||భగవద్గీత ||
|| పదునేడవ అధ్యాయము ||
||
శ్రద్ధాత్రయ విభాగ యోగము-వచన వ్యాఖ్యానము
||
|| om tat sat||
||ఓమ్ తత్ సత్||
అర్జున ఉవాచ
యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాsన్వితాః|
తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్త్వమాహోరజస్తమః||
"ఓ కృష్ణా! మరి శాస్త్ర విధిని వదలి శ్రద్ధతో పూజించేవారి నిష్ఠ ఎటువంటిది ? సత్త్వమా, రజస్సా, తమస్సా?"
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీమద్భగవద్గీత
సప్తదశోధ్యాయః
శ్రద్ధాత్రయవిభాగయోగః
శ్రీ భగవానుడు పదహారవ అధ్యాయములోఆఖరిలో చెప్పిన మాట -’ శాస్త్రములో చెప్పిన ఆదేశములకు భిన్నముగ ప్రవర్తించరాదని శాస్త్రము ఉల్లంఘించి విచ్చల విడిగా ప్రవర్తించినచో మోక్షసిద్ధి లభించదు’ అని. దాని వలన అర్జునుడికి మళ్ళీ సందేహము వస్తుంది.
అర్జునుడి సందేహము శాస్త్రవిధిని వదిలేసి శ్రద్ధతోకూడిన వారై, పూజయజ్ఞాదులు ఆచరించినచో వారి నిష్ఠ సాత్వికమా, రాజసమా లేక తామసమా అని .
కృష్ణుడు ఎవరైతే ’ శాస్త్ర విధి ముత్సృజ్య’ అంటే శాస్త్రవిధిని వదిలేసి , ’వర్తతే కామకారతః’ తమ కామమును అనుసరించి ప్రవర్తిస్తారో - వాఇకి సుఖములేదు మోక్షమూ లేదు అని దైవాసుర సంపద్విభాగయోగములో చెప్పాడు( 16.23). అయితే ఇక్కడ అర్జుని ప్రశ్న ’కామకారతు’ల గురించికాదు. అర్జునిని ప్రశ్న శ్రద్ధతో పూజ చేసేవారిగురించి.
ఇక్కడ శ్రద్ధ అన్నది ముఖ్యము.
ఆ శ్రద్ధ గురించి కృష్ణుడు ముందు చెపుతాడు.
ప్రాణులకి శ్రద్ధ స్వభావముచే పూర్వజన్మసంస్కారముచే మూడు విధములుగా వుంటుంది. అది సాత్త్విక శ్రద్ధ , రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. వారి శ్రద్ధ వారి అంతః కరణాన్ని అనుసరించి వుంటుంది.(17.3)
సత్వగుణము కలవారు దేవతలను రజోగుణము కలవారు యక్షులను రాక్షసులను, తమోగుణముకలవారు భూతప్రేతగణములనూ పూజించుచున్నారు.(17.4) అంతేకాదు కొందరు కామరాగ బలాన్వితులై దంభంతోనూ అహంకారముతోనూ ప్రాణులకు తమకు బాధకలిగించే శాస్త్ర విహితమైన ఘోరతపస్సు చేసేవారు కూడా అసుర నిశ్చయము కలవారు.
ఎవరెవరు ఎట్టి స్వభావముకలవారో వారి ఆహారము వారి పనితీరు వారిమాట వారు చదువు గ్రంధములు పూజించు దేవతలు వారి స్వభావము నకు అనుగుణముగా నుండును.
ఆహారము కూడ మూడు విధములుగ విభజింపబడి యున్నది.
శ్రీభగవానువాచ
ఆయుఃసత్వబలమారోగ్యసుఖప్రీతివివర్ధనాః
రస్యాఃస్నిగ్ధాఃస్థిరా హృద్యాః ఆహారాః సాత్వికప్రియాః||8||
ఆయుస్సు మనోబలము దేహబలము ఆరోగ్యము సౌఖ్యము వృద్ధిపొందించునవీ, పాలు చక్కెర మొదలగు రసపదార్ధములు వెన్ననెయ్యి మొదలగు స్నిగ్ధపదార్ధములు ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్ధములు సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్ధములు సాత్వికులకు ఇష్టమైనవి.
చాలాచేదు, చాలా పులుపు, చాలా ఉప్పు , చాలావేడి , ఘాటు మంటగా వుండే కారము ఆహారములు రాజసికమైనవి అంటే రాజసికులకు ఇష్టము. అవి బాధ కష్టము రోగము కలిగిస్తాయి.(17.09)
మిక్కిలివేడి అయినది శరీరమునకు దుఃఖము వ్యాకులత్వము కలిగించు ఆహారము రజోగుణముకలవారికి ఇష్టమై యుండును. రాజస ఆహారము తినిన వెంటనే అమృతముగ నుండును. కాని కాసేపటికి దుఃఖము కలిగించును.
వండిన తరువాత జాము దాటినది, వండిన తరువాత రాత్రి గడచినది, పాచిపోయినది ఎంగిలి చేసినది, రుచిలేనిది, అశుద్ధముగనున్న ఆహారము తమోగుణముకలవారికి ఇష్టమైయుండును.(17.10)
పూజ ఏటువంటి శ్రద్ధ తో చేశామో దానిని బట్టి మూడు రకాల పూజలు సాత్విక శ్రద్ధ తో చేసిన పూజ రాజసికశ్రద్ధతో చేసిన పూజ తామసికశ్రద్ధ తో చేసిన పూజ అని విన్నాము. అదేవిధముగా ఎటువంటి శ్రద్ధతో చేశామో దానిని బట్టి యజ్ఞము , తపస్సు దానము కూడా విభజింప బడ్డాయి.
ఇక్కడ యజ్ఞములగురించి శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు:
శాస్త్రోక్తమైనది ఫలాపేక్షరహితమైనది, ఇది చేయతగినది అని మనస్సు సమాధానపరచుకొని చేయబడినది సాత్విక యజ్ఞమనబడును. (17.11)
ఫలాభిలాషతో దంబముకొరకు కావింపబడు యజ్ఞము రాజస యజ్ఞమనబడును. (17.12)
శాస్త్రోక్తముకానిది, అన్నదానము లేనిది, మంత్రలోపము కలది, దక్షిణలులేనిది శ్రద్ధతో చేయబడనిది తామస యజ్ఞమనబడును. (17.13)
తన సొత్తులో కొంతభాగము ఋత్విక్కులకు బీదలకు దరిద్రనారాయణులకు దక్షిణగా ఒసంగవలెను. అది త్యాగమునకు చిహ్నము.
అలాగే కృష్ణ భగవానుడు తపస్సుని మూడురకాలుగా విభజించి శారీరక మానసిక వాచక తపస్సులని , వాటి గురించి చెప్పుచున్నాడు:
దేవతలు గురువులు బ్రహ్మనిష్టులు ప్రాజ్ఞులగు మహనీయులను పూజించుట, బాహ్యాంతర శుచిత్వము తన శరీరము మనస్సుతానుండుచోటు, పరిసరములను శుద్ధముగ నుంచుకొనుట , బ్రహ్మ చర్యము , అహింస మొదలగు వానిని శారీరక తపస్సుఅనబడును.(17.14)
స్నాన అహారుదల ద్వారా శరీరమును, దైవసంకల్పము ద్వారా మనస్సును శుచివంతముగానుంచుకొనవలెను. కుట్ర, కపటత్వము లేకుండాయుండవలెను. తలంపులందు, వాక్కు నందు క్రియయందు, ఒకే ప్రవర్తన కలిగియుండవలెను.
బ్రహ్మచర్యముచే విషయదోషము కామవ్యవహారములేకుండుట , ఏప్రాణికి అపకారము చేయకుండుటఅనగా అహింస సాత్విక తపస్సుఅనబడును.
ఇక వాచకతపస్సు:
శ్రీభగవానువాచ
అనుద్వేగకరంవాక్యం సత్యంప్రియహితంచ యత్|
స్వాధ్యాయభ్యసనంచైవ వాగ్మయం తప ఉచ్యతే||15||
ఇతరులమనస్సును బాధ కలిగించనిదియు, సత్యమైనదియు ప్రియమైనదియు వాక్యమును పలుకుట, ఉపనిషత్తులు భగవద్గీత భారత భాగవతాదుల అధ్యయనము చేయుట ప్రణవమంత్రము జపించుట వాచక తపస్సుఅనబడును.
మనస్సును నిర్మలముగ నుంచుకొనుట ముఖము ప్రసన్నముగ నుంచుకొనుట, ఆత్మనుగురించి మననము చేయుచు మౌనముగ నుండుట మానసిక తపస్సు అనబడును. (17.16)
ఈ మూడువిధములైన శారీరక, వాచక, మానసిక తపస్సు అత్యంత శ్రద్ధతో ఫలాభిరహితముగ చేసినప్పుడు అది సాత్త్విక తపస్సు అనబడును. (17.17)
దంబముతో సత్కారము అందుకునేందుకు , అందరిచే పూజింపబడుటకు చేయబడున తపస్సును రాజసిక తపస్సు అనబడును.(17.18)
మూర్ఖపు పట్టుదలతో శరీరమును శుష్కోపవసాదులచే బాధించి ఇతరుల నాశము చేయవలెనని ఉద్దేశ్యముతో చేయబడు తపస్సు తామసిక తపస్సు అనబడును.(17.19)
అలాగే దానములు కూడా చేసే శ్రద్ధ బట్టి మూడు విధములుగా విభజించి కృష్ణ భగవానుడు విడదీకరిస్తాడు:
శ్రీభగవానువాచ
దాతవ్యమితి యద్దానం దీ యతేనుపకారిణే|
దేశకాలేచ పాత్రేచ తద్దానంసాత్వికంస్మృతమ్||20||
దానముచేయవలెనని నిశ్చయించుకొని ప్రత్యుపకారము చేయలేనివారికి దీనులకు అసహాయులకు దేశకాలపాత్రలను జూసి దానము చేయుట సాత్వికదానము అనబడును.
దేశే అనగా పవిత్ర ప్రదేశములందు పుణ్యక్షేత్రములందు తీర్ధాదులందు అశ్రమములందు దానముచేయవలెను.
కాలే అనగా గ్రహణసమయమందు సంక్రాంతి ఎదైనా పుణ్యకార్య సందర్భమున యోగ్యతకలవారికి బీదలకు వికలాంగులకు దరిద్రనారాయణులకు దానము ఇవ్వవలెను. ఇది సాత్విక దానమనబడును.
ప్రత్యుపకారముకొరకుగాని ఫలము ఆశించిగాని మనస్సులో బాధపడుతూ ఇచ్చు దానము రాజసికమనబడును్(17.21)
దేశకాలపాత్రలను చూడకుండా సత్కారభావముతో చేయబడనిదీ, తిరస్కారభావముతో చేయునది అంటే అవమానం చేస్తూ చేయబడినది దానిని తామస దానము అంటారు.(17.22)
యజ్ఞదానతపాదులు మూడువిధములుగా విభజించి సాత్త్విక విధానమే అనుసరించవలసిన విధానము అని గ్రహించవలసిన విషయము. ఇవి ఫలా పేక్షలేకుండా బ్రహ్మమునకు సమర్పించి చేయాలి అన్నది అంతర్గత భావము . బ్రహ్మమునకు ఎలా అర్పించాలి,తపోదాన యజ్ఞాలు ఎలా ఆచరించాలి అనే విషయము చెప్పడానికి కృష్ణభగవానుడు "ఓమ్ తత్ సత్" అన్న మాటకి భావము చెపుతాడు.
పరబ్రహ్మ వాస్తవముగా నామరూపరహితమైనది.
భక్తులు ధ్యానించి చింతించుట కొరకు ఆ పరబ్రహ్మమునకు నామము నిర్దేశింపబడినది. అవి " ఓం తత్ సత్" అనే మంత్రములను చింతించుచూ పరబ్రహ్మమును ధ్యానముచేస్తారు. ఇవి మూడు మాటలు మహత్తర శక్తి పవిత్రత కలిగియున్నాయి. అదే భగవానుని సందేశము.
శ్రీభగవానువాచ
ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధస్మృతః|
బ్రాహ్మణా స్తేన వేదాశ్చయజ్ఞాశ్చ విహితాపురా||
పరబ్రహ్మమునకు ఓం అని తత్ అని సత్ అని మూడుపేర్లు చెప్పబడినవి వాని ఉచ్చారణచేతనే బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు నిర్మించబడినవి.
పరమాత్మనామము ఓంకారము చాలామహిమకలది దాని ఉచ్చారణతోనే బ్రహ్మవాదులు శాస్త్రోక్తమైన యజ్ఞ దాన తపో క్రియలు ఆరంభిస్తారు ( 17.24). అంటే ఆరంభములో ఓంకారము. ఈ ఓంకారముతో కర్మానుష్టానమందు ఏమైనా దోషాలు లోపాలు విఘ్నాలు ఉన్నా ఆ సమస్తము నాశనమైపోతాయి. ప్రతి మంత్రము ఆదిలో కూడా ఓం చేర్చబడినది.
మోక్షకాంక్ష కలవారు ఫలమును కోరక ’తత్’ అని పలికి యజ్ఞ దాన తపో క్రియలు ఆచరిస్తారు. తత్ అన్న శబ్దము ఆచరణలో ముఖ్యము.(17.25)
ఆచరణానంతరము కలగనిది కలిగినపుడు , అసాధువు సాధువు అయినపుడు శుభకార్యములపుడు ’సత్’ అన్న శబ్దము ఉపయోగించబడుతుంది (17.26) ఈశ్వరునికోసము చేసే కర్మను కూడా సత్ అని అంటారు.
వేదములయొక్క మూలబీజము ఓంకారము.
ఓం- పరబ్రహ్మము.
తత్ - ఆ పరబ్రహ్మము.
సత్ - సద్రూపమైనది.
తత్ - ఆ , సత్ - సద్వస్తువు, ఓం--పరబ్రహ్మము.
అనగా ఆ పరబ్రహ్మము ఒక్కటియే సత్ సద్వస్తువు.
తక్కినవన్ని మిధ్యావస్తువులు.
అంటే బ్రహ్మసత్యం జగన్మిధ్య.
దానిలోనే సర్వవేదాంతసారము ప్రస్ఫుటమగుచున్నది.
” ఓం ” చేర్చుటవలననే అన్నిమంత్రములు శక్తివంతములై ప్రభావితము చేయుచున్నవి.
” తత్” అనుపదము ఉచ్చరించుటచే మోక్షార్ధులు తపోదానయజ్ఞాది క్రియలు ఫలాపేక్షలేకుండా చేసి చిత్తశుద్ధిని పొందుచున్నారు. తద్వారా మోక్షమును పొందుచున్నారు ముక్తికొరకు అట్టిపుణ్యకార్యములు తప్పక ఆచరించవలెను అనియే భగవద్గీతలో బోధించబడినది.
ప్రతీవారు శ్రద్ధను ఆశ్రయించి ద్విగుణీకృతవిశ్వాశముతో వారి వారి ఆధ్యాత్మిక కార్యక్రమములను చేసుకొనవలెను అని భగవానుడు కర్మలో దైవత్వమును బోధించెను.
||ఓం తత్ సత్||
శ్రీభగవానువాచ
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్|
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ||
"పార్థా ! శ్రద్ధలేకుండా ఏ హ్మం చేసినా , ఏదానం చేసినా, ఏ తపమాచరించినా అది అసత్ అనబడుతుంది.దానివలన ఇహ పరాలలో కూడా ఫలము లేదు."
|| ఓమ్ తత్ సత్ ||
|| om tat sat||