||సుందరకాండ. ||
||తత్త్వదీపిక -పదమూడవ సర్గ ||
||జ్ఞానమయకోశము లో హనుమంతుడు||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ త్రయోదశస్సర్గః
తత్వదీపిక
జ్ఞానమయకోశము లో హనుమంతుడు
పదమూడవ సర్గలో జరిగిన కథ క్లుప్తముగా ఈ విధముగా చెప్పవచ్చు.
సీత రావణుని భవనము లో వున్నదని సంపాతి చెప్పినా గాని ,
సీతాదేవి ఎక్కడా కనిపించకపోవడముతో
మనోమయకోశమైన రావణ భవనములో
తిరుగుతూ వున్న హనుమంతుని మనస్సు పరిపరివిధములుగా పరిగెడుతుంది.
ఆ మనస్సు పరుగులు,
దానిని అధిగమించి దుఃఖము అనే బంధమును తెంచి,
అన్వేషణకి భగవత్కటాక్షము కావాలని తెలిసికొని,
ప్రార్థనలుచేసి అశోకవనము ప్రవేశించే హనుమంతుని
ఈ సర్గలో మనము చూస్తాము.
ముందుగా ఆ సీతాదేవి కనపడకపోవడముతో
హనుమంతుని మనస్సుచేసే పరుగులు చూస్తాము.
"జనకాత్మజ ఏమైంది ,
రావణునికి వశమయ్యనా?
లేక రామ బాణములకు భయపడి తోందరగా ఎగిరిపోతున్న రాక్షసుని నుంచి సీత పడిపోయిందా?
లేక ఆకాశములో తీసుకుపోబడుతున్నసీత హృదయము సాగరమును చూచి పతించినదా ?
లేక రావణుని నించి విడిపోడానికి ప్రయత్నిస్తున్న సీత సముద్రములో బహుశ పడిపోయి ఉండవచ్చు.
లేక తన శీలము రక్షించుకుంటూ వున్న సీత ఆ దుష్టుని చేత తినబడినదా?
లేక రాక్షసేంద్రుని పత్నులచేత తినబడి ఉండవచ్చు.
లేక రాముని ధ్యానిస్తూ పంచత్వము పొందినదేమో.
లేక మైథిలి ఓ రామా ఓ లక్ష్మణా ఓ అయోధ్యా అని విలపిస్తూ దేహమును త్యజించనేమో'
అని ఆ ఆలోచనలు .
చివర మళ్ళీ సీత రావణునికి వశమయ్యనా అన్నమొదటి ఆలోచనపై ఇంకో ఆలోచనవస్తుంది.
'సీత రావణుని వశము ఏట్లు అగును?'అని.
ఈ విధమైన ఆలోచనలలో హనుమంతుని మనోవ్యథ మనకి కనిపిస్తుంది
ఆలోచనులు అంతటితో ఆగవు.
హనుమంతుని మనస్సు ఇంకా పరిగెడుతుంది.
' రాముని ప్రియమైన భార్య చంపబడినను, చిత్రవధ చేయబడినను , మరణించిననూ
ఆ విషయము చెప్పుట భావ్యము కాదు.
చెప్పుటచే దోషము కలుగును.
చెప్పకపోయిననూ కూడా దోషమే.
ఇప్పుడు కర్తవ్యము ఏమిటో నాకు విషమముగా కాన వస్తున్నది.
ఈ కార్యములో ఏది శ్రేయస్కరము',
అని మళ్ళీ హనుమంతుడు విచారణలో పడును.
ఆ ఆలోచనలు తను సీతను చూడకుండా
లంకానగరము నుంచి కిష్కింధ వెళ్ళిపోతే జరిగే విషయాలపై పోతుంది.
ఆ ఆలోచనలు క్రమముగా సీత కనపడలేదను మాటను విని రాముడు ప్రాణములు త్యజించడము,
రాముడు లేడని మిగిలిన ఇక్ష్వాకు వంశనాశనము,
అదే కారణముగా వానరుల నాశనము దాకావెళ్ళిపోతాయి.
ఆ ఆలోచనలకి అంతముగా "నేను మైథిలిని చూడకుండా కిష్కింధనగరము వెళ్ల కూడదు.
నేను మైథిలి చూడకుండా సుగ్రీవుని చూడను" అనే స్థితికి వస్తాడు.
మళ్ళీ ఆ ఆలోచనలు సీతాన్వేషణపై మళ్ళి,
దానికి కారకుడైన రావణుని పైకి వెళ్ళుతాయి.
ఆ దశగ్రీవుని వధించడమా లేక పశుపతికి ఇవ్వబడు పశువు వలె
రావణుని తీసుకొని పోయి రాముని కి సమర్పించడమా అనే విషయముపై మళ్ళుతాయి.
చివరికి హనుమంతుడు
" రామపత్నీ యశస్వినీ అగు సీతజాడ కనపడువరకు
ఈ లంకానగరమును మళ్ళీ మళ్ళీ వెదకెదను" అని అనుకొని
అప్పుడు కనపడుతున్న అశోకవనములో వెదకడానికి నిశ్చయించుకుంటాడు.
ఆ మహాతేజోవంతుడు మారుతాత్మజుడు అగు హనుమంతుడు కాసేపు ధ్యానము చేసి
దుఃఖమనే బంధమును తెంచుకొని నిలబడి ప్రార్థనచేస్తాడు..
' లక్ష్మణునితో కూడిన రామునకు నమస్కారము.
దేవి అయిన జనకాత్మజకు నమస్కారము.
రుద్రుడు ఇంద్రుడు యముడు అనిలిడు వీరందరికీ నమస్కారములు.
చంద్రునకు, సూర్యునకు మరుత్ గణములకు నమస్కారము'.
ఈ విధముగా అందరికీ ప్రణామములు అర్పించిన
ఆ వానరుని మనస్సు ముందరే అశోకవనము చేరి,
తదనంతర కర్తవ్యము గురించి సీత ఎలాకనపడునో అని ఆలోచించ సాగెను.
'ఇక్కడ ఋషిగణములతో కూడిన దేవులు నాకు సిద్ధి కలిగించుగాక.
స్వయంభూ, బ్రహ్మ దేవతలందరూ,
అగ్ని, వాయువు, ఇంద్రుడు , పాశము చేతులో కలవాడు,
వరుణుడు, చంద్రుడు , సూర్యుడు, అశ్వినులు ,
మరుత్గణములు అందరూ నాకు సిద్ధిని కలుగించుదురు గాక.
సమస్త భూతములు , ఆ భూతముల ప్రభువు ,
ఇంకా కనపడని దేవతలూ కూడా నాకు సిద్ధి కలిగించుగాక'.
ఈ విధముగా ప్రార్థనలు చేసి అశోకవనము ప్రవేశించును
ఇది వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదమూడవ సర్గలో జరిగిన కథ.
ఇది ఒకవిధముగా మనోమయకోశములో మనస్సుని అధిగమించి ముందుకు పోవలసిన సమయములో మనస్సులో జరిగే యుద్ధము అని అనుకోవచ్చు.
సీతాన్వేషణ ఫలించకపోవడముతో ,
సీత జీవించివున్నదా లేదా అన్న సందేహముతో పాటు ,
సీతకనపడలేదని చెప్పడమువలన కలిగే హాని అంతా ఆలోచించి ,
హనుమంతుడు వెనకాడలేదు.
రావణుని ( రావణుడు అనే మనస్సుని) సంహరించడమో
లేక ఆ రావణుని పశువు లాగా తీసుకుపోయి రామునికే సమర్పిద్దాము అన్న ఆలోచన వచ్చి ,
" వుదతిష్ఠన్ మహాతేజా " ,
ధృఢ నిశ్చయముతో లేచి నుంచుని
ఆ తేజోవంతుడు అన్వేషణలో ముందుకు వెళ్ళాడు కాని
అ సందేహాలకి బానిస అయి అన్వేషణ చాలించలేదు.
ఇక్కడ ఇంకో మాట కూడా వున్నది.
ఇంత శోకములో కనపడినది అశోకవనము.
ఆ అశోకవనములో వెళ్ళబోతూ చేసిన హనుమంతుని ప్రార్థనలతో ,
ఈ సీతాన్వేషణ లో సిద్ధి కలగాలి అంటే తన సామర్థ్యముతోనే కాక
పరమాత్ముని కటాక్షము కావాలి అన్నమాట
హనుమంతునికి స్ఫురించినట్లు మనకి స్ఫురిస్తుంది.
అలాగే అత్మాన్వేషణలో కూడా మన సామర్థ్యమే కాక
భగవంతుని కటాక్షము కూడా ఉండాలి
అన్నమాట కూడా మనకు విదితమౌతుంది.
ఈ సర్గలో ముఖ్యమైన శ్లోకము
శ్లో||నమోస్తు రామాయ స లక్ష్మణాయ
దేవ్యే చ తస్యై జనకాత్మజాయై|
నమోస్తు రుద్రేంద్ర యమానిలిభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గనేభ్యః||
ఈ ప్రార్థనా శ్లోకము నిత్యము చదువుకొనతగినది.
రామాయణ పారాయణలో అనేకమంది ఈ శ్లోకమును
ప్రార్థనా శ్లోకముగా ఉపయోగిస్తారు
వెనుక మహేంద్ర పర్వతము నుండి బయలు దేరునపుడు
హనుమంతుడు నమస్కారము చేసి బయలు దేరెను.
అపుడు సూర్యునకు, ఇంద్రునకు,బ్రహ్మకు, వాయువునకు నమస్కరించెను.
కాని ఇపుడు సీతకు రామునకు, లక్ష్మణునకు ముందు నమస్కరించి
తరువాత ఇతర దేవతలకు నమస్కరించెను.
అంటే భగవదనుగ్రహము, భగవద్భక్తుల అనుగ్రహము,
దేవి అనుగ్రహము కలిగిన వాడు ఆత్మదర్శనము
తద్వారా భగవద్దర్శనము పొందును.
ఇతర దేవతలను నమస్కరించుట
వారి అనుగ్రహము పొందుట,
అంతః కరణ శుద్ధికి అవశ్యము.
భగవంతుని నమస్కరించునపుడు
భగవద్బక్తులద్వారా దేవిద్వారానే ఆశ్రయింపవలెను అను నియమమును
ఇక్కడ హనుమంతుడు పాటించెను.
మహేంద్ర పర్వతము నుండి బయలుదేరుతూ
సూర్యమహేంద్రాదులకు నమస్కారము చేసినపుడు
''నమ" అన్న శబ్దము వాచ్యముగా ప్రయోగింపలేదు.
ఇక్కడ మూడు సార్లు నమః శబ్దమును ప్రయోగించెను.
సీత సాక్షాత్తు 'లక్ష్మీ స్వరూపిణి'.
ఆమె ఎన్నడూ స్వామిని వీడియుండునది కాదు.
జీవ స్వరూపమును శిక్షించుటకై ఆమె ఇందు బంధనమున ఉన్నట్లు జీవభావమున నటించుచుండెను.
ఆట్టి ఆమెని తాను వెతుకుట ఏమి?
ఇది కేవలము "లోకవిడంబనమని" హనుమ ఎరింగెను.
వెంటనే తాను అన్వేషించు చున్నాను అన్న స్వాతంత్ర్య భావముము విడిచి
పారతంత్ర్యమును ఇందు ప్రకటించెను అంటారు అప్పలాచార్యులవారు.
నమః అంటే,
న = కాదు; మః =నాది ;
నమః అంటే నాది కానిది.
ఆ నమః అనడములో అన్వేషించుటలో
'నేను కర్తను కాను. నేను వారి పని ముట్టును"
అనుభావన మనోవాక్కాయకర్మలచే ప్రదర్శించడము.
అ నమః తోనే భగవంతుని శరణాగతి చేసెను.
అపుడు కాని సీతమ్మ దర్శనము ఒసంగలేదు.
సీతమ్మ సాక్షాత్తు 'లక్ష్మీ స్వరూపిణి కనుక
ఆమె అనుగ్రహమున్ననే ఆమె దర్శనమిచ్చునని హనుమ గుర్తించి,
"నమోస్తు దేవ్యై జనకాత్మజాయై" అని నమస్కరించెను.
దేవి అను పదమునకు క్రీడించునది , ప్రకాశించునది అని అర్థము.
ఇది అంతయూ ఆమె క్రీడయే.
అంతే గాక ఆమె ప్రకాశ స్వరూపిణీ.
ప్రకాశము ఇతరులను ప్రకాశింపచేయును.
తానును ప్రకాశించును.
అందుచే తన సంబోధనలో జనకాత్మజ అనెను.
అంటే జనకుని కూతురనికాదు.
"జనకునకు తనను కనిపింపచేసినది" అని అర్థము.
"అమ్మా ఆనాడు జనకుడు నిన్ను పొందవలనని యజ్ఞక్షేత్రము దున్న లేదు.
తనంత తాను దున్నుచుండగా నీవు అనుగ్రహించి అతనికి కనపడితివి.
అట్లే నీవు అనుగ్రహించి నాకు కనపడవలెను గాని నేను నిన్ను వెతుకుటయా?"
అను భావము స్ఫురించునట్లు పై వాక్యము-
"నమోస్తు దేవ్యై జనకాత్మజాయై" - పలికెను.
ఇట్లు హనుమంతుడు సీతమ్మను ప్రార్థించి ముందుకేగెను.
ఇంకోమాట.
జాంబవంతుని ప్రేరణతో సముద్రలంఘనము చేయబోతూ
తనని రామబాణముతో పోల్చుకొని
"గమ్యము చేరతాను , కార్యము సాధిస్తాను , లేకపోతే రావణుని బంధించి తీసుకు వస్తాను"
అని ప్రతిజ్ఞచేసిన హనుమంతుడు
సీతాదేవి కనపడపోవడముతో మనోవ్యధలో పడి,
మళ్ళీ ఆ నిర్వేదము వదిలి ఆ మనోవ్యథలోనుంచి బయటపడి,
"ఉదతిష్ఠన్ మహాతేజా" ఆ తేజోవంతుడు తనని తాను పైకి లాక్కున్నాడుట.
అలా నిర్వేదము వదిలిన హనుమంతుడు అశోకవనములో ప్రవేశిస్తూ ,
తన సామర్థ్యముమీదే కాక భగవత్కతాక్షము కూడా కావాలని భగవంతులందరికీ ప్రార్థన చేస్తాడు.
ఈ ప్రార్థనలలో మనకి స్ఫురించేది,
'తన సామర్థ్యమే కాదు దేవి కటాక్షము కావాలి' అని హనుమంతునికి జ్ఞానోదయము అయినది అని.
అంటే ఇదే జ్ఞానమయకోశమా అని కూడా స్ఫురిస్తుంది.
జ్ఞానస్వరూపుడైన హనుమంతునికి భగవంతుని కటాక్షము కావాలి
అని జ్ఞానోదయము అయింది అనడము అసమంజసముగా అనిపించవచ్చు.
హనుమంతుడు లంక చేరడానికి సముద్రలంఘనము చేయగల శక్తి తనలో ఉన్నాగాని,
ఆ శక్తి తనలో వున్నదని జాంబవంతుని ప్రేరణవలననే ,
హనుమంతుడు ముందుకు వెళ్ళాడు.
అదే విధముగా ఆ జ్ఞానము తనలో ఉన్నాగాని,
సీత కనపడక పోయి మనో వ్యధ చెందిన హనుమ,
మనస్సును జయించి ముందుకు పోతూ,
ఈ అన్వేషణలో భగవంతుని కటాక్షము కావాలి అనే మాట మళ్ళీ తనంతట తానే గ్రహించడమైనది అన్నమాట.
అలా గ్రహించడమే జ్ఞానోదయము.
ఆ జ్ఞానోదయము తోనే ఆ ప్రార్థనలు చేశాడని అప్పలాచార్యులవారి తత్త్వగీత.
అదే జ్ఞానమయకోశములోని హనుమంతుని కథ.
||ఓమ్ తత్ సత్||
|| ఇది భాష్యమ్ అప్పలాచార్యులవారి తత్త్వదీపికలో మాకు తెలిసిన మాట||
||ఓమ్ తత్ సత్||