||భగవద్గీత ||
||ఏడవ అధ్యాయము ||
||విజ్ఞానయోగము- వచన వ్యాఖ్యానము
||
|| ఓమ్ తత్ సత్ ||
శ్రీ భగవానువాచ
మయ్యాసక్త మనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః|
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు||1||
"ఓ పార్థా ! నాయందు ఆసక్తి కలిగి నన్నే ఆశ్రయించి యోగము ఆచరించుచూ నన్ను ఏ ప్రకారముగా తెలిసి కొనగలవో దానిని వినుము "
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
భగవద్గీత
సప్తమోధ్యాయము
విజ్ఞానయోగము
ఇది విజ్ఞానయోగము.
విజ్ఞానము అంటే విశేష జ్ఞానము. అనుభవముతో కలిసిన జ్ఞానము.
ఈ అధ్యాయము స్వానుభవము తో కూడిన పరమార్థజ్ఞానమును గురించి ప్రత్యేకముగా చర్చింపబడిన అధ్యాయము కాబట్టి దీనిని విజ్ఞాన యోగము అన్నారు.
విజ్ఞానము గురించి అర్జునుడు అడగలేదు. అందుకని ఈ అధ్యాయము కూడా భగవంతుని శ్లోకముతోనే "భగవానువాచ" అంటూ మొదలగుతుంది.
కృష్ణుడు "భగవంతుని గురించి సంపూర్ణముగా తెలిసికొను మార్గమును విశదీకరిస్తాను" అంటూ మొదలెడతాడు. అంటే ఏమిటి చెపుతాడు అన్న ప్రశ్న ఉదయిస్తుంది.
ధ్యాన యోగములో కృష్ణుడు ' యోగినామపి సర్వేషాం ... శ్రద్ధవాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః' అంటే 'యోగులలో కూడా నాయందు మనస్సునిలిపి నన్నే శ్రద్ధతో సేవించేవాడు అందరిలోకి శ్రేష్ఠుడు అనుకుంటాను' అని చెపుతాడు. అంటే "నన్ను ఆశ్రయిస్తే అన్నీ సమస్యలు తీరిపోతాయి మోక్షద్వారము సులభము " అని అన్నట్లే. అయితే భగవంతుడు అలాంటి వాడు ఏలా తెలిసికోవాలి అనే ప్రశ్నరావచ్చు. దానికి సమాధానముగా ఈ అధ్యాయములో మొదలులోనే చెపుతాడు, "భగవంతుని గురించి సంపూర్ణముగా తెలిసికొను మార్గమును విశదీకరిస్తాను" అంటూ .
ఆ మార్గము ఏమిటి అన్నదానికి సమాధానముగా కృష్ణుడు అంటాడు:
భగవానువాచ
జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః|
యత్ జ్ఞాత్వా నేహ భూయో న్యజ్ఞాsతవ్యమవశిష్యతే ||2||
అంటే " యత్ జ్ఞాత్వా ఇహ " - ఏది తెలిసి కొనితే ఇక్కడ ( అంటే ఈ ప్రపంచములో)
" న జ్ఞాతవ్యం అవశిష్యతే"- మళ్ళీ ఇంక తెలిసికొనదగినది లేదో
అట్టి జ్ఞానమును గురించి చెప్పెదను అంటాడు
ఏలాంటి జ్ఞానము అంటే - "సవిజ్ఞానం జ్ఞానమ్" - అంటే అనుభవముతో కూడిన జ్ఞానము.
అది తెలిసికొంటే ఇంకొకటి తెలిసికొన వలసినది లేదు ;
లేక అది తెలిసికొంటే ఇంకొకటి తెలిసికొన తగినది లేదు అని అంటాడు.
ఓక ఉపనిషత్తులో గురుశిష్యుల సంభాషణలో గురువు "నీకు ఏమి కావాలి" అంటే " ఏది తెలిసికొంటే ఇంకొకటి తెలిసికొనవలసినది లేదో అది కావాలి " అని శిష్యుడు అడుగుతాడు. ఇక్కడ అలాంటి అలోచనే వుంది. ఇక్కడ శిష్యుడు అడగకపోయినా భగవంతుడు " అట్టి జ్ఞానము" గురించి చెప్పడానికి తయారుగా వున్నాడు.
ఈ "సవిజ్ఞానం జ్ఞానమ్" అంటే అనుభవముతో కూడిన జ్ఞానము. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి ?
అటువంటి జ్జ్ఞానము అందరికి దొరకదు. వేలకొలదీ మనుష్యులలో ఎవడో ఒకడు అటువంటి ఆశ ఆసక్తి గల వాడు ఉంటాడు. అట్టి యత్నము చేసిననవారిలో ఒకానొకడు మాత్రమే నిజముగా భగవంతుని తెలిసికొను చున్నాడు. ఆత్మానుభూతి అన్నది మాటలతో కలుగునది కాదు. దానికి చాలా పురుషప్రయత్నము పట్టుదల త్యాగము ఇంద్రియ నిగ్రహము మనస్సంయమనము అత్యవసరము. అంటే ఏదో వేలకొలదిలో ఒక్కడే ఉన్నాఇక్కడ కృష్ణుడు అర్జునిడికి అంటే తన ప్రియ శిష్యునికి దీనిని గురించి బోధిస్తాడన్నమాట.(7.03)
భగవంతుని " పర అపర " ప్రకృతి :
భగవంతుడు తన స్వరూపమును పర అపర ప్రకృతి రూపముగా విడమరిచి చెపుతాడు. పర అంటే పరమ శ్రేష్ఠమైనది శుద్ధ ప్రకృతి. అపర అంటే ఉత్కృష్ఠము కానిది సంసారబంధనము అయినది. ముందుగా అపరప్రకృతి వర్ణిస్తూ భగవంతుని అపరప్రకృతి ఎనిమిది విధములు అని చెపుతాడు
శ్రీభగవానువాచ
భూమిరాపోఽనలో వాయుః ఖం మనోబుద్ధిరేవచ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ||7.04||
పంచ భూతములు మనస్సు బుద్ధి అహంకారము - ఇవి ఎనిమిది రకములు
పంచ భూతములు జడ పదార్థములు అని మనకి తెలిసిన విషయమే. వాటికి చైతన్యము ఉండదు. మనస్సు బుద్ధి అహంకారము ఈ మూడూ కూడా జడపదార్థములే అని ఇక్కడ మనకి తెలుస్తుంది. అది యే "అపరా" ప్రకృతి. "అపరా" అంటే పరము కానిది.
అంటే ఉత్కృష్ఠము కానిది. అదే అశుద్ధము అనర్థకరము సంసారబంధనము అయినది అన్నమాట.
"అపరా" కన్న వేరే అయినది "పరా". అంటే అదే శ్రేష్ఠమైనది శుద్ధ ప్రకృతి.
ఆ పరా ప్రకృతి ఏమిటీ అంటే అది " జీవ భూతం మహాబాహో" అది జీవ రూపమైన ప్రకృతి.
జీవభూతమైన ప్రకృతిలో ఆత్మ ఒక్కటియే చైతన్య రూపము.(7.05)
ఈ జడ పదార్థములతో వున్న "అపరా" ప్రకృతి కన్న జీవభూతములతో కలిసిన "పరా" ప్రకృతియే శ్రేష్ఠమైనది గమనించమని కృష్ణుడు చెపుతాడు.
దీనిలో ముఖ్యమైన మాట - "సర్వాణి భూతాని" అన్ని ప్రాణులూ ఈ పరా అపరా అన్న ప్రకృతి కారణముగా కలిగినవి.
ఈ రెండు ప్రకృతులూ భగవత్స్వరూపము.
భగవంతుడే ఈ జగత్తుయొక్క ఉత్పత్తికి నాశనమునకు కారణము.(7.06)
శ్రీభగవానువాచ
మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణాఇవ||7||
అంటే
"నాకంటే వేరుగా ఇంకొకటిలేదు - నాలోనే ఈ ప్రపంచమంతయూ కూర్చబడిఉన్నది - దారంలో మణుల వలె."
ఇక్కడి ఉపమానము మణులహారములో దారము లాగా ప్రపంచములోని ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడు. ఆధారము లేక ఆ దారము లేకపోతే హారము ఎలాఉండదో భగవత్స్వరూపము లేకపోతే మిగిలినవి అన్నీ కూడా ఉండవు అని అన్నమాట.
ఇది అంతా దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నమాటకి సమాధానము కూడా.
అదే కృష్ణుడు మళ్ళీమళ్ళీ చెపుతాడు.
భగవంతుని స్వరూపముగురించి.
శ్రీభగవానువాచ
రసోsహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశి సూర్యయోః|
ప్రణవః సర్వ వేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు||8||
పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు||9||
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్|
బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహమ్ ||10||
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్|
ధర్నావిరుద్ధో భూతేషు కామోsస్మి భరతర్షభ ||11||
అంటే
నీళ్ళలో రుచి, సూర్యచంద్రులలో కాంతి,వేదములలో ఓంకారము,ఆకాశములో శబ్దము, మనుష్యులలో పరాక్రమము, భూమిలో గంధము, అగ్నిలో ప్రకాశము, అన్ని ప్రాణులలో ప్రాణము, తాపసులలో తపస్సు, అన్నిటిలో బీజము, బుద్ధిమంతులలో బుద్ధి, ధీరులలో ధైర్యము, బలవంతుల ఆశ అనురాగము లేని బలము, ప్రాణులలో ధర్మవిరుద్ధము కాని కోరిక.
ఇవన్నీ భగవత్స్వరూపములే
అది కృష్ణుడు చెప్పిన మాట ( శ్రీభగవానువాచ)
దీని అర్థము భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నాడు అన్నమాట.
కర్మయోగములో అన్నీ తెలిసి కూడా మనుష్యుడు పాపము వేపు ఎందుకు పరిగెడతాడు అని అర్జునుడు అడిగితే కృష్ణుడు అది మనుష్యుడి ప్రకృతి స్వభావము వలన అంటే రజో తామస సత్వ గుణములవలన అని చెపుతాడు.
మళ్ళీ ఆ గుణములగురించే మాట్లాడుతూ -
"మత్తః ఏవ ఇతి" - నా వలన కలిగినవే
"న త్వహం తేషు తే మయి" - "అహం తేషు న ; తే మయి న"
అంటే నేను వాని యందు గాని అవి నాయందు గాని లేవు .
ప్రకృతిచే పుట్టు ఈ రజో తామస సత్వ గుణములు భగవంతునిలో లేవు వాటిలో భగవంతుడు లేడు. వాటి మాయ వలన భగవంతుడు కనపడకపోవచ్చు. "మోహితం నాభిజానాతి" అంటే వాటివలన కలిగిన మోహము ద్వారా , మాయాద్వారా , కోరికలపై మనస్సు పరుగిడడముతో భగవంతుడు దూరము అవచ్చు. (7.13)
అయితే ఆ మోహమును ఎవరు అధిగమించ గలరు?
దానికి సమాధానము గా కృష్ణుడు చెపుతాడు.
శ్రీభగవానువాచ:
దేవీ హ్యేషాగుణమయీ మమ మాయ దురత్యయా |
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||14||
"మమ మాయా దురత్యయా" - దాటుటకు కష్టమైన నా మాయ ( ప్రకృతి)
"మామేవ యే ప్రపద్యంతే" - నన్ను ఎవరు శరణుపొందుతారో
"తే ఏతాం మాయామ్ తరన్తి" - వారు ఈ మాయను దాటుతారు.
అంటే మనో బుద్ధి ద్వారా రజో తామస గుణములను అదుపులో పెట్టి సత్వగుణముద్వారా భగవత్ ధ్యాస పెంచి నప్పుడే, మనుష్యుడు మాయను దాటి భగవత్ సాన్నిధ్యము సంపాదిస్తాడు.
ఇలా చెప్పినది భగవంతుని మూల ప్రకృతి.
రజో తామస సత్వగుణములచే కలుగు మాయను దాటడానికి భగవత్ సాన్నిధ్యము కాని, ఆత్మ సాక్షాత్కారము గాని కలగాలి.
ఇది అందరికీ సాధ్యము కాదు.
ఇది ఎవరికి సాధ్యము , ఎవరికి సాధ్యము కాదు అన్నది ఒక ప్రశ్న.
దానికి జవాబు ఈ శ్లోకము.
శ్రీభగవానువాచ:
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః|
మాయయాsపహృత జ్ఞానా అసురం భావమాశ్రితాః ||15||
అంటే:
దుష్కృతినః ( పాపులు)
మూఢాః ( మూఢులు)
నరాధమాః ( నీచులు)
మాయయా అపహృత జ్ఞానాః ( మాయ చేత అపహరించబడిన జ్ఞానము కలవారు)
అసుర భావమ్ ఆశ్రితాః ( రాక్షసత్వము కలవారు)
- పాపులు , మూఢులు నీచులు - వీళ్ళందరికి భగవంతుడిని ఆశ్రయిద్దామను కోరిక రాదు!
భగవంతుని ఆశ్రయిద్దామను కోరిక ఎవరికి వస్తుంది ? (7.16)
నలుగురికి !
ఆ నలుగురు ఎవరు ?
"ఆర్తో జిజ్ఞాసుః అర్థార్ధీ జ్ఞానీ చ భరతర్షభ" ||
అంటే
"ఆర్తః"- కష్టములో నున్నవాడు
"జిజ్ఞాసుః"- తెలుకొవాలి అన్న కోరిక గలవాడు
"అర్థార్థీ" - ధనము కోరువాడు
"జ్ఞానీ"- జ్ఞానము కలవాడు.
వీళ్లకి భగవంతుని మీద కోరిక-
వాళ్ళందరూ మంచి వాళ్ళే - "ఉదారః సర్వే ఏతే"
వీళ్ళలో జ్ఞాని శ్రేష్ఠుడు అని చెప్పనక్కర లేదు.
అది తెలిసిన మాట. (7.17)
జ్ఞాని కి భగవంతుని మీద, భగవంతుని జ్ఞానిమీద మిక్కిలి ప్రేమ
జ్ఞాని యే భగవంతుడు.
జ్ఞానయోగము గురించి చూశాము , జ్ఞాని అంటే తెలిసిన మాటే అనిపించవచ్చు. కాని ప్రతిసారి జ్ఞాని అంటే ఎవరు అని మననం చేసుకోవడము మంచిది. అందుకని ఈ మాట మళ్ళీ ప్రస్తావిస్తున్నాము.
భగవంతుడు తనకన్న వేరు అని ప్రారంభస్థితిలోవున్నా నిరంతర ఆత్మ చింతనచేత, అహంభావ నిర్మూలనచేత, నిష్కామకర్మచేత, వాసనా క్షయము అంటే రజోతామస గుణముల క్షయముతో లేక పోవడముతో ఆరూఢ స్థితి కలుగగలదు. ఆరూఢస్థితిలో భగవంతుడు తనకన్న వేఱుగనుండడు. అస్థితియే జ్ఞానోదయమైన స్థితి. అతడే జ్ఞానుడు. జ్ఞాని అద్వైత మూర్తి.
ఈ స్థితి రావడానికి చాలా జన్మలు పట్టవచ్చు.
కాని ఇన్ని జన్మలకోసము ప్రతీక్షింపలేక మనుష్యుడు మధ్యలో దేవతారాధనలో పడి అనేక దేవతలను పూజించవచ్చు.(7.20)
ఏ భక్తుడు ఏ దేవతను ఆరాధించినా భగవంతుడు వారి శ్రద్ధ పఠిష్ఠము అవడానికి, ఆ శ్రద్ధ స్థిరము అయ్యేటట్లుగా భగవంతుడు చేస్తున్నాడు. ఆ అరాధనలలో ఏవరు ఎంత అడిగితే అంతే ఇచ్చినట్లు జరుగుతుంది. ఫలాసక్తి గల మన చిన్న కోరికలు ఫలముతో నే నిండిపోతాయి. ఫలాశక్తి లేని నిష్కామము సచ్చిదానంద స్వరూపానికి దోవ చూపిస్తాయి.(7.23)
మరి మోక్షము ఇచ్చే భగవంతుని కాక ఫలములు ఇచ్చే దేవతలపైకి ఎందుకు మనుష్యులు లాగ బడతారు అన్నప్రశ్న అర్జునుడు అడిగిన ప్రశ్నలాంటిదే.( పురుషులు పాపము ఎందుకు చేస్తారు? అని)
దానికి సమాధానము ఈ శ్లోకము:
శ్రీభగవానువాచ
అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యన్తే మామబుద్ధయః |
పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్ ||24||
అంటే
మమ భావం అజానన్తః - నా స్వరూపము తెలియని
అబుద్దయః - అవివేకులు
అవక్తమ్ మామ్ - కనపడని నన్ను
వ్యక్తిం ఆపన్నం మన్యన్తే- దేహము కలవానిగా తలంచుచున్నారు.
అంటే భగవంతుని అసలు స్వరూపము తెలియనివారు భవంతునికి స్వరూపము ఉన్నట్లు గా తలచి ఇతర దేవారాధనలో నిమగ్నులు అవుతున్నారన్న మాట !
భగవంతుడి రూపము ఏటువంటిది?
అవ్యక్తమ్ -కనపడనిది
అవ్యయమ్- నాశనము లేనిది
అనుత్తమమ్- సర్వోత్తమైనది
అట్టి రూపాన్ని మనస్సులో అధిష్ఠానము చేయడము కష్టము ఏవరికైనా.
యోగమాయ చేత జ్ఞానము కప్పబడినప్పుడు అట్టి రూపము కనపడదు.
అవివేకులకు అట్టి రూపము తెలియదు.(7.25)
ఇచ్ఛాద్వేషాలనే ద్వంద్వాలవలన కలిగే మోహము చేత సర్వ ప్రాణులూ పుట్టుకతోనే మూఢులై పుడుతున్నారు(7.26 ). అయితే ఈ ద్వంద్వాల నుంచి బయటపడేవారు ఎవరు ? ఏవరైతే పుణ్యకర్మలతో పాపము నాశనము చేస్తారో వాళ్లకి సుఖదుఃఖములనుంచి బయట పడి స్థిరమైన భక్తి కలవారై భగవంతుని సేవిస్తారు (7.28).
ఏవరైతే సంసార దుఃఖమును పోగొట్టుకొఱకు భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళు ఆత్మస్వరూపము , సమస్తకర్మలను బ్రహ్మస్వరూపముగానే భావిస్తారు.
శ్రీభగవానువాచ
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలేsపి చ మాం తే విదుర్యుక్తచేతసః ||30||
అధిభూత అధిదైవ అధియజ్ఞములతో గూడిఉన్న నన్ను ఎవరు తెలిసికుంటారో వారు దేహ వియోగకాలమందు నిలకడగల మనస్సు కలవారై నన్ను తెలిసికొంటారు.
ఈ అధ్యాయములో ముఖ్యమైన విషయము ఈ జగత్తులోని సర్వప్రకృతికి భగవంతు డే ఆధారము అని. అంటే ఈ సృష్టిలోని ప్రతి వస్తువునందు ప్రతి విషయము నందు భగవంతుని వైభవము గోచరించుచున్నది అను అవగాహన మనకు రావాలి . అట్టి అవగాహన మనకి వచ్చినచో మన దైనందిన కార్యములలో ప్రతి పనిలో భగవంతుని తలచు కొనుచూ భగవంతుని వైభవముతో ఏకాగ్రత కలిగి మనసు భగవంతుని యందే నిలపగలుగుతాము.
ఉదాహరణకి ఉదయము నిద్రలేవగనే ముఖము నీటితో శుభ్రపరచు కొనుచూ ఆనీటి యొక్క చల్లని తత్వమును నీటి స్పర్శవలన సృష్టి ఎంత దివ్యమైనది, దాని స్పర్శరుచి ఎంత ఆహ్లాదము ఉత్సాహము కలిగించును అని భగవంతునికి కృతజ్ఞతలు తెలుపు కొనవచ్చును. ఈ విధముగా మనము దినమంతయు ఏదో ఒకవిధమున కర్మ చేయుచూ మనసు భగవంతుని యందు నిలపవచ్చును. నాలుగురకములైన భక్తులలో జ్ఞాని శ్రేష్టుడు కనుక మనము జ్ఞానమునే జీవిత లక్ష్యముగా నెంచి సాధన సాగించ వలెను. ఈ సంసార దుఃఖమునుండి బయటపడుటకు భగవంతునే ఆశ్రయించి అజ్ఞానము నుండి విడివడ వలెను.
||ఓం తత్ సత్||
శ్రీభగవానువాచ
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలేsపి చ మాం తే విదుర్యుక్తచేతసః ||30||
'అధిభూత అధిదైవ అధియజ్ఞములతో గూడిఉన్న నన్ను ఎవరు తెలిసికుంటారో వారు దేహ వియోగకాలమందు నిలకడకల మనస్సు కలవారై నన్ను తెలిసికొంటారు".
||ఓం తత్ సత్||
|| ఓమ్ తత్ సత్ ||