||భగవద్గీత ||

||నాలుగవ అధ్యాయము ||

||జ్ఞాన యోగము - వచన వ్యాఖ్యానము ||

|| Om tat sat ||

భగవద్గీత
నాలుగవ అధ్యాయము
జ్ఞాన యోగము - యజ్ఞము గురించి !

జ్ఞానయోగము లో కృష్ణుడు యజ్ఞము గురించి చెపుతాడు.

శ్రీభగవానువాచ:
బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా || 24 ||

స|| (యజ్ఞే) అర్పణం బ్రహ్మ | హవిః బ్రహ్మ | బ్రహ్మగ్నౌ బ్రహ్మణా హుతం బ్రహ్మ ఏవ | బ్రహ్మ కర్మ సమాధినా తేన గన్తవ్యం బ్రహ్మ ఏవ |

అంటే
యజ్ఞములో "అర్పణం బ్రహ్మ", హోమము అర్పించబడు సాధనములు బ్రహ్మ !
"హవిః బ్రహ్మ", హోమద్రవ్యములు బ్రహ్మమే !
"బ్రహ్మగ్నౌ" బ్రహ్మము అనెడి అగ్నిలో "బ్రహ్మణాహుతం" బ్రహ్మస్వరూపుడగు యజమాని చేత ఆహుతిచేయబడినది కూడా "బ్రహ్మ ఏవ" బ్రహ్మమే !
"బ్రహ్మకర్మసమాధినా" బ్రహ్మకర్మను చేయు సమాధిలో ఉన్నవాడు
"తేన గంతవ్యం" వాడు వెళ్ళు స్థానము "బ్రహ్మ ఏవ" అది కూడా బ్రహ్మమే !

అంటే యజ్ఞములో అన్నీ బ్రహ్మస్వరూపమే , అట్టి యజ్ఞములో ఏకాగ్ర భావముతో కర్మచేయువాడు పొందు స్థానము కూడా బ్రహ్మమే అని.

ఇక్కడ యజ్ఞములో ద్రవ్యములు సామానులు గురించి చెప్పినట్లే , సమస్తమూ బ్రహ్మస్వరూపమే అని అర్థము. ఆ భావముతో నిష్కామ కర్మ చేయువాడు పొందు స్థానము బ్రహ్మమే అని అర్థము.

అందుకని యేకార్యము అయినా చేసినప్పుడు ఈ భావన తో చేస్తే అది "ఇహా అభిక్రమనాశో న అస్తి" అలా ప్రారంభించినది నాశనమగుట లేదు . ఈ భావన రావడము కోసము ఈ శ్లోకమే పఠిస్తారు చాలా మంది !

ఈ శ్లోకములో చెప్పినది అర్థము చేసుకొని ముందుకు వెడితే అంతా బ్రహ్మమే అయినప్పుడు ఆ బ్రహ్మను ఆరాధించే విధానాలు కూడా అనేకము అన్నది స్ఫురిస్తుంది.

ఇక్కడ యజ్ఞము అన్నది విశదీకరించడము కోసము ముందుగా యజ్ఞములో అనీ బ్రహ్మస్వరూపమే ఏకాగ్రచిత్తముతో చేస్తే వచ్చేది బ్రహ్మమే అని చెప్పి , అప్పుడు కృష్ణుడు యోగులు యజ్ఞము ఏలాచేశారు అన్నది చెపుతాడు.

"దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే "

కొందరు యోగులు దేవతారాధనయే యజ్ఞము గా చేయుచున్నారు - అంటే ఏకాగ్రచిత్తముతో దేవాతారాధన కూడా యజ్ఞమే అన్నమాట.

మరి కొందరు మనస్సుని బ్రహ్మము అనబడు అగ్నిలో ఆహుతిచేసి జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వము పొందుచున్నారు. అంటే దీని అర్థము ఆత్మ అను దానిగురించి విచారణచేసి జీవాత్మ పరమాత్మ రెండూ వేరు కాదు , ఆ రెండూ ఒకటే అనే భావనను నిర్ధారించు కోవడము , అట్టి విచారణే ఒక యజ్ఞము అన్నమాట.

అంటే కృష్ణ భగవానుడు వేదాలలో "మంత్ర తంత్ర యుక్తమైన యజ్ఞమును" , తంత్రము తీసేసి మనస్సులో చేసే విచారణ , మనస్ఫూర్తిగా చేసే పూజలు కూడా యజ్ఞమే అని చెప్పాడు. అంటే వేదాలలో చెప్పిన యజ్ఞములో కావలసిన నలుగురు పురోహితులు అక్కరలేదు. నీ మనస్ఫూర్తిగా నీవే పూజలు అనే యజ్ఞము ద్వారా లేక ఆత్మ విచారణ అనే యజ్ఞము ద్వారా బ్రహ్మము పొందగలవు అని చెపుతున్నాడన్నమాట.

ఇది చాలా గంభీరమైన మాట.

పూర్వకాలములో రాజులకే తప్ప ఇతరులకు అలవికాని యజ్ఞము ఈ విశదీకరణ ద్వారా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది అన్నమాట.

పూర్వకాలములో యజ్ఞము అంటే ఏమిటి అన్నది రామాయణములో బాలకాండ చదివితే తెలుస్తుంది. బాలాకాండలో పదునాలుగవ సర్గ అంతా యజ్ఞము ఎలాచేయబడినది అనే విషయము మీదే . దాంట్లో నలుగురు అధ్వర్యు హోతా ఉద్గాతా బ్రహ్మ అని ఋత్విజులు ఉంటారు. వాళ్ళు నలుగురు నాలుగు వేదాలకి సంబంధించినవారు ! వాళ్ళు చేయవలసిన కర్మలు చాలాఉంటాయి. ఓక చోట దశరథుడు చెపుతాడు:

"నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి"
అంటే - యజ్ఞములో దోషములు ఉంటే - "కర్తా వినశ్యతి" - యజ్ఞకర్త నశించిపోతాడు !

అందుకని ఆందరూ యజ్ఞము సంబంధించిన కార్యక్రమము జాగ్రత్తగా చేయాలి అని దశరథుడు తన మంత్రులకు చెపుతాడు.

అలాగే సగరును యజ్ఞము , అంబరీషుని యజ్ఞము ప్రతి చోటా కూడా ఇదే మాట వస్తుంది.

అంబరీషుడి యజ్ఞములో యజ్ఞపశువు ని ఇంద్రుడు తీసుకుపోతే ఋత్విజులు అంబరీషునికి యజ్ఞపశువు కాని లేకపోతే ఆస్థానములో ఇంకొకరిని తీసుకురావాలి లేకపోతే "నీకే మొప్పు" అంటే, అంబరీషుడు శునశ్శేఫుని తీసుకువచ్చి యజ్ఞపశువు గా నిలబెట్టుతాడు. అంటే ఆ యజ్ఞముల లో కర్మకాండ ప్రధానము.

ఆ యజ్ఞములన్నీ ఫలాభిలాషాతో చేసే యజ్ఞములే.

యజ్ఞము అంటే ఆ కాలములో అది కథ.

అట్టి కర్మకాండ ప్రధానమైన యజ్ఞముతో సమానముగా కృష్ణుడు సామాన్య ప్రజలు చేయగల యజ్ఞములను భక్తులకు విశదీకరించాడు.

అట్టి కర్మకాండ ప్రధానమైన యజ్ఞముతో సమానముగా కృష్ణుడు ఏకాగ్రతతోచేసిన దేవతా ఆరాధన కూడా యజ్ఞమే నని చెపుతాడు.

ఈ యజ్ఞములు మోక్షమే ఫలముగా జరుగు యజ్ఞములు .
ఈ యజ్ఞములకు " సంభారాలు" ఏమీ అక్కర లేదు.
ఈ యజ్ఞములలో ముఖ్యము మన శక్తి సామర్థ్యములే .
ఈ నిష్కామకర్మ అధారముగా చేయబడు ఈ యజ్ఞములలో దోషాలు ( కర్తకు హాని కలిగే దోషాలు ) ఏమీ లేవు. తెలిసి తెలియక చేసిన దోషాలమీద వచ్చే నష్ఠము మోక్షప్రదాయక ఫలితములు లేకపోవచ్చు గాని హాని కలుగు భయము వుండదు.

కృష్ణుడు యజ్ఞము అందరికీ అందు బాటలో ఉంచడము కోసము 24 - 32 శ్లోకాలాలలో పన్నెండు యజ్ఞముల గురించి విశదీకరిస్తాడు అవి 1 దైవ యజ్ఞము (4.25) ;2 బ్రహ్మ యజ్ఞము (4.25) ;3 ఇన్ద్రియసంయమ యజ్ఞము (4.26) ;4 శబ్దాది విషయ నిరోధ యజ్ఞము (4.26); 5 మనోనిగ్రహ యజ్ఞము (4.27) ; 6 ద్రవ్య యజ్ఞము ( 4.28); 7 తపోయజ్ఞము: (4.28); 8 యోగయజ్ఞము (4.28); 9 స్వాధ్యాయ యజ్ఞము (4.28) ;10 జ్ఞాన యజ్ఞము: (4.28); 11 ప్రాణాయామ యజ్ఞము (4.29) ;12 ఆహారనియమ యజ్ఞము (4.30)

ఇంకాఅనేక యజ్ఞములు ఉన్నాయి. వాటి అన్నిటిలోకి జ్ఞాన యజ్ఞమే గొప్పది అన్నట్లు గా కూడా చెపుతాడు.

ఇంకా అనేక యజ్ఞములు ఉన్నాయి అన్నమాటలో ఇమిడి వున్నది ఒక రహస్యము.
అది ఏపని చేసినా నిష్కామ కర్మ ప్రధానముగా చేస్తూ దానినే యజ్ఞముగా భావించి చేయడమే అన్నమాట

ఈ యజ్ఞము అన్న మాట భక్త సముదాయానికి భగవద్గీత అందించిన ఒక ప్రధానమైన ఫలము

||ఓమ్ తత్ సత్ ||
------------------------------

|| ఓమ్ తత్ సత్ ||