||కఠోపనిషత్ ||

||వచనవ్యాఖ్యానము ||

||ప్రథమాధ్యాయము - ప్రథమ వల్లీ||

|| Om tat sat ||

కథోపనిషత్తు

ఓమ్ సహనావవతు
సహ నౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓమ్ శాంతిః శాంతిః శాంతిః||

ప్రథమోధ్యాయః

ప్రథమ వల్లి

ఓం

" వాజస్రవసః సర్వ వేధసం దదౌ"
"వాజస్రవసుడు సమస్త వస్తువులను ఇచ్చివేశెను" అంటూ మొదలవుతుంది కథోపనిషత్తు.
ఏందుకు ఇచ్చివేసెను అన్న ప్రశ్నకి సమాధానము - "ఉసన్" ఫలములమీద కోరికతో
ఫలములమీద కోరికతో "దదౌ" అంటే - దానము ఇచ్చాడన్నమాట.

ఫలములమీద కోరిక వుండి చేసే యజ్ఞయాగాదులు కర్మకాండ ను అనుసరించి చేయడము అన్నమాట.

ఆయనకు నచికేతుడు అనే పేరుగల కుమారుడు ఉన్నాడు. యజ్ఞరీతిగా ఇస్తున్న దక్షిణలు నచికేతుడు చూస్తాడు. పిల్లవాడయినా శ్రద్ధతో ఆ వాజస్రవుడు ఇచ్చిన దక్షిణలను చూసి ఇలా అనుకుంటాడు

"పితోదకా జగ్ధతృణా
దుగ్ధదోహా నిరిన్ద్రియాః"|

"పితోదకా" అంటే నీళ్ళు తాగడం పూర్తి చేసినవి అంటే నీళ్ళు కూడాతాగడానికి కోరిక లేనివి
"జగ్ధతృణా" అంటే గడ్డి తినడము పూర్తిచేసినవి అంటే గడ్డి కూడా తినడానికి కోరిక లేనివి
"దుగ్దదోహా" అంటే పాలు ఇవ్వడము పూర్తిచేసినవి అంటే ఇంక పాలుఇవ్వడానికి శక్తిలేనివి
"నిరిన్ద్రియాః" కోల్పోయినవి ఇన్ద్రియశక్తి కోలుపోయినవి అంటే ఇంక ఈన శక్తి కోలుపోయినవి
అంటే ఎందుకూ పనికిరాని ఆవులను దానము చేస్తున్నాడన్నమాట !

ఆవుల దానము అన్నిటిలోకి ఉత్తమమైన దానము. అయితే ఎందుకూ పనికిరాని ఆవులను దానము చేయడము దానమే కాదు. అలాంటి దానమిచ్చేవాళ్ళు కి ఏ ఫలితము లభిస్తుంది.

"అనన్దా నామ తే లోకాః
తాన్ స గచ్చతి తా దదత్"

"అనన్దా నామ" అంటే ఆనంద రహితమైన అంటే అనందము లేని లోకాలను పొందుతాడు. అంటే స్వర్గ లోకాము పొందాడానికి వాజస్రవుడు చేస్తున్న యాగము వలన ఆయనకు లభించే ఫలము -"ఆనందము లేని లోకములు" అన్నమాట.

ఈ సంగతిని గ్రహించిన నచికేతుడు తండ్రికి చెప్పడానికి , తండ్రి ఉత్తమమైన సంపదలు దానము చెయ్యాలి కనక, తండ్రికి పిల్లలకన్నా ఉత్తమమైన సంపద లేదు కనక తండ్రిని ప్రోత్సహించడము కోసమా అన్నట్లు అడుగుతాడు.

"కస్మై మాం దాస్యతి ఇతి |"

"ఎవరికి నన్ను ఇస్తారు"? అని. ఒక పనిలో మునిగి ఉన్నవారికి ఇంకొక సంగతి పట్టదు. అలాగే వాజస్రవుడు కూడా నచికేతుని మాట పట్టించుకోలేదు. నచికేతుడు తండ్రిచే ఉత్తమమైన దక్షిణలు ఇప్పించాలి అనే ఉద్దేశ్యముతో అడిగినా వాజస్రవుడు నచికేతుని మాట పట్టించుకోలేదు. అలాగే రెండు మూడు సార్లు అడిగేసరికి వాజస్రవుడు చికాకు తో లేక కోపముతో ఇలాఅంటాడు.

మృత్యువే త్వా దదామీతి||

"నిన్ను యముడికి ఇస్తాను". ఇది వాజస్రవుని మాట . తండ్రిమాట. మనము పనిలో మునిగివున్నప్పుడు ఎవరో ఏదో ప్రశ్న వేసి సమాధానము కోసము వేధిస్తూవుంటే చాలామంది విసుగుతో అనాలోచితముగా ఎదో అనేస్తారు. అదే అయింది వాజస్రవుడికి. ఆ మాట విని తను యముడికి దానమివ్వబడం ఖాయమేనని తలచి నచికేతుడు ఇంకా అలోచిస్తాడు.

" కిం స్విద్ కర్తవ్యం
యన్మయాsద్య కరిష్యతి ||"

"యమునికి దానమిచ్చి ఏమి చేయబోతున్నారు ? ఇప్పుడు నాచే చేయదగినది ఏమిటి" అని. నచికేతుడు తండ్రి చేత ఉత్తమమైన దక్షిణలు ఇప్పించే ఆలోచనలో ఉన్నవాడు. తండ్రి మాట వ్యర్థము కానిచ్చేవాడు కాదు. తను యముడికి దానమివ్వబడం ఖాయమేనని తలచి నచికేతుడు తను చేయవలసిన కర్తవ్యము మీద ఇంకా అలోచిస్తాడు. తండ్రి ఆగ్రహముతో కోపముతో గాని చెప్పినమాట అయినా అది వ్యర్థము కాకూడదని తలచి తన నిశ్చయము తండ్రికి చెపుతాడు. వాజస్రవుడు కూడా తను చేసినది గుర్తించి చింతాగ్రస్తుడవుతాడు. అది చూసిన నచికేతుడు బాలుడు అయినా తండ్రికి నచ్చచెప్పడము మొదలెడతాడు.

"అనుపశ్య యథాపూర్వే
ప్రతిపశ్య తథాsపరే"
ముందు మనపూర్వీకులు ఎలావుండేవారో చూడండి. అలాగే ఇప్పుడు ఉన్నవారిని గురించి ఆలోచన చేయండి. మనము మనపూర్వీకుల అనుభవాలను గుర్తించాలి అలాగే. ఇప్పటి వాళ్ళ అనుభవాలు గుర్తించాలి. అంటే పూర్వీకులు మాట తప్పని వారు తన తండ్రికూడా మాట తప్పకూడదు అని. ఈ కాలము వారు కూడా అదేవిధముగా ఉన్నారు అలాగ లేకపోతే ఆనందములేని లోకాలకి పోతారు అని. ఆ మాట చెప్పి జీవిత సత్యము ఒకటి చెపుతాడు.

సస్యమివ మర్త్యః పచ్యతే
సయమివాజాయతే పునః||

మనుష్యుడు సస్యము లాగా నశిస్తాడు. మళ్ళీ సస్యములాగా జన్మిస్తాడు. అంటే జీవితము శాశ్వతము కాదు. పుట్టినవారికి మరణము తప్పదు. మరణించినవారికి పుట్టడము తథ్యము. అందుకని తను యమలోకము పోవడముగురించి . గురించి చింతన వద్దు అని.

అలాచెప్పి నచికేతుడు యమలోకానికి వెళ్ళుతాడు.

యమలోకములో యమధర్మరాజు ఉండదు. అప్పుడు నచికేతుడు మూడురోజులు ఉపవాసము చేస్తూ వేచివుంటాడు. యమధర్మరాజు రాగానే ఆయన మంత్రులు నచికేతుని రాక ఉపవాసము గురించి చెపుతారు. అలా అని కథో పనిషత్తులో రాయకపోయినా ఆ సంగతి వేదాలలోని ఇతర సందర్భములద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనము మంత్రులు చెప్పినమాట వింటాము.

"వైశ్వానరః ప్రవిశతి అతిథి బ్రాహ్మణో గృహాన్"

ఒక అతిథి బ్రాహ్మణుడు అగ్నిలాంటివాడు గృహములో ప్రవేశిస్తాడు. అతనికి ఉదకము ఇచ్చిశాంతి చేస్తున్నారు. ఓ యమధర్మరాజా ఆ బాలునికి నీరు ఇవ్వు అని. అంటే అతిథి ఎక్కడ అయినా అంటే యమలోకములో కూడా పూజనీయుడే. అతిథి సత్కారాలు భూలోకములోనే కాదు అన్నిచోట్లా ముఖ్యమే అని స్ఫురిస్తూ అతిథి సత్కారముగురించి ఇక్కడ కూడా ఉద్ఘాటన చేయబడడము అవుతుంది. అంతే కాదు ఆ మంత్రులు అతిథి సత్కారము చేయకపోతే ఎమి అవుతుందో కూడా చెపుతారు. దీని ముఖ్య ఉద్దేశ్యము అతిథి సత్కారము గురించే. బ్రాహ్మణుడు అంటే పవిత్రుడు అని. ఎక్కడైన పవిత్రులకు గౌరవ స్థానము ఇవ్వాలి అన్నమాట.

అప్పుడు యమధర్మరాజు నచికేతుడి దగ్గరకు వెళ్ళి ఇలా చెపుతాడు.

"ఓ బహ్మన్ ! అతిథీ నమస్కరింపతగిన నీవు నా గృహములో మూడు రాత్రులు ఏకారణముగా నివశించావో ఆకారణముగా నాకు శుభము అగుగాక. నీకు నమస్కారము".

"తస్మాత్ త్రీన్ వరాన్ వృణీష్వ"||

"అందువలన , అంటే అలాగ మూడు రాత్రులు గడపడము వలన , మూడు వరములు స్వీకరించు". అంతే యముడు నచికేతుడి కి మూడు వరములు ప్రసాదిస్తాడు.

ఇప్పుడు నచికేతుడు బాలుడే అయినా ధర్మాని కి అనుగుణముగా సంభాషణ సాగిస్తాడు.

యమధర్మరాజు మూడు వరాలు ఇస్తే మొదటిది తన తండ్రి క్షేమముగురించే అడుగుతాడు. తన తండ్రి శాంతముతో కోపరహితుడై మనో వ్యాకులతపోయి తనను ఆదరించాలి అని. తన వారి అంటే తన తల్లితండ్రుల క్షేమమే ముఖ్యధర్మము అని ఇక్కడ నచికేతుడు ద్వారా మనము వింటాము. యమధర్మరాజు ఆ వరము ఇస్తాడు.

"త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తమ్"|

మృత్యుముఖమునుండి ప్రముక్తుడైన అంటే తిరిగి వచ్చిన నిన్ను చూసినవాడై .. వీతమన్యుడు అంటే కోపరహితుడు అవుతాడు. అంతే కాదు మునుపటివలెనే వుంటాడు. రాత్రులందు సుఖముగా నిద్రించకలడు.

ఇంక నచికేతుడు రెండవ వరము కోరుతాడు. అ వరము అడిగేముందు దానికి కారణము చెపుతాడు.
స్వర్గే లోకే న భయం కిన్చనాస్తి
న తత్ర త్వం
న జరయా బిభేతి |
"స్వర్గలోకములో కించిత్తు కూడా భయము లేదు". "న తత్ర త్వం" అంటే "అక్కడ నువ్వు లేవు" అంటే మరణము లేదు అన్నమాట. "అక్కడ వృద్ధాప్యము లేదు". అంతే కాదు స్వర్గములో వారికి ఆకలి దప్పుల ను దాటి శోకరహితులై అనందిస్తారు. అమరత్వాన్ని పొందుతారు. అంటే సర్గము వెళ్ళడము అందరికి కోరతగిన కోరిక అన్నమాట. దానిని గురించే నచికేతుని రెండవ వరము.

స త్వం అగ్నిం స్వర్గ్యమ్ అధ్యేషి మృత్యో
ప్రబ్రూహి త్వం శ్రద్ధదానాయ మహ్యం||

"అట్టి స్వర్గానికి తీసుకుపోగల అగ్నిగురించి ( యజ్ఞము గురించి) ఓ యమరాజా నీకు తెలుసు. దానిని శ్రద్ధావంతుడైన నాకు నీవు ఉపదేశించు"

అప్పుడు యమధర్మరాజు - " నువు కోరిన దానిని తెలిసిన నేను స్వర్గాన్ని అందించే అగ్నిని( యజ్ఞమును )చెపుతాను. జాగ్రత్తగా విను" . అది ఎలాంటిది దాని విశేషము ఏమిటీ అన్నది కూడా యమధర్మరాజు చెపుతాడు.

అనన్తలోకాప్తిమథో ప్రతిష్ఠాం
విద్ధి త్వమేతం నిహితం గుహాయాం||
అది ఏటువంటి యాగము అంటే అది శాశ్వతమైన స్వర్గాన్ని ప్రాప్తింపచేసేది , "ప్రతిష్ఠాం" అది అన్ని లోకాలకి ఆధారభూతమైనది , "నిహితం గుహాయాం"- హృదయ గుహలలో నివశించేది . దానిని నీవు తెలిసికో.

కథ మొదటిలో ఫలముకోరికతో చేయబడు యాగానితో మొదలుపెట్టి , నచికేతుడి చేత ఆ స్వర్గము మీద అందరికీ ఉన్న ఆకాంక్ష చెప్పించి , అది అందుకోడానికి కావలసిన యాగము తన రెండవ కోరిక గా అడిగించి యమధర్మరాజు చేత చెప్పబడినది ఆ యజ్ఞమే కాదు , దానిని అధిగమించిన యజ్ఞము. దాని చేత హృదయ గుహలో నివశించే , సమస్తలోకాలకి ఆధారభూతమైనది, శాశ్వతమైన స్వర్గాన్ని ప్రాప్తింపచేసే యజ్ఞము ఆన్నమాట.

ఉపనిషత్తులు కర్మకాండను దాటి అధ్యాత్మిక చింతన రేకెత్తించె సోపానాలు.

ఇక్కడ యమధర్మరాజు ద్వారా మనకి అదే చెపుతున్నాడు. అది యమధర్మరాజు చెప్పినట్లుగా నేర్చుకోనిన నచికేతుని జవాబులతో సంతుష్టి పొందిన యమధర్మరాజు మళ్ళీ చెపుతాడు.
"వరం తవేహాద్య దదామి భూయః"
నచికేతుని జవాబులతో సంతుష్ఠి పొందిన యమధర్మరాజు, "నీకు ఇంకోవరము ఇస్తాను" అంటాడు. ఈ యజ్ఞము నచికేతుని పేరుతో ప్రసిద్ధమవుతుంది అని. అంతే కా సంతోషముతో ఒక హారము కూడా ఇస్తాడు యమ ధర్మరాజు. ఆ నచికేత యజ్ఞము యొక్క మహిమ ఏమిటీ అంటే-
"త్రిణాచికేతః త్రిభిరేత్య సన్ధిం
త్రికర్మకృత్ తరతి జన్మమృత్యూః|"
ఈ నచికేత యజ్ఞమును మూడు సార్లు చేసి ,
"త్రిభిరేత్య" అంటే ముగ్గురిని ఆశ్రయించి ,
"త్రికర్మకృత్" అంటే మూడు విధులను నిర్వర్తించినపుడు
ఏమిటి అవుతుంది ?
"తరతి" దాటుతాడు
ఏమిటి దాటుతాడు ?
"జన్మ మృత్యూః" - జనన మరణములను అధిగమిస్తాడన్నమాట.

నచికేతుడు అడిగినది స్వర్గము వేళ్ళే యాగము. ఆ నచికేత యజ్ఞము చేస్తే స్వర్గము పొందవచ్చు. అదే మూడు సార్లు చేసి ముగ్గురను ఆశ్రయించి అంటే తల్లి తండ్రి గురువులను ఆశ్రయించి వారి మార్గదర్శకత్వములో పోతూ మూడు కర్మలు ఆచరిస్తే జనన్ మరణములను అధిగమిస్తాడన్నమాట.

ఆమూడుకర్మలు ఏమిటి ?
అవే నిష్కామ కర్మ , స్వాధ్యాయము ,ఈశ్వర ఆరాధన.

అంటే ఆ యజ్ఞము చేస్తూ ముగ్గురను ఆశ్రయించి మూడు కర్మలూ చేసితే జనన మరణాలని అధిగమించి స్వర్గానికి వెళ్ళకుండా భగవంతుని అనుభూతి పొంది పరమశాంతిని పొందుతాడన్నమాట. అదే మోక్షము. నచికేతుడికి యమధర్మరాజు మోక్షానికి మార్గము చెప్పాడన్నమాట.

అదే మళ్ళీ చెపుతాడు యమధర్మరాజు.

"స మృత్యుపాశాన్ పురతః ప్రణిద్య"
"స" అట్టివాడు మృత్యుపాశములను ముందరే వదిలించివేసికొని పరమశాంతిని పొందుతాడన్నమాట. అంటే అజ్ఞానమునుంచి విడివడి అంటే రాగద్వేషాలనుంచి బయటపడి జీవితము గడుపుతాడు. కోరికలు, ద్వేషము లేనివాడై జీవిస్తూ జన్మరాహిత్యము పొందితే అదే మృత్య్వు మీద జయము కూడా.

ఇంక యమధర్మరాజు "ఓ నచికేతా స్వర్గానికి తీసుకువెళ్ళే ఏ యాగాన్ని గురించి అడిగావో ఆయాగాన్ని నీకు చెప్పాను. ఈ యాగాన్ని జనులు నీ పేరిటనే పిలుస్తారు. " ఇంకా చెపుతాడు:

"తృతీయం వరం నచికేతో వృణీష్వ"
"ఓ నచికేతా మూడో వరము కోరుకో"

అప్పుడు నచికేతుడు తన మూడవ వరము కోరుకుంటాడు. అదే ముఖ్యమైన వరము.

"యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే
అస్తీతి ఏకే నాయం అస్తీతి చ ఏకే||"

"ప్రేతే మనుష్యే" అంటే మనుష్యుని మరణానంతరము కొందరు ఉన్నాడు అని కొందరు లేడు అని . ఇది సందేహము . దీనిని నీనుంచి తెలుసుకుంటాను అదే నామూడవ వరము అంటాడు నచికేతుడు.

యమధర్మరాజు ఇది చెప్పడానికి వెంటనే సుముఖత చూపించడు. ఇది గురుశిష్యుల సంభాషణ లాంటిదే. శిష్యులు ఏ ప్రశ్న అడిగితే దానికి సమాధానము ఇవ్వవలసిన కర్తవ్యము ఉన్నాగాని , శిష్యుడు ఆ సమాధానము అందుకోడానికి తయారు గా ఉన్నాడా అన్నది కూడా గురువుల భాధ్యత. మరణానంతరము అన్నది గంభీరమైన ప్రశ్న. దాని సమాధానము కూడా గంభీరమైన విషయము. అది చెప్పేముందర యమధర్మరాజు ఆ ప్రశ్ననుంచి నచికేతుని తప్పించడానికి చూస్తూ , నచికేతుని తో ఇలా అంటాడు.
"దేవైరత్రాపి విచికిత్సితం పురా"
నహి సువిజ్ఞేయం అణుః ఏష ధర్మః

అంటే ఈ విషయములో "దేవైరత్రాపి" దేవతలకి కూడా సందేహము వుంది
"నహి సువిజ్ఞేయం" - ఇది సులభముగా అర్థము కాదు
"అణుః" అతి సూక్ష్మమైనది
అందుకని ఓ నచికేతా ! - "అన్యం వరం వృణీష్వ" ఇంకో వరము కోరుకో!
నన్ను బలవంతము చెయ్యక మరో వరము కోరుకో అంటాడు యమధర్మరాజు.

అప్పుడు నచికేతుడు దేవతలకు కూడా సందేహము వుంటే యమధర్మరాజు కన్నా వేరెవరు దీనిని చెప్పడానికి ఉండరు అని అనుకొని ఇలా అంటాడు.

"దేవైరత్రాపి విచిత్సితం కిల
త్వం చ మృత్యో యన్న సుజ్ఞేయ మాత్థ|"

"దేవతలకి కూదా సందేహము అంటున్నావు. దీని సులభముగా అర్థము చేసుకోవడముకాదు అని ఎందువలన చెపుతున్నావో అందువలన ...

వక్తా చాస్య త్వాదృగన్యో న లభ్యో
నాన్యో వరః తుల్య ఏతస్య కశ్చిత్||

"నీలాంటి ఉపదేశకుడు మరొకరు 'న లభ్యో'’ మళ్ళీ లభించడు "! ఇంకో వరము ఏదీ దీనితో "న తుల్యః" సమానము కాదు ! అందుకని నీవే చెప్పాలి అని అంటాడు నచికేతుడు. అంటే గురువు ను మళ్ళీ అడుగుతున్నాడు.

అప్పుడు యమధర్మరాజు నచికేతుని ఆవిషయము గురించి మళ్ళించడానికి మభ్యపెట్టడానికి మళ్ళీ ప్రయత్నము చేస్తూ ఇలాఅంటాడు.

"శతాయుషుః పుత్రపౌత్రాన్ వృణీష్వ"
"శతాయుస్సు గల పుత్ర పౌత్రులను కోరుకో"
"బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్"
" చాలా పశువులు ఏనుగులు బంగారము గుర్రాలు కోరుకో"
"భూమేః మహత్ ఆయతనం వృణీష్వ"
"భూమిలో పెద్ద రాజ్యాన్ని కోరుకో"
"స్వయం చ జీవ శరదో యావత్ ఇచ్ఛసి"
"నువ్వు నీ ఇష్టమున్న సంవత్సరాలు జీవించు"
"ఏతత్ తుల్యం వరం మన్యసే వృణీష్వ"
"దీనితో సమానమైన వరము కావాలనుకుంటే అది కోరుకో"
"చిరకాలము ఈ మహా భూమిమీద వసించు"
"కామానాం త్వాం కామభాజం కరోమి"
కోరికలన్నిటికీ నిన్ను అనుభవించేవాడిగా చేస్తాను"

ఇవన్నీ నచికేతునికి మభ్యపెట్ట తలిచిన యమధర్మరాజు యొక్క బంధాలు. ఇంకా చెపుతాడు నచికేతునికి.

"యే యే కామా దుర్లభా మర్త్య లోకే
సర్వాన్ కామాన్చన్ధతః ప్రార్థయస్వ|"
"యే యే కోరికలు మనుష్యలోకములో దుర్లభమో అవన్నీ కూడా నీ ఇష్టానుసారము కోరుకో" |

ఇమా రామాః స రథాః సతూర్యా
నహీదృశా లమ్భనీయా మనుష్యైః|
"రథాలు ఇస్తాను. వాద్యోపకరణాలతో పురుషులను మైమరపించేటటువంటి స్త్రీలు , అటువంటి స్త్రీలు మనుష్యలోకములో పొందబడేవారు కారు"
"అభిర్మత్ప్రత్తభిః పరిచారయస్వ"
"అటువంటి స్త్రీలచేత పరిచర్యలు చేయుంచుకో"
కాని .. !!
"నచికేతో మరణం మా అనుప్రాక్షీః"
"ఓ నచికేతా ! మరణము గురించి అడగవద్దు !!

" ఓ నచికేతా మరణము గురించి అడగవద్దు" అంటూ యమధర్మరాజు నచికేతుని అనేకవిధములుగా ప్రలోభ పెట్ట చూస్తాడు. ఇవన్ని కూడా కాదంటే అప్పుడు శిష్యుడు గురువుగారి పరిక్ష దాటగలిగినట్లే.

ఇదంతా విని నచికేతుడు యమధర్మరాజు తో ఇలా చెపుతాడు.

" తవైవ వాహాః తవ నృత్యగీతైః|
" ఆ ఆటలూ పాటలూ నృత్య గీతాలు నువ్వే వుంచుకో"
జీవితమే స్వల్పమైనది అని , యమధర్మరాజు చెపుతున్నవి అన్నీ అశాశ్వతాలు అనీ నచికేతునికి తెలిసినవే. తనకి తెలిసిన విషయాలు ఇంకా చెపుతాడు.

నచికేతుడు అంటాడు:
"న విత్తేన తర్పణీయో మనుష్యో"
"మనుష్యుడు ధనముతో తృప్తి చెందేవాడు కాడు"

మనిషి కి ధనమోహము ఎంత అంటే ఆ ధనమోహము ఎంత ధనమున్నా తృప్తి తీరదు.
ఇది గంభీరమైన మాట.
ఇది ముమ్మాటికి నిజము.
అందుకని అది ఎంతకోరినా సరిపోదు.
ఆ కోరికకు ఫలము ఉండదు.

అదే కాదు
"జీవిష్యామో యావదీష్యసి త్వం"
"నువ్వు ఎంతవరకు వరమిస్తావో అంతవరకు జీవిస్తాము" ఆ వరాలు అన్ని అయినతరువాత మరణము తథ్యమే కదా. అందుకని "ఈ ఆయుస్సు సంపదలు వద్దు . నేను కోరిన వరమే చాలు ". అంటే నచికేతుడు యమధర్మరాజు చెప్పిన కోరికలకి అతీతుడై తన కోరిక మీదే నిలబడి ఉంటాడు.

అదే కాదు. నచికేతుడు ఒక ప్రశ్న అడుగుతాడు>

ఈ మర్త్య లోకములో వుండి క్షణికమైన ఆటలూ పాటలతో కలిసిన జీవితపు నిజము తెలిసికొనినవాడై అజ్ఞానమును ఛేదించి నాశనములేని బ్రహ్మమును చేరువాడెవడు ఈ దీర్ఘాయుస్సు తో సంతోషపడతాడు ? అని. అంటే నచికేతుడు తనకు ఆ దీర్ఘాయుస్సు తో పనిలేదని తనకు మరణము గురించి ఉన్న సందేహము తీర్చ మని యమధర్మరాజు ని అడుగుతాడన్నమాట.

తండ్రి యాగాన్ని శ్రద్ధతో ఆలకించి , తండ్రి చేస్తున్న తప్పును సరిదిద్దడానికి తననే దానముగా అర్పించుకొని , అనాలోచితముగా "యముడికిస్తాను" అన్న తండ్రి మాటని నిజము చేయదలిచి యమధర్మరాజు దగ్గఱకి వచ్చిన నచికేతుడు, తనకు యమధర్మరాజు ఇచ్చిన వరాలను తన తండ్రి క్షేమానికి , స్వర్గారోహణ చెయ్యడానికి కావలసిన యాగము యొక్క జ్ఞానము లోక హితము కోసము , చివరికి మరణము గురించి వున్న సందేహము తీర్చుకోవడానికి ఉపయోగిస్తాడు.

ఆ మూడో వరము నుంచి తప్పించ డానికి యమధర్మరాజు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలము చేసి అదే కావాలి అని యమధర్మరాజుకి ఘంటాపథముగా చెప్పుతాడు.

యమధర్మరాజు సంతోషపడి తన ఉపదేశాన్ని మొదలు పెడతాడు రెండవ వల్లిలో.

ఇంతటితో మొదటి వల్లి సమాప్తము.

||ఓమ్ తత్ సత్||