భగవద్గీత !!

ద్వితీయోధ్యాయః!

 

 


|| ఓమ్ తత్ సత్ ||
సంజయ ఉవాచ:
తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంత మిదం వాక్యం ఉవాచ మథుసూదనః ||1||

"ఆవిధముగా కనికరముచే కూడినవాడును ,కన్నీరుతో నిండిన వ్యాకుఅలమైన కళ్ళు కనవాడునూ, దుఃఖించుచున్నావాడును అగు అర్జునినితో మధుసూదనుడు ఈ వాక్యములు చెప్పెను"

శ్రీమద్భగవద్గీత
సాంఖ్య యోగము
ద్వితీయోధ్యాయః
శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః

భగవద్గీత సాంఖ్యయోగము ఆత్మతత్వం

సంజయుడు అర్జుని గురించి చెపుతూ " శోకసంవిగ్న మానసం" "అశ్రుపూర్ణాకులేక్షణమ్" " విషీదంతం" అని అంటాడు. ఇవన్నీ అర్జునిని మానసిక స్థితిని వర్ణిస్తాయి. అట్టి స్థితిలోనున్న అర్జునితో మధుసూదనుడు ఇట్లు పలికెను

శ్రీ భగవానువాచ:
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున ||2||

"అర్జునా ? ఈ కష్టసమయమున పామరులు అవలంబించు నదియు అపకీర్తిని కలుగ జేయునదియు స్వర్గమును నిరోధించునదియు అగు ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది ? అధైర్యమును నీచమగు మనోదౌర్బల్యమును వదలి యుద్ధము జేయుటకు సిద్ధము కమ్ము" అని. అంటే అర్జునుని దీన స్థితిని జూచి కృష్ణుడు అతనికి ధైర్యమును పురికొల్పుచున్నాడు .

అయినాగాని అర్జునినికి తన మానసిక వ్యథ తగ్గదు.
" గురూన్ హత్వా..." గురువులను చంపి భోగానలు అనుభవించే కన్నా,
"భైక్ష్యం అపి ఇహలోకే.." ఈ లోకములో బిక్షము ఎత్తుకోవడము ..మేలు !
"న చ ఏతత్ విద్మః" ఇది కూడా తెలియదు
"ఏది" అంటే - " మనము గెలవడము మంచిదా వాళ్ళు గెలవడము మంచిదా అన్నది !
అది కూడా తెలియటల్లేదన్నమాట !!

ఇది ఒక "కృపణుడి" గుణము అదే కృపణత్వము - అంటే ఒక పిసినిగొట్టు. ఏదీ వదలలేని వాడి కథ. ఇంత వ్యథ లోనూ అర్జునిడికి తన వ్యథకి కారణము తెలుసును.

అదే అర్జునుడు అంటాడు "కృష్ణా కార్పణ్య దోషములచే ధర్మాధర్మములు తెలియక ; ఏది నిశ్చయముగా చేయవలెనో తెలియని సందిగ్ధములో నున్నవాడను" అని చెప్పి, -

యత్ శ్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహితన్మే
శిష్యస్తే అహం శాధి మాం ప్రపన్నమ్||7||

"నేను నిన్ను శరణు బొందిన శిష్యుడను . ’"యత్ శ్రేయసం" అంటే ఏది శ్రేయస్కరమో దానిని నిశ్చయముగా నాకు చెప్పుము. నా ఇంద్రియములను శోషింపజేయుచున్న నా దుఃఖమును పోగొట్టుము" మని అర్జునుడు ప్రార్ధించెను.

"శాధి మాం" - నన్ను శాసించు అంటూ పూర్తిగా కృష్ణుడి మీద భారము వేసి
"నయోత్స్య ఇతి " యుద్ధము చెయ్యను అంటూ కృష్ణుడికి చెప్పి " తూష్ణీం బభువ హ" ఇంక మాట్లాడకుండా కూర్చుంటాడు.

"దృష్ట్వాతు పాండవానీకమ్.." అన్న మాటనుంచి "నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభువ హ" (2.09) అని అర్జునుడు రథము మీద మాటలాడకుండా చతికిలబడడము వఱకు మనము విన్నది శోకము మోహము .

ఈ శోకమోహాలు పుట్టడానికి కారణము మమత్వమే. అర్జునుడు "వీరు నావారు" "నేను వీళ్ళవాడను" అన్నభావన వలన భ్రాంతిలో పడ్డాడు. దీనిలోంచి బయట పడడానికి అంటే ఈ శోకమోహాల ను అధిగమించడానికి ఆత్మ జ్ఞానమే ముఖ్యము. అర్జునిని ఉదాహరణగా ఉంచుకొని భవంతుడు లోకసంగ్రహార్థము ఆత్మ గురించి తన దివ్యమైన ఉపదేశమును మొదలెడతాడు".

శ్రీభగవానువాచ:
"ఆశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే"|
గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||

"అర్జునా ! నువ్వు శోకింప దగని విషయము గూర్చి శోకించు చున్నావు. పెద్ద పెద్ద మాటలు కూడా చెపుతున్నావు .జ్ఞానులు మరణించిన వారి గురించి గాని జీవించి యున్న వారిని గురించి గాని దుఃఖింపరు"

ఎందువలన శోకింపరాదు అన్న ప్రశ్నరావచ్చు.
వాళ్ళు నిత్యులు కనక .
వాళ్ళు ఎలానిత్యులు ?
జీవునకీ శరీరమందు బాల్య యవ్వన వార్ధక్యములు అను అవస్థలలాగా మరణానంతరము కూడా వేరొక అవస్థ అనగా వేరొక శరీరము కలుగు చున్నది".
అంటే అత్త్మ నిత్యము అన్నమాట

ఈ విధముగా మొదలుపెట్టి కృష్ణుడు అర్జునునికి అత్మ యొక్క తత్త్వము గురించి బోధింప సాగెను.

ఆత్మ నిత్యమే అనుకుందాము. అయితే ఆత్మ పోయింది అనే శోకము లేకపోయినా ఈ చలి వేడి సుఖ దుఃఖాలవలన దేహికి శోకము ఉండవచ్చుకదా అనిపించవచ్చు.

దానికి కృష్ణుడు వాటిని అంటే ఆ శితోష్ణ సుఖదుఃఖాలను "తితిక్షస్వ" భరించు అంటాడు ( 2.14) అయితే భరిస్తే ఏమి ప్రయోజనము అన్న ప్రశ్న మళ్ళీ వెంటనే వస్తుంది
దానికి కృష్ణుడు ఇలా సమాధానము ఇస్తాడు:
శ్రీభగవానువాచ
యం హి న వ్యధయన్త్యేతే పురుషం పురుషషభ|
సమ దుఃఖ సుఖం ధీరం సోsమృతత్వాయ కల్పతే||(2.15)||
ఇది ముఖ్యమైన మాట. ఏవరిని అయితే-
"ఏతే" అంటే ఈ శీతోష్ణ సుఖదుఃఖాలు
"న వ్యధయన్తి" - భాధించవో , ఇంకా ఎవరు
"సమ దుఃఖ సుఖం"- సుఖాలు దుఃఖాలమిద సమము గా ఉంటాడో
అట్టి వాడు , అంటే అట్టి వివేకము గలవాడు - మోక్షాని కి అర్హుడవుతాడు అన్నమాట.

అందుకని కృష్ణుడు అర్జునినికి ఇలా చెపుతాడు

" అర్జునా శబ్ద స్పర్శాది విషయ సంయోగములు అ స్థిరములయి యున్నవి. కాబట్టి వాటి సుఖ దుఃఖముల యందు సమ భావము కలిగి యుండుము."

అసత్యములైన దేహాదులకు ఉనికి లేదు. ఎందుకు అంటే పుట్టుకముందు ఆ దేహము లేదు. అదే దేహము మరణాంతరము లేదు. అది శాశ్వతము కాదు. ఆత్మ ఒక్కటి యే శాశ్వతమైనది. ఈ సమస్త ప్రపంచము పరమాత్మ చే వ్యాపించబడి నాశ రహితమై యున్నది. యదార్ధముగా ఈ ఆత్మ దేని చేతను చంపబడుట లేదు ఆత్మకు చావు పుట్టుకలు లేవు. ఇది అనాది ".

"వాసాంసి జీర్ణాని యథావిహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి"||2.22||

"మనుజుడు చిరిగి పోయిన పాత బట్టలను విడచి నూతన వస్త్రములను ధరించు నట్లు దేహి యగు ఆత్మ శిధిల మైన పాత శరీరము వదలి క్రొత్త శరీరము ధరించు చున్నది".
ఇప్పుడు కృష్ణుడు ఆత్మయొక్క ప్రత్యేకత చెపుతాడు.

"న ఏనం ఛిన్దన్తి అస్త్రాణి" - దీనిని అస్త్రములతో చేదించలేము
"న ఏనం దహతి పావకః" - దీనిని నిప్పు కాల్చలేదు
"న చ ఏనం క్లేదయన్తి ఆపః" - దీనిని నీరుకూడా తడపలేదు
"న శోషయతి మారుతః" - దీనిని మారుతి శోషింపచెయ్యలేడు.
"అయం అవ్యక్తః" - ఇది (అంటే ఈ ఆత్మ) ఇంద్రియములకు గోచరింపనివాడు
"అచిన్త్యః - చింతిఫ సక్యము కానివాడు
" అవికారః" - వికారము లేని వాడు.

అంటే కృష్ణుడు అన్నమాట "ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానిది మనసు చే చింతింప శక్యము కానిది నిర్వికారముకలది అని తెలిసికొని నీవు చింతింప తగదు" అని.

కృష్ణుడు ఆత్మ గురించి ఇంతాచెప్పి, మళ్ళీ పొనీ ఈ ఆత్మ నిత్యము కాదు అనిత్యమే అనుకుందాము. అలా అయినాగాని నీవు దుఃఖించడానికి తగదు (2.26). ఎందుకు అంటే
"జాతస్య హి ధ్రువో మృత్యుః
ధ్రువం జన్మ మృతస్య చ " ||2.27||

"అర్జునా. పుట్టిన వానికి చావు, మరణించిన వానికి పుట్టుక తప్పదు". జననమరణములు తప్పించలేనివి కనుక కూడా దుఃఖించ పనిలేదు. అదేకాదు ఈ ప్రాణులు పుట్టుకపూర్వము మనకు తెలియదు పుట్టినతరువాత మధ్యలో మనకి కనిపిస్తాయి. మళ్ళీ మరణము తరువాత మళ్ళీ అగోచరము అవుతాయి. అంటే దేహము కనపడని స్థితిలోనుంచి వచ్చి మళ్ళీ కనపడని స్థితిలోకి వెళ్ళాడన్నమాట . అలాంటి దానిగురించి దుఃఖము ఎందుకు అని.(2.28)

ఈ ఆత్మ అన్నది సులభముగా అందరికీ అర్థము అవ్వదు. ఈ ఆత్మ కనపడనిది కనుక అందరికీ ఆశ్చర్యమే అవుతుంది (2.29)

"దేహీ" అంటే దేహములో ఉండే ఈ ఆత్మ. ఆత్మ నిత్యము. చంపబడనిది. దేహమును వధించినా దేహి వధింపబడదు. అందుకని కూడా దుఃఖము వలదు అని.

అంటే ఇప్పుడు చెప్పినది అంతా పారమార్థికముగా దుఃఖము వలదు అని.
అయితే ఈ పరమార్థతత్త్వము సంగతి వదిలేసి ఈ లోకములో ధర్మాధర్మములద్వారా అలోచిస్తే ఎలాగ ఉంటుంది ?
అప్పుడు కృష్ణుడు పారమార్థికముగా కాక తన ధర్మము ను అనుసరించి చూచినా అర్జునుడు తన ధర్మము నుంచి చలించరాదని మళ్ళీ ఇంకో విధముగా చెపుతాడు.

యుద్ధము క్షత్రియ ధర్మము . యుద్ధము చేసి స్వర్గమును పొందే అవకాశము అదృష్టవంతులకే దొరుకుతుంది. స్వధర్మము విడిచి యుద్ధము చేయకపోతే అపకీర్తిపొందుతావు. యుద్ధములో హతమైతే స్వర్గము పొందుతావు. యుద్ధములో గెలిస్తే ఈ భూమిని అనుభవిస్తావుఅని.
అంటే స్వధర్మము అయిన క్షత్రియ ధర్మము అనుసరించడమే మంచిది అన్నమాట.
అలాగ స్వధర్మము అనుసరించేవారికి కృష్ణుని ఉపదేశము ఇది-

శ్రీభగవానువాచ:
సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ|
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి ||2.38||

"సుఖ దుఃఖ ములందును జయాపజయము లందును సమ బుద్ధి కలిగి యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. అట్లైన నీవు ఎటు వంటి పాపమును పొందవు " అని చెపుతాడు.

ఈ విధముగా ఆత్మస్వరూప జ్ఞానము చెప్పి, ఎందుకు శోకించరాదు అన్నమాట సాంఖ్యయోగము ఉపదేశము ద్వారా అర్జునినికి బోధిస్తాడు.

అయితే కృష్ణుడు సాంఖ్యయోగము బోధించి ఆగిపోలేదు.
సాంఖ్యములో బోధించిన అత్త్మజ్ఞానము కలగాలి.
ఈ ఆత్మ జ్ఞానము చెపితే లేక వింటే వచ్చే జ్ఞానము కాదు.
వేలకొలది మనుష్యులలో ఒకడికే ఆత్మ సాక్షాత్కారమౌతుంది .
అలా అయితే ఈ జ్ఞానము ఏలా కలుగుతుంది అన్న ప్రశ్న వస్తుంది.

ఆ జ్ఞానము కర్మబంధనములనుంచి బయటపడితే యోగబుద్ధి ద్వారా కలుగుతుంది.

అందుకే కృష్ణభగవానుడు కర్మ యోగముగురించి అంటే కర్మ బంధనములనుంచి విడివడగల యోగాన్ని విశదీకరిస్తాడు.

దేనిమీద అయినా ప్రేరణ కలగడానికి ముందు దాని గొప్పదనము తెలియాలి .
అందుకని కర్మయోగము ఏట్లా అనుష్ఠానము చేయ్యాలి అన్నది వదిలేసి, కృష్ణ భగవానుడు కర్మయోగము యొక్క మహిమ గురించి ఇట్లు చెప్పెను. అదిమహత్తరమైన విషయము.

శ్రీభగవానువాచ
నేహాభి క్రమనాశోsస్తి ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||40 ||

ఈ కర్మయోగములో
అభిక్రమనాశః - ప్రారంభించినది నాశనమగుట ( నిష్ఫలమగుట) లేదు
ప్రత్యవాయో - దోషము
న విద్యతే - లేదు
అంటే నిష్కామ కర్మ మొదలేట్టితే నిష్ఫలమవ్వడము లేదు.
అస్య ధర్మస్య స్వల్పమపి - ఈ నిష్కామ కర్మ కొంచెము చేసిననూ
త్రాయతే భయాత్ - భయము నుంచి రక్షించును.

ఏంత చిన్నపని నిష్కామము గా చెసినా అది జీవుని సంసారభయమునుంచి రక్షించును.
అంటే నిష్కామ కర్మ చేయునివానికి సంసార బంధనముల గురించి భయము తొలగుట ఒక మహత్తర భాగ్యము.

ఈ కర్మయోగానుష్ఠానమునకు అంటే అనుసరించడానికి నిశ్చయముతో కూడిన బుద్ధి ఒక్కటే కావాలి.

అందరికీ ఆ బుద్ధి ఉండకపోవచ్చు అంటూ ఉదాహరణ చెపుతాడు .
"వేదవాదరతాః పార్థ" ! - "ఓ పార్థా !వేదము లోని కర్మకాండే తప్ప ఇంకో మార్గము లేదు అనేవారికి కర్మయోగము అనుసరించడానికి కావలసిన "నిశ్చిత" బుద్ధి ఉండదు". వాళ్ళకి స్వర్గమే అత్యుత్తమము అన్న అభిప్రాయముతో భోగ ఇశ్వర్యము ప్రాప్తికోసము అనేక మార్గములు చెపుతారు. వారు చెప్పే కర్మలు పునర్జన్మలకు కారణం. అలాగ భోగ ఈశ్వర్యములకు ఆకర్షింపబడినవారు వారి కోరికలతో బుద్ధి అపహరించ బడిన వారు అవుతారు. అట్టి వారికి నిశ్చలత ఉండదు. (2.42 - 44)

అందుకని కర్మ యోగము గురించి బోధిస్తూ , కృష్ణుడు అర్జునినితో ఇలా అంటాడు:

'ఓ అర్జునా " నిస్త్రైగుణ్యో భవ" అంటే నీవు త్రిగుణములను వదలిన వాడవు కమ్ము. ద్వందములు లేక నిరంతరము శుద్ధ సత్యము నాశ్రయించి యోగ క్షేమముల దృష్టి లేనివాడవై ఆత్మ జ్ఞానివి కమ్ము!'.(2.25). అలా కర్మయోగముగురించి చెపుతూ కర్మ యోగము యొక్క ముఖ్య సూత్రము సూక్ష్మము గా చెపుతాడు కృష్ణుడు.

శ్రీభగవానువాచ
కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన ||47||

"నీకు కర్మ చేయుట యందే అధికారము కలదు . కర్మఫలము లందు ఆసక్తి ఉండకూడదు". ఇది చాలా ముఖ్యమైన మాట.

అయితే కర్మఫలములమీదా ఆసక్తి ఉండకోడదు అంటే మరి కష్టపడి కర్మ చేయడమెందుకూ అని కర్మలే మానకోడదు.

కర్మఫలముమీద కోరికతో కర్మ చేయకూడదు . అయితే కర్మ ఎలాచెయ్యాలి అన్న ప్రశ్న వస్తుంది. దానికే సమాధానముగా కృష్ణుడు ఇలాచెపుతాడు.

"యోగస్థః - యోగావస్థలో ఉండి( కర్మచెయ్యి)
"సంగం త్యక్త్వా"- కర్మఫలముల పై ఆసక్తిలేకుండా
"సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వా"- ఫలము వచ్చినా రాకపోయినా సమముగా భావించి
"కురు కర్మాణి"- కర్మ చెయ్యి !

అంటే కృష్ణుడు అర్జునిడికి ఇలాబోధిస్తాడు
"సమత్వ బుద్ధితో కూడి నీవు నిష్కామ కర్మను చేయుము"అని

అయితే సమత్వ బుద్ధితో చేయడము వలన ఫలము ఏమిటి?
సమత్వ బుద్ధి కలవాడు పుణ్యపాపములను రెండిటినీ ఈ జన్మలోనే విడుచుచున్నాడు(2.50).
అంటే మోక్షము పొందుచున్నాడు అన్నమాట.
అది ఏలా గ అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానము
సమత్వ బుద్ధితో కర్మచేడమువలన సత్త్వశుద్ధి పొందుతాడు.
సత్త్వ శుద్ధి పొంది పరమాత్మ ధ్యానము చేస్తే అప్పుడు ఆత్మ సాక్షాత్కారము.

అదే కృష్ణుడు చెప్పిన మాట
శ్రీభగవానువాచ
యథా స్థాస్యతి నిశ్చలాతదా యోగమవాప్యసి|| || 53||

అంటే " బుద్ధి ఎపుడూ చలించనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలచి యుండి సమాధిపొందు నో అపుడు నీవు ఆత్మ సాక్షాత్కారము నొందగలవు" అని చెప్పును.

అపుడు అర్జునునికి అట్టి యోగ సమాధిలో నున్నవాని లక్షణములు ఏమి అని సందేహము వచ్చెను.

అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కాభాషాసమాధిస్తస్య కేశవ ||54||

అంటే సమాధియందుండు స్థితప్రజ్ఞు డగు జీవన్ముక్తుని యొక్క లక్షణములు ఎట్లుండునని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగెను.

అపుడు శ్రీకృష్ణుడు స్థిత ప్రజ్ఞుని లక్షణములను క్రింది విధముగా వివరించెను.

" ( ఎవరైతే) మనస్సునందలి నందలి కొరికలను సంపూర్ణముగా వదలి నిరంతరము ఆత్మయందే సంతుష్టిని పొందు చుండునో దుఃఖమునందు కలత సుఖమునందు ఆసక్తి లేనివాడై, కోరికలు లేని వాడై, ప్రియము కలిగినప్పుడు ఆనందము అప్రియము కలిగి నప్పుడు ద్వేషము లేనివాడు స్థిత ప్రజ్ఞుడు" (2.55-57). ఆ స్థిత ప్రజ్ఞుని ప్రతిభ ఏమిటి తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకోనునట్లు ఇంద్రియములను విషయములందు ఆశక్తి తొలగించి వానిని వెనుకకు మరలుచేయగల వాడు అన్నమాట ( 2.58). అందుకే వానిని స్థితప్రజ్ఞుడు అందురు.

విషయములందు అసక్తి వలన కలుగు దుఃఖములగురించి వివరించుచూ కృష్ణభగవానుడు ఇట్లు చెప్పెను.

శ్రీభగవానువాచ
"క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః|
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణస్యతి"||63||

"మనుజుడు ఇంద్రియాది విషయములంయందు ఆశక్తి యుండుట వలన కొరిక . కోరిక వలన కొపము, కోపమువలన అవివేకము .అవివేకము వలన మరపు మరపు వలన బుద్ధి నాశము . క్రమముగా సంభ వించు చున్నవి. మనోనిర్మలత్వము కలిగిన మనుజునకు సమస్త దుఃఖములు ఉప శమించు చున్నవి ఆత్మ చింతన లేని వానికి సుఖము లభించదు. " నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి" అనగా ఇంద్రియనిగ్రహము విషయనిత్యాగము అహంకార మమకార రాహిత్యము తో శాంతిని పొందును.

మళ్ళీ ఇంద్రియ నిగ్రహము లేని వారిగురించి చెపుతూ- ఇంద్రియాల వెంట పడే నిలకడలెని వారి మనస్సు బుద్ధిని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహము ఉన్నవారి ప్రజ్ఞ ప్రతిష్ఠ మౌతుంది.

ఎవరికి శాంతి లభిస్తుంది అన్న మాట చెపుతూ కోరికలు ఎవరిలో చేరిపోతాయో వారు శాంతి పొందుతారు. కోరికలు కోరుకునే వాడికి కాదు అని. అలాగే అన్ని భోగాలను వదిలి దేనిని కోరక అహంకారము మమకారములు లేక సంచరించే వాడు శాంతి పొందుతాడు అని.

"ఇంద్రియనిగ్రహము విషయనిత్యాగము అహంకార మమకార రాహిత్యము మొదలైనవి సాధన చేయుచూ రాగా జీవ బ్రహ్మైక్యము సిద్ధించును కీటకము బ్రమరముగా మారు విధముగా జీవుడు బ్రహ్మస్వరూపుడై వెలయును"

ఈ విధముగా శ్రీకృష్ణుడు సాంఖ్యయోగము , కర్మయోగము తరువాత సన్యాస యోగమును కూడా అర్జునినకు బొధించెను.

నిజ జీవితములో కూడా మనుజుడు ఒక్కొక్క సమయమున తన ఎదురగు సమస్యలతొ పోరాడ లేక అధైర్యము పిరికితనము నకు లొనయి చేతకాని వలె యగుట సహజము ఆసమయమున నీరస మావహించి యుండును. దిక్కుతోచని స్థితి ఏర్పడును. ఏపని చేయ వలెనో నిశ్చయముగ తెలియని స్థితిలో నుండును. అట్టిసమయమున శ్రీ కృష్ణుని బోధ ఎంతయో ఉపకరించును

ఈ సమస్యల గురించి మనము శోకించుట తగదు. ఏ కార్యములకైననూ మనము నిమిత్తమాత్రులమే కనుక ఫలితమును ఆశించక ధర్మము నిరవేర్చు దిశగా కార్యము సానుకూలపరచు కొనుట ఉత్తమము. శరీరము యొక్క అశాశ్వతత్వమును మాటి మాటికి తలచుకొను చుండిన సమస్య యొక్క తీవ్రత బలహిన పడును. ఆత్మ ఒక్కటియే శాశ్వత మైనదని మననము చేసికొనవలెను.

సమస్యల వలయములో అంటే సమస్యలలో చిక్కు బడి నప్పుడు పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నుండుటకు గట్టి ప్రయత్నము చేయ వలెను అప్పుడు మనస్సు యొక్క చంచలము ఆగి , మనో నిర్మలత్వము కలిగి సమస్యలు పరిష్కరించుటకు కావలసిన ధైర్యము శాంతియు లభించును .

|| ఓమ్ తత్ సత్ ||
శ్రీభగవానువాచ:
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాsస్యా మన్తకాలేsపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి||72||
" ఇది అంతయూ బ్రహ్మసంబంధమైన స్థితి . దీనిని పొందివాడు మరల మోహపడడు.అంత్యకాలమందు కూడా ఇట్టి స్థితియందున్నవాడు బ్రహ్మానందమును పొందుచున్నాడు"
|| ఓమ్ తత్ సత్ ||

|| ఓమ్ తత్ సత్ ||