||భగవద్గీత ||
||ఐదవ అధ్యాయము ||
||కర్మ సన్న్యాస యోగము- ఓక చిన్నమాట
||
|| Om tat sat ||
భగవద్గీత
ఇదవ అధ్యాయము
కర్మ సన్యాస యోగము:
భవద్గీతలో - ఓక చిన్నమాట
భగవద్గీతలో కొన్ని మాటలు చాలా అద్భుతముగా ఉంటాయి.
ఈ ఇదవ అధ్యాయములో అలాంటి మాటలు వస్తాయి.
ఓక చోట కృష్ణుడు చెపుతాడు
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే ||
అంటే :
ప్రభుః లోకస్య కర్తృత్వం న సృజతి | - భగవంతుడు జీవులకు కర్తృత్వము కలగ చేయడు -
కర్మాణి న | - కర్మలను కూడ కలగచేయడు
కర్మఫలసంయోగమ్ (అపి) న సృజతి | - కర్మఫలములతో సంబంధము కూడా కలగ చేయడు
స్వభావః తు ప్రవర్తతే - అవన్నీ వారి వారి స్వభావము వలన వస్తాయి.
అంటే మనము చేసే పనులన్నీ మన భాద్యతతోనే వస్తాయి తప్ప - వాటన్నిటికీ కారణము దేముడే అని అనుకోడానికి వీలు లేదు. మనం వేళ్ళి దొంగతనము చేసి అన్నిటికీ భగవంతుడే భాధ్యుడు అనుకోడానికి వీలు లేదు . అలాగే లాటరీ గెలిచి అది దేముడు దయ అనుకోడము కూడా భ్రమ యే ! మనము సాత్వికహృదయముతో మంచి పనులు చేసినా లేక తమోగుణముతో చెడు పనులు చేసినా అవి మన స్వభావము వలన చేయబడినవే .
ఈ మాట చాలా చిన్నమాట .
స్వాభావికమైన మాట.
ఇది నిజమా కాదా అని అలోచనచేయడానికి అవసరమే లేదు.
అంతా పచ్చి నిజము !!
ఇది అర్థము చేసుకోడానికి తత్వార్థ జ్ఞానము , వేదాంతము కూడా అక్కరలేదు.
అలాంటి మాటే తరువాత శ్లోకములో వస్తుంది.
నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః |
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః ||
అంటే
"విభుః కస్యచిత్ పాపమ్ న ఆదత్తే | - దేముడు ఎవరి పాపము స్వీకరింపడు !
అంటే పాపము చేసి ప్రాయశ్చిత్తపడి , కాశీలో గంగలో స్నానము చేసి ఆ పాపము అంతా భవంతుడికి ఇచ్చేశాము అది భగవంతుడు స్వీకరిస్తాడు అనుకోడము కూడా అజ్ఞానము.
అలాగే
"సుకృతం చ ఏవ న (ఆదత్తే)"|-
అంటే అలాగే మంచిపనులు కూడా భగవంతుడు స్వీకరింపడు.
అంటే మన పాపపుణ్యాలకి భగవంతుడు సాక్షి తప్ప ఇంకేమి లేదు.
నిజానికి మనపాప పుణ్యాలకి మన మనస్సే యే సాక్షి
ఇంకో మాటలో చెప్పాలి అంటే భగవంతుడు లాగా ఆత్మ కూడా సాక్షి.
అద్వైతములో మనకు తెలిసేది
అత్మా అన్నా పరమాత్మ అన్నా ఒకటే !!
భగవంతుడు మనకి అన్నీ చేస్తాడు చేయిస్తాడు అనే మాటలన్నీ ఎందుకు వస్తాయి అంటే
అజ్ఞానేన జ్ఞానం ఆవృతమ్| - అజ్ఞానము వలన
( తస్మాత్) తేన జంతవః ముహ్యంతి - ఆ అజ్ఞానము వలన జంతువులు( అంటే మనుష్యులుకూడా) మోహముపొందుచున్నారు !
ఇదే విధముగా ఉద్దవగీతలో ఒక మాట చెపుతాడు కృష్ణుడు.
ప్రాయేణ మనుజా లోకే లోక తత్వ విచక్షణాః|
సముద్ధరన్తి ఆత్మానం ఆత్మనైవాశుభాశయాత్ ||
అంటే " లోక తత్వ విచక్షణాః " లోక తత్త్వ విచక్షణా జ్ఞానము ఉన్నవాళ్ళు
"సముద్ధరంతి ఆత్మానం"- తమను తామే ఉద్దరించుకొనెదరు - ఎలాగ?
"ఆత్మనైవ" - తమ ఆత్మ చేతనే ; దేనినుంచి ఉద్ధరించుకుంటారు అంటే
అశుభాశయాత్ - అశుభకర్మల నుంచి !!
అంటే మనష్యులు తమను తామే తమ విచక్షణా జ్ఞానము ద్వారా పైకి తీసుకు రాగలరు.
మళ్ళీ భగవద్గీతలోనే ఆరవ అధ్యాయములో అలాంటి మాటే కృష్ణుడు చెపుతాడు
శ్రీభగవానువాచ:
ఉద్ధరేదాత్మనా ఆత్మానం న ఆత్మనా అవసాదయేత్ |
ఆత్మైవ ఆత్మనో భంధుః అత్మైవ రిపుః ఆత్మనః||
ఆత్మనా - తన చేత
ఆత్మానం - తననే
ఉద్ధరేత్ - ఉద్ధరించకొనవలెను
అత్మైవ ఆత్మనో బంధుః - తనకు తానే బంధువు ( సంసార సముద్రములో విజయము సాధిస్తే)
అత్మైవ ఆత్మనో రిపుః- తనకు తానే శత్రువు ( సంసార సముద్రములో విజయము సాధించకపోతే)
న ఆత్మనా అవసాదయేత్ - తనచే తానే అధోగతిని పొందించకొన గూడదు !
అంటే తనను తానే తన కృషిచేత ఉద్ధరించకొనవలెను. ఇంకొకళ్ళూ మార్గము చూపిస్తారుకాని చేసేది చేయవలసినది తనే . ఏమి టి చేసేది చేయవలసినది. నిష్కామ కర్మ , అందరి పట్ల సమత్వము.
అంటే ఈ నాలుగు శ్లోకాలలో కృష్ణుడు చెప్పినది -
మన అంతట మనమే మనలను పైకి తీసుకు రాగలము .
స్వాభావికమైన గుణముల వలన పాప పుణ్యములు చేసినా ,
మనకు ఉన్నా విచక్షణాజ్ఞానముతో
మన అంతటమనమే పైకి రాగలము.
దేముడి దయవలన మనకి కావలసిన పని అయిపోతుంది అన్నది వ్యావహారిక భాషలో సరి అయినా - ఈ శ్లోకాలు చెప్పేమాట చేయవలసినది మనమే. చేసేది మనమే. దేముడికి ఇలాంటి పనితో సంబంధము లేదు అని
భవద్గీత అంతా చదివి ఇదా మనకు తెలిసిన రహస్యము - ఇది చాలా చిన్న మాటకదా అని అనిపించవచ్చు.
కాని ఇది ఒక గొప్పమాట
ఇది అర్థము చేసుకొని భాధ్యత మనదే అనుకొని
మన ఆత్మయే మన సాక్షిగా వుంచుకొని
నిష్కామ కర్మ చేస్తూ
సమత్వము సంపాదించగలిగితే
మనకు వచ్చే ఆనందమే మన మోక్షము.
ఇదే భగవద్గీత విశిష్ఠత;
వేదాలు ఉపనిషత్తులూ చదివి తత్వజ్ఞానము సంపాయించి యోగానుశాసనముతో బ్రహ్మము గురించి తెలిసి కొని మోక్షము పోందడము ఒక మార్గము. అందరికితెలిసిన కష్ఠమైన మార్గము
భగవద్గీత సామాన్యులకు అందుబాటులో ఉండే మార్గములు ప్రతిపాదించి సామాన్యులకు సామాన్యభాషలో మోక్షమునకు దారి చూపిస్తుంది .
అదే భవద్గీత విశిష్ఠత.
ఓమ్ తత్ సత్
||ఓమ్ తత్ సత్ ||
|| ఓమ్ తత్ సత్ ||