||సుందరకాండ||

|| శ్లోకాలు||

|| తాత్పర్యముతో శ్లోకాలు ||

||వచనరూపములో సర్గలు ||

సుందరకాండ

రామకృష్ణమఠం వారు ప్రచురించిన తెలుగు సుందరకాండలో మొదటి వాక్యాలలో - అంధ్రులవారి ఆరాధ్యదైవము శ్రీరాముడు అని మొదలుపెట్టి అందులో సుందరకాండ ప్రాధాన్యము ఏమిటి అంటూ చర్చారూపము లో విశదీకరిస్తారు. దేశ విదేశాలలో పండితులు సుందరకాండ గురించి రాస్తూ రామాయణములో సుందరకాండ ప్రధాన్యత , సుందరకాండ మీద తరతరాలుగా వస్తున్నవిశ్వాసము గురించి కూడా రాస్తారు.

రామాయణములో సుందరకాండ ప్రాధాన్యము మనకుటుంబాలలో చాలామందికి తెలిసినమాటే. మా అమ్మ సుందరకాండ పారాయణచేసేది. ఆ చేసే విధానము కూడా తెలుసు. రోజుకి ఏడు సర్గలు చొప్పున అరవైఎనిమిది రోజుల్లో ఏడు సార్లు పూర్తిగా చదవడము. ఏమీ తెలియకుండానే ఏమన్నా చికాకులు ఉన్నప్పుడు అమ్మా సుందరకాండ ( మాకోసము) చదువమ్మా అన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే అంతక ముందులో, ఏప్పుడో ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యముచెపుతూ అమ్మ పరవాలేదురా "నేను సుందరకాండ చదువుతాను లేరా" అని వుండవచ్చు. దానితో మాకు ధైర్యము వచ్చిఆ పనులు జరిగి పోయి ఉండవచ్చు . అదే ఉదాహరణ తీసుకొని తరువాత మా అంతట మేమే అమ్మా సుందరకాండ చదవగలవా అని అడగడము అలవాటు అయిపోయింది. ఇంక ఇది ఎలా మొదలైంది అన్న ప్రసక్తి లేనే లేదు. ఇలాంటి మాఇంటి కథనమే అనేక కుటుంబాలలో అయివుంటుంది. అలాగ సుందరకాండ పారాయణ చాలా కుటుంబాలలో ఆనవాయితీ అయిపోయింది.

అయితే ఈ ఆనవాయితీ ముందు ముందు కుటుంబాల ద్వారా సాగుతుందా అన్నది ఒక ప్రశ్నే. ముందు తరాలవారికి సుందరకాండ లోని ముఖ్యమైన అంశము అర్థము అవడమే ముఖ్యము అని ఒక ఆలోచన. సుందరకాండ పారాయణ వలన ఓక పని అయింది అంటే ఆ పని జరగడానికి ఎవరో సుందరకాండలో హనుమంతుని లాగా ఆ పని మీద పనిచేయడము వలనే ఆ పని జరుగుతుంది. సుందరకాండలో హనుమంతుడు ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆగకుండా ముందుకుపోయి తన పని సాధించాడు. జీవితములో కూడా అదే కథ.

ఈ కథని అందరికి అందించాలని మా అమ్మకి ఒక కోరిక. ఆ కోరిక తోనే ముందు మూడు వందల శ్లోకాలతో సంక్షిప్త సుందరకాండ ప్రచురించడమైనది. అదే సుందరకాండ కాసరబాద.ఓర్గ్ లో కూడా ప్రచురించడమైనది.

తరువాత కిందటి సంవత్సరము( 2016) సుందరకాండ పారాయణ కోసము సుందరకాండ శ్లోకాలు మాత్రమే ప్రచురింపబడినాయి.

ఇప్పుడు సుందరకాండ శ్లోకాలకి తెలుగులో తాత్పర్యము తో సహా తీసుకు రావడానికి ప్రయత్నము చేస్తున్నాము. ఈ పేజిలో ఇప్పటి దాకా వచ్చిన సర్గల తాత్పర్యము శ్లోకాలు , వచనరూపములో సర్గ కనిపిస్తాయి.

ఈ శ్లోకతాత్పర్యాలకు మా ఇంగ్లీషు తాత్పర్యము ఒక ఆధారము. అలాగే రామకృష్ణ మఠము వారి సుందరకాండ కూడా మా దృష్టిపథము లో వుంది. ఈ రెండిటికన్న ఇంకో గ్రంధము మాకు చాలా అధారము అనిపించింది. అది సంస్కృతములో రాయబడిన సుందరకాండ టీకా. అవి రామాయణ తిలక, రామాయన శిరోమణి, రామాయణ భూషణము అనబబడు టీకా త్రయము. ఈ మూడు సుందరకాండలోని పదాలకి సందర్భము వివరిస్తాయి. ఇది సంస్కృత గ్రంధము.

గత విజయదశమి నాడు మొదలెట్టిన ఈ కార్యక్రమము జులై 1కి అవుతుందని అనుకున్న మా అంచనా ప్రకారము అయింది కూడా !

అన్నీ పరమేశ్వరార్పణమస్తు అనడం ఒక ఆనవాయితీ. అలాగే ఇది కూడా
పరమేశ్వరాపణమస్తు !!

||ఓమ్ తత్ సత్||