||భగవద్గీత ||

|| పదునాలుగవ అధ్యాయము ||

||గుణత్రయ విభాగయోగము -వచన వ్యాఖ్యానము ||

|| om tat sat||


||ఓమ్ తత్ సత్||
శ్రీభగవానువాచ:
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|
యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః||1||
"దేనిని తెలిసికొని మునులందఱూ ఈ సంసారబంధమునుంచి పరమోత్తమమగు మోక్షమును పొందిరో అట్టి శ్రేష్ఠమైన జ్ఞానములో ఉత్తమమైన జ్ఞానమును మఱల చెప్పుచున్నాను"

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీమద్భగవద్గీత
గుణత్రయవిభాగయోగము
చతుర్దశోధ్యాయః

మూడో అధ్యాయములో "గుణములయొక్క కర్మలయొక్క విభజన గురించి యదార్థము గ్రహించినవాడు సాత్వికతామస రజోగుణములు శబ్దాది విషయములందు ప్రవర్తించుచున్నవి అని గ్రహించి, ఆత్మస్వరూపుడగు తనకు వానితో సంబంధము లేదని గ్రహించి ( మోక్షసాధనకై )కర్మలయందు అభిమానము లేకుండ ఉండును (3.28)" అని చెపుతాడు. అదే ధోరణిలో మూడవ అధ్యాయములోనే అర్జుని ప్రశ్న "కృష్ణా! మనుజుడు బలాత్కారముగా నియోజింపబడినవాని వలే పాపము ఎందుకు చేయుచున్నాడు" అన్న మాటకి సమాధానముగా " దానికి హేతువు రజో గుణము వలన పుట్టిన కామము" ఆ కామమే మహాశత్రువు గా గ్రహించుము" అని చెపుతాడు. అంతకన్న గుణములగురించి ఎక్కువ చెప్పలేదు.

ఆ తరువాత నాలుగవ ధ్యాయములో - "చాతుర్వర్ణ్యం మయాసృష్ఠం గుణకర్మ విభాగశః" అంటే "గుణకర్మలవిభాగము అనుసరించి నాలుగు వర్ణములు నాచే సృష్ఠించబడినవి" అని చెప్పి గుణముల విభజనగురించి ఒక చిన్నమాట చెప్పివదిలేశాడు.

ఆత్మసంయమయోగము లో "శాంత రజసం" - రజోగుణ వికారములు లేని ధ్యానయోగికి శ్రేష్ఠమైన సుఖమును పోందుచున్నాడు అని చెప్పి ( రజో తామస)గుణములను అదుపులో ఉంచవలసిన సంగతి చెపుతాడు.

విజ్ఞానయోగములో - "త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్" అంటూ ఈ జగత్ సర్వము ఈ మూడు గుణములయొక్క స్వభావముచేత మోహములో పడి ఈ గుణాలకి అతీతుడైన బ్రహ్మ స్వరూపము తెలియజాలక ఉన్నాయి ( 7.13) అని చెప్పి ఈ గుణములవలన ప్రజలు దారితప్పి పోతారు అన్నమాట చెపుతాడు.

పదమూడో అధ్యాయములో మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణము ఈ గుణాలతో సంగమే అని కూడా( 13.21) లో కృష్ణ భగవానుడు చెపుతాడు. అయితే మళ్ళీ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏగుణాలతో ఏమి సంబంధము ? ఈ గుణములు ఎలా బంధిస్తాయి ? గుణములనుండి ఎలా విముక్తిపొందవచ్చు. వాటికి సమాధానమే ఈ అధ్యాయము.

కృష్ణార్జునసంవాదములో అర్జునిడికి నిర్గుణ బ్రహ్మ తత్త్వము గురించి అంటే జ్ఞానసంబంధమైన విషయములగురించి అంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి , జ్ఞానము జ్ఞేయము గురించి ప్రకృతి పురుషులగురించి చెపుతాడు . ప్రకృతి పురుషులగురించి విశదీకరిస్తూ మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణము ఈ గుణాలతో సంగమే అని కూడా( 13.21) లో కృష్ణ భగవానుడు చెపుతాడు. అయితే మళ్ళీ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏగుణాలతో ఏమి సంబంధము ? ఈ గుణములు ఎలా బంధిస్తాయి ? గుణములనుండి ఎలా విముక్తిపొందవచ్చు. వాటికి సమాధానమే ఈ అధ్యాయము.

ఈ ప్రశ్నలు అర్జునుడు అడగపోయినా కృష్ణుడికి ప్రకృతి వలనకలిగే గుణములగురించి ఇంకా చెప్పాలని కుతూహలము తో "గుణత్రయ విభాగయోగము" తనే మొదలెడుతాడు.

ఈ పదునాలుగవ అధ్యాయము కూడా "యత్ జ్ఞాత్వా.." ఏది తెలిసికొంటే నీకు సంసారబంధనము నుంచి విడివడగలవో అట్టి జ్ఞానము " తత్ ప్రవక్ష్యామి " నీకు చెపుతాను అంటూ మొదలెడతాడు !

అంటే ఈ గుణత్రయ విభాగయోగము కూడా అంత ముఖ్యమన్నమాట.

అదే ఈ అధ్యాయములో మొదటి శ్లోకము:
శ్రీభగవానువాచ:
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|
యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః||1||

అంటే "దేనిని తెలిసికొని మునులందఱూ ఈ సంసారబంధమునుంచి పరమోత్తమమగు మోక్షమును పొందిరో అట్టి శ్రేష్ఠమైన జ్ఞానములో ఉత్తమమైన జ్ఞానమును మఱల చెప్పుచున్నాను"

శ్రీభగవానుడు " దేనిని తెలుసుకొనీ మునులందరూ ఈ సంసారబంధమునుండి విడివడి మోక్షసిద్ధిని బడసిరో అట్టి పరమాత్మైక విషయకమైనది ఉత్తమమైనది జ్ఞానమును చెప్పుచున్నాను" అనెను . ఈ జ్ఞానమును తెలిసికొనినవారు సాక్షాత్తు భగవంతునితో ఐక్యము నొందగలరు అన్నమాట . భగవత్సాయుజ్యము నొందగలరు అన్నమాట. జీవుడు బంధమునుండి విముక్తుడు కావలసినచో ఈ మూడు గుణములు దాటి ఆవలనున్న పరమాత్మను చేరుటయే.(14.2)

ప్రకృతి పురుషుల కలయికవలన భూతోత్పత్తి అవుతుంది. పురుషుడు అంటే ఆత్మయే అని , ఆత్మయే బ్రహ్మము అని ఇదివఱకు విన్నమాటలే. పుట్టిన ప్రతి ప్రాణికి బీజము తానే అన్నమాట చెప్పి సమస్త భూతములు బ్రహ్మ స్వరూపమే అని కృష్ణుడు విశదీకరించాడన్నమాట. అంటే వారికి ప్రకృతియే తల్లి, పరమాత్మయే తండ్రి.(14.3,4)

ప్రకృతినుంచే గుణములు అవిర్భయించాయి. అదే ఈ శ్లోకములో:
శ్రీభగవానువాచ
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః |
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||5||
"ఓ మహాబాహో ! సత్వము రజస్సు తమస్సు అనబడు గుణములు ప్రకృతివలన సంభవించినవి.(అవి) నాశరహితమైన ఆత్మను దేహమునందు బంధించుచున్నవి"

ప్రకృతిజన్యమగు ఈ మూడు గుణములు జీవుని ఉచ్చ నీచ జన్మములకు కారణమని చెప్పబడుచున్నది. ఈ మూడు గుణములగురించి చెపుతూ సత్వగుణము నిర్మలమైనది కనక ప్రకాశము కలదై జ్ఞానమునందు ఆసక్తి చేత జీవుని బంధించుచున్నది.(14.6)

జీవుడు ప్రయత్నపూర్వకముగా సత్వగుణమును దాటి ఆత్మస్థితికి చేరవలయును.

రజోగుణము కోరికలను ఆసక్తియును కలుగజేయును అనేక బాహ్యాడంబరమైన కర్మలచేత ఖ్యాతి ఆర్జించవలెనని దృశ్యసంబంధమైన వివిధ కార్యకలాపముల చేత జీవుని బంధించును (14.7)

తమోగుణము అజ్ఞానమును అవివేకమును సోమరితనము నిద్ర కలుగజేయును. (14.8)
శ్రీభగవానువాచ
సత్వంసుఖే సంజయతి రజఃకర్మణి భారత
జ్ఞానమావృత్యతు తమఃప్రమాదే సంజయత్యుత ||9||

అంటే "ఓఅర్జునా ! సత్వ గుణము సుఖమునందును రజోగుణము కర్మమునందును తమోగుణము జ్ఞానమును [వివేకమును] కప్పివేసి జీవుని ప్రమాదమునందు చేర్చుచున్నవి"

ఈ త్రిగుణములకు నిత్య నిర్మలుడైన జీవుడు వశుడై యుండుట ఆశ్చర్యము. ఇవి జ్ఞానదీపమును ఆత్మదీపమును ఏదోవిధముగ కప్పునటువంటి గుణములు.

ఒక్కొక్క గుణము అధికముగానున్నపుడు జీవుడు ఒనర్చు కర్మము దానికి అనుగుణముగనె యుండును .
అయితే ఎప్పుడు ఏగుణం వృద్ధిలో వుందో తెలుసు కోవడానికి గుర్తులేవి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానముగా కృష్ణుడు ఆ మూడుగుణముల గుర్తులు ఫలాలు చెపుతాడు.

సత్వగుణము అభివృద్ధి పొందినపుడు జీవుని సమస్త చర్యలు సాత్వికముగ ప్రకాశయుతముగ జ్ఞానవంతముగ నుండును. ప్రశాంతముగ మాట్లాడుట సాత్వికాహారము తినుట ఉత్తమగ్రంధములను చదువుటయు చేయును . సాత్విక గుణమునకు ఉదాహరణగా విభీషణుడిని తీసికొనవచ్చును.(14.11)

రజోగుణము ప్రభావమువలన జీవుడు లేనిపోని కర్మలను వ్యవహారములను పైనవేసుకొనుచూ నిత్యము శాంతి లేకుండా యుండును. అంటే అశాంతి పరుడై యుండును. (14.12) రావణాసురుని రజోగుణము వృద్ధి్గా ఉన్నవారిలో ఉదాహరణగా తీసికొన వచ్చును.

తమోగుణమువలన బుద్ధి మాంద్యము సోమరితనము మూఢత్వము వచ్చును.(14.13) కుంభకర్ణుడు తమోగుణమునకు ప్రతీక.

ప్రతీవారును తమతమ హృదయములను శోధించుకొనీ తమయందు యే గుణముల లక్షణములున్నవో చూచుకొని సాధనచేత ఊర్ధ్వస్థితిని పొందుటకు ప్రయత్నము చేయవచ్చును . చేయవలను కూడా.

జీవుడు సత్వగుణము అభివృద్ధినొందినవానినిగా మరణించినచో అతడు ఉత్తమ లోకములనే పొందును. (14.14)సత్వగుణసంస్కారము కలుగుటకు ఎంతయో సాధన సంస్కారము అవసరము. జీవుడు జీవితమంతా పుణ్యకార్యములు చేయుచూ పరోపకార భావన కలిగి యుండవలయును.

జీవుడు రజోగుణము అభివృద్ధి నొందగా మరణించినచో అతడు కర్మ మీద ఆసక్తి గలవారి ఇంట జన్మించుచున్నాడు. (14.15)

అట్లే తమోగుణము కలవాడు మూఢసంసారుల గర్భములో జన్మించుచున్నాడు.

సాత్వికర్మలచే నిర్మలసుఖము, రజోగుణములచే దుఃఖము, అదేవిథముగా తమోగుణముచే అజ్ఞానము కలుగుచున్నది.(14.16)

సత్త్వం ప్రధానమైనప్పుడు జ్ఞానము కలుగుతుంది. రజస్సు వలన లోభము తమస్సువలన ప్రమాదము మోహమే కాక అజ్ఞానము కూడా కలుగుతుంది.(14.17) సత్త్వములో ఉన్నవారు దేవలోకాలకి వెళతారు. రజోగుణములో ఉన్నవారు మధ్యలోకములో అంటే మనుష్యలోకములో ఉంటారు.తమోగుణములో ఉండే వారు అధోగతి పొందుతారు.(14.18).

తాను చేయు సమస్తకర్మలకును తాను అకర్త, సర్వసాక్షి నిర్గుణుడు అనీ వాస్తవముగా ఎవరు తెలిసికొనునో వారు తత్ క్షణమే భగవత్స్వరూపమును పొందుచున్నారు.

కృష్ణుడు ఈ విశదీకరణలో..
గుణాన్ ఏతాన్ అతీత్య ... ఈ గుణములను దాటి
అమృతం అశ్నుతే - అమృతత్వమును పొందుతాడు ( 13.20) ఆని కూడా చెపుతాడు.

ఆ విశదీకరణలోనే వుంది తరువాత ప్రశ్న అదే అర్జునుడు అడిగిన ప్రశ్న.

అదే అర్జునిని ప్రశ్న.
అర్జున ఉవాచ:
కైర్లింగైస్త్రీన్గుణానేతాన్ అతీతో భవతి ప్రభో |
కిమాచారం కథం చైతాం స్త్రీన్గుణానతివర్తతే ||21||

అంటే "ఓ ప్రభో !ఈ ముడు గుణములను అతిక్రమించినవాడు ఏ లక్షణములతో ఉండును. ఎటువంటి ప్రవర్తన కలవాడగుచున్నాడు. ఈ మూడు గుణములను ఎట్లు అతిక్ర మించుచున్నాడు." అని.

ఈ ప్రశ్నకి కారణము అర్జునిని సందేహము. ప్రకృతికి సంబంధించిన ఈ మూడు గుణములగురించి , ఈ మూడు గుణములు ఎలాగ జీవుని బంధిస్తున్నాయో , జీవుడు ఈ మూడుగుణములను దాటి అమృతత్త్వము పొందగలడు అని వినిన అర్జునిని కి మళ్ళీ గుణములనుంచి జీవుడు తనంతత తానే ఎట్లా బయటపడగలడు అన్న సందేహము వస్తుంది.

అప్పుడు కృష్ణ భగవానుడు గుణాతీతుని లక్షణములు గుణములను అతిక్రమించడానికి ఉపాయములు చెపుతాడు.

ఈ మూడు గుణములను అతిక్రమించినవాని యొక్క లక్షణములు ఈ విధముగా ఉంటాయి.

" ఎవడు తనకు ప్రాప్తించిన సత్వగుణమగు ప్రకాశము, రజోగుణమగు కార్య ప్రవృత్తిని గాని తమోగుణసంబంధ మోహమును గాని ద్వేషింపడో అవి తొలగిపోయినచో అపేక్షింపడో , అతనికి సుఖదుఃఖములు సమానమో, ఇష్టా అనిష్టములందు నిందాస్తుతుల యందు మానావమానములందు శతృవుల యందు మిత్రుల యందు సమభావముండునో, సమస్త కార్యములందు కర్తృత్వము వదలి వేయునో, సమస్త కార్యములు వదలి బ్రహ్మమందుండునో అట్టివాడు గుణములకు అతీతుడని చెప్పబడెను (14.22-25).

"కథంచ ఏతాన్ త్రీన్ గుణాన్" - అయితే ఈ మూడు గుణములను "అతివర్తతే" దాటుట ఎట్లు అన్న అర్జుని ప్రశ్నకి సమాధానము గా మళ్ళీ కృష్ణుడు ఇలా చెపుతాడు.
శ్రీభగవానువాచ:
మాం చ యోsవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే|
స గుణాన్సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే||26||

అంటే "ఎవరు నన్నుఅచంచలమైన భక్తి యోగముచేత సేవించుచున్నాడో అతడు ఈ గుణములను తప్పకుండా దాటి జీవన్ముక్తుడగుటకు సమర్థుడగుచున్నాడు".

అంటే ఈ గుణములను దాటడానికి కూడా భగవంతుని అచంచలమైన భక్తితో సేవించుచున్నాడో అతడు దానికి సమర్థుడగు చున్నాడన్నమాట.

భక్తిమార్గము అందరికి సులభమైనది. తద్వారా భవత్కృప , బ్రహ్మజ్ఞానము అలాగే భగవదనుభూతి పొందడానికి అనుకూలముగా వుండును.

అంటే అ గుణములను దాటడానికి కూడా భక్తి మార్గము అవసరము అన్నమాట.

ఈ మూడు గుణములను అతిక్రమించినవాడు బ్రహ్మము ను పొందుచున్నాడు అన్నమాటకి - బ్రహ్మము అంటే మళ్ళీ కృష్ణుడు విశదీకరిస్తాడు.

బ్రహ్మము నాశరహితమైనది వికారము లేనిది , శాశ్వత ధర్మస్వరూపమైనది , నిరతిశయ ఆనంద రూపమమైనది.

అదే సత్ (నాశరహితమైనది) చిత్ (శాశ్వత ధర్మస్వరూపమైనది) ఆనంద ( నిరతిశయ ఆనందరూపమైనది) స్వరూపము.

అదే సత్ చిదానంద స్వరూపము. అదే నా స్వరూపము అని.(14.27)
|| ఓమ్ తత్ సత్||
బ్రహ్మణో హి ప్రతిష్టాsహమ్ అమృతస్యావ్యయస్య చ|
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ||27||
"నేను నాశ రహితము నిర్వికారమును శాశ్వత ధర్మస్వరూపమును అచంచల ఆనందస్వరూపము అగు బ్రహ్మమునకు ఆశ్రయమును అయివున్నాను"
||ఓమ్ తత్ సత్||


|| om tat sat||