||భగవద్గీత ||
|| పదునైదువ అధ్యాయము ||
||పురుషోత్తమ ప్రాప్తి యోగము -వచన వ్యాఖ్యానము
||
|| om tat sat||
||ఓమ్ తత్ సత్||
శ్రీభగవానువాచ:
ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్యపర్ణాని యస్తం వేద స వేదవిత్ ||1||
"దేనికి వేదములు ఆకులుగాఉన్నవో అట్టి సంసార వృక్షమగు అశ్వత్థవృక్షమును నాశనములేనిదిగనూ, పైన వేళ్ళు గలది గనూ, క్రింద కొమ్మలు గలదిగనూ చెప్పబడుచున్నది. అది ఎవరు తెలిసికొనుచున్నాడో వాడు యథార్థము తెలిసికొనిన వాడు".
శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః
శ్రీమద్భగవద్గీత
పురుషోత్తమ ప్రాప్తి యోగము
పదునైదువ అధ్యాయము
గుణత్రయవిభాగ యోగములో భక్తి ద్వారా త్రిగుణములు దాటవచ్చని భక్తి ద్వారా బ్రహ్మసాక్షాత్కారము పొందవచ్చని అనన్యభక్తి చేత ఆ పురుషోత్తముని ఆ పరమాత్మను పొందవచ్చని శ్రీకృష్ణుడు అర్జునునకు చెపుతాడు.
పురుషోత్తముడు అనగా పరమాత్మ. శరీరమునకు అభిమాని అయిన క్షర పురుషుని కన్ననూ, మనస్సు యొక్క అభిమాని యగు అక్షరపురుషుని కన్ననూ ఉత్తముడైన పరమాత్మనే పురుషోత్తముడు అని అంటారు. అట్టి పురుషోత్తముడిని పొందుటకు ( ప్రాప్తికి) మార్గము ఈ అధ్యాయమునందు తెలుపబడినది కనుక ఈ అధ్యాయముని పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటారు.
పురుషోత్తమప్రాప్తికి ముందు ఆ పురుషోత్తముని స్వరూపము , పురుషోత్తమ ప్రాప్తి పొందుమార్గము , పురుషోత్తమ ప్రాప్తి వలన ఫలితములు ఏమిటి అన్న ప్రశ్నవస్తుంది. ఆ ప్రశ్నలకే సమాధానము పురుషోత్తమ ప్రాప్తి యోగము.
భక్తి ద్వారా త్రిగుణములు దాటవచ్చని చెప్పినా ఆ భగవద్భక్తి వృద్ధి అవడానికి కామక్రోధములతో కలిసిపోయిన విషయములపై విరక్తి లేక వైరాగ్యము కలవాలి. అంటే సంసార విషయములు క్షణికములు అన్న భావన రావాలి. అది వివరించడముకోసమే ఈ అధ్యాయములో సంసారమును వృక్షముతో పోల్చి దానిని అశ్వత్థ వృక్షమన్నాడు కృష్ణ పరమాత్మ. అశ్వత్థము అంటే ఏమిటి? అశ్వత్థ అన్నమాట 'శ్వః', 'న స్థః' అన్నమాటలలోనుంచి వచ్చినది.
"శ్వః" అంటే "రేపు" ;
"న స్థః" అంటే "ఉండనిది"
'న స్థః స్వః' అంటే అశ్వత్థః అన్నమాట. అంటే ’రేపు లేనిది’. అదే సంసార వృక్షము. అదే అశ్వత్థ వృక్షము.
సంసార వృక్షమునకు కారణ భూతుడు పైనున్న పరమాత్మయే . ఈ వృక్షముయొక్క వేళ్ళకి పైన వున్న పరమాత్మ యే అధారభూతమగుటచే ఆ వేళ్ళు పైన వున్నట్లు కొమ్మలు క్రింద వున్నట్లు చెప్పబడినది. ఈ సంసారము క్షణికమని తెలిసిననాడే మాయ తొలగి జ్ఞానోదయము అవుతుంది . అదే వేదములసారము . అదే పురుషోత్తమ ప్రాప్తి యోగములో కృష్ణభగవానుని మొదటి మాట .
శ్రీభగవానువాచ:
ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్యపర్ణాని యస్తం వేద స వేదవిత్ ||1||
అంటే "దేనికి వేదములు ఆకులుగాఉన్నవో అట్టి సంసార వృక్షమగు అశ్వత్థవృక్షమును నాశనములేనిదిగనూ, పైన వేళ్ళు గలది గనూ, క్రింద కొమ్మలు గలదిగనూ చెప్పబడుచున్నది. అది ఎవరు తెలిసికొనుచున్నాడో వాడు యథార్థము తెలిసికొనిన వాడు".
ఇక్కడ విషయ విరక్తి వైరాగ్యము బోధించుటకు దృశ్యరూపసంసారము ఒక అశ్వత్ధ వృక్షముతో పోల్చబడినది అన్నమాట. ఈ సంసార వృక్షము పైనవ్రేళ్ళు క్రిందకొమ్మలు కలది, వేదములే ఆకులుగా కలది. ఈ సంసారవృక్షము పైన (ఊర్ధ్వమున) ఉన్న బ్రహ్మమునయుండియే ఆవిర్భవించినది.
ఈ వృక్షమునకు వేదములే ఆకులు అని ఎందుకు అంటారు. వేదాలు ధర్మము అధర్మముల ఫలములను విడమరిచి చెప్పి సంసారవృక్షమును రక్షిస్తున్నాయి. చెట్టును ఆకులు రక్షించినట్లు వేదాలు సంసార వృక్షాన్ని రక్షిస్తున్నాయి. అందుకనే వేదాలు ఆకులుగా గల సంసార వృక్షము అన్నారు.
వేదాలలో గృహస్తులకు అలాగే మిగిలినవారికి వారు ఫలాపేక్షతో చేయతగిన కర్మకాండ గురించి చాలావుంది. అందుకే వేదాలు సంసారవృక్షాన్ని రక్షిస్తున్నాయి అని అన్నారు.
అదే వేదాలలో వేదాల అంతం లో సంసారవృక్షమునుంచి బయట పడడానికి కావలసిన వేదాంతం కూడా చెప్పబడినది.
ఈ విధముగా సంసారవృక్షాన్ని బ్రహ్మమునుంచి ఉద్భవించినదానిగా, వేదములనే ఆకులచే రక్షింపబడిన దానినిగా ఎవరు తెలిసికొంటారో వాళ్ళు వేదము తెలిసినవారు అన్నమాట.
మాయ అనగా(అవిద్య) ఎలాగైతే అనిత్యమైనది నిత్యము గాను, దుఃఖమును సుఖముగాను, అనాత్మని ఆత్మ గాను తోపింపజేయునో అలాగే పైనున్న పురుషొత్తముని నుంచి అవిర్భవించిన తలక్రిందులుగానున్న సంసారవృక్షమును పురుషోత్తమునితో సంబంధము లేని వృక్షము వలే కనిపింపచేయును.
అలాగే బ్రహ్మమార్గమున నున్నవారికి ఈ సంసారవృక్షము అవరోధము కల్పించుచున్నది.
అశ్వత్ధము అనగా రేపు యుండునోలేదోనని సందేహముతో నున్నది. నాశరహితమైనది అనాదికాలము నుండి కోట్లకొలది జన్మలనుండి బాగా ధృఢపడుతూవచ్చి శాఖోపశాఖలుగా విస్తరించి యున్నది. దీని శాఖలు సత్వరజోతమో గుణములవలన పైకి ( బ్రహ్మము వేపుకు) కిందకీ ( మనుష్యలోకానికి) వ్యాపించివున్నాయి. అంటే సత్వగుణమువలన పైకి తమో గుణము వలన కిందకీ వ్యాపించి వున్నాయి అన్నమాట. కర్మవాసనలు దీని వ్రేళ్ళు. మూలము అంటే ముఖ్యమైన వేరు బ్రహ్మమైనా , కర్మతో బంధమైన పిల్లవేళ్ళు మనుష్యలోకములో వ్యాపించి వున్నాయి .
ఈ వృక్షానికి తుది మొదలు తెలిసికోలేము. ఆ రూపముతో కూడా చూడలేము సత్వరజోతమోగుణముల చేత శబ్దాది గుణములచే దీని చిగుళ్ళు వృద్ధి యగుచున్నవి. అట్టి ఈ సంసారవృక్షమునకు ,అంటే ఈ జగత్తుకి ఆధారము బ్రహ్మమని ఎరిగినవాడే వేదార్ధమును యదార్థమును నెరిగినవాడు.
అసంగ మనగా ప్రాపంచిక విషయవిరక్తి అభిమానము లేకుండుట. అసంగమనే బలమైన ఖడ్గముచేత సంసారవృక్షమును చేదించవలెను. మంద మంద వైరాగ్యముచే ఈ సంసారవృక్షము ఛేదింపబడదు. తీవ్రవిరక్తికి పరిపూర్ణ అసంగము ఆవశ్యకమై యున్నది.(15.3)
సంసారవృక్షమును అసంగమనే ఖడ్గముచే ఛేదించినవారు ఎవరు అంటే కృష్ణుడు చెపుతాడు:
శ్రీభగవానువాచ:
నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మ నిత్యా వినివృత్తకామాః
ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞై
గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయమ్ తత్|| 5||
వారు - అభిమానమును విడిచిన వారు, దృశ్యపదార్దముల యందు ఆశక్తిలేనివారు, కోరికలను జయించినవారు సుఖదుఃఖాదులను విడచి పెట్టిన వారు, మూఢత్వము లేనివారు, నిరంతరము అత్మజ్ఞాన విచారణలోఉన్నవారు. అట్టి వారు మాత్రమే పరమాత్మను పొందగలరు.(15.5)
పరమాత్మను పొందగలరు అంటే ఆ పరమాత్మ స్థానము ఎలాంటిది?
ఆ పరమాత్మస్థానము సూర్యచంద్రాగ్నులు ప్రకాశింపచేయజాలవు . అట్టి స్థానమును పొందిన వారు మరల ఈ సంసార సాగరానికి మళ్ళీ రారు. (15.6)
అ పరమాత్మ స్థానము పొందు జీవుల స్వరూపము ఏమిటి?
శ్రీభగవానువాచ:
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః|
మనష్షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి||7||
’ నా అంశయే జీవలోకములో సనాతన జీవమై ప్రకృతియందున్న ఆరవది అయిన మనస్సును (అయిదు)ఇంద్రియాలను ఆకర్షించుచున్నది’
’మమైవాంశో’ అన్న మాటతో భవంతుని అంశ జీవుని లో ఉంది అని నిస్సందేహముగా చెపుతున్నాడు. అంటే జీవాత్మ పరమాత్మా ఒకటే అన్నమాట. జీవాత్మ కి ఆత్మ అనుభూతి అయినపుడు జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుస్తుంది. అత్మానుభూతి అవనంతకాలము జీవుడు అజ్ఞానములోనే ఉంటాడు. ఇది మనము విన్నమాటే. ఇక్కడ అదే భావముతో కృష్ణుడు అర్జునుడికి మళ్ళీ బోధిస్తున్నాడు.
జీవుడు వాస్తవముగా భగవదంశస్వరూపుడు. తాను శరీరమని తలచి ఇంద్రియములతో మనస్సుతో కాలక్షేపము చేయుచున్నాడు. వాయువు సుగంధవస్తువులు గానీ దుర్గంధవస్తువులుగాని ఎలా తీసుకొనిపోవునో అలాగనే జీవుడు పాత శరీరమువీడి క్రొత్త శరీరముధరించినపుడు మనస్సును ఇంద్రియములను వాటియందుండు సంస్కారములను( వాసనలు) తీసుకొని పోవుచున్నాడు. జీవుడు చెవి ముక్కు కన్ను చర్మము అనే జ్ఞానేంద్రియములతో మనస్సు ఆశ్రయించి విషయములను అనుభవించు చున్నాడు. ఆత్మ అనాత్మవివేకము ఉన్నవారు, చిత్త శుద్ధికలిగి ధ్యానాది ప్రయత్నము చేసినవారుమాత్రమే పరమాత్మను తెలిసికొనగలరు.(15.7,8,9)
విభూతియోగములో చెప్పినట్లే మళ్ళీ సూర్య చంద్ర అగ్నిల తేజస్సు అంతా పరమాత్మదే అని కృష్ణభగవానుడు విశదీకరిస్తాడు. ప్రతి ప్రాణకోటిలో భాగముగా వాటికి బలము సామర్థ్యము ఇచ్చుచున్నది పరమాత్మయే. పరమాత్మయే రసస్వరూపుడగు చంద్రుడై సస్యములను పోషించు చున్నాడు. అంటే సమస్త జీవలోకానికి అన్నాహారములను సృష్టించుచున్నాడు. (15.12,13)
అదే కాదు వాటి పచనమునకు కూడా ఆ పరమాత్మయే కారణభూతుడు.
శ్రీభగవానువాచ:
అహం వైశ్వానరోభూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః|
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్||14||
అంటే "నేను వైశ్వానరుడను జఠరాగ్ని అయి ప్రాణులయొక్క శరీరము ఆశ్రయించి ప్రాణ అపాన వాయువులతో కూడుకొని నాలుగు విథములగు అన్నమును పచనము చేయుచున్నాను".
అంటే మనము భుజించు ఆహారమును పరమాత్మయే ఒసంగుచున్నాడు. ఆ అన్నమును తానే పచనము చేయుచున్నాడు. వైశ్వానరుడు అను జఠరాగ్నిగా అయి ప్రాణులయొక్క శరీరములో ప్రాణవాయువు సహాయముతో నాలుగు విధములగు అన్నమును పచనము చేయుచున్నాడు.
అ నాలుగు విథములగు అన్నములు-
భక్ష్యము - కొరుక్కొని తినేది
భోజ్యము - చప్పళించి తినే మెత్తనైన అన్నము
లేహ్యము - నాలుకతో రుచి చూచే పచ్చళ్ళు
చోష్యము - పాయసము మొదలగునవి.
"పచామ్యన్నం చతుర్విథం" అన్న కృష్ణ భగవానుని మాటతో మనకు తెలిసేది పచనముకూడా భగవదనుగ్రహము అయినప్పుడు మనము తినేది భగవంతునికి అర్పించి మరీ తినవలెను అని. మనకు ఎవరైనా సహాయకులు ఉంటే వారికి మనదగ్గర ఉన్నపనులన్నీ అప్పగించము. అప్పగించ తగిన పనులే అప్పగిస్తాము. అలాగే పచనము అంతా భగవంతుని భాద్యత కాబట్టి అమితముగా భోజనము చేయకూడదు. మితముగా చేయవలెను. అంటే తినడముకూడా తగినట్లు మితముగా తినవలెను. తిను ఆహారముకూడా న్యాయార్జితమై ఉండాలి.
భగవంతుడు మన జఠరములోనే కాదు హృదయములో కూడా నివసిస్తాడు. అదే ఈ శ్లోకములో:
శ్రీభగవానువాచ:
సర్వస్య చాహం హృధి సన్నివిష్టో
మత్తః స్మృతిః జ్ఞానమపోహనం చ|
వైదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్||15||
అంటే "నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందున్నవాడను. నా వలననే జ్ఞానము మరపు కలుగుచున్నవి. వేదములన్నిటి చేతను తెలియదగినవాడను నేనే. మరియు వేదము ఎరిగిన వాడను నేనే".
సమస్త ప్రాణుల హృదయమున యుండి తెలివి మరపు కలిగించువాడు పరమాత్మయే. వేదములచే తెలియతగిన వాడు కూడా పరమాత్మయే.
’వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో’- ’అన్ని వేదములచే తెలిసికొనతగిన వాడను నేను’ అన్న మాటతో కృష్ణభగవానుడు వేదాంత సారమంతా బోధిస్తున్నాడన్నమాట. వేదాలలో చాలా చెప్పబడ్డాయి. కాని వేదాలలో తెలిసికోనబడ తగినది పరమాత్మయే. పరమాత్మయే ఆత్మస్వరూపము. ఈ మాట రెండవ అధ్యాయమునుంచి అనేకవిధములుగా చెప్పబడుతూనే ఉంది. వేదములలో తెలిసికొనతగిన వాడిని నేనే అని ఇక్కడ చెప్పడము ఇప్పటిదాకా చెప్పినది ధృవీకరణము చేయడమే.
మళ్ళీ జీవస్వరూపము గురించి చెపుతూ: కృష్ణ భగవానుడు ఇలా చెపుతాడు.
ఈ ప్రపంచమున క్షరుడు అక్షరుడు అను ఇద్దరు పురుషులు కలరు. సమస్త ప్రాణులలో క్షరమగు దేహమే ముఖ్యము అని తలచే వాడు క్షరుడు లేక క్షర పురుషుడు అని చెప్పబడినది. మనస్సే తాము అని గ్రహించి మోక్షము వచ్చే దాకా అనేక జన్మలవరకు నశించని జీవుడు అక్షరపురుషుడు. అనేక జన్మలవరకు నశించని వాడగుటచే ఆ జీవుని కూటస్థుడగు జీవుడు అలాగే అక్షర పురుషుడు అని అంటారు.
వారిద్దరికన్న వేరైనవాడు మోక్షముపొందిన వాడు ఉత్తముడు. అతడే పరమాత్మ. అతడే పురుషోత్తముడు. (15.16,17)
కొందరు దేహస్థితియందును అంటే దేహమే ముఖ్యము అని, కొందరు జీవస్థితి అంటే మనస్సే తాము అని అభిమానించువారు. వారిరువురు సామాన్యపురుషులు. అత్మయందే ఉండువాడు ఉత్తమపురుషుడు అంటే పురుషోత్తముడు. అట్టి పురుషోత్తమస్థితి ప్రయత్నపూర్వకముగా సంపాదించవలెను. ప్రయత్నపూర్వకముగా దేహస్థితినీ జీవస్థితినీ దాటి సాక్షి యగు ఆత్మ స్థితికి అంటే పురుషోత్తమ స్థితికి వచ్చినవాడే ధన్యుడు. అట్టి స్థితి యే జీవిత పరమావధి. దానిచే జన్మసార్ధకమగును.
ఇక్కడ కృష్ణభగవానుడు తనే పురుషోత్తముడు అని చెపుతాడు. ఎందుకు?
శ్రీభగవానువాచ:
యస్మాత్ క్షరమతీతోsహం అక్షరాదపి చోత్తమః|
అతోsస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః||18||
యస్మాత్ - ఎందువలన
క్షరమ్ - క్షరస్వరూపుని
అతీతోహం - అతిక్రమించినవాడిని
అక్షరాత్ అపి- అక్షరస్వరూపుని కూడా ( అతిక్రమించినవాడిని)
ఆ కారణము వలన లోకములోనూ వేదములలోనూ పురుషోత్తమూడిగా ప్రసిద్ధుడైనాను
"క్షర స్వరూపును మించినవాదను అక్షర స్వరూపుని కన్న శ్రేష్ఠుడగుటచే ప్రపంచములోనూ వేదములలోనూ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కి ఉన్నాను"
ఏవరైతే అజ్ఞానము లేనివాడై భగవానుని పురుషోత్తముని గా తెలిసికొనుచున్నాడో అతడు అన్నీ తెలిసినవాడై అన్నివిధములుగా భగవంతుని ధ్యానించుచున్నాడు (15.19)
అట్టివాడు , అంటే పురుషోత్తముని గురించి అన్నివిధముల తెలిసికొనిన వాడు జ్ఞానవంతుడు కృతకృత్యుడు కాగలడు ( 15.20)
కృష్ణభగవానుడు అర్జునిని పాపరహితుడా అంటే పాపములు లేనివాడా అని సంబోధిస్తూ అతిరహస్యమైన ఈశాస్త్రము నీకు చెప్పాను అంటాడు. ఇది రహస్యమా ? ఎందుకు రహస్యము అనిపించవచ్చు. నాలుగవ అధ్యాయములో కర్మ యోగము పుట్టు పూర్వోత్తరాలు చెపుతూ -”స కాలేనేహ మహతా యోగో నష్ఠః పరంతప’ (4.02)- అంటే ’చాలా కాలము గడిచినందున ఈ యోగము ఈ లోకములో ( నష్ఠః) పోయినది’ అని చెపుతాడు. అంటే ఆ గీతోపదేశ కాలములో ఈ గీతలో చెప్పిన విషయాలు అన్నీ ఎవరికీ తెలియని రహస్యములు లాగా ఉండి పోయాయి అన్నమాట. ఈ రహస్యమైన ఈ పురుషోత్తముని గురించి తెలిసికొనినవాడు జ్ఞానము సంపాదించినవాడు కృత కృత్యుడు కాగలడు అని కృష్ణుని సందేసము.
భగవానుడు బోధించిన ఈ అధ్యాత్మశాస్త్రము ఆచరించినవాడు ధన్యుడగును.
పురుషోత్తమప్రాప్తియోగము సమాప్తము
|| ఓం తత్ సత్||
శ్రీభగవానువాచ:
ఇతి గుహ్యతమం శాస్త్ర మిదముక్తం మయాsనఘ|
ఏతద్భుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్కృతకృత్యశ్చ భారత||20||
|తా|| ఓ భరతా! ఈ ప్రకారముగా అతి రహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు చెప్పితిని.దీనిని చక్కగా తెలిసికొనినవాడు జ్ఞానవంతుడు కృతకృత్యుడును కాగలడు.
|| ఓం తత్ సత్||
|| om tat sat||