||భగవద్గీత ||
||నాలుగవ అధ్యాయము ||
||జ్ఞాన యోగము - వచన వ్యాఖ్యానము
||
||ఓమ్ తత్ సత్ ||
శ్రీ భగవానువాచ:
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్ ||
"నాశరహితమైన ఈయోగమును నేను పూర్వము సూర్యునకు చెప్పితిని. సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించెను.మనువు ఇక్ష్వాకునకు బోధించెను"
||ఓమ్ తత్ సత్ ||
శ్రీకృష్ణపరబ్రహ్మనే నమః
శ్రీమద్భగవద్గీత
జ్ఞానయోగము
నాలుగవ అధ్యాయము
-
మొదటి మూడు అధ్యాయాలలో మొదటి శ్లోకము ఒక ప్రశ్నతో మొదలగుతుంది.
ప్రథమాధ్యాయములో ధృతరాష్ట్రుని ప్రశ్న ,
ద్వితీయ తృతీయ అధ్యాయాలలో అర్జునుడి ప్రశ్నలు వస్తాయి.
మొదటిసారిగా నాలుగవ అధ్యాయము "శ్రీభగవానువాచ" అంటూ,
అంటే కృష్ణ భగవానుని మాటలతో మొదలగుతుంది.
శ్రీభగవానువాచ:
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్ ||
" ఈ అవ్యయమైన కర్మయోగమును నేను పూర్వము సూర్యునకు చెప్పితిని.
సూర్యుడు మనువు కొఱకు, మనువు ఇక్ష్వాకునకు బోధించెను" ,
కర్మయోగములో కర్మయోగము ప్రాచీనమైనది.
దానిని అనుసరించి "జనకాదయః..." అంటే జనకుడు మొదలగు వారు ముక్తిని పొందారు అని కృష్ణుడు చెప్పగా విన్నాము.
కర్మయోగము కృష్ణునికి అతి ప్రియకరము అన్నట్లు " యే మే మతం ఇదమ్.. "
అంటే ఇది నా మతము అని కూడా చెపుతాడు.
ఆ కర్మయోగముయొక్క ప్రాచీనత వివరిస్తూ కృష్ణుడు
కర్మయోగముయొక్క పుట్టు పూర్వోత్తరాలు చెపుతాడు.
ఆ పూర్వోత్తరాలతో ఈ జ్ఞానయోగము మొదలగుతుంది.
కర్మయోగము భగవంతుడు ద్వారా మొదటగా సూర్యునకు ,
సూర్యునిద్వారా మిగిలిన వారికి ఉపదేశించబడినది అన్నమాట.
ఇది పరంపరగా వచ్చిన పద్ధతి.
అయితే..
"స కాలేన మహతా యోగో నష్ఠః పరన్తప"
ఇలా పరంపరగా వచ్చుచున్న నిష్కామకర్మ అనబడు "మహత్ యోగః" అంటే కర్మయోగము
" కాలేన " కాలప్రవాహములో - " నష్టః" - కలిసిపోయింది !!
అంటే అందరూ మరచిపోయారు అన్నమాట.
అందుకనే కృష్ణుడు తన భక్తుడు మిత్రుడు అర్జునుడికి,
తద్వారా మళ్ళీ లోకములో అందరికీ ఉపదేశించాడు.
ఆప్పుడు అర్జునుడికి మళ్ళీ సందేహము వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ తన ఎదురుగుండా వుండి,
తనే పూర్వకాలములో సూర్యునికి ఉపదేశించాను అంటే అది ఎలాకుదురుతుంది అని.
అప్పుడు కృష్ణుడు మొదటి సారిగా తన భగవత్స్వరూపము గురించి చెపుతాడు.
(1) తనకి చాలా జన్మలున్నట్లు, " తాన్ అహం వేత్థ సర్వాణి " అవన్నీ నాకు తెలుసు
(2) " అజోపి " తను పుట్టుక లేనివాడు అయినా ,
" సంభవామి ఆత్మ మాయయా "
తనకి జన్మ అవసరము లేకపోయినా తన మాయచేత తనే లోకములో పుట్టుతాను అని
(3) అలా ఎప్పుడు ఎందుకు పుడుతాడు అంటే
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మశ్చ
తదాత్మానం సృజామ్యహమ్ ||
అంటే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు
ఆ ధర్మమునకు కలిగిన హాని తొలగించడము కోసము అని !.
పుట్టి ఏమి చేస్తాడు...
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం|
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే ||
"సాధువులను రక్షించడంకోసము ,
ధర్మమును మళ్ళీ స్థాపించుట కోసము
ప్రతి యుగములోనూ పుట్టుతాను" అని
అంటే అర్జునుడు "నీవు ఇప్పటివాడివి పూర్వములో సూర్యునికి ఏలా చెప్పావు"
అని అడిగిన ప్రశ్నకు సమాధానముగా,
తాను పుట్టుక లేని వాడనని నాశ రహితుడ ననీ సర్వజ్ఞుడనని
తన భగవదవతారముల గురించి మట్లాడుతూ,
అవతారాలు ఎందుకు అన్నమాటగురించి కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్పుతాడు.
అప్పటి దాకా కృష్ణుడు దేవకీ వసుదేవుల పుత్రుడనియే అనుకొని ,
తమని కష్టాలలో ఆదుకుంటాడు అని తెలిసినా,
కృష్ణుడు భగవత్స్వరూపమని అనుకున్నా -
అర్జునుడికి "కృష్ణుడే భగవంతుడు" అన్న మాట
భగవద్గీతలో మొట్టమొదటిసారిగా కృష్ణుడే చెపుతాడు.
అలా తన స్వరూపము గురించి చెప్పి -
అనురాగము అంటే కోరిక భయము క్రోధము విడచిన వారై
నాయందే చిత్తము లగ్నము చేసి నన్నే ఆశ్రయించి
జ్ఞానతపస్సుచే పవిత్రులైన వారు -
"మద్భావం ఆగతాః" - "నా స్వరూ పమును పొందుదురు" అని .
అంటే జ్ఞానతపస్సుతో మోక్షముపొందుతారు అని.
జ్ఞానతపస్సు అంటే
అనురాగము లేక కోరిక భయము క్రోధము లేని వారై
భగవంతుని ఆశ్రయించి భగవంతుని మీదనే ధ్యానము చేయుట అన్నమాట.
కృష్ణుడు ఎవరికి కర్మవలన బంధము కలుగదు అన్న మాటగురించి చెప్పుతూ ,
"అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందువాడు
సుఖ దుఃఖాది ద్వంద్వములు దాటి, మాత్సర్యము లేక,
ఫలము యొక్క ప్రాప్తము అప్రాప్తము అనే విషయములందు సమ బుద్ధి కల వాడు,
కర్మ చేసినను బంధింప బడడు " అని చెపుతాడు.
కృష్ణుడు భగవదనుగ్రహము గురించి చెపుతూ ఇలా అంటాడు
- "యే యథా మాం ప్రపద్యంతే"-
- "ఎవరు ఏ ప్రకారముగా భగవంతుని ప్రార్థింతురో"-
వారిని ఆప్రకారముగానే భగవంతుడు అనుగ్రహించును.
ఒకసారి కాళిదాసు రఘువంశం లో చెపుతాడు "లోకో భిన్నరుచిః".
లోకులకు అనేక మైన రుచులు ( కోరికలు) ఉంటాయి అని.
ఒకరు నిష్కామకర్మ చేస్తూ శాంతి సమత్వము పొందాలి అని కోరుకుంటారు ;
ఒకరు అదే కర్మ చేస్తూ "ఓ దేవా నాకు సమస్త సుఖములు కావాలి" అనుకుంటారు.
కృష్ణుడు చెప్పేది
"ఎవరు ఏ ప్రకారముగా భగవంతుని ప్రార్థింతురో
వారికి భగవంతుడు అదే విథముగా అనుగ్రహించును" అని.
అంటే నిష్కామ కర్మచేసినా మనకి మన కోరుకో వలసిన కోరిక మీద జ్ఞానము ఉండాలి అన్నమాట.
లేకపోతే ఏమీ కోరుకో ఆక్కరలేదు అని ,
నిష్కామకర్మ అంటేనే దానిలోనే ఉంది "కోరిక" గురించి అని -
అది "కోరిక లేని కర్మ" అని తెలిసి ఉండాలి .
అలాంటి కోరికలేని కర్మ చేస్తూవున్నప్పుడు
ఇంకోసంగతి అనవసరము అని తెలుసు కొనడమే "జ్ఞానము".
ఆ జ్ఞానము లేనప్పుడు మనము కర్మ చేస్తూ నిష్కామ కర్మ చేస్తున్నాము అని అనుకుంటాము.
కాని మనస్సు అంతా భగవదనుగ్రహము
ఏప్పుడు ఏరూపములో వస్తుంది అనే అలోచనలో ఉండి
కావలసిన హృదయ నిర్మలత్వము ఉండదు !!
అంటే మనస్సుని అదుపులో పెట్టుకోవాలి.
అలా మనస్సుని అదుపులో పెట్టూకొని ఎవరైతే..
"నమాం కర్మాణి లింపన్తి"
"నన్ను కర్మలు అంటవు ,
"నమే కర్మ ఫలే స్పృహా"
"నాకు కర్మఫలములమీద కోరికలేదు"
"ఇతి మాం యోభిజానాతి "
అని నన్ను( తనను) ఎవరు తెలుసుకుంటారో - వారికి కర్మబంధములు ఉండవు !
ఈ శ్లోకములో ఎవరికైతే ఆత్మ జ్ఞానము ఉందో వారికి కర్మబంధములు ఉండవు అని అర్థము ;
ఇంకా " "నన్ను కర్మలు అంటవు , నాకు కర్మఫలములమీద కోరికలేదు" అని నిశ్చయముతో
ఎవరైతే భగవంతుని మీదే ధ్యానము చేస్తున్నారో వారికి కర్మబంధములు ఉండవు అని అర్థము.
"ఈ రహస్యము తెలిసికొని చాలామంది భక్తులు మోక్షముపొందారు.
కనుక అర్జునా నీవు కూడా పూర్వీకులలా నిష్కామ కర్మ చేయి" అని కృష్ణుడు అర్జునుడికి చెపుతాడు.
కర్మ అనే విషయములో ఏది "కర్మ"? ఏది "అకర్మ" ? అన్న మాటమీద మేధావులకు కూడా అర్థము కాదు.
కర్మ కూడా రెండు విధములు.
ఒకటి చేయవలసిన కర్మ ( అదే అసలు కర్మ).
రెండవది చేయకూడని కర్మ. అంటే నిషిద్ధ కర్మ. అదే "వికర్మ".
ఈ కర్మల భేదము అంటే "కర్మ- వికర్మ- అకర్మ"ల మూడింటికి భేదము తెలిసిన వాడు జ్ఞాని .
ఆ భేదము తెలిసి - "కర్మ" లో "అకర్మ" ను - "అకర్మ"లో కర్మను - చూడగలిగిన వాడు వివేకము గలవాడు.
అట్టివానికి , అంటే అట్టి జ్ఞానికి ఆత్మసాక్షాత్కారము పొందుటచే సమస్త నియత కర్మలను చేసిన వాడగును.
అంటే చేయవలసిన కర్మలను అన్నీఆచరించిన వాడు అగును.
అంటే మోక్షసాధకుడు అన్నమాట.
అయితే "కర్మ" లో "అకర్మ" ఏమిటి ?
నిష్కామకర్మ చేస్తూ ఫలములను అపేక్షించ కుండా,
ఇంకా పైగా కర్తృత్వము లేకుండా ,
అంటే ఆ చేసే కర్మ తనే చేస్తున్నాను అనే భావన లేకుండా,
ఇంకా చేస్తున్న ఆ కర్మ, అంటే ఆ చేస్తున్న పని, భగవదనుగ్రహముతో చేస్తున్నాను అనే భావన తో చేసినప్పుడు,
ఆ కర్మ వలన బంధము వుండదు.
అంటే ఆ కర్మ చేసినాగాని కర్మ చేయనట్లే అగును.
అంటే ఆ కర్మ, "అకర్మ" లాంటిదే.
అదే " కర్మ" లో " "అకర్మ" చూడగలగటము అంటే !!
మరి "అకర్మ" లో "కర్మ" ఏమిటి?
ఒకడు తన ప్రకృతి మార్చుకోకుండా
అంటే తనలో వున్న రజో తమో గుణములను నిర్మూలింఛకుండా ,
దేహేంద్రియములను అదుపులో పెట్టి ఏమీ కర్మ చేయక అది " అకర్మ" అనుకోవచ్చు .
కాని ఆ "అకర్మ"లో అతడు రజో తమో గుణముల ప్రభావములో
తన మనస్సుతో కర్మలను ఆచరిస్తూ వుంటే అది బాహ్యముగా " అకర్మ" అయినా
అది మనసా " కర్మ" లతో అంటే నిషిద్ద "కర్మ"లతో కూడినది.
అలాగ ఆ "అకర్మలో" కర్మ వున్నది అని గ్రహించుట యే " అకర్మ లో "కర్మ" చూడడము అన్న మాట !
కర్మ భేదములు తెలిసి,
"కర్మలో అకర్మ", "అకర్మలో కర్మ" చూడగలిగి,
ఎవరైతే కోరిక సంకల్పము లేకుండా
జ్ఞానము అనే అగ్నిలో కర్మలను దహించి ఆచరిస్తాడో వాడు " పండితుడు" అనబడును.
ఆట్టివాడు అన్ని విధముల కర్మ బంధనలకు అతీతుడు.
అట్టివాడు జ్ఞానావస్థలో వున్నప్పుడు భవత్ప్రీత్యర్థము
ఏమి కర్మ చేసినా అది బంధరహితము అగును అని కృష్ణుడు చెపుతాడు.
భగవత్ప్రీతికోసము అందరూ తమ తమ ఇష్టానుసారము ప్రార్థన చేస్తారు.
భగవత్ప్రీతి కోసము చేసే ప్రార్థనే యజ్ఞము.
భగవత్ప్రీతికోసము చేసే ప్రార్థనలే యజ్ఞములు కూడా.
అవి అనేక రకములు
ఇక్కడ కృష్ణుడు యజ్ఞముల గురించి ఒక ముఖ్యమైన మాట చెపుతాడు.
"బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ||"
అంటే
"యజ్ఞము నందలి హోమసాధనములు,హోమద్రవ్యములు
హోమాగ్నీ, హోమము చేయు వాడు,
హోమము చేయబడునది, అన్నియు బ్రహ్మస్వరూపములే !
అలాంటి ఏకాగ్ర భావముతో యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందుచున్నాడు"
జీవుని పాపమును పోగొట్టి చిత్తశుద్ధి కలిగించి తద్వారా మోక్షమును కలుగ జేయుటకు ఆచరించ వలసిన యజ్ఞములు అవి .
ఆ యజ్ఞములు అనేక రకములుగా తలచవచ్చును .
ఆ యజ్ఞములు ఇవి:
1 దైవ యజ్ఞములు - దేవతారాధన , దేవత ఉపాశనా మొదలగునవి
2 బ్రహ్మ యజ్ఞము - విచారణచేత , పవిత్రతచేతను మనస్సును బ్రహ్మలో విలీనమొనర్చుట
3 ఇన్ద్రియసంయమ యజ్ఞము -
ఇంద్రియ నిగ్రహము మోక్షసాధనకు ప్రథమసోపానము.
ఇంద్రియ నిగ్రహమునే ఒక యజ్ఞము గా భావించి చేయుట.
అదే ఒక యజ్ఞము.
4 శబ్దాది విషయ నిరోధ యజ్ఞము -
ఇంద్రియములు విషయములమీద తిరుగుతూవుంటాయి.
విషయములలోని దోషాలని విచారించి వాటిపై కోరికలు త్యజించాలి .
లేకపోతే ఇంద్రియములు వాటిపై పరుగెత్తుతాయి.
అలా విషయములపై ఆశక్తి,, విషయములలోని దోషాలపై కోరికి, అణగదొక్కినప్పుడు
మన మనస్సుకు నిలకడ శాంతి దొరకును.
ఆ నిలకడలోనే ఆత్మజ్ఞానము .
ఆత్మజ్ఞానమే మోక్షము.
ఇందులో శబ్దాది విషయనిరోధము అనబడు సోపానమే యజ్ఞము గా భావించుట
5 మనోనిగ్రహ యజ్ఞము :
మనస్సు అదుపు లేని గుర్రాలు లాంటిది.
ఇంద్రియ నిగ్రహము శబ్దాది విషయ నిరోధనము కూడా
మనస్సు ద్వారా అదుపులోకి తీసుకు రావాలి.
మనస్సును అధీనము లో తీసుకు రావడానికి
మనస్సుకి పై స్థానములో నున్న బుద్ధి ద్వారా మనస్సుని నిగ్రహించాలి.
ఆ మనో నిగ్రహమే ఒక యజ్ఞము గా చేయుట యే మనోనిగ్రహ యజ్ఞము.
6 ద్రవ్య యజ్ఞము :
తన ధనమును దాన ధర్మాది కార్యక్రమములపై సద్వినియోగపరచుట యే ఒక యజ్ఞము.
7 తపోయజ్ఞము:
వ్రత ఉపవాసములతో దేహేంద్రియాలను తపింపచేసి వశపరచుకొనుటయే ఒక యజ్ఞము.
8 యోగయజ్ఞము:
యమ నియామది రూపములు కల అష్టాంగ యోగమే ఒక యజ్ఞము.
9 స్వాధ్యాయ యజ్ఞము:
వేదోపనిషత్తుల అధ్యయనమే ఒక యజ్ఞముగా ,
10 జ్ఞాన యజ్ఞము:
వేదోపనిషత్తుల అధ్యయనమే కాక
వాటిని అర్థము చేసుకోని వాటిని అవలంబించుట యే ఒక యజ్ఞము.
అది యే జ్ఞాన యజ్ఞము.
11 ప్రాణాయామ యజ్ఞము: ప్రాణాయామమే ఒక యజ్ఞముగా
12 ఆహారనియమ యజ్ఞము :
ఆహార నియమమున కట్టుబాటు కలవారు.
ఆనియమమే ఒక యజ్ఞముగా చేయువారు
అన్నింటిలో యజ్ఞము చేసేవారందరూ "సంశిత వ్రతాః "
తము పూనుకొన్నకర్మ మీద ధృఢ చిత్తము కలవారు ,
అనుకున్న పనినే కఠోర నియమముల తో చేయువారు.
అది యే వారి యజ్ఞము
ఇవన్నీ చెప్పి కృష్ణుడు మళ్ళీ వీటిలో దేనికి ప్రాధాన్యత అన్న విషయము కూడా చెపుతాడు .
శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞా జ్ఞానయజ్ఞః పరన్తప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||
అంటే
" ఓ అర్జునా ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞముకన్నా
జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది.
ఎందుకనగా సమస్త కర్మ నాశనము కానిదై, జ్ఞానమునందే వుండుట వలన"
ద్రవ్యయజ్ఞము అంటే దాన ధర్మాది కార్యక్రమములుచేస్తూ
వాటిలోనే తన్మయత్వము పొందడము, తద్వారా మోక్షము.
ద్రవ్యయజ్ఞములో చేయు కర్మ, దాన ధర్మములు.
జ్ఞానయజ్ఞములో కర్మ జ్ఞానము. జ్ఞానము జ్ఞానోపాశన చేసినవాడి దగ్గిరే ఉంటుంది. అది కృష్ణుడి మాట.
జ్ఞానము ఏలా సంపాయించాలి?
-
- "ప్రణిపాతేన"
గురువు గారికి సాష్ఠాంగ ప్రణామము చేసి
- "పరిప్రశ్నేన"
గురువుగారిని వినయముతో ప్రశ్నించుట తో
-"సేవయా"
సేవ చేసి
-"జ్ఞానినః తత్వదర్శినః"
- గురువు లు ఎవరు -
- బ్రహ్మానుభవము గల జ్ఞానులు, వారి ద్వారా !
- అయితే ఎవరికి జ్ఞానము లభిస్తుంది?
- "శ్రద్ధవాన్" ! - శ్రద్ధ వున్నవాళ్ళకే - !
- "తత్పరః:" - దానియందే లగ్నమైనవాడికి-
- "సంయతేంద్రియః" - ఇంద్రియములను జయించినవాడికి
జ్ఞానయజ్ఞము శ్రేష్టము అనడానికి ఇంకా విషయాలు ఉన్నాయి:
జ్ఞానము పొందుట వలన అంతవరకు గల మోహము నశించును.
జ్ఞానము పొందుట వలన సమస్త ప్రాణికోట్లను తనయందు , భగవంతుని యందును వీక్షించును
జ్ఞానము పొందుట వలన పాపాత్ము లందరి కంటెను మిగుల పాపము చేసిన వాడైనను ,
సమస్త పాప సముద్రమును జ్ఞానమను తెప్పచే దాటి వేయ గలుగును.
జ్ఞానము కర్మలను అగ్నిలాగ బూడిద చేసి మనుష్యుని బంధరహితముగా చేస్తుంది.
చివరి మాటలా కృష్ణుడు చెపుతాడు:
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్ స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి||
అంటే
"జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఏదియును లేదు
అట్టి జ్ఞానము పొందినవాడు కాలక్రమమున తన యందే అనుభవించును"
ప్రపంచములో పవిత్రమైనవి చాలా ఉంటాయి.
కాని జ్ఞానముతో సమానముగా పవిత్రమైనవి లేవు
అంటే జ్ఞానమే అన్నిటికన్నా పవిత్రమైనది అని దీని భావము.
ఈ జ్ఞానము స్వయముగా ప్రయత్నించుటవలనే దొరుకుతుంది.
ఈ జ్ఞానము ఎక్కడ ఉదయిస్తుంది - "ఆత్మని"- ఆత్మలో
ఈ జ్ఞానమునకు కాలమునకు సంబంధము- "కాలేన" కాలక్రమములో జ్ఞానము మోక్షకారణమగుతుంది.
జ్ఞానము - "సంశయము" అనబడే ఆజ్ఞానమును నివర్తిస్తుంది అంటే పోగొట్టుతుంది
చివరలో జ్ఞానమును నిష్కామ కర్మనూ కలుపుతూ కృష్ణుడు అర్జునుడితో అంటాడు:
"తస్మాదజ్ఞాన సంభూతం హృత్థ్సం జ్ఞానాసినాత్మనః |
చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ||"
అంటే..
"ఓ భారతా ! ఆ అజ్ఞానము వలన పుట్టిన ,
నీ హృదయములో నిలబడి వున్న "సంశయము" అను అజ్ఞానమును
జ్ఞానమనే ఖడ్గముతో చేదించి జ్ఞానయోగ సాధనము అయిన నిష్కామకర్మ ఆచరించుము. లెమ్ము !
ఆవిథముగా జ్ఞానమనే ఖడ్గమును అర్జునిడికి ఉపదేశిస్తాడు.
అన్వయము :
మనుజుడు ఉదయము లేచిన క్షణము నుండి ఏదియో యొక కర్మను చేయుచునే యుండును..
మన నిత్య జీవితమునకు అవసరము అయ్యెడి ప్రతి కార్యమును భగవంతుని తో అనుసంధానము గావించి ఈశ్వరార్పితము చేసిన యడల ఆ కర్మల బంధము మనకి దూరమగును.
పైన చెప్పిన యజ్ఞములలో ప్రతి దినము మనము ఒక యజ్ఞము అయినను చేయుటకు పూనుకొన వలెను.
ఆహారము భుజించుట కూడా బ్రహ్మార్పణము గావించి చేసిన అది యజ్ఞమగును.
అన్నియజ్ఞములలో శ్రేష్టమైన జ్ఞానమునకై సర్వదా కృషి చేయవలెను.
భగవంతుడు చెప్పిన యజ్ఞములలో ఇంద్రియ నిగ్రహము ఒకటి.
దాని వివరణ:
ఇంద్రియనిగ్రహము :
ఇన్ద్రియములన్నిటిని శబ్దాది విషయము లందు సంచరించ నీయక
బాహ్య ప్రపంచము నుండి మరలించి
దైవమునందు దైవ విషయములందు విలీన మొనర్చుట. ఏకాగ్రమొనర్చుట. అదియే ఇంద్రియనిగ్రహము.
మానవుని ప్రతి ఇంద్రియము ఎంతో శక్తిని సంతరించుకుని ఉన్నది.
కాని ప్రతి వ్యక్తి ఈ శక్తి అంతనీ బాహ్య విషయములయందు వినియోగించి, వాటి శక్తిని వృధా చేసికొనుచున్నాడు.
దీనికి ఒక చక్కటి ఉదాహరణము ఇచట చెప్పబడుచున్నది.
మహాభారత యుద్ధము ముగి౦పు రాబోవు సమయమున కౌరవులలో ధుర్యో ధనుడు మాత్రము మిగిలియుండెను.
చివరిరోజు యుద్ధమునకు పోబోవుచూ దుర్యోధనుడు తల్లి గాంధారి యొక్క ఆశీర్వచనమునకై వచ్చెను.
దుర్యోధనుడు వచ్చి ఆశీర్వదింపుమని అడుగగా గాంధారి యిట్లనెను .
"దుర్యోధనా! నీవు నదీ స్నానము చేసి, ఏ వస్త్రము ధరింపక నా వద్ధకు రమ్ము" అని.
అంత దుర్యోధనుడు అటులనే చేయుచుండగా,
శ్రీకృష్ణుడు తల్లి వద్దకు అయినను అట్లు వెళ్ళుట సముచితము కాదని
అంగవస్త్రము ధరించి వెళ్ళుము అని సలహా ఇచ్చెను.
అపుడు దుర్యోధనుడు చిన్న అంగవస్త్రము ధరించి వెళ్ళెను.
గాంధారి పుత్ర ప్రేమతో దృష్టి సారించగా ఆమె దివ్య నేత్రముల నుండి వచ్చిన దివ్య తేజస్సు
ఎదురుగా నున్న దుర్యోధనుని శరీరమున వ్యాపింపగా,
అంగవ స్త్రముచే కప్పబడిన భాగము తప్ప మిగిలిన శరీరమంతయూ వజ్రముతో సమానమైన శక్తిని సంతరించు కొన్నది.
గాంధారి నేత్రముల నుండి వచ్చిన ఆ దృష్టికి అంతటి శక్తి ఎట్లు వచ్చినది ?
గాంధారి వివాహము అయినప్పటి నుంచి నేత్ర దృష్టిని నిక్షిప్త పరచు కొనెను. అదియే ఆమె శక్తి
అట్టి ఇంద్రియ శక్తిని వృథా చేయరాదు అని .
|| ఓమ్ తత్ సత్ ||
శ్రీభగవానువాచ
తస్మాదజ్ఞాన సంభూతం హృత్థ్సం జ్ఞానాసినాత్మనః |
చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ||
"ఓ అర్జునా! కాబట్టి నీ హృదయమున్నదియూ అజ్ఞానమువలన పుట్టినది అగు ఈ సంశయమును జ్ఞానమనబడు ఖడ్గముచే ఛేదించి నిష్కాఅమకర్మ యోగమును ఆచరింపుము. లెమ్ము!"
|| ఓమ్ తత్ సత్||
___________________________________________________________________
|| ఓమ్ తత్ సత్||