స|| దేవ వర! ప్రసీద | ఉగ్రరూపః భవాన్ కః | మే అఖ్యాహి | హి తవప్రవృత్తిమ్ న జానామి| ఆద్యం భవన్తమ్ విజ్ఞాతుమ్ ఇచ్ఛామి | తే నమః || 31||

శ్లోక ప్రతిపదార్థాలు:

దేవ వర! ప్రసీద - దేవులలో శ్రేష్ఠుడా అనుగ్రహింపుము
ఉగ్రరూపః భవాన్ కః - ఉగ్రరూపముతో వున్న నీవు ఎవరివి?
మే అఖ్యాహి - నాకు చెప్పుము
హి తవప్రవృత్తిమ్ న జానామి - ఏల అనగా నీ యొక్క ప్రవృత్తిని తెలిసికొనలేకపోతున్నాను
ఆద్యం భవన్తమ్ - అది పురుషుడవగు నిన్ను
విజ్ఞాతుమ్ ఇచ్ఛామి - తెలిసికొన గోరుతున్నాను
తే నమః - నీకు నమస్కారములు.

శ్లోక తాత్పర్యము:

"దేవులలో శ్రేష్ఠుడా, అనుగ్రహింపుము. ఉగ్రరూపముతో వున్న నీవు ఎవరివి?
నాకు చెప్పుము. ఏల అనగా నీ యొక్క ప్రవృత్తిని తెలిసికొనలేకపోతున్నాను.
అది పురుషుడవగు నిన్నుతెలిసికొన గోరుతున్నాను.
నీకు నమస్కారములు."||31||

ఆ వుగ్ర స్వరూపమును చూచి భయపడిన అర్జునుడి ప్రశ్నకు, మూడు శ్లోకాలలో భగవంతుడు సమాధానము ఇస్తాడు.

శ్లోకము 32

శ్రీ భగవానువాచ|

కాలోఽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః|
ఋతేఽపి త్వా న భవిష్యన్తి సర్వే
యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః||32||

స|| ( అహమ్) లోక క్షయకృత్ ప్రవృద్ధః కాలోఽస్మి| లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః | ప్రత్యనీకేషు యే యోధాః అవస్థితాః (తే) సర్వే త్వా ఋతేపి న భవిష్యన్తి ||32||

శ్లోక ప్రతిపదార్థాలు:

లోక క్షయకృత్ ప్రవృద్ధః - లోక సంహారకుడనై విజృంభించిన
కాలః అస్మి- కాలమును నేను
లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః - లోకులను సంహరించుటకు ఈవిధముగా ప్రవర్తించిన వాడను
ప్రత్యనీకేషు యే యోధాః అవస్థితాః - ప్రతిపక్షసైన్యములో యే యోధులు వున్నారో
సర్వే త్వా ఋతేపి - వారందరూ నీవు లేకపోయిననూ
న భవిష్యన్తి - వుండరు.

శ్లోక తాత్పర్యము:

శ్రీ భగవానుడు చెప్పెను.
"లోక సంహారకుడనై విజృంభించిన కాలమును నేను.
లోకులను సంహరించుటకు ఈవిధముగా ప్రవర్తించిన వాడను.
ప్రతిపక్షసైన్యములో యే యోధులు వున్నారో వారందరూ నీవు లేకపోయిననూ వుండరు."

శ్లోకము 33

తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్|
మయైవేతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్||33||

స|| తస్మాత్ త్వం ఉత్తిష్ఠ | శత్రూన్ జిత్వా యశః లభస్వ |సమృద్ధం రాజ్యం భుజ్ఞ్ఖ్వ| ఏతే మయా ఎవ పూర్వం ఏవ నిహతాః | హే సవ్యసాచిన్ (త్వం) నిమిత్తమాత్రం భవ||33||

శ్లోక ప్రతిపదార్థాలు:

తస్మాత్ త్వం ఉత్తిష్ఠ - అందువలన నీవు లెమ్ము
శత్రూన్ జిత్వా యశః లభస్వ - శత్రువులను జయించి యశస్సును పొందుము
సమృద్ధం రాజ్యం భుజ్ఞ్ఖ్వ - పరిపూర్ణమైన రాజ్యమును అనుభవింపుము
ఏతే మయా ఎవ పూర్వం ఏవ నిహతాః - వీరందరూ నాచేత ముందే చంపబడిరి.
హే సవ్యసాచిన్ (త్వం) నిమిత్తమాత్రం భవ - ఓ సవ్యసాచి, నిమిత్తమాత్రముగా వుండుము.

శ్లోక తాత్పర్యము:

"అందువలన నీవు లెమ్ము. శత్రువులను జయించి యశస్సును పొందుము.
పరిపూర్ణమైన రాజ్యమును అనుభవింపుము. వీరందరూ నాచేత ముందే చంపబడిరి.
కావున ఓ సవ్యసాచి, నిమిత్తమాత్రముగా వుండుము."||33||

'నిమిత్తమాత్రం భవ" - అంటే నిమిత్తమాత్రుడివిగా వుండుము అని. అది అర్జునుడికి చెప్పినమాటే కాక, సమస్త ప్రజానీకానికి చెప్పినమాట. అజ్ఞానులు అన్నీ తమ చేతనే చేయబడినవి అని, తనే కర్త అని భావించి తత్ఫలితముగా దుఃఖములు పొందుచున్నారు. చేసిన పనులన్నీ భగవదార్పణము అని చేయవలెను. అదే నిమిత్తమాత్రము గా అని.

శ్లోకము 34

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణమ్ తథాఽనాన్యపి యోధవీరాన్|
మయాహతాం స్త్వం జహి మావ్యధిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్||34||

స||మయా హతాన్ ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణమ్ తథా అన్యాన్ యోధవీరాన్ అపి త్వం జహి | మావ్యధిష్టాః | యుధ్యస్వ | రణే సపత్నాన్ జేతాసి||34||

శ్లోక ప్రతిపదార్థాలు:

మయా హతాన్ ద్రోణం చ భీష్మం చ -
నా చేత చంపబడిన ద్రోణుని, భీష్ముని
జయద్రథం చ కర్ణమ్ తథా అన్యాన్ యోధవీరాన్ అపి -
జయద్రధుని కర్ణుని, అలాగే ఇతర యుద్ధ వీరులను కూడా
త్వం జహి - నీవు చంపుము
మావ్యధిష్టాః - భయపడకుము
యుధ్యస్వ - యుద్ధము చేయుము
రణే సపత్నాన్ జేతాసి- రణములో శత్రువులను జయింపగలవు.

శ్లోక తాత్పర్యము:

"నా చేత చంపబడిన ద్రోణుని, భీష్ముని-
జయద్రధుని, కర్ణుని, అలాగే ఇతర యుద్ధ వీరులను కూడా నీవు చంపుము.
భయపడకుము. యుద్ధము చేయుము. రణములో శత్రువులను జయింపగలవు."||34||

"మావ్యధిష్టాః", యుధ్యస్వ, జేతాసి అంటే "భయపడకు', 'యుద్ధము చేయుము', 'గెలిచెదవు' అని.

జీవితములో అనేక సమస్యలు వస్తాయి. వాటికి భయపడకుండా ధైర్యముతో చేయవలసిన రీతిగా , యుద్ధము చేసినట్లే చేయాలి. జేతాసి అన్నమాటలో మనము చేయవలసిన రీతిగా చేసినచో సత్ఫలము మనకు వచ్చును అని. ఇది అర్జునుడి కి చెప్పినమాటే అయినా , అందరికి వర్తిస్తుంది.

శ్లోకము 35

సంజయ ఉవాచ

ఏతచ్ఛ్రుత్వావచనం కేశవస్య
కృతాంజలిర్వేపమానః కిరీటీ|
నమస్కృత్వా భూయయేవాహ కృష్ణం
సగద్గదం భీత భీతః ప్రణమ్య||35||

స|| కిరీటీ కేశవస్య ఏతత్ వచనం శ్రుత్వా వేపమానః కృతాంజలిః కృష్ణం నమస్కృత్వా భీత భీతః ప్రణమ్య సగద్గదమ్ భూయ ఏవ (ఇదం) ఆహ ||

శ్లోక ప్రతిపదార్థాలు:

కిరీటీ కేశవస్య ఏతత్ వచనం శ్రుత్వా - అర్జునుడు కృష్ణుని ఈ మాటలను విని
వేపమానః కృతాంజలిః కృష్ణం నమస్కృత్వా - వణుకుచున్నవాడై, చేతులు జోడించుకొని కృష్ణునికి నమస్కరిస్తూ
భీత భీతః ప్రణమ్య - భయపడినవాడగుచు వంగి
సగద్గదమ్ - గద్గద స్వరముతో
భూయ ఏవ (ఇదం) ఆహ - మఱల ఇట్లు పలికెను.

శ్లోక తాత్పర్యము:

సంజయుడు చెప్పెను.
"అర్జునుడు కృష్ణుని ఈ మాటలను విని, వణుకుచున్నవాడై చేతులు జోడించుకొని కృష్ణునికి నమస్కరిస్తూ
భయపడినవాడగుచు వంగి, గద్గద స్వరముతో మఱల ఇట్లు పలికెను."||35||

శ్లోకము 36

అర్జున ఉవాచ:

స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ|
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే నమస్యన్తి చ సిద్ధసంఘాః||36||

స|| హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి | అనురజ్యతే చ| రక్షాంసి భీతాని దిశః ద్రవన్తి | సర్వే సిద్ధసంఘాః నమస్యన్తి చ | (ఏతాని) స్థానే ||36||

శ్లోక ప్రతిపదార్థాలు:

తవ ప్రకీర్త్యా - నీ నామము కీర్తింపబడుటవలన
జగత్ ప్రహృష్యతి - లోకముమిక్కిలి సంతోషించుచున్నది.
అనురజ్యతే చ- మిక్కిలి ప్రీతి పొందుతున్నది
రక్షాంసి భీతాని దిశః ద్రవన్తి - రాక్షసులు భయముతో అన్ని దిశలలో పోవుచున్నారు
సర్వే సిద్ధసంఘాః - సమస్త సిద్ధ సమూహములు
నమస్యన్తి చ - నమస్కరించుచున్నవి.
(ఏతాని) స్థానే - (ఇవి) నీకు తగినవి.

శ్లోక తాత్పర్యము:

అర్జునుడు పలికెను."ఓ హృషీకేశా, నీ నామము కీర్తింపబడుటవలన లోకము మిక్కిలి సంతోషించుచున్నది. మిక్కిలి ప్రీతి పొందుతున్నది. రాక్షసులు భయముతో అన్ని దిశలలో పోవుచున్నారు. సమస్త సిద్ధసమూహములు నమస్కరించుచున్నవి. ఇవి నీకు తగినవి."||36||

శ్లోకము 37

కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే|
అనన్త దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసతత్పరం యత్||37||

స|| మహాత్మన్ ! అనన్త ( రూపా) దేవేశ జగన్నివాస సత్ అసత్ చ యత్ ( అస్తి) తత్పరమ్ అక్షరమ్ ( బ్రహ్మమ్) త్వం అసి | బ్రహ్మణః అపి ఆది కర్త్రే ( తథైవ)| గరీయసే తే కస్మాత్ న నమేరన్||37||

శ్లోక ప్రతిపదార్థాలు:

మహాత్మన్ ! అనన్త ( రూపా) దేవేశ జగన్నివాస -
మహాత్మా అనంత రూపా దేవేశా జగన్నివాసా ,
సత్ అసత్ చ యత్ ( అస్తి) -
సత్ పదార్థము అసత్ పదార్థము ఏది కలదో
తత్పరమ్ - వాటిని అధిగమించినవాడవు
అక్షరమ్ ( బ్రహ్మమ్) త్వం అసి - నాశరహితమైన బ్రహ్మము నీవే.
బ్రహ్మణః అపి ఆది కర్త్రే - బ్రహ్మకు కూడా ఆదికారణుడవు.
గరీయసే తే - వారందరికి మించినవాడవగు నీకు
కస్మాత్ న నమేరన్- ఎందుకు నమస్కరింపరు.

శ్లోక తాత్పర్యము:

"ఓ మహాత్మా , అనంత రూపా, దేవదేవేశా, జగన్నివాసా ,
సత్ పదార్థము అసత్ పదార్థము ఏది కలదో
వాటిని అధిగమించినవాడవు,
నాశరహితమైన బ్రహ్మము నీవే.
బ్రహ్మకు కూడా ఆదికారణుడవు.
వారందరికి మించినవాడవగు నీకు ఎందుకు నమస్కరింపరు?"||37||

శ్లోకము 38

త్వామాది దేవః పురుషః పురాణ
స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
వేత్తాఽసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్త రూప||38||

స|| హే అనన్త రూప త్వం ఆది దేవః | త్వం పురాణపురుషః | అస్య విశ్వస్య పరం నిధానమ్ | వేత్తా చ | వేద్యం చ |పరంధామ చ అసి | త్వయా ఏతత్ విశ్వమ్ తతమ్||38||

శ్లోక ప్రతిపదార్థాలు:

త్వం ఆది దేవః - నీవు ఆది దేవుడవు
త్వం పురాణపురుషః - నీవు పురాణ పురుషుడవు.
అస్య విశ్వస్య పరం నిధానమ్ - ఈ జగత్తుకి శ్రేష్ఠమైన ఆధారము.
వేత్తా చ వేద్యం చ - తెలిసిన వాడవు. తెలిసికొనతగిన వాడవు.
పరంధామ చ అసి- శ్రేష్ఠమైన గమ్య స్థానము నీవు.
త్వయా ఏతత్ విశ్వమ్ తతమ్- నీచేత సమస్త విశ్వమూ వ్యాపింపబడినది.

శ్లోక తాత్పర్యము:

"నీవు ఆది దేవుడవు. నీవు పురాణ పురుషుడవు. ఈ జగత్తుకి శ్రేష్ఠమైన ఆధారము.
సమస్తము తెలిసిన వాడవు. తెలిసికొనతగిన వాడవు.
నీవు శ్రేష్ఠమైన గమ్య స్థానము. నీచేత సమస్త విశ్వమూ వ్యాపింపబడినది."||38||

శ్లోకము 39

వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ|
నమో నమస్తేఽస్తు సహస్రకృత్యః
పునశ్చ భూయోఽపి నమో నమస్తే||39||

స|| వాయుః యమః అగ్నిః వరుణః శశాంకః ప్రజాపతిః ప్రపితామహః త్వం అసి | తే సహస్ర కృత్యః నమోనమః అస్తు| తే పునః చ నమః| | భూయః అపి నమః||

శ్లోక ప్రతిపదార్థాలు:

వాయుః యమః అగ్నిః వరుణః - వాయువు, యముడు, అగ్ని, వరుణుడు
శశాంకః ప్రజాపతిః ప్రపితామహః - చంద్రుడు, ప్రజాపతి, బ్రహ్మకు కూడా తండ్రివి
త్వం అసి - నీవే అయివున్నావు.
తే సహస్రకృత్యః నమోనమః అస్తు- నీకు వేయి సార్లు నమస్కారములు
తే పునః చ నమః - నీకు మళ్ళీ నమస్కారములు.
భూయః అపి నమః- మరల నమస్కారములు.

శ్లోక తాత్పర్యము:

" వాయువు, యముడు, అగ్ని, వరుణుడు
చంద్రుడు, ప్రజాపతి, వీరందరికి ,బ్రహ్మకు కూడా తండ్రివి నీవే అయివున్నావు.
నీకు వేయి సార్లు నమస్కారములు. నీకు మళ్ళీ నమస్కారములు. మరల నమస్కారములు."

శ్లోకము 40

నమో పురస్తాదథ పృష్టతస్తే
నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ|
అనన్తవీర్యా మితమిక్రమస్త్వమ్
సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః||40||

స|| సర్వ పురస్తాత్ పృష్ఠతః సర్వత ఏవ నమః అస్తు | (త్వం) అనన్తవీర్యామితవిక్రమః| త్వం సర్వం సమప్నోషి | తతః సర్వః అసి||40||

శ్లోక ప్రతిపదార్థాలు:

సర్వ పురస్తాత్ పృష్ఠతః నమః అస్తు - ఓ కృష్ణా, నీకు ఎదుటను, వెనుకను, నమస్కారములు
సర్వత ఏవ - అన్నివేపుల కూడా నమస్కారములు.
(త్వం) అనన్తవీర్యామితవిక్రమః -
నీవు అపరిమిత సామర్థ్యము పరాక్రమము గలవాడవు.
త్వం సర్వం సమప్నోషి -- నీవు సర్వమును వ్యాపించి వున్నావు
తతః సర్వః అసి -అందువలన సర్వ స్వరూపుడవు అయి వున్నావు.

శ్లోక తాత్పర్యము:

"ఓ కృష్ణా, నీకు ఎదుటను, వెనుకను, నమస్కారములు. అన్నివేపుల కూడా నమస్కారములు. నీవు అపరిమిత సామర్థ్యము పరాక్రమము గలవాడవు. నీవు సర్వమును వ్యాపించి వున్నావు. అందువలన సర్వ స్వరూపుడవు అయి వున్నావు."||40||

శ్లోకము 41

సఖేతి మత్వా ప్రసభం యదుక్తమ్
హే కృష్ణ హే యదవ హే సఖేతి|
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ప్రణయేన వాపి||41|

స|| హే అచ్యుత ! తవ ఇదం మహిమానమ్ అజానతా మయా ప్రమాదాత్ ప్రణయేన వా అపి సఖా ఇతి మత్వా హే కృష్ణ హే యాదవ హే సఖా ఇతి ప్రసభమ్ యత్ ఉక్తం ( తత్ క్షామయే)||41||

శ్లోక ప్రతిపదార్థాలు:

తవ ఇదం మహిమానమ్ అజానతా- నీ ఈ మహిమ తెలియని
మయా ప్రమాదాత్ ప్రణయేన వా అపి - నాచేత అజ్ఞానముతో స్నేహముతో కూడా
సఖా ఇతి మత్వా - సఖుడవు అని తలచి
హే కృష్ణ హే యాదవ హే సఖా ఇతి ప్రసభమ్ యత్ ఉక్తం-
హే కృష్ణ, హే యాదవ హే సఖా అని అలక్ష్యముగా ఎది చెప్పబడినదో్
( తత్ క్షామయే) - (అది క్షమింపుము)

శ్లోక తాత్పర్యము:

"ఓ కృష్ణా , నీ ఈ మహిమ తెలియని నాచేత అజ్ఞానముతో, స్నేహముతో కూడా సఖుడవు అని తలచి,
హే కృష్ణ, హే యాదవ హే సఖా అని అలక్ష్యముగా ఎది చెప్పబడినదో (అది క్షమింపుము)."||41||

శ్లోకము 42

యచ్చాపహాసార్థమసత్కృతోఽసి
విహారశయ్యాసనభోజనేషు|
ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం
తత్‍క్షామయే త్వామహమప్రమేయమ్||42||

స|| హే అచ్యుత ! విహారశయ్యాసనభోజనేషు ఏకః అథవా తత సమక్షం అపి అపహాసార్థమ్ అసత్కృతః అసి | యత్ చ తత్ అప్రమేయమ్ త్వాం అహం క్షామయే||

శ్లోక ప్రతిపదార్థాలు:

విహారశయ్యాసనభోజనేషు -
విహారము సలుపు నప్పుడు, పడుకోనినప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనసమయములలో
ఏకః అథవా - ఒక్కడివే ఉన్నప్పుడు లేక
తత సమక్షం అపి - ఇతరుల సమక్షములో
అపహాసార్థమ్ - పరిహాసముకొఱకు
అసత్కృతః అసి అవమానింపబడితివి.
యత్ చ తత్ - అలాంటివి ఏవి కలవో అవి
అప్రమేయమ్ త్వాం అహం క్షామయే -
అప్రమేయుడగు నీవు నన్ను క్షమించవేడుచున్నాను

శ్లోక తాత్పర్యము:

"ఓ కృష్ణా, విహారము సలుపు నప్పుడు, పడుకోనినప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనసమయములలో ఒక్కడివే ఉన్నప్పుడు, లేక ఇతరుల సమక్షములో, పరిహాసముకొఱకు పరిహసింపబడితివి. అలాంటివి ఏవి కలవో అవి
అప్రమేయుడగు నీవు నన్ను క్షమించవేడుచున్నాను."||42||

శ్లోకము 43

పితాఽసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమోఽస్త్యభ్యద్ధికః కుతోఽన్యో
లోకత్రయేఽప్యప్రతిమప్రభావ||43||

స|| అప్రతిమప్రభావ త్వం చరాచరస్య అస్య లోకస్య పితా అసి| పూజ్యః చ | గరీయాన్ గురుః అసి|లోకత్రయే అపి త్వత్ సమః న అస్తి| అభ్యధికః అన్యః కుతః|

శ్లోక ప్రతిపదార్థాలు:

అప్రతిమప్రభావ - సాటిలేని ప్రభావము కలవాడా
త్వం చరాచరస్య - నీవు సమస్త చరాచరముల యొక్క
అస్య లోకస్య పితా అసి - ఈ ప్రపంచమునకు తండ్రి అయి వున్నావు.
పూజ్యః చ - పూజింపతగిన వాడవు
గరీయాన్ గురుః అసి- శ్రేష్ఠమైన గురువువి
లోకత్రయే అపి త్వత్ సమః న అస్తి-
మూడు లోకములలోనూ నీకు సమానుడు లేడు
అభ్యధికః అన్యః కుతః- నిన్ను మించినవాడు ఎక్కడ?

శ్లోక తాత్పర్యము:

"సాటిలేని ప్రభావము కలవాడా నీవు సమస్త చరాచరములకు, ఈ ప్రపంచమునకు తండ్రి అయి వున్నావు.
పూజింపతగిన వాడవు. శ్రేష్ఠమైన గురువువి. మూడు లోకములలోనూ నీకు సమానుడు లేడు
నిన్ను మించినవాడు ఎక్కడ?"||43||

శ్లోకము 44

తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశ మీడ్యమ్|
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్||44||

స|| తస్మాత్ కాయం ప్రణిధాయ ప్రణమ్య త్వాం ఈశమ్ ఈఢ్యం ప్రసాదయే| దేవ దేవా పుత్రస్య ( అపరాధాః) పితా ఇవ సఖ్యుః సఖా ఇవ ప్రియాయాః ప్రియః ఇవ ( మే అపరాధం) సోఢుం అర్హసి||

శ్లోక ప్రతిపదార్థాలు:

తస్మాత్ కాయం ప్రణిధాయ ప్రణమ్య- అందువలన ఈ శరీరముతో సాష్ఠాంగ నమస్కారము చేసి
త్వాం ఈశమ్ ఈఢ్యం ప్రసాదయే-
ఈశ్వరుడవు స్తుతింపతగినవాడవు అగు నిన్ను వేడుకొనుచున్నాను.
దేవ దేవా పుత్రస్య ( అపరాధాః) పితా ఇవ-
ఓ దేవ దేవా కుమారుని తండ్రివలె,
సఖ్యుః సఖా ఇవ ప్రియాయాః ప్రియః ఇవ
చెలికానుని చెలికానునివలె, ప్రియుని ప్రియునివలె
( మే అపరాధం) సోఢుం అర్హసి- నా అపరాధములు క్షమించుటకు తగినవాడివి.

శ్లోక తాత్పర్యము:

"అందువలన ఈ శరీరముతో సాష్ఠాంగ నమస్కారము చేసి,ఈశ్వరుడవు స్తుతింపతగినవాడవు అగు నిన్ను వేడుకొనుచున్నాను.ఓ దేవ దేవా, కుమారుని తండ్రివలె, చెలికానుని చెలికానునివలె, ప్రియుని ప్రియునివలె నా అపరాధములు క్షమించుటకు తగినవాడివి."||44||

శ్లోకము 45

అదృష్ట పూర్వం హృషితోఽస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే|
తదేవ మే దర్శయ దేవ రూపం
ప్రశీద దేవేశ జగన్నివాస||45||

స|| అదృష్ట పూర్వం దృష్ట్వా హృషితః అస్మి| మే మనః చ భయేన ప్రవ్యధితం| హే దేవ ! జగన్నివాస ప్రసీద||

శ్లోక ప్రతిపదార్థాలు:

అదృష్ట పూర్వం దృష్ట్వా హృషితః అస్మి-
ఏప్పుడూ చూడనిది చూచి సంతోషపడినవాడను.
మే మనః చ భయేన ప్రవ్యధితం -
నా మనస్సు భయముతో మిక్కిలి బాధ పొందినది.
హే దేవ ! జగన్నివాస ప్రసీద -
ఓ దేవా , జగన్నివాస అనుగ్రహింపుము.

శ్లోక తాత్పర్యము:

"ఏప్పుడూ చూడనిది చూచి సంతోషపడినవాడను. నా మనస్సు భయముతో మిక్కిలి బాధ పొందినది.
ఓ దేవా , జగన్నివాస అనుగ్రహింపుము."||45||

శ్లోకము 46

కిరీటినం గదినం చక్రహస్త
మిచ్ఛామిత్వాం ద్రష్టుమహం తథైవ |
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే||46||

స|| అహం త్వాం తథా ఎవ కిరీటినమ్ గదినం చక్రహస్తం ద్రష్టుం ఇచ్ఛామి | సహస్రబాహో విశ్వమూర్తే చతుర్భుజేన తేన రూపేణ ఏవ భవ||46||

శ్లోక ప్రతిపదార్థాలు:

అహం త్వాం తథా ఎవ - నేను ఇదివరకు వలె
కిరీటినమ్ గదినం చక్రహస్తం- కిరీటివి, గదను ధరించినవానిగా, చక్రము చేతిలో గలవాడివిగా
ద్రష్టుం ఇచ్ఛామి - చూచుటకు కోరుచున్నాను
సహస్రబాహో విశ్వమూర్తే - సహస్రబాహో, ఓ విశ్వ మూర్తి
చతుర్భుజేన తేన రూపేణ ఏవ భవ
నాలుగు భుజములకల ఆ రూపముతోనే మరల అగుము.

శ్లోక తాత్పర్యము:

" నేను ఇదివరకు వలె నిన్ను కిరీటివిగను, గదను ధరించినవానిగా, చక్రము చేతిలో గలవాడివిగా చూచుటకు కోరుచున్నాను. ఓ సహస్రబాహో, ఓ విశ్వ మూర్తి నాలుగు భుజములకల పూర్వ రూపము నే ధరింపుము."||46||

శ్లోకము 47

శ్రీభగవానువాచ:

మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శిత మాత్మయోగాత్|
తేజోమయం విశ్వమనన్త మాద్యం
యన్మే త్వదన్యేన న దృష్ట పూర్వమ్||47||

స||హే అర్జున! తేజోమయమ్ విశ్వమ్ అనన్తమ్ ఆద్యం త్వదన్యేన న దృష్టపూర్వమ్ మే యత్ ఇదం పరం రూపమ్ ( అద్రాక్షీః) తత్ (రూపమ్) ప్రసన్నేన మయా తవ ఆత్మయోగాత్ దర్శితమ్||47||

శ్లోక ప్రతిపదార్థాలు:

తేజోమయమ్ విశ్వమ్ అనన్తమ్ ఆద్యం - తేజోమయమైనది, విశ్వరూపమైనది, అంతము లేనిది, మొదటిదియు
త్వదన్యేన న దృష్టపూర్వమ్ - త్వత్ అన్యేన న దృష్ఠపూర్వమ్-
నీవు తప్ప అన్యుల చేత చూడబడని
మే యత్ ఇదం పరం రూపమ్ ( అద్రాక్షీః) -
నా యొక్క ఈ పరమోత్కృష్ఠమైన రూపమును చూచితివి.
తత్ (రూపమ్) ప్రసన్నేన మయా
ఆ రూపము ప్రన్నుడనైన నా చేత
తవ ఆత్మయోగాత్ దర్శితమ్
నీకు ఆత్మశక్తి వలన చూపబడినది.

శ్లోక తాత్పర్యము:

"తేజోమయమైనది, విశ్వరూపమైనది, అంతము లేనిది, మొదటిదియు
నీవు తప్ప అన్యుల చేత చూడబడని
నా యొక్క ఈ పరమోత్కృష్ఠమైన రూపమును చూచితివో,
ఆ రూపము ప్రన్నుడనైన నా చేత నీకు ఆత్మశక్తి వలన చూపబడినది".||47||

శ్లోకము 48

న వేదయజ్ఞాధ్యయనైర్నదానై
ర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః
ఏవం రూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర||48||

స||హే క్రురుప్రవీర | ఏవం రూపః అహమ్ నృలోకే త్వదన్యేన న దృష్ఠః| వేదయజ్ఞాధ్యయనైః దానైః క్రియాభిః ఉగ్రైః తపోభిః ద్రష్టుమ్ న శక్యః|| 48||

శ్లోక ప్రతిపదార్థాలు:

ఏవం రూపః అహమ్ నృలోకే - ఈ నా రూపమును మనుష్య లోకములో
త్వదన్యేన న దృష్ఠః - నీవు తప్ప అన్యులెవరూ చూడలేదు.
వేదయజ్ఞాధ్యయనైః దానైః క్రియాభిః - వేదాయజ్ఞాధ్యయనము చేతనూ, దాన క్రియల చేతనూ
ఉగ్రైః తపోభిః ద్రష్టుమ్ న శక్యః - అతి ఉగ్రమైన తపస్సు చేతనూ చూడశక్యము కాదు.

శ్లోక తాత్పర్యము:

"అర్జునా ఈ నా రూపమును మనుష్య లోకములో, నీవు తప్ప అన్యులెవరూ చూడలేదు.
ఆ రూపము వేదాయజ్ఞాధ్యయనము చేతనూ, దాన క్రియల చేతనూ
అతి ఉగ్రమైన తపస్సు చేతనూ కూడా చూడశక్యము కాదు."||48||

శ్లోకము 49

మాతే వ్యథా మాచ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీద్రుజ్ఞ్మమేదం|
వ్యపేతభీః ప్రీతిమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య||49||

స|| ఈ దృక్ ఘోరం మమ ఇదం రూపమ్ దృష్ట్వా తే వ్యథా మా| విమూఢభావః చ న |త్వం వ్యపేతభీః ప్రీతమనాః ( భవ) | మే తత్ ఇదం రూపం ఏవ పునః ప్రపశ్య||49||

శ్లోక ప్రతిపదార్థాలు:

ఈ దృక్ ఘోరం - ఇటువంటి ఘోరమైన
మమ ఇదం రూపమ్ దృష్ట్వా-నా ఈ రూపమును చూచి
తే వ్యథా మా - నీవు వ్యథ పొందకు
విమూఢభావః చ న - చిత్తవైకల్యము కూడా వలదు
త్వం వ్యపేతభీః ప్రీతమనాః ( భవ) - నీవు భయము లేని వాడవై ప్రసన్న మనస్సు కలవాడవు అగుము
మే తత్ ఇదం రూపం - నా ఆ పూర్వపు రూపమునే
ఏవ పునః ప్రపశ్య- మళ్ళీ చూడుము.

శ్లోక తాత్పర్యము:

"ఇటువంటి ఘోరమైన నా ఈ రూపమును చూచి నీవు వ్యథ పొందకు.
చిత్తవైకల్యము కూడా వలదు. నీవు భయము లేని వాడవై ప్రసన్న మనస్సు కలవాడవు అగుము
నా పూర్వపు రూపమునే మళ్ళీ చూడుము."||49||

శ్లోకము 50

సంజయ ఉవాచ

ఇత్యర్జునం వాసుదేవః తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః|
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ||50||

స|| ఇతి వాసుదేవః అర్జునమ్ ఉక్త్వా తథా స్వకం రూపం భూయః దర్శయామాస | మహాత్మా పునః చ సౌమ్యవపుః భూత్వా భీతం ఏనమ్( అర్జునమ్) ఆశ్వాసయామాస||50||

శ్లోక ప్రతిపదార్థాలు:

ఇతి వాసుదేవః అర్జునమ్ ఉక్త్వా - ఈ విధముగా వాసుదేవుడు అర్జునునికి చెప్పి
తథా స్వకం రూపం భూయః దర్శయామాస- అప్పుడు తన పూర్వ రూపమును మళ్ళీ చూపించసాగెను.
మహాత్మా పునః చ సౌమ్యవపుః భూత్వా - ఆమహాత్ముడు మరల సౌమ్యరూపము పొంది
భీతం ఏనమ్( అర్జునమ్) ఆశ్వాసయామాస - భయపడుతున్న అర్జునునిని ఓదార్చెను.

శ్లోక తాత్పర్యము:

సంజయుడు పలికెను.
"ఈ విధముగా వాసుదేవుడు అర్జునునికి చెప్పి, అప్పుడు తన పూర్వ రూపమును మళ్ళీ చూపించసాగెను.
ఆ మహాత్ముడు మరల సౌమ్యరూపము పొంది భయపడుతున్న అర్జునునిని ఓదార్చెను."||50||

శ్లోకము 51

అర్జున ఉవాచ:

దృష్ట్వేదం మానుషం రూపం తవసౌమ్యం జనార్దన|
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః||51||

స|| హేజనార్దన ! తవ సౌమ్యం ఇదం మానుషం రూపమ్ దృష్ట్వా ఇదానీమ్ స చేతాః సంవృత్తః | ప్రకృతిం గతః అస్మి||51||

శ్లోక ప్రతిపదార్థాలు:

తవ సౌమ్యం ఇదం - నీ సౌమ్యమైన ఈ
మానుషం రూపమ్ దృష్ట్వా - మానుష రూపమును చూచి
ఇదానీమ్ స చేతాః సంవృత్తః - ఇప్పుడు కుదుటపడిన మనస్సు గలవాడను
ప్రకృతిం గతః అస్మి- నా ప్రకృతిని పొందినవాడను అయితిని.

శ్లోక తాత్పర్యము:

"ఓ జనార్దనా , నీ సౌమ్యమైన ఈ మానుష రూపమును చూచి,
ఇప్పుడు కుదుటపడిన మనస్సు గలవాడను, నా ప్రకృతిని పొందినవాడను అయితిని."||51||

శ్లోకము 52

శ్రీభగవానువాచ

సుదుర్దర్శమిదం రూపం దృష్టవానపి యన్మమ|
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః||52||

స|| మమ యత్ (రూపం) దృష్టవాన్ అసి తత్ ఇదం రూపం సుదుర్దర్శమ్ | దేవాః అపి నిత్యం అస్య రూపస్య దర్శన కాంక్షిణః || 52||

శ్లోక ప్రతిపదార్థాలు:

మమ యత్ (రూపం) దృష్టవాన్ అసి - నా యే రూపము చూచితివో
తత్ ఇదం రూపం సుదుర్దర్శమ్ - ఆ రూపము చూచుటకు చాలా దుర్లభము
దేవాః అపి నిత్యం అస్య రూపస్య- దేవతలు కూడా ఎల్లప్పుడు ఆ రూపము
దర్శన కాంక్షిణః - దర్శించుటకు కోరుచున్నారు.

శ్లోక తాత్పర్యము:

భగవంతుడు చెప్పెను.
"అర్జునా, నా యే రూపము చూచితివో ఆ రూపము చూచుటకు చాలా దుర్లభము
దేవతలు కూడా ఎల్లప్పుడు ఆ రూపము దర్శించుటకు కోరుచున్నారు."||52||

శ్లోకము 53

నాహం వైదైర్న తపసా న దానేన న చేజ్యయా|
శక్యం ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా||53||

స|| మామ్ యథా దృష్టవాన్ అసి ఏవం విధః అహం వైదైః ద్రష్టుమ్ న శక్యః| తపసా చ న ( శక్యః)| దానేన చ న ( శయః)| ఇజ్యయా ( యజ్ఞేన) చ న ( శక్యామి)|

శ్లోక ప్రతిపదార్థాలు:

మామ్ యథా దృష్టవాన్ అసి - నన్ను ఏవిధముగా చూచితివో
ఏవం విధః - ఆ రూపముతో
అహం వైదైః ద్రష్టుమ్ న శక్యః - నేను వేదములచేతను చూచుటకు శక్యుడను కాను
తపసా చ న ( శక్యః)- తపస్సుచేత కూడా
దానేన చ న ( శయః)- దానములచేత కూడా
ఇజ్యయా ( యజ్ఞేన) చ న ( శక్యామి)- యజ్ఞములచేత కూడా

శ్లోక తాత్పర్యము:

"నన్ను ఏవిధముగా చూచితివో ఆ రూపముతో, నేను వేదములచేతను చూచుటకు శక్యుడను కాను.
తప్పస్సుచేత కూడా. దానములచేత కూడా. యజ్ఞములచేత కూడా."||53||

శ్లోకము 54

భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోఽర్జున|
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప||54||

స|| పరన్తప ! ఏవం విధః అహమ్ అనన్యయా భక్త్యాతు తత్త్వేన జ్ఞాతుమ్ ద్రష్ఠుమ్ చ ప్రవేష్టుంచ శక్యః అస్మి||

శ్లోక ప్రతిపదార్థాలు:

ఏవం విధః అహమ్ - ఈ విధముగా నేను
అనన్యయా భక్త్యాతు - అనన్యమైన భక్తితో
తత్త్వేన జ్ఞాతుమ్ - యదార్థముగా తెలిసికొనుటకు
ద్రష్ఠుమ్ చ - చూచుటకు
ప్రవేష్టుంచ శక్యః అస్మి - ఐక్యమొందుటకు శక్యుడను అగుచున్నాను

శ్లోక తాత్పర్యము:

"ఓ పరన్తపా , ఈ విధముగా నేను అనన్యమైన భక్తితో యదార్థముగా తెలిసికొనుటకు చూచుటకు
ఐక్యమొందుటకు శక్యుడను అగుచున్నాను."||54||

అనన్యభక్తి చేతనే భగవానుని (1) తెలిసికొనుటకు (2) చూచుట కు (3) ప్రవేశించుటకు- "జ్ఞాతుం, ద్రష్టుం , ప్రవేష్టుం", అన్నవి మూడు సోపానాలు. అనగా భగవంతుడు ఇట్టివాడని పరిజ్ఞానము కలుగుట మొదటి అంతస్తు. భగవంతుడిదగ్గరకు వచ్చి భక్తుడు అతి సమీపముగా దర్శింపగలుగును. ఇది రెండవ అంతస్తు. కరమునందలి అమలకముగా ప్రత్యక్షముగా జూచునట్లు భగవంతుని చూడగలుగును. విశిష్టాద్వైత స్థితిలో భగవంతుని చూసి ప్రవేశించి అతనిలో ఐక్యమైపోవును. అదే మూడవ సోపానము. అదే పూర్ణ అద్వైత స్థితి.

మొదటిది సామీప్యము
రెండవది సారూప్యము
మూడవది సాయుజ్యము

ఇదియే మోక్షము.

అంతేకాదు ఆఖరి శ్లోకములో గీతాశాస్రము యొక్క సారము చెప్పబడుతుంది.

శంకరాచార్యులవారు తమ భాష్యములో ఆఖరి శ్లోకము - "సర్వస్య గీతాశాస్త్రస్య సారభూతః"- సంపూర్ణ గీతా శాస్త్రము యొక్క సారము చెప్పబడినది అని. ఈ సారము ఎందుకు ఎవరికోసము చెప్పబడినది? . "అనుష్ఠేయత్వేన" గీతాశాస్త్రమును అనుసరించి అనుష్ఠానము చేయువారికి అని.

శ్లోకము 55

మత్కర్మకృన్మత్పరమో మద్భక్తసంగవర్జితః|
నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాణ్డవ||55||

స|||హే పాణ్దవ ! మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః సర్వభూతేషు నిర్వైరః యః - సః మామ్ ఏతి ||

శ్లోక ప్రతిపదార్థాలు:

మత్కర్మకృత్ - నాకొఱకై కర్మలు చేయువాడు
మత్పరమః - నన్నే నమ్మిన వాడు
మద్భక్తః - నాయందే భక్తి కలవాడు
సంగవర్జితః - సంగములను విడిచినవాడు
సర్వభూతేషు నిర్వైరః యః - సమస్త భూతముల యందు వైరము లేని వాడు
సః మామ్ ఏతి - అతడు నన్ను పొందును.

శ్లోక తాత్పర్యము:

"ఓ పాండవ నాకొఱకై కర్మలు చేయువాడు, నన్నే నమ్మిన వాడు, నాయందే భక్తి కలవాడు, సంగములను విడిచినవాడు
సమస్త భూతముల యందు వైరము లేని వాడు, అతడు నన్ను పొందును."||55||

అంటే 'మత్ కర్మకృత్' - నాకొరకే కర్మలను చేయువాడు ( కర్మయోగము), 'మత్ పరమో' - నన్నే పురుషార్థముగా నమ్మిన వాడు ( ధ్యానయోగము), 'మత్ భక్తః' - నాయందే భక్తి కలవాడు ( భక్తి యోగము), 'సర్వభూతేషు నిర్వైరః' - సమస్త ప్రాణులయందు ద్వేషము లేని వాడు, 'సంగవర్జితః' - మమత్వము వదిలిన వాడు ( జ్ఞానయోగము) , 'అట్టి వాడు 'నన్ను' పొందుతాడు అన్న మాట.

ఇది ముందు చెప్పిన మాటే.

విశ్వరూపసందర్శనము తరువాత పూర్తిగా నమ్మకము కలిగించి మళ్ళీ అదే మాట చెప్పడముతో
ఆ మాట మీద మనకి ధృఢ నమ్మకము కలగడము కోసమే అన్న మాట.

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగోనామ
ఏకాదశోఽధ్యాయః
ఓం తత్ సత్