||భగవద్గీత ||

|| పదునాఱవ అధ్యాయము ||

||దైవాసుర సంపద్విభాగ యోగము- శ్లోకాలు - అర్థతాత్పర్యాలతో ||

|| om tat sat||


||ఓమ్ తత్ సత్||

శ్రీభగవానువాచ:
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః|
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్||1||

" భయము లేకుండుట, అంతః కరణ శుద్ధి, జ్ఞానయోగమునందు ఉండుట, దానము, ఇంద్రియనిగ్రహము, యజ్ఞము, అధ్యయనము చేయుట, తపస్సు , కపటము లేకుండుట ( మొదలగు నవి దైవసంబంధమగు ఐశ్వర్యములు)"

శ్రీమద్భగవద్గీత
దైవాసురసంపద్విభాగయోగము
షోడషోఽధ్యాయః
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఇది దైవాసుర సంపద్విభాగయోగము. అంటే దైవసంబంధమైన సంపత్తి అసుర సంబంధమైన సంపత్తి గురించి అన్నమాట. ఈ రెండు మాటలు ముందు అధ్యాయలలో వచ్చాయి .

ఫురుషోత్తమ ప్రాప్తి యోగములో అశ్వత్థవృక్షము గురించి చెపుతో రెండవ శ్లోకములో దాని కొమ్మలు "గుణప్రవృద్ధాః" అంటే గుణములచే వృద్ధి పొందింపబడినవి . ఆ కోమ్మలు "ఊర్ధ్వం చ" పైకి బ్రహ్మలోకమువైపు, "అథః చ" అంటే క్రిందకి అధోగతికి వ్యాపించి వున్నాయి. కొమ్మలు పైకి పోతాయా క్రిందకు పోతాయా అన్నది వారి వారి ప్రకృతిని అనుసరించి ఉంటుంది. సంసారము నుంచి పైకి తీసుకు వెళ్ళే ప్రకృతి, సంసారమునుంచి క్రిందకి లాగే ప్రకృతి గురించి కృష్ణుడు ఏడో అధ్యాయములో తొమ్మిదవ అధ్యాయములో చెప్పాడు.

ఏడో అధ్యాయములో "అసురం భావమాశ్రితాః" అంటూ అసుర ప్రకృతి కలవారు " మాం న ప్రపద్యన్తే" అంటూ నన్నుపొందరు అని చెపుతాడు. అదే మళ్ళీ తొమ్మిదవ అధ్యాయములో "మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతసః" అంటే " వ్యర్థమైన ఆశలు కలవారు , వ్యర్థమైన కర్మలు చేయువారు, వ్యర్థమైన జ్ఞానము కలవారు , బుద్ధిహీనులు " మొదలగు వారు అసురసంబంధమైన ప్రకృతిని ఆశ్రయించినవారగు చున్నారు అని చెపుతాడు.

మళ్ళీ తొమ్మిదవ అధ్యాయములో కృష్ణుడు "దైవీం ప్రకృతి మాశ్రితాః" అంటూ దైవ ప్రకృతి ఆశ్రయించినవారి గురించి చెపుతాడు.

దైవ ప్రకృతిని ఆశ్రయించినవారు - "భజన్తి అనన్య మనసో" అంటే "ఇంకొక ఆలోచనలేకుండానన్ను సేవిస్తున్నారు" అని అంటాడు. అంటే దైవ ప్రకృతి నాశ్రయించినవారు మోక్షమార్గములో ఉంటారు అన్నమాట.

మళ్ళీ పురుషోత్తమప్రాప్తి యోగములో -" నిర్మానమోహా జితసంగ దోషాః అధ్యాత్మ నిత్యా విని వృత్తకామాః" అంటూ ఇటువంటి మంచి ప్రకృతి కలవారు - "అవ్యయం పదం గచ్ఛన్తి" అంటే "నాశనము లేని స్థానమును పొందుచున్నారు" అంటాడు.

అంటే అసుర ప్రకృతితో అథోగతి, దైవ ప్రకృతితో మోక్షమార్గము పొందుతారు అనే మాట కృష్ణుడు చెప్పాడు.

ఈ ప్రకృతినే విడమరుస్తూ దైవ అసుర సంపత్తి గురించి విశదీకరించడము వలన ఈ అధ్యాయానికి దైవాసుర సంపద్విభాగయోగము అని పేరువచ్చినది.

కృష్ణుడు తన ఉపదేశముతోనే ఈ అధ్యాయము మొదలు పెడుతాడు. అందులో దైవ సంపత్తితో ఈ అధ్యాయము మొదలగుతుంది.

శ్రీభగవానువాచ:
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః|
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్||1||

స||అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితః దానం దమః చ యజ్ఞః చ స్వాధ్యాయః తపః ఆర్జవమ్ ( ఇత్యాది దైవీం సంపదం అభిజాతస్య భవన్తి)||1||

||శ్లోకార్థములు||

అభయం సత్త్వసంశుద్ధిః - భయము లేకుండుట అంతః కరణ శుద్ధి
జ్ఞానయోగ వ్యవస్థితః - జ్ఞానయోగమునందు ఉండుట
దానం దమః చ యజ్ఞః చ - దానము ఇంద్రియ నిగ్రహముయజ్ఞమును
స్వాధ్యాయః తపః ఆర్జవమ్ - అధ్యయమును తపస్సు ఋజుత్వము
( ఇవన్ని పుట్టినవానికి దైవసంబంధమగు సంపత్తిలో కలుగుచున్నవి)

||శ్లోక తాత్పర్యము||

"భయము లేకుండుట, అంతః కరణ శుద్ధి, జ్ఞానయోగమునందు ఉండుట, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞమును, అధ్యయమును, తపస్సు, ఋజుత్వము ( మున్నగునవి పుట్టినవానికి దైవసంబంధమగు సంపత్తిలో కలుగుచున్నవి)". ||1||

అభయం అంటే భయము లేకుండుట. అది ఒక సుగుణము. అభయము కలవాడు అంటే పరబ్రహ్మము యొక్క అభయము కలవాడు లేక పరబ్రహ్మము యొక్క రక్షణలో వున్నవాడు అని కూడా స్ఫురిస్తుంది. నిష్కామ కర్మను గురించి చెప్పినప్పుడు కూడా ఈ మాట వస్తుంది. "స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్"(2.40). నిష్కామ కర్మ కొంచెము చేసినా భయము నుంచి రక్షింపబడతాడు అని. అంటే భయము పోతుంది అని. ఇక్కడ ముఖ్యమైన మాట భయమే దుర్గుణములకు మూలకారణము. అభయము కలవాడు ముందుకు పోగలడు అని.

చిత్తము అత్యంత నిర్మలముగా యుండవలెను. జ్ఞానమందు ధృఢ స్థితిని సంపాదించవలెను. దానము అంటే అన్ని దానములు. దాంట్లోనే సంపత్ దానము , జలదానము అన్నదానము మొదలగునవి అన్నీ వస్తాయి.

స్వాధ్యాయః అన్నమాటలో అధ్యాత్మిక గ్రంధములను చదివి సారము మననము చేయుట అని. ఇది దైవ సంపత్తి.

||శ్లోకము 2 ||

అహింసా సత్యమక్రోధః త్యాగశ్శాన్తిరపైశునమ్|
దయా భూతేష్వలోలత్వం మార్దవమ్ హ్రీరచాపలమ్||2||

స|| అహింసా సత్యం అక్రోధః త్యాగం శాన్తిః అపైశునమ్ భూతేషు దయా (విషయైః) అలోలత్వం మార్దవమ్ హ్రీరచాపలమ్ ( ఇత్యాది దైవీం సంపదం అభిజాతస్య భవన్తి)||2||

||శ్లోకార్థములు||

అహింసా సత్యం అక్రోధః - అహింస, సత్యము, క్రోధములేకుండుట,
త్యాగం శాన్తిః అపైశునమ్ - త్యాగము శాంతి, కొండెములు చెప్పకుండుట
భూతేషు దయా (విషయైః) అలోలత్వం- భూతములపై దయ, విషయలోలత్వము లేకుండుట
మార్దవమ్ హ్రీరచాపలమ్ - మృదుస్వభావము, సిగ్గు, చంచలత్వము లేకుండుట
( ఇవన్ని పుట్టినవానికి దైవసంబంధమగు సంపత్తిలో కలుగుచున్నవి)

||శ్లోక తాత్పర్యము||

"అహింస, సత్యము, క్రోధములేకుండుట, త్యాగము శాంతి, కొండెములు చెప్పకుండుట, భూతములపై దయ, విషయలోలత్వము లేకుండుట, మృదుస్వభావము, సిగ్గు, చపలత్వము లేకుండుట
( ఇవన్ని పుట్టినవానికి దైవసంబంధమగు సంపత్తిలో కలుగుచున్నవి)".||2||

అహింస అంటే శరీరముతో మనస్సుతో వాక్కుతో ఏ ప్రాణికి హింస చేయకుండుట. సాధారణముగా అహింస అనగానే శారీరక హింస అన్నమాటే వినపడుతుంది. మనము మానసికముగా వాక్కుతో కలిగించె బాధలు కూడా హింసయే. ఇక్కడ అహింస అంటే అన్ని రకముల హింసగురించి.

ఇంకోమాట. ఇక్కడ హ్రీః అంటే సిగ్గు. సిగ్గు దైవసంబంధమైన సంపత్తి అని. అధ్యాత్మిక విషయాలలో సిగ్గు ఎలావస్తుంది ? చేయకూడని కార్యములు చేయడము, అంటే ధర్మవిరుద్ధమైన కార్యములు చేయడము సిగ్గు పడవలసిన విషయములు. అంటే సిగ్గు, మనుషుడిని అధర్మకార్యాలనుంచి ఆపుతుంది. మనము చేయవలసిన విషయములు చేయకపోయినచో అవి సిగ్గు పడవలసిన విషయములు. సిగ్గులేని వాడికి అన్నీ ఒకటే.

అచాపలము అంటే చపలత్వము లేకుండుట అని.

||శ్లోకము 3||

తేజః క్షమా ధృతిశ్శౌచం అద్రోహోనాతిమానితా|
భవన్తి సంపదం దైవీమభిజాతస్య భారత ||3||

స||తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహః నాతిమానితా ( ఇత్యాది సుగుణాః) దైవీం సంపదం అభిజాతస్య భవన్తి||3||

||శ్లోకార్థములు||

తేజః క్షమా ధృతిః శౌచం - తేజస్సు, ఓర్పు, ధైర్యము, శుచిత్వము
అద్రోహః నాతిమానితా - ద్రోహముచేయకుండుట, గర్వము లేకుండుట
అభిజాతస్య భవన్తి- పుట్టినవానికి కలుగుచున్నవి
దైవీం సంపదం - దైవసంబంధమైన సంపదలు ( పొందదగి).

||శ్లోక తాత్పర్యము||

"తేజస్సు, ఓర్పు, ధైర్యము, శుచిత్వము, ద్రోహముచేయకుండుట, గర్వము లేకుండుట (మొదలగు సుగుణములు)
దైవసంబంధమైన సంపదలు పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవి".||3||

"నాతిమానితా" అంటే తనపై తనకి గర్వము లేకుండుట. తనకి తనపై గర్వము లేకపోవడము దైవ సంబంధమైన సంపత్తి. రాక్షస స్వభావము కలవారు, తనంటివాడు లేడు తానే సర్వజ్ఞుడు అనే భావములో ఉంటారు. అట్టి భావములు అసుర భావనలు.

||శ్లోకము 4 ||

దమ్భో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్||4||

స|| హే పార్థ ! దమ్బః దర్పః అభిమానః చ క్రోధః పారుష్యం ఏవ చ అజ్ఞానం చ ( ఇత్యాది) అసురీం సమ్పదం అభిజాతస్య భవన్తి||4||

||శ్లోకార్థములు||

దమ్బః దర్పః అభిమానః - డంబము దర్పము అభిమానము
క్రోధః పారుష్యం ఏవ చ అజ్ఞానం - క్రోధము, పౌరుషత్వము, అలాగే అజ్ఞానము
( ఇత్యాది) అసురీం సమ్పదం - ఇత్యాది అసురీ సంపదలు పొందదగి
అభిజాతస్య భవన్తి - పుట్టినవానికి కలుగుచున్నవి

||శ్లోక తాత్పర్యము||

"డంబము దర్పము అభిమానము, క్రోధము, పౌరుషత్వము, అలాగే అజ్ఞానము ఇత్యాది అసురీ సంపదలు పొందదగి
పుట్టినవానికి కలుగుచున్నవి". ||4||

దంబము దర్పము అభిమానము అహంకారము పౌరుషము క్రోధము మున్నగు నవి అసురసంబంధమైన గుణములు. సుందరకాండలో రావణుడు సీతతో చెప్పిన మాటలలో కనపడే గుణములు ఇవే, డంబము దర్పము అభిమానము, క్రోధము, పౌరుషత్వము. ఆ అసుర సంపదతో పుట్టినవారికి ఆ గుణములు గర్వకారణములు కూడా. ఈ గుణములు కలవారికి శాంతి లభించదు.(16.4).

||శ్లోకము 5 ||

దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా|
మాశుచస్సంపదం దైవీ మభిజాతోఽసి పాణ్డవ ||5||

స|| దైవీ సంపత్ విమోక్షాయ అసురీ (సంపత్) నిబన్ధాయ మతా| హే పాణ్డవ! దైవీం సంపదమ్ అభిజాతః అసి | (తతః) మాశుచః||5||

||శ్లోకార్థములు||

దైవీ సంపత్ విమోక్షాయ- దైవ సంపత్తి మోక్షము కొఱకు
అసురీ (సంపత్) నిబన్ధాయ మతా- అసురీ సంపత్తి బంధముల కొఱకు చెప్పబడినవి
హే పాణ్డవ! దైవీం సంపదమ్ అభిజాతః అసి - ఓ పాండవా, దైవ సంపత్తి పొందదగి పుట్టినవాడవు
(తతః) మాశుచః- అందువలన దుఃఖము వలదు ||5||

||శ్లోక తాత్పర్యము||

"దైవ సంపత్తి మోక్షము కొఱకు, అసురీ సంపత్తి బంధముల కొఱకు చెప్పబడినవి.
ఓ పాండవ దైవ సంపత్తి పొందదగి పుట్టినవాడవు అందువలన దుఃఖము వలదు"

దైవసంబంధమైన సంపద "విమోక్షాయ" అంటే మోక్షముపొందుటకు , అసుర సంపద "నిబంధాయ" సంసారబంధనముకు హేతువులు అని చెప్పబడినది . దైవసంపదలు మనుష్యుని మనస్తాపములనుంది విడుదలచేయును. అసురీ సంపదలు సుఖదుఃఖ మనస్తాపములతో బందించును. ( 16.5)

ఇక్కడా భగవానుడు అర్జునిడికి "మాశుచః" అంటే దుఃఖము వలదు అంటూ తన ముఖ్యసందేశము చెపుతున్నాడు. గీత ప్రారంభము అర్జునుని దుఃఖము వలననే. రెండవ అధ్యాయములో, "ఆశోచ్యానన్వశోచస్త్వం"అంటే "శోకించతగని వాటి పై శోకిస్తున్నావు" అంటూ మొదలైన సంభాషణ చివరి దశలోకి వస్తోంది అని ఇక్కడ స్ఫురిస్తుంది.

||శ్లోకము 6 ||

ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ అసురఏవ చ |
దైవో విస్తరశః ప్రోక్త అసురం పార్థమే శృణు||6||

స|| హే పార్థ అస్మిన్ లోకే దైవః అశురః ఏవ చ ద్వౌ భూతసర్గౌ (స్తః) | (తస్మిన్) దైవః విస్తరశః ప్రోక్తః | (అతః) అసురమ్ మే శ్రుణు||

||శ్లోకార్థములు||

అస్మిన్ లోకే - ఈ లోకములో
దైవః అశురః ఏవ చ - దైవ సంబంధమైన అసుర సంభంధమైన
ద్వౌ భూతసర్గౌ (స్తః) - రెండు విధములగు ప్రాణుల సృష్టి కలదు
దైవః విస్తరశః ప్రోక్తః - దైవ సంపత్తి విస్తరముగా చెప్పబడెను
అసురమ్ మే శ్రుణు - అసురసంపత్తి గురించి వినుము||

||శ్లోక తాత్పర్యము||

"ఈ లోకములో దైవ సంబంధమైన, అసుర సంభంధమైన రెండు విధములగు ప్రాణుల సృష్టి కలదు.
దైవ సంపత్తి విస్తరముగా చెప్పబడెను. అసురసంపత్తి గురించి వినుము".||6||

ఇంతకు ముందు మూడు శ్లోకాలలో దైవ సంబంధమైన గుణములు చెప్పబడినవి.ఈ దైవ సంపత్తి మనను ముందుకు తీసుకుపోగల ప్రవృత్తి: ఆ ప్రవృత్తి ఒకసారి మననము చేద్దాము.

-భయములేకుండుట , అంత్ఃకరణశుద్ధి, జ్ఞానయోగమునందుండుట , దానము,బాహ్యేంద్రియనిగ్రహము, జ్ఞాన యజ్ఞము, శాస్త్రాధ్యయనము, తపస్సు, ఋజుత్వము అహిం, సత్యము, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి ,ఇతరులయందు దోషములను చూడకుండుట, భూత దయ, విషయ లోలత్వము లేకుండుట, మృదుత్వము, సిగ్గు, చపలత్వము లేకుండుట, ప్రతిభ, ఓర్పు, ధైర్యము, బాహ్యాంతరశుచిత్వము, ఎవనికిని ద్రోహము చేయకుండుట, స్వాతిశయము లేకుండుట

ఇవన్ని సద్గుణములు. సాధకుడు ఈ ఇరువది ఆరు సద్గుణములను అలవరచుకొవాలి.

ఇక ఆ అసుర స్వభావము గురించి పండ్రెండు శ్లోకాలలో వివరిస్తాడు కృష్ణుడు. రెండు విధములగు పాణుల సృష్ఠి గురించి బృహదారణ్యకో పనిషత్తులో ( శ్రుతులలో) చెప్పబడినది. "ద్వయా హ వై ప్రాజపత్యా దేవాశ్చాసురాశ్చ"( బృఉ 1.3.1) "ప్రజాపతి సంతానము ఇద్దరు దేవతలు అసురులు ఆని"

||శ్లోకము 7||

ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః|
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే||7||

స|| అసురాః జనాః ప్రవృత్తించ నివృత్తించ న విదుః| తేషు శౌచం న విద్యతే | ఆచారః చ పి న| సత్యం అపి న||7||

||శ్లోకార్థములు||
అసురాః జనాః - అసుర జనులు
ప్రవృత్తించ నివృత్తించ న విదుః - ప్రవృత్తి గురించి నివృత్తి గురించి ఎఱుగరు
తేషు శౌచం న విద్యతే - వారికి శుచిత్వముఉండదు
ఆచారః చ పి న- అచారములు కూడా వుండవు
సత్యం అపి న- సత్యముగాని ఉండదు.

||శ్లోక తాత్పర్యము||

"అసుర జనులు ప్రవృత్తి గురించి నివృత్తి గురించి ఎఱుగరు. వారికి శుచిత్వముఉండదు
అచారములు కూడా వుండవు. సత్యము కూడా ఉండదు".||7||

ప్రవృత్తి అంటే చేయతగినది. అదే ధర్మ ప్రవృత్తి. నివృత్తి అంటే విడిచిపెట్ట తగినది. అదే అధర్మము . అధర్మము విదిచిపెట్టతగినది. ధర్మకార్యములలో ప్రవరించాలి.అధర్మ కార్యక్రమములనుంచి వెనకి మఱలాలి. అది అసుర సంపద కలవారు చేయని విషయములు.

||శ్లోకము 8||

అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్|
అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్||8||

స|| తే జగత్ అసత్యం అప్రతిష్ఠం అనీశ్వరమ్ కామహైతుకం అపరస్పర సమ్భూతమ్ అన్యత్ కిం ఆహుః||8||

||శ్లోకార్థములు||

తే జగత్ అసత్యం- వారు జగత్తు అసత్యమని
అప్రతిష్ఠం అనీశ్వరమ్ - వ్యవస్థలు లేనిది, ఈశ్వరుడు లేనిది
కామహైతుకం- కామమే హేతువు గా కలది
అపరస్పర సమ్భూతమ్ అన్యత్ కిం ఆహుః-
పరస్పరసంబంబంధముల కన్న మరియొకటి ఏమికలదు అని చెప్పుదురు.

||శ్లోక తాత్పర్యము||

"వారు జగత్తు అసత్యమని, వ్యవస్థలు లేనిది, ఈశ్వరుడు లేనిది, కామమే హేతువు గా కలది అని,
పరస్పరసంబంబంధముల కన్న మరియొకటి ఏమికలదు అని చెప్పుదురు".||8||

వ్యవస్థలు అంటే ధర్మ అధర్మము అనే వ్యవస్థ లేదు అని. జగత్తు అసత్యము అనడంలో ఇది అద్వైతము కాదు. ఇక్కడ అర్థము వేదములు అసత్యము అని అర్థము. ముఖ్యమైన పురుషార్థము కామమే అంటే కోరికలు సాధించడమే ఒక గమ్యము అని. పరస్పర సంబంధములు అంటే స్త్రీపురుష సంబంధముల కన్న వేరొక విషయము లేదు అని. ఇవన్ని ఆసురీ భావనలు సంపత్తు.

ఆ కాలములోనే చార్వాక దర్శనము అని ఒక మతము ఉండేది. అది ద్వైతాద్వైత విశిష్ఠాద్వైత మత సిద్ధాంతములకు విరుద్ధము. ఆ దర్శనము ప్రకారము రాజే దేముడు. వేదములు ప్రమాణములు కావు. చని పోయినవానికి పుట్టుక వుండదు. కామమే ధ్యాస. జీవించునంతవరకు కావలసినది సుఖమే. స్త్రీపురుషసంబంధమే కావలసిన విషయము, అంతకు మించి ఇక ఏమీ లేదు అని. ఇది చాలామందికి మనస్సుకి అతుక్కుపోయే భావనలు. భగవద్గీతలో ను వేదములలో మనము వినేది అట్టి భావములు కలవారు అధములు అని.

||శ్లోకము 9||

ఏతాం దృష్టిమవష్ఠభ్య నష్ఠాత్మానోఽల్పబుద్ధయః |
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాజగతోఽహితాః||9||

స|| తే ఏతాం దృష్ఠిం అవష్టభ్య నష్టాత్మనః అల్పబుద్ధయః ఉగ్రకర్మాణః అహితాః జగతః క్షయాయ ప్రభవన్తి ||9||

||శ్లోకార్థములు||

ఏతాం దృష్ఠిం అవష్టభ్య - ఇట్టి దృష్ఠిని అవలంబించి
నష్టాత్మనః అల్పబుద్ధయః - చెడిన మనస్సు కలవారు, స్వల్పబుద్ధి కలవారు
ఉగ్రకర్మాణః అహితాః - కౄరకర్మలు చేయువారు, లోక హితము కోరని వారై
జగతః క్షయాయ ప్రభవన్తి - జగత్తు నాశనము కొఱకు పుట్టుచున్నారు.

||శ్లోక తాత్పర్యము||

"(వారు) ఇట్టి దృష్ఠిని అవలంబించి, చెడిన మనస్సు కలవారు, స్వల్పబుద్ధి కలవారు
కౄరకర్మలు చేయువారు, లోక హితము కోరని వారై జగత్తు నాశనము కొఱకు పుట్టుచున్నారు".||9||

ఇక్కడ చెప్పినవన్నీ కూడా అంటే చెడిన మనస్సు కలవారు, స్వల్పబుద్ధి కలవారు
కౄరకర్మలు చేయువారు, లోక హితము కోరని వారు, వీరందరూ అసుర స్వభావము కలవారు అని.

||శ్లోకము 10||

కామమాశ్రిత్య దుష్పూరం దమ్బమానమదాన్వితాః|
మోహాద్గృహీత్వాఽసద్గ్రాహన్ ప్రవర్తన్తేఽశుచివ్రతాః||10||

స|| దుష్పూరం కామం ఆశ్రిత్య దమ్భమానమదాన్వితాః మోహాత్ అసత్ గ్రాహాన్ గృహీత్వా అశుచివ్రతాః ప్రవర్తన్తే||

||శ్లోకార్థములు||

దుష్పూరం కామం ఆశ్రిత్య - తనివితీరని కామమును ఆశ్రయించి
దమ్భమానమదాన్వితాః - డంబము, అభిమానము,మదములతో కూడినవారై
మోహాత్ అవివేకము వలన
అసత్ గ్రాహాన్ గృహీత్వా - అనిశ్చయమైన విషయములను పట్టుకొని
అశుచివ్రతాః ప్రవర్తన్తే- అపవిత్ర వ్రతములతోప్రవర్తించుచున్నారు.

||శ్లోక తాత్పర్యము||

"వారు తనివితీరని కామమును ఆశ్రయించి, డంబము, అభిమానము, మదములతో కూడినవారై
అవివేకము వలన అనిశ్చయమైన విషయములను పట్టుకొని అపవిత్ర వ్రతములతోప్రవర్తించుచున్నారు".||10||

ఇక్కడ "దుష్పూరం" అన్నమాటతో కోరికల స్వరూపము వివరించబడినది. కోరికలు ఎప్పుడు పూర్తిగా అవవు. కోరికలమీదా ఆశ అలా పెరుగుతూనే వుంటుంది. అందుకే దానిని తనివితీరని కామము అని చెపుతారు. దీనికి కారణము అవివేకమే.

||శ్లోకము 11||

చిన్తామపరిమేయాం చ ప్రళయాన్తాముపాశ్రితాః|
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః||11||
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః|
ఈహన్తే కామభోగార్థ మన్యాయేనార్థసంచయాన్||12||

స|| చ అపరిమేయామ్ ప్రలయాన్తామ్ చిన్తామ్ ఉపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావత్ ఇతి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః కామ భోగార్థం అర్ధసంచయాన్ ఈహన్తే||

||శ్లోకార్ధములు||

అపరిమేయామ్ ప్రలయాన్తామ్ - అపరిమితమైన ప్రళయకాలము వఱకు విడవని
చిన్తామ్ ఉపాశ్రితాః - చింతనలను ఆశ్రయించినవారు
కామోపభోగపరమాః ఏతావత్ - కామములను అనుభవించుటయే చాలు
ఇతి నిశ్చితాః - అని నిశ్చయించుకొనిన వారు

||శ్లోక తాత్పర్యము||
"అపరిమితమైన ప్రళయకాలము వఱకు విడవని చింతనలను ఆశ్రయించినవారు, కామములను అనుభవించుటయే చాలు అని నిశ్చయించుకొనిన వారు;"||11||

ఇవన్ని అసుర స్వభావము కలవారి గుణములు.

||శ్లోకము 12||

ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః|
ఈహన్తే కామభోగార్థ మన్యాయేనార్థసంచయాన్||12||

స|| ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః కామ భోగార్థం అన్యాయేన అర్ధసంచయాన్ ఈహన్తే||

||శ్లోకార్ధములు||

ఆశాపాశశతైర్బద్ధాః- ఆశాపాశములతో కట్టబడిన వారు
కామక్రోధపరాయణాః- కామక్రోధములతో నిండిన వారు
కామ భోగార్థం - కామములను అనుభవించుట కొఱకు
అన్యాయేన అర్ధసంచయాన్ - అన్యాయముగా ధనసమూహములను
ఈహన్తే- కోరుచున్నారు.

||శ్లోకతాత్పర్యము||

"ఆశాపాశములతో కట్టబడిన వారు, కామక్రోధములతో నిండిన వారు, కామములను అనుభవించుట కొఱకు
అన్యాయముగా ధనసమూహములను కోరుచున్నారు".||12||

అసుర స్వభావము కలవారి ఆలోచనలగురించి వింటాము 13,14,15 శ్లోకములలో.

|శ్లోకము 13||

ఇదమద్య మయాలబ్ధమిమం ప్రాప్స్యేమనోరథమ్|
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్||13||

స||ఇదం అద్య మయా లబ్ధం | ఇదం మనోరథం ప్రాప్స్యే| ఇదం ధనం అస్తి| ఇమం ధనం అపి పునః భవిష్యతి||13||

||శ్లోకార్ధములు||
ఇదం అద్య మయా లబ్ధం - ఇది నాచేత పొందబడినది
ఇదం మనోరథం ప్రాప్స్యే- ఈ మనోరథము పొందగలను
ఇదం ధనం అస్తి- ఈ ధనము వుంది
ఇమం ధనం అపి పునః భవిష్యతి- ఈ ధనము మరల మరల కలుగగలదు

||శ్లోక తాత్పర్యము||

"ఈ కోరిక నాచేత పొందబడినది. ఈ మనోరథము పొందితిని ఈ ధనము వుంది.ఈ ధనము మరల మరల కలుగగలదు".||12||
ఇవి గర్వము తో చెప్పబడే మాటలు.

||శ్లోకము 14||

అసౌ మయాహతశ్శత్రుః హనిష్యే చాపరానపి|
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్సుఖీ||14||

స|| అసౌ శత్రుః మయా హతః| అపరాన్ అపి చ హనిష్యే | అహం ఈశ్వరః | అహం భోగీ | అహం సిద్ధః| (అహం) బలవాన్ సుఖీ (చ)|| 14||

||శ్లోకార్ధములు||
అసౌ శత్రుః మయా హతః- ఈ శత్రువు నాచేత చంపబడెను
అపరాన్ అపి చ హనిష్యే - ఇతరులను కూడా చంపెదను
అహం ఈశ్వరః - నేను ఈశ్వరుడను
అహం భోగీ నేను - నేనే భోగములను అనుభవించువాడును
అహం సిద్ధః- నేను సిద్ధుడను
బలవాన్ సుఖీ (చ)- బలవంతుడను సుఖ్హవంతుడను.

||శ్లోక తాత్పర్యము||

"ఈ శత్రువు నాచేత చంపబడెను ఇతరులను కూడా చంపెదను. నేను ఈశ్వరుడను. నేనే భోగములను అనుభవించువాడును నేను సిద్ధుడను, బలవంతుడను సుఖ్హవంతుడను"

ఇవి కూడా మదాంధుల చేత గర్వము తో చెప్పబడే మాటలు

||శ్లోకము 15||

ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా|
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః||15||

స|| (అహం) ఆఢ్యః అభిజనవాన్ అస్మి| మయా సదృశః అన్యః కః అస్తి| (అహం) యక్ష్యే | (అహం) దాస్యామి|(అహం) మోదిష్యే| ఇతి అజ్ఞానమోహితాః సన్తః|| 15||

||శ్లోకార్ధములు||

(అహం) ఆఢ్యః అభిజనవాన్ అస్మి- నేను ధనవంతుడను, గొప్ప వంశమున జన్మించినవాడను
మయా సదృశః అన్యః కః అస్తి- నాతో సమానమైన వాడు మరిఒకడు ఎక్కడ?
(అహం) యక్ష్యే - యాగము చేసెదను
(అహం) దాస్యామి- దానములను ఇచ్చెదను
(అహం) మోదిష్యే- అనందించెదను
ఇతి అజ్ఞానమోహితాః సన్తః- ఈ విధముగా అజ్ఞానులు అనుకుంటారు.

||శ్లోక తాత్పర్యము||

"నేను ధనవంతుడను, గొప్ప వంశమున జన్మించినవాడను. నాతో సమానమైన వాడు మరిఒకడు ఎక్కడ?
నేను యాగము చేసెదను. నేను దానములను ఇచ్చెదను. నేను అనందించెదను
ఈ విధముగా అజ్ఞానులు అనుకుంటారు".||15||

||శ్లోకము 16||
అనేకచిత్తవిభ్రాన్తా మోహజాల సమావృతాః|
ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేఽశుచౌ||16||

స|| (తథా) అనేక చిత్తవిభ్రాన్తాః మోహజాల సమావృతాః కామభోగేషు ప్రసక్తాః అశుచౌ నరకే పతన్తి||16||

||శ్లోకార్ధములు||

అనేక చిత్తవిభ్రాన్తాః - అనేక విధములైన చిత్త చాంపల్యము కలవారు
మోహజాల సమావృతాః - మోహజాలములో పడినవారు
కామభోగేషు ప్రసక్తాః - కామములను అనుభవించుటలో ఆసక్తి కలవారు
అశుచౌ నరకే పతన్తి- అపవిత్రమైన నరకమందు పడుచున్నారు.

||శ్లోక తాత్పర్యము||

"(ఈ విధముగా) అనేక విధములైన చిత్త చాంపల్యము కలవారు, మోహజాలములో పడినవారు
కామములను అనుభవించుటలో ఆసక్తి కలవారు, అపవిత్రమైన నరకమందు పడుచున్నారు".||16||

అంటే ప్రపంచములో మనుష్యులు ఎంత ధనము, ఎంత కీర్తి (ధనము సంపాదించిన కీర్తి),ఎంత ఐశ్వర్యము కలిగి ఉన్నప్పటికి అహంకారము గర్వము తొలగనిచో చిత్తశుద్ధి లేక పతనమే పొందుదురు అని భావము.

||శ్లోకము 17||

ఆత్మసమ్భావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః|
యజన్తే నామయజ్ఞైస్తే దమ్భేనాఽవిధిపూర్వకమ్||17||

స|| ఆత్మ సంభావితాః స్తబ్ధాః ధనమాన మదాన్వితాః తే దమ్భేన అవిధి పూర్వకం నామ యజ్ఞైః యజన్తే||17||

||శ్లోకార్ధములు||

ఆత్మ సంభావితాః - తమను తాము గొప్పగా అనుకునే వారు
స్తబ్ధాః ధనమాన మదాన్వితాః - మొండివారు, ధనము కలదని అభిమానము మదము కలవారు
తే దమ్భేన - వారు గర్వముతో
అవిధి పూర్వకం నామ యజ్ఞైః యజన్తే-
శాస్త్రవిరుద్ధముగా నామ మాత్రపు యజ్ఞములచే యాగము చేయుచున్నారు.

||శ్లోక తాత్పర్యము||

"తమను తాము గొప్పగా అనుకునే వారు, మొండివారు, ధనము కలదని అభిమానము మదము కలవారు
వారు గర్వముతో, శాస్త్రవిరుద్ధముగా నామ మాత్రపు యజ్ఞములచే యాగము చేయుచున్నారు".||17||

ఇప్పటి దాకా చెప్పినమాటలు ఒకసారి మననము చేద్దాము.

ఆసురీ సంపద కలవారు గర్వముతో ఈ విధముగా అనుకుంటారు;

"ఇదం అద్య మయా లబ్ధం"- ఈ కొరిక ఇపుడు పొందితిని !.
"ఇదం ప్రాప్స్యే మనోరథమ్" - ఈ మనోరథము ను పొందగలను !
"ఇదం( ధనం) అస్తి" - ఈ ధనము కలదు.
"ఇదం( ధనం) అపి మే పునః భవిష్యతి" - ఈ ధనము కూడా భవిష్యత్తులో నాకు మళ్ళీ దొరకకలదు !
"అసౌ శతృః మయా హతం"- ఈ శత్రువు నాచే చంపబడెను.
"అపరాన్ అపి హనిష్యే చ"- ఇతర శత్రువులు కూడా నాచే చంపబడగలరు.
"అహం ఈశ్వరః"- నేను ఈశ్వరుడను,
"అహం భోగీ" - నేను భోగీ
"అహం సిద్ధః" నేను అనుకున్నపనిని చేయగలవాడను

ఇది నిజముగా మదాంధకారములో ఉన్న మనుష్యుడు అనుకునే మాటలే. "నేను ప్రభువుని. నేను బలవంతుడను సుఖవంతుడను గొప్పకులమునందు జన్మించినవాడను. నాతో సమానుడు ఎవరు". ఇవన్నీ గర్వముతో పలుకు మాటలు. (16.15). తామే గొప్పవారని భావించుకొని శాస్త్రప్రకారము కాకుండా తమకు తోచినట్లు పూజలూ యజ్ఞాలు చేస్తారు.(16.17)

అట్టివారు తమకు తామే గొప్ప పండితులుగ తలచుకొనుచు ఇతరులను ద్వేషించు చుంటారు. తమ దేహమందును ఇతరుల దేహమందును ఉన్న భగవంతుని తెలిసి కొనలేక, పరులను దూషించు చుంటారు.. పరులను దూషించుట అనగా సాక్షాత్తు భగవంతుని దూషించినవాడే యగును. (16.18)

||శ్లోకము 18||

అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః|
మామాత్మాపరదేహేషు ప్రద్విషన్తోఽభ్యసూయకాః||18||

స|| (తే) అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః ఆత్మదేహేషు పరదేహేషు చ ( స్థితం ) మాం ప్రద్విషన్తః అభ్యసూయకాః ||18||

||శ్లోకార్ధములు||
అహంకారం బలం దర్పం - అహంకారము, బలము,గర్వమును
కామం క్రోధం చ సంశ్రితాః - కామము క్రోధము కూడా బాగుగా ఆశ్రయించినవారు
ఆత్మదేహేషు పరదేహేషు చ ( స్థితం ) మాం - తమ దేహములోను, పరుల దేహములోను వున్న నన్ను
ప్రద్విషన్తః- మిగుల ద్వేషించు వారు
అభ్యసూయకాః - ఆసూయాపరులు

||శ్లోక తాత్పర్యము||
"అహంకారము, బలము,గర్వమును, కామము క్రోధము కూడా బాగుగా ఆశ్రయించినవారు,
తమ దేహములోను, పరుల దేహములోను వున్న నన్ను మిగుల ద్వేషించు వారు . వారు ఆసూయాపరులు".||18||

||శ్లోకము 19||

తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్|
క్షిపామ్యజస్ర మశుభాన్ ఆసురీష్వేవ యోనిషు||19||

స|| ద్విషతః క్రూరాన్ అశుభాన్ తాన్ నరాధమాన్ అహమ్ సంసారేషు అసూరీషు యోనిషు ఏవ అజస్రం క్షిపామి|| 19||

||శ్లోకార్ధములు||
ద్విషతః- ( నన్ను) ద్వేషించువారు
క్రూరాన్ అశుభాన్ తాన్ నరాధమాన్ - కౄరులు పాపకార్యములు చేయువారగు ఆ నరాధములను
అహమ్ సంసారేషు అసూరీషు యోనిషు ఏవ -
నేను సంసారములలో అసురజన్మలలోకి
అజస్రం క్షిపామి- ఎల్లప్పుడు త్రోసివెసెదను.

||శ్లోక తాత్పర్యము||

"నేను, ద్వేషించువారు కౄరులు పాపకార్యములు చేయువారగు ఆ నరాధములను,
ఎల్లప్పుడు సంసారములలో అసురజన్మలలోకి త్రోసివెసెదను."||19||

||శ్లోకము 20||

ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని|
మామప్రాప్యైవ కౌన్తేయ తతోయాన్త్యధమాం గతిమ్||20||

స|| హే కౌన్తేయ ! అసురీమ్ యోనిమ్ ఆపన్నాః మూఢాః జన్మని జన్మని మామ్ అప్రాప్య ఏవ తతః అధమామ్ గతిం యాన్తి ||20||

||శ్లోకార్ధములు||

అసురీమ్ యోనిమ్ ఆపన్నాః - అసుర సంబంధమైన జన్మమును పొందినవారగు
మూఢాః జన్మని జన్మని మామ్ - మూఢులు జన్మజన్మకి నన్ను పొందక
తతః అధమామ్ గతిం యాన్తి - ఇంకా అధమమైన గతిని పొందుచున్నారు

||శ్లోక తాత్పర్యము||

"ఓ కౌన్తేయా, అసుర సంబంధమైన జన్మమును పొందినవారగు మూఢులు, జన్మజన్మకి నన్ను పొందక,
ఇంకా అధమమైన గతిని పొందుచున్నారు".||20||

||శ్లోకము 21||

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః|
కామః క్రోధస్తథా లోభః తస్మా దేతత్రయం త్యజేత్||21||

స|| కామః క్రోధః తథా లోభః ఇదం త్రివిధం నరకస్య ద్వారం (సన్తి) | (తే) ఆత్మనః నాశనం (కురుథ)| తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్ ||

||శ్లోకార్ధములు||

కామః క్రోధః తథా లోభః - కామము క్రోధము అలాగే లోభము
ఇదం త్రివిధం నరకస్య ద్వారం - ఇది మూడు విధములగు నరకముయొక్క ద్వారములు
ఆత్మనః నాశనం - జీవునకు నాశనము కలిగించునవి
తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్ - అందువలన ఈ మూడు త్యజింపవలెను

||శ్లోకతాత్పర్యము||

"కామము క్రోధము అలాగే లోభము ఇవి మూడు విధములగు నరకముయొక్క ద్వారములు.
ఇవి జీవునకు నాశనము కలిగించునవి. అందువలన ఈ మూడు త్యజింపవలెను".||21||

శంకారాచారులవారు తమ భాష్యములో మానవుడు ఈ మూడు ద్వారాలలో ప్రవేశించగనే ఆత్మ నశిస్తుంది అంటారు. అందుకని ఈ మూడు త్యజింపదగినవి.

||శ్లోకము 22||

ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారైస్త్రిభిర్నరః|
అచరత్యాత్మనః శ్రేయః తతో యాన్తిపరాం గతిమ్||22||

స|| హే కౌన్తేయ ! ఏతైః త్రిభిః తమోద్వారైః విముక్తః నరః అత్మనః శ్రేయః ఆచరతి | తతః పరాం గతిం యాతి ||22||

||శ్లోకార్ధములు||

ఏతైః త్రిభిః తమోద్వారైః - ఈ మూడు నరక ద్వారములనుంచి
విముక్తః నరః - విముక్తుడైన నరుడు
అత్మనః శ్రేయః ఆచరతి - తనకు మేలు కావించుకొనుచున్నాడు.
తతః పరాం గతిం యాతి - అందువలన పరమ గతి ( మోక్షము) పొందుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"ఈ మూడు నరక ద్వారములనుంచి విముక్తుడైన నరుడు తనకు మేలు కావించుకొనుచున్నాడు.
అందువలన పరమ గతి ( మోక్షము) పొందుచున్నాడు".||22||

ఈ మూడు అంటే కామ క్రోధ లోభము లను త్యజించినవాడు తనకు తానే మేలు చేసుకొనుచున్నాడు అని.

||శ్లోకము 23||

యశ్శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః|
న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్||23||

స|| యః శాస్త్రవిథిమ్ ఉత్శృజ్య కామకారతః వర్తతే సః సిద్ధిం న అవాప్నోతి| పరాం గతిం (చ) న ( ఆప్నోతి)||23||

||శ్లోకార్ధములు||

యః శాస్త్రవిథిమ్ ఉత్శృజ్య - ఎవరు శాస్త్రోక్తమగు విధి ని విడిచిపెట్టి
కామకారతః వర్తతే - తన కోరికలకొఱకే ప్రవర్తించుచున్నాడో
సః సిద్ధిం న అవాప్నోతి- వాడు సిద్ధిని పొందడు

||శ్లోకతాత్పర్యము||

"ఎవరు శాస్త్రోక్తమగు విధి ని విడిచిపెట్టి తన కోరికల కొఱకే ప్రవర్తించుచున్నాడో,
అట్టి వాడు సిద్ధిని పొందడు".||23||

||శ్లోకము 24||

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ|
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి||24||

స|| తస్మాత్ తే కార్యాకార్యవ్యవస్థితౌ శాస్త్రం ప్రమాణం | శాస్త్రవిధానోక్తం జ్ఞాత్వా ఇహ కర్మ కర్తుం (త్వం) అర్హసి||24||

||శ్లోకార్ధములు||
తస్మాత్ తే కార్యాకార్యవ్యవస్థితౌ - అందువలన నువ్వుచేయతగినది చేయతగనిది నిర్ణయించినప్పుడు
శాస్త్రం ప్రమాణం - శాస్త్రమే ప్రమాణముగా తీసుకొనుము.
శాస్త్రవిధానోక్తం జ్ఞాత్వా - శాస్త్రములో చెప్పిన విధానము తెలిసికొని
ఇహ కర్మ కర్తుం (త్వం) అర్హసి - ఈ లోకములో కర్మ చేయుటకు తగినవాడవు.||24||

||శ్లోకతాత్పర్యము||

"అందువలన నువ్వుచేయతగినది చేయతగనిది నిర్ణయించినప్పుడు, శాస్త్రమే ప్రమాణముగా తీసుకొనుము.
శాస్త్రములో చెప్పిన విధానము తెలిసికొనిన ఈ లోకములో కర్మ చేయుటకు తగినవాడవు".||24||

"కర్మ కర్తుం అర్హసి" అంటే కర్మ చేయుటకు అర్హుడవు అంటూ , కర్మ చేయడానికి శాస్త్ర జ్ఞానము అవసరము అని, శాస్త్రాదులద్వారాకర్మ చేయు పద్ధతిని తెలిసికొని పిమ్మట కర్మ చేయుట ఉత్తమము అని కృష్ణుడు చెపుతున్నాడు.

ఇక్కడ దైవ అసుర గణములు గుణములను వారి వారి సంపత్తుగా వర్ణించి, అసుర గుణములను అయిన కామ క్రోధ లోభ గుణములౌ త్యజించ వలెను , అని అలా త్యజించడము వలన మనుజుడికి తను కోరుకునే శ్రేయస్సు లభిస్తుంది అని కృష్ణుడు చెపుతాడు.

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ
షోడశోఽధ్యాయః
||ఓం తత్ సత్||


|| om tat sat||