భగవద్గీత !
!! తృతీయ అధ్యాయము !!
! కర్మయోగము.!!!
|| ఓమ్ తత్ సత్ ||
అర్జున ఉవాచ:
జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన|
తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ||
"ఓ కృష్ణా జ్ఞానము కర్మము కంటే శ్రేష్ఠమైనది అని నీ అభిమతమైతే మరి ఈ భయంకరమైన కర్మ లో నన్ను ఎందుకు ప్రవర్తింపచేయుచున్నావు"
భగవద్గీత
కర్మయోగము
మూడవ అధ్యాయము
శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః
"నహి కశ్చిత్ క్షణమపి" - అంటే ఒక్క క్షణముకూడా కర్మ అంటే పని చేయకుండా ఉండలేము అంటూ
ఈ అధ్యాయమంతా కర్మ సంబంధమైన విషయాలతో నిండినది.
కర్మ సంబంధమైన విషయాలు అంటే కర్మ ఎందుకు చెయ్యాలి,
ఎటువంటి కర్మ చెయ్యాలి, చెయ్యకపోతే ఏమి అవుతుంది , చేస్తే ఏమి అవుతుంది,
అన్నీతెలిసికూడా మనుష్యుడు ఎందుకు తప్పుడు కర్మ చేస్తాడు అన్నవిషయాలన్నమాట.
అన్నీ కర్మ సంబంధమైన విషయాలు కాబట్టి దీనిని కర్మ యోగము అన్నారు.
ఈ అధ్యాయము అర్జునుని ప్రశ్న తో ప్రారంభము అవుతుంది.
" ఓ కృష్ణా ! 'బుద్ధిః కర్మణా జ్యాయసీ చేత్'
అంటే బుద్ధి యోగము అంటే జ్ఞానయోగము కర్మ యోగముకన్నా శ్రేష్ఠమైనది అని
నీ అభిప్రాయమైతే నన్ను ఎందుకు ఈ కర్మతో కూడిన ఘోరమైన యుద్ధము చేయమంటావు " అని.
ఈ ప్రశ్నకు కారణము సాంఖ్యయోగములో కృష్ణుడు చెప్పిన మాటలే.
సాంఖ్యయోగములో ముందు జ్ఞానయోగము ఆత్మను గురించి ఉపదేశించి,
తరువాత నిష్కామ కర్మగురించి ప్రశంసాత్మకముగా చెప్పి,
మరల స్థితప్రజ్ఞుని లక్షణములు ఇంద్రియ నిగ్రహ సాధనములు చెప్పి,
చివరి శ్లోకాలలో బ్రాహ్మీ స్థితిని, జ్ఞాన అనుభవమును వర్ణించి చెప్పుట వలన
జ్ఞానయోగమే శ్రేష్ఠము అని అనిపించవచ్చు.
కానీ అర్జునిడితో మాత్రము 'కర్మణ్యేవాధికారః తే'
అంటే 'నీ కు కర్మలయందే అధికారముంది.
కర్మలు చేయకుండా ఉండడములో నీకు ప్రీతి కలుగనీయకు' అని
కర్మ చేయడమే కర్తవ్యము అని కుండ బద్దలికొట్టినట్టు చెప్పాడు.
భక్తుల శ్రేయస్సుకి సాంఖ్యబుద్ధిని సాధనముగా చెప్పి
తనకు కర్మలు చేయమంటే అర్జునిడికి కలత రావడము సహజమే
ఆందుకనే అర్జునుడు
' ఓ జనార్దనా!కర్మల కంటే జ్ఞానమే శ్రేష్టమని నీ అభిప్రాయమైతే
మరి నాకెందుకీ ఘోరమైన కర్మ విధిస్తున్నావు' అని అడుగుతాడు.
అంతే కాదు అర్జునుడు మళ్ళీ అంటాడు -
"తదేకమ్ వద" అంటే ఏదో ఒక్కటే చెప్పు. అంటే ఏది?
"ఏదైతే నాకు నిశ్చయముగా శ్రేయస్సు కలిగించునో అదొక్కటే చెప్పు"!!
అప్పుడు కృష్ణుడు విశదీకరిస్తాడు:
శ్రీభగవానువాచ
లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ |
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ || ( 3.03)
"ఓ అర్జునా నాచేత పూర్వములో రెండు విథములగు అనుష్ఠాన క్రమములు చెప్ప బడినవి.
ఒకటి జ్ఞానమార్గము పై పోవువారికి జ్ఞానయోగము
రెండవది కర్మమార్గము పై పోవువారికి కర్మయోగము అని"
అంటే రెండు మార్గములు ఉన్నాయి అని.
ఇది కూడా ముఖ్యమైన మాటే.
ఎందుకు అంటే తత్త్వ విచారణలో కొంతమంది
రెండూ ( జ్ఞాన కర్మయోగాలు) కలిపి ఒకటే మార్గము అని వాదించే వారుంటారు.
కాని భగవద్గీతలో వీటికి గమ్య స్థానము ఒకటే అయినా
ఇవి రెండు వేరే మార్గాలు అని నిశ్చయముగా చెప్పినట్టే.
కొందరు తత్వ విచారణ యందు ఆశక్తి కలిగి ఉంటారు.
వారు జ్ఞాన యోగులు .
కొందరు కర్మ యందు ఆశక్తి కలిగి ఉంటారు .
వారిని కర్మయోగులని చెప్ప వచ్చును.
అందరికీ ఒకటే మార్గమని లేదు.
కర్మ యోగములో కూడా మళ్ళీ కర్మ అంటే ఏమిటీ అన్న ప్రశ్న ముఖ్యము.
కర్మలో కామముతో చేసేకర్మలు ,
కామము లేకుండా చేసే కర్మలు ఉంటాయి.
కామము తో చేసే కర్మలు చెడు కర్మలు.
కామము లేకుండా చేసే కర్మలు మనస్సుని మంచి మార్గములో పెట్టు మంచి కర్మలు అనవచ్చు.
అసలు కర్మలే చెయ్యకపోతే చెడు కర్మలు ఉండనే ఉండవు కదా
అని కర్మత్యాగము గురించి మన ఆలోచనలు రావచ్చు.
కృష్ణుడు కర్మయోగము గురించి చెపుతూ కర్మ త్యాగము చేయడముతో ,
అంటే కర్మ చేయకుండా ఉండడము వలన, మనుష్యుడు సిద్ధిపొందడు.
నిష్కామకర్మ వలనే సిద్ధి పొందును అని చెపుతాడు.
ఆ విథముగా కృష్ణుడు కర్మత్యాగాన్నిఅనుమానం లేకుండా నిషేధిస్తాడు.(3.04)
ఇంకా చెపుతూ ప్రకృతి వలన పుట్టుకతో వచ్చిన పుట్టిన గుణములవలన
ఏ వ్యక్తి కర్మ చేయకుండా ఒక క్షణము కూడా కూడా ఉండలేడు.
ఎవడు ఇంద్రియములను మనస్సుచే నియమించి అంటే తన అధీనములో ఉంచి ,
వానిచే మోహము లేని వాడై , కర్మని ఆచరించునో అతడు ఉత్తముడు అని(3.07).
కర్మ త్యాగముకన్నా కర్మ చేయటమే మేలు.
కర్మ చేయకపోతే చిత్తశుద్ధి కలగదు.
చిత్తశుద్ధిలేకపోతే జ్ఞానము అంకురించదు.
జ్ఞానము లేకపోతే మోక్షము ఉండదు.
కర్మ చేయక పోతే ఈ దేహ యాత్ర కూడా సాగదు.
అందుకని కర్మ చేయవలసినదే !
అయితే ఎలాంటి కర్మ చెయ్యాలి?
- "నియత కురు కర్మత్వం"- (3.08)
"శాస్త్ర నియతమగు కర్మ చేయవలెను".
'శాస్త్ర నియతమగు కర్మ " అన్నది కూడా కొంచెము సందిగ్ధమే .
ఏ శాస్త్రము అన్న ప్రశ్నరావచ్చు.
శాస్త్రనియతమైన కర్మ అంటే భగవత్ప్రీతికరమైన
లోకహితముకొఱకు చేయు పనియే నియత కర్మ.
ఇంకా చిన్నది గా చెప్పలంటే
లోక హితము కొఅకు చేయు కర్మఒక్కటే నియత కర్మ.
అట్టి కర్మే యజ్ఞము కూడా.
అట్టి కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయవలెను.
భగవంతుని కొఱకు చేయబడిన కర్మలు యజ్ఞములు.
ఆ కర్మలే (యజ్ఞము అనబడినప్పటికీ) ఫలాపేక్షతో చేసితే బంధాలు (3.9).
ఆ యజ్ఞము అన్నమాటగురించి చెపుతూ కృష్ణుడు ఇట్లా అంటాడు.
" సృష్ఠిలోనే బ్రహ్మ ప్రజలతో సహా ప్రజలకోరికలు తీర్చుమార్గముగా యజ్ఞములను సృష్ఠించెను.
ఆ యజ్ఞములను చేయుచూ ప్రజలు దేవతలనూ ,
దేవతలు ప్రజలనూ తృప్తి పరచుచూ,
ఉత్తమ స్థాయిలో శ్రేయస్సు పొందగలరు అని" (అని బ్రహ్మ ఆదేశము!).(3.10,11)
అయితే యజ్ఞము ఎందుకు?
పూర్వములో యజ్ఞము ఎందుకు ముఖ్యమైన కర్మగా ప్రతిపాదించబడినది ?
అన్న ప్రశ్నకి సమాధానముగా కృష్ణుడు చెప్పిన మాట ఇది!
శ్రీభగవానువాచ
" అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాత్ అన్నసంభవః |
యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః"|| (3.14)
"అన్నమువలన ప్రాణులు ,
మేఘమువలన అన్నము,
యజ్ఞమువలన మేఘము ,
యజ్ఞము సత్కర్మ ఆచరణము వలన కలుగుచున్నది.
ఇంకా ముందుకు పోతే సత్కర్మము వేదములవలన,
వేదములు అక్షరబ్రహ్మ ద్వారా కలిగినవి.
అందువలన సర్వత్రా నిండియున్న బ్రహ్మమే
యజ్ఞము లో ప్రతిష్ఠించబడినది అని తెలుసుకొనుము" అని.
అంటే బ్రహ్మము వలన వేదము,
వేదము వలన సత్కర్మ,
సత్కర్మ వలన యజ్ఞము కలుగుచున్నవి .
ఇది ఒక ధర్మ చక్రము.
ఈ ధర్మ చక్రమును ప్రతి వాడు అనుసరించవలెనని కూడా కృష్ణుడు చెపుతాడు.
ఈ చక్రములోని యజ్ఞము, ఫలాసక్తిలేని యజ్ఞము.
అందువలననే కృష్ణుడు ఈ ధర్మచక్రమును ప్రతివారు అనుసరించాలి అంటాడు.
ఈ ధర్మచక్రమును అనుసరించనివాడు అంటే యజ్ఞములను ఫలాసక్తి తో చేసేవాడు అన్నమాట.
ఫలాసక్తి వున్నవాడు వాడి జీవితము వ్యర్థము (3.16)
కర్మ అందరూ చెయ్యాలా ?
కర్మయోగమనే విథి ఎవరికి లేదు?
ఆ ప్రశ్నకి సమాధానము,
అత్మజ్ఞానముపొందినవారికి కర్మ విథి అని లేదు.
జ్ఞానయోగ మార్గములో పోవువారికి కర్మ విథి అని లేదు.
అటువంటి వాళ్లకి, అంటే ఆత్మజ్ఞానము పొందిన వారికి
కర్మచేయడము వలనగాని చేయకపోవడము వలనకాని ఏమీ ప్రయోజనము లేదు.(3.18)
మిగిలిన వాళ్ళూ అందరికీ
అంటే ఆత్మ జ్ఞానమార్గములో పయనించని వారికి,
సాధారణ సంసార సాగరములో పయనించు వారికి
కర్మ తప్పని విథి యే.
అలాంటి వారు కర్మని ఫలాపేక్షలేకుండా చేయవలెనని,
కర్మ ద్వారా మోక్షము పొందవచ్చునని కృష్ణుని మాట(3.19)
ఇలా కర్మవిధిని అనుసరించి మోక్షముపొందినవారెవరు అంటే
జనకుడు మున్నగు వారు నిష్కామ కర్మ చేతనే మోక్షముపొందిరి అని కృష్ణుడు చెపుతాడు.
జనకుడు మున్నగువారు జ్ఞానులు అని మనము వినివుండవచ్చు .
అయితే నిష్కామ కర్మద్వారా మోక్షముపొందినా
కర్మలు వదలకుండా లోకసంగ్రహము కొఱకు నిష్కామ కర్మలు కొనసాగించారు అన్నమాట.(3.20)
ఇక్కడ అర్జునునికి నిష్కామకర్మలు ఆచరించడానికి కృష్ణుడు ఇంకో కారణము చెపుతాడు.
అదే లోకసంగ్రహము.
లోకసంగ్రహముకొఱకు అయినా నిష్కామ కర్మ చెయ్యి అని.
లోకసంగ్రహము తో నాకేమి పని అని అనుకునేటట్టయితే
కృష్ణుడు తననే ఉదాహరణగా చెపుతాడు.
శ్రీభగవానువాచ
"న మే పార్థా అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన"(3.22)
"ఓ పార్థా! నాకు ముల్లోకములలో చేయదగిన కార్యము కొంచెము కూడా లేదు"
అయినా గాని కృష్ణుడు కర్మలోనే ప్రవర్తిస్తున్నాడు.
ఎందుకు?
"మమ వర్త్మ అనువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః"(3.23)
"ఓ పార్థా! మనుష్యులు నా యొక్క మార్గమునే అనుసరింతురు"
అంటే యథా రాజా తథా ప్రజా అన్నమాట గుర్తుంచుకోండి అని కృష్ణుడు చెపుతున్నాడు.
అధికారములో నున్న వ్యక్తి తను ఏమి చెయ్యకుండా
మిగిలిన వారిపై అధికారము చెలాయిస్తే అది జరిగే పని కాదు అని.
శ్రీభగవానువాచ
"యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః"(3.21)
"శ్రేష్ఠమైన వారు ఎలాచేస్తారో అలాగే మిగిలినవాళ్ళు కూడా "
అందుకని అజ్ఞాని ఎంతో ఆసక్తితో అధికమైన ఫలాపేక్షతో ఎలా కర్మలు చేస్తాడో
ఆలాగే అంత ఆసక్తితో ఫలాపేక్ష లేకుండా జ్ఞాని లోకోపకారము కొఱకు కర్మలు ఆచరించవలెను.(3.25)
అయితే ఆసక్తితో కర్మకాండలో మునిగి ఉన్నవారిని
లేపి వద్దు మీరు నిష్కామ కర్మ చేయ్యాలి అని చెప్పడము కన్న,
వారికి జ్ఞాని అగువాడు తనంతట తాను చేయవలసిన పనులను చేసి ,
వారు తన ఆచరణను చూచి
తమంతట తామే మనస్సు మార్చుకొని నిష్కామకర్మలోకి వచ్చుట మంచిది.(3.26)
ఆత్మ జ్ఞానములేని వారు, లేక జ్ఞానము లేనివారు
కర్మప్రభావములో ఎలా వస్తారు అన్నమాటకి సమాధానముగా కృష్ణుడు
కర్మలన్నీ ప్రకృతి గుణములచే చేయబడుతున్నాయి.
మూఢుడు ఆకర్మలు తనే చేస్తున్నాను అనుకుంటాడు.(3.27)
నిజము తెలిసిన జ్ఞాని ఆ గుణములకు దూరముగా ఉంటాడు (3.28).
మరి మనము మాట్లాడుతున్నది జ్ఞానులగురించి కాదు.
అలాగ ఆత్మ జ్ఞానము లేని వారు కర్మ ఎలాచెయ్యాలి అన్నది ఒక ప్రశ్న లేక సమస్య.
దానికి సమాధానము ఆ కర్మలన్నీ భగవంతునికే సమర్పించి చెయ్యాలి అని కృష్ణుని సందేశము (3.30)
ఈ విధముగా కర్మాచరణము గురించి చెప్పికృష్ణుడు మళ్ళీ ఇట్లా అంటాడు.
శ్రీభగవానువాచ
"నిరాశీః నిర్మమో భూత్వా యుద్ధ్యస్వ విగతజ్వరః ||(3.30)||
అంటే కోరికలు లేకుండా మమకారము లేకుండా సంతాపము లేకుండా,
కర్మలను నాకు ( భవంతునికి) సమర్పించి,
యుద్దము చేయుము అని అర్జునినికి చెపుతాడు.
నిష్కామకర్మకి అగ్రస్థానము ఇవ్వడము కోసము శ్రీకృష్ణుడు అంతాచెప్పి
నిష్కామ కర్మ యే తన మతముగా చెపుతాడు
శ్రీభగవానువాచ
"యే మతమ్ ఇదం నిత్యం అనుతిష్ఠన్తి మానవాః|
శ్రద్ధావన్తో అనసూయన్తో ముచ్యంతే తే అపి కర్మభిః "||(3.31)
అంటే "ఏ మనుష్యులు నా మతము ( నా అభిమతమును, అంటే నిష్కామ కర్మను)
శ్రద్ధగా అసూయలేనివారుగా నిత్యము అంటే ఎల్లప్పుడూ అనుసరించెదరో
వారు కర్మబంధమునుంచి కూడా విడువబడుచున్నారు"అని.
కర్మలో కూడా స్వధర్మమే మంచిది పరధర్మము కన్నా.
శ్రీభగవానువాచ
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||(3.35)
చక్కగా ఆచరింపబడిన పరుల ధర్మము కన్న
గుణములు లేకపోయినప్పటికీ తన ధర్మమే మేలు అని.
కర్మసిద్ధాంతము వినుటకు సులభము.
చేయుట కూడా సులభమే.
అయినా అందరూ దీనిని అమలు చేయకపోతున్నారు ఎందుకు?
అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది.
అదే అర్జునుడు అడుగుతాడు
"అథకేన ప్రయుక్తో అయం పాపం చరతి పూరుషః"(3.36)
"అయితే ఎందుకు మానవుడు పాపము చేయుటకు ప్రేరేపింపబడుతున్నాడు ?"
అందులోనూ
"అనిచ్చన్నపి" పాపము చెయ్యాలని కోరిక లేక పోయినా గాని
పాపము చేయుటకు ప్రేరేపింపబడుతున్నాడు.
అంతే కాదు
"బలాదివ నియోజితః" - అంటే ఎవరో బలవంతముగా చేయించినట్లు చేస్తారుట !
అలా పాపకర్మలు ఎందుకు చేస్తారు అన్నమాటకి కృష్ణుడు విశదీకరిస్తాడు.
ఏషః రజోగుణ సముద్భవః కామ: -
దీనికి కారణము రజోగుణమునుంచి పుట్టిన -కామము
ఏషః క్రోధః - ఈ కామమే క్రోధముగా మారుచున్నది.
ఏనం ఇహ వైరిణమ్ విద్ధి-
దీనిని (ఈ కామమును) మోక్షమునకు పరమ శత్రువు గా తెలిసి కొనుము !(3.37)
కోరికలను అణగదొక్క లేక మానవుడు పాపకార్యములకు కట్టుబడుతున్నాడు !
అది ఎలా అణగదొక్కాలి అంటే, ఒక చిన్న సూత్రము చెపుతాడు కృష్ణుడు.
ఇన్ద్రియాణి పరాణి- ఇంద్రియములు గొప్పవే శరీరము కన్నా
ఇన్ద్రియేభ్యః పరం మనః - ఇంద్రియములకన్నా గొప్పది మనస్సు.
మనసస్తు పరా బుద్ధిః - మనస్సు కన్న గొప్పది బుద్ధి
బుద్ధేః పరతః సః - బుద్ధి కన్న గొప్పవాడు వాడు అంటే ఆత్మ.
అలాంటి అత్మ గొప్పదని గ్రహించి అత్మద్వారా మనస్సుని ఇంద్రియములను అదుపులో ఉంచి అప్పుడు
"మహాబాహో కామరూపం శత్రుం జహి "!
ఓ మహాబాహో ! కామరూపముగల శత్రువును జయింపుము !(3.43)
ఈ విధముగా కృష్ణుడు కర్మయోగమును అర్జునినికి బోధిస్తాడు.
అన్వయము ..
అధ్యాత్మిక మార్గమున కర్మమార్గము జ్ఞానమార్గము కూడా ముఖ్యమైన అనుష్టాన విధములు .
మన దైనందిక కర్మలన్నియు ఫలాపేక్ష లేక భగవదర్పిత భావముతో చేసినచో
మనము కర్మబంధములో చిక్కు కొనకుండా ఉండగలము
లేకపోతే కామ్య కర్మ వలన పరిమిత ఫలములను పొందుచూ,
జనన మరణ చక్రములో తగుల్కొని మోక్షమునకు దూరము అవుతాము.
బాహ్యవిషయములందు ఇంద్రియములను సంచరింపనీయక
అంతర్ముఖ మొనరించిన కోరికలు తగ్గించి
ఇంద్రియ నిగ్రహము పొందగలుగుదుము.
మనస్సును ఫలాసక్తిగల ఆ విషయముల నుండి మరలించి
భగవంతుని యందు (ఆత్మ యందు) స్థిరపరచవలెను.
ఏ కార్యము చేసినను నేను చేసితిని అను అహంకారమును విడచి
నాలోగల దైవ శక్తి వలన ఈ కార్యము జరిగినది అను ఎరుక కలిగి యుండి
ఫలితమును కృష్ణార్పణమస్తు అనుకుంటూ భగవదర్పణము గావింప వలెను.
ఒక వ్యక్తి ఇష్టము లేకున్ననూ పాప కార్యములు చేయుచుండుటకు కారణమేమి?
అని అర్జునునికు కలిగిన సందేహమే మనలో చాలా మందికి కలుగుచుండును.
దొంగతనము చేయకూడదను విషయము
దోంగకి కూడా బాగుగా తెలియును కాని
దొంగతనము చేయ చునే ఉన్నాడు.
అనగా అతని పూర్వ జన్మ సంస్కారముల బలముచే
అట్టి కార్యములను చేయు చున్నాడు.
వాటి నుండి తప్పించు కొనలేకపోతున్నాడు.
ఎటువంటి పని చేయుచున్ననూ ,
ఆపనికి సంబందించిన కామమే కారణము.
అనగా కోరికయే కారణము.
ఆ కోరికకు రజో గుణమే కారణము.
రజోగుణము ఒక వ్యక్తి లో ఎక్కువ ఒక వ్యక్తిలో తక్కువగ యుండుటకు పూర్వజన్మ సంస్కారములు కారణము .
మరి ఆ సంస్కారముల నుండి తప్పించు కొనవీలు లేదా? అని ప్రశ్న వచ్చును.
ఈ జన్మలో గల విచక్షణాజ్ఞానముతో దొంగతనము చేయకూడని పని,
నేను చేయను అని నిర్ధారించు కొని ఆ చెడు కర్మ నుండి బయపడవచ్చును.
తనంతట తాను ఆ నిర్ణయము తీసుకొనలేని స్థితిలో యుండినచో
పెద్దల వద్దకు వెళ్ళి వారి సందేశమును అనుసరించి మంచి మార్గము లోనికి మరల వచ్చును.
అట్లు మంచిమార్గము లోనికి మరలిన వారికి దేవతలు తోడుగా ఉంటారు.
అంతేకాదు అటు వంటి భక్తులు తనకెంతో ప్రియమని భగవంతుడే స్వయముగా చెప్పుచున్నాడు.
హోమము తర్పణము (పితృతర్పణము) అతిధి పూజ, బ్రహ్మ యజ్ఞము, వేదాధ్యయనము,
ప్రాణులకు అన్నము ఇచ్చుట ఇవన్నీ భగవత్ ప్రీతికరమైనవి పరోపకారార్ధమైన కర్మలు,
ఇవి బంధము కలుగ జేయవు.
|| ఓమ్ తత్ సత్ ||
శ్రీభగవానువాచ
ఏవం బుద్ధేః పర బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా|
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్||
"ఓ అర్జునా ఈ విధముగా బుద్ధి కన్నా అతీతమైనదానిని గా ఆత్మను ఎరిగి
బుద్ధిచేత మనస్సును అరికట్టి కష్టసాధ్యమైన కామము అనబడు శత్రువును జయింపుము"
||ఓమ్ తత్ సత్ ||
|