||భగవద్గీత ||
||నాలుగవ అధ్యాయము ||
||జ్ఞాన యోగము - శ్లోకాలు - అర్థతాత్పర్యాలతో ||
||ఓమ్ తత్ సత్ ||
శ్రీ భగవానువాచ:
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్ ||
"నాశరహితమైన ఈయోగమును నేను పూర్వము సూర్యునకు చెప్పితిని.
సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించెను.మనువు ఇక్ష్వాకునకు బోధించెను"
శ్రీమద్భగవద్గీత
జ్ఞానయోగము
చతుర్థోఽధ్యాయము
||శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః||
మొదటి అధ్యాయము అంటే అర్జున విషాదయోగము ధృతరాష్ట్రుని ప్రశ్నతో మొదలవుతుంది. రెండవ అధ్యాయము సాంఖ్యయోగములో మొదటి శ్లోకము సంజయుని భాషణతో మొదలవుతుంది. తృతీయ అధ్యాయములో అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది.
మొదటిసారిగా నాలుగవ అధ్యాయము 'శ్రీభగవానువాచ' అంటూ, అంటే కృష్ణ భగవానుని మాటలతో మొదలవుతుంది. అంటే మూడవ అధ్యాయము లో కర్మయోగము బోధించిన కృష్ణుడికి, కర్మయోగము మీద ఇంకా చెప్పవలసిన మాటలు వున్నాయి అన్నమాట.
కర్మయోగము ప్రాచీనమైనది అని, దానిని అనుసరించి "జనకాదయః..." అంటే జనకుడు మొదలగు వారు ముక్తిని పొందారు అని కృష్ణుడు చెప్పగా విన్నాము. ఇంకా కృష్ణుడు కర్మయోగము తనకు అతి ప్రియకరము అన్నట్లు, " యే మే మతం ఇదమ్..", అంటే ఇది నా మతము అని కూడా చెపుతాడు.
ఈ అధ్యాయములో ఆ కర్మయోగముయొక్క ప్రాచీనత వివరిస్తూ కృష్ణుడు, కర్మయోగముయొక్క పుట్టు పూర్వోత్తరాలు చెపుతాడు. ఆ పూర్వోత్తరాలతో ఈ జ్ఞానయోగము మొదలగుతుంది.
||శ్లోకము 1||
శ్రీ భగవానువాచ:
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవేఽబ్రవీత్ ||1||
స|| అవ్యయం ఇమం యోగం అహం వివస్వతే ప్రోక్తవాన్ | వివస్వాన్ మనవే ప్రాహ | మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్ ||1||
||శ్లోకార్థములు||
అవ్యయం ఇమం యోగం - అవ్యయమైన ఈ యోగమును
అహం వివస్వతే ప్రోక్తవాన్ - నేను సూర్యునకు చెప్పితిని
వివస్వాన్ మనవే ప్రాహ - సూర్యుడు మనువుకు చెప్పెను
మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్ - మనువు ఇక్ష్వాకునకు చెప్పెను
||శ్లోకతాత్పర్యము||
భగవంతుడు చెప్పుచున్నాడు:
"అవ్యయమైన ఈ యోగమునునేను సూర్యునకు చెప్పితిని.
సూర్యుడు మనువుకు చెప్పెను. మనువు ఇక్ష్వాకునకు చెప్పెను." ||1||
కర్మయోగము భగవంతుడు ద్వారా మొదటగా సూర్యునకు, సూర్యునిద్వారా మిగిలిన వారికి ఉపదేశించబడినది అన్నమాట. ఇది పరంపరగా వచ్చిన పద్ధతి. అయితే..,
||శ్లోకము 2||
ఏవం పరమ్పరాప్రాప్తం ఇమం రాజర్షయో విదుః |
స కాలేనేహ మహతా యోగో నష్ఠః పరన్తప || 2 ||
స||హే పరన్తప ! ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయః విదుః | మహతా కాలేన స మహతా యోగః ఇహ నష్టః ||2||
||శ్లోకార్థములు||
హే పరన్తప - ఓ పరన్తపా
ఏవం పరంపరా ప్రాప్తం - ఈ విధముగా పరంపరగా వచ్చుచున్న
ఇమం రాజర్షయః విదుః - ఈ యోగము రాజఋషులు తెలుసుకొనిరి
మహతా కాలేన స యోగః - మహత్తరమైన కాలప్రవాహములో ఈ యోగము
ఇహ నష్టః - లోకములో కలిసిపోయినది
||శ్లోకతాత్పర్యము||
"ఓ పరన్తపా, ఈ విధముగా పరంపరగా వచ్చుచున్నఈ యోగము రాజఋషులు తెలుసుకొనిరి.
మహత్తరమైన కాల ప్రవాహములో ఈ యోగము కలిసిపోయినది." ||2||
ఇది రాజ ఋషులు తెలిసుకున్నారు అంటే, అర్జునుడు కూడా అలాగే తెలిసికోవచ్చు, ఇది కష్ఠము కాదు అని ఒక ధ్వని. రాజఋషులు అనడములో రాజ్యమేలే, రాజ్య వ్యవహారములతో మునిగి తేలే రాజులే, ఇది పట్టగలిగినప్పుడు, సంసారసాగరములో మునిగి తేలే సంసారులకు కూడా తగిన యోగము అని కూడా ఇంకో ధ్వని.
కాని, "స కాలేన మహతా యోగో నష్ఠః|".
ఇలా పరంపరగా వచ్చుచున్న నిష్కామకర్మ అనబడు "యోగః" అంటే కర్మయోగము
'కాలేన' కాలప్రవాహములో - 'నష్టః' - కలిసిపోయింది అని.
అంటే అందరూ కర్మయోగములో అసలు మాట మరచిపోయారు అన్నమాట.
నిష్కామకర్మ మహత్తరమైన యోగము. కాలము కూడా మహత్తరమైనదే.
కాలములో కలిసిపోయిన యోగము అందరూ మరచిపోయారు.
అందుకనే కృష్ణుడు తన భక్తుడు మిత్రుడు అర్జునుడికి,
తద్వారా మళ్ళీ లోకములో అందరికీ ఉపదేశించాడు అని ఇంకో ధ్వని.
||శ్లోకము 3||
స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః |
భక్తోఽసి మే సఖాచేతి రహస్యం హ్యేతదుత్తమమ్ || 3 ||
స|| (త్వం) మే భక్తః సఖాచ అసి ఇతి పురాతనః సః ఏవ అయం యోగః అద్య తే మయా ప్రోక్తః | ఉత్తమమ్ ఏతత్ యోగం రహస్యం హి ||3||
||శ్లోకార్థములు||
మే భక్తః సఖాచ అసి ఇతి - నాభక్తుడవు సఖుడవు అయివున్నావని
పురాతనః సః ఏవ అయం యోగః - పురాతనమైన ఆ ఈ యోగమే
అద్య తే మయా ప్రోక్తః - ఇప్పుడు నాచేత నీకు చెప్పబడినది
ఉత్తమమ్ ఏతత్ యోగం రహస్యం హి - ఉత్తమమైనది రహస్యమైనది కూడా
||శ్లోకతాత్పర్యము||
"నాభక్తుడవు సఖుడవు అయివున్నావని, పురాతనమైన ఆ ఈ యోగమే ఇప్పుడు నాచేత నీకు చెప్పబడినది.
ఈ యోగము ఉత్తమమైనది, రహస్యమైనది కూడా." ||3||
ఇక్కడ చెప్పబడిన కర్మయోగము పురాతనమైనది. కొత్తవిషయముకాదు. రహస్యము. ఎలా రహస్యము అయినది? ఇది కాలప్రవాహములో కలిసిపోయి అందరూ మరచిపోయారు. ఇది ఇప్పుడు ఎవరికి తెలియనిది కాబట్టి రహస్యముగా వుండిపోయినది. ఇంకొకమాట. పూర్వకాలములో జ్ఞాన బోధ తగినవాళ్ళకే చేయబడేది. అందుకని కూడా అది అందరికి అందుబాటలో లేక రహస్యముగా వుండి పోయినది.
||శ్లోకము 4||
అర్జున ఉవాచ :
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః|
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి || 4 ||
స|| భవతః జన్మ అపరం | వివస్వతః జన్మ పరమ్ | ఆదౌ త్వం ప్రోక్తవాన్ ఇతి ఏతత్ కథం విజానీయామ్ ||4||
||శ్లోకార్థములు||
వివస్వతః జన్మ పరమ్ - సూర్యుని జన్మము వెనుకటిది
భవతః జన్మ అపరం - నీ జన్మము తరువాతది
ఆదౌ త్వం ప్రోక్తవాన్ ఇతి - ఆదిలో నీవు చెప్పితివి అన్నది
ఏతత్ కథం విజానీయామ్ - దీనిని ఎట్లు తెలిసికొందును
||శ్లోకతాత్పర్యము||
"సూర్యుని జన్మము వెనుకటిది. నీ జన్మము తరువాతది
ఆదిలో నీవు చెప్పితివి అన్నది, దీనిని ఎట్లు తెలిసికొందును." ||4||
ఆప్పుడు అర్జునుడికి మళ్ళీ సందేహము వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ తన ఎదురుగుండా వుండి, దేవకీ గర్భములో పుట్టిన కృష్ణుడు,
తనే పూర్వకాలములో సూర్యునికి ఉపదేశించాను అంటే అది ఎలాకుదురుతుంది అని.
అప్పుడు కృష్ణుడు మొదటి సారిగా తన భగవత్స్వరూపము గురించి వివరముగా చెపుతాడు.
||శ్లోకము 5||
శ్రీ భగవానువాచ:
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తానయహం వేద సర్వాణి న త్వం వేత్థ పరన్తప || 5 ||
స|| హే అర్జున ! మే తవ చ జన్మాని బహూని వ్యతీతాని | తాని సర్వాణి అహం వేద | హే పరన్తప ! త్వం నవేత్థ ||5||
||శ్లోకార్థములు||
మే తవ చ జన్మాని బహూని - నాకును నీకును జన్మలు అనేకము
వ్యతీతాని - (అవి) గడచి పోయినవి.
తాని సర్వాణి అహం వేద - వానిని అన్నిటినీ నేను ఎఱుగుదును
హే పరన్తప త్వం నవేత్థ - ఓ పరంతపా, నీవు ఎఱుగవు
||శ్లోకతాత్పర్యము||
"ఓ అర్జునా, నాకును నీకును జన్మలు అనేకము.(అవి) గడచి పోయినవి. వానిని అన్నిటినీ నేను ఎఱుగుదును
ఓ పరంతపా, నీవు ఎఱుగవు." ||5||
సాంఖ్య, కర్మయోగములలో కృష్ణుడే భగవంతుడు అని ధ్వనించే మాటలు చెప్పబడినా,
ఇక్కడ కృష్ణుడు మొదటి సారిగా తన భగవత్స్వరూపము గురించి తనే చెపుతాడు.
(1) తనకి చాలా జన్మలున్నట్లు, " తాన్ అహం వేత్థ సర్వాణి " అవన్నీ తనకు తెలుసు.
(2) " అజోపి " తను పుట్టుక లేనివాడు అయినా , " సంభవామి ఆత్మ మాయయా "
తనకి జన్మ అవసరము లేకపోయినా తన మాయచేత తనే లోకములో పుట్టుతాను అని
(3) అలా ఎప్పుడు, ఎందుకు పుడుతాడు అన్నమాటకూడా ముందు శ్లోకాలలో వస్తాయి.
||శ్లోకము 6||
అజోఽపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోఽపి సన్ |
ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా|| 6 ||
స|| (అహమ్) అజః అపి సన్ అవ్యయాత్మా అపి సన్ భూతానామ్ ఈశ్వరః అపి సన్ స్వాం ప్రకృతిం అధిష్ఠాయ ఆత్మ మాయయా సంభవామి ||
||శ్లోకార్థములు||
అజః అపి సన్ - పుట్టుకలేనివాడనైనను
అవ్యయాత్మా అపి సన్ - నాశరహితస్వరూపము కలవాడనైను
భూతానామ్ ఈశ్వరః అపి సన్ - ప్రాణులకు ఈశ్వరుడనైనను
స్వాం ప్రకృతిం అధిష్ఠాయ - స్వకీయమైన ప్రకృతిని అధిగమించి
ఆత్మ మాయయా సంభవామి - నా యొక్క మాయాశక్తితో పుట్టుచున్నాను
||శ్లోకతాత్పర్యము||
"పుట్టుకలేనివాడను, నాశరహితస్వరూపము కలవాడను, ప్రాణులకు ఈశ్వరుడను
అయినను, స్వకీయమైన ప్రకృతిని అధిగమించి నా యొక్క మాయాశక్తితో పుట్టుచున్నాను." ||6||
భ్హగవంతుడు పుట్టుక లేనివాడు. అయినా పుడుతున్నాడు. ఇక్కడ కృష్ణుడు తనంతట తాను పుట్టుచున్నాను అంటాడు, అంటే తన జన్మ, పూర్వజన్మ కర్మ బంధములవలన కాదు అని భావము.
అలా ఎప్పుడు పుట్టుచున్నాడు, ఎందుకు పుట్టుచున్నాడు అన్న ప్రశ్నలకి కూడా సమాధానము చెపుతాడు కృష్ణుడు.
||శ్లోకము 7||
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానమ్ సృజామ్యహమ్ || 7 ||
స|| హే భారత|| యదా యదా ధర్మస్య గ్లానిః అధర్మస్య అభ్యుత్థానమ్ భవతి తదా ఆత్మానమ్ అహమ్ సృజామి ||7||
||శ్లోకార్థములు||
భారత - ఓ అర్జునా
యదా యదా ధర్మస్య గ్లానిః - ఎప్పుడెప్పుడు ధర్మమునకు హానియు
అధర్మస్య అభ్యుత్థానమ్ భవతి - అధర్మమునకు అభివృద్ధియును కలుగునో
తదా ఆత్మానమ్ అహమ్ సృజామి - అప్పుడు నన్ను నేను సృష్టించుకొనుచున్నాను
||శ్లోకతాత్పర్యము||
"ఓ భారతా, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హానియు, అధర్మమునకు అభివృద్ధియును కలుగునో,
అప్పుడు నన్ను నేను సృష్టించుకొనుచున్నాను." ||7||
అంటే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు.
ఎప్పుడైతే అధర్మము ప్రబలుతుందో అప్పుడు.
అప్పుడు ధర్మమునకు కలిగిన హాని తొలగించడము కోసము అని.
అంటే కృష్ణుడు అవతారపురుషుడు అని.
పుట్టి ఏమి చేస్తాడు?
||శ్లోకము 8||
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 8 ||
స|| సాధూనాం పరిత్రాణాయ దుష్కృతాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే సంభవామి ||8||
||శ్లోకార్థములు||
సాధూనాం పరిత్రాణాయ - సాధువులను రక్షించుటకు
దుష్కృతాం వినాశాయ చ - దుష్కర్మలు చేయువారిని నాశనము చేయుటకు
ధర్మ సంస్థాపనార్థాయ - ధర్మము స్థాపించుటకు
యుగే యుగే సంభవామి - యుగ యుగములలో అవతరించుచున్నాను
||శ్లోకతాత్పర్యము||
"సాధువులను రక్షించుటకు, దుష్కర్మలు చేయువారిని నాశనము చేయుటకు,
ధర్మము స్థాపించుటకు, యుగ యుగములలో అవతరించుచున్నాను." ||8||
అర్జునుడు "నీవు ఇప్పటివాడివి పూర్వములో సూర్యునికి ఎలా చెప్పావు", అని అడిగిన ప్రశ్నకు సమాధానముగా, ఈ రహస్యాలు మనకి తెలుస్తాయి. కృష్ణుడు తాను పుట్టుక లేని వాడనని, నాశ రహితుడననీ సర్వజ్ఞుడనని చెప్పి, తన భగవదవతారముల గురించి మాట్లాడుతూ, ఈ అవతారాలు ఎందుకు అన్నమాట కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్పుతాడు.
అదే దుష్టశిక్షణ, సాధు రక్షణ, ధర్మ సంస్థాపన.
అప్పటి దాకా కృష్ణుడు దేవకీ వసుదేవుల పుత్రుడే అనుకొని, తమని కష్టాలలో ఆదుకుంటాడు అని తెలిసినా,
కృష్ణుడు భగవత్స్వరూపమని అనుకున్నా, అర్జునుడికి, "కృష్ణుడే భగవంతుడు" అన్న మాట, భగవద్గీతలో మొట్టమొదటిసారిగా కృష్ణుడే చెపుతాడు.
||శ్లోకము 9 ||
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఽర్జున || 9 ||
స|| హే అర్జునా | యః ఏవం మే దివ్యం జన్మ కర్మ తత్త్వతః వేత్తి సః దేహం త్యక్త్వా పునః జన్మ న ఏతి | సః మామ్ ఏతి ||9||
||శ్లోకార్థములు||
హే అర్జునా | యః ఏవం మే దివ్యం - ఓ అర్జున ఈ విధముగా నా దివ్యమైన
జన్మ కర్మ తత్త్వతః వేత్తి - జన్మమును కర్మలను యదార్థముగా తెలిసికొనుచున్నాడో
సః దేహం త్యక్త్వా పునః జన్మ న ఏతి - అతడు దేహము వదలి పునర్జన్మ పొందడు.
సః మామ్ ఏతి - అతడు నన్నే పొందును.
||శ్లోకతాత్పర్యము||
"ఓ అర్జునా, ఈ విధముగా నా దివ్యమైన జన్మమును కర్మలను యదార్థముగా తెలిసికొనుచున్నాడో,
అతడు దేహము వదలి పునర్జన్మ పొందడు. అతడు నన్నే పొందును." ||9||
భగవత్స్వరూపము యదార్థముగా తెలిసికొనినవానికి పునర్జన్మ వుండదు అని చెపుతాడు కృష్ణుడు. అంటే మోక్షము అని. ఇక్కడ యదార్థముగా అంటే వేదాధ్యయనము వలన అని, లేక వినడము వలన అని కాని కాదు. స్వానుభవము ద్వారా భగవత్స్వరూపము తెలిసికొనినవానికి అని. అంటే ఆత్మానుభవము పొందిన వారికి అని. అదే సర్వభూత సమత్వ స్థితికి చేరినవారికి అని.
||శ్లోకము 10||
వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః |
బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః ||10 ||
స|| వీతరాగ భయక్రోథాః మన్మయాః మామ్ ఉపాశ్రితాః బహవః జ్ఞానతపసా పూతాః మద్భావమ్ ఆగతాః ||10||
||శ్లోకార్థములు||
వీతరాగ భయక్రోథాః - అనురాగము భయము కోపమును విడిచినవారును
మన్మయాః- మనస్సు నాయందే లగ్నము చేసిన వారును
మామ్ ఉపాశ్రితాః - నన్ను ఆశ్రయించినవారును
బహవః జ్ఞానతపసా పూతాః - అనేకులు జ్ఞాన తపస్సుచే పవిత్రులై
మద్భావమ్ ఆగతాః - నాస్వరూపమును పొందిరి
||శ్లోకతాత్పర్యము||
"అనురాగము భయము కోపమును విడిచినవారును, మనస్సు నాయందే లగ్నము చేసిన వారును,
నన్ను ఆశ్రయించినవారును, అనేకులు జ్ఞాన తపస్సుచే పవిత్రులై, నా స్వరూపమును పొందిరి." ||10||
అలా తన స్వరూపము గురించి చెప్పి, కృష్ణుడు ఎవరికి మోక్షము వస్తుంది అన్నది కూడా చెపుతాడు.
అనురాగము అంటే కోరిక, భయము, క్రోధము విడచినవారై, భగవంతుని యందే చిత్తము లగ్నము చేసి, భగవంతునే ఆశ్రయించి, జ్ఞానతపస్సుచే పవిత్రులైన వారు, "మద్భావం ఆగతాః", "నా స్వరూపమును పొందుదురు" అని .
అంటే జ్ఞానతపస్సుతో మోక్షముపొందుతారు అని.
జ్ఞానతపస్సు అంటే, కోరిక భయము క్రోధము లేని వారై భగవంతుని ఆశ్రయించి భగవంతుని మీదనే ధ్యానము చేయుట అన్నమాట.
||శ్లోకము 11||
యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్ |
మమవర్త్మాను వర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః || 11 ||
స|| హే పార్థ ! యే యథా మాం ప్రపద్యంతే తాన్ తథా ఏవ అహం భజామి | మనుష్యాః మమ వర్త్మ సర్వశః అనువర్తన్తే ||11||
||శ్లోకార్థములు||
యే యథా మాం ప్రపద్యంతే - ఎవరు నన్ను ఏ విధముగా ఆశ్రయించుచున్నారో
తాన్ తథా ఏవ అహం భజామి - వారిని ఆ విధముగా అనుగ్రహించుచున్నాను
మనుష్యాః మమ వర్త్మ - మనుష్యులు నా యొక్క మార్గమును
సర్వశః అనువర్తన్తే - అన్నివేళలా అనుసరించుచున్నారు
||శ్లోకతాత్పర్యము||
"ఎవరు నన్ను ఏ విధముగా ఆశ్రయించుచున్నారో, వారిని ఆవిధముగా అనుగ్రహించుచున్నాను.
మనుష్యులు నా యొక్క మార్గమును అన్నివేళలా అనుసరించుచున్నారు." ||11||
కృష్ణుడు భగవదనుగ్రహము గురించి చెపుతూ ఇలా అంటాడు
- "యే యథా మాం ప్రపద్యంతే"-
- "ఎవరు ఏ ప్రకారముగా భగవంతుని ప్రార్థింతురో"-
వారిని ఆప్రకారముగానే భగవంతుడు అనుగ్రహించును.
ఒకసారి కాళిదాసు రఘువంశం లో చెపుతాడు "లోకో భిన్నరుచిః".
లోకులకు అనేక మైన రుచులు ( కోరికలు) ఉంటాయి అని.
ఒకరు నిష్కామకర్మ చేస్తూ శాంతి సమత్వము పొందాలి అని కోరుకుంటారు ;
ఒకరు అదే కర్మ చేస్తూ "ఓ దేవా నాకు సమస్త సుఖములు కావాలి" అనుకుంటారు.
కృష్ణుడు చెప్పేది, "ఎవరు ఏ ప్రకారముగా భగవంతుని ప్రార్థింతురో, వారికి భగవంతుడు అదే విథముగా అనుగ్రహించును" అని.
అంటే నిష్కామ కర్మచేసినా మనకి కోరతగిన కోరికల మీద జ్ఞానము ఉండాలి అన్నమాట.
నిష్కామకర్మ అన్నమాటలోనే ఉంది "కోరిక" గురించి. కోరికల మీద ధ్యాస కూడదు అని.
అది "కోరికలు లేని కర్మ" అని తెలిసి ఉండాలి. అలాంటి కోరికలు లేని కర్మ చేస్తూవున్నప్పుడు ఇంకో సంగతి అనవసరము అని తెలుసు కొనడము కూడా "జ్ఞానము".
ఆ జ్ఞానము లేనప్పుడు మనము కర్మ చేస్తూ నిష్కామ కర్మ చేస్తున్నాము అని అనుకుంటాము.
కాని మనస్సు అంతా భగవదనుగ్రహము, ఎప్పుడు ఏ రూపములో వస్తుందో అనే అలోచనలో ఉండి, కావలసిన మనో్ నిర్మలత్వము ఉండదు.
||శ్లోకము 12||
కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా || 12||
స|| కర్మణాం సిద్ధిమ్ కాఙ్క్షన్తః ఇహ దేవతాః యజన్తే హి , కర్మజా సిద్ధిః మానుషే లోకే క్షిప్రమ్ భవతి ||12||
||శ్లోకార్థములు||
కర్మణాం సిద్ధిమ్ కాఙ్క్షన్తః - కర్మల సిద్ధి పై ఆపేక్ష కలవారు
ఇహ దేవతాః యజన్తే హి - ఈ లోకములో దేవతలను ప్రార్థింతురు
కర్మజా సిద్ధిః మానుషే లోకే - కర్మ ఫలములు మనుష్యలోకములో
క్షిప్రమ్ భవతి - శీఘ్రముగా కలుగుచున్నవి
||శ్లోకతాత్పర్యము||
"కర్మల సిద్ధి పై ఆపేక్ష కలవారు, ఈ లోకములో దేవతలను ప్రార్థింతురు.
కర్మ ఫలములు మనుష్యలోకములో, శీఘ్రముగా కలుగుచున్నవి". ||12||
మానవ జన్మ యొక్క ప్రత్యేకత ఇదే. కర్మఫలములు మనుష్య జన్మలో త్వరగా లభిస్తాయి.
||శ్లోకము 13||
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తార మవ్యయమ్ || 13 ||
స|| చాతుర్వర్ణ్యం గుణకర్మ విభాగశః మయా సృష్ఠం| తస్య కర్తారమపి మామ్ అకర్తారం అవ్యయమ్ విద్ధి ||13||
||శ్లోకార్థములు||
గుణకర్మ విభాగశః - గుణములవలన చేయబడు కర్మలను అనుసరించి
చాతుర్వర్ణ్యం మయా సృష్ఠం - నాలుగు వర్ణములు నాచేత సృష్టింపబడినవి
తస్య కర్తారమపి - వాటికి కర్తనైనను
మామ్ అకర్తారం అవ్యయమ్ విద్ధి - నన్ను కర్తకాని వానిగను నాశరహితుడుగను తెలిసికొనుము
||శ్లోకతాత్పర్యము||
"గుణములవలన చేయబడు కర్మలను అనుసరించి నాలుగు వర్ణములు నాచేత సృష్టింపబడినవి.
వాటికి కర్తనైనను, నన్ను కర్తకానివానిగను నాశరహితుడుగను తెలిసికొనుము." ||13||
||శ్లోకము 14||
నమాం కర్మాణి లిమ్పన్తి నమే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిః న స బధ్యతే || 14 ||
స|| మామ్ కర్మాణి న లింపన్తి | మే కర్మఫలే స్పృహా న | ఇతి మామ్ యః అభిజానాతి సః కర్మభిః న బధ్యతే ||14||
||శ్లోకార్థములు||
మామ్ కర్మాణి న లింపన్తి - నన్ను కర్మలు అంటుకొనవు
మే కర్మఫలే స్పృహా న - నాకు కర్మలయందుకోరిక లేదు
ఇతి మామ్ యః అభిజానాతి - ఈ విధముగా నన్ను ఎవరు తెలిసికొనుచున్నారో
సః కర్మభిః న బధ్యతే - వారు కర్మలచే బంధింపబడరు
||శ్లోకతాత్పర్యము||
"నన్ను కర్మలు అంటుకొనవు. నాకు కర్మలయందుకోరిక లేదు
ఈ విధముగా నన్ను ఎవరు తెలిసికొనుచున్నారో, వారు కర్మలచే బంధింపబడరు." ||14||
"నన్ను కర్మలు అంటవు", "నాకు కర్మఫలములమీద కోరికలేదు"
అని నన్ను( తనను) ఎవరు తెలుసుకుంటారో - వారికి కర్మబంధములు ఉండవు.
ఈ శ్లోకములో ఎవరికైతే ఆత్మ జ్ఞానము ఉందో వారికి కర్మబంధములు ఉండవు అని అర్థము.
ఇంకా, "నన్ను కర్మలు అంటవు, నాకు కర్మఫలములమీద కోరికలేదు" అని నిశ్చయముతో,
ఎవరైతే భగవంతుని మీదే ధ్యానము చేస్తున్నారో వారికి కర్మబంధములు ఉండవు అని అర్థము.
"నమే కర్మాణి లింపన్తి నమే కర్మ ఫల స్పృహా" - అన్నది ఒక తారక మంత్రము లాంటిది.
అదే మాట అనుకుంటూ వుంటే చివరికి అదే మనస్సులో బలపడి పోతుంది.
ఆన్ని విషయాలలో అదే భావన తో వుంటే, కర్మబంధాలు వుండే కార్యాలమీద ఆసక్తి పోతుంది.
అదే మాట అనుకుంటూ, ఫలాసక్తితో మీద ధ్యాస వుంటే అదే కపట ధ్యానము అని విన్నాము.
||శ్లోకము 15||
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ||15||
స|| ఏవం జ్ఞాత్వా పూర్వైః ముముక్షుభిః అపి కర్మ కృతం | తస్మాత్ త్వం పూర్వైః కృతం పూర్వతరమ్ కర్మ ఏవ కురు ||15||
||శ్లోకార్థములు||
ఏవం జ్ఞాత్వా - ఈ ప్రకారముగా తెలిసికొని
పూర్వైః ముముక్షుభిః అపి కర్మ కృతం - పూర్వులైన ముముక్షువులచేత కూడా కర్మ చేయబడినది
తస్మాత్ త్వం పూర్వైః కృతం - అందువలన పూర్వులచే చేయబడిన
పూర్వతరమ్ కర్మ ఏవ కురు - పురాతనమైనట్టి కర్మను చేయుము
||శ్లోకతాత్పర్యము||
"ఈ ప్రకారముగా తెలిసికొని పూర్వులైన ముముక్షువులచేత కూడా కర్మ చేయబడినది.
అందువలన పూర్వులచే చేయబడిన, పురాతనమైనట్టి నిష్కామ కర్మను చేయుము". ||15||
ఇక్కడ కర్మ అంటే నిష్కామ కర్మ. అంటే మోక్షమార్గములో పోవుచున్న పూర్వీకులచేత నిష్కామ కర్మ చేయబడినది అని. అదే అధారముగా తీసుకుని, కృష్ణుడు అర్జునుని కూడా అలాగ నిష్కామ కర్మ చేయుము అని చెపుతున్నాడు.
ఇక్కడ భగవత్స్వరూపమైన తను చెప్పిన విధముగా చేయి అనకుండా, పూర్వీకులు లాభముపొందారు. అందువలన నీవుకూడా వారిని అనుసరించి నిష్కామ కర్మ చేయుము అని బోధిస్తున్నాడు కృష్ణుడు.
అంతా చెప్పి, కర్మ అంటే అందరికి సులభముగా అర్థము కాకపోవచ్చు అని ఉద్దేశ్యముతో, కృష్ణుడు కర్మ అన్నమాటగురించి ఇక్కడ మూడు శ్లోకాలలో వివరిస్తాడు.
||శ్లోకము 16||
కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్|| 16||
స|| కర్మ కిం అకర్మ కిం ఇతి అత్ర కవయః అపి మోహితాః | యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్ష్యసే తత్ కర్మ తే ప్రవక్ష్యామి ||16||
||శ్లోకార్థములు||
కర్మ కిం అకర్మ కిం ఇతి - కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అని
అత్ర కవయః అపి మోహితాః - ఈ విషయములో మేధావులు కూడా మోహము చెందిరి
యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్ష్యసే - ఏది వింటే అశుభము నుంచి విముక్తుడవు కాగలవో
తత్ కర్మ తే ప్రవక్ష్యామి - ఆకర్మగురించి చెప్పెదను
||శ్లోకతాత్పర్యములు||
"కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అని, ఈ విషయములో మేధావులు కూడా మోహము చెందిరి.
ఏది వింటే అశుభము నుంచి విముక్తుడవు కాగలవో ఆ కర్మ గురించి చెప్పెదను". ||17||
వేదాలలో అనేకరకముల కర్మలు చెప్పబడ్డాయి. అవి ప్రబలముగా వున్నప్పుడు కర్మ అంటే వూర్తిగా అవగాహన కాకపోవడము సహజము. కృష్ణుడు వివరిస్తున్నది నిష్కామ కర్మ తో సంబంధించిన కర్మయోగము గురించి. నిష్కామకర్మ గురించి పండితులు కూడా అవగాహన చేసుకో లేక మోహపడ్డారు అని.
||శ్లోకము 17||
కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః || 17 ||
స|| కర్మణః అపి బోద్ధవ్యం | వికర్మణః బోద్ధవ్యమ్| అకర్మణః చ బోద్ధవ్యమ్ |కర్మణః గతిః గహనా హి || 17||
||శ్లోకార్థములు||
కర్మణః అపి బోద్ధవ్యం - కర్మ యొక్క స్వరూపము తెలిసికొనతగినది
వికర్మణః బోద్ధవ్యమ్ - చేయకూడని కర్మగురించి కూడా తెలిసికొనతగినది
అకర్మణః చ బోద్ధవ్యమ్ - కర్మ చేయకుండా వుండు స్థితి కూడా తెలిసికొనతగినది
కర్మణః గతిః గహనా హి - కర్మ విధానములు ఎఱుగుట కష్టము కదా
||శ్లోకతాత్పర్యములు||
"కర్మ ,అంటే చేయతగిన కర్మ, యొక్క స్వరూపము తెలిసికొనతగినది. వికర్మ, అంటే చేయకూడని కర్మగురించి, కూడా తెలిసికొనతగినది. అకర్మ, అంటే కర్మ చేయకుండా వుండు స్థితి, కూడా తెలిసికొనతగినది.
కర్మ విధానములు లోతైనవి, ఎఱుగుట కష్టము కదా." ||17||
ఇక్కడ మూడు విషయాలు వున్నాయి. చేయతగిన కర్మ, చేయకూడని కర్మ, కర్మ ఏమీ చేయకుండా వుండే స్థితి. ఈ మూడు తెలిసికొనతగినవి.
చేయతగిన కర్మ, చేయకూడని కర్మల గురించి సందిగ్ధములో పడి, ఏమీ చేయకుండా వుంటే చేయకూడని కర్మ లని తప్పించుకుంటాము అనే ధ్యాసతో కొందరు కర్మ ఏమీ చేయకుండా వుండే స్థితిలో వుండిపోతారు. ఆ సందేహము తీర్చడము కోసము ఇక్కడ కృష్ణుడు, ఈ మూడు విడమరిచి చెపుతాడు కృష్ణుడు.
||శ్లోకము 18||
కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః|
స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ || 18||
స|| కర్మణి అకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః పశ్యేత్ సః మనుష్యేషు బుద్ధిమాన్ సః యుక్తః కృత్స్నకర్మకృత్ భవతి |18||
||శ్లోకార్థములు||
కర్మణి అకర్మ యః పశ్యేత్ - కర్మ లో అకర్మ చూడగలిగినవాడు
అకర్మణి చ కర్మ యః పశ్యేత్ - అకర్మలో కర్మ చూడగలిగినవాడు
సః మనుష్యేషు బుద్ధిమాన్ - అతడు మనుష్యులలో వివేక వంతుడు
సః యుక్తః - అతడు యోగముతో కూడినవాడు
కృత్స్నకర్మకృత్ భవతి - సకల కర్మలను ఆచరించినవాడు అగుచున్నాడు
||శ్లోకతాత్పర్యములు||
"కర్మ లో అకర్మ చూడగలిగినవాడు, అకర్మలో కర్మ చూడగలిగినవాడు,
అతడు మనుష్యులలో వివేక వంతుడు. అతడు యోగముతో కూడినవాడు.
అతడు సకల కర్మలను ఆచరించినవాడు అగుచున్నాడు." ||18||
ఇక్కడ కర్మ వికర్మ అకర్మ అన్న విషయాలపై కృష్ణుడు మూడు శ్లోకాలలో విశదీకరించాడు.
కర్మ అనే విషయములో ఏది "కర్మ"? ఏది "అకర్మ" ? అన్న మాటమీద మేధావులకు కూడా అర్థము కాదు.
కర్మ కూడా రెండు విధములు. ఒకటి చేయవలసిన కర్మ ( అదే అసలు కర్మ). రెండవది చేయకూడని కర్మ. అంటే నిషిద్ధ కర్మ. అదే "వికర్మ". ఏమీ కర్మ చేయకుండా వుండడము అకర్మ అన్నమాట.
ఈ కర్మల భేదము, అంటే "కర్మ- వికర్మ- అకర్మ"ల మూడింటికి భేదము, తెలిసిన వాడు జ్ఞాని.
వాటిలో భేదము తెలిసి, "కర్మ" లో "అకర్మ" ను; "అకర్మ"లో కర్మను, చూడగలిగిన వాడు వివేకము గలవాడు.
అట్టివానికి, అంటే అట్టి జ్ఞానికి ఆత్మసాక్షాత్కారము పొందుటచే సమస్త నియత కర్మలను ( చేయకపోయినా) చేసిన వాడగును. అంటే చేయవలసిన కర్మలను అన్నీఆచరించిన వాడు అగును. అంటే మోక్షసాధకుడు అన్నమాట.
అయితే "కర్మ" లో "అకర్మ" ఏమిటి ?
నిష్కామకర్మ చేస్తూ ఫలములను అపేక్షించ కుండా, ఇంకా పైగా కర్తృత్వము లేకుండా, అంటే ఆ చేసే కర్మ తనే చేస్తున్నాను అనే భావన లేకుండా, ఇంకా చేస్తున్నఆ కర్మ, అంటే ఆ చేస్తున్న పని, భగవదనుగ్రహముతో చేస్తున్నాను అనే భావన తో చేసినప్పుడు, ఆ కర్మ వలన బంధము వుండదు.
అంటే ఇక్కడ, ఆ కర్మ చేసినాగాని కర్మ చేయనట్లే అగును.
అంటే ఆ కర్మ, అకర్మ లాంటిదే.
కర్మలో, అకర్మ చూడగలగటము అంటే అదే.
మరి అకర్మ లో కర్మ ఏమిటి?
ఒకడు తన ప్రకృతి మార్చుకోకుండా, అంటే తనలో వున్న రజో తమో గుణములను నిర్మూలించకుండా,
దేహేంద్రియములను అదుపులో పెట్టి, ఏమీ కర్మ చేయకుండా, అది అకర్మ అనుకోవచ్చు .
కాని ఆ అకర్మ"లో, అతడు రజో తమో గుణముల ప్రభావములో, తన మనస్సుతో కర్మలను ఆచరిస్తూ వుంటే అది బాహ్యముగా బాహ్యేంద్రియములద్వారా అకర్మ అయినా, అది మనసా చేయబడిన కర్మలతో, అంటే నిషిద్ద కర్మలతో కూడినది. అలాగ ఆ "అకర్మలో", కర్మ వున్నది అని గ్రహించుట యే, అకర్మ లో కర్మ చూడడము అన్న మాట.
ఈ భేదములు తెలినవాడు జ్ఞాని.
||శ్లోకము 19||
యస్య సర్వే సమారమ్భాః కామ సంకల్పవర్జితాః |
జ్ఞానాగ్ని దగ్ధకర్మాణాం తమాహుః పణ్డితం బుధాః || 19 ||
స|| యస్య సర్వే సమారమ్భాః కామసంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణమ్ తం పండితం ఇతి బుధాః ఆహుః||19||
||శ్లోకార్థములు||
యస్య సర్వే సమారమ్భాః - ఎవని యొక్క సమస్త కార్యములు
కామసంకల్ప వర్జితాః - కోరిక సంకల్పము అనునవి లేకుండునో
జ్ఞానాగ్ని దగ్ధకర్మాణమ్ తం - జ్ఞానమనేడి అగ్నిలో దహింపబడిన కర్మలు గల అతనిని
పండితం ఇతి బుధాః ఆహుః - పండితుడు అని విజ్ఞులు చెప్పుదురు
||శ్లోకతాత్పర్యములు||
"ఎవని యొక్క సమస్త కార్యములు, కోరిక, సంకల్పము అనునవి లేకుండునో,
జ్ఞానమనేడి అగ్నిలో దహింపబడిన కర్మలు గల అతనిని పండితుడు అని విజ్ఞులు చెప్పుదురు." ||19||
కర్మ భేదములు తెలిసి,
"కర్మలో అకర్మ", "అకర్మలో కర్మ" చూడగలిగి,
ఎవరైతే కోరిక, సంకల్పము లేకుండా,
జ్ఞానము అనే అగ్నిలో కర్మలను దహించి ఆచరిస్తాడో, అట్టి వాడు పండితుడు అనబడును.
ఆట్టివాడు అన్ని విధముల కర్మ బంధనలకు అతీతుడు.
||శ్లోకము 20||
త్యక్త్వా కర్మ ఫలాసఙ్గం నిత్య తృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృతోఽపి నైవ కించిత్కరోతి సః || 20||
స|| ఫలాసంగం త్యక్త్వా నిత్య తృప్తః నిరాశ్రయః కర్మణి అభిప్రవృత్తః సః కించిత్ ( కర్మ) న కరోతి ఏవ ||20||
||శ్లోకార్థములు||
ఫలాసంగం త్యక్త్వా - ఫలాకాంక్ష త్యజించి
నిత్య తృప్తః నిరాశ్రయః - ఎల్లప్పుడు సంతృప్తికలవాడును దేనిని ఆశ్రయించని వాడును
కర్మణి అభిప్రవృత్తః - కర్మమునందు ప్రవర్తించినవాడైననూ
సః కించిత్ ( కర్మ) న కరోతి ఏవ - అతడు కొంచెము కూడా కర్మ చేయనివాడె అగుచున్నాడు.
||శ్లోకతాత్పర్యములు||
"ఫలాకాంక్ష త్యజించి, ఎల్లప్పుడు సంతృప్తికలవాడును, దేనిని ఆశ్రయించని వాడును
కర్మమునందు ప్రవర్తించినవాడైననూ, అతడు కొంచెము కూడా కర్మ చేయనివాడె అగుచున్నాడు." ||20||
ఇక్కడ మూడు సుగుణములు చెప్పబడినవి. ఫలాసక్తిని వదలడము, ఎల్లప్పుడు సంతృప్తి కలిగి వుండడము, దేనిని ఆశ్రయించకుండా వుండడము.
ఈ మూడు వున్నవాడు, ఏ పని చేసినా, దాని ఫలములపై అతనికి ఆశలేదు. అతడు ఆ పని ఏవిధముగా అమలు అయిననూ సంతృప్తి చెందినవాడే అగుటవలన, అతనికి సుఖదుఃఖాలు లేవు. అతనికి ఎవరి ఆశ్రయము అక్కరలేదు కనక జరిగిన కార్యమువలన కలిగె ఆశ, నిరాశ, ఆశ్రయ నిరాశ్రయ బాధలు అతనికి కలుగవు. అందువలన అతడు కర్మలయందు సంచరించుచున్నప్పటికీ, కర్మ బంధములు లేని వాడు అగుచున్నాడు. అంటే కర్మలు చేయని వాడే అగుచున్నాడు.
||శ్లోకము 21||
నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్|| 21 ||
స|| నిరాశీః యతచిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్ కిల్బిషమ్ ( పాపం) న ఆప్నోతి ||21||
||శ్లోకార్థములు||
నిరాశీః యతచిత్తాత్మా - ఆశలేనివాడును, ఇన్ద్రియనిగ్రహము కలవాడును
త్యక్త సర్వ పరిగ్రహః - సమస్త వస్తు స్వీకారమును విడిచినవాడును
శారీరం కేవలం కర్మ కుర్వన్ - శరీరమాత్రము చేత కర్మను చేయుచున్నను
కిల్బిషమ్ ( పాపం) న ఆప్నోతి - పాపమును పొందడు.
||శ్లోకతాత్పర్యములు||
"ఆశలేనివాడును, ఇన్ద్రియనిగ్రహము కలవాడును, సమస్త వస్తు స్వీకారమును విడిచినవాడును,
శరీరమాత్రము చేత కర్మను చేయుచున్నను పాపమును పొందడు." ||21||
ఇక్కడ కూడా మూడు గుణములు చెప్పబడినవి. ఆశ లేకుండుట, ఇన్ద్రియ నిగ్రహము కలిగియుండుట, సమస్త వస్తు స్వీకారము విడిచియుండుట.
ఆశ లేకుండుటలో, ఫలాసక్తికూడా వుండదు. ఇన్ద్రియనిగ్రహములో సంతృప్తి వుంటుంది. సమస్త వస్తు స్వీకారము విడిచినవాడు దేనిని ఆశ్రయించడు. అటువంటి వాడు శరీరధారణ కోసము కర్మ చేయుచున్ననూ, కర్మ చేయని వాడే అగును. అట్టివాడు పాపమును పొందడు.
||శ్లోకము 22||
యదృచ్చాలాభసంతుష్ఠో ద్వన్ద్వాతీతో విమత్సరః |
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే || 22||
స||యదృచ్చాలాభసంతుష్టః ద్వన్ద్వ అతీతః విమత్సరః సిద్ధౌ అసిద్ధౌ చ సమః కృత్వా అపి సః న నిబధ్యతే ||22||
||శ్లోకార్థములు||
యదృచ్చాలాభసంతుష్టః - అప్రయత్నముగా దొరికినదానితో సంతృప్తి చెందినవాడును
ద్వన్ద్వ అతీతః విమత్సరః - ద్వంద్వములకు అతీతుడు, మాత్సర్యము లేనివాడు
సిద్ధౌ అసిద్ధౌ చ సమః - ఫలము పొందిననూ పొందకపోయిననూ సమము గా వుండువాడు
కృత్వా అపి సః న నిబధ్యతే - కర్మ చేసిననూ అతడు కర్మలచే బంధింపబడడు
||శ్లోకతాత్పర్యములు||
"అప్రయత్నముగా దొరికినదానితో సంతృప్తి చెందినవాడును, ద్వంద్వములకు అతీతుడు, మాత్సర్యము లేనివాడు, ఫలము పొందిననూ పొందకపోయిననూ సమము గా వుండువాడు, కర్మ చేసిననూ అతడు కర్మలచే బంధింపబడడు." ||22||
కృష్ణుడు ఎవరికి కర్మవలన బంధము కలుగదు అన్న మాట గురించి విశదీకరిస్తూ, "అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందువాడు, సుఖ దుఃఖాది ద్వంద్వములు దాటి, మాత్సర్యము లేక, ఫలము యొక్క ప్రాప్తము అప్రాప్తము అనే విషయములందు సమ బుద్ధి కల వాడు, కర్మ చేసినను బంధింప బడడు" అని చెపుతాడు.
||శ్లోకము 23||
గతసఙ్గస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః |
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే || 23||
స|| గత సఙ్గస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయ ఆచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ||23||
||శ్లోకార్థములు||
గత సఙ్గస్య ముక్తస్య - సంగము లేనివాడు, బంధములనుండి విడువబడిన వాడు
జ్ఞానావస్థిత చేతసః - జ్ఞానావస్థలో వున్నవాడును
యజ్ఞాయ ఆచరతః కర్మ - భగవత్ప్రీత్యర్థము ఆచరించిన వాని యొక్క కర్మ
సమగ్రం ప్రవిలీయతే - సంపూర్ణముగా యజ్ఞములోనే విలీనమగుచున్నవి
||శ్లోకతాత్పర్యములు||
"సంగము లేనివాడు, బంధములనుండి విడువబడిన వాడు, జ్ఞానావస్థ లో వున్నవాడును,
భగవత్ప్రీత్యర్థము ఆచరించిన వాని యొక్కకర్మ, సంపూర్ణముగా యజ్ఞములోనే విలీనమగుచున్నవి." ||23||
సంగము లేనివాడు,సంసార బంధములనుండి విడువబడినవాడు, జ్ఞానావస్థలో వున్నవాడు - వీరు భగవత్ప్రీత్యర్థము ఏమి కర్మ చేసినా అది బంధములు లేనిది అగును అని కృష్ణుడు చెపుతాడు. జ్ఞానావస్థ అంటే ఆత్మ జ్ఞానములో నిలకడ కలవాడు అని. వీరందరు మోక్షము పొందినవారే. జనకాదులవలే వారు కర్మ భవత్ప్రీత్యర్థము చేస్తారు. అట్టి కర్మలు బంధములు కలుగ చేయవు.
భగవత్ప్రీత్యర్థము అన్న మాట కొంచెము అలోచించతగినది. భగవత్ప్రీతికోసము అందరూ తమ తమ ఇష్టానుసారము ప్రార్థన చేస్తారు. భగవత్ప్రీతి కోసము చేసే ప్రార్థనేలే యజ్ఞము అని ఇక్కడ చెప్పబడుచున్నది. భగవత్ప్రీతి కోసము చేసే ప్రార్థనేలే యజ్ఞము అంటూ కృష్ణుడు ఒక ముఖ్యమైన మాట చెప్పాడు.
యజ్ఞము అన్నది వైదీక కర్మ. ఇది వేదములలో ఒక నిష్ఠగా చెప్పబడినది. యజ్ఞము అంటే ఆ కార్యక్రమములో ఆహుతి చేయించువాడు, ఆహుతి చేయువాడు, ఆహుతి చేయబడుతున్న ద్రవ్యము, ఆహుతి చేయడానికి కావలసి హోమము, అంటే అగ్ని, ముఖ్యము. ఆహుతి చేయబడేది హోమాగ్నిలో దగ్ధము చేయబడుతుంది. అంటే అగ్నిదేవుడు ఆహుతిలో దేవతల కోసము అర్పింపబడిన ద్రవ్యములను దేవతలకు చేర్చుతాడు అన్నమాట. దేవతలు సంతోషముతో ఆహుతి స్వీకరించి, ఆహుతి చేసినవారికి కావలసిన వరములు ఇస్తారు. వైదీక యజ్ఞములో నలుగురు పురోహితులు వుంటారు. ఇది వేదాలలో ఒక నిష్ఠానురూపముగా చెప్పబడినది. ఈ నిష్ఠ సరిగా చేయబడనిచో, యజ్ఞము చేసేవాడికి చాలా అనర్థములు కలుగుతాయి అని కూడా చెప్పబడుతుంది. రామాయణములో బాలకాండలో పుత్రకామేష్టి యజ్ఞము చేయుచున్నదశరథమహారాజు, తన మంత్రులకు ఆదేశము ఇస్తూ అదే మాట చెపుతాడు. ఈ విధముగా యజ్ఞము చేయడము, సామాన్యులకు సాధ్యము కాదు. ఆహుతిలో అర్పించబడే ద్రవ్యములు సంపాదించడము కూడా సామాన్యులు అందరికి సాధ్యముకాదు. అంటే వేదములో చెప్పబడిన ఫలసిద్ధికి కావలసిన యజ్ఞములు, అందరికి యదార్థముగా అందుబాటులో లేవు అన్నమాట.
ఇక్కడ యజ్ఞము అన్నమాటకి నూతన మైన అర్థము కలిగించి, సామాన్యులు భక్తితో చేయగలిగే కర్మలనే ఆహుతిగా అర్పించబడగల ద్రవ్యసాధనములవలె సృష్టించి, కృష్ణుడు మోక్షమార్గము అందరికి అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఇక్కడ చెప్పబడే యజ్ఞములు రాజులు రాజభటులకు, పురుషులకు స్త్రీలకు, బ్రాహ్మలు శూద్రులకు, ధనవంతులకు ధనము లేనివారికి అందరికి సమానమే.
ముందు శ్లోకాలలో లోకులు చేయగల కర్మలతోనే, అనేక రకములైన యజ్ఞములు చెప్పబడినవి.
ఇది భగవద్గీతలో ఒక ముఖ్యమైన మాట.
||శ్లోకము 24||
బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా || 24 ||
స|| (యజ్ఞే) అర్పణం బ్రహ్మ | హవిః బ్రహ్మ | బ్రహ్మగ్నౌ బ్రహ్మణా హుతం బ్రహ్మ ఏవ | బ్రహ్మ కర్మ సమాధినా తేన గన్తవ్యం బ్రహ్మ ఏవ ||24||
||శ్లోకార్థములు||
(యజ్ఞే) అర్పణం బ్రహ్మ - (యజ్ఞములో) అర్పణము బ్రహ్మ
హవిః బ్రహ్మ - హవిస్సు బ్రహ్మమే
బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మ ఏవ -
బ్రహ్మ మనెడి అగ్నియందు బ్రహ్మ స్వరూపుడగు యజమాని చేత ఆహుతిచేయబడినది బ్రహ్మమే
బ్రహ్మ కర్మ సమాధినా - సర్వము బ్రహ్మస్వరూపము అనే భావనతో యజ్ఞకర్మ చేయు
తేన గన్తవ్యం బ్రహ్మ ఏవ - అతనిచేత చేరవలసిన స్థానము బ్రహ్మమే
||శ్లోకతాత్పర్యములు||
"యజ్ఞములో అర్పణము బ్రహ్మ. హవిస్సు బ్రహ్మమే.
బ్రహ్మ మనెడి అగ్నియందు బ్రహ్మ స్వరూపుడగు యజమాని చేత ఆహుతిచేయబడినది బ్రహ్మమే.
సర్వము బ్రహ్మస్వరూపము అనే భావనతో యజ్ఞకర్మ చేయు అతనిచేత పొందవలసిన స్థానము కూడా బ్రహ్మమే." ||24||
అంటే, యజ్ఞము నందలి హోమసాధనములు,హోమద్రవ్యములు, హోమాగ్నీ, హోమము చేయు వాడు, హోమము చేయబడునది, అన్నియు బ్రహ్మస్వరూపములే. అలాంటి ఏకాగ్ర భావముతో యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందుచున్నాడు.
||శ్లోకము 25||
దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే |
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి || 25||
స|| అపరే యోగినః దైవం యజ్ఞమేవ పర్యుపాసతే |అపరే యజ్ఞేనైవ యజ్ఞమ్ బ్రహ్మగ్నౌ ఉపజుహ్వతి ||25||
||శ్లోకార్థములు||
అపరే యోగినః - కొందరు యోగులు
దైవం యజ్ఞమేవ పర్యుపాసతే - దైవము ఆరాధించు యజ్ఞమునే ఉపాసన చేయుచున్నారు
అపరే యజ్ఞేనైవ యజ్ఞమ్ - కొందరు జీవబ్రహ్మైక్య భావముతో జీవుని
బ్రహ్మగ్నౌ ఉపజుహ్వతి - బ్రహ్మము అగ్నిలో హోమము చేయుచున్నారు
||శ్లోకతాత్పర్యములు||
"కొందరు యోగులు దైవము ఆరాధించు యజ్ఞమునే ఉపాసన చేయుచున్నారు.
కొందరు జీవబ్రహ్మైక్య భావముతో జీవుని బ్రహ్మము అనే అగ్నిలో హోమము చేయుచున్నారు." ||25||
ఆహుతి చేయబడేది హోమాగ్నిలో దగ్ధము చేయబడుతుంది. ఇక్కడ ఆహుతిగా అర్పించబడినది దైవారాధనయే. అంటే దేవుని ఆరాధనే ఒక యజ్ఞము. దైవతారాధన ఆహుతిగా, భక్తి అనే అగ్నిలో, దైవమునకు సమర్పిస్తున్నాము అన్నమాట.
ఇక్కడ రెండు రకముల యజ్ఞములు చెప్పబడినవి
1 దైవ యజ్ఞములు - దేవతారాధన , దేవత ఉపాశనా మొదలగునవి
2 బ్రహ్మ యజ్ఞము - విచారణచేత , పవిత్రత చేతను మనస్సును బ్రహ్మములో విలీనమొనర్చుట
||శ్లోకము 26||
శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |
శబ్దాదీన్విషయానన్య ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి || 26||
స|| అన్యే శ్రోత్రాదీని ఇన్ద్రియాణి సంయమ అగ్నిషు జుహ్వతి |అన్య శబ్దాదీన్ విషయాన్ ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి ||26||
||శ్లోకార్థములు||
అన్యే శ్రోత్రాదీని ఇన్ద్రియాణి - కొందరు చెవి మున్నగు ఇన్ద్రియములను
సంయమ అగ్నిషు జుహ్వతి - నిగ్రహము అనబడె అగ్నిలో హోమము చేయుచున్నారు
అన్య శబ్దాదీన్ విషయాన్ - మరికొందరు శబ్దము మున్నగు విషయములను
ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి - ఇన్ద్రియములను అగ్నిలో హోమము చేయుచున్నారు
||శ్లోకతాత్పర్యము||
"కొందరు చెవి మున్నగు ఇన్ద్రియములను, నిగ్రహము అనబడె అగ్నిలో హోమము చేయుచున్నారు.
మరికొందరు శబ్దము మున్నగు విషయములను, ఇన్ద్రియములను అగ్నిలో హోమము చేయుచున్నారు". ||26||
.
ఇక్కడ ఆహుతి చేయబడేవి ఇన్ద్రియములు. అవి నిగ్రహము అనబడే అగ్నిలో ఆహుతి చేయడము అంటే ఇన్ద్రియములను నిగ్రహించుతున్నారన్నమాట. అంటే ఇన్ద్రియ నిగ్రహమే ఒక యజ్ఞముగా భావించబడుతున్నది అన్నమాట.
ఇంద్రియ నిగ్రహము మోక్షసాధనకు ప్రథమసోపానము. ఇంద్రియ నిగ్రహమునే ఒక యజ్ఞము గా భావించి చేయుట ఒక యజ్ఞము.
ఇక్కడ చెప్పబడిన రెండవ యజ్ఞము శబ్దాది విషయ నిరోధ యజ్ఞము.
ఇంద్రియములు విషయములమీద తిరుగుతూవుంటాయి. విషయములలోని దోషాలని విచారించి వాటిపై కోరికలు త్యజించాలి. లేకపోతే ఇంద్రియములు వాటిపై పరుగెత్తుతాయి. అలా విషయములపై ఆసక్తి,, విషయములలోని దోషాలపై కోరిక, అణగదొక్కినప్పుడు మన మనస్సుకు నిలకడ, శాంతి దొరకును. ఆ నిలకడలోనే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానమే మోక్షము. ఇందులో శబ్దాది విషయములు ఆహుతిగా, నిరోధము అనే అగ్నిలో ఆహుతిచేయబడతాయి. అంటే శబ్దాది విషయ నిరోధనము సమకూర్చబడినది అన్నమాట. మోక్షమార్గములో శబ్దాది విషయ నిరోధము ఒక సోపానము. ఆ సోపానమే యజ్ఞము గా భావించుట ఇక్కడ చెప్పబడినది.
||శ్లోకము 27||
సర్వాణీన్ద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే || 27 ||
స|| అపరే సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణ కర్మాణి చ జ్ఞానదీపితే ఆత్మ సంయమ అగ్నౌ జుహ్వతి ||27||
||శ్లోకార్థములు||
అపరే సర్వాణి ఇంద్రియకర్మాణి - మరికొందరు సమస్త ఇన్ద్రియ కర్మలను
ప్రాణ కర్మాణి చ - ప్రాణములయొక్క కర్మలను
జ్ఞానదీపితే - జ్ఞానముచే ప్రకాశింపచేయబడిన
ఆత్మ సంయమ అగ్నౌ జుహ్వతి - మనో నిగ్రహమనే అగ్నియందు హోమము చేయుచున్నారు
||శ్లోకతాత్పర్యము||
"మరికొందరు సమస్త ఇన్ద్రియ కర్మలను, ప్రాణముల యొక్క కర్మలను,
జ్ఞానముచే ప్రకాశింపచేయబడిన, మనో నిగ్రహమనే అగ్నియందు హోమము చేయుచున్నారు." ||27||
ఇక్కడ చెప్పబడినది మనోనిగ్రహ యజ్ఞము.
మనస్సు అదుపు లేని గుర్రాలు లాంటిది. ఇంద్రియ నిగ్రహము శబ్దాది విషయ నిరోధనము కూడా మనస్సు ద్వారా అదుపులోకి తీసుకు రావాలి. మనస్సును అధీనము లో తీసుకు రావడానికి మనస్సుకి పై స్థానములో నున్న బుద్ధి ద్వారా మనస్సుని నిగ్రహించాలి. ఆ మనో నిగ్రహమే ఒక యజ్ఞము గా చేయుట యే మనోనిగ్రహ యజ్ఞము. మనో నిగ్రహము కూడా మోక్షమార్గములో ఒక సోపానము. ఆ సోపానమే ఒక యజ్ఞము.
||శ్లోకము 28||
ద్రవ్య యజ్ఞా తపో యజ్ఞా యోగ యజ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయ జ్ఞానయజ్ఞశ్చ యతయః సంశితవ్రతాః || 28 ||
స|| అపరే ద్రవ్య యజ్ఞాః అపరే తపో యజ్ఞా అపరే యోగ యజ్ఞా తథా అపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞా | తే యతయః సంశిత వ్రతాః ||28||
||శ్లోకార్థములు||
అపరే ద్రవ్య యజ్ఞాః - మరి కొందరు ద్రవ్యములు సద్వినియోగము చేయుటయే యజ్ఞముగా చేయుదురు
అపరే తపో యజ్ఞా - మరికొందరు తమ తపస్సునే యజ్ఞముగా చేయుదురు
అపరే యోగ యజ్ఞా - మరి కొందరు యోగమునే యజ్ఞముగా చేయుదురు
అపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞా - మరికొందరు వేదాధ్యయనము వేదార్థజ్ఞాన సముపార్జనయే యజ్ఞముగా చేయుదురు.
తే యతయః - ఆ ప్రయత్న శీలురు
సంశిత వ్రతాః - ధృఢమైన నిష్ఠతో వ్రతము చేయువారు
||శ్లోకతాత్పర్యము||
"మరి కొందరు ద్రవ్యములు సద్వినియోగము చేటయే యజ్ఞముగా చేయుదురు. మరికొందరు తమ తపస్సునే యజ్ఞముగా చేయుదురు. మరి కొందరు యోగమునే యజ్ఞముగా చేయుదురు. మరికొందరు వేదాధ్యయనము వేదార్థజ్ఞాన సముపార్జనయే యజ్ఞముగా చేయుదురు. ఇక్కడ ప్రయత్న శీలురు ధృఢమైన నిష్ఠతో వ్రతము చేయువారు". ||28||
ఇక్కడ చెప్పబడిన యజ్ఞములు ద్రవ్య, తపో, యోగ, స్వాధ్యాయ యజ్ఞములు.
ద్రవ్య యజ్ఞము : తన ధనమును దాన ధర్మాది కార్యక్రమములపై సద్వినియోగపరచుట యే ఒక యజ్ఞము.
తపోయజ్ఞము: వ్రత ఉపవాసములతో దేహేంద్రియాలను తపింపచేసి వశపరచుకొనుటయే ఒక యజ్ఞము.
యోగయజ్ఞము: యమ నియామది రూపములు కల అష్టాంగ యోగమే ఒక యజ్ఞము.
స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము- వేదాధ్యయనము వేదార్థజ్ఞాన సముపార్జనయే యజ్ఞముగాచేయుట.
అంటే అధ్యాత్మిక పుస్తములు ( అంటే సుందరకాండ మున్నగునవి) చదవడమే ఒక యజ్ఞముగా భావించి ఉపాసన చేయవచ్చు. సుందరకాండ లో వున్న తత్వార్థము విశదీకరించడము కూడా ఒక యజ్ఞము గా భావించి చేయవచ్చు అన్నమాట.
||శ్లోకము 29||
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాఽపరే |
ప్రాణాపాన గతీరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః || 29 ||
స|| ప్రాణాయామపరాయణాః అపరే ప్రాణాపాన గతీ రుద్ధ్వా అపానే ప్రాణం తథా ప్రాణే అపానమ్ జుహ్వతి ||29||
||శ్లోకార్థములు||
ప్రాణాయామపరాయణాః అపరే - ప్రాణాయామ తత్పరులగు కొందరు
ప్రాణాపాన గతీ రుద్ధ్వా - ప్రాణ అపాన గతులని నిరోధించి
అపానే ప్రాణం తథా ప్రాణే అపానమ్ -
అపానవాయువులో ప్రాణవాయువును అట్లే ప్రాణవాయువులో అపాన వాయువును
జుహ్వతి - హోమము చేయుచున్నారు.
||శ్లోకతాత్పర్యము||
"ప్రాణాయామ తత్పరులగు కొందరు ప్రాణ అపాన గతులని నిరోధించి,
అపానవాయువులో ప్రాణవాయువును అట్లే ప్రాణవాయువులో అపాన వాయువును హోమము చేయుచున్నారు". ||29||
ఇక్కడ ప్రాణాయామము ఒక యజ్ఞముగా చెప్పబడుచున్నది.
||శ్లోకము 30||
అపరే నియతాహారః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి |
సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః ||30||
స|| అపరే నియతాహారః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి | ఏతే సర్వే అపి యజ్ఞవిదః యజ్ఞ క్షపిత కల్మషాః ||30||
||శ్లోకార్థములు||
అపరే నియతాహారః - కొందరు ఆహారమునందు కట్టుబాటు కలవారై
ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి - ప్రాణాది వాయువులను ప్రాణవాయువులలోనే హోమము చేయుచున్నారు
ఏతే సర్వే అపి యజ్ఞవిదః - వీరందరూ యజ్ఞమును ఎరిగినవారు
యజ్ఞ క్షపిత కల్మషాః - యజ్ఞము చేత నశింపచేయబడిన పాపము కలవారు
||శ్లోకతాత్పర్యము||
"కొందరు ఆహారమునందు కట్టుబాటు కలవారై, ప్రాణాది వాయువులను ప్రాణవాయువులలోనే హోమము చేయుచున్నారు. వీరందరూ యజ్ఞమును ఎరిగినవారు. యజ్ఞము చేత నశింపచేయబడిన పాపము కలవారు." ||30||
ఇక్కడ చెప్పబడిన యజ్ఞము ఆహారనియమ యజ్ఞము.
ఆహారనియమ యజ్ఞము అంటే, ఆ ఆహార నియమమే ఒక యజ్ఞముగా చేయువారు.
ఇక్కడ యజ్ఞము చేసేవారందరిని, 'సంశిత వ్రతాః' అంటారు. అంటే తము పూనుకొన్నకర్మ మీద ధృఢ చిత్తము కలవారు అని. అనుకున్న పనినే కఠోర నియమముల తో చేయువారు. అది యే వారి యజ్ఞము.
ఇక్కడ యజ్ఞము చేసేవారందరూ, 'యజ్ఞ క్షపిత కల్మషాః', అంటే యజ్ఞము చేత నశింపచేయబడిన పాపము కలవారు అని.
||శ్లోకము 31||
యజ్ఞశిష్టామృత భుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్|
నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యఃకురుసత్తమ || 31||
స|| హే కురుసత్తమ ! యజ్ఞశిష్ఠా మృతభుజః సనాతనమ్ బ్రహ్మ యాన్తి | అయజ్ఞస్య అయం లోకః నాస్తి | అన్యః కుతః ||31||
||శ్లోకార్థములు||
కురుసత్తమ - కురువంశములో ఉత్తముడా
యజ్ఞశిష్ఠామృతభుజః - యజ్ఞములో శేషించిన అమృతతుల్యము అగు అన్నమును భోజించువారు
సనాతనమ్ బ్రహ్మ యాన్తి - సనాతనమైన బ్రహ్మమును పొందుచున్నారు
అయజ్ఞస్య అయం లోకః నాస్తి - యజ్ఞము చేయని వారికి ఈ లోకము లేదు
అన్యః కుతః - ఇంకో లోకము ఎక్కడ?
||శ్లోకతాత్పర్యము||'
"ఓ కురుసత్తమా, యజ్ఞములో శేషించిన అమృతతుల్యము అగు అన్నమును భోజించువారు, సనాతనమైన బ్రహ్మమును పొందుచున్నారు. యజ్ఞము చేయని వారికి ఈ లోకములో సుఖము లేదు. పరలోకములో సుఖము ఎక్కడ?" ||31||
'యజ్ఞశిష్ఠాశినః' అంటే, యజ్ఞములో శేషించిన అన్నము అని. అది తిన్నవారు పాపరహితులు అని వేదములలో చెప్పబడుతుంది . ఇక్కడ చెప్పబడిన యజ్ఞములలో చేసిన ఆహుతి వలన లభించేది, అమృత తుల్యమగు శాంతి. ఆ శాంతి లభించడమే పాపము లేనివారు అవడము అన్నమాట.
ఆ యజ్ఞము చేయనివారికి ఈ లోకము లో శాంతి లేదు. అటువంటప్పుడు పరలోకము గురించి చెప్పవలసినది ఏమి లేదు అని శ్లోకార్థము.
||శ్లోకము 32||
ఏవం బహువిథా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే || 32||
స|| ఏవమ్ బహువిథాః యజ్ఞాః బ్రహ్మణః ముఖే వితతాః | తాన్ సర్వాన్ కర్మజాన్ విత్థి |ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ||32||
||శ్లోకార్థములు||
ఏవమ్ బహువిథాః యజ్ఞాః - ఈ విధముగా అనేకవిధములైన యజ్ఞములు
బ్రహ్మణః ముఖే వితతాః - వేదమందు విస్తరించబడినవి
తాన్ సర్వాన్ కర్మజాన్ విత్థి - వానిని అన్నిటినీ కర్మలతో కూడినవి గా తెలిసికొనుము
ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే - ఇట్లు తెలిసికొని విముక్తుడవు కాగలవు
||శ్లోకతాత్పర్యము||
"ఈ విధముగా అనేకవిధములైన యజ్ఞములు వేదమందు విస్తరించబడినవి.
వానిని అన్నిటినీ కర్మలతో కూడినవి గా తెలిసికొనుము ఇట్లు తెలిసికొని విముక్తుడవు కాగలవు." ||32||
ఇవే కాకుండా అనేక యజ్ఞములు వేదములలో చెప్పబడినవి. అందు లో కర్మ, అకర్మ, వికర్మ, భేదములు తెలిసికొనినవాడు కర్మలను అంటే యజ్ఞములను ఆచరించి మోక్షము పొందుచున్నాడు అని అర్థము.
||శ్లోకము 33||
శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞా జ్ఞానయజ్ఞః పరన్తప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే || 33||
స|| హే పరన్తప ! ద్రవ్యం అయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః శ్రేయాన్ | హే పార్థ ! సర్వం కర్మ అఖిలమ్ జ్ఞానే పరిసమాప్యతే ||33||
||శ్లోకార్థములు||
ద్రవ్యమయాత్ యజ్ఞాత్ - ద్రవ్యమయమైన యజ్ఞము కన్న
జ్ఞాన యజ్ఞః శ్రేయాన్ - జ్ఞాన యజ్ఞము శ్రేష్ఠమైనది.
హే పార్థ ! సర్వం కర్మ అఖిలమ్ - ఓ పార్థ సమస్త కర్మలు నాశనముకానివి అగుచు
జ్ఞానే పరిసమాప్యతే - జ్ఞానములో పరిసమాప్తినొందు చున్నవి
||శ్లోకతాత్పర్యము||
"ద్రవ్యము వలన సాధ్యమైన యజ్ఞము కన్న జ్ఞాన యజ్ఞము శ్రేష్ఠమైనది.
ఓ పార్థ, సమస్త కర్మలు నాశనముకానివి అగుచు జ్ఞానములో పరిసమాప్తినొందు చున్నవి." ||33||
అన్ని యజ్ఞములు చెప్పి , కృష్ణుడు ఏ యజ్ఞము అన్నిటిలోకి శ్రేష్ఠమైనది అన్నవిషయము కూడా చెపుతున్నాడు.
" ఓ అర్జునా ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞముకన్నా జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. ఎందుకనగా సమస్త కర్మ నాశనము కానివై, జ్ఞానమునందే సమాప్తము అగుటవలన."
ద్రవ్యయజ్ఞము అంటే దాన ధర్మాది కార్యక్రమములుచేస్తూ, వాటిలోనే తన్మయత్వము పొందడము, తద్వారా మోక్షము పొందడము జరుగుతుంది. ద్రవ్యయజ్ఞములో చేయు కర్మ, ద్రవ్య దాన ధర్మములు. ఆ ద్రవ్యములు దానమనే ఆహుతిలోకి వెళ్ళిపోతాయి. దాన యజ్ఞము చేసిన వానికి దానము చేయగావచ్చిన ఫలము మిగులుతుంది. ఆహుతి చేయబడిన దానము, దానము స్వీకరించిన వానికి పోతుంది.
జ్ఞానయజ్ఞములో చేయబడే కర్మ జ్ఞానోపాసన. ఈ ఉపాసనలో ఆహుతి చేయబడినది జ్ఞానము. కాని ఆహుతి చేయబడిన జ్ఞానము, జ్ఞానోపాశన చేసినవాడి దగ్గిరే ఉంటుంది. అది కృష్ణుడి మాట. అందుకని జ్ఞాన యజ్ఞము శ్రేష్ఠమైనది అంటాడు కృష్ణుడు. అందుకని జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞము కన్న ఉత్తమమైనది.
మరి జ్ఞానము ఎలా సంపాయించాలి? కృష్ణుడు అది కూడా చెపుతాడు.
||శ్లోకము 34||
తద్విద్ధి ప్రణి పాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వ దర్శినః || 34 ||
స|| తత్ జ్ఞానం ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా విద్ధి | తత్త్వ దర్శినః జ్ఞానినః తే ఉపదేశ్యన్తి ||34||
||శ్లోకార్థములు||
తత్ జ్ఞానం ప్రణిపాతేన - ఆ జ్ఞానము సాష్టాంగ నమస్కారముతోను
పరిప్రశ్నేన - వినయముగా ప్రశ్నించుటచేతను
సేవయా విద్ధి - సేవ చేతను తెలిసికొనుము
తత్త్వ దర్శినః - తత్త్వజ్ఞానము కల
జ్ఞానినః తే ఉపదేశ్యన్తి - జ్ఞానులు నీకు ఉపదేశింపగలరు
||శ్లోకతాత్పర్యము||
"ఆ జ్ఞానము సాష్టాంగ నమస్కారముతోను, వినయముగా ప్రశ్నించుటచేతను,సేవ చేతను తెలిసికొనుము.
తత్త్వజ్ఞానము కల జ్ఞానులు నీకు ఉపదేశింపగలరు."||34||
జ్ఞానము ఎలా సంపాదించాలి అన్నమాటకి కృష్ణు భగవానుని సమాధానము: గురువు గారికి సాష్ఠాంగ ప్రణామము చేసి, గురువుగారిని వినయముతో ప్రశ్నించి, గురువుగారి సేవ చేసి జ్ఞానము సంపాదించుము అని.
గురువులు ఎవరు - బ్రహ్మానుభవము గల జ్ఞానులు, వారి ద్వారా జ్ఞానము లభిస్తుంది!
అయితే ఎవరికి జ్ఞానము లభిస్తుంది? శ్రద్ధ వున్నవాళ్ళకే. దానియందే లగ్నమైనవాడికి. ఇంద్రియములను జయించినవాడికి.
||శ్లోకము 35||
యత్ జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్డవ |
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి || 35||
స|| హే పాణ్డవ ! యత్ జ్ఞాత్వా పునః ఏవమ్ మోహమ్ న యాస్యసి యేన భూతాని అశేషేణ అత్మని అథో మయి ద్రక్ష్యసి ( తత్ జ్ఞానమ్ విద్ధి !)
||శ్లోకార్థములు||
యత్ జ్ఞాత్వా పునః - ఏది తెలిసికొని మళ్ళీ
ఏవమ్ మోహమ్ న యాస్యసి - ఇట్టి మోహమును పొందవో
యేన భూతాని అశేషేణ అత్మని - దేనిచేత ప్రాణులను నీయందును
అథో మయి ద్రక్ష్యసి - అలాగుననే నాయందు చూడగలవో
( అట్టి జ్ఞానమును తెలిసికొనుము)
||శ్లోకతాత్పర్యము||
"ఓ అర్జునా, ఏది తెలిసికొని మళ్ళీ ఇట్టి మోహమును పొందవో,
దేనిచేత ప్రాణులను నీయందును, అలాగుననే నాయందు చూడగలవో
(అట్టి జ్ఞానమును తెలిసికొనుము)." ||35||
||శ్లోకము 36||
అపి చేదపి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి || 36||
స|| సర్వేభ్యః పాపేభ్యః పాపకృత్తమః అపి చేత్ అపి సర్వం వృజినమ్ ( పాపమ్) జ్ఞానప్లవేనైవ సంతరిష్యసి ||36||
||శ్లోకార్థములు||
సర్వేభ్యః పాపేభ్యః - పాపత్ములందరికంటెను
పాపకృత్తమః అపి చేత్ - పాపములు చేసినవాడవైనా గాని
సర్వం వృజినమ్ ( పాపమ్) - సమస్త పాపములను
జ్ఞానప్లవేనైవ సంతరిష్యసి - జ్ఞానమనే నావతో దాటగలవు
||శ్లోకతాత్పర్యము||
"పాపత్ములందరికంటెను పాపములు చేసినవాడవైనా గాని
సమస్త పాపములను జ్ఞానమనే నావతో దాటగలవు." ||36||
ఇది జ్ఞానముయొక్క ప్రాముఖ్యత. ఎంతపాపము చేసినాగాని జ్ఞానము సంపాదించినప్పుడు సంసారసాగరాన్ని దాటినట్లే.
||శ్లోకము 37||
యథైథాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున|
జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా || 37||
స|| హే అర్జునా ! సమిద్ధః అగ్నిః ఏథాంసి యథా భస్మసాత్ తథా జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే ||37||
||శ్లోకార్థములు||
సమిద్ధః అగ్నిః - బాగుగా ప్రజ్వలింపబడిన అగ్ని
ఏథాంసి యథా భస్మసాత్ - కట్టెలను ఏ విధముగా భస్మము చేయునో
తథా జ్ఞానాగ్నిః సర్వకర్మాణి - అదే విధముగా జ్ఞానము అనబడు అగ్ని
సర్వకర్మాణి భస్మసాత్ కురుతే - సమస్త కర్మలను భస్మము చేయుచున్నది
||శ్లోకతాత్పర్యము||
"బాగుగా ప్రజ్వలింపబడిన అగ్నికట్టెలను ఏ విధముగా భస్మము చేయునో,
అదే విధముగా జ్ఞానము అనబడు అగ్నిసమస్త కర్మలను భస్మము చేయుచున్నది." ||37||
ఈ జ్ఞానము అజ్ఞానమును నశింపచేస్తుంది. అది ఇక్కడ చెప్పబడిన మాట.
||శ్లోకము 38||
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్ స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి|| 38 ||
స|| ఇహ జ్ఞానేన సదృశం పవిత్రం న విద్యతే హి | తత్ యోగసంసిద్ధిః కాలేన ఆత్మని స్వయమ్ విందతి ||38||
||శ్లోకార్థములు||
ఇహ జ్ఞానేన సదృశం పవిత్రం - ఈ లోకములో జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది
న విద్యతే హి - ఏదియు లేనే లేదు
తత్ యోగసంసిద్ధిః - అట్టి జ్ఞానమును యోగ సిద్ధి పొందినవాడు
కాలేన ఆత్మని స్వయమ్ విందతి - కాలక్రమమున తనయందు స్వయముగనే పొందుచున్నాడు
||శ్లోకతాత్పర్యము||
"ఈ లోకములో జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఏదియు లేనే లేదు.
అట్టి జ్ఞానమును యోగ సిద్ధి పొందినవాడు కాలక్రమమున తనయందు స్వయముగనే పొందుచున్నాడు." ||38||
ప్రపంచములో పవిత్రమైనవి చాలా ఉన్నాయి.
కాని జ్ఞానముతో సమానముగా పవిత్రమైనవి లేవు
అంటే జ్ఞానమే అన్నిటికన్నా పవిత్రమైనది అని దీని భావము.
ఈ జ్ఞానము స్వయముగా ప్రయత్నించుటవలనే దొరుకుతుంది.
ఈ జ్ఞానము ఎక్కడ ఉదయిస్తుంది - "ఆత్మని"- అంటే ఆత్మలో
ఈ జ్ఞానమునకు కాలమునకు సంబంధము - "కాలేన", అంటే కాలక్రమములో జ్ఞానము మోక్షకారణమగుతుంది.
జ్ఞానము - "సంశయము" అనబడే ఆజ్ఞానమును నివర్తిస్తుంది, అంటే పోగొట్టుతుంది
||శ్లోకము 39||
శ్రద్ధ్వాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిం అచిరేణాధిగచ్ఛతి|| 39 ||
స|| శ్రద్ధవాన్ తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లభతే |జ్ఞానమ్ లబ్ధ్వా పరామ్ శాంతిమ్ అచిరేణ అధిగచ్చతి ||39||
||శ్లోకార్థములు||
శ్రద్ధవాన్ తత్పరః సంయతేంద్రియః -
శ్రద్ధ కలవాడు, తదేక నిష్ఠ కలవాడు, ఇన్ద్రియములను జయించినవాడు
జ్ఞానం లభతే - జ్ఞానము పొందును
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిం - జ్ఞానము పోంది మహత్తరమైన శాంతిని
అచిరేణ అధిగచ్చతి - శీఘ్రముగా పొందుచున్నాడు
||శ్లోకతాత్పర్యము||
"శ్రద్ధ కలవాడు, తదేక నిష్ఠ కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, జ్ఞానము పొందును.
జ్ఞానము పోంది మహత్తరమైన శాంతిని శీఘ్రముగా పొందుచున్నాడు." ||39||
||శ్లోకము 40||
అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ||40||
స|| అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి |సంశయాత్మా అయం లోకః నాస్తి | పరం న | సుఖం అపి నాస్తి ||40||
||శ్లోకార్థములు||
అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ - అజ్ఞానుడు శ్రద్ధలేనివాడు
సంశయాత్మా వినశ్యతి - సంశయములు కలవాడు వినాశము పొందుచున్నాడు
సంశయాత్మా అయం లోకః నాస్తి - సంశయములు కలవానికి ఈ లోకము లేదు
పరం న - పరలోకము కూడా లేదు
సుఖం అపి నాస్తి - సుఖము కూడాలేదు
||శ్లోకతాత్పర్యము||
"అజ్ఞానుడు, శ్రద్ధలేనివాడు, సంశయములు కలవాడు వినాశము పొందుచున్నాడు.
సంశయములు కలవానికి ఈ లోకము కాని, పరలోకము కాని, సుఖము కాని లేదు." ||40||
||శ్లోకము 41||
యోగసన్న్యస్తకర్మాణాం జ్ఞానసంఛిన్నసంశయమ్ |
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ || 41 ||
స|| హే ధనంజయా ! యోగసన్యస్త కర్మాణమ్ జ్ఞానసంచ్ఛిన్న సంశయమ్ ఆత్మ వన్తం కర్మాణి న నిబధ్నంతి ||41||
||శ్లోకార్థములు||
హే ధనంజయా - ఓ ధనంజయా
యోగసన్యస్త కర్మాణమ్ - యోగముచే కర్మలను త్యజించినవానిని
జ్ఞానసంచ్ఛిన్న సంశయమ్ - జ్ఞానముతో సంశయములను ఛిన్నము చేసినవానిని
ఆత్మ వన్తం - ఆత్మ నిష్ఠ కలవానిని
కర్మాణి న నిబధ్నంతి - కర్మలు బంధింపవు
||శ్లోకతాత్పర్యము||
"ఓ ధనంజయా, యోగముచే కర్మలను త్యజించినవానిని, జ్ఞానముతో సంశయములను ఛిన్నము చేసినవానిని,
ఆత్మ నిష్ఠ కలవానిని, కర్మలు బంధింపవు." ||41||
ఈ శ్లోకాలలో ఆరు శ్లోకాలలో( 36-41) జ్ఞానయజ్ఞము ప్రాముఖ్యత చెప్పాడు :
- జ్ఞానము పొందుట వలన మోహము నశించును.
- జ్ఞానము పొందుట వలన సమస్త ప్రాణికోట్లను తనయందు, భగవంతుని యందును వీక్షించును
- జ్ఞానము పొందుట వలన పాపాత్ములలో అందరి కంటెను మిగుల పాపము చేసిన వాడైనను ,
సమస్త పాప సముద్రమును జ్ఞానమను తెప్పచే దాటి వేయ గలుగును.
- జ్ఞానము కర్మలను అగ్నిలాగ బూడిద చేసి మనుష్యుని బంధరహితముగా చేస్తుంది.
చివరి మాటలా కృష్ణుడు చెపుతాడు:
||శ్లోకము 42||
తస్మాదజ్ఞాన సంభూతం హృత్థ్సం జ్ఞానాసినాత్మనః |
ఛిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత || 42||
స|| హే భారత ! తస్మాత్ ఆత్మనః హృద్ స్థమ్ అజ్ఞానసంభూతమ్ ఏనం సంశయమ్ జ్ఞానాసినా చిత్వా యోగమ్ ఆతిష్ఠ ఉత్తిష్ఠ ||42||
||శ్లోకార్థములు||
హే భారత - ఓ భారత
తస్మాత్ ఆత్మనః హృత్స్థమ్ - అందువలన నీయొక్క హృదయములో వున్న
అజ్ఞానసంభూతమ్ ఏనం సంశయమ్ - అజ్ఞానముతో పుట్టిన ఈ సందేహమును
జ్ఞానాసినా చిత్వా - జ్ఞానమనే ఖడ్గముతో నశింపచేసి
యోగమ్ ఆతిష్ఠ - యోగము ఆచరించుము
ఉత్తిష్ఠ - లెమ్ము
||శ్లోకతాత్పర్యము||
"ఓ భారత, అందువలన నీయొక్క హృదయములో వున్న, అజ్ఞానముతో పుట్టిన ఈ సందేహమును,
జ్ఞానమనే ఖడ్గముతో నశింపచేసి, యోగము ఆచరించుము.లెమ్ము" ||42||
ఇప్పటిదాకా చెప్పిన జ్ఞానమును, నిష్కామ కర్మనూ కలుపుతూ కృష్ణుడు అర్జునుడితో ఇలా చెపుతాడు:
"ఓ భారతా ! ఆ అజ్ఞానము వలన పుట్టిన , నీ హృదయములో నిలబడి వున్న "సంశయము" అను అజ్ఞానమును, జ్ఞానమనే ఖడ్గముతో చేదించి జ్ఞానయోగ సాధనము అయిన నిష్కామకర్మ ఆచరించుము. లెమ్ము!" అని
ఆ విథముగా జ్ఞానమునే ఖడ్గము గా ఉపయోగించమని అర్జునిడికి ఉపదేశిస్తాడు.
ఈ అధ్యాయములో కృష్ణుడు యజ్ఞము యొక్క తత్త్వము విడమరిచి, మానవాళికి అనేక యజ్ఞములు చెప్పెను మనుజుడు ఉదయము లేచిన క్షణము నుండి ఏదియో యొక కర్మను చేయుచునే యుండును. నిత్య జీవితమునకు అవసరము అయ్యెడి ప్రతి కార్యమును భగవంతుని తో అనుసంధానము గావించి ఈశ్వరార్పితము చేసిన యడల ఆ కర్మల బంధము దూరమగును.
పైన చెప్పిన యజ్ఞములలో ప్రతి దినము ఏదో ఒక యజ్ఞము అయినను చేయుటకు పూనుకొన వలెను.
ఆహారము భుజించుట కూడా బ్రహ్మార్పణము గావించి చేసిన అది యజ్ఞమగును.
అన్నియజ్ఞములలో శ్రేష్టమైనది జ్ఞానయజ్ఞము. జ్ఞానమార్గములో పొవు వారు చేసే యజ్ఞము అదే.
భగవంతుడు చెప్పిన యజ్ఞములలో ఇంద్రియ నిగ్రహము ఒకటి.
ఇంద్రియనిగ్రహము అంటే ఇన్ద్రియములన్నిటిని శబ్దాది విషయము లందు సంచరించ నీయక బాహ్య ప్రపంచము నుండి మరలించి దైవమునందు దైవ విషయములందు విలీన మొనర్చుట. అదియే ఇంద్రియనిగ్రహము.
మానవుని ప్రతి ఇంద్రియము ఎంతో శక్తిని సంతరించుకుని ఉన్నది. దీనికి ఒక చక్కటి ఉదాహరణము ఇచట చెప్పబడుచున్నది. మహాభారత యుద్ధము ముగి౦పు రాబోవు సమయమున కౌరవులలో ధుర్యో ధనుడు మాత్రము మిగిలియుండెను. చివరిరోజు యుద్ధమునకు పోబోవుచూ దుర్యోధనుడు తల్లి గాంధారి యొక్క ఆశీర్వచనమునకై వచ్చెను. దుర్యోధనుడు వచ్చి ఆశీర్వదింపుమని అడుగగా గాంధారి యిట్లనెను."దుర్యోధనా! నీవు నదీ స్నానము చేసి, ఏ వస్త్రము ధరింపక నా వద్ధకు రమ్ము" అని. అంత దుర్యోధనుడు అటులనే చేయుచుండగా, శ్రీకృష్ణుడు తల్లి వద్దకు అయినను అట్లు వెళ్ళుట సముచితము కాదని, అంగవస్త్రము ధరించి వెళ్ళుము అని సలహా ఇచ్చెను.
అపుడు దుర్యోధనుడు చిన్న అంగవస్త్రము ధరించి వెళ్ళెను.గాంధారి పుత్ర ప్రేమతో దృష్టి సారించగా ఆమె దివ్య నేత్రముల నుండి వచ్చిన దివ్య తేజస్సు ఎదురుగా నున్న దుర్యోధనుని శరీరమున వ్యాపింపగా, అంగవ స్త్రముచే కప్పబడిన భాగము తప్ప మిగిలిన శరీరమంతయూ వజ్రముతో సమానమైన శక్తిని సంతరించు కొన్నది. గాంధారి నేత్రముల నుండి వచ్చిన ఆ దృష్టికి అంతటి శక్తి ఎట్లు వచ్చినది ? గాంధారి వివాహము అయినప్పటి నుంచి నేత్ర దృష్టిని నిక్షిప్త పరచు కొనెను. అదియే ఆమె శక్తి. అట్టి ఇంద్రియ శక్తిని వృథా చేయరాదు అని .
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయామ్ యోగ శాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ
చతుర్థోఽధ్యాయః ||
||ఓమ్ తత్ సత్ ||