||భగవద్గీత ||

|| పదునెనిమిదవ అధ్యాయము ||

|| మోక్షసన్న్యాస యోగము - వచన వ్యాఖ్యానము ||

|| om tat sat||


||ఓమ్ తత్ సత్||
అర్జున ఉవాచ:
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్|
త్యాగస్య చ హృష్కేశ పృథక్కేసి నిషూదన ||1||
"హే మహాబాహో ! ఇంద్రియ నిగ్రహముగల ఓ కృష్ణా ! సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యదార్ధమును తెలియగోరుచున్నాను."
-----

శ్రీమద్భగవద్గీత
అష్టాదశోధ్యాయః
మోక్షసన్యాసయోగము
శ్రీకృష్ణపరబ్రహ్మనే నమః

శంకరభగవత్పాదులు పదునెనిమిదవ అధ్యాయము మోక్షసన్న్యాస యోగము గురించి ఇట్లా అంటారు.
"సర్వేషు హి అతీత్యేషు అధ్యాయేషు" అంటే ఇంతకముందు దాటిన అన్ని అధ్యాయాలలో, ’ఉక్తః అర్థః’ అంటే చెప్పడిన అర్థము, అస్మిన్ అధ్యాయే - ఈ అధ్యాయములో, అవగమ్యతే - కనిపిస్తుంది అని.

అంటే అన్ని అధ్యాయాల సారము ఈ అధ్యాయములో వస్తుంది అన్నమాట.

ఇంతవరకు జ్ఞానముచే మోక్షము, భక్తి చే మోక్షము, అలాగే కర్మచే మోక్షము పొందగల పద్ధతులను తెలుపు అధ్యాయములు అనగా జ్ఞాన యోగము భక్తి యోగము కర్మయోగము గురించి విన్నాము.

ఈ అధ్యాయములో - అంటే మోక్షసన్న్యా స యోగములో - మోక్షప్రదమగు సన్యాసము ద్వారా లేక త్యాగముద్వారా లేక భగవదర్పణము ద్వారా లేక సర్వసంగరాహిత్యము ద్వారా యోగము భగవదైక్యము అంటే మోక్షము సిద్ధించునని తెలుపు అధ్యాయము. అందువలన ఈ అధ్యాయమునకు మోక్షసన్యాసమని పేరు కలిగి యుండవచ్చును.

మోక్షమనగా విడుదల. బంధమునుండి విడుదల. అట్టి బంధమోచన రూపమగు ముక్తి కైవల్యము త్యాగమువలననే లభించును. త్యాగమనినా సన్యాసమనినను ఒకటియే. ప్రపంచము, దేహము, మనస్సుఇత్యాది సమస్త దృశ్యపదార్ధముల యొక్క సంగము పరిత్యజించి మోక్ష రూపుడగు భగవంతునే శరణు పొందవలెను. ఆ క్షణముననే దృగ్వస్తువు అంటే ఇంద్రియగోచరమైన వస్తువులవేపు పరుగెత్తే మనస్సు ఆత్మగా శేషించును. అదియే మోక్ష స్థితి.

మోక్షసన్న్యసమునకు మరియొక అర్ధము.

మోక్షమనగా దైవము, సన్యాసమనగా సమస్త కర్మల ఫలమును అర్పించుట. అంటే మోక్షమును సన్యాసము అనగా వదలుట. అప్పుడు మోక్షముకూడా సన్న్యసించగలవారు ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానము ఆత్మను ఎరిగిన వానికి ఎట్టి బంధము ఉండదు. అట్టి బంధమే లేనివానికి మోక్షము గురించిన ప్రశ్నేలేదు. ముక్త స్థితి లో జీవుడు మోక్షభావన కూడ త్యజించును. పదిహేడు అధ్యాయములలో అధ్యాత్మ బోధ వినిన తరువాత ఇక బంధ మెచట ? అంటే ఈ అధ్యాయములో మోక్షమును కూడా సన్యసించు యోగము కాబట్టి మోక్షసన్న్యాస యోగమని చెప్పబడినది అని అనవచ్చు.

అదే మాట - " అజోనిత్య శాశ్వతోయమ్ పురాణో"- అను నిత్య సత్యము ద్వారా మనకు తెలియునది సనాతనమగు ఆత్మను ఎరిగిన వానికి బంధము ఉండదు. అట్టి బంధమే లేనివానికి మోక్షము గురించిన ప్రశ్నేలేదు.

ఈ అధ్యాయము అర్జుని ప్రశ్నతో మొదలగుతుంది. అర్జునుడు సంన్యాసము త్యాగము అన్నమాటలలో భేదము తెలిసికోగోరి అడుగుతున్నాడు.

అర్జున ఉవాచ:
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్|
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశి నిషూదన ||1||

అంటే "హే మహాబాహో ! ఇంద్రియ నిగ్రహముగల ఓ కృష్ణా ! సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యదార్ధమును తెలియగోరుచున్నాను."

అర్జునిని ప్రశ్నకి సమాధానముగా భగవానుడు సన్న్యాసము అంటే ఏమిటి త్యాగము అంటే ఏమిటి అన్న మాటతో మొదలెడతాడు.

"ఓ అర్జునా , కామ్యకర్మలను వదలుట సన్యాసమని కొందరు పండితులు చెప్పుదురు. మరి కొందరు సమస్త కర్మలయొక్క ఫలమును త్యజించుట త్యాగమని చెప్పుదురు".

అంటే కోరికల కోసము చేసే ఆశ్వమేధయాగము లాంటివి అవసరమున్నా త్యజించడము కామ్య కర్మ పరిత్యాగము అంటారు. చేయవలసిన నిత్య నైమిత్తిక కర్మలుచేస్తూ ఆకర్మల ఫలమును త్యాగము చెయ్యడము సర్వ కర్మ ఫలత్యాగము అని అంటారు. ’దోషవత్ కర్మ’ అంటే కర్మ బంధానికి కారణము కాబట్టి అన్ని కర్మలూ అంటే యజ్ఞదాన తపోకర్మలతో కలిపి అన్ని కర్మలూ త్యజించాలి అని కొందరి అభిప్రాయము. కొందరు యజ్ఞదానతపో కర్మలను త్యజించరాదు అని మరికొందరు అంటారు. జ్ఞాన నిష్ఠలో ఉన్నవారికి సాంఖ్యయోగము అనుసరించువారికి ఈ ప్రశ్నలేనే లేదు. వాళ్ళు అన్ని కర్మలూ సంన్యాసము చేయు వారు.

ఇవన్నీ పండితులు చెపుతారు అంటూ చెప్పిన మాటలు. ఇంక కృష్ణుడు తన అభిప్రాయము చెపుతాడు.

శ్రీభగవానువాచ:
"నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరతసత్తమ|
త్యాగోహి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః "||4||

" కర్మత్యాగవిషయమున నా నిశ్చితాభిప్రాయము చెప్పుదును వినుము. త్యాగము మూడు విధములుగ చెప్పబడినది".
శ్రద్ధాత్రయ విభాగ యోగములో శ్రద్ధ గురించి చెప్పినట్లుగానె, త్యాగము కూడా మూడు విధములు . ఆ మూడూ సాత్విక త్యాగము, రాజసిక త్యాగము, తామసిక త్యాగము అని.

మూడు విధాల త్యాగము గురించి ఇంకా చెప్పే ముందర యజ్ఞతపో దానా కర్మలు త్యజించాలా అన్నప్రశ్న మీద కూడా కృష్ణుడు తన నిశ్చిత అభిప్రాయము చెప్పాలి. దానికి కృష్ణుడు చెప్పిన మాట:

యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం ||5||

అంటే యజ్ఞము దానము తపస్సు అనెడి కర్మలు - ’న త్యాజ్యం’ - త్యజించతగినవి కాదు. అంతేకాదు అవి- ’కార్యమేవ తత్ ’- అంటే యజ్ఞదాన తపో కర్మలు చెయవలసిన కర్మలు !

న త్యాజ్యం - త్యజించకోడదు . ఎందుకు?

నిష్కామముగా ఆచరించిన ఆ కర్మలు - ’పావనాని మనీషిణాం" - మనుష్యులను పావనము చేయును కనుక. అంటే మనుష్యులకు చిత్తశుద్ధిని కలుగ జేయును కనుక అని . అందుకని ఈ యజ్ఞ దాన తపో కర్మలు కూడా ఆసక్తిని ఫలములను వదిలి చేయవలెను. అదే తన ఉత్తమమైన నిశ్చితాభిప్రాయము అని కృష్ణభగవానుడు చెపుతాడు. ( 18.06)

యజ్ఞదాన తపో కర్మలే కాకుండా సర్వకర్మ ఫలత్యాగములో నియత కర్మలు కూడా త్యజించాలా అన్నప్రశ్న మిగిలిపోయింది.

దానికి కూడా సమాధానము చెపుతూ - కృష్ణభగవానుడు చెపుతాడు. " నియత కర్మలను సంన్యసించరాదు" అవి చెయవలసినవే. వాటిని అజ్ఞానంలో త్యజించడము తామస త్యాగము అంటారు.

త్యాగము గురించి చెపుతూ అది మూడు విధములు అని చెప్పి , ఆ మూడురకములైన త్యాగము గురించి చెప్పబోయే ముందు యజ్ఞ దాన తపో కర్మలు నియతకర్మలు త్యజించకూడనవి అని చెప్పి అప్పుడు మళ్ళీ తన దృష్టి మూడు విధములైన త్యాగము గురించి మళ్ళిస్తాడు కృష్ణ భగవానుడు.

అవి తామసిక త్యాగము, రాజసిక త్యాగము , సాత్త్విక త్యాగము.

పుణ్యకర్మలు చేయడము ముముక్షువునకు ఎంతో అవసరము. వేదశాస్త్రాదులందు విధింపబడిన కర్మలు విడిచిపెట్టరాదు. ఎవరైనా అట్టి కర్మను విడిచి పెట్టిన అది తామస త్యాగమనబడును. వారు అవివేకులు మోహ పరవసులని నిశ్చయించుకొనవచ్చును.

ఎవరు శరీర ప్రయాస వలన భయము చేత దుఃఖము కలుగజేయునది అని తలంచి విద్యుక్తధర్మమును అంటే చేయవలసిన ధర్మమును విడచి పెట్టునో అట్టివాడి కర్మత్యాగము రాజస త్యాగమును అనబడును. రాజసిక త్యాగము చేసినవాడు ఆ త్యాగఫలమును పొందడు. (18.08)

ఇది చేయతగినదే యని తలంచి శాస్త్ర విహిత కర్మను ఆసక్తి మరియు ఫలము విడిచి పెట్టి చేసిన త్యాగము సాత్విక త్యాగమనబడును. సత్వగుణముతో ఉన్న మేధావి త్యాగశీలుడు. అశుభము అగు కర్మను ద్వేషించడు. శుభమును నిష్కామమును సుఖకరము యగు కర్మయందు ఆసక్తుడు కాడు. అనగా అభిమానము కలిగి యుండడు. ఆట్టివాడు తనలో తటస్థ భావము కలిగి యుండును.

దేహధారియగు జీవుడు దేహ సంరక్షణార్ధము కర్మ చేయవలసియే యుండును. కర్మలను నిశ్శేషముగా వదలడము శక్యముకాదు. అందువలన ఆ కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలమును విడచిన చాలును. అపుడు అతడు బద్ధుడు కాడు. అట్టి వాడే త్యాగియని చెప్పబడును.(18.09)

త్యాగి కాని వాళ్ళకి నష్టము ఏమిటి లేక త్యాగము వదిలేసి కర్మలను ఫలాసక్తితో చేసేవారికి వచ్చే ఫలము ఏమిటి అన్న ప్రశ్నరావచ్చు. వాళ్ళకి వచ్చేఫలములు మూడు రకాలు . ’అనిష్టమ్’ ’ఇష్టమ్’ మూడోది ’మిశ్రమమ్’.

వారికి వచ్చే ఫలాలు - ఇష్టమైనవి [సుఖకరమైనస్వర్గాదులు] అయిష్టమైనవి [దుఃఖకర నీచ జన్మాదులు ] ఇష్టానిష్ట మిశ్రమమైనది[ సుఖ దుఃఖములుగల మానవజన్మ]. ఇవి మూడువిధములైన కర్మఫలములు. మరణానంతరము ఈ కర్మ ఫలములు కర్మలను ఫలాసక్తి తో చేయువారికే కలుగును. (18.12)

సంన్యాసులకు త్యాగులకు అంటే ఫలాపేక్ష రహితముగా కర్మమును చేయువారికి చిత్తశుద్ధిద్వారా మోక్షము కలుగును. నిష్కామకర్మము ఏంతో మహిమతో కూడుకొనినదై యున్నది.

త్యాగము చేస్తే మోక్షము వస్తుంది అన్నది తెలిసినపుడు మనుష్యుడు కర్మలు లేక కర్మఫలాలని వదిలి ఆ మార్గము లోకి ఎందుకు వెళ్ళడు అన్న ప్రశ్న వస్తుంది. కర్మలను నిశ్శేషముగా ఎందుకు వదలడు అని.

కృష్ణ భగవానుడు కర్మకి మూలకారణాలు చెపుతాడు.

’పంఛైతాని మహాబాహో కారణాని నిబోధమ”|

కర్మకాండ అంతమును బోధించు వేదాంతశాస్త్రమందు కర్మాచరణ విషయమున ఐదు కారణములు చెప్పబడినవి. వాటిని గురించే కృష్ణభగవానుడు అర్జునిడికి చెపుతాడు. కర్మ ఆచరణకి అయిదు కారణాలు అని.

ఆ అయిదు ఏమిటీ?:

శ్రీభగవానువాచ:
అధిష్టానం తథా కర్తా కరణం చ పృథక్విధమ్
వివిధాః చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమం||14||

అధిష్టానం - శరీరము
కర్తా - కర్త - చేయువాడు
కరణం పృథక్విధమ్ చ - వివిధములగు ఇంద్రియములు
వివిధస్య పృథక్ చేష్టా - పలువిధములగు చేష్టలు- క్రియలు
దైవం- దైవము
ఇక్కడ దైవమనగా అధిష్టాన దేవతలు గాని పూర్వజన్మసంస్కారములు గాని అని చెప్పవచ్చును.

మనుజుడు శరీరము వాక్కు మనస్సు చేత నిర్వర్తించే ప్రతికర్మకూ ఈ అయిదు హేతువులు. కర్మ న్యాయమైనట్టిది గాని, అన్యాయమైనట్టిది గాని అవచ్చు. ఆ కర్మకు ఈ ఐదును కారణములై యున్నవి.

సాక్షి యగు ఆత్మను కర్త యని అనుకునే వాడు అజ్ఞాని అవివేకి. అతనికి కర్మయొక్క వాస్తవ రూపము తెలియదు. అసంగమగు ఆత్మకు కర్తృత్వము ఆరోపించువాడు నేత్రములున్న గుడ్డివాడగును. ఎంతపాండిత్యమున్నను వారుపరమార్ధ దృష్టిలో దుర్మతులు. (18.16)
అయితే దుర్మతులు కాని వారు ఏవరు?
ఎవనికి నేను కర్తను కాను అని అని తలంపు లేదో , ఎవని యొక్క బుద్ధి కర్మలను అంటదో అతడు ఈ ప్రాణులన్నింటినీ చంపినననూ వాస్తవముగా ఏమీ చంపుట లేదు . అతడు కర్మలచే బంధింపబడుట లేదు. (18.17). వాడు దుర్మతికాదు సుమతి అని అనవచ్చు.

ఆ సత్యమే ఇచట చెప్పబడినది.

ఎవడు కర్తృత్వము లేనివాడై అసంగుడై ఈ దేహము మనస్సు నేను కాదని ఆత్మ యందే స్థితి కలిగి సమస్త ప్రాణులనుయందు తన ఆత్మనే చూచుటవల్ల ఎవరిని హింసించడు బాధించడు.

అనగా జీవుడు ఆత్మ స్థానము దిగివచ్చి దృశ్యముకల బుద్ధితో జేరి నేను చేయుచున్నానని తలంచుటయే కాని ఎపుడు సంగముపై ఆసక్తి లేదో అపుడు పుణ్యపాపములతో బంధములు అతనికి అంటవు.

అర్జునుడు క్షత్రియుడు.
దుష్ట శిక్షణ ప్రభు కర్తవ్యము ధర్మము.
కౌరవులు అధర్మము చేసి దుష్టులయిరి. వారిని అసంగ బుద్ధితో నిరహంకారముతో వధించినను వధించనట్లే యగును. బుద్ధినిదాటి అహంకారమును దాటి ఆత్మయందునెలకొనిన వానికి బుద్ధితో ఏ పనిని చేసినను చేయనట్లేయగును. అయితే అట్టివాడు అసభ్యకరమైన పనిని చేయడు.

ఈ భావమును లోతుగా విచారించి పరప్రాణికి బాధ కలిగించకుండ ఆత్మయందుస్థితుడై అసంగబుద్ధితో ఆయాకార్యములునెరవేర్చుచూ బంధవిముక్తుడై వెలయవలెను అని గీతా సందేశము.

ఈ సందర్భములో శంకరభగవత్పాదుల భాష్యము విన తగినది.

సాంఖ్యయోగములో- ’నాయం హన్తి నహన్యతే ’(2.19) అని ఆత్మ ఈ హనన క్రియలో కర్తాకాదు కర్మ కాదు అని చెప్పి, ’నజాయతే మ్రియతే వా’(2.20) అని అంటే అత్మ అవినాశి అంటే నాశనము లేనిదీ అని చెప్పి, ’వేదా వినాశినం నిత్యం’ (2.21) అంటూ అలా ఆత్మ తత్త్వము తెలిసినవాడు ఏవరిని ఏట్లా చంపించకలడు అన్న మాటతో జ్ఞాని చంపడు జ్ఞాని బద్ధుడుకాడు అని నిశ్చితార్థము చెప్పుతున్నాడు.

జ్ఞానికి దేహాన్ని భరిస్తున్నానని అభిమానము ఆసక్తి లేదు కనక అవిద్య వలన కలుగు సర్వ కర్మలను సన్న్యసించడము సంభవము. వారికి అనిష్టము ఇష్టము మిశ్రమము అన్న మూడు కర్మఫలములూ ఉండవు. సన్న్యాసులుకానివారికి ఈ మూడు ఫలములు తప్పవు. ఇది గీతాసారము.

అయితే కర్మల ప్రేరేపణకి , కర్మ చేయడానికి ఆధారములు ఏమిటి

కృష్ణ భగవానుడు చెపుతాడు: కర్మల ప్రేరేపణకు హేతువులు లేక కారణములు మూడు:
"జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా"
జ్ఞానం - తెలివి
జ్ఞేయం - తెలియబడ తగిన వస్తువు
పరిజ్ఞాతా - తెలియువాడు
దేని ద్వారా అన్ని విషయాలు తెలియబడుతున్నాయో అది జ్ఞానము. అదే మన తెలివి. ఆ తెలివి ద్వారా తెలియబడ తగిన వస్తువు వున్నదని గ్రహించిన వాడు తెలిసికొనినవాడు. వాడు కర్త అయి ఆకర్మకి పూనుకుంటాడు. అంటే ప్రతికర్మకి తెలివి తెలిసికొనతగిన వస్తువు, ఆ వస్తువు గురించి తెలిసికొనినవాడు కారణాలు అవుతాయి.(18.18)

కర్మమునకు ఆధారము సాధనములు మూడు- అవి ’కరణమ్ కర్మ కర్త ఇతి’ . కరణమ్ అంటే దేని ద్వారా కర్మ చేయబడుతుందో అది. అవి మన ఇంద్రియాలు. కర్మ అంటే కర్తకి ప్రీతికరమైనది . కర్త అంటే చేయువాడు. ప్రతి కర్మకి ఈ మూడు వుంటాయి.

వీటిలో క్రియ కారకము ఫలము ఈ మూడూ గుణముతో సంబంధము వున్నవి. అంటే ఈ మూడును సాత్వికము రాజసము తామసికమై యున్నవి.

సాంఖ్య శాస్త్రములో జ్ఞానము, కర్మ, కర్త అనువానిని గుణభేదాలను అనుసరించి మూడు విధములు అని చెప్పబడినవి( 18.19).
అంటే జ్ఞానము కర్మ కర్తల యొక్క సాత్త్విక రాజసిక తామసిక రూపములు భగవానుడు వివరిస్తాడు.

శ్రీభగవానువాచ:
సర్వ భూ తేషు ఏనైకంభావమవ్యయమీక్షతే|
అవిభక్తంవిభక్తేషు తజ్ఞానంవిద్ధి సాత్వికమ్||20||

ఆత్మవస్తువు లేక, దైవము యొక్క ఉనికి సకల చరాచర ప్రాణులందు విభజింపబడక ఏకమై నున్నట్లు ఏ జ్ఞానము చేత తెలిసికొనుచున్నాడో అట్టి జ్ఞానము సాత్త్విక జ్ఞానమనబడును.

భగవంతుడు సకల ప్రాణులందు వ్యాపించియిన్నాడు అని గ్రహించి . ప్రపంచము లో అనేక జీవరాసులు భిన్న భిన్నపదార్ధములు చూచినను వాని ఉపాధి రూపమున నామరూపములు వదలి అన్నిటియందు అవిభక్తమైన ఒక్కటైన ఆత్మనే చూచువాడు సాత్త్విక జ్ఞానము కలవాడని చెప్పబడును.

అంటే అనేకత్వములో ఏకత్వము,
నాశములో అవినాశిత్వము,
విభజిత వస్తువులలో అవిభక్త త్త్వము,
వీటిని చూడ గలుగుటయే ఉత్తమ జ్ఞానము అన్నమాట.
అదే సాత్త్విక జ్ఞానము.

ప్రపంచమున వస్తువులు అనేకములయినవి నాశవంతమైనవి విభాగముతో కూడినవి. ఆత్మ మాత్రము ఏకమైనది నాశరహితమైనది అవిభక్తమైనది. కనుక ఏప్రాణిని చూసినను అతని దేహము పైగాని గుణముపై గాని దృష్టినుంచక ఆ ప్రాణిలోన గల ఆత్మపై దృ ష్టి నుంచవలెను. ఆత్మపై దృష్టి అనగా దైవదృష్టి కలవారు. అట్టివారు ఉత్తములు.

ఏ జ్ఞానమువలన మనుజుడు సమస్త ప్రాణులందును వేరు ఉన్న సమస్త జీవులను వేరు వేరుగ చూచు చున్నాడో అట్టివాడు రాజస జ్ఞానము కలవాడు అని చెప్పబడినది. ప్రాణులలో వీడు వేరు వీడు వేరు అని అనేకత్వము చూచుట ఉత్తమ జ్ఞానముకాదు. అది రాజస జ్ఞానమగును.

తామస జ్ఞానముకలవాడు ఏదియో యొక దృశ్యవస్తువు పట్టుకొని దానియందే ఆశక్తి కలిగి అదియే సమస్తమని తలంచు చుండును. శరీరమే ఆత్మఅని తలంచు చుండును.

జ్ఞానమును విభజించిన తరువాత అలాగే కర్మలను కూడా కృష్ణభగవానుడు విభజిస్తాడు.

శ్రీభగవానువాచ:
నియతం సంగరహితమరాగద్వేషతః కృతమ్|
అఫలప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్త్వికముచ్యతే||23||

శాస్త్రముచే నియమింపబడిన ఏ కర్మ ఆసక్తి లేకుండా రాగద్వేషములు లేకుండా ఫలాపేక్ష లేకుండా చేయబడినదో ఆ కర్మ సాత్త్విక కర్మ అని చెప్పబడుచున్నది.

మానవుడు తన ఇష్టము వచ్చినట్లు చేయక శాస్త్రాదులచే నియమింపబడిన కర్మనే చేయవలెను. ప్రపంచములో మానవుడు కర్మ చేయకుండా వుండలేడు. కనుక శాస్త్ర నియమమైన కర్మ సంగరహితముగ రాగద్వేషములు లేకుండ ఫలాపేక్ష లేకుండ చేయవలెను.

అట్టికర్మ మోక్ష ప్రదమై యుండును..

ఫలాపేక్షతో అహంకారముతో చేయుకర్మ రాజస కర్మ అనబడును. కర్తృత్వ బుద్ధి ఫలాపేక్షతో చేయు కర్మలు అత్యంత ప్రయాసతో కూడు కొని యుండును.

భగవద్విముఖుడై స్వార్ధ సాధన కొరకు చేయు పనులు తామసకర్మలు అనబడును. అట్టివాడు అట్టి కర్మలను అవివేకముతో గుడ్డిగ చేయుట వలన అవి దుఃఖమును కలుగజేయును.

ఇంక కర్తను గురించి భగవంతుడు చెప్పుచున్నాడు.
శ్రీభగవానువాచ
ముక్తసంగోనహంవాదీధృత్సాహసమన్వితః|
సిద్ద్యసిద్ధ్యోర్నిర్వికారఃకర్తాసాత్త్విక ఉచ్యతే ||26||

ఏవరైతే
ముక్తసంగో - ఫలాపేక్షవిడిచినవాడు
న అహం వాదీ - ’నేను’ అను అహంభావము లేని వాడు
ధృతి ఉత్సాహ సమన్వితః - ధైర్యము ఉత్సాహము తో ఉన్నవాడు
నిర్వికారః - సిద్ధించిన సిద్ధించకపోయినా చలించని వాడు
అటువంటి కర్తను సాత్త్విక కర్త అని అంటారు.

అంటే నేను కర్తను అను అభిమానము లేనివాడు అహంభావము లేనివాడు సంగము ఫలాపేక్ష లేనివాడు కార్యము సిద్ధించినను సిద్ధించ కున్నను వికారము చెందని వాడు సాత్త్విక కర్త అని చెప్పబడును.

ఇంక రాజస కర్త గురించి.

అనురాగము కలవాడు కర్మ ఫలమును ఆశించువాడు, లోభి శుచిత్వము లేనివాడు, కార్యము సిద్ధించినపుడు సంతోషముతోను, కార్యము చెడినపుడు దుఃఖముతోను గూడినవాడు రాజస కర్త అని చెప్పబడును.

ఏకాగ్రత లేనివాడు సంస్కారము లేనివాడు ఇతరుల కార్యములను చెడగొట్టువాడు (నైష్క్రతికః) , ఎప్పుడు ఏదో చింతతోను దుఃఖముతోనుండువాడు తామసిక కర్త యనబడును.

గుణములచేత కర్మను కర్తను విభజించి చెప్పిన కృష్ణుడు అలాగే బుద్ధి ధైర్యము లలో గుణములచే కలుగు బేధములను కూడా చెపుతాడు :

శ్రీభగవానువాచ:
ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయా భయే
బంధంమోక్షంచయావేత్తి బుద్ధిస్సా పార్ధ సాత్వికీ|| 30||

సాత్విక బుద్ధికి అంటే ఎవరైతే:

ప్రవృత్తిం నివృత్తిం చ -
ప్రవృత్తి మార్గమగు కర్మమార్గము. నివృత్తిమార్గమగు సన్న్యాస మార్గము నూ
కార్యా కార్యే - చేయ తగినది, చేయ కూడనిది
భయా భయే- భయమును నిర్భయమునూ
బంధం మోక్ష ఏవ చ- బంధమునూ మోక్షము నూ
వేత్తి - తెలికొనుచున్నరో

ఎవరైతే కర్మ మార్గము సన్న్యాస మార్గము, చేయతగినది , చేయకూడనిది , భయము నిర్భయము నూ తెలిసికొనుచున్నారో అట్టి వారి బుద్ధి సాత్త్వికీ బుద్ధి అని చెప్పబడుతున్నది.

ఏ బుద్ధి ధర్మ ప్రవృత్తిని (లేక ప్రవృత్తిమార్గమగు కర్మమార్గమును), అధర్మమునుండి నివృత్తిని లేక నివృత్తి మార్గమగు సన్యాసమార్గమును , చేయతగిన దానిని చేయ తగనిదానిని , భయమును అభయమును బంధమును మోక్షమును తెలిసికొనుచున్నాడో అట్టి బుద్ధి సాత్త్వికమైనది యగును.

ధర్మమును అధర్మమును, చేయతగినదానిని చేయతగనిదనిని వున్నది వున్నట్లుగాక వేరొకవిధముగా తెలిసి కొనుచున్నడో అట్టి బుద్ధి రాజస బుద్ధి యనబడును.(18.31)

ఏ బుద్ధి అవివేకముచే కప్పబడినదై అధర్మమును ధర్మముగ ఎంచునో, అలాగే సమస్త పదార్ధములను విరుద్ధముగ తలచునో అట్టి బుద్ధి తామస బుద్ధియై యున్నది. లేని దేహము జగత్తు వారికి వున్నట్లు చూపట్టును. దుఃఖకరమైన విషయ భోగములు సుఖములుగా తోచును. పరమానందకరమగు ఆత్మరుచింపకయేయుండును (18.32).

తరువాత కృష్ణ భగవానుడు మూడు రకముల ధైర్యము గురించి విశదీకరిస్తాడు.

ఏ ధైర్యముచే మనుజుడు తన మనస్సును ఇంద్రియములను విషయభోగముల నుండి నిరోధించునో దృశ్యవ్యామోహమునుండి నివృత్తుడగునో అదియే గొప్ప ధైర్యము. అది నిశ్చలముగ నుండవలెను. దానిని సాత్త్విక ధైర్యము అంటారు.(18.33)

ఏ ధైర్యముచేత మనుజుడు ఫలాపేక్షకలవాడై ధర్మమును అర్ధమును కామమును మిక్కిలి ఆసక్తితో అనుష్టించునో అట్టిది రాజస ధైర్యమనబడును.(18.34)

ఏ ధైర్యము చేత దుర్బుద్ధిని నిద్రను భయమును శోకమును దిగులు మదమును విడువక యుండునో అది తామస ధైర్యమనబడును.(18.35)

అలాగే మూడు విధములయిన సుఖములను గురించి కృష్ణుడు చెపుతాడు.

శ్రీభగవానువాచ:
యత్తదగ్రే విషమివ పరిణామేఅమృతోపమమ్
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తంఆత్మబుద్ధిప్రసాదజమ్||37||
ఏ సుఖమైతే
అగ్రే - ప్రారంభమున
విషమివ - విషములాగ
పరిణామే - చివరిలో
అమృతోపమం- అమృతముతో సమానముగా

ఉండునో అది సాత్విక సుఖము అన్నమాట

అంటే ఏ సుఖము ప్రారంభమున విషమువలెను పర్యవసానమందు అమృతము పోలినదిగా నుండునో , తనబుద్ధి యొక్క నిర్మలతత్వముచే కలుగు నట్టి ఆ సుఖము సాత్త్విక సుఖమనబడును ! సాధకునకు ప్రారంభమున అభ్యాసకాలమందు బ్రహ్మనిష్ట ధ్యాన వైరాగ్యాదులు కష్టముగాతోచవచ్చును. అభ్యాసము పూర్తియగు కాలమున అదే అమృత తుల్యముగ నుండును. సాధనలు కావించు సమయమున కష్టములకు జంకక బుద్ధిని నిర్మలముగ ఉంచుకొనవలెను.

ఏ సుఖము విషయేంద్రియ బంధమువలన మొదట అమృతము అనిపించి చివరిలో విషముగ నున్నచో అట్టి సుఖము రాజస సుఖముగ చెప్పబడినది. (18.38)

నిద్ర సోమరితనము ప్రమత్తత అనువానివలన పుట్టి ఏ సుఖము ఆరంభమందు అంతమునందు తనకు మోహము అజ్ఞానము బాధను కలుగజేసినచో అది తామస సుఖమనబడును. (18.39)

గుణముల విభజన గురించి పదునాలుగవ అధ్యాయము అంటే గుణత్రయ విభాగయోగము లో మొదలుపెట్టి చెప్పిన మాట. ప్రకృతి మాయనుండి పుట్టి ఈ మూడు గుణములతో వుండని వస్తువు ఈ ప్రపంచముననే లేదు. భూలోకమందుగాని స్వర్గమందు గాని దేవతలయందు గాని ఎక్కడా లేదు. దేవతలుగూడ బంధమున ఉన్నవారే. గుణములతో బంధింపబడిన ఈ సంసారము అశ్వత్థ వృక్షరూపములో వివరించి దీనిని అసంగము అనే ఖడ్గముతో చేధించి పరమాత్మను చేరాలి అని మనము పురుషోత్తమ ప్రాప్తి యోగములో విన్నాము.

అయితే మరి లోకములో అన్ని త్రిగుణాత్మకమే అయితే అసంగమనే ఖడ్గము ఎలా వస్తుంది అన్న సందేహము సబబే. మానవుడు తన ధర్మమును ఫలాపేక్ష లేకుండా నిర్వర్తిస్తూ భగవత్ శరణాగతిలో వెళ్ళితే అప్పుడు అసంగమనే ఖడ్గము పొందబడును అని గీతా సందేశము. అంటే వారు భగవత్ శరణాగతిలో గుణాతీత స్థితికి వచ్చి జ్ఞానాదులు పొంది ముక్తి పొందుతారు. అదే కృష్ణభగవానుడు మళ్ళీ ఇక్కడ చెపుతాడు.

ఈ సందర్భములో కృష్ణ భగవానుడు వర్ణ సంస్కారము గురించి చెపుతాడు.

"ఓఅర్జునా| బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు వారివారిజన్మాంతర సంస్కారమును బట్టి సృష్టింపబడిరి."- [చాతుర్వర్ణం మయాసృష్టంగుణకర్మ విభాగశః] (4.13)

వారివారి గుణస్వభావమును బట్టి కర్మలు వేరు వేరుగా విధింపబడినవి. దీనిని బట్టి వారి పుట్టుకతోనే వారి జాతి ఏర్పడుట లేదు వారి వారి గుణములను బట్టీయే జన్మకర్మలు ఏర్పడు చున్నవి అన్న మాట.

ఎవరైనా ఊర్ధ్వస్థితికి వెళ్ళవలెనన్నజన్మతః ఏ జాతి లో పుట్టినప్పటికి రాజులైనా రాజభటులు ఆయినా వారి శుద్ధత్వము పవిత్రత పరమార్ధిక సాధనచే వారు పారమార్థికముగా ఉత్తమ వర్ణస్థులుగా తయారుకావచ్చును.

శ్రీభగవానువాచ
శమోదమస్తపఃశౌచంక్షాంతిరార్జవమేవచ;
జ్ఞానవిజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజమ్||42||

అంతరిన్ద్రియ నిగ్రహహము శమము ; బాహ్యేంద్రియ నిగ్రహహము దమము;శుచిత్వము రుజుమార్గము గురువు శాస్త్రము నందు నమ్మకము కలిగియుండుట, ఓర్పు మొదలగునవి కూడా బ్రహ్మణులకు స్వభావముగ వుండును.

అలాగే శూరత్వము తేజస్సు (కీర్తి ప్రతాపము) ధైర్యము సామర్ధ్యము ; యుద్ధము నందుపారిపోకుండుట దానము ; ప్రజాపాలన శక్తి క్షత్రియులకు స్వభావము వలన పుట్టినవి.

వైశ్యునకు వ్యవసాయము గోసంరక్షణము వర్తకము స్వభావముగ నుండును.

శూద్రునకు సేవారూపకమయిన కర్మ స్వభావముగనుండును.

ఈ స్వభావములు త్రిగుణాత్మకమైన ప్రకృతి వలన కలుగుతాయి. అయితే ఈ భిన్న భిన్న స్వభావములతో వున్న మనుష్యులు సంసారవృక్షాన్ని ఛేధించ గల అసంగమనే ఖడ్గాని ఎలా పొందగలరు అన్న మాటకి సమాధానము కూడా కృష్ణభగవానుడు చెపుతాడు:

శ్రీభగవానువాచ:
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః|
అంటే తమతమ కర్మలయందు తత్పరులైన మనుష్యులు సిద్ధిని పొందుతారు. అంటే సిద్ధిని పొందడానికి , పైన చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మాలకి సంబంధము లేదు. ఇది అందరికీ వర్తిస్తుంది. అది ఎలా సాధ్యము అని అనుమానం వస్తుంది అని కృష్ణభగవానునికి తెలుసు. అందుకనే అంటాడు:
’స్వకర్మ నిరతః సిద్ధిం యథా విన్దతి తత్శృణు’||
కృష్ణ భగవానుడు చెపుతాడు - ’తమ కర్మలయందు నిరంతరము మునిగి ఉన్న వారు సిద్ధి ఎలా పొందుతారో చెపుతాను విను” !!
గీతలో మనము ముందు విన్నసంగతే. సమస కర్మలను కర్మఫలములను భగవదర్పితము చేసి భగవంతుని శరణాగతి పొందడమే. అదే ఇప్పుడు చెప్పేది.
శ్రీభగవానువాచ:
యతః ప్రవృత్తిర్భూతానాం యేనసర్వమిదం తతం|
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధింవిందంతిమానవః ||46||

ఎవని వలన సమస్త ప్రాణులూ పుడుతున్నాయో, ఎవని చేత సమస్త ప్రపంచము నిండి ఉన్నదో ఆ పరమాత్ముని తమ కర్మలచే అర్చించి మానవుడు సిద్ధిపొందుతాడు.

తమ కర్మలయందు తత్పరులైన మనుష్యులు సిద్ధిని పొందుతారు. తన తన స్వాభావిక కర్మలు కర్మ ఫలములు ఈశ్వరార్పణముగ నిష్కామముగ ఆచరించుటచే చిత్తశుద్ధికలుగగా దానిచే జ్ఞానయోగ్యత కలుగు చున్నది. "..ఏన సర్వమిదమ్ తతమ్" అని చెప్పినట్లు దేనిచే ప్రపంచము అంతయూ వ్యాపింపబడియున్నదో ఆ పరమాత్మ పాలలోవెన్నవలె స్థూలనేత్రములకు గోచర ముకాకున్నను జ్ఞాననేత్రమునకు సర్వత్ర గోచరించును.

కర్మ చేయుటయే నీవంతు ఫలితము భగవంతునికి అర్పింపుము. అప్పుడు మోక్షసిద్ధిని పొందగలవు అని గీతా సందేశము. కర్మయను ప్రమిదలో భక్తి యను తైలము పోసి ధ్యానమను వత్తిని పెట్టి జ్ఞానమను జ్యోతినివెలిగింపుము అని భగవానుని సందేశము.

శ్రీభగవానువాచ
శ్రేయాన్స్వధర్మోవిగుణఃపరధర్మాస్త్వనుష్టితాత్|
స్వభావ నియతంకర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం||47||

అంటే తనధర్మము గుణములేనిదిగ కనబడినను (అసంపూర్ణముగా అనుష్టింపబడినది అయిననూ) చక్కగా అనుష్టించబడిన ఇతర ధర్మముల కంటె శ్రేష్టమైనదే యగును. స్వభావముచే తన ధర్మమునకు తగిన కర్మ చేయుచున్న ఎడల పాపమును పొందడు.

ఎందుకు స్వధర్మమే మేలు అంటాడు?
దీనిని సమర్థించడానికి కృష్ణ భగవానుడు వెంటనే ఇంకో మాట చెప్పాడు.
’సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివా వృతా”-
అంటే సమస్త కర్మలు దోషముతో అగ్ని పొగ చేత కప్పబడినట్లు కప్పబడి యున్నవే.
సమస్త కర్మలూ త్రిగుణాత్మకమై దోషముతో కప్పబడినవై ఉన్నప్పుడు , దోషముతో కూడిన ఇతరుల ధర్మమును ఆచరించడము కన్న ఫలము త్యజించి చేసిన స్వధర్మమే మేలు. సమస్తకర్మలూ అన్నది అన్ని వర్ణజాతులకు సంబంధించినదే. అప్పుడు స్వధర్మమే మేలు అనడము పూర్తిగా సమర్థనీయమే.

సర్వారంభ హి దోషేణ - అన్నమాటతో మోక్షమార్గానికి వెళ్ళే రాజమార్గములో అన్ని జాతులవారు ఒకటే అని చేప్పాడు కృష్ణుడు.

ఇలా మోక్ష సాధనకు ప్రయాస పడుతున్నవారిలో ఎవరు సిద్ధి పొందుతారు?
శ్రీభగవానువాచ:
అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః|
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధి గచ్ఛతి||

అసక్తబుద్ధిః - ఆసక్తి లేనివాడు ( వస్తువుల్లపై)
జితాత్మ- మనస్సును జయించినవాడు
విగతస్పృహః - కోరికలు లేనివాడు
అట్టివాడు సన్న్యాసముతో ( కర్మఫలమైన లేక జ్ఞానమార్గముద్వారా) నిష్క్రియమైన ఆత్మను అంటే మోక్షము లేక సిద్ధి పొందుతున్నాడన్నమాట.

సిద్ధి ఎలాపొందుతారు అన్నప్రశ్నకి కూడా కృష్ణ భగవానుడు సమాధానమిచ్చాడు.

"కర్మసిద్ధిని పొందినవాడు ఏ విధముగా పరమాత్మను పొందుచున్నాడో ఆ విధమునూ, జ్ఞానముయొక్క శ్రేష్టమైన పరాకాష్ఠ ఏది వుందో దానిని ( ఎలా పొందుతున్నాడో దానిని) సంక్షేపముగా నా వలన తెలిసికొనుము" అని.

కర్మ సిద్ధిని పొందినవారు పరమాత్మను ఎలా పొందగలరో గీత యొక్క సారమంతయు భగవానుడు క్లుప్తముగ నాలుగు శ్లోకములలో ఈ విధముగా తెలుపుచున్నాడు.

శ్రీభగవానువాచ:
బుద్ధ్యావిశుద్ధయా యుక్తో దృత్యాత్మానం నియమ్య చ|
శబ్దాదీన్విషయాస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుద స్యచ ||51||
వివిక్త సేవీ లఘ్వాశీ యతవా క్కాయ మానసః|
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యంసముపాశ్రితః”||52||
అహంకారం బలందర్పం కామం క్రోధంపరిగ్రహమ్|
విముత్య నిర్మమ శ్శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే||53||

దీనినే సంక్షిప్త గీత యని కూడ అందురు

మోక్షప్రాప్తికి -
- బుద్ధినినిర్మలముగ యుంచుకొనవలెను.
- ధైర్యముచే ఇంద్రియములను స్వాధీనము చేసికొనవలెను.
- శబ్దస్పర్శాది విషయములను త్యజించవలెను.
- రాగద్వేషములను విడిచి పెట్టవలెను.
ఇలా చేసిన తరువాత ఏమి చెయ్యలి?
- ఏకాంతమైనస్థలమును ఆశ్రయించవలెను
- మితాహారము సేవించవలెను
- వాక్కును శరీరమును మనస్సును స్వాధీనమునందుంచుకొనవలెను
- వైరాగ్యమును లెస్సగా ఆశ్రయించవలెను.
- నిరంతరము ధ్యానతత్పరుడై యుండవలెను.
అలా ధ్యాన యోగపరుడై అహంకారము దుష్టకార్యములకుపయోగించు బలమును కామమును క్రోధమును పరిగ్రహమును [ ఇతరులనుండి వస్తువులను తీసుకొనుట] , మమకారము వదలి వేసి శాంత చిత్తుడైన వాడు బ్రహ్మగా అవడానికి యోగ్యుడు.

ఈ విధముగా బ్రహ్మ సాక్షాత్కారము పొందినవాడు నిర్మలమనస్సుకలవాడై ప్రాణులందు సమబుద్ధి కలిగినవాడై ఉత్తమ భగవద్భక్తిని పోందును.(18.54)

ఏడవ సర్గలో ’చతుర్విధా భజన్తే మాం’ అంటే నాలుగు రకాలవారు నన్నుభక్తితో సేవిస్తారు అంటాడు ( 7.16). ఆ నాలుగురు ఎవరు ? , ఆపదలో నున్న వాడు, భగవత్ తత్త్వం తెలిసికొవలను అనే కోరిక గలవాడు, ధనము కోరేవాడు, మరియూ జ్ఞాని.

బ్రహ్మజ్ఞానము కలవాడు జ్ఞాని. అట్టివాడు పరాభక్తి అనగా జ్ఞాననిష్టతో సమానమైన భక్తిని పొందును.
జ్ఞానయోగ పరాకాష్ఠలో జ్ఞాని భక్తుడిగా మారుతాడు అన్నమాట.

కృష్ణభగవానుడు ఆ జ్ఞానిగురించి చెపుతాడు ; "ఆ భక్తి చేత నేను ఎంతటివాడనో , ఎట్టివాడనో నన్ను యదార్థముగా తెలుసుకుంటాడు. నన్ను యదార్థముగా తెలిసికొని నాయందు ప్రవేశిస్తాడు"

ఇక్కడ భక్తి యనే పుష్పమే జ్ఞానమనే ఫలముగా మారుచున్నది. భక్తిద్వారా ఆత్మస్వరూపమును తెలిసికొని ఆ స్వరూపమునందు ప్రవేశించు చున్నాడు. అంటే జ్ఞానముచే ముక్తి లభించును. ముక్తి పొందే జ్ఞానము భక్తి వలన లభించును

’బుద్ధ్యావిశుద్ధయా యుక్తో’ విశుద్ధమైన భక్తితో అంటూ ’వివిక్త సేవీ లఘ్వాసీ’ ఏకాంత ప్రదేశములో నన్ను ధ్యానిస్తూ అంటూ జ్ఞాని భగవానుని ఎలా పొందుతాడో చెప్పి(18.55) - తొమ్మిదవ అధ్యాయములో "అనన్యాః చింతయంతో మామ్" (9.22) అంటూ శరణాగతుల కి చెప్పిన మార్గము గురు=ఇంచి కృష్ణుడు మళ్ళీ ప్రస్తావిస్తాడు.

" నన్నే ఆశ్రయించినవాడు సర్వ కర్మలను చేయుచున్నప్పటికీ నా అనుగ్రహము వలన శాశ్వతము నాశరహితము అగు పదము పొందుతున్నాడు" (18.56) అంటే మోక్షము పొందుతున్నాడు అన్నమాట.

ఆంటే అన్నికార్యములు నిరంతరము చేయుచున్నను మనస్సు భగవంతుని యందు లగ్నమైనచో భగవాదానుగ్రహమువలన మోక్షము లభించ గలదు.

ఇందులో కర్మఫల సన్యాసమే చెప్పబడినదిగాని కర్మ సన్యాసముకాదు.

మనుజుడు పరమాత్మను పరమ ప్రాప్యముగ నెంచి నిరంతరము భగవంతుని యందే సంలగ్నమొనర్పవలెను

ప్రీతితో భక్తిపూర్వకముగ తన్నుభజించువారికి బుద్ధియోగమును ఒసంగెదనని భగవానుడు 11 అధ్యాయములో తెలిపెను.

అదే మళ్ళీ తన చివరి మాట లాగా కృష్ణ భగవానుడు ఇలా చెప్పుచున్నాడు :" సమస్త కర్మలు వివేకముతో కూడిన బుద్ధిచేత నాకు సమర్పించి , నన్నే పరమ ప్రాప్యముగా ఎంచినవాడై బుద్ధియోగము అవలంబించి నాయందే చిత్తము నిలుపుము. నాయందే చిత్తము నిలిపిన వాడ వైతే నా అనుగ్రహము వలన సమస్త సంసారిక దుఃఖములను దాట గలవు."

అహంకారముతో ఇది నాకు కుదరదు అని అనుకుంటే ఆది నాశనకారి యే.
ఎందుకు?
’స్వభావముతో నీ కర్మచేత నీవు బంధింపబడిన వాడివి. ఆ మోహముతో నీవు కర్మ చేయడానికి ఇష్ఠపడనప్పటికీ అవశుడవై నీవు ఆ కర్మ చేస్తావు’.
అది ఎలా?
ఈశ్వరుడు సమస్త ప్రాణుల హృదయదేశములో ఉంటాడు. ఉండి సమస్తప్రాణులనూ యంత్రము మీద బొమ్మలను తిప్పినట్లు తిప్పుతూ ఉంటాడు (18.61)
దీనిలోంచి బయటపడడము ఎలాగ?
శ్రీభగవానువాచ:
తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత|
తత్ ప్రసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్||
"ఆ ( హృదయస్థుడగు ) ఈశ్వరునే శరణు పొందుము. ఆ భగవదనుగ్రహముచే సర్వోత్తమమగు శాంతిని , శాశ్వతమగు మోక్షపదవిని నీవు పొందగలవు"

అంటే ఆ ఈశ్వరునే సంసారకష్ఠము తొలగించకోవడము కోసము సర్వాత్మ భావముతో ఆశ్రయించు. అప్పుడు ఈశ్వరానుగ్రహము వలన పరమ శాంతిని శాశ్వతమైన భగవత్ స్థానమును పొందగలవు అని అర్జునిడికి కృష్ణుడు చెపుతాడు.

అలా కృష్ణుడు అర్జునునికి రహస్యములన్నిటికి రహస్యమైన గీతా శాస్త్రము చెప్పి, "దీనినంతతిని బాగుగా విచారణ చేసి తదుపరి నీకు ఎట్లు ఇష్టమో అట్లాచరించుము" అని చెపుతాడు.

అర్జునుడు కృష్ణుడికి మిక్కిలి ప్రీతి పాత్రుడు.
అందుకని "నీకు ఎట్లు ఇష్టమో అట్లాచరించుము’ అని చెప్పినా ,
"తే హితం వక్ష్యామి"- "నీ హితము కోరి చెపుతున్నాను" అంటూ.
భూయః - మళ్ళీ చెపుతాడు.

శ్రీభగవానువాచ:
శ్లో||మన్మనాభవ మద్భక్తోమద్యాజి మాంనమస్కురు
మామెవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే"||65||

అంటే - " నాయందుమనస్సునుంచుము. నాయడల భక్తికలిగి యుందుము. నన్ను ఆరాధించుము. నాకు నమస్కరించుము. అట్లు కావించెదవేని నీవు నన్నే పొందగలవు. నా కిష్టుడవై యున్నావు కనక ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను" అని.

సాక్షాత్తు కృష్ణమూర్తియే ఈవాక్యమును సత్యమని ప్రతిజ్ఞ చేసిచెప్పెను.

శ్రీభగవానువాచ
స్సర్వధర్మాన్ ప రిత్యజ్య మామేకంశరణం వ్రజ|
అహంత్వాసర్వ పాపేభ్యొ మోక్ష యిష్యామి మాశుచః||66||

అంటే - "సమస్త ధర్మములను విడిచి పె ట్టి నన్నొకడిని మాత్రమే శరణుపొందుము. నేను సమస్త పాపముల నుండి విముక్తునిగ చేయుదును".

సమస్త కర్మలు ధర్మములన్నింటియొక్క ఫలితము శరణాగతి యొక్క ఫలితముననే ఇమిడియున్నది. దేనినిపొందినచో సమస్తము పొందబడినదియగునో అట్టి ఆత్మవస్తువు భగవంతుని ఆశ్రయించిన చాలును. కావున తన్నొక్కనినే శరణు పొందమని భగవానుడు ఉపదేశించెను.

దృశ్యపదార్ధములన్నిటిని వదలి దృక్వస్తువగు ఆత్మనొక్కదానినే శరణు పొందుము అని చెప్పెను. త్యాగము చేతనేమోక్షము లభించును. దృశ్యరూపక్షేత్రమును గురించిన భావము లను త్యజించి క్షేత్రజ్ఞుడగు పరమాత్మను శరణు పొందవలెను.

ఈ సత్యము తెలిసికొని భగవంతుని శరణాగతి యొనర్చి ఇంక ఏమాత్రము శోకింపకుము అని భావన.

దుఃఖరహితమగు పరమాత్మ స్థానము లభించునపుడు ఇంక శోకమునకు ఆస్కారము లేదు.

” అశో చ్యానన్వశోచస్త్వం ” అను శోకరాహిత్య బోధ ద్వారా గీత ప్రారంభమై "మాశుచః" అను శోకరాహిత్య వాక్యముతో అంతమైనది కావున గీత లక్ష్యము శోకరాహిత్యమే.

ఆనంద ప్రాప్తి. బ్రహ్మానంద ప్రాప్తి. ఇవియే గీతా లక్ష్యము ...

ఈ శ్లోకమునందు అతిసులభమైన భక్తి ప్రపత్తి శరణాగతి మాత్రమే ముక్తికి హేతువుగ తెలుపబడుటచే గొప్ప గొప్ప శాస్త్రములు చదువలేనివారు ఈ శ్లోకమును సదా మననము చేయుట అత్యంత శ్రేయస్కరము.

భగవానుడు గీతాశాస్త్రము గురించి ఇట్లు చెప్పెను. "అర్జునా! నీకుబోధింపబడిన గీతా శాస్త్రము తపస్సులేనివారికి గాని భక్తుడుకానివానికిగాని వినుటకిష్టములేనివానికి గాని గురు సేవచేయనివారికిగాని, నన్ను దూషించువానికిగాని ఎన్నడును చెప్పతగినదికాదు" .

తపస్సుకలవారికి భక్తి కలవారికి గీతను బోధింపవచ్చును. ఎవరు అతిరహస్యమైన గీతా శాస్త్రము నాభక్తులకు చెప్పునో అట్టివాడునిస్సందేహముగ నన్నే పొందును అని భగవానుడు చెప్పెను. దేవునికి ప్రియమొనర్చుటకై మానవులు అనేక పుణ్యకార్యములు చేయుచున్నారు. వారందరికన్ననూ గీతశాస్త్ర బోధకుడే అధిక పుణ్యము సంపాదించు చున్నాడు అని్. గీతా ప్రచారము పుణ్యప్రదమైనది . అట్టి ప్రచారకుని జన్మ సార్ధకమైన ది.

శ్రీభగవానువాచ||
అధేష్యతే చ య ఇమంధర్మ్యంసంవాదమావయోః|
జ్ఞాన యజ్ఞేన తేనాహమిష్ట స్స్యాహమితి మేమతిః ||70||

అంటే - "ఎవరు ధర్మయుక్తమైన ఈ సంభాషణము అధ్యయనము చేయునో అట్టి వానిచే జ్ఞానయజ్ఞముచే నేను ఆరాధింప బడిన వాడనగుదును".

శ్రీభగవానువాచ
కచ్చిదేతచ్చ్రుతంపార్ధ త్వయైకాగ్రేణ చేతసా|
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ||72||

అంటే "ఓ అర్జునా!నాయీ బోధను ఏకాగ్రముగ వింటివా? అజ్ఞానజనితమగు నీ భ్రమ సంపూర్ణముగ నశించినదా" అని.

ఏకాగ్రేణచేతసా అంటే ” ధ్యానించునపుడు గాని శ్రవణము చేయునపుడుగా ని విచారణసలుపునపుడుగాని మనస్సు ఏకాగ్రముగ యుండవలెను. అజ్ఞానము సమూలముగ నశింపచేసికొనుడు అని భగవానుడు గీతాశాస్త్రమందు అంతిమోపదేశము గావించెను తన బంధువులు చనిపోవుదురను దుఃఖము శ్రీకృష్ణుడు ఉపదేశించిన జ్ఞానముచే సమూలముగ నశించినది.

అప్పుడు అర్జునుడు చిట్టచివరగా చెప్పిన మాట ఇది:

అర్జున ఉవాచ
నష్టోమోహః స్మ్రతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా|
స్థితోస్మి గతసందేహః కరిష్యేవచనంతవ||73||

అంటే - "నీఅనుగ్రహమువలన నాఅజ్ఞానము నశించినది. సంశయములు తొలగినవి. ఇక నీఆజ్ఞను నెరవేర్చెదను"

శిష్యుడు ఎంతపైస్థితికిపోయినను గురు భ క్తిని గురువాక్యపాలనను వదలరాదు. దైవభ క్తిని శాస్త్రపాలనను ఏకాలమందు విడనాడరాదు.

ఇట్టి అద్భుతమైన సంవాదము వినిన సంజయుడు ధృతరాష్ట్రునకు ఇలా చెపుతాడు. "ఓ దృతరాష్ట్రా ! కృష్ణుడియొక్కయు అర్జునుడి యొక్కయు ఆశ్చర్యకరమైన పులకాంకురముకలుగజేయు సంభాషణమును వింటిని మోహగ్రస్తుడగు అర్జునుడు భగవానుని దివ్య బోధచే మహాత్ముడుగ మారిపోయెను.గీతా శాస్త్రము అపూర్వమైన మహిమకలది.అత్యాశ్చర్యమైనది".

వ్యాసుడు సంజయుడికి దూరదర్శన దూరశ్రనణ శక్తినొసంగెను. రణరంగమున జరిగిన సంవాదమును వినగలిగెను చూడ గలిగెను. సంజయుడు చెప్పినది సాక్షాత్తు భగవత్ప్రోక్తములైన వాక్యములే.

భగవానుడు స్వయముగా బోధించిన గీతాశాస్త్రము పుణ్యమైనది పావనమైనది. అట్టి గీతాశాస్త్రము వినిన సంజయుడు "ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణార్జునుల సంవాదము తలచి తలచి మాటి మాటికి ఆనందమును పోందు చున్నాను".

వినిన బోధను మాటిమాటికి తలచుకొని మనననిధిద్యాసలు గావించుకొని ఆనందముపొంది సంజయుడు సంతోషార్ణవమున ఓలలాడెను.

ఆ సంతోషముతో గీతలో చెప్పిన చివరి మాట !

సంజయ ఉవాచ
యత్ర యోగే శ్వరకృష్ణో యత్ర పార్ధోర్ధనుర్ధరః...
తత్రశ్రీర్విజయోభూతి ర్ధ్రువానీతిర్మతిర్మమమ||78||

అంటే - "ఎచట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండునో ఎచ ట ధనుర్ధారి అగు అర్జునుడు ఉండునో అచట సంపదలు విజయమును ఐశ్వర్యమును దృఢ మగు నీతియును ఉండునని నా అభిప్రాయము".

ధనుర్ధారియగు అర్జునుడు బాహ్య శత్రువులను జయించి గీతాజ్ఞానరూపఖడ్గముచే అంతఃశత్రువులను కూడా జయించినభక్తుడు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉండుచోట విజయాదులు వర్ధిల్లును. గీతాజ్ఞానరూప మహాధనస్సు చేపట్టినవాడు నిష్కామభక్తి ధ్యాన వైరాగ్యాదులు అను అస్త్రములు ధరించిన భక్తుని చెంతకు సాక్షాద్భగవంతుని సాన్నిధ్యమువలె విజయాదులు వర్ధిల్లు చుండును .

ఈ విధముగా భగవద్గీత కృష్ణార్జునుల సంవాదము సమాప్తము అవుతుంది.

శ్రీమహాభారతే శ్రీమద్భీష్మపర్వణి శ్రీమద్భగవద్గితా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
మోక్షసన్యాసయోగోనామ
అష్టాదశోధ్యాయః
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః ||
||ఓం తత్ సత్ ||

------------------------------------------------------------------------------------

 

 


|| om tat sat||