||భగవద్గీత ||

||ఎనిమిదవ అధ్యాయము ||

||అక్షరపరబ్రహ్మ యోగము- శ్లోకాలు - అర్థతాత్పర్యాలతో ||


||ఓమ్ తత్ సత్||

భగవద్గీత
 ఎనిమిదవ అధ్యాయము
 అక్షరపరబ్రహ్మ యోగము
 శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

 విజ్ఞాన యోగములో  " సాదిభూతాధి దైవం మాం సాధియజ్ఞం చ యేవిదుః " అంటూ అధిభూత అధిదైవము అధియజ్ఞములతో కూడిన నన్ను ( బ్రహ్మమును) ఎవరు తెలిసికొనుచున్నారో వారు నన్ను చివరి క్షణాలలో కూడా తెలిసికొని వుంటారు అని చెపుతాడు. అది విన్న తరువాత అర్జునుడికి సందేహము వస్తుంది. అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము ఇవన్నీ ఏమిటీ అని. ఆ ప్రశ్నతోనే ఈ అక్షర పరబ్రహ్మ యోగము మొదలగుతుంది.  అక్షరము అంటే నాశనములేనిది. అక్షరపరబ్రహ్మము అంటే నాశనములేని బ్రహ్మము గురించి అని.

శ్లోకము 1,2
 
అర్జున ఉవాచ:
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |
అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే ||1||
అధియజ్ఞః కథం కో అత్ర దేహే అస్మిన్ మధుసూదన|
ప్రాయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ||2||

స|| హే పురుషోత్తమ ! తత్ బ్రహ్మ కిం? అధ్యాత్మం కిం? కర్మ కిం? అధిభూతం చ కిం ప్రోక్తం? అధిదైవం కిముచ్యతే ? హే మధుసూదన ! అస్మిన్ దేహే అధియజ్ఞః కః? అత్ర ప్రయాణకాలేచ నియతాత్మభిః కథం (త్వం)  జ్ఞేయః అసి  || 

ప్రతిపదార్థాలు:

తత్ బ్రహ్మ కిం? ఆ బ్రహ్మము అంటే ఏది
అధ్యాత్మం కిం?  అధ్యాత్మము అంటే ఏమిటి
కర్మ కిం? కర్మ ఏది?
అధిభూతం చ కిం ? అధిభూతమని దేనిని చెప్పబడినది ?
అధిదైవం కిముచ్యతే ? అధిదైవమని దేనిని చెపుతారు ?
అధియజ్ఞః కః? అధి యజ్ఞుడు ఎవరు ?
కథం జ్ఞేయః అసి ? నీవు ఏట్లు తెలియబడు వాడవు?
అంటే నిన్ను ఎట్లు తెలిసికొనగలము !అని.

అర్జునుడు  భగవానుని ఏడు ప్రశ్నలు అడుగుతాడు. 1 బ్రహ్మము ఏది ?  2 అధ్యాత్మమేది  3 కర్మ మనగా  ఏది ?  4 అధిభూతమని  ఏది  చెప్పబడినది 5  అధిదైవమని  ఏది చెప్పుదురు  6 ఈ దేహమందు  అధియజ్ఞు  డెవరు  7 ఇవన్నీ నీవే అన్నావు గదా,  అట్టి నిన్నుతెలుసుకొనుట  ఎట్లు?

ఆప్రశ్నలన్నిటికీ  భగవానుడు  సమాధానము  చెపుతాడు.

శ్లోకము 3

శ్రీ భగవానువాచ:
అక్షరం బ్రహ్మ పరం స్వభావో అధ్యాత్మముచ్యతే|
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ||3||

స|| పరమం అక్షరం బ్రహ్మ (ఉచ్యతే)| స్వభావం అధ్యాత్మం ఉచ్యతే | భూతభావోద్భవకరః విసర్గః కర్మసంజ్ఞితః||3||

ప్రతిపదార్థాలు:

అక్షరం - క్షయములేనిది లేక నాశరహితమైనది అదియే బ్రహ్మము.
స్వభావం - తన స్వభావమే తన ఆత్మరూపమే అధ్యాత్మము.
కర్మ- సమస్త భూతములకు ఉత్పత్తి హేతువగు క్రియలు ,అట్టి నిష్కామకర్మయే కర్మ అనబడును.

శ్లోక తాత్పర్యము:

క్షయములేనిది లేక నాశరహితమైనది అదియే బ్రహ్మము.
తన స్వభావమే తన ఆత్మరూపమే అధ్యాత్మము.
సమస్త భూతములకు ఉత్పత్తి హేతువగు క్రియలు, అట్టి నిష్కామకర్మయే కర్మ అనబడును.||3||


శ్లోకము  4

అధిభూతం క్షరో భావః పురుషాశ్చాధిదైవతమ్ |
అధియజ్ఞోఽహమేవాత్ర  దేహే దేహభృతాం వర||4||

స|| దేహభృతాం వర ( హే అర్జున) క్షరః భావః అధిభూతం ( ఇతి కథితః)| పురుషః చ | అధిదైవం చ| అత్ర దేహే అహమేవ అధియజ్ఞః ||4||

ప్రతిపదార్థాలు:

క్షరః భావః అధిభూతం - నశించునట్టి పదార్థము  అధిభూతము.
అధిదైవము - పురుషః చ - పురుషుడు  (అంటే విరాటపురుషుడు) అధి దైవము అనబడును
ఇక్కడ పురుషుడు అంటే మామూలు పురుషుడు అని కాదు విరాటపురుషుడు అని.
అత్ర దేహే అహమేవ - దేహమందు వశించు నేనే ఆధియజ్ఞుడు అనబడును

శ్లోక తాత్పర్యము:

నశించునట్టి పదార్థము  అధిభూతము. విరాటపురుషుడు అధి దైవము అనబడును. దేహమందు వశించు నేనే ఆధియజ్ఞుడు అనబడును. ||4||

ఇక్కడ అధియజ్ఞుడు ఎవరు అన్నది విశదీకరుస్తూ,  "అత్ర దేహే అహమేవ" అంటూ దేహములో వశించు పరమాత్మ యే అని చెప్పాడు.  తద్వారా దేహములో వశించు ఆత్మ యే పరమాత్మ అని చెప్పడమైనది. (8.04)

చాలామందికి ఆత్మ అన్నది తెలుసు. కాని ఆత్మ వేరు పరమాత్మవేరు అనే విచారణలో ఉంటాము. మనందరికి అతికష్టముతో అత్మానుభూతి తద్వారా పరమాత్మానుభూతి జన్మ జన్మలతరువాత అవుతాయని విన్నదే. ఇక్కడ కృష్ణుడు  సందేహము లేకుండా ఆత్మ పరమాత్మ ఒక్కటే అని  మనకి చెపుతున్నాడు.

ఇప్పటి దాకా ఏడు ప్రశ్నలలో ఆరు చెప్పడమైనది. అర్జునుని ఏడవ ప్రశ్నఅంతిమ ఘడియలలో "కథం జ్ఞేయసి" నీవు ఏట్లు తెలిసికొనబడగలవు అని. అది మళ్ళీ కృష్ణుడు విశదీకరిస్తాడు ఐదవ శ్లోకములో చెపుతాడు.

శ్లోకము 5

  అన్తకాలేచ మామేవ స్మరన్ముక్త్వా  కళేబరమ్|
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః||5||

స|| యః అన్తకాలేచ మాం ఏవ స్మరన్ కలేబరం ముక్త్వా ప్రయాతి సః  మద్భావం యాతి | అత్ర సంశయః న అస్థి||5||

ప్రతిపదార్థాలు:

అన్తకాలే మామేవ - చివరి ఘడియలలో నన్నే
స్మరన్ - స్మరించుచూ
కలేబరం ముక్త్వా ప్రయాతి - శరీరము విడిచి వెళ్ళునో
సః  మద్భావం యాతి - అతడు నన్నే పొందుతున్నాడు
అత్ర సంశయః న అస్థి - ఇచట సందేహము లేదు .

శ్లోక తాత్పర్యము

"చివరి ఘడియలో నన్నే స్మరించుచూ ఎవరైతే శరీరము వదలుచున్నారో వారు నా స్వరూపము నిస్సంశయముగా పొందుచున్నారు" ||5||

అంతే కాదు.ఇంకో రహస్యము చెపుతాడు ఆరవ శ్లోకములో

శ్లోకము 6

యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కళేబరం|
తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావ భావితః ||6||

స|| హే కౌన్తేయ ! అన్తే యం యం వాపి భావమ్ స్మరన్ కళేబరం త్యజతి (సః) సదా తద్భావ భావితః తం తం ఏవ ఏతి ||6||

ప్రతిపదార్థాలు:


యం యం వాపి స్మరన్భావం  - యం యం వ అపి స్మరన్ భావం
ఏ ఏ భావము స్మరించుచూ
త్యజత్యన్తే కళేబరం-   అన్తే కళేబరం త్యజతి
 చివరిలో తమ శరీరము   విడుచుచున్నారో
సదా తద్భావ భావితః - ఎల్లప్పుడు అదే భావము కలవారై
తం తం ( భావం) ఏవ ఏతి - ఆ యా రూపమునే పొందుచున్నారు.

శ్లోక తాత్పర్యము
 
" మరణకాలమున ఏభావమును గురించి చింతించుచూ దేహము వదులుదురో అదే భావముతో ఆ రూపమును పొందుచున్నాడు" ||6||

 అంటే అంత్య కాలములో ఎవరు ఏ దేవతని స్మరిస్తారో వారు ఆ దేవతస్వరూపమే పొందుతారు అని. అంత్యకాలములో వచ్చే భావన నిరంతర స్మరణచేత అభ్యాసమైన భావన.

అంటే మనస్సు అటు ఇటుపోకుండా చివరి ఘడియలలో కూడా అధ్యాత్మ చింతనలో ఉండాలి అంటే అది జీవితమంతా అధ్యాత్మ చింతన ఉండాలి అని ఏడవ శ్లోకములో వింటాము

శ్లోకము 7

తస్మాత్ సర్వేషుకాలేషు మామనుస్మరయుధ్య చ |
మయ్యర్పిత మనోబుద్ధిః మామేవైష్యస్యసంశయః ||7||

స|| తస్మాత్ సర్వేషు కాలేషు మాం అను స్మర | యుధ్య చ |  మయి అర్పిత మనో బుద్ధిః మాం ఏవ ఏష్యసి | అసంశయః ||7||

ప్రతిపదార్థాలు:

తస్మాత్ సర్వేషు కాలేషు - అందువలన  అన్ని కాలములలో
మాం అను స్మర - నన్నే స్మరించు.
యుధ్య చ - యుద్ధము కూడా చేయి ( స్వధ ర్మము పాటించు)
మయి అర్పిత మనో బుద్ధిః - నాకు అర్పించబడిన మనస్సు బుద్ధికలవాడవై,
మాం ఏవ ఏష్యసి - నన్నే పొందెదవు.
అసంశయః- నిస్సంశయముగా !

శ్లోక తాత్పర్యము:

అందువలన  అన్ని కాలములలో నన్నే స్మరించుచు  యుద్ధము చేయుము.  నాకు అర్పించబడిన మనస్సు బుద్ధికలవాడవై, నిస్సంశయముగా నన్నే పొందెదవు.||7||

మొదటిలో "కథం జ్ఞేయసి" " నీవుఎట్లు తెలిసికొనబడగలవు" అన్నప్రశ్నకి "నన్ను స్మరిస్తూ ఉంటే పొందగలవు" అని చెపుతాడు.
ఇది పూర్తి సమాధానము కాదు. అందుకనే కృష్ణుడు మళ్ళీ విశదీకరిస్తాడు 8వ శ్లోకములో.

శ్లోకము 8

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్ ||8||

స|| హే పార్థ ! అభ్యాస యోగ యుక్తేన అన్య గామినా చేతసా దివ్యం పరమమ్ పురుషం అనుచిన్తయన్ ( తం బ్రహ్మం ఏవ) యాతి ||8||

ప్రతిపదార్థాలు:

అభ్యాస యోగ యుక్తేన - అభ్యాసము అనబడు యోగముతో వున్న
చేతసా నాన్యగామినా - చేతసా న అన్యగామినా
ఇంకెక్కడికీ వెళ్ళని మనస్సుతో
పరమం పురుషం దివ్యం - దివ్యమైన పరమమైన పురుషుని
అంటే దివ్యమైన సర్వోత్తముడైన పరమ పురుషుని
యాతి పార్థానుచిన్తయన్ - పార్థా అనుచిన్తయన్ యాతి,
పార్థా ఎల్లప్పుడు స్మరించుచూ పొందు చున్నాడు

శ్లోక తాత్పర్యము:

పార్థా అభ్యాసము అనబడు యోగముతో వున్న, ఇంకొక విషయములపై  వెళ్ళని మనస్సుతో, దివ్యమైన సర్వోత్తముడైన పరమ పురుషుని ఎల్లప్పుడు స్మరించుచూ పొందు చున్నాడు.||8||

ఇదే మళ్ళీ విశదీకరిస్తాడు తొమ్మిది పది శ్లోకాలలో.

శ్లోకాలు 9,10

కవిం పురాణమనుశాసితార
మనోరణీయాంసమనుస్మరేద్యః|
సర్వస్యధాతారమచిన్త్యరూపం
ఆదిత్యవర్ణం తమసః పురస్తాత్ ||9||

(యః ) కవిం పురాణం అనుశాసితారం అణోః అణీయాంసమ్  సర్వస్య ధాతారమ్ అచిన్త్య రూపమ్ ఆదిత్య వర్ణం తమసం పరస్తాత్  ( అనుస్మరేత్ , సః దివ్యం ఉపైతి)

ప్రతిపదార్థాలు:

కవిం- అన్నీ తెలిసినవాడు , సర్వజ్ఞుడు
పురాణం - పురాతనుడు
అనుశాసితారం - సమస్తలోకములను శాసించు వాడు
అణోః అణీయాంసమ్ - అణువుల కన్న సూక్ష్మమైనవాడు
సర్వస్య ధాతారమ్ - సమస్తలోకములకు ఆధారమైన వాడు
 అచిన్త్య రూపమ్- ఆలోచనలకు అందని స్వరూపము కలవాడు
ఆదిత్య వర్ణం - సూర్యునికాంతి లాంటి కాంతి గలవాడు
తమసం పరస్తాత్  - అజ్ఞానాంధకారమునకు ఆవల వుండెడి వాడు,
(అనుస్మరేత్ , సః దివ్యం ఉపైతి)
అట్టివానిని ఎవరు స్మరించునో వారు దివ్యస్వరూపమైన పరమాత్మను పొందుదురు.

శ్లోక తాత్పర్యము:

సమస్తలోకములను శాసించు వాడు అణువుల కన్న సూక్ష్మమైనవాడు, సమస్తలోకములకు ఆధారమైన వాడు,  ఆలోచనలకు అందని స్వరూపము కలవాడు, సూర్యునికాంతి లాంటి కాంతి గలవాడు, అజ్ఞానాంధకారమునకు ఆవల వుండెడి వాడు,
(అట్టివానిని ఎవరు స్మరించునో వారు దివ్యస్వరూపమైన పరమాత్మను పొందుదురు)||9||

శ్లోకము 10

ప్రయాణకాలే మనసాఽచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ|
భ్రువోర్మధ్యే ప్రాణమావేస్య సమ్యక్
స తం పరం పురుషం ఉపైతి దివ్యం||10||

స|| (యః ) భక్త్యా యుక్తః ప్రయాణకాలే యోగబలేన ప్రాణం  భృవోః మధ్యే సమ్యక్ ఆవేశ్య చ  అచలేన మనసా  (తం) పురుషం (అనుస్మరేత్),  సః దివ్యం తం పరం ఏవ ఉపైతి ||10||

ప్రతిపదార్థాలు:

ప్రయాణకాలే మనసాఽచలేన - అంత్యకాలమందు  అచలమైన మనస్సుతో
భక్త్యా యుక్తో - భక్తితో కూడికొనినవాడై
యోగబలేన - యోగబలముతో
ప్రాణం  భృవోః మధ్యే సమ్యక్ ఆవేశ్య చ  -
ప్రాణవాయువును కనుబొమలయొక్క మధ్యభాగములో నిలిపి,
(తం) పురుషం (అనుస్మరేత్) - ఆ పురుషుని ఎవరు స్మరించుదురో
సః దివ్యం పరం తం ఏవ ఉపైతి -
అతడు దివ్యస్వరూపుడైన సర్వజ్ఞుడైన ఆ పరమాత్మనే పొందును.

శ్లోక తాత్పర్యము:

"అంత్యకాలమందు  అచలమైన మనస్సుతో,  భక్తితో కూడికొనినవాడై, యోగబలముతో ప్రాణవాయువును కనుబొమలయొక్క మధ్యభాగములో నిలిపి, ఆ పురుషుని ఎవరు (స్మరించుదురో ) అతడు దివ్యస్వరూపుడైన సర్వజ్ఞుడైన ఆ పరమాత్మనే పొందును"||10||

అటువంటి ఉపాసనను ఇంకా విశదీకరిస్తూ కృష్ణుడు ఇలా అంటాడు

శ్లోకము 11

యదక్షరం వేద విదో వదన్తి
విశన్తి యద్యతయో వీతరాగాః|
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే||11||

స|| యత్ అక్షరం వేద విదః వదన్తి, యత్ యతయో వీతారాగాః విశన్తి, యత్ ఇచ్ఛన్తో ( తే) బ్రహ్మచర్యం చరన్తి, తత్ పదం తే సంగ్రహేణ ప్రవక్ష్యామి||11||

ప్రతిపదార్థాలు:

యదక్షరం - దేనిని క్షయము లేనిదాని గా
వేద విదో వదన్తి- వేదము తెలిసినవారు చెపుతారో,
యద్యతయో వీతరాగాః - యత్ యతయో వీతరాగాః
దేనిని జితేంద్రియులు, రాగరహితులు ( కోరికలు వదిలినవారు),
యదిచ్ఛన్తో- దేనికోరకై
బ్రహ్మచర్యం చరన్తి- బ్రహ్మచర్యము పాటిస్తున్నారో
తత్ పదం  -  ఆ స్థానమును
సంగ్రహేణ ప్రవక్ష్యే- సంక్షేపముగా చెప్పెదను.

శ్లోక తాత్పర్యము:

దేనిని క్షయము లేనిదాని గా వేదము తెలిసినవారు చెపుతారో, దేనిని జితేంద్రు లు రాగరహితులు ( కోరికలు వదిలినవారు) కోరకై బ్రహ్మచర్యము పాటిస్తున్నారో
ఆ స్థానమును  సంక్షేపముగా చెప్పెదను||11||

శ్లోకము 12

శ్రీభగవానువాచ:

సర్వద్వారాణి సంయమ్య మనో హృదినిరుధ్యచ |
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్||12||

స|| యః సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ మూర్ధ్ని ప్రాణమ్ ఆధాయ  ఆత్మనః యోగధారిణామ్  ఆస్థితః  ||

ప్రతిపదార్థాలు:

సర్వద్వారాణి సంయమ్య - (ఇంద్రియ) ద్వారములన్నిటినీ  బాగుగా అరికట్టి
మనో హృదినిరుధ్యచ - మనస్సుని హృదయములో స్థాపించించి
మూర్ధ్నా  ఆధాయా  ప్రాణం - శిరస్సునందు ప్రాణము నిలిపి
ఆత్మనః యోగధారిణామ్  ఆస్థితః  - ఆత్మగురించి చింతనము పొందినవాడై

శ్లోక తాత్పర్యము:
 
(ఇంద్రియ) ద్వారములన్నిటినీ  బాగుగా అరికట్టి, మనస్సుని హృదయములో స్థాపించించి, శిరస్సునందు ప్రాణము నిలిపి, ఆత్మగురించి చింతనము పొందినవాడై ||12||

శ్లోకము 13

ఓమ్ ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్||13||

స|| బ్రహ్మ ఓం ఇతి  ఏకాక్షరమ్ వ్యాహరన్ మాం అనుస్మరన్ దేహన్ త్యజన్ ప్రయాతి సః పరమాం గతిం యాతి ||13||

ప్రతిపదార్థాలు:

బ్రహ్మ ఓం ఇతి  ఏకాక్షరమ్ - బ్రహ్మ వాచకమైన "ఓమ్" అను ఒక అక్షరమును,
వ్యాహరన్ - ఉచ్చరించుచూ
మాం అనుస్మరన్- నన్ను అనుక్షణము స్మరించుచూ,
యః ప్రయాతి త్యజన్ దేహం - ఎవరు దేహమును త్యజించి పయనింతురో
స యాతి పరమాం గతిమ్- అతడు పరమపదమైన గతిని పొందును.

శ్లోక తాత్పర్యము:

బ్రహ్మ వాచకమైన "ఓమ్" అను ఒక అక్షరమును ఉచ్చరించుచూ,
నన్ను అనుక్షణము స్మరించుచూ ఎవరు దేహమును త్యజించి పయనింతురో
అతడు పరమపదమైన గతిని పొందును||13||


"ఎవరు  ఇంద్రియద్వారములను అన్నిటినీ ( సర్వద్వారాణి)  అరిక ట్టి  మనస్సును హృదయమందు  స్థాపించి ( మనోహృది నిరుధ్య చ)  ప్రాణవాయువును  శిరస్సునందుంచి  ఆత్మచింతనా  రూపయోగధారణ చేయుచూ ఓంకార  ముచ్చరించుచూ  బ్రహ్మమును  భావించుచు ఈ దేహమును వదులుదురో వారు  మోక్షమును  పొందుదురని " అని.

"ఓమ్" అనే ఒక అక్షరము బ్రహ్మమునకు పర్యాయపదము

ఈ నాలుగు శ్లోకాలలో కృష్ణుడు బ్రహ్మ ఐకత్యము ఎలా అని చెపుతూ , అంత్యదశలో( ప్రయాణకాలే) ఇంద్రియనిగ్రహము   ( సర్వద్వారాణీ సంయమ్య) ప్రణవనాదము చేస్తూ యోగసమాధిలోనన్నే స్మరిస్తూ దేహము వదులుతారో - అట్టివారు పరమోత్కృష్టమైన గతిని అంటే మోక్షము పోందుతారు ( స యాతి పరమాంగతిమ్ ) అని చెపుతాడు.

అయితే ఇది అందరికీ సాధ్యముకాని పనిగదా అనిపించవచ్చు.
అలా 'ఓం' అంటూ దేహము త్యజించనివారికి మోక్షము ఏలాగ అన్న ప్రశ్నకూడా రావచ్చు. 

దానికే సమాధానము లాగా కృష్ణుడు మళ్ళీ చెపుతాడు.

శ్లోకము 14

అనన్యచేతాః సతతం యోమాం స్మరతి నిత్యశః|
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ||14||

స|| పార్థా | యః అనన్య చేతాః మాం నిత్యశః సతతం స్మరతి నిత్యయుక్తస్య తస్య అహం సులభః  ||14||

ప్రతిపదార్థాలు:

అనన్యచేతాః - అంటే ఇంకో దానిమీద మనస్సు లేనివారై
సతతమ్ మాం స్మరతి - నన్నే ఎల్లప్పుడు స్మరిస్తాడో
నిత్యయుక్తస్య- నిరంతరము ధ్యానపరుడైన
యోగినః - ఆ యోగికి
తస్యాహం సులభః - వారికి నేను సులభముగా దొరుకుతాను !!

శ్లోక తాత్పర్యము:

 ఇంకో దానిమీద మనస్సు లేనివారై నన్నే ఎల్లప్పుడు స్మరిస్తాడో
నిరంతరము ధ్యానపరుడైనట్టి ఆ యోగికి నేను సులభముగా దొరుకుతాను ||14||


అంటే అన్ని విషయములు వదిలేసి బ్రహ్మము మీద నిరంతర ధ్యానపరులకు సులభముగా దొరుకుతాను అని . ఇక్కడ సులభము అని చెప్పడములో ముందుచెప్పినది ( సర్వద్వారాణీ సంయమ్య అన్నది) కష్టము చాలామందికి అవవచ్చు.

వారికి పరమాత్మపొందితే ఏమి లాభము ?

శ్లోకము 15

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |
నాప్నువన్తి మాహాత్మానః సంసిద్ధిం పరమాం గతిమ్||15||

స|| పరమాం సంసిద్దిమ్ ( మోక్షం ) గతాః మహాత్మనః మాం ఉపేత్య పునః దుఃఖాలయం అశాశ్వతం జన్మ న ఆప్నువన్తి ||15||

ప్రతిపదార్థాలు:

పరమాం సంసిద్దిమ్ ( మోక్షం ) గతాః - సర్వోత్తమమైన మోక్షమును పొందిన
మహాత్మనః మాం ఉపేత్య - మహాత్ములు, నన్ను పొందినవారై
పునః దుఃఖాలయం అశాశ్వతం - మరల దుఃఖదాయకమైన అశాశ్వతమైన
జన్మ న ఆప్నువన్తి - జన్మని పొందరు.

శ్లోక తాత్పర్యము:

సర్వోత్తమమైన మోక్షమును పొందిన  మహాత్ములు, నన్ను పొందినవారై , మరల దుఃఖదాయకమైన అశాశ్వతమైన జన్మని పొందరు.||15||

మహాత్ములు పరమాత్మ నే  ( మోక్షము) పొంది  తిరిగి  దుఃఖాలయమైన జన్మమునకు  మళ్ళీ రారు. కాని పొందని వారు  లోకాలన్నిటికీ  అంటే స్వర్గలోకము బ్రహ్మ లోకము లాంటివి అన్నిటికీ  తిరిగిరావడము అన్నది ఖాయమే. అది పదహారవ శ్లోకములో వింటాము.

శ్లోకము 16

ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఽర్జున |
మాముపేత్యతు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే ||16||

స|| హే అర్జున! ఆబ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినః మాం ఉపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే ||16||

ప్రతిపదార్థాలు:

ఆబ్రహ్మభవనాల్లోకాః- బ్రహ్మలోకము వఱకు గల లోకములన్నీ
పునరావర్తినోఽర్జున- అర్జునా పునరావర్తినః
అర్జునా తిరిగివచ్చెడి స్వభావము కలవి.
అంటే ఈ లోకాలకి వెళ్ళే వాళ్ళు మళ్ళీ పునర్జన్మ పొందుతారు అని.
మాముపేత్యతు కౌన్తేయ - కౌన్తేయా  నన్ను పొందినవారికి
పునర్జన్మ న విద్యతే - పునర్జన్మ కలగదు.

శ్లోక తాత్పర్యము:

బ్రహ్మలోకము వఱకు గల లోకములన్నీ, అర్జునా తిరిగివచ్చెడి స్వభావము కలవి. కౌన్తేయా  నన్ను పొందినవారికిపునర్జన్మ కలగదు||16||

ఇక్కడ  పునర్జన్మ లేని మోక్షము యొక్క విశేషము గురించి వివరించడముకోసము పునర్జన్మతో కూడిన స్వర్గాది బ్రహ్మలోకముల గురించి కృష్ణుడు మళ్ళీ మనకి విశదీకరిస్తాడు.

 స్వర్గాది బ్రహ్మలోకము లు పొందిన వారు దుఃఖాలయమైన ఈ జీవితానికి తిరిగివస్తారు. " ఇంకో విషయములపై మనస్సులేకుండా ( అనన్య చేతాః)  నన్ను ఎల్లప్పుడూ స్మరిస్తూ  ( యో మాంస్మరతి నిత్యశః) ఉండే వారికి ( సులభః) సులభముగా పునర్జన్మ లేని  మోక్షమును పోందుతారు "అని.

శ్లోకము 17

సహస్రయుగపర్యన్తం అహర్యద్బ్రహ్మణో విదుః|
రాత్రిం యుగసహస్రాన్తాం తేఽహోరాత్రవిదో జనాః ||17||

స|| ఏ జనాః బ్రహ్మణః యత్ అహః (తం) సహస్రయుగ పర్యన్తం, యుగసహస్రాన్తాం రాత్రిం చ, విదుః తే అహోరాత్రవిదః ||17||

ప్రతిపదార్థాలు:

(ఏ) జనాః - ఏ జనులు
బ్రహ్మణః యత్ అహః - బ్రహ్మదేవుని యొక్క పగలు
(తం) సహస్రయుగ పర్యన్తం  విదుః - వెయ్యి యుగములు పరిమతి గలదానిగా తెలిసికొనుచున్నారో
రాత్రిం యుగసహస్రాన్తాం - వేయి యుగముల అంతమును రాత్రి గా తెలిసికొనుచున్నారో
తే అహోరాత్రవిదః - వారు కాలతత్త్వము ( పగలు రాత్రి) గురించి తెలిసికొనినవారు.

శ్లోక తాత్పర్యము:

"ఏ జనులు
బ్రహ్మదేవుని యొక్క పగలువెయ్యి యుగములు పరిమతి గలదానిగా తెలిసికొనుచున్నారో, వేయి యుగముల అంతమును రాత్రి గా తెలిసికొనుచున్నారో
వారు కాలతత్త్వము ( పగలు రాత్రి) గురించి తెలిసికొనినవారు."||17||

శ్లోకము 18

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్త సంజ్ఞకే ||18||

స|| అహః ఆగమే అవ్యక్తాత్  సర్వాః వ్యక్తయః ప్రభవన్తి | రాత్రి ఆగమే అవ్యక్తసంజ్ఞకే తత్రైవ ప్రలీయన్తే ||18||

ప్రతిపదార్థాలు:

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః - అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః
అవ్యక్తము నుండి చరాచరములు సర్వము
ప్రభవన్త్యహరాగమే - ప్రభవన్తి అహరాగమే
పగటి యొక్క ప్రారంభములో పుట్టుచున్నవి.
రాత్ర్యాగమే  - రాత్రి యొక్క ప్రారంభములో
అవ్యక్తసంజ్ఞకే - ఆ అవ్యకతములోనే
ప్రలీయన్తే -లీనమగుచున్నవి.

శ్లోక తాత్పర్యము:

అవ్యక్తము నుండి చరాచరములు సర్వము
పగటి యొక్క ప్రారంభములో పుట్టుచున్నవి.
 రాత్రి యొక్క ప్రారంభములో ఆ అవ్యకతములోనే  లీనమగుచున్నవి.||18||

శ్లోకము 19

భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే|
రాత్ర్యాగమేఽవశః పార్థ ప్రభవత్యహరాగమే ||19||

స||హే పార్థ ! స ఏవ అయం భూతగ్రామః అవశః  రాత్రి ఆగమే ప్రలీయతే ( పునః)  అహః ఆగమే ప్రభవతి ||19||

ప్రతిపదార్థాలు:

భూతగ్రామః స ఏవాయం - స ఏవ అయమ్ భూతగ్రామః
అట్టి ఈ ప్రాణి సమూహమే
భూత్వా భూత్వా - మళ్ళీ మళ్ళీ
అవశః  రాత్రి ఆగమే ప్రలీయతే - అవశులై  రాత్రి ప్రారంభమున లీనమగుచున్నవి
( పునః)  అహః ఆగమే ప్రభవతి.
మళ్ళీ పగటి ప్రారంభమున పుట్టుచున్నవి. ||19||

శ్లోక తాత్పర్యము:

"అట్టి ఈ ప్రాణి సమూహమేమళ్ళీ మళ్ళీ అవశులై  రాత్రి ప్రారంభమున లీనమగుచున్నవి.
మళ్ళీ పగటి ప్రారంభమున పుట్టుచున్నవి"||19||

శ్లోకము 20

పరస్తస్మాత్తు భావోఽన్యో అవ్యక్తోఽవ్యక్తాత్ సనాతనః |
యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||20||

స|| యః భావః తస్మాత్ అవ్యక్తాత్ తు అన్యః పరః సనాతనః సః సర్వభూతేషు  నశ్యత్సు న వినశ్యతి ||20||

ప్రతిపదార్థాలు:

యః భావః - ఏ భావము ( అక్షర పరబ్రహ్మము)
తస్మాత్ అవ్యక్తాత్ తు - ఆ అవ్యక్తము కన్ననూ ( ప్రకృతి కన్ననూ )
అన్యః - వేరే అయినది
పరః- ఉత్తమమైనది
అవ్యక్తః - ఇంద్రియములకు అగోచరమైనది యు
సనాతనః- పురాతనమైనది యు
సః - ఆ అక్షర ప్రబ్రహ్మము
సర్వేషు భూతేషు నశ్యత్సు - సమస్త భూతములు నశించుచున్ననూ
న వినశ్యతి - నశించదు.

శ్లోక తాత్పర్యము:

 ఏ భావము ( అక్షర పరబ్రహ్మము), ఆ అవ్యక్తము కన్ననూ ( ప్రకృతి కన్ననూ ) వేరే అయినది, ఉత్తమమైనది, ఇంద్రియములకు అగోచరమైనది, పురాతనమైనది,
ఆ  భావము ( అక్షర పరబ్రహ్మము), సమస్త భూతములు నశించుచున్ననూ నశించదు||20||.

అలా అన్నీ నశించినాకాని సనాతనమైనది సర్వభూతములూ నశించినాకాని నశించనిది అదే అవ్యక్తము అక్షరము. దానినే పరమగతి  అంటారు.  ఆ గతిని పొందినవారు తిరిగి రారు. అదే మోక్షము.(8.20)


శ్లోకము 21

అవ్యక్తోఽక్షర ఇత్యుక్తః  తమాహుః పరమాం గతిమ్|
యం ప్రాప్య ననివర్తన్తే తద్ధామ పరమం మమ || 21||

స|| (యః ) అవ్యక్తః అక్షర ఇతి ఉక్తః తంపరమాం గతిం ఆహుః | యం ప్రాప్య న నివర్తన్తే తత్ మమ పరమం ధామ ||21||

ప్రతిపదార్థాలు:

అవ్యక్తోఽక్షర ఇత్యుక్తః - అవ్యక్తః అక్షరః ఇతి ఉక్తః
అగోచరుడు నాశరహితుడు  అని చెప్పబడిన
తం పరమాం గతిం ఆహుః - అతనినే  అత్యుత్తమమైన ప్రాప్య స్థానముగా చెప్పబడినది,
యం ప్రాప్య  న అనివర్తన్తే - ఏది పొంది మళ్ళీ వెనకి రారో
తత్ మమ పరమం ధామ - అది నా శ్రేష్ఠమైన స్థానము 

శ్లోక తాత్పర్యము:

అగోచరుడు నాశరహితుడు  అని చెప్పబడిన అతనినే  అత్యుత్తమమైన ప్రాప్య స్థానముగా చెప్పబడినది.
 ఏది పొంది మళ్ళీ వెనకి రారో అది నా శ్రేష్ఠమైన స్థానము||21||. 

శ్లోకము 22

పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్||22||

స||హే పార్థ ! భూతాని యస్య అన్తః స్థాని యేన ఇదం సర్వం తతమ్ సః పరః పురుషః అనన్యయా భక్త్యాతు లభ్యః ||22||

ప్రతిపదార్థాలు:

యస్యాన్తఃస్థాని భూతాని - భూతాని యస్య అన్తః స్థాని
ప్రాణులు ఎవని యొక్క లోపలనున్నవో,
యేన సర్వమిదం తతమ్
ఎవని చేత ఈ సమస్త జగత్తు వ్యాపింపబడినదో,
సఃపరః పురుషః - ఆ పరమ పురుషుడు
అనన్యయా భక్త్యాతు లభ్యః - అనన్యమమగు భక్తితో పొందబడువాడు .

శ్లోక తాత్పర్యము:

ప్రాణులు ఎవని యొక్క లోపలనున్నవో, ఎవని చేత ఈ సమస్త జగత్తు వ్యాపింపబడినదో,
ఆ పరమ పురుషుడు అనన్యమమగు భక్తితో పొందబడువాడు||22||

శ్లోకము 23

యత్రకాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః |
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ ||23||

స|| హే భరతర్షభ ! యత్రకాలే ప్రయాతాః యోగినః అనావృత్తింతు ఆవృత్తిం చ ఏవ పునరావృత్తిం యాన్తి తం కాలం వక్ష్యామి ||23||

ప్రతిపదార్థాలు:

యత్రకాలే ప్రయాతాః యోగినః - ఏ కాలమందు పోయిన యోగులు
అనావృత్తింతు- పునర్జన్మ రాహిత్యమును
ఆవృత్తిం చ ఏవ - ఏ కాలమందు పోయిన యోగులు
పునరావృత్తిం యాన్తి  - పునర్జన్మ పొందెదరో
తం కాలం వక్ష్యామి - ఆ కాలమును చెప్పెదను.

శ్లోక తాత్పర్యము:

"ఏ కాలమందు పోయిన యోగులు పునర్జన్మ రాహిత్యమును,
ఏ కాలమందు పోయిన యోగులు పునర్జన్మ పొందెదరో
ఆ కాలమును చెప్పెదను".||23||

అంటే ప్రయాణకాలము లో ఏమి చెయ్యవలెనో  చెప్పిన కృష్ణుడు పునర్జన్మలేని మోక్షమునకు తగిన కాలము ఏటువంటిది అన్నది కూడా విశదీకరిస్తాడు.

శ్లోకము 24

అగ్నిజ్యోతిరహశ్శుక్ల ష్షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ||24||

స|| అగ్నిః జ్యోతిః అహః శుక్లః షణ్మాసాః  ఉత్తరాయణం ( యత్ర సన్తి)  తత్ర ప్రయాతాః బ్రహ్మవిదః జనాః బ్రహ్మ గచ్ఛన్తి ||24||

ప్రతిపదార్థాలు:

అగ్నిజ్యోతిరహశ్శుక్ల - అగ్నిః జ్యోతిః అహః శుక్లః
అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షము
షణ్మాసా ఉత్తరాయణమ్ - ఆరునెలలు గల ఉత్తరాయణము,
తత్ర ప్రయాతాః బ్రహ్మవిదః - ఆమార్గములో పయనించు బ్రహ్మ వేత్తలైన
జనాః బ్రహ్మ గచ్ఛన్తి - జనులు బ్రహ్మత్వము పొందుచున్నారు

శ్లోక తాత్పర్యము:
 
అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఆరునెలలు గల ఉత్తరాయణము.
ఆమార్గములో పయనించు బ్రహ్మ వేత్తలైన జనులు బ్రహ్మత్వము పొందుచున్నారు.||24||

శ్లోకము 25

ధూమోరాత్రిః తదా కృష్ణ ష్షణ్మాసా దక్షిణాయణమ్|
తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ||25||

స|| ధూమః రాత్రిః తథా  కృష్ణ షణ్మాసాః దక్షిణాయనమ్ (యత్ర సన్తి) తత్ర యోగీ చాన్ద్రమసం జ్యోతిః ప్రాప్య (పునః) నివర్తతే ||25||

ప్రతిపదార్థాలు:

ధూమః రాత్రిః తథా కృష్ణ  - పొగ , రాత్రి , అలాగే కృష్ణ పక్షము
ష్షణ్మాసా దక్షిణాయణమ్- ఆరునెలలు గల దక్షిణాయనము,
తత్ర యోగీ - ఆ మార్గమున పోవు యోగి
చాన్ద్రమసం జ్యోతిః - చంద్రసంబంధమైన ప్రకాశమును
ప్రాప్య (పునః) నివర్తతే -  పొంది మరలపునర్జన్మ పొందుతున్నాడు.

శ్లోక తాత్పర్యము:
 
"పొగ , రాత్రి , అలాగే కృష్ణ పక్షము ఆరునెలలు గల దక్షిణాయనము,
ఆ మార్గమున పోవు యోగి చంద్రసంబంధమైన ప్రకాశమును
పొంది మరలపునర్జన్మ పొందుతున్నాడు"||25||

శ్లోకము 26

శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే |
ఏకయాయత్యనావృతిమ్ అన్యయాఽవర్తతే పునః ||26||

స|| శుక్ల కృష్ణే ఏతే గతీ హి జగతః శాశ్వతే మతే ఏకయా అనావృత్తిం యాతి | అన్యయా పునః ఆవర్తతే|26||

ప్రతిపదార్థాలు:

శుక్ల కృష్ణే ఏతే గతీ హి - శుక్లపక్షము కృష్ణ పక్షము ఇవి ప్రశిద్ధములైన మార్గములు.
జగతః శాశ్వతే మతే - జగత్తునకు శాశ్వతములని తలచబడుచున్నవి
ఏకయాయత్యనావృతిమ్- ఏకయా అనావృత్తిం యాతి
ఒక దానిలో పునర్జన్మ లేని స్థితిని పొందుచున్నాడు.
అన్యయా పునః ఆవర్తతే- ఇంకోదానిలో మరల జన్మము ఎత్తుచున్నాడు.

శ్లోక తాత్పర్యము:

శుక్లపక్షము కృష్ణ పక్షము ఇవి ప్రశిద్ధములైన మార్గములు. జగత్తునకు శాశ్వతములని తలచబడుచున్నవి.
ఒక దానిలో పునర్జన్మ లేని స్థితిని పొందుచున్నాడు.
ఇంకోదానిలో మరల జన్మము ఎత్తుచున్నాడు||26||

శ్లోకము 27

నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తోభవార్జున ||27||

స|| హే అర్జునా! ఏతే సృతీ జానన్ యోగీ కశ్చన న ముహ్యతి |తస్మాత్ అర్జున సర్వేషు కాలేషు యోగయుక్తః భవ ||27||

ప్రతిపదార్థాలు:

ఏతే సృతీ జానన్ యోగీ - ఈ మార్గములు తెలిసిన యోగి,
న ముహ్యతి కశ్చన- ఎప్పుడును మోహమును పొందడు.
తస్మాత్ అర్జున సర్వేషు కాలేషు - అందువలన సమస్త కార్యములందును,
యోగయుక్తః భవ -  యోగము కలవాడివి కమ్ము.

శ్లోక తాత్పర్యము:

ఈ మార్గములు తెలిసిన యోగి, ఎప్పుడును మోహమును పొందడు.
అందువలన సమస్త కార్యములందును, యోగము కలవాడివి కమ్ము.||27||

శ్లోకము 28

వేదేషుయజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్ఠం|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్||28||

స|| యోగీ ఇదం విదిత్వా వేదేషు  యజ్ఞేషు దానేషు తపఃసు చ యత్ పుణ్యఫలమ్ ప్రదిష్టమ్ తత్ సర్వం అత్యేతి చ ఆద్యం  పరం స్థానమ్ ఉపైతి||28||
 
ప్రతిపదార్థాలు:

వేదేషుయజ్ఞేషు తపస్సు చైవ - వేదములలోను యజ్ఞములలోను తపస్సులోనూ కూడా
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్ఠం- దానములలో కూడా ఏ పుణ్యము చెప్పబడినదో
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా - దానిని మించి అంతయు పొందును అని తెలిసికొని
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ - యోగి అనాదియు పరమోత్కృష్టమైనస్థానము పొందుచున్నాడు.

శ్లోక తాత్పర్యము:

వేదములలోను యజ్ఞములలోను తపస్సులోనూ  దానములలో కూడా ఏ పుణ్యము చెప్పబడినదో
దానిని మించి అంతయు పొందును అని తెలిసికొని
యోగి ఆది కారణమైన  పరమోత్కృష్టమైనస్థానము పొందుచున్నాడు.||28||

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరపరబ్రహ్మయోగోనామ
అష్టమోఽధ్యాయః
||ఓం తత్ సత్ ||

   












 



||ఓం తత్ సత్ ||