||భగవద్గీత ||
||ఏడవ అధ్యాయము ||
||విజ్ఞానయోగము-శ్లోక తాత్పర్యాలు
||
||ఓమ్ తత్ సత్||
శ్రీ భగవానువాచ
మయ్యాసక్త మనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః|
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు||1||
"ఓ పార్థా ! నాయందు ఆసక్తి కలిగి నన్నే ఆశ్రయించి యోగము ఆచరించుచూ నన్ను ఏ ప్రకారముగా తెలిసి కొనగలవో దానిని వినుము "
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
భగవద్గీత
సప్తమోధ్యాయము
విజ్ఞానయోగము
ఇది విజ్ఞానయోగము.
విజ్ఞానము అంటే విశేష జ్ఞానము. అనుభవముతో కలిసిన జ్ఞానము.
ఈ అధ్యాయము స్వానుభవము తో కూడిన పరమార్థజ్ఞానమును గురించి ప్రత్యేకముగా చర్చింపబడిన అధ్యాయము కాబట్టి దీనిని విజ్ఞాన యోగము అన్నారు. విజ్ఞానము గురించి అర్జునుడు అడగలేదు. అందుకని ఈ అధ్యాయము కూడా భగవంతుని శ్లోకముతోనే "భగవానువాచ" అంటూ మొదలగుతుంది.
శ్లోకము.1
శ్రీభగవానువాచ.
మయ్యాసక్త మనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః|
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు||1||
స|| హే పార్థ ! మయి ఆసక్తమనాః మదాశ్రయః యోగం యుఞ్జన్ మాం అసంశయమ్ సమగ్రం యథా జ్ఞాస్యసి తత్ శృణు ||1||
మయ్యాసక్త మనాః పార్థ - ఓ పార్థా నాయందు ఆసక్తి కలిగి,
మదాశ్రయః - నన్నే ఆశ్రయించి ,
యోగం యుఞ్జన్ - యోగము అనుసరించి
అసంశయం సమగ్రం మాం- నిస్సంశయముగా సంపూర్ణముగా నన్ను,
యథా జ్ఞాస్యసి తత్ శృణు- ఎలా తెలిసికొనగలవో అది ( ఆమార్గమును) విను.
శ్లోక తాత్పర్యము
"ఓ పార్థా! నాయందు ఆసక్తి కలిగి, నన్నే ఆశ్రయించి,యోగము అనుసరించుచూ, సంపూర్ణముగా నిస్సంశయముగా ఎలా తెలిసికొనగలవో దానిని వినుము"||1||
ఇక్కడ కృష్ణుడు "భగవంతుని గురించి సంపూర్ణముగా తెలిసికొను మార్గమును విశదీకరిస్తాను" అంటూ మొదలెడతాడు. అంటే ఏమిటి చెపుతాడు అన్న ప్రశ్న ఉదయిస్తుంది.
ధ్యాన యోగములో కృష్ణుడు ' యోగినామపి సర్వేషాం ... శ్రద్ధవాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః' అంటే 'యోగులలో కూడా, నాయందు మనస్సునిలిపి నన్నే శ్రద్ధతో సేవించేవాడు అందరిలోకి శ్రేష్ఠుడు.' అని చెపుతాడు. అంటే "నన్ను ఆశ్రయిస్తే అన్నీ సమస్యలు తీరిపోతాయి. మోక్షద్వారము సులభము " అని అన్నట్లే. అయితే " నన్ను" అంటున్నభగవంతుడు ఎలాంటి వాడు? ఎలా తెలిసికోవాలి? అనే ప్రశ్నలురావచ్చు. దానికి సమాధానముగా ఈ అధ్యాయములో మొదలులోనే చెపుతాడు, "భగవంతుని గురించి సంపూర్ణముగా తెలిసికొను మార్గమును విశదీకరిస్తాను" అంటూ .
ఆ మార్గము ఏమిటి అన్నదానికి సమాధానముగా కృష్ణుడు అంటాడు:
శ్లోకము 2
శ్లో|| జ్ఞానం తేఽహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః|
యత్ జ్ఞాత్వా నేహ భూయో న్యజ్ఞాఽతవ్యమవశిష్యతే ||2||
స|| యత్ జ్ఞాత్వా ఇహ భూయః జ్ఞాతవ్యం అన్యత్ న అవశిష్యతే ఇదం స విజ్ఞానమ్ జ్ఞానమ్ అశేషతః తే వక్ష్యామి || 2||
అంటే
" యత్ జ్ఞాత్వా ఇహ " - ఏది తెలిసి కొనితే ఇక్కడ ( అంటే ఈ ప్రపంచములో)
" న జ్ఞాతవ్యం అవశిష్యతే"- మళ్ళీ తెలిసికొనదగినది ఇంకోటి లేదో.
అట్టి జ్ఞానమును గురించి చెప్పెదను అంటాడు
అది ఎలాంటి జ్ఞానము అంటే,
" ఇదం స విజ్ఞానం జ్ఞానమ్" - ఈ అనుభవముతో కూడిన జ్ఞానము.
వక్ష్యామ్యశేషతః- అశేషతః వక్ష్యామి- శేషములేకుండా చెప్పుచున్నాను.
శ్లోక తాత్పర్యము
తా|| ఏది తెలిసికొంటే ఇంకొకటి తెలిసికొన వలసినది లేదో అట్టి ఈ అనుభవముతో కూడిన జ్ఞానమును నిశ్శేషముగా చెపుతాను అని ||2||.
ఓక ఉపనిషత్తులో గురుశిష్యుల సంభాషణలో గురువు "నీకు ఏమి కావాలి" అంటే " ఏది తెలిసికొంటే ఇంకొకటి తెలిసికొనవలసినది లేదో అది కావాలి " అని శిష్యుడు అడుగుతాడు. ఇక్కడ అలాంటి అలోచనే వుంది. ఇక్కడ శిష్యుడు అడగకపోయినా భగవంతుడు "అట్టి జ్ఞానము" గురించి చెప్పడానికి తయారుగా వున్నాడు.
ఈ "సవిజ్ఞానం జ్ఞానమ్" అంటే అనుభవముతో కూడిన జ్ఞానము.
దీని యొక్క ప్రత్యేకత ఏమిటి ?
అది మూడో శ్లోకములో.
శ్లోకము 3
శ్లో|| మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః||3||
స|| మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ సిద్ధయే యతతి | యతతానాం సిద్ధానాం అపి కశ్చిత్ మాం తత్త్వతః వేత్తి ||3||
మనుష్యాణాం సహస్రేషు - వేలకొలదీ మనుష్యులలో,
కశ్చిద్యతతి సిద్ధయే - కశ్చిత్ సిద్ధయే యతతి.
ఒకడు సిద్ధికొఱకు ప్రయత్నము చేయుచున్నాడు.
యతతాం అపి సిద్ధానాం - ప్రయత్నము చేయుచున్న సిద్ధులలో
కశ్చిన్మాం వేత్తి తత్త్వతః- కశ్చిత్ మాం తత్త్వతః వేత్తి
ఎవరో ఒకడు నన్నువాస్తవముగా తెలికొనుచున్నాడు.
శ్లోక తాత్పర్యము
తా|| వేలకొలదీ మనుష్యులలో ఒకడు సిద్ధికొఱకు ప్రయత్నము చేయుచున్నాడు.
ఆ ప్రయత్నము చేయుచున్నవారిలో ఎవరో ఒకడు నన్ను వాస్తవము గా తెలిసికొనుచున్నాడు||3||.
అటువంటి జ్ఞానము అందరికి దొరకదు. వేలకొలదీ మనుష్యులలో ఎవడో ఒకడు అటువంటి ఆశ, ఆసక్తి గల వాడు ఉంటాడు. అట్టి యత్నము చేసిననవారిలో ఒకానొకడు మాత్రమే నిజముగా భగవంతుని తెలిసికొనుచున్నాడు. ఆత్మానుభూతి అన్నది మాటలతో కలుగునది కాదు. దానికి చాలా పురుషప్రయత్నము పట్టుదల త్యాగము ఇంద్రియ నిగ్రహము మనస్సంయమనము అత్యవసరము. అంటే వేలకొలదిలో అలాంటివాడు ఒక్కడే ఉన్నా, ఇక్కడ కృష్ణుడు అర్జునిడికి, అంటే తన ప్రియ శిష్యునికి, దీనిని గురించి బోధిస్తాడన్నమాట.(7.03)
ఆ భగవంతుని " పర", " అపర " ప్రకృతి ఇక్కడ 4 వ శ్లోకములో చెపుతున్నాడు :
శ్లోకము 4
భూమిరాపోఽనలో వాయుః ఖం మనోబుద్ధిరేవచ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ||4||
స|| భూమిః ఆపః అనలః ఖమ్ మనః బుద్ధిః అహంకార ఏవ చ ఇతి ఇయం మే అష్టధా భిన్నా ప్రకృతిః ||4||
భూమిరాపోఽనలో వాయుః - భూమిః ఆపః అనిలః వాయుః
భూమి , జలము, అగ్ని, వాయువు,
ఖం మనోబుద్ధిః - ఖం మనః బుద్దిః - ఆకాశము, మనస్సు, బుద్ధి ,
అహంకార ఏవ చ- అహంకారము కూడా
ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా - ఇతి ఇయం మే అష్టధా భిన్న ప్రకృతిః;
అని ఇవి నా ఎనిమిది విధములుగా వుండు ప్రకృతి.
శ్లోక తాత్పర్యము.
తా|| భూమి , జలము, అగ్ని, వాయువు ,ఆకాశము, మనస్సు, బుద్ధి , ఇంకా అహంకారము అని,
ఇవి నా ఎనిమిది విధములుగా వుండు ప్రకృతి. ||4||
ఇక్కడ భగవంతుడు తన స్వరూపమును పర అపర ప్రకృతి రూపముగా విడమరిచి చెపుతాడు. పర అంటే పరమ శ్రేష్ఠమైనది. శుద్ధ ప్రకృతి. అపర అంటే ఉత్కృష్ఠము కానిది. సంసారబంధనము అయినది. ముందుగా అపరప్రకృతి వర్ణిస్తూ భగవంతుని అపరప్రకృతి ఎనిమిది విధములు అని చెపుతాడు
పంచ భూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము - ఇవి ఎనిమిది రకములు. పంచ భూతములు జడ పదార్థములు అని మనకి తెలిసిన విషయమే. వాటికి చైతన్యము ఉండదు. మనస్సు బుద్ధి అహంకారము ఈ మూడూ కూడా జడపదార్థములే అని ఇక్కడ మనకి తెలుస్తుంది. అది యే "అపరా" ప్రకృతి.
"అపరా" అంటే పరము కానిది. అంటే ఉత్కృష్ఠము కానిది. అదే అశుద్ధము. అనర్థకరము. సంసారబంధనము అయినది అన్నమాట.
ఇక అపరా కానిది అంటే "పరా" గురించి 5వ శ్లోకములో చెపుతాడు.
శ్లోకము 5
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్|
జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ||5||
స|| మహాబాహో ఇయం అపరా ఇతః తు అన్యాం యయా ఇదం జగత్ ధార్యతే (తామ్) జీవభూతామ్ మే ప్రకృతిమ్ పరాం విత్థి||5||
అపరేయమితస్త్వన్యాం - అపరా ఇయం ఇతః తు అన్యాం
ఇయం అపరా| ఇతః తు అన్యాం,
ఈ ప్రకృతి అనర్థకరము. దీని కన్నా వేరే అయినది,
ప్రకృతిం విద్ధి మే పరామ్ - మే పరామ్ ప్రకృతిం విద్ధి.
నా పరమ ఉత్కృష్టమైన ప్రకృతిని తెలిసికొనుము.
అంటే అష్ఠ విధములుగా విభజింపబడిన ఈ అపరా ప్రకృతి నికృష్ఠమైనది.
దీని కన్నా వేరే అయిన, ఉత్కృష్ఠమైన "పరా" ప్రకృతిని తెలిసికొనుము.
ఆ పరా ప్రకృతి ఎలాంటిది?
యయేదం ధార్యతే జగత్ - యయా ఇదం జగత్ ధార్యతే-
దేని చేత ఈ జగత్తు ధరింపబడుచున్నదో ,
జీవభూతం- జీవ రూపమైనట్టి
మే ప్రకృతిం- నాప్రకృతిని
పరామ్ ( విద్ధి) - ఉత్కృష్ఠమైనది గా (తెలిసికొనుము).
శ్లోక తాత్పర్యము
తా|| ఓ అర్జునా ఈ ( అష్ఠవిధములైన) అపరా ప్రకృతి నికృష్ఠమైనది. ఈ జగత్తు నంతయు ధరించు, జీవ రూపమైన నా మరియొక ప్రకృతిను శ్రేష్ఠమైన దానిని గా ఎఱుంగుము ||5||
అంటే - జీవరూపమైనది, దేనిచేత జగత్తు అంతయూ ధరింపబడుచున్నదో, అట్టి నా ప్రకృతిని శ్రేష్ఠమైనదానిని గా ఎఱుంగుము.
ఈ జడ పదార్థములతో వున్న "అపరా" ప్రకృతి కన్న జీవభూతములతో కలిసిన "పరా" ప్రకృతియే శ్రేష్ఠమైనది గమనించమని కృష్ణుడు చెపుతాడు.
ఈ జగత్తుకి ఎవరు కారకులు? అది 6 వ శ్లోకములో.
శ్లోకము 6
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ||6||
స|| సర్వాణి భూతాని ఏతద్యోనీని ఇతి ఉపధారయ | అహమ్ కృత్స్నస్య జగతః పభవః తథా ప్రళయః ||6||
సర్వాణి భూతాని - సమస్త ప్రాణులు
ఏతద్యోనీని - ఈ పరా అపర ప్రకృతిలే కారణముగా కలిగినవి
ఇతి ఉపధారయ - అని తెలిసికొనుము.
అహమ్ కృత్స్నస్య జగతః - నేను చేయబడిన ప్రపంచము యొక్క
ప్రభవః ప్రళయః తథా - ఉత్పత్తికి నాశనముకు కారణభూతుడను.
శ్లోక తాత్పర్యము
తా|| సమస్త భూతములును ఈ అపర పరా ప్రకృతులవలనే కలుగునవి అని తెలికొనుము. నేనే ఈ సమస్త ప్రపంచముయొక్క ఉత్పత్తికి వినాశమునకు కారణభూతుడనై యున్నాను.||6||
దీనిలో ముఖ్యమైన మాట - "సర్వాణి భూతాని" అంటే అన్ని ప్రాణులూ, ఈ పరా అపరా అన్న ప్రకృతి కారణముగా కలిగినవి. ఈ రెండు ప్రకృతులూ భగవత్స్వరూపము. భగవంతుడే ఈ జగత్తుయొక్క ఉత్పత్తికి నాశనమునకు కారణము.
శ్లోకము 7
మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణాఇవ||7||
స|| హే ధనంజయ ! మత్తః పరతరం కించిత్ అపి న అస్తి | సూత్రే మణిగణాఇవ మయి ఇదం సర్వం ప్రోతమ్ ||7||
మత్తః పరతరం - నాకంటే వేరే అయినది( శ్రేష్ఠమైనది)
నాన్యత్కించిదస్తి- న అన్యత్ కించిత్ అస్తి - ఇంకొకటి లేదు
మయి సర్వమిదం ప్రోతం - నాలోనే ఇవి అన్నీ కూర్చబడినవి.
సూత్రే మణి గణాఇవ- మణుల హారములోదారమువలె
శ్లోక తాత్పర్యము
తా|| నా కంటే వేరుగ మరియొకటి లేదు. మణిహారములో దారము వలె, నాయందే ఈ సమస్త ప్రపంచము కూర్చబడినది.||7||
ఇక్కడి ఉపమానము మణులహారములో దారము లాగా ప్రపంచములోని ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడు. దారము యొక్క ఆధారము లేక, అంటే ఆ దారము లేకపోతే, హారము ఎలాఉండదో, భగవత్స్వరూపము లేకపోతే మిగిలినవి అన్నీ కూడా ఉండవు అని అన్నమాట. ఇది అంతా దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నమాటకి సమాధానము కూడా.
అదే, అంటే దేవుడు ఎక్కడవున్నాడు అన్నది కృష్ణుడు మళ్ళీ మళ్ళీ 8 వ శ్లోకమునుంచి .
భగవంతుని స్వరూపము లాగా చెపుతాడు.
8 వ శ్లోకము
రసోఽహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశి సూర్యయోః|
ప్రణవః సర్వ వేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు||8||
స|| హే కౌన్తేయ ! అప్సు రసః| శశి సూర్యయోః పభా| సర్వవేదేషు ప్రణవః |ఖే శబ్దః | నృషు పౌరుషం అపి ||8||
రసోఽహమప్సు కౌన్తేయ - కౌన్తేయ అప్సు అహం రసః
కౌంతేయ, ఉదకములలో నేను రసము.
ప్రభాస్మి శశి సూర్యయోః- సూర్య చంద్రులలో నేను వారి కాంతిని.
ప్రణవః సర్వ వేదేషు - సమస్త వేదములలో నేను ప్రణవము.
శబ్దః ఖే - ఆకాశములో శబ్దము.
పౌరుషం నృషు- మనుష్యులలో పౌరుషము.
శ్లోక తాత్పర్యము
త|| ఓ కౌంతేయా ! నేను ఉదకములలో రసము. సూర్య చంద్రులలో వారి కాంతిని. సమస్త వేదములలో నేను ప్రణవము. ఆకాశములో నేను శబ్దము. మనుష్యులలో నేను పౌరుషము అయి వున్నాను.||8||
శ్లోకము 9
పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు||9||
స|| పృథివ్యాం పుణ్యః గన్ధః చ | విభావసౌ తేజః చ అస్మి | సర్వభూతేషు జీవనమ్ ! తపస్విషు తపః చ అస్మి||9||
పుణ్యో గన్ధః పృథివ్యాం - భూమిలో సువాసనయూ,
తేజశాస్మి విభావసౌ - అగ్నిలో తేజస్సు,
జీవనం సర్వభూతేషు - సమస్తభూతములలో ప్రాణమును,
తపశ్చాస్మి తపస్విషు- తపస్సు చేయువారిలో తపస్సు.
శ్లోక తాత్పర్యము
తా|| నేను భూమిలో సువాసనయూ, అగ్నిలో తేజస్సు , సమస్తభూతములలో ప్రాణమును,తపస్సు చేయువారిలో తపస్సు||9||
శ్లోకము 10
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్|
బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహమ్ ||10||
స|| హే పార్థ ! మామ్ సర్వ భూతానాం సనాతనమ్ బీజః విద్ధి |అహం బుద్ధిమతాం బుద్ధిః | తేజస్వినాం తేజః అస్మి ||10||
సనాతనమ్ బీజం మాం సర్వభూతానాం - సమస్త భూతములలోనూ నన్ను సనాతనమైన/శాశ్వతమైన బీజముగా
విద్ధి పార్థ - పార్థ తెలిసికొనుము.
బుద్ధిర్బుద్ధి మతామస్మి - బుద్ధిమతాం బుద్ధిః అస్మి,
బుద్ధిమంతులలో బుద్ధిని,
తేజస్తేజస్వినామహమ్- ధీరులయొక్క ధైర్యమును.
శ్లోక తాత్పర్యము
తా|| ఓ పార్థా సమస్త భూతములలోనూ నన్ను శాశ్వతమైన బీజముగా తెలిసికొనుము.
బుద్ధిమంతులలో బుద్ధిని, ధీరులయొక్క ధైర్యమును కూడా నేనే.||10||
శ్లోకము 11
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్|
ధర్నావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ||11||
స|| భరతర్షభ ! అహం బలవతామ్ కామరాగ వివర్జితమ్ బలమ్ | భూతేషు ధర్మావిరుద్ధః కామః అస్మి ||11||
బలం బలవతాం చాహం - బలవంతులలో బలము నేను
కామరాగవివర్జితమ్- కామ రాగము లేని ( బలమును).
ధర్నావిరుద్ధో భూతేషు - ధర్మమునకు విరుద్ధము కాని
కామోఽస్మి - కామము నేనే.
శ్లోక తాత్పర్యము
తా|| ఓ భరతర్షభ , బలవంతులలో కామ రాగము లేని బలము నేను. ధర్మమునకు విరుద్ధము కాని కామము నేనే||11||.
ఈ శ్లోకాలలో అర్థము, భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నాడు అన్నమాట.
శ్లోకము 12
యే చైవ సాత్వికా భావా రాజసా స్తామసాశ్చయే |
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ||
స|| సాత్వికాః భావాః యే రాజసాః చ తామసాః చ యే తాన్ మత్తః ఏవ ఇతి విద్ధి | తు తేషు అహమ్ న |తే మయి సన్తి || 12||
యే చైవ సాత్వికా భావా - సాత్వికగుణముచే కలిగిన స్వభావములు ఏవి కలవో,
రాజసా స్తామసాశ్చయే - రజో తమో గుణములవలన కలిగిన స్వభావములు ఏవి కలవో,
మత్త ఏవేతి తాన్విద్ధి - అవి నావలన కలిగినవే.
న త్వహం తేషు - నేను వాటిలో లేను.
న తే మయి - అవి నాలో లేవు.
శ్లోక తాత్పర్యము
తా|| సాత్వికగుణముచే కలిగిన స్వభావములు ఏవి కలవో, రజో తమో గుణములవలన కలిగిన స్వభావములు ఏవి కలవో, అవి నావలన కలిగినవే. నేను వాటిలో లేను. అవి నాలో లేవు.||12||
శ్లోకము 13
త్రిభిర్గుణమయైర్భావైభిః సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ||
స|| ఏభిః త్రిభిః గుణమయైః భావైభిః సర్వం ఇదం జగత్ మోహితం |ఏభ్యః పరం అవ్యయమ్ మాం న అభిజానాతి ||13||
త్రిభిర్గుణమయైర్భావైభిః - త్రిభిః గుణమయైః భావైభిః
మూడు గుణములయొక్క స్వభావములచేత
సర్వం ఇదం జగత్ మోహితం - ఈ సమస్త జగత్తు మోహితమైనది( మాయలో వున్నది)
( జగత్తు అలాగ మోహములో వున్నదై)
ఏభ్యః పరం అవ్యయమ్ - వీటికి( ఆ గుణములకు) అతీతుడై నాశనరహితుడైన
మాం న అభిజానాతి - నన్ను తెలిసికొనలేకపోతున్నది.
శ్లోక తాత్పర్యము
తా|| ఆ మూడు గుణములయొక్క స్వభావములచేత ఈ సమస్త జగత్తు మోహితమై మాయలో వున్నది.
జగత్తు అలాగ మోహములో వున్నదై, ఆ గుణములకు అతీతుడైన, నాశనరహితుడనైన నన్ను తెలిసికొనలేకపోతున్నది||13||
కర్మయోగములో అన్నీ తెలిసి కూడా మనుష్యుడు పాపము వేపు ఎందుకు పరిగెడతాడు అని అర్జునుడు అడిగితే, కృష్ణుడు అది మనుష్యుడి ప్రకృతి స్వభావము వలన, అంటే రజో తామస సత్వ గుణములవలన అని చెపుతాడు.
ప్రకృతిచే పుట్టు ఈ రజో తామస సత్వ గుణములు భగవంతునిలో లేవు. వాటిలో భగవంతుడు లేడు. వాటి మాయ వలన భగవంతుడు కనపడడు. "మోహితం నాభిజానాతి" అంటే వాటివలన కలిగిన మోహము ద్వారా , మాయద్వారా , కోరికలపై మనస్సు పరుగెడడముతో భగవంతుడు దూరము అవుతాడు. అయితే ఆ మోహమును ఎవరు అధిగమించ గలరు?
దానికి సమాధానము కృష్ణుడు 14 వ శ్లోకములో చెపుతాడు.
శ్లోకము 14
శ్రీభగవానువాచ:
దైవీ హ్యేషాగుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||14||
స|| హి దైవీ గుణమయీ ఏషా మమ మాయా దురత్యయా | మాం ఏవ యే ప్రపద్యన్తే తే ఏతామ్ మాయాం తరన్తి ||14||
దైవీ - దైవ సంబంధమైన
గుణమయీ- త్రిగుణాత్మకమైన
మమ ఏషా మాయా దురత్యయా - నా ఈ మాయ ( ప్రకృతి) దాటుటకు కష్టమైనది.
మామేవ యే ప్రపద్యంతే - నన్ను ఎవరు శరణుపొందుతారో
తే ఏతాం మాయామ్ తరన్తి - వారు ఈ మాయను దాటుతారు.
శ్లోక తాత్పర్యము
తా|| దైవ సంబంధమైన త్రిగుణాత్మకమైన ఈ నా మాయ దాటుటకు కష్ఠమైనది. నన్ను ఎవరు శరణుపొందుతారో
వారు ఈ మాయను దాటుతారు||14||
అంటే మనస్సు బుద్ధి ద్వారా రజో తామస గుణములను అదుపులో పెట్టి, సత్వగుణముద్వారా భగవత్ ధ్యాస పెంచి నప్పుడే, మనుష్యుడు మాయను దాటి భగవత్ సాన్నిధ్యము సంపాదిస్తాడు.
ఇక్కడ చెప్పినమాట భగవంతుని సాన్నిధ్యము ఎలాగ అని.
మూల ప్రకృతిలో రజో తామస సత్వగుణములచే కలుగు మాయను దాటడానికి భగవత్ సాన్నిధ్యము కాని, ఆత్మ సాక్షాత్కారము గాని కలగాలి.
ఇది అందరికీ సాధ్యము కాదు. ఇది ఎవరికి సాధ్యము, ఎవరికి సాధ్యము కాదు అన్నది ఒక ప్రశ్న.
దానికి జవాబు 15 వ శ్లోకము లో.
శ్లోకము 15
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః|
మాయయాఽపహృత జ్ఞానా అసురం భావమాశ్రితాః ||15||
స|| దుష్కృతినః మూఢాః మాయయా అపహృత జ్ఞానాః |అసురం భావం ఆశ్రితాః |నరాధమాః మామ్ న ప్రపద్యన్తే ||15||
దుష్కృతినః- పాపులు
మూఢాః - మూఢులు
నరాధమాః - నీచులు
మాయయా అపహృత జ్ఞానాః - మాయ చేత అపహరించబడిన జ్ఞానము కలవారు
అసుర భావమ్ ఆశ్రితాః - రాక్షసత్వము కలవారు
నమాం ప్రపద్యన్తే- నన్ను పొందుటలేదు.
శ్లోక తాత్పర్యము
తా|| పాపులు , మూఢులు, నీచులు, మాయ చేత అపహరించబడిన జ్ఞానము కలవారు, రాక్షసత్వము కలవారు, నన్ను పొందుటలేదు||15||.
అసలు మాట - వీళ్ళందరికి భగవంతుడిని ఆశ్రయిద్దామను కోరిక రాదు!
మరి భగవంతుని ఆశ్రయిద్దామను కోరిక ఎవరికి వస్తుంది ?
అది 16 వ శ్లోకములో.
శ్లోకము 16
చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోsర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థారీ జ్ఞానీ చ భరతర్షభ ||
స|| భరతర్షభ ! ఆర్తః జిజ్ఞాసుః అర్థార్థీ జ్ఞానీ చ చతుర్విధాః సుకృతినః జనాః మామ్ భజన్తే ||16||
ఆర్తః జిజ్ఞాసుః అర్థార్థీ జ్ఞానీ - ఆపత్తులో వున్నవాడు,భగవంతుని తెలిసికొనకోరిక గలవాడు
ఆర్తః- కష్టములో నున్నవాడు
జిజ్ఞాసుః- ( భగవంతుని) తెలుకోవాలి అన్న కోరిక గలవాడు
అర్థార్థీ - ధనము కోరువాడు
జ్ఞానీ- జ్ఞానము కలవాడు.
చతుర్విధాః సుకృతినః జనాః - అలాగ నాలుగు విధములైన పుణ్యాత్ములగు జనులు
మామ్ భజన్తే - నన్ను సేవించుచున్నారు.
శ్లోక తాత్పర్యము
తా|| కష్టములో నున్నవాడు, భగవంతుని తెలుకొవాలి అన్న కోరిక గలవాడు, ధనము కోరువాడు, జ్ఞానము కలవాడు. అలాగ నాలుగు విధములైన పుణ్యాత్ములగు జనులు, నన్ను సేవించుచున్నారు||16||
శ్లోకము 17
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థం అహం స చ మమ ప్రియః ||
స|| తేషాం నిత్యయుక్తః ఏక భక్తః జ్ఞానీ విశిష్యతే | జ్ఞానినః అహం అత్యర్థం ప్రియః హి ! సః చ మమ ప్రియః ||17||
తేషాం నిత్యయుక్తః ఏక భక్తిః -
వారిలో ఎల్లప్పుడు పరమాత్మమీద ధ్యానము లో ఉండెడి వాడు, ఒక పరమాత్మ యందే భక్తి గలవాడు,( అయిన)
జ్ఞానీ విశిష్యతే - జ్ఞాని విశిష్ఠుడు( అతి ఉత్తముడు)
జ్ఞానినః అహం అత్యర్థం ప్రియః హి-
జ్ఞానికి నేను అత్యంత ప్రియుడను,
సః చ మమ ప్రియః - అతడు కూడా నాకు ఇష్ఠము.
శ్లోక తాత్పర్యము
తా||వారిలో ఎల్లప్పుడు పరమాత్మమీద ధ్యానము లో ఉండెడి వాడు, ఒక పరమాత్మ యందే భక్తి గలవాడు, అగు జ్ఞాని, విశిష్ఠుడు( అతి ఉత్తముడు). జ్ఞానికి నేను అత్యంత ప్రియుడను, అతడు కూడా నాకు ప్రియుడు.||17||
అంటే జ్ఞాని కి భగవంతుని మీద, భగవంతుని జ్ఞానిమీద మిక్కిలి ప్రేమ. జ్ఞాని గురించి ఇంకా వింటాము 18 వ శ్లోకములో.
శ్లోకము 18
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతమ్ |
ఆస్థితః స హియుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ||18||
స|| ఏతే సర్వే ఉదారాః ఏవ | జ్ఞానీతు ఆత్మ ఏవ ఇతి మే మతః|హి సః యుక్తాత్మా (సన్) మాం ఏవ అనుత్తమామ్ గతిం ఆస్థితః ||18||
ఉదారాః సర్వ ఏవైతే - ఏతే సర్వే ఉదారః ఏవ
వీరందరూ ( పైన చెప్పబడిన నలుగురూ) మంచివారే.
జ్ఞానీత్వాత్మైవ మే మతమ్ - జ్ఞానీతు ఆత్మఏవ మే మతమ్|
జ్ఞాని నేనే అని నా అభిప్రాయము.
స హి యుక్తాత్మా - అతడు నాయందే మనస్సు నిలిపిన వాడై
మామేవానుత్తమాం గతిమ్ - మాం ఏవ అనుత్తమాం గతిం-
నన్నే అత్యుత్తమమైన ప్రాప్య స్థానముగా ( నిశ్చయించుకొని)
ఆస్థితః- ఆశ్రయించుకొని యున్నాడు
శ్లోక తాత్పర్యము
తా|| వీరందరూ ( పైన చెప్పబడిన నలుగురూ) మంచివారే. కాని జ్ఞాని సాక్షాత్తు నేనే అని నా అభిప్రాయము. ఎందుకు అంటే జ్ఞాని నన్నే అత్యుత్తమమైన ప్రాప్య స్థానముగా నిశ్చయించుకొని, నన్ను ఆశ్రయించుకొని యున్నాడు||18||
శ్లోకము 19
బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ||19||
స|| బహూనాం జన్మనామ్ అన్తే జ్ఞానవాన్ (సన్) సర్వం వాసుదేవః ఇతి మామ్ ప్రపద్యతే | సః మహాత్మా సుదుర్లభః ||19||
బహూనాం జన్మనామన్తే - అనేక జన్మల తరువాత
జ్ఞానవాన్మాం ప్రపద్యతే - జ్ఞానవంతుడు నన్ను పొందుతున్నాడు,
వాసుదేవః సర్వమితి - సర్వము వాసుదేవుడే అని ( తలచుకొని).
స మహాత్మా సుదుర్లభః- అట్టి మహాత్ముడు చాలా అరుదు.
శ్లోక తాత్పర్యము
తా|| అనేక జన్మల తరువాత సర్వము వాసుదేవుడే అని ( తలచుకొని), జ్ఞానవంతుడు నన్ను పొందుతున్నాడు.
అట్టి మహాత్ముడు చాలా అరుదు||19||.
జ్ఞానయోగము గురించి విన్నాము. జ్ఞాని అంటే తెలిసిన మాటే అనిపించవచ్చు. కాని ప్రతిసారి జ్ఞాని అంటే ఎవరు అని మననం చేసుకోవడము మంచిది. అందుకని ఈ మాట మళ్ళీ ప్రస్తావిస్తున్నాము.
భగవంతుడు తనకన్న వేరు అని ప్రారంభస్థితిలో వున్నా, నిరంతర ఆత్మ చింతనచేత, అహంభావ నిర్మూలనచేత, నిష్కామకర్మచేత, వాసనా క్షయము అంటే రజోతామస గుణముల క్షయముతో, అంటే లేక పోవడముతో, ఆరూఢ స్థితి కలుగ గలదు. ఆరూఢస్థితిలో భగవంతుడు తనకన్న వేఱుగనుండడు. ఆ స్థితియే జ్ఞానోదయమైన స్థితి. అతడే జ్ఞానుడు. జ్ఞాని అద్వైత మూర్తి.
ఈ స్థితి రావడానికి చాలా జన్మలు పట్టవచ్చు. కాని ఇన్ని జన్మలకోసము ప్రతీక్షింపలేక మనుష్యుడు మధ్యలో దేవతారాధనలో పడి ఇతర దేవతలను పూజించవచ్చు. అదే మనము 20 వ శ్లోకములో వింటాము.
శ్లోకము 20
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేఽన్యదేవతాః |కామైస్తైస్తై
తం తం నియమాస్థాయ ప్రకృత్యా నియతాస్స్వయా ||20||
స|| స్వయా ప్రకృత్యా నియతాః తైః తైః కామైః హృతజ్ఞానాః తం తం నియమమ్ అస్థాయ అన్యదేవతాః ప్రపద్యన్తే ||20||
స్వయా ప్రకృత్యా నియతాః - తమ ప్రకృతిచేత ప్రేరేపింప బడిన ( జనులు)
కామైస్తెస్తెర్హృతజ్ఞానాః- కామైః తైః తైః హృత జ్ఞానాః
వారి వారి కోరికలచేత అపహరింపబడిన జ్ఞానము కలవారు,
ప్రపద్యన్తేఽన్యదేవతాః- ఇతర దేవతలను భజించు చున్నారు.
శ్లోక తాత్పర్యము
తా|| తమ ప్రకృతిచేత ప్రేరేపింప బడిన వారై, వారి వారి కోరికలచేత అపహరింపబడిన జ్ఞానము కలవారై,
కొందరు ఇతర దేవతలను పూజించు చున్నారు||20||
21 వ శ్లోకము
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి |
తస్య తస్యచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ||21||
స|| యః యః భక్తః యామ్ యామ్ తనుం శ్రద్ధయా అర్చితుం ఇచ్ఛ తి తస్య తస్య శ్రద్ధామ్ అచలామ్ విదధామి ||21||
యో యో యాం యాం తనుం భక్తః -
ఏయే భక్తుడు ఏ యే దేవతా రూపమును
శ్రద్ధయార్చితుమిచ్ఛతి- శ్రద్ధయా అర్చితుం ఇచ్ఛతి- శ్రద్ధతో పూజించుటకు కోరుకొనుచున్నాడో
తస్త తస్యాచలాం శ్రద్ధామ్ - తస్య తస్య అచలాం శ్రద్ధామ్
వారి వారి శ్రద్ధనే స్థిరమైన దానిని గా
విదధామ్యహమ్- నేను చేయుచున్నాను.
శ్లోక తాత్పర్యము
తా|| ఏయే భక్తుడు ఏ యే దేవతా రూపమును శ్రద్ధతో పూజించుటకు కోరుకొనుచున్నాడో
దానికి తగిన శ్రద్ధనే నేను స్థిరముగా కలుగ చేయుచున్నాను||21||.
కాని ఇన్ని జన్మలకోసము ప్రతీక్షింపలేక మనుష్యుడు మధ్యలో దేవతారాధనలో పడి అనేక దేవతలను పూజించవచ్చు. ఏ భక్తుడు ఏ దేవతను ఆరాధించినా, వారి శ్రద్ధ పఠిష్ఠము అవడానికి, ఆ శ్రద్ధ స్థిరము అయ్యేటట్లుగా భగవంతుడు చేస్తున్నాడు. ఆ అరాధనలలో ఏవరు ఎంత అడిగితే అంతే ఇచ్చినట్లు జరుగుతుంది. ఫలాసక్తి గల మన చిన్న కోరికలు మన ఫలముతో నే నిండిపోతాయి. ఫలాశక్తి లేని నిష్కామము సచ్చిదానంద స్వరూపానికి దోవ చూపిస్తాయి.
శ్లోకము 22
స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధన మీహతే |
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ ||22||
స|| సః తయా శ్రద్ధయా తస్య ఆరాధనమ్ ఈహతే |మయా ఏవ విహితాన్ తాన్ కామాన్ హి తతః లభతే ||22||
స తయా శ్రద్ధయా యుక్తః - అతడు (అంటే కోరికలతో ఇతర దేవతలనారాధించు వాడు) అట్టి శ్రద్ధతో కూడుకొనినవాడై
తస్య ఆరాధన మీహతే - ఆ దేవతలను ఆరాధించున్నాడు.
లభతే చ తతః కామాన్ - ఆ దేవతల ద్వారా కోరికలను పొందుతున్నాడు,
మయైవ విహితాన్ హి తాన్ - నా చేతనే విధింపబడిన విధముగా
శ్లోక తాత్పర్యము
తా|| కోరికలతో ఇతర దేవతలనారాధించు వాడు శ్రద్ధతో కూడుకొనినవాడై ఆ దేవతలను ఆరాధించున్నాడు.
మరియు నా చేతనే విధింపబడిన విధముగా ఆ దేవతల ద్వారా కోరికలను పొందుతున్నాడు||22||
శ్లోకము 23
అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ |
దేవాన్ దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి ||23||
స||| అల్పమేధసామ్ తేషామ్ తత్ ఫలమ్ తు అన్తవత్ భవతి | దేవ యజః దేవాన్ యాన్తి | మద్భక్తాః ఆమ్ అపి యాన్తి ||23||
అల్పమేధసామ్ తేషామ్ - అల్పమేధస్సు గల వారి
తత్ ఫలమ్ తు అన్తవత్ భవతి - ఆ ఫలము అంతము కలది ( అశాశ్వతము)
దేవ యజః దేవాన్ యాన్తి - దేవతలను పూజించువారు దేవతలను పొందుదురు.
మద్భక్తాః ఆమ్ అపి యాన్తి - నాభక్తులు నన్ను పొందుదురు.
శ్లోక తాత్పర్యము
తా|| అల్పమేధస్సు గల వారి ఆ ఫలము అంతము కలది ( అశాశ్వతము ). దేవతలను పూజించువారు దేవతలను పొందుదురు.
నా భక్తులు నన్ను పొందుదురు ||23||
మరి మోక్షము ఇచ్చే భగవంతుని కాక, ఫలములు ఇచ్చే దేవతలపైకి ఎందుకు మనుష్యులు లాగ బడతారు అన్నప్రశ్న, అర్జునుడు అడిగిన ప్రశ్నలాంటిదే.( అన్నీ తెలిసి పురుషులు పాపము ఎందుకు చేస్తారు? అని) . దానికి సమాధానము 24 వ శ్లోకము:
శ్లోకము 24
అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యన్తే మామబుద్ధయః |
పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్ ||24||
స|| అవ్యయమ్ అనుత్తమమ్ పరం మమ భావం అజానన్తః అబుద్ధయః అవ్యక్తమ్ మామ్ వ్యక్తిం ఆపన్నమ్ మన్యతే ||24||
అవ్యక్తం వ్యక్తి మాపన్నం - వ్యక్తము కాని నన్నుదేహము కలవానినిగా
మన్యన్తే మామబుద్ధయః - అవివేకులు నన్ను తలంచుచున్నారు.
అవ్యయమ్ అనుత్తమమ్- నాశరహితమైన సర్వోత్తమైనట్టి
పరం భావమజానన్తో మమ - నాయొక్క విలక్షణమైన ప్రకృతి స్వరూపమును తెలియక.
శ్లోక తాత్పర్యము
తా|| నాశరహితమైన సర్వోత్తమైనట్టి నాయొక్క విలక్షణమైన ప్రకృతి స్వరూపమును తెలియక,
అవివేకులు వ్యక్తము కాని నన్ను, దేహము కలవానినిగా తలంచుచున్నారు||24||.
అంటే భగవంతుని అసలు స్వరూపము తెలియనివారు, భవంతునికి స్వరూపము ఉన్నట్లు గా తలచి, ఇతర దేవారాధనలో నిమగ్నులు అవుతున్నారన్న మాట !
భగవంతుడి రూపము ఏటువంటిది?
అవ్యక్తమ్ -కనపడనిది. అవ్యయమ్- నాశనము లేనిది. అనుత్తమమ్- సర్వోత్తమైనది.
అట్టి రూపాన్ని మనస్సులో అధిష్ఠానము చేయడము కష్టము.
ఏవరికైనా యోగమాయ చేత జ్ఞానము కప్పబడినప్పుడు అట్టి రూపము కనపడదు.
అవివేకులకు అట్టి రూపము తెలియదు. అదే 25 వ శ్లోకములో .
శ్లోకము 25
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః |
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ||25||
స|| యోగమాయా సమావృతః అహం సర్వస్య ప్రకాశః న| మూఢః అయం లోకః మామ్ అజమ్ అవ్యయమ్ నాభిజానాతి ||
నాహం ప్రకాశః సర్వస్య - నేను అందరికి కనిపించువాడను కాను. ( ఎందుకు?)
యోగమాయాసమావృతః - యోగ మాయ చేత కప్పబడి ఉండుటవలన.
మూఢోఽయం నాభిజానాతి - మూఢులకు ఇది తెలియదు.
లోకో మామజమవ్యయమ్ - లోకులు నన్ను పుట్టుకలేనివానిగా నాశరహితునిగా ( ఎఱుగరు).
శ్లోక తాత్పర్యము
తా|| యోగ మాయ చేత కప్పబడి ఉండుటవలన నేను అందరికి కనిపించువాడను కాను.
అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టుకలేనివానిగా, నాశరహితునిగా ఎఱుగరు||25||.
శ్లోకము 26
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ||26||
స|| హే అర్జునా! అహమ్ సమతీతాని వర్తమానాని చ భవిష్యాణి చ భూతాని వేద | మాంతు కశ్చన న వేద ||26||
వేదాహం సమతీతాని - సమతీతాని అహం వేద-
గడిచిపోయినట్టి వానిని నేను ఎఱుగుదును.
వర్తమానాని చ అర్జున - ఓ అర్జునా ప్రస్తుతం వున్నవాటిని కూడా .( ఎఱుగుదును)
భవిష్యాణి చ భూతాని - భవిష్యత్తులో రాబోవునట్టి ప్రాణులను కూడా (ఎఱుగుదును).
మాం తు వేద న కశ్చన - నన్ను మాత్రము ఎవరు ఎఱుగరు.
శ్లోక తాత్పర్యము
తా|| ఓ అర్జునా భూత భవిష్యత్ వర్తమాన కాలమందు కల ప్రాణులను నేను ఎఱుగుదును.
నన్ను మాత్రము ఎవరూ ఎఱుగరు.||26||
శ్లోకము 27
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత |
సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరంతప ||27||
స|| హే పరన్తప ! భారత ! సర్గే ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వ మోహేన సర్వభూతాని సమ్మోహమ్ యాన్తి ||27||
ఇచ్ఛాద్వేషసముత్థేన- కామ క్రోధములవలన పుట్టిన
ద్వన్ద్వమోహేన - ద్వంద్వరూపమగు మోహముతో
సర్వభూతాని సమ్మోహం - సమస్త భూతములు అజ్ఞానమును.
సర్గే యాన్తి - పుట్టుకతోనే పొందుచున్నారు.
శ్లోక తాత్పర్యము
తా|| ఓ పరంతపా , కామ క్రోధములవలన పుట్టిన ద్వంద్వరూపమగు మోహముతో
సమస్త భూతములు అజ్ఞానము పుట్టుకతోనే పొందుచున్నారు.||27||
ఇచ్ఛాద్వేషాలనే ద్వంద్వాలవలన కలిగే మోహము చేత సర్వ ప్రాణులూ పుట్టుకతోనే మూఢులై పుడుతున్నారు.
అయితే ఈ ద్వంద్వాల నుంచి బయటపడేవారు ఎవరు ?
అది 28 వ శ్లోకములో వింటాము.
28 వ శ్లోకము
యేషామ్ త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వన్ద్వ మోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః ||28||
స||పుణ్యకర్మణాం ఏషాం జనానాం పాపం తు అన్తగతమ్ తే ద్వన్ద్వమోహ నిర్ముక్తా ధృఢవ్రతాః మాం భజన్తే ||28||
పుణ్యకర్మణాం- పుణ్యకర్మలు చేయు
ఏషాం జనానాం పాపం తు అన్తగతమ్ - ఈ జనుల పాపము నాశనము పొందును
తే ద్వన్ద్వ మోహనిర్ముక్తా - వారు ద్వన్ద్వరూపముల అజ్ఞానము నుండి విడువబడిన వారై,
భజన్తే మాం దృఢవ్రతాః - నన్ను ధృఢమైన దీక్షతో సేవించుచున్నారు.
శ్లోక తాత్పర్యము
తా|| పుణ్యకర్మలు చేయు ఏ జనుల పాపము నశించినదో , వారు వారు ద్వన్ద్వరూపముల అజ్ఞానము నుండి విడువబడిన వారై,
నన్ను ధృఢమైన దీక్షతో సేవించుచున్నారు.||28||
29 వ శ్లోకము
జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే|
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ||29||
స|| యే జరామరణ మోక్షాయ మామ్ ఆశ్రిత్య యతన్తి, తే కృత్స్నమ్ అధ్యాత్మం అఖిలం కర్మ చ తత్ బ్రహ్మ విదుః ||29||
జరామరణ మోక్షాయ - జరామరణముల నుంచి మోక్షము పొందుటకు
మామాశ్రిత్య యతన్తి యే- నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయు చున్నారో
తే కృత్స్నమ్ అధ్యాత్మం - వారు సమస్తమైన ఆత్మ స్వరూపమును
అఖిలం కర్మ చ - సమస్త కర్మలనూ
తత్ బ్రహ్మ విదుః - ఆ బ్రహ్మమే అని ఎఱుగుదురు.
శ్లోక తాత్పర్యము
తా|| ఎవరైతే జరామరణముల నుంచి మోక్షము పొందుటకు నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయు చున్నారో,
వారు ఆత్మ స్వరూపమును సమస్త కర్మలనూ ఆ బ్రహ్మమే అని ఎఱుగుదురు||29||.
శ్లోకము 30
.
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ||30||
స|| యే స అధిభూతాధిదైవమ్ స అధియజ్ఞం చ మామ్ విదుః తే ప్రయాణకాలే అపి చ యుక్త చేతసః మామ్ విదుః ||30||
సాధిభూతాధిదైవం మాం - అధిభూత అధి దైవములతో కూడిన వానిని గా నన్ను
సాధియజ్ఞం చ యే విదుః - అధి యజ్ఞముతో కూడా కూడినవానిని గా తెలుసుకొనుచున్నారో,
ప్రయాణకాలేఽపి చ - దేహ వియోగ కాలమందును
మాం తే విదుర్యుక్తచేతసః - తే మాం ఉక్త చేతసః విదుః
వారు నన్ను నిలకడ కల మనస్సు కలవారై ఎఱుంగుదురు.
శ్లోక తాత్పర్యము
తా|| అధి భూత అధి దైవ అధి యజ్ఞముతో కూడిన వానిని గా నన్ను ఎవరు తెలుసుకొనుచున్నారో,
వారు దేహ వియోగ కాలమందునువారు నన్ను నిలకడ కల మనస్సు కలవారై ఎఱుంగుదురు..||30||
ఇక్కడ అధిభూతం అంటే నశించునట్టి పదార్థము . అంటే నశించునట్టి పదార్థము కూడా బ్రహ్మమే. "బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్" అన్నశ్లోకము లో ఇది విన్నమాటే . అధిదైవము అంటే విరాట పురుషుడు లేక హిరణ్యగర్భుడు అని.
అంటే ఇక్కడ భావము, అధిభూత అధిదైవ అధియజ్ఞ రూపములగు సమస్త పదార్థములు పర్మాత్మ స్వరూపములే అన్న సత్యాన్ని జీవిత కాలములో తెలిసికొనినవారు /అనుభవము గలవారు అంతిమ క్షణాలలో అట్టి బ్రహ్మానునుభవమే కలిగియుందురు అని.
ధ్యాన యోగములో కృష్ణుడు ' యోగినామపి సర్వేషాం ... శ్రద్ధవాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః' అంటే 'యోగులలో కూడా, నాయందు మనస్సునిలిపి నన్నే శ్రద్ధతో సేవించేవాడు అందరిలోకి శ్రేష్ఠుడు.' అని చెపుతాడు. అంటే "నన్ను ఆశ్రయిస్తే అన్నీ సమస్యలు తీరిపోతాయి. మోక్షద్వారము సులభము " అని అన్నట్లే. అయితే " నన్ను" అంటున్నభగవంతుడు ఎలాంటి వాడు? ఎలా తెలిసికోవాలి? అనే ప్రశ్నలు వస్తాయి. దానికి సమాధానముగా ఈ అధ్యాయములో మొదలులోనే చెపుతాడు, "భగవంతుని గురించి సంపూర్ణముగా తెలిసికొను మార్గమును విశదీకరిస్తాను" అంటూ .
ఈ అధ్యాయములో ముఖ్యమైన విషయము ఈ జగత్తులోని సర్వప్రకృతికి భగవంతు డే ఆధారము అని. అంటే ఈ సృష్టిలోని ప్రతి వస్తువునందు ప్రతి విషయము నందు భగవంతుని వైభవము గోచరించుచున్నది అనే అవగాహన మనకు రావాలి . అట్టి అవగాహన మనకి వచ్చినచో మన దైనందిన కార్యములలో ప్రతి పనిలో భగవంతుని తలచు కొనుచూ భగవంతుని వైభవముతో ఏకాగ్రత కలిగి మనసు భగవంతుని యందే నిలపగలుగుతాము.
ఇక్కడ 7వ సర్గ నుంచి 11 వ సర్గ దాకా ఒక ప్రత్యేకత వున్నదని ( అక్బరు కాలమునాటి) మధుసూదన సరస్వతి తమ భగవద్గీత మీద గూఢార్థ దీపిక అన్న పుస్తకములో రాశారు. భగవద్గీత మూడు భాగములుగా విభజించ వచ్చు. మొదటి ఆరు అధ్యాయాలు ఒక భాగము. తరువాత ఆరు సర్గలు ( 7-11 అధ్యాయాలు) రెండవ భాగము. చివరి ఆరు సర్గలు ( 12-18 అధ్యాయాలు)మూడవ భాగము. ఈ మూడు భాగాలకి "తత్ త్వం అసి " అన్న మూడు పదముల వాక్యాని కి సంబంధము వున్నది
వేద మహావాక్యాలలో "తత్ త్వం అసి" అని అందరమూ విన్నాము.
ఇది గురువు శిష్యునకు చెప్పిన మాట.
త్వం - అంటే నువ్వు,
తత్ - అంటే "పరమాత్మ"
అసి అన్నది త్వం తో కలిపి 'త్వం అసి' చదువుతాము.
త్వం అసి అంటే నువ్వే !
"తత్ త్వం అసి" అంటే వెర్రివాడా ఆ పరమాత్మ స్వరూపము నువ్వే అని గురువు శిష్యునకు చెప్పినమాట.
ఇక్కడ మొదటి ఆరు అధ్యాయలలో చెప్పబడినది అంతా దైవమునుంచి వేరే వున్నాను అనుకొనే 'త్వం" అంటే నీ గురించి.
రెండవ ఆరు అధ్యాయాలలో మనము వినేది "తత్" అనే పరమాత్మ స్వరూపము గురించి.
ఆఖరి ఆరు అధ్యాయలలో మనము వినేది జ్ఞానము, అంటే పరమాత్మయే మనము అన్న జ్ఞానము అని.
ఆ విధముగా, "తత త్వం అసి" అన్నమాటే , భగవద్గీతలో 18 అధ్యాయలలో ఇమిడి వున్నది అని మధుసూదన సరస్వతి గారి మాట.
దీన్ని గురించి మళ్ళీ మనము ఇంకొసారి వింటాము.
ఈ మాటతో భవద్గీతలో 7వ అధ్యాయము సమాప్తము.
ఇతి భవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞాన యోగో నామ సప్తమోఽధ్యాయః
||ఓమ్ తత్ సత్||
||ఓం తత్ సత్||