||భగవద్గీత ||
|| పదమూడవ అధ్యాయము ||
||క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము -అర్థతాత్పర్యాలతో ||
|| om tat sat|
||ఓం తత సత్||
అర్జున ఉవాచ:
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవచ |
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ ||
"ఓ కృష్ణా ప్రకృతిని పురుషుని క్షేత్రమును క్షేత్రజ్ఞునుని జ్ఞానమును జ్ఞేయమును వీటినన్నిటిని తెలియగోరుచున్నాను"
శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
శ్రీమద్భగవద్గీత
పదమూడవ అధ్యాయము
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము
ఇది పదమూడవ అధ్యాయము.
కొందరు పండితులు భగవద్గీత ని మూడు భాగములుగా విభజించి, మొదటి ఆరు సర్గలు కర్మ షట్కము అని, రెండవ ఆరు సర్గలు భక్తి షట్కము అని , ఆఖరి ఆరు సర్గలు అంటే పదమూడవ సర్గనుంచి పదునెనిమిది సర్గ వఱకు జ్ఞాన షట్కము అని చెపుతారు. అంటే ఈ ఆఖరి ఆరు సర్గలలో జ్ఞాన సంబంధమైన విచారణ ముఖ్యము. అందులో ఈ పదమూడవ అధ్యాయము జ్ఞానషట్కములో మొదటి సోపానము అన్నమాట. ఈ సర్గ జ్ఞాన సంబంధమైన విచారణ, ముఖ్యముగా క్షేత్రము అంటే ఏమిటి? క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి? అన్న దాని గురించి విచారణ.
జ్ఞానము గురించి వింటూనే వున్నాము. ఏడవ అధ్యాయము అంటే జ్ఞాన యోగములో కృష్ణుడు తనయొక్క పరా అపరా ప్రకృతులగురించి వర్ణిస్తాడు. తన అపరా ప్రకృతి ఎనిమిది విధములు అని, జీవ రూపమైన పరా ప్రకృతి అపరా ప్రకృతి కన్నాఉత్కృష్ఠమైనది అని చెపుతాడు. ఈ పరా అపరా ప్రకృతుల సహాయముతో భగవంతుడు సమస్త సృష్ఠి స్థితి లయ కారకుడు.
శంకరాచార్యులవారు తమ భాష్యములో పదమూడవ అధ్యాయము మీద ఇలా చెపుతారు. "తత్ర క్షేత్ర క్షేత్రజ్ఞలక్షణ ప్రకృతి ద్వయ నిరూపణ ద్వారా ఈశ్వరస్య తత్త్వనిర్ధారణాయ క్షేత్రాధ్యాయః ఆరభతే". అంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల లక్షణముల ద్వారా ప్రకృతి ద్వయములను నిరూపిస్తూ ఈశ్వరతత్త్వము నిర్ధారణ చేయుటకు ఈ క్షేత్రాధ్యాయము మొదలు పెట్టబడినది అని. అంటే పరా అపరా ప్రకృతుల మీద, క్షేత్ర క్షేత్రజ్ఞుల మీద విచారణతో పరమాత్వ తత్త్వము అర్థము చేసుకోవడమే ఈ అధ్యాయము యొక్క ముఖ్య భూమిక.
పన్నేండవ అధ్యాయములో "అద్వేష్ఠా సర్వభూతానాం" అన్న శ్లోకము నుంచి చివరిదాకా ఏడు శ్లోకాలలలో తత్త్వ జ్ఞానుల నిష్ఠ వివరింపబడినది. ఆ శ్లోకాలలో భగవంతుని పీతి పాత్రుడగు వాని ముప్పది ఐదు గుణములు చెప్పబడినవి. అటువంటి గుణముల కల భక్తుని యొక్క తత్త్వజ్ఞానము వివరించడమే ఈ అధ్యాయము యొక్కముఖ్య అంశము.
సగుణ నిర్గుణ బ్రహ్మముల యొక్క ఉపాసన, ఆ ఉపాసన చేయు భక్తుల లక్షణములు పన్నెండవ అధ్యాయము లో అంటే భక్తి యోగము లో విపులముగా తెలిసికొనిన తర్వాత అర్జునుడు నిర్గుణ బ్రహ్మ తత్వము జ్ఞానము సంబధించిన విచారణను అట్టి పరమాత్మను పొందుటకు ఉపాయము గురించి తెలిసుకొనగోరి కృష్ణుని అడుగుతాడు అన్నమాట. పదమూడవ అధ్యాయము అర్జునుడు పరమాత్మ తత్త్వము తెలిసికొన గోరి అడిగిన ప్రశ్నతో మొదలవుతుంది
.
శ్లోకము 1
అర్జున ఉవాచ||
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ|
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ||1||
స||హే కేశవ ! ప్రకృతిమ్ పురుషం చ ఏవ క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ జ్ఞానమ్ జ్ఞేయం చ ఏతత్ వేదితుమ్ ఇచ్ఛామి||1||
శ్లోకార్థములు:
ప్రకృతిమ్ పురుషం చ ఏవ - ప్రకృతిని పురుషుని గురించి
క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ - క్షేత్రమును క్షేత్రజ్ఞుని గురించి
జ్ఞానం జ్ఞేయం చ - జ్ఞానమును జ్ఞేయమును
ఏతత్ వేదితుమ్ ఇచ్ఛామి -వీటన్నిటిని తెలిసికొన గోరుతున్నాను.
శ్లోక తాత్పర్యము:
"ఓ కేశవా, ప్రకృతిని పురుషుని గురించి, క్షేత్రమును క్షేత్రజ్ఞుని గురించి,
జ్ఞానమును జ్ఞేయమును, వీటన్నిటిని తెలిసికొన గోరుతున్నాను." ||1||
అంటే ఇక్కడ ప్రకృతి పురుషుల గురించి, జ్ఞానము, జ్ఞేయము అంటే తెలిసికొనబడతగిన పరమాత్మ గురించి, క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించి విడమర్చి చెప్పమని అర్జునునిప్రశ్న అదే ప్రార్థన. ఇవే ఈ అధ్యాయములే చెప్పబడే మాటలు.
ఆ అర్జునిని ప్రశ్నవలన ఈ అధ్యాయములోని ముఖ్యవిషయాలు తెలుస్తాయి. కాని కొన్ని భగవద్గీత సంచికలలో అర్జునుని ప్రశ్నరూపమైన శ్లోకము లేదు. శ్రీ శంకరాచార్యులవారి భగవద్గీతలో కూడా అర్జునిని ప్రశ్నరూపమైన శ్లోకము లేదు. శంకరభగవత్పాదుల భగవద్గీతలో పదమూడవ అధ్యాయములో మొదటి శ్లోకము శ్రీభగవానువాచ అంటూ శ్రీకృష్ణుని ప్రవచనముతో ( అదే అర్జునిని ప్రార్థనకి వచ్చిన సమాధానము కూడా ) అధ్యాయము మొదలవుతుంది.
శ్లోకము 2
శ్రీభగవానువాచ ||
ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిదీయతే|
ఏతద్యోవేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||2||
స|| కౌన్తేయ! ఇదం శరీరం క్షేత్రం ఇతి అభిదీయతే| ఏతత్ యః వేత్తి తం క్షేత్రజ్ఞః ఇతి తత్ విదః ప్రాహుః||2||
శ్లోకార్థములు:
ఇదం శరీరం - ఈ శరీరము
క్షేత్రం ఇతి అభిదీయతే - క్షేత్రము అని చెప్పబడుచున్నది
ఏతత్ యః వేత్తి - దీనిని ఎవరు తెలిసికొనుచున్నారో
తం క్షేత్రజ్ఞః ఇతి - వానిని క్షేత్రజ్ఞుడు అని
తత్ విదః ప్రాహుః- అది తెలిసిన వారు చెప్పుదురు.
శ్లోక తాత్పర్యములు
"ఓ కౌన్తేయా, ఈ శరీరము క్షేత్రము అని చెప్పబడుచున్నది. దీనిని ఎవరు తెలిసికొనుచున్నారో
వానిని క్షేత్రజ్ఞుడు అని , ఆ క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించి తెలిసిన వారు చెప్పుదురు".||2||
క్షేత్రము అంటే భూమి లేక పొలము అని. ఏ విధముగా పొలములో నాటిని బీజములు అభివృద్ధి చెందడానికి భూమి ఎంత సహాయ కారియో, అదే విధముగా జ్ఞానము అనే బీజము అభివృద్ధి చెందడానికి ఈ శరీరము కూడా సహాయకారి. అంటే జ్ఞాన బీజమునకు, శరీరము క్షేత్రములాగ సహకరిస్తుంది. కనుక శరీరమే క్షేత్రమని చెప్పబడినది. క్షేత్రమగు శరీరమును తెలిసికొన గల ప్రజ్ఞ కలిగిన వాడే క్షేత్రజ్ఞుడు. అతడే ప్రత్యగాత్మ (ఆత్మ). ఇది ఈ తత్త్వజ్ఞానము తెలిసినవారు చెప్పుమాట.
ఇది అర్జునుని ప్రశ్నకు పూర్తి సమాధానము కాదు. మూడవ శ్లోకములో ఇంకా వస్తుంది.
మొదటి శ్లోకములోని అర్జునిని ప్రశ్నలేకపోతే ఇదంతా, అంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి, కృష్ణుడు ఎందుకు మొదలెట్టాడు అని మనకు ప్రశ్నరావచ్చు. అర్జునుని ప్రశ్నలేకపోయినా కృష్ణుని క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి ప్రవచనము సందర్భానుసారమే ! ఎలా అంటే ఈ ప్రవచనము పన్నెండవ అధ్యాయముతో కలిసి వున్నట్లుగా చదవాలి.
పన్నెండవ అధ్యాయములో అంటే భక్తి యోగములో మొదటి శ్లోకము అర్జునిని ప్రశ్న సతతయుక్తులై నిన్ను ఉపాశించే భక్తులు, ఇంద్రియగోచరముకాని అక్షరపరబ్రహ్మము ను ఉపాశించేవారు - వీరిద్దరిలో యోగము ఎక్కువ తెలిసినవారు ఎవరు అని . ఆ ప్రశ్నకు సమాధానముగా కృష్ణుడు కోరికలు వదలి అక్షరోపాసకులని పక్కన పెట్టి భక్తి తో యవరు తనని నిత్యయుక్తులై పరమశ్రద్ధతో ఉపాశించేవారు యోగులు అని చెపుతాడు. కాని అక్షరోపాసకుల ప్రయాస మిగిలినవారి ప్రయాసకన్నా కష్ఠము అని చెప్పి, ఏడు శ్లోకాలలో అక్షరోపాసకుల గుణములను వల్లిస్తాడు. ఇక మిగిలినది ఆ అక్షరోపాసకుల తత్త్వజ్ఞానము. ఆ తత్త్వజ్ఞానమే ఈ అధ్యాయము యొక్క ముఖ్యాంశము. ఆ తత్త్వజ్ఞానానికి క్షేత్ర క్షేత్రజ్ఞుల కి సంబంధము ఏమిటి అని అనిపించవచ్చు.
ఆ తత్వ జ్ఞానము గురించి అంటే ఈశ్వరుని యొక్కప్రకృతి గురించి ఏడవ అధ్యాయములో చెప్పడమైనది. ఈశ్వరుని ప్రకృతి రెండు విధములు అని. ఆ రెండు ప్రకృతులు అంటే పరా అపరా అని చెప్పడమైనది. అ రెండు ప్రకృతులే ఇక్కడ క్షేత్ర క్షేత్రజ్ఞులు. ఈ రెండు ప్రకృతులద్వారా ఈశ్వరుడు జగదుత్పత్తి స్థితి లయములకు కారకుడవుతున్నాడు. క్షేత్ర క్షేత్రజ్ఞులనే ఈ రెండు ప్రకృతులనుగురించే ఈ అధ్యాయము. అందుకని అర్జుని ప్రశ్న లేకపోయినా ఈ అధ్యాయములో కృష్ణభగవానుని మొదటి శ్లోకము పన్నెండవ సర్గలోని అర్జునిని ప్రశ్నకి ఇచ్చే సమాధానము లో మిళితమౌతుంది.
శ్లోకము 3
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత|
క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ||3||
స|| హే భారత! సర్వక్షేత్రేషు మామ్ క్షేత్రజ్ఞం చ అపి విద్ధి | క్షేత్ర క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్ తత్ (ఏవ) జ్ఞానం (ఇతి) మమ మతం||3||
శ్లోకార్థములు:
సర్వక్షేత్రేషు - సమస్త క్షేత్రములందు
మామ్ క్షేత్రజ్ఞం చ అపి విద్ధి - నన్ను క్షేత్రజ్ఞునిగా తెలిసికొనుము
క్షేత్ర క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్ - క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి జ్ఞానము ఏది కలదో
తత్ (ఏవ) జ్ఞానం - అదియే జ్ఞానము తెలిసికొనుము
(ఇతి) మమ మతం- అది నా అభిప్రాయము.
శ్లోక తాత్పర్యములు
"ఓ భారత, సమస్త క్షేత్రములందు నన్ను క్షేత్రజ్ఞునిగా తెలిసికొనుము. క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి జ్ఞానము ఏది కలదో- అదియే జ్ఞానము తెలిసికొనుము. అది నా అభిప్రాయము".||3||
కృష్ణుడు తన మొదటి శ్లోకములో క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరముగురించి క్షుణ్ణము గా తెలిసికొనినవాడు అని చెప్పాడు. అంతే కాదు. ఇంకా తెలిసికొనవలసినది చాలావుంది.
ఈ శ్లోకములో జీవాత్మ యే క్షేత్రజ్ఞుడు అని చెప్పిన కృష్ణుడు ఇప్పుడు రహస్యముచెపుతాడు.
'క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి'- నన్నే క్షేత్రజ్ఞుడని కూడా తెలిసికొనుము.
ఏదో ఒక క్షేత్రానికి క్షేత్రజ్ఞుడు కాదు
'సర్వక్షేత్రేషు భారత !' - 'సమస్త క్షేత్రములందు' - "నేనే క్షేత్రజ్ఞుడను" !
అంటే పరమాత్మ యే క్షేత్రజ్ఞుడు అని.
అన్నిభూతములలోనూ పరమాత్మయే క్షేత్రజ్ఞుని రూపములో ఉన్నాడన్నమాట.
దీని భావము జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అని.
ఇదే బ్రహ్మసూత్రాలలో మహావాక్యము.
ఇక్కడ అది భగవంతుని ద్వారా వచ్చిన వాక్యము.
ఇంకోమాట.
క్షేత్ర క్షేత్రజ్ఞయోః జ్ఞానం- క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానము ఏది వుందో
తత్ జ్ఞానమ్ - అది నిజమైన జ్ఞానము
అంటే కృష్ణభగవానుడు తన అభిప్రాయము చెపుతున్నాడు.
క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానమే నిజమైన జ్ఞానము అని.
శ్లోకము - 4
తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్|
స చ యో యత్ప్రభావశ్చ యత్ ప్రభావః చ ||4||
స||తత్ క్షేత్రం యత్ చ ( తత్ క్షేత్రం) యాదృక్ చ ( తత్ క్షేత్రం) యత్ వికారి ( తత్ క్షేత్రం) యతః చ యత్ సః ( క్షేత్రజ్ఞః) చ యః (సః) యత్ ప్రభావః చ తత్ ( సర్వం) సమాసేన ( సంక్షేపేన) మే శృణు ||4||
శ్లోకార్థములు:
తత్ క్షేత్రం యత్ చ - ఆ క్షేత్రము ఏదియో
యాదృక్ చ - ఎటువంటిదో
యత్ వికారి -ఎట్టి వికారములు కలదో
యతః చ యత్ - దేనినుండి ఏవిధముగా ( ఉత్పత్తి అయినదో)
సః ( క్షేత్రజ్ఞః) చ - ఆ క్షేత్రజ్ఞుడు కూడ
యత్ ప్రభావః చ - ఎట్టి ప్రభావము కలవాడో
తత్ ( సర్వం) సమాసేన - అది సంక్షేపముగా
మే శృణు - వినుము.
శ్లోక తాత్పర్యము
" ఆ క్షేత్రము ఏదియో , ఎటువంటిదో, ఎట్టి వికారములు కలదో, దేనినుండి ఏవిధముగా (ఉత్పత్తి అయినదో),
ఆ క్షేత్రజ్ఞుడు ఎట్టి ప్రభావము కలవాడో, అది సంక్షేపముగా వినుము.||4||
క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానమే నిజమైన జ్ఞానము అన్నప్పుడు ఆ క్షేత్రము ఏమిటి? ఎటువంటిది? ఏ మార్పులు చెందుతుంది? ఏ కారణము చేత ఏ విధముగా మారుతుంది అన్నప్రశ్నలు వస్తాయి. అలాగే క్షేత్రజ్ఞుడు ఎవరు? అతని ప్రభావము ఎటువంటిది అన్నవి కూడా సహజమే. వాటికి సమాధానాలే ఈ అధ్యాయములోని కృష్ణుని ప్రవచనము
శ్లోకము 5
ఋషిభిర్భహుధా గీతం ఛన్దోభిర్వివిధైః పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః||5||
స||( తత్ జ్ఞానం) ఋషిభిః బహుథా పృథక్ వివిధైః ఛన్దోభిః గీతమ్ | హేతుమద్భిః వినిశ్చితైః బ్రహ్మసూత్రపదైఃచ ఏవ ( గీతమ్) ||5||
శ్లోకార్థములు:
ఋషిభిః బహుథా - ఋషులచేత అనేక విధములుగా
పృథక్ వివిధైః - వేరు వేరుగా పలువిధములైన
ఛన్దోభిః గీతమ్ - వేదములలో గానము చేయబడినది
హేతుమద్భిః- హేతువులతో కూడిన
వినిశ్చితైః - బాగుగా నిశ్చయింపబడినట్టి
బ్రహ్మసూత్రపదైఃచ ఏవ - బ్రహ్మ సూత్ర పదములచేత కూడా
శ్లోక తాత్పర్యము
"ఋషులచేత అనేక విధములుగా వేరు వేరుగా పలువిధములైన వేదములలో హేతుయుక్తముగా గానము చేయబడినది.
బాగుగా నిశ్చయింపబడినట్టి బ్రహ్మ సూత్ర పదములచేత కూడా చెప్పబడినది"|| 5||
క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానము చాలా పురాతనమైనది. ఋషులు వేదాలలో అనేకవిధములుగా ఈ జ్ఞానముగురించి గానము చేశారు. ఋగ్వేదములో సూక్తములు వేరు వేరు ఋషుల ద్వారా చెప్పబడినవి. తైత్తరీయోపనిషద్ లో బ్రహ్మము మీద "యతోవాచా నివర్తన్తే| అప్రాప్య మనసా సహ| అని చెప్పబడినది. అలాగే బ్రహ్మమును సూచించే పదాల చేత ఉపనిషత్తులలో వేదాలలో, బ్రహ్మ సూత్రాలలో దీనిని నిశ్చయించి చెప్పారు.
ఇలా చెప్పడములో ముఖ్య ఉద్దేశ్యము ఇప్పుడు చెప్పబడుతున్న జ్ఞానము పురాతనమైనది, అంటే తెలిసినదే అని. ఇక కృష్ణుడు క్షేత్రము క్షేత్రజ్ఞుల గుణములు చెపుతాడు..
శ్లోకములు 6,7
మహాభూతాన్యహఙ్కారో బుద్ధిరవ్యక్తమేవ చ |
ఇన్ద్రియాణి దశైకం చ పఞ్చ చేన్ద్రియగోచరాః||6||
ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సఙ్ఘాతశ్చేతనా ధృతిః|
ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్||7||
స||మహాభూతాని అహంకారః బుద్ధిః అవ్యక్తం ఏవ చ దశ ఏకం చ ఇన్ద్రియాణి పంచ ఇన్ద్రియగోచరాః చ ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతః చేతనా ధృతిః ఏతత్ సవికారం క్షేత్రం సమాసేన ఉదాహృతమ్||6,7||
శ్లోకార్థములు:
మహాభూతాని- పంచ మహాభూతములు
అహంకారః బుద్ధిః అవ్యక్తం ఏవ చ - అహంకారము, బుద్ధి , మూల ప్రకృతి కూడా
దశ ఏకం చ ఇన్ద్రియాణి - పదనొకండు ఇంద్రియములు
పంచ ఇన్ద్రియగోచరాః చ - ఇంద్రియ విషయములు ఐదు
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం - కోరిక, ద్వేషము, సుఖము దుఃఖము
సంఘాతః - దేహేంద్రియాదుల సముదాయము
చేతనా ధృతిః - తెలివి ధైర్యము
ఏతత్ సవికారం - అను ఈ వికారములతో కూడిన (శరీరము)
క్షేత్రం - క్షేత్రము అని
సమాసేన ఉదాహృతమ్ - సంక్షేపముగా చెప్పబడినది
శ్లోక తాత్పర్యము:
"పంచ మహాభూతములు అహంకారము, బుద్ధి , అలాగే మూల ప్రకృతి, పదనొకండు ఇంద్రియములు
ఇంద్రియ విషయములు ఐదు; కోరిక, ద్వేషము, సుఖము దుఃఖము, దేహేంద్రియాదుల సముదాయము
తెలివి, ధైర్యము ,అను ఈ వికారములతో కూడిన (శరీరము) క్షేత్రము అని సంక్షేపముగా చెప్పబడినది."||6,7||
".
'ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి ' ( 13.2) అంటూ ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది అంటూ మొదలెట్టినా దానిని ఇంకా విశదీకరిస్తూ కృష్ణుడు ఇలాచెపుతాడు. క్షేత్రమనగా ఒక స్థూలదేహమే కాదు. స్థూల సూక్ష్మ పంచమహాభుతములు మూలప్రకృతి (మాయ), అహంకారము , మనస్సు , బుద్ధి , ఇచ్ఛా ద్వేషాది దుర్వృత్తులు, ధృత్యాది సద్వృత్తులు ఇవన్నీ క్షేత్రము క్రిందకే వచ్చును.(13.5,6)
క్షేత్రము అంటే స్థూల శరీరమే కాదు దానితో కూడిన వికారములు కూడా క్షేత్రము అన్నమాట.
ఇక ఐదు శ్లోకాలలో క్షేత్రజ్ఞుని గుణములు వర్ణిస్తాడు కృష్ణుడు. ఈ గుణములే జ్ఞానము కూడా. ఇవే జ్ఞాన సాధనములు కూడా.
శ్లోకము - 8
అమానిత్వం అదమ్భిత్వం అహింసా క్షాన్తిరార్జవమ్|
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః||8||
స|| అమానిత్వం, అదమ్భిత్వం, అహింసా, క్షాన్తిః, ఆర్జవమ్, అచార్యోపాసనమ్, శౌచమ్ (బాహ్యాంతరశుచిత్వమ్), స్థైర్యమ్, ఆత్మవినిగ్రహః,(ఏతత్ సర్వం జ్ఞానం ఇతి ప్రోక్తమ్)||8||
శ్లోకార్థములు:
అమానిత్వం - తనని తాను పొగడు కొనకుండుట
అదమ్భిత్వం - డంబము లేకుండుట
అహింసా - పరులను భాదించకుండా ఉండుట
క్షాన్తిరార్జవమ - ఓర్పు వుండడము కుటిలత లేకుండుట
అచార్యోపాసనమ్- గురుసేవా తత్పరుడై యుండుట
శౌచమ్- బాహ్యాంతర శుచిత్వము
స్థైర్యమ్ - స్థిరముగా వుండుట ( ధర్మ మార్గమున)
ఆత్మవినిగ్రహః- మనస్సును నిగ్రహింపగలిగి ఉండుట.
శ్లోక తాత్పర్యము:
"తనని తాను పొగడు కొనకుండుట, డంబము లేకుండుట, పరులను భాదించకుండా ఉండుట
ఓర్పు వుండడము, కుటిలత లేకుండుట, గురుసేవా తత్పరుడై యుండుట, బాహ్యాంతర శుచిత్వము
ధర్మ మార్గమున స్థిరముగా వుండుట, మనస్సును నిగ్రహింపగలిగి ఉండుట"|| 8||
జ్ఞానము అంటే లక్ష్యము చేరుటకు కావలసిన నైతిక అధ్యాత్మిక సంపత్తియే అని ఇక్కడ అర్థము. ఇక్కడ చెప్పబడిన గుణములన్నీ సాధకునకు, ముముక్షువునకు ఉండవలసిన లక్షణములు. అధ్యాత్మిక మార్గములో పోవు వాడికి ఇక్కడ చెప్పబడిన ప్రతి లక్షణము ముఖ్యమే
శ్లోకము -9
ఇన్ద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ|
జన్మమృత్యు జరావ్యాధి దుఃఖదోషానుదర్శనమ్||9||
స|| ఇన్ద్రియార్థేషు వైరాగ్యమ్, అనహంకారః ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనమ్ (ఏతత్ సర్వం జ్ఞానం ఇతి ప్రోక్తమ్)||9||
శ్లోకార్థములు:
ఇన్ద్రియార్థేషు వైరాగ్యమ్ - , ఇంద్రియవిషయములమీద వైరాగ్యము
అనహంకారః ఏవ చ - , అహంకారము లేకపోవుట
జన్మ మృత్యు జరా వ్యాధి - పుట్టుక, చావు, ముసలితనము వ్యాధి
దుఃఖ దోషాను దర్శనమ్ -వాటివలన కలుగు దుఃఖమును గ్రహించుట
శ్లోక తాత్పర్యము:
"ఇంద్రియవిషయములమీద వైరాగ్యము, అహంకారము లేకపోవుట, పుట్టుక, చావు, ముసలితనము వ్యాధి
మున్నగు వాని వలన కలుగు దుఃఖమును గ్రహించుట;"
శ్లోకము -10
అసక్తి రనభిష్వఙ్గః పుత్ర దారగృహాదిషు|
నిత్యం చ సమచిత్తత్వ మిష్టానిష్టోపపత్తిషు||10||
స|| పుత్రదార గృహాదిషు అనాసక్తిః , అనభిష్వంగః , ఇష్టానిష్ట ఉపపత్తిషు నిత్యం సమచిత్తత్త్వం చ (ఏతత్ సర్వం జ్ఞానం ఇతి ప్రోక్తమ్)||10||
శ్లోకార్థములు:
పుత్రదార గృహాదిషు అనాసక్తిః - పుత్రులు భార్య ఇల్లు మున్నగు వానిమీద అనాసక్తి
అనభిష్వంగః - సాహచర్యము లేకుండుట
ఇష్టానిష్ట ఉపపత్తిషు - శుభాశుభములు కలిగినప్పుడు
నిత్యం సమచిత్తత్త్వం చ - ఎల్లప్పుడు సమబుద్ధి కలిగియుండుట
శ్లోక తాత్పర్యము:
"పుత్రులు భార్య ఇల్లు మున్నగు వానిమీద అనాసక్తి,, వాటివలన కలుగు సుఖదుఃఖములతో
సాహచర్యము లేకుండుట, శుభాశుభములు కలిగినప్పుడు ఎల్లప్పుడు సమబుద్ధి కలిగియుండుట."
శ్లోకము 11
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ|
వివిక్తదేశ సేవిత్వమ్ అరతిర్జనసంసది||11||
స|| మయి అనన్యయోగేన అవ్యభిచారిణీ ( అచంచల) భక్తిః, వివిక్తదేశసేవిత్వమ్ , జనసంసది అరతిః (ఏతత్ సర్వం జ్ఞానం ఇతి ప్రోక్తమ్)||11||
శ్లోకార్థములు:
మయి అనన్యయోగేన - నాయందు అనన్యమైన భక్తితో
అవ్యభిచారిణీ భక్తిః - చలించనట్టి భక్తికలిగియుండుట
వివిక్తదేశసేవిత్వమ్- ప్రతిబంధము లేని చోట ఆశ్రయించడము
జనసంసది అరతిః - జనసమూహముల మీద ప్రీతిలేకుండుట
శ్లోక తాత్పర్యము
"నాయందు అనన్యమైన భక్తితో, చలించనట్టి భక్తి కలిగియుండుట,
ప్రతిబంధము లేని చోట ఆశ్రయించడము, జనసమూహముల మీద ప్రీతిలేకుండుట,"||11||
శంకరాచార్యులవారు తమ భాష్యములో, "ప్రాకృత జనసంసది అరతిః జ్ఞానార్థత్వాత్ జ్ఞానమ్", అంటే ఈ గుణములు జ్ఞానమునకు దారి తీస్తాయి కనుక అవే జ్ఞానము అని రాస్తారు.
శ్లోకము 12
అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్|
ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోఽన్యథా||12||
స|| అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం, తత్త్వజ్ఞానార్థ దర్శనమ్, ఏతత్ సర్వం జ్ఞానం ఇతి ప్రోక్తమ్| యత్ అతః అన్యథా తత్ అజ్ఞానం ( ఇతి ప్రోక్తమ్)|| 12||
శ్లోకార్థములు:
అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం -ఆధ్యాత్మ జ్ఞానము ఎల్లప్పుడు కలిగి యుండుట,
తత్త్వజ్ఞానార్థ దర్శనమ్ - తత్త్వజ్ఞానము యొక్కప్రయోజనము తెలిసికొనుట,
ఏతత్ సర్వం - ఇవి అన్నియు
జ్ఞానం ఇతి ప్రోక్తమ్- జ్ఞానము అని చెప్పబడినది.
శ్లోక తాత్పర్యము:
"ఆధ్యాత్మ జ్ఞానము ఎల్లప్పుడు కలిగి యుండుట, తత్త్వజ్ఞానము యొక్కప్రయోజనము తెలిసికొనుట,
ఇవి అన్నియు, జ్ఞానము అని చెప్పబడినది".||12||
' అమానిత్వం అదమ్భిత్వం ' - అంటే గర్వములేకపోవడము డాంబికము లేకపోవడము అంటూ 13.08 నుంచి జ్ఞానము ఉన్నవాడి లక్షణములు చెపుతాడు కృష్ణుడు. ఆ లక్షణాల ప్రయోజనము ఏమిటి . ఆ లక్షణాలే జ్ఞానసాధనములు అన్నమాట. ఈ లక్షణాలు ఉన్నవాడు వాటిని జ్ఞాన సంపాదనకు సాధనాలుగా ఉపయోగించి తెలిసికొన తగినదానిని తెలిసికొన గల యోగ్యుడు అవుతాడు.
ఈ జ్ఞానసాధనములు ఏమిటి? అవి,-
గర్వములేకపోవడము, డాంబికము లేకపోవడము, అహింసా, క్షాన్తి, ఆర్జవము, ఆచార్యోపాసనము, శౌచము, స్థైర్యము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థములందు వైరాగ్యము, అహంకారము లేకపోవడము ఇవన్నీ జ్ఞానసాధనములే. జన్మమృత్యుజరావ్యాధులయందు గల దుఃఖమునే దోషముగా చూడకలగడము వలన దేహేంద్రియ విషయభోగాలపై విరక్తి అంటే వైరాగ్యము పుడుతుంది. అంటే అది కూడా అంటే జన్మమృత్యుజరావ్యాధుల యందుకల దుఃఖమునే దోషముగా చూడకలగడము కూడా జ్ఞానసాధనమే అన్నమాట.
అంతేకాదు విషయాలవేపు దృష్టి మళ్లక పోవడము, పుత్రదారా గృహాదులయందు మమకారము లేకపోవడము , ఇష్టము అనిష్టములయందు సమభావము కలిగియుండడము, భగవంతునియందు చెదరని భక్తి అనబడు అనన్యయోగము, ఏకాంతప్రదేశ వాసము, అజ్ఞానులగు జనసమూహములయందు కోరికలేకపోవడము, అధ్యాత్మజ్ఞానమందు ప్రీతి కలిగియుండుట, తత్వజ్ఞానము యొక్క ప్రయోజనము తెలిసికొనియుండుట, ఇవన్నీ జ్ఞానసాధనాలే.
ఏతత్ సర్వం జ్ఞానం ఇతి ప్రోక్తమ్.- "ఇదంతా జ్ఞానము ని చెప్పబడినది".
అంటే అదే జ్ఞానము కూడా.
గర్వములేకపోవడము, డాంబికము లేకపోవడము అన్నది జ్ఞానమా అన్న సందేహము రావచ్చు. దానికి శంకరాచార్యులవారి సమాధానం, 'జ్ఞాన నిమిత్తత్వాత్, జ్ఞాన సహకారీ కారణత్వాత్" అంటే జ్ఞానము సంపాదించడానికి మార్గము సులభము చేస్తాయి కనుక అని. అవి జ్ఞానమునకు సహకరిస్తాయి కనుక అని.
జ్ఞానము గురించి ఇంకోమాట. తెలిసికొనతగినదానిని తెలిసికొనుటకు కావలసినదే జ్ఞానము. తెలిసికొనతగినది పరమాత్మ.పరమాత్మ అనే లక్ష్యము చేరుటకు కావలసిన ఆధ్యాత్మిక సంపత్తియే జ్ఞానమని చెప్పబడినది. ఇక్కడ చెప్పబడిన సుగుణములు ఎపుడు చిత్తమందు విరాజిల్లునో అపుడే ఆత్మ వ్యక్తము కాగలదు. .
జ్ఞానముచేత తెలిసికొనతగినది 'జ్ఞేయము'. జ్ఞేయము గురించి ఆరు శ్లోకాలలో కృష్ణుడు చెపుతాడు.
శ్లోకము 13
జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వాఽమృతమశ్నుతే|
అనాదిమత్పరమం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే||13||
స|| యత్ జ్ఞేయం యత్ జ్ఞాత్వాఅమృతం అశ్నుతే తత (అహం) ప్రవక్ష్యామి| అనాదిమత్ పరం బ్రహ్మ తత్ సత్ (ఇతి) న ఉచ్యతే| అసత్ ఇతి న ( ఉచ్యతే)||13||
శ్లోకార్థములు
యత్ జ్ఞేయం - ఏది తెలిసికొనతగినదో
యత్ జ్ఞాత్వాఅమృతం అశ్నుతే - ఏది తెలిసికొంటే మోక్షమును పొందుచున్నాడో
తత (అహం) ప్రవక్ష్యామి - అది నేను చెప్పెదను
అనాదిమత్ - ఆది లేనట్టి
పరం బ్రహ్మ - పర బ్రహ్మమనబడునది
తత్ సత్ (ఇతి) న ఉచ్యతే - అది ఉన్నదనిగాని చెప్పబడదు
అసత్ ఇతి న ( ఉచ్యతే)్- లేదు అని చెప్పబడదు
శ్లోక తాత్పర్యము
"ఏది తెలిసికొనతగినదో, ఏది తెలిసికొంటే మోక్షమును పొందుచున్నాడో, అది నేను చెప్పెదను
పర బ్రహ్మమనబడునది సత్ అనిగాని (ఉన్నదనిగాని) చెప్పబడదు, అసత్ అనిగాని (లేదు అని) చెప్పబడదు." ||13||
ఇక్కడ జ్ఞేయమైన ( అంటే తెలిసికొనతగిన) పరమాత్మ స్వరూపము మీద కృష్ణుడు బోధిస్తాడు. అది తెలిసికొనడము వలన ఏమి లభిస్తుంది?. కృష్ణుడు చెపుతాడు 'జ్ఞాత్వాఅమృతం అశ్నుతే'- అంటే తెలిసికొంటే మోక్షము పొందును అని. ఇక కృష్ణుడు అనాది లేనట్టి పరమాత్మ గురించి చెపుతాడు. అందులో మొదటి మాట " న సత్ న అసత్" అని. అంటే పరబ్రహ్మమనబడునది ఉన్నదనిగాని, లేదు అని గాని చెప్పబడదు అని."
తెలిసికొనతగినది తెలుపుతాను అని చెప్పి, తెలిసికొనతగినది ఉన్నది అని గాని లేదు అని గాని చెప్పబడదు అంటే తెలిసికొనతగినది ఏమిటి అన్న ప్రశ్నవస్తుంది. ఇక్కడ జ్ఞేయము అంటే పరమాత్మ. పరమాత్మని ఉపనిషత్తులలో ఈ విధముగానే చిత్రీకరింపబడినది. ఉదాహరణకి తైత్తరీయోపనిషత్తులో బ్రహ్మము గురించి ఈ విధముగా చెప్పబడుతుంది. "యతోవాచా నివర్తన్తే| అప్రాప్య మనసా సహ|" అని. అంటే వాక్కు మనస్సు బ్రహ్మము చేరలేక వనక్కి వచ్చాయి అని
వాక్కుకు భూతప్రపంచములో నున్న సమస్త భూతములను విశ్లేషించగల శక్తి కలదు. అలాగే మనస్సు సమస్త విషయములను గ్రహింప గల శక్తి కలదు. అటువంటి వాక్కు మనస్సు బ్రహ్మమును చేరలేక వెనక్కి తిరిగి వచ్చాయి అనడములో ఉద్దేశ్యము బ్రహ్మము మనస్సుకి వాక్కుకి అతీతము అని. ఇక్కడ చెప్పబడిన మాట అంటే బ్రహ్మము సత్ కాదు అసత్ కాదు అనడములో అదే ఉద్దేశము. ఇదే మాట శంకరభాష్యములో విశదముగా విశ్లేషించ బడినది.
ఇక జ్ఞేయము, పరమాత్మ యొక్క, స్వరూపము కృష్ణ భగవానుడు చెపుతాడు.
శ్లోకము 14
సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షి శిరోముఖమ్|
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి||14||
స|| తత్ సర్వతః పాణి పాదమ్ సర్వతః అక్షి శిరో ముఖం సర్వతః శ్రుతిమత్ (తత్) సర్వం లోకే ఆవృత్య తిష్ఠతి||14||
శ్లోకార్థములు:
తత్ సర్వతః పాణి పాదమ్ - అది అంతట చేతులు కాళ్ళూ కలది
సర్వతః అక్షి శిరో ముఖం - అంతటనూ కళ్ళు తలలు ముఖము కలది
సర్వతః శ్రుతిమత్ - అంతటయును చెవులు క్జలది
(తత్) సర్వం లోకే ఆవృత్య తిష్ఠతి- అది లోకమంతయు వ్యాపించి వున్నది.
శ్లోక తాత్పర్యము
"అది అంతట చేతులు కాళ్ళు కలది. అంతటనూ కళ్ళు తలలు ముఖము కలది. అంతటయును చెవులు కలది.
అది లోకమంతా వ్యాపించి వున్నది".||14||
పరబ్రహ్మము "సత్" అంటే ఉన్నది అని చెప్పలేము ,లేదు అని చెప్పలేము అని చెప్పి; దాని అర్థము పరబ్రహ్మము లేదు అని కాదు అని ధృవీకరించడానికి అన్నట్లు, ఈ శ్లోకములో పరబ్రహ్మము లోకమంతా వ్యాపించివుంది. దానికి కళ్ళు తలలు వున్నాయి అని చెప్పబడినది. ఇవి వేదాలలో శ్వేతాశ్వరోపనిషత్తులో, అలాగే పురుషసూక్తములో చెప్పబడిన మాటలు.
కొన్ని ఉపనిషత్తులలో గురుశిష్యుల సంభాషణ/ఉపదేశములలో వున్నశ్లోకాలు, భగవద్గీత లో భగవంతుని వాక్కు లాగా భగవానువాచ అంటూ వస్తాయి. ఈ శ్లోకము అలాంటిదే. ఈ శ్లోకము శ్వేతాశ్వతరోపనిషద్ లో ( శ్వే 3.15) శ్లోకము. పరబ్రహ్మము గురించి శ్వేతాశ్వరోపనిషద్ లో చెప్ప బడిన కొన్ని మాటలు ఇక్కడ జ్ఞేయము గురించిచెప్పబడిన మాటలలో ఇంకా వస్తాయి.
ఇక్కడ అంతట చేతులు తలలు కలది అని అంటే నిజముగా ఆ అంగములు వున్నాయి అని కాదు. బ్రహ్మమునకు ఆ అంగముల గుణములు వున్నాయి అన్నమాట ముందు శ్లోకములో వస్తుంది.
శ్లోకము 15
సర్వేన్ద్రియ గుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్|
అసక్తం సర్వభృచ్ఛైవ నిర్గుణం గుణభోక్తృ చ||15||
స|| తత్ సర్వేన్ద్రియ గుణాభాసమ్ సర్వేన్ద్రియ వివర్జితమ్ అసక్తమ్ సర్వభృత్ చ ఏవ నిర్గుణమ్ గుణభోక్తృ చ (ఇతి ఉచ్యతే) ||15||
శ్లోకార్థములు:
సర్వేన్ద్రియ గుణాభాసమ్ - అన్ని ఇన్ద్రియముల గుణములను ద్వారా ప్రకాశింపచేయబడునది
సర్వేన్ద్రియ వివర్జితమ్ - ఇన్ద్రియములు ఏమియు లేనిదియు
అసక్తం - బంధములు లేదియు
సర్వభృత్ చ ఏవ -సమస్తమును భరించునదియు
నిర్గుణమ్ గుణభోక్తృ చ - గుణరహితము, గుణములను అనుభవించునదియు
శ్లోక తాత్పర్యము:
" ఇన్ద్రియములు లేనిదియు కాని ఇన్ద్రియముల గుణముల ద్వారా ప్రకాశింపచేయ బడునది,
బంధములులేనిదియు, సమస్తమును భరించునదియు, గుణరహితము, గుణములను అనుభవించునదియు".||15||
గుణములు లేని పరబ్రహ్మము అన్నిశుద్ధ గుణములను ప్రకాశింపచేసి వాటి ద్వారా ప్రకాశించునది. ఏమిటా గుణాలు అంటే ఉదాహరణ సమత్వము. సమత్వము మనలో ఉన్నపరబ్రహ్మమును ప్రకాశింపచేస్తుంది. సృష్తి స్థితి లయ కారకుడైన పరబ్రహ్మము సర్వమును భరించునది కాని దేనితోను అను బంధము లేనిది
ఇన్ద్రియములు లేకపోయినా ఇన్ద్రియగుణములద్వారా ప్రకాశింపబడునది అనే అలోచన శ్వేతాశ్వతరోపనిషత్తులో వస్తుంది. "అపాణి పాదౌ జవనో గ్రహీతా పశ్యత్యచక్షుః సశృణోత్యకర్ణః|" అంటే చేతులు లేకపోయిన పట్టుకొనగలిగినది కాళ్ళు లేకపోయినా శీఘ్రముగా పోవునది, కళ్ళు లేకుండా చూడగలిగినది, చెవులు లేకుండా వినగలిగినది. ఇవన్ని, "యతోవాచా నివర్తన్తే", అంటే వర్ణింపనలవికాని పరబ్రహ్మము యొక్క వర్ణనలు.
శ్లోకము 16
బహిరన్తశ్చ భూతానాం అచరం చరమేవచ|
సూక్ష్మత్వాత్ అవిజ్ఞేయం దూరస్థం చాన్తికేచ తత్ ||16||
స|| (తత్) భూతానామ్ బహిః అన్తః చ ( స్థితమ్), అచరం చరమేవ చ, సూక్ష్మత్వాత్ అవిజ్ఞేయం తత్ ( బ్రహ్మమ్) దూరస్థమ్ అన్తికేచ (ఇతి ఉచ్యతే) ||16||
శ్లోకార్థములు:
భూతానామ్ బహిః అన్తః చ స్థితమ్ - ప్రాణులయొక్క వెలుపలనూ లోపలనూ ఉండునది
అచరం చరమేవ చ - కదలనిదియు, కదులునదియు
సూక్ష్మత్వాత్ అవిజ్ఞేయం - సూక్ష్మము వలన కనపడనిదియు
తత్ ( బ్రహ్మమ్) దూరస్థమ్ అన్తికేచ - దూరముగావుండునదియు , దగ్గరగావుండునదియు
శ్లోక తాత్పర్యము:
"ప్రాణులయొక్క వెలుపలనూ లోపలనూ ఉండునది, కదలనిదియు, కదులునదియు
సూక్ష్మము వలన కనపడనిదియు, దూరముగావుండునదియు, దగ్గరగావుండునదియు".||16||
పరబ్రహ్మము సర్వత్ర వ్యాపించియున్నది. అందుకనే అది ప్రాణులయొక్క లోపల ప్రత్యగాత్మ రూపములో బాహ్యములో ప్రకృతి రూపములో వుండును. శంకరాచార్యులవారు తమ భాష్యములో దేహమే ఆత్మ అనుకునే వారికి స్పర్శలో వున్న బ్రహ్మము బయట వున్నట్లే అని రాశారు.
"అచరం చరమేవచ" అంట బ్రహ్మము కదలనిది కదులునది . సర్వవ్యాపకమైన బ్రహ్మము చరములగు జీవరాసులలోను అచరములగు శిలాపర్వ తాదులలో వెలయుచున్నరని చెప్పవచ్చు. స్వప్నములో మనుజుడు స్వప్నలోకములోని దృశ్యాదులు కదులుచు చూచుచున్ననూ , స్వప్నము చూచుచున్నవాడు వాస్తవముగా తన శయనాసయము పై కదలకనే ఉన్నాడు. అదేవిధముగా పరబ్రహ్మము స్వప్నతుల్యమగు ఈ జగత్తులో ప్రాణికోట్ల రూపములో కదలుచున్నను, వాస్తవముగా బ్రహ్మ రూపమున నిశ్చలముగా వెలయుచున్నాడు. శంకరాచార్యులవారు రజ్జుసర్ప ఉదహరణ ఇస్తారు. ముందు సర్పమను భావము కలిగినప్పుడు అది "చరతి" అనే భావము అంటే కదులునట్లు అనిపిస్తుంది. అది సర్పము కాదు , రజ్జు అంటే అది తాడే అని నిర్ధారణ అయినప్పుడు అది "అచరము" అన్న భావము తెలుస్తుంది..
"దూరస్థమ్ అన్తికేచ" అంటే దూరముగా వుండునదియు, దగ్గరగా వుండునది. శంకరాచార్యులవారు, "అవిజ్ఞాతతయా దూరస్థమ్" అంటే పర బ్రహ్మము తెలియకపోవడము వలన బ్రహ్మముఅజ్ఞానులకు అతి దూరముగా వున్నదనిపిస్తుంది. "ఆత్మత్వాత్ విదుషాత్" హృదయములోనే వున్నది అని తెలిసినవారికి, బ్రహ్మము అతి దగ్గరగా వుండునది.
శ్లోకము 17
అవిభక్తం చ భూతేషు విభక్తమివ స్థితమ్|
భూతభర్తృచ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ||17||
స|| భూతేషు తత్ అవిభక్తం చ విభక్తం ఇవ స్థితమ్| భూత భర్తృ చ ||17||
శ్లోకార్థములు:
భూతేషు తత్ అవిభక్తం చ - ప్రాణులలో అది విభజింపబడనిది అయినను
విభక్తం ఇవ స్థితమ్- విభజింపబడినదానివలె నున్నదియు
భూత భర్తృ చ - ప్రాణులను భరించునదియు
గ్రసిష్ణు - లయమొనర్చునదియు
ప్రభవిష్ణు చ- సృష్ఠించునదియు
తత్ జ్ఞేయం - ఆ బ్రహ్మము తెలిసికొనతగినదియు
శ్లోక తాత్పర్యము:
"ఆ బ్రహ్మము ప్రాణులలో అది, విభజింపబడనిది అయినను, విభజింపబడినదానివలె నున్నది.
పరబ్రహ్మము ప్రాణులను భరించునదియు, లయమొనర్చునదియు, సృష్ఠించునదియు, తెలిసికొనతగినదియు.||17||
బ్రహ్మము ఒక్కటే. కాని అదే అన్ని జీవరాసులలో ఉంటూ విభజింపబడని బ్రహ్మము విభజింపబడినట్లు అనిపిస్తుంది. ఈ రెండు పరా, అపరా ప్రకృతులద్వారా ఈశ్వరుడు జగదుత్పత్తి స్థితి లయములకు కారకుడవుతున్నాడు అని ఏడవ ధ్యాయములో విన్నాము. అదే ఇక్కడ చెప్పబడుతున్నది.
శ్లోకము 18
జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే|
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్||18||
స|| తత్ జ్యోతిషామపి జ్యోతిః , తమసః పరమ్, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం | సర్వస్య హృది విష్టితం ఇతి ఉచ్యతే||18||
శ్లోకార్థములు:
తత్ జ్యోతిషామపి జ్యోతిః - ప్రకాశించెడి వానికి కూడా ప్రకాశమునిచ్చునదియు
తమసః పరమ్ - అజ్ఞానముకన్న వేరే అయినది
జ్ఞానం - జ్ఞానస్వరూపమైనదియు
జ్ఞేయం - తెలిసికొనతగినదియు
జ్ఞానగమ్యం - జ్ఞానము చే పొందతగినదియు
సర్వస్య హృది విష్టితం - సమస్తప్రాణులయొక్క హృదయమందు విశేషించి వున్నదియు
శ్లోక తాత్పర్యము:
"ప్రకాశించెడి వానికి కూడా ప్రకాశమునిచ్చునదియు, అజ్ఞానముకన్న వేరే అయినది,
జ్ఞానస్వరూపమైనదియు, తెలిసికొనతగినదియు, జ్ఞానము చే పొందతగినదియు
సమస్తప్రాణులయొక్క హృదయమందు విశేషించి వున్నదియు".||18||
శ్వేతాశ్వరోపనిషత్తులో "తస్య భాసా సర్వమిదం విభాతి" ( శ్వే6.14) అని వస్తుంది. అంటే ఆ పరమాత్మ యొక్క కాంతితో సమస్త ప్రపంచము( సూర్య చంద్రులు) ప్రకాశించును అని వస్తుంది. ఇక్కడ అదే చెప్పబడినది.
శ్లోకము 19
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః|
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే||19||
స||ఇతి క్షేత్రం తథా జ్ఞానం చ జ్ఞేయం చ సమాసతః ఉక్తమ్ | మద్భక్తః ఏతత్ విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే||19||
శ్లోకార్థములు:
ఇతి క్షేత్రం తథా జ్ఞానం చ - ఈ విధముగా క్షేత్రము జ్ఞానము,
జ్ఞేయం చ - తెలిసికొనతగినదియు,
సమాసతః ఉక్తమ్ - సంక్షేపముగా చెప్పబడెను.
మద్భక్తః ఏతత్ విజ్ఞాయ - నా భక్తులు ఇది తెలిసికొని
మద్భావాయ ఉపపద్యతే- నా స్వరూపము పొందుటకు తగినవాడగుచున్నాడు
శ్లోక తాత్పర్యము:
" ఈ విధముగా క్షేత్రము జ్ఞానము, జ్ఞేయము, సంక్షేపముగా చెప్పబడెను.
నా భక్తులు ఇది తెలిసికొని నా స్వరూపము పొందుటకు తగినవారగుచున్నారు".||19||
ఈ శ్లోకముతో అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పడము అయింది. అది మళ్ళీ ఒకమాటు మననం చేద్దాము.
పరమాత్మ స్వరూపము గురించి చెపుతూ జ్ఞేయమగు పరమాత్మరూపము అంతట కన్నులు తలలు ముఖములు కలది అయి ప్రపంచము నందు సమస్తమునూ ఆవరించి యున్నది. జ్ఞేయ రూపమగు పరమాత్మ సమస్తములైన గుణములను చేత ప్రకాశింపబడునది, భరించునది, సమస్త ఇంద్రియములు లేనిది, దేనినీ అంటనిది, ప్రాణులయొక్క లోపల బయట యుండునది, కదలనిది కదులునది, అతిసూక్ష్మమయి యుండుటవలన తెలియబడనిది, అజ్ఞానులకు దూరముగానుండునట్లనిపించునది జ్ఞానులకు హృదయములో దగ్గరగావున్నట్లు అనిపించునది. పరమాత్మ స్వరూపము "అవిభక్తం విభక్తేషు" అంటే విభజింపబడని దైననూ విభజింపబడినదానివలె నున్నది. ఆ స్వరూపము ప్రాణులను సృష్టించునది పోషించునదీ లయించునది.
అట్టి పరమాత్మ ప్రకాశించెడి సూర్యచంద్రాగ్నులను కూడా ప్రకాశింపజేయునది. సమస్త ప్రాణుల హృదయములో విషేషించియున్నదానివలె కనపడుచున్నది. జీవుల పాప పుణ్యములను అతిసమీపమునుండి చూచున్నది . ఒకే వస్తువు కదలకయూ కదలుచును యున్నది. స్థూలాకాశము, చిత్తాకాశము, చిదాకాశము అని మూడు యున్నవి. వీనిలో సూక్షమ్మగు చిదాకాశమే పరబ్రహ్మము. అది జ్ఞాన నేత్రము ద్వారా తెలిసికొనబడగలదు. అదే జ్ఞేయమగుపరమాత్మ.
అలాగ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు , జ్ఞానము జ్ఞేయము గురించి క్లుప్తముగా విశదీకరించి కృష్ణభగవానుడు ఇంకా ఇలా అంటాడు.
ఏతత్ విజ్ఞాయ - ఇదితెలిసికొనినవాడు
మద్భావాయోపపద్యతే - నా భావము ( మోక్షము) పొందుటకు అర్హుడు అవుతాడు.
శ్లోకము 20
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి|
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్||20||
స|| ప్రకృతిం పురుషం చ ఏవ ఉభౌ అపి అనాదీ విద్ధి |వికారాం చ గుణాన్ చ ఏవ ప్రకృతి సంభవాన్ ||20||
శ్లోకార్థములు:
ప్రకృతిం పురుషం చ ఏవ - ప్రకృతిని పురుషుని కూడా
ఉభౌ అపి అనాదీ విద్ధి - ఈ రెండిటినీ ఆదిలేనివని తెలిసికొనుము.
వికారాం చ గుణాన్ చ ఏవ - ఇన్ద్రియ వికారములను గుణములను
ప్రకృతి సంభవాన్ - ప్రకృతి వలన సంభవించినవే ( అని తెలిసికొనుము)
శ్లోక తాత్పర్యము:
"ప్రకృతిని పురుషుని కూడా, ఈ రెండిటినీ ఆది లేనివని తెలిసికొనుము.
ఇన్ద్రియ వికారములను సత్త్వరజో తమో గుణములను ప్రకృతి వలన సంభవించినవే అని తెలిసికొనుము".||20||
శ్లోకము 21
కార్యకరణ కర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే||21||
స|| కార్యకరణ కర్తృత్వే ప్రకృతిః హేతుః ఇతి ఉచ్యతే| సుఖదుఃఖానాం భోక్తృత్వే పురుషః హేతుః (ఇతి) ఉచ్యతే||21||
శ్లోకార్థములు:
కార్యకారణ కర్తృత్వే - కార్య కరణములను కలుగచేయుటకు
ప్రకృతిః హేతుః ఇతి ఉచ్యతే - ప్రకృతియే కారణమని చెప్పబడుచున్నది
సుఖదుఃఖానాం భోక్తృత్వే - సుఖదుఃఖములను అనుభవించుటయందు
పురుషః హేతుః (ఇతి) ఉచ్యతే -పురుషుడే కారణమని చెప్పబడుచున్నది.
శ్లోక తాత్పర్యము:
"కార్యకరణములను కలుగచేయుటకు, ప్రకృతియే కారణమని చెప్పబడుచున్నది
సుఖదుఃఖములను అనుభవించుటయందు, పురుషుడే కారణమని చెప్పబడుచున్నది".||21||
.
కార్యకరణములను కలుగ చేయునది ప్రకృతి. శంకరాచార్యులవారు తమ భాష్యములో ఇలా చెపుతారు. "కార్యం శరీరం కరణాని తత్స్థాని త్రయోదశ". అంటే "కార్యమనగా శరీరము. కరణమనగా దానిలో వున్న పదమూడు". అవే ఇంద్రియమనోబుద్ధి అహంకారములు పంచభూతములు, శబ్దాదివిషయములు. వీటన్నిటిని కలుగజేయునది ప్రకృతి. "కామక్రోధసుఖదుఃఖ మోహాములు" ప్రకృతివలననే కలిగినవి.
కార్యక రణముల వలన కలిగే సుఖదుఃఖములను అనుభవించేది, వాటికి అతీతుడను అనే జ్ఞానము లేని, పురుషుడు
కొన్ని భగవద్గీతలలొ "కార్యకరణ" బదులు "కార్య కారణ" అని రాయబడుతుంది. అర్థము మాత్రము మారదు.
శ్లోకము 22
పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్ గుణాన్|
కారణం గుణసంగోఽస్య సదసద్యోనిజన్మసు||22||
స|| ప్రకృతిస్థః పురుషః ప్రకృతిజాన్ గుణాన్ భుఙ్క్తే హి | గుణసంగః అస్య సదసద్యోని జన్మసు కారణమ్||22||
శ్లోకార్థములు:
ప్రకృతిస్థః పురుషః - ప్రకృతి యందు వున్నవాడై పురుషుడు
ప్రకృతిజాన్ గుణాన్ - ప్రకృతివలన పుట్టిన గుణములను
భుఙ్క్తే హి - అనుభవించుచున్నాడు కదా
గుణసంగః అస్య - గుణములతో కూడికయే ఈ జీవునకు
సదసద్యోని జన్మసు - మంచి చెడ్డ జన్మములు ఎత్తుటకు
కారణమ్- కారణము.
శ్లోక తాత్పర్యము:
"ప్రకృతి యందు వున్నవాడై పురుషుడు, ప్రకృతివలన పుట్టిన గుణములను అనుభవించుచున్నాడు కదా.
గుణములతో కూడికయే ఈ జీవునకు, మంచి చెడ్డ జన్మములు ఎత్తుటకు కారణము".||22||
శంకరాచార్య ఇలా వివరిస్తారు. పురుషుడు భోక్త లాగ ప్రకృతిలో వున్నాడు. ప్రకృతి లో ముఖ్యమైన అంశము అజ్ఞానము.ఈ ఆజ్ఞానము వలననే పురుషుడు దేహాది ఇంద్రియములనే తనవి గా భావించి సుఖదుఃఖాలను అనుభవిస్తాడు. ఇక్కడ ఈ సందర్బములొ సారాంశము రాస్తూ ఇలా చెపుతారు. "ఏతత్ ఉక్తం భవతి"- "ఇది చెప్పవలసిన మాట". "ప్రకృతిస్థత్వాఖ్యా అవిద్యా, గుణేషు చ సఙ్గః కామః సంసారస్య కారణమితి", అంటే సంసారానికి కారణము ప్రకృతికి సంబంధించిన ఆజ్ఞానము, గుణములతో కలుగు బంధము కామము ఇత్యాది అని."తచ్చ పరివర్తనాయ ఉచ్యతే" - " ఇది తప్పించుకొనతగినవి కనుక చెప్పబడినది" అని. అంటే గుణములతో కూడికయే ఈ జీవునకు, మంచి చెడ్డ జన్మములు ఎత్తుటకు కారణము. అవి తప్పించుకొనతగినవి కనుక కృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పుచున్నాడు అని.
రెండవ అధ్యాయములో విన్నాము. సంసార విషయములు గుణములతో కూడినవి. అందుకనే కృష్ణ భగవానుడు అర్జునుడికి , "నిస్త్రైగుణ్యో భవార్జున" (2.45) అంటే త్రిగుణములను అధిగమించి ముందుకు సాగమని చెపుతాడు సాంఖ్యయోగములో. ప్రకృతివలన కలిగే గుణముల వశములో వున్న జీవుడు/పురుషుడు పునర్జన్మ మార్గములో ఇరుక్కుపోతాడు. ప్రకృతికి అతీతుడుగా వున్న పురుషుడు, అసంగుడై బ్రహ్మత్వముయొక్క మార్గములో వుంటాడు.
శ్లోకము 23
ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః|
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః||23||
స||పురుషః అస్మిన్ దేహే అపి పరః ఉపద్రష్ఠా అనుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మా ఇతి చ ఉక్తః ||23||
శ్లోకార్థములు:
పురుషః అస్మిన్ దేహే అపి - పురుషుడు ఈ దేహములో ఉన్నప్పటికి
పరః - శరీరము కన్నా వేరే అయినవాడుగను
ఉపద్రష్ఠా - సాక్షిగా నుండవాడును,
అనుమన్తా చ - అనుమతించువాడుగను
భర్తా భోక్తా - భరించువాడుగను, అనుభవించువాడుగను,
మహేశ్వరః - నియామకుడుగను
పరమాత్మా ఇతి చ ఉక్తః - పరమాత్ముడు అని చెప్పబడుచున్నాడు
శ్లోక తాత్పర్యము:
"పురుషుడు ఈ దేహములో ఉన్నప్పటికి, శరీరము కన్నా వేరే అయినవాడుగను, సాక్షిగా నుండవాడును,
అనుమతించువాడుగను, భరించువాడుగను, అనుభవించువాడుగను, నియామకుడుగను, పరమాత్మ అని చెప్పబడుచున్నాడు".||23||
'ఉప' అంటే దగ్గరగావున్న, 'ద్రష్టా' అంటే సాక్షి. దేహములో వుండే పురుషుడు నిజానికి అందరికన్నా దగ్గరగావున్న సాక్షి. యజ్ఞయాగాదులలో పూజారులు, పూజచేస్తున్నవారు ఇద్దరూ పూజలో నిమగ్నమైనప్పుడు, పూజావిధానము సరిగా అవుతున్నదా లేదా చూడడానికి, ఒక ఆసనము వేసి, ఒక పురోహితుని సాక్షిగా కూర్చోపెడతారు. ఆయనని ఉపద్రష్టా అంటారు. దేహములో వున్న పురుషుడు కూడా ఉపద్రష్ట లాగా సాక్షి అని.
భర్తా భోక్తా మహేశ్వరః అంటూ , ప్రకృతిని అధిగమించిన పురుషుడు. ఆయనే పరమేశ్వరుడు అని.
ఇదంతా మూడవ శ్లోకములో క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో, ఎట్టి ప్రభావము కలవాడో అన్న మాటకి సమాధానము.
శ్లోకము 24
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ|
సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే||24||
స|| యః ఏవం పురుషః గుణైః సహ ప్రకృతిం వేత్తి సః సర్వథా వర్తమానః అపి భూయః న అభిజాయతే ||24||
శ్లోకార్థములు:
య ఏవం పురుషః - ఎవరు ఈ ప్రకారముగా పురుషుని
గుణైః సహ ప్రకృతిం - గుణములతో కూడిన ప్రకృతిని
వేత్తి- తెలిసికొనుచున్నాడో
సః సర్వథా వర్తమానః అపి - అతడు ఎట్లున్నప్పటికి
భూయః న అభిజాయతే - మరల పుట్టడు.
శ్లోక తాత్పర్యము:
"ఎవరు ఈ ప్రకారముగా పురుషుని, గుణములతో కూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో,
అతడు ఎట్లున్నప్పటికి, మరల పుట్టడు".||24||
పురుషుడు వీటన్నిటిచేత అంటే ఇంద్రియమనోబుద్ధిహంకారముల సంయోగముచే అయాసుఖదుఃఖాదులు అనుభవిస్తున్నాడు. మంచిజన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణము కూడా ఆ గుణముల సంయోగము వలనే. కాని నిజానికి ఆ పురుషునకు కర్తృత్వ, భోక్తృత్వము లేదు, ఆవిషయము గ్రహించినప్పుడే మోక్షము. జీవుడు తన ఉపాధులతోనూ గుణములతోను ఆశక్తి వదలినవాడై, మమకారము అహంకారము లేనివాడై, అసంగ నిర్గుణ చిద్రూపమే తానని భావించిన అది ముక్తికి హేతువగును.
అంటే పురుషుడు (ఆత్మ) నిత్యశుద్ధుడు. ఎవైనా దుఃఖాది వికారములు కలిగినపుడు ఇవి నా స్వరూపముకాదు. నేను వాటన్నిటికి సాక్షిని అని స్థిర చిత్తుడయి యుండవలెను. అదే ముక్తికి హేతువు.
శ్లోకము 25
ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా|
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే||25||
స|| ఆత్మానం కేచిత్ ఆత్మనా ధ్యానేన ఆత్మని పశ్యన్తి | అన్యే సాంఖ్యేన యోగేన (పశ్యన్తి)| అపరే కర్మయొగేన చ ( పశ్యన్తి)||25||
శ్లోకార్థములు:
ఆత్మానం కేచిత్ - ఆత్మను కొందరు
ఆత్మనా ధ్యానేన - మనస్సుచేత ధ్యానముతో
ఆత్మని పశ్యన్తి - తనలోన చూచుచున్నారు
అన్యే సాంఖ్యేన యోగేన - మరికొందరు సాంఖ్యయోగము ద్వారా
అపరే కర్మయోగేన చ - ఇంకకొందరు కర్మయోగముద్వారా
పశ్యన్తి- చూచుచున్నారు.
శ్లోక తాత్పర్యము:
" ఆత్మను కొందరు మనస్సుచేత ధ్యానముతో తనలోన చూచుచున్నారు.
మరికొందరు సాంఖ్యయోగము ద్వారా ఇంకకొందరు కర్మయోగముద్వారా చూచుచున్నారు."||25||
శుద్ధమైన మనస్సుద్వారా కొందరు ధ్యానయోగముననుసరించి కొందరు సాంఖ్యయోగము (జ్ఞానయోగము) అనుసరించి. కొందరు కర్మయోగమును అనుసరించి ఆత్మను సాక్షాత్కరించుకొనగలరు. భక్తి యోగము ధ్యానయోగములోనే ఇమిడిఉన్నది.
"ఆవిధముగా తెలుసుకో లేని వారు ఇతరులు బోధింపగా విని శ్రవణ తత్పరులై శ్రద్ధకలిగినవారై మృత్యురూపక సంసారమును తప్పకదాటగలరు".||25||
శ్లోకము 26
అన్యే త్వేవ మజానన్తః శ్రుత్వాఽన్యేభ్య ఉపాసతే|
తేఽపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణః||26||
స||అన్యేతు ఏవమ్ అజానన్తః అన్యేభ్యః శ్రుత్వా (బ్రహ్మన్) ఉపాసతే| శ్రుతిపరాయణాః తే అపి మృత్యుం అతి తరన్తి ఏవ||26||
శ్లోకార్థములు:
అన్యేతు ఏవమ్ అజానన్తః - మరికొందరు ఇది తెలియక
అన్యేభ్యః శ్రుత్వా - ఇతరుల దగ్గర నుంచి విని,
(బ్రహ్మన్) ఉపాసతే- బ్రహ్మమును ఉపాశించెదరు
శ్రుతిపరాయణాః తే అపి - శ్రవణము నందు ఆసక్తి కల వారు కూడా
మృత్యుం అతి తరన్తి ఏవ- మృత్యువును తప్పక దాటుచున్నారు
శ్లోక తాత్పర్యము:
"మరికొందరు ఇది తెలియక, ఇతరుల దగ్గర నుంచి విని, బ్రహ్మమును ఉపాశించెదరు.
శ్రవణము నందు ఆసక్తి కల వారు కూడా మరణరూపమును దాటుదురు".||26||
ఇక్కడ అజానన్తః అంటే ధ్యాన సాంఖ్య కర్మయోగములు తెలిసికొనని వారు అని. అట్టివారుకూడా ఉపదేశము పొందినవారై, ఆ శ్రద్ధా భక్తి అనుష్ఠానములచే సంసార సముద్రము దాటివేయవచ్చు అని కృష్ణుడు చెప్పుచున్నాడు.
శ్లోకము 27
యావత్సంజాయతే కించిత్ సత్వం స్థావరజఙ్గమమ్|
క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భతర్షభ||27||
స|| హే భరతర్షభ ! స్థావర జంగమం సత్త్వమ్ యావత్ కించిత్ సంజాయతే తత్ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ విద్ధి ||27||
శ్లోకార్థములు:
స్థావర జంగమం సత్త్వమ్ -చరా చరాత్మకమైన జీవము
యావత్ కించిత్ సంజాయతే -ఏదేది పుట్టుచున్నదో
తత్ క్షేత్ర క్షేత్రజ్ఞ - అది క్షేత్రము క్షేత్రజ్ఞుల
సంయోగాత్ విద్ధి - సంయోగము వలన పుట్టుచున్నది అని తెలిసికొనుము..
శ్లోక తాత్పర్యము:
" ఓ భరతర్షభ , చరా చరాత్మకమైన జీవము ఏదేది పుట్టుచున్నదో,
అది క్షేత్రము క్షేత్రజ్ఞుల సంయోగము వలన పుట్టుచున్నది అని తెలిసికొనుము".||27||
అంటే సంసార సాగరములో జనించే అజ్ఞానము అంతా ప్రకృతి పురుషుల, అంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే. ఆ అజ్ఞానము నశించడము అన్నది పురుషుడు ప్రకృతిని అధిగమించినపుడే.
శ్లోకము 28
సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తమ్ యః పశ్యతి స పశ్యతి||28||
స||సర్వేషు భూతేషు సమం తిష్టన్తం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యన్తం (ఇతి) యః పశ్యతి సః ( యదార్థం ) పశ్యతి||28||
శ్లోకార్థములు:
సర్వేషు భూతేషు - సమస్త ప్రాణులలో
సమం తిష్టన్తం పరమేశ్వరం - సమముగా వున్నట్టి పరమాత్మను,
వినశ్యత్సు అవినశ్యన్తం (ఇతి)- నశించిననూ నశింపదానినిగా
యః పశ్యతి - ఎవరు చూచుచున్నారో
సః ( యదార్థం ) పశ్యతి- అతడు నిజమును చూచుచున్నాడు.
శ్లోక తాత్పర్యము:
" సమస్త ప్రాణులలో సమముగా వున్నట్టి పరమాత్మను, నశించిననూ నశింపదానినిగా
ఎవరు చూచుచున్నారో, అతడు నిజమును చూచుచున్నాడు".||16||
దేహాది దృశ్యపదార్ధములు నశించినను ఆత్మ నశింపదు అనుమాట వివేకము. అదే జ్ఞానము. అట్టి జ్ఞానదృష్టికలవాడే వాస్తవముగా జ్ఞాన నేత్రము కలవాడు. అంటే జ్ఞానము కలిగినవాడు. ఈ మాటనే కృష్ణభగవానుడు అద్భుతమైన వాక్యములో చెప్పాడు..
శ్లోకము 29
సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్|
న హినస్త్యాత్మనాఽఽత్మానం తతోయాంతి పరాంగతిమ్||29||
స|| హి సర్వత్ర సమవస్థితమ్ ఈశ్వరమ్ సమం పశ్యన్ అత్మనా ఆత్మానం న హినస్తి | తతః పరాం గతిం యాతి||29||
శ్లోకార్థములు:
సర్వత్ర సమవస్థితమ్ ఈశ్వరమ్- సమస్త ప్రాణులయందు సమానముగావున్నఈశ్వరుని
సమం పశ్యన్ - సమానముగా చూచుచూ
అత్మనా ఆత్మానం న హినస్తి - తన ఆత్మను హించించుకొనడు
తతః - అందువలన
పరాం గతిం యాతి- అత్యుత్తమమైన గతిని పొందుచున్నాడు.
శ్లోక తాత్పర్యము:
"సమస్త ప్రాణులయందు సమానముగావున్నఈశ్వరుని, సమానముగా చూచుచూ మనుజుడు తన ఆత్మను హించించుకొనడు.
అందువలన అత్యుత్తమమైన గతిని పొందుచున్నాడు".||29||
శ్లోకము 30
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|
యః పశ్యతి తథాఽఽత్మానం అకర్తారం స పశ్యతి||30||
స|| యః కర్మాణి ప్రకృత్యా ఏవ సర్వసః క్రియమాణాని , తథా ఆత్మానం అకర్తారం చ పశ్యతి సః (యదార్థం) పశ్యతి ||30||
శ్లోకార్థములు:
యః కర్మాణి - ఎవరు కర్మలను
ప్రకృత్యా ఏవ - ప్రకృతి చేతనే
సర్వశః క్రియమాణాని - సర్వవిధముల చేయబడుచున్నట్లు గను
తథా ఆత్మానం - అట్లే ఆత్మను
అకర్తారం అకర్తారం- కర్తగాని వాని గను చూచుచున్నాడో
సః (యదార్థం) పశ్యతి - అతడు నిజముగా చూచుచున్నవాడగును.
శ్లోక తాత్పర్యము:
"ఎవరు కర్మలను ప్రకృతి చేతనే సర్వవిధముల చేయబడుచున్నట్లు గను.
అట్లే ఆత్మను కర్తగాని వాని గను చూచుచున్నాడో, అతడు నిజముగా చూచుచున్నవాడగును".||30||
ప్రపంచములో అన్నిపదవులలోను మోక్షపదవి శ్రేష్టమైనది. ఆత్మసాక్షాత్కార మోక్షపదవి గొప్పది. ప్రపంచమున సమస్తకర్మలు ప్రకృతిచే చేయబడుచున్నవని, ఆత్మ అకర్త అనే జ్ఞానముకలవాడు వాస్తవముగా జ్ఞాన నేత్రము కలవాడు. ఈ మాటే కృష్ణ భగవానుడు మరొక అద్భుతమైన వాక్యములో చెప్పాడు.
శ్లోకము 31
యథాభూతపృథక్భావమ్ ఏకస్థమనుపశ్యతి|
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా||31||
స|| యదా భూతపృథగ్భావమ్ ఏకస్థం చ తతః ఏవ విస్తారం అనుపశ్యతి తదా (సః) బ్రహ్మన్ సంపద్యతే||31||
శ్లోకార్థములు:
యదా భూతపృథగ్భావమ్ - ఎప్పుడు వేరుగావుండెడి భావము కల ప్రాణులను
ఏకస్థం చ - ఒక్కదానిలో వున్నవిగను
తతః ఏవ విస్తారం - దానినుండియే విస్తరించు చున్నవిగను
అనుపశ్యతి- చూచుచున్నాడో
(సః) బ్రహ్మన్ సంపద్యతే- అతడు బ్రహ్మమును పొందుచున్నాడు
శ్లోక తాత్పర్యము:
"ఎప్పుడు వేరుగా వుండెడి భావము కల ప్రాణులను ఒక్కదానిలో వున్నవిగను,
దానినుండియే విస్తరించు చున్నవిగను చూచుచున్నాడో
అతడు బ్రహ్మమును పొందుచున్నాడు".||31||
అంటే భిన్న భిన్నరూపములతో నున్న సమస్త ప్రపంచము ప్రరమాత్మ నుండే విస్తరించిన దానిగా ఎవరు వీక్షింపగలుగునో వారే బ్రహ్మమును పొందగలుగుదురు అని. ఇదే మాట బృహదారణ్యక ఉపనిషత్తులో, "అత్మైవ ఇదం సర్వం"(బృ2.4.8) ఈ సమస్తము ఆత్మయే అని చెప్పబడినది.
శ్లోకము 32
అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయ మవ్యయః|
శరీరస్థోఽపి కౌన్తేయ న కరోతి నలిప్యతే||32||
స|| కౌన్తేయ అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ అవ్యయః అయం పరమాత్మా శరీరస్థః అపి న కరోతి నలిప్యతే ||32||
శ్లోకార్థములు:
అనాదిత్వాత్ - ఆది లేనివాడు అగుట చేతనూ,
నిర్గుణత్వాత్ - గుణరహితుడు అగుట చేతనూ
అవ్యయః అయం పరమాత్మా - నాశరహితుడగు ఈ పరమాత్మ
శరీరస్థః అపి - శరీరమందు వున్నవాడైనప్పటికి
న కరోతి నలిప్యతే - ఏమీ చేయుటలేదు, దేనికి అంటబడుట లేదు.
శ్లోక తాత్పర్యము:
"ఓ కౌన్తేయ, ఆది లేనివాడు అగుట చేతనూ, గుణరహితుడు అగుట చేతనూ, నాశరహితుడగు ఈ పరమాత్మ
శరీరమందు వున్నవాడైనప్పటికి, - ఏమీ చేయుటలేదు, దేనిచేతను అంటబడుట లేదు".||32||
కల్మషములు గల దేహములో వున్నప్పటికి, పరమాత్మ ఆదిలేనివాడు, గుణరహితుడు అగుటచేత, సాక్షిగావుంటూ ఏమీ చేయుటలేదు, దేనిచేతను అంటబడుట లేదు.
శ్లోకము 33
యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే|
సర్వత్రావస్థితో దేహే తథాఽఽత్మా నోపలిప్యతే||33||
స|| సర్వగతమ్ ఆకాశమ్ సౌక్ష్మ్యాత్ యథా న ఉపలిప్యతే తథా సర్వత్రదేహే అవస్థితః ఆత్మా న ఉపలిప్యతే ||33||
శ్లోకార్థములు:
సర్వగతమ్ ఆకాశమ్ - సర్వత్ర వ్యాపించియున్న ఆకాశము
సౌక్ష్మ్యాత్- సూక్షత్మము వలన
యథా న ఉపలిప్యతే - ఏ విధముగా అంటబడదో
తథా అదేవిధముగా
సర్వత్రదేహే అవస్థితః ఆత్మా - శరీరమంతయూ వ్యాపించివున్న ఆత్మ
న ఉపలిప్యతే - అంట బడదు.
శ్లోక తాత్పర్యము:
"సర్వత్ర వ్యాపించియున్న ఆకాశము సూక్షత్మము వలన ఏ విధముగా అంటబడదో,
అదేవిధముగా శరీరమంతయూ వ్యాపించివున్న ఆత్మ అంటబడదు".||33||
.
సర్వత్రవ్యాపించినను ఆకాశము సూక్ష్మమగుటవలన ఏ ప్రకారము దుమ్ము ధూళివాటిచే అంటబడదో, ఆదే ప్రకారము శరీరమంతట వెలయుచున్నపరమాత్మశరీర గుణములదోషములచే అంటబడక యున్నాడు.
శ్లోకము 34
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత||34||
స|| భారత! ఏకః రవిః ఇమమ్ కృత్స్నం లోకమ్ యథా ప్రకాశయతి తథా క్షేత్రీ ( క్షేత్రజ్ఞః) కృత్స్నం క్షేత్రం ప్రకాశయతి||34||
శ్లోకార్థములు:
ఏకః రవిః ఇమమ్ కృత్స్నం లోకమ్ - ఒకటే సూర్యుడు ఈ సమస్తమైన లోకమును,
యథా ప్రకాశయతి - ఏవిధముగా ప్రకాశింప చేయునో
తథా క్షేత్రీ ( క్షేత్రజ్ఞః) - అదే విధముగా క్షేత్రజ్ఞుడు
కృత్స్నం క్షేత్రం ప్రకాశయతి - సమస్త లోకములను ప్రకాశింపచేయుచున్నాడు.
శ్లోక తాత్పర్యము:
"ఓ భారత, ఒకటే సూర్యుడు ఈ సమస్తమైన లోకమును, ఏవిధముగా ప్రకాశింప చేయునో,
అదే విధముగా క్షేత్రజ్ఞుడు సమస్త లోకములను ప్రకాశింపచేయుచున్నాడు.:"||34||
శ్లోకము 35
క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా|
భూతప్రకృతి మోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్||35||
స||యే జ్ఞానచక్షుసా ఏవం క్షేత్ర క్షేత్రజ్ఞయోః అన్తరమ్ భూతప్రకృతి మోక్షం చ విదుః తే పరమం ( మోక్షం) యాన్తి||35||
శ్లోకార్థములు:
యే జ్ఞానచక్షుసా ఏవం - ఎవరు జ్ఞానదృష్ఠితో నే
క్షేత్ర క్షేత్రజ్ఞయోః అన్తరమ్ - క్షేత్రము క్షేత్రజ్ఞుల భేదమును
భూతప్రకృతి మోక్షం చ - ప్రాణులకు సంబంధించియుండు ప్రకృతి నుండి మోక్షము పొందుటకు
విదుః - (ఉపాయము) తెలిసికొనుచున్నరో
తే పరమం యాన్తి- వారు పరమాత్మ పదమును పొందుచున్నారు.
శ్లోక తాత్పర్యము:
"ఎవరు జ్ఞానదృష్ఠితో క్షేత్రము క్షేత్రజ్ఞుల భేదమును, ప్రాణులకు కారణమైన ప్రకృతి నుండి మోక్షము పొందుటకు
ఉపాయము తెలిసికొనుచున్నరో , వారు పరమాత్మ పదమును పొందుచున్నారు".||35||
మోక్షమనగా ప్రకృతి (అవిద్య) నుండి విడుదలయే. క్షేత్ర క్షేత్రజ్ఞ విభేధము తెలిసినవాడే వివేకము చేత మోక్షమును పొందగలుగుచున్నాడు. అదియే తెలిసికొనవలసిన ఉపాయము.
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగోనామ
త్రయోదశోఽధ్యాయః
ఓం తత్ సత్
|| om tat sat||