భగవద్గీత !!తృతీయ అధ్యాయము!! కర్మ యోగము
"జనకాదయః .. జనకుడు మొదలగు వారు !"
"జనకాదయః .. జనకుడు మొదలగు వారు !"
నిష్కామ కర్మ గురించి చెపుతూ ఎవరికి నిష్కామకర్మ చేయుటకు కావలసిన ఏకాగ్రత రాదో అన్న విషయము మీద "వేదవాదరతాః పార్థ న అన్యద్ అస్తి ఇతి వాదినః" "వేదము చెప్పిన మాటే మాట" అనే వాళ్ళకి ఆ ఏకాగ్రత రాదు అని కృష్ణుడు చెపుతాడు.
అంటే నిష్కామ సిద్ధాంతం వేదములలో లేని మాటా అని కొందరికి అనుమానము రావచ్చు. అది నిరాకరించడము కోసమే కర్మ యోగములో కర్మ ప్రాధాన్యము చెపుతూ , అత్మలోనే తృప్తి పడేవారికి తప్ప మిగిలిన అందరికి కర్మ చెయ్యడము తప్పనిసరి అని చెప్పి ఇంకా ముందుకు వేడతాడు. ఈ విధముగా అంటే ఈ నిష్కామకర్మ ద్వారా , "జనాదయః" అంటే జనకుడు మొదలగువారు మోక్షము పోందారు అని . అంటే ఈ నిష్కామకర్మ సిద్ధాంతము కొత్తది కాదు. చాలామంది దీనిని అనుసరించి మోక్షము పొందారు అని చెప్పడము అన్నమాట.
జ్ఞానయోగములో కృష్ణుడు నిష్కామ కర్మ తనే ( భగవంతుడే) పూర్వకాలములో సూర్యునకు ఉపదేశించినట్లు కూడా చెపుతాడు(శ్లో 4.1).
అసలు మనకు ఏమీ కోరికలు లేకపోయినా , " లోక సంగ్రహ మేవ అపి" లోక కల్యాణము కోసము కూడా మనము కర్మ చేయవలెను.
చివరికి కృష్ణుడు తన జీవితమే ఉదాహరణ గా చెపుతూ , తనకి కర్మ చేయవలసిన అవసరము లేనప్పటికీ కర్మ ఎందుకు చేయుచున్నాడో చెపుతాడు.
యది హ్యహం న వర్తేయం జాతు కర్మాణ్యతన్ద్రితః |
మమవర్త్మాను వర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః ||
" నేను జాగరూకుడనై కర్మ చేయకపోయినచో మనుష్యులు సర్వవిథములుగా నన్నే అనుసరింతురు " అంటే వాళ్ళు కూడా కర్మ చేయ్యరు. అందుకని తను కర్మని ఆచరిస్తున్నట్లు చెపుతాడు. అలాగే జ్ఞానులు కర్మయందు ఫలాసక్తి లేకపోయినప్పటికీ లోకసంగ్రహము కోసము నిష్కామ కర్మ చేయవలెను అని కృష్ణుని సిద్ధాంతము.
జ్ఞానులకే కాదు మనకి కూడా అది వర్తిస్తుంది
అంతేకాదు అలాగే లోకసంగ్రహముకోసము నిష్కామకర్మ చేస్తే
మనము కూడా జ్ఞానమార్గములో ఉన్నట్లే !!
|| ఓమ్ తత్ సత్ ||
|| Om tat sat ||