||సుందరకాండ. ||

||తత్త్వదీపిక - పదునాలుగొవ సర్గ ||

||ఆనందమయ కోశములో హనుమంతుడు||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ చతుర్దశస్సర్గః

తత్త్వదీపిక
ఆనందమయ కోశములో హనుమంతుడు

పదునాలుగొవ సర్గలో కథ క్లుప్తముగా ఇలా చెప్పవచ్చు.

హనుమంతుడు ప్రవేశించిన అశోకవనము సుందరమైన వనము. ఆ వనము అన్నిరకముల ఫల పుష్పవృక్షములతో నిండియుండెను. ఆ వృక్షముల క్రింద గొడుగులు , గొడుగుల క్రింద అరుగులు నిర్మింపబడెను. హనుమంతుడు అక్కడే దట్టముగా ఆకులతో అలముకొనిన బంగారు శింశుపా వృక్షము చూచెను. ఆ వృక్షము ఎక్కిన హనుమంతుడు రాముని దేవి తప్పక ఇచట రాగలదు అని భావించి ఆ చెట్టుపైన ఎవరికీ కానరాకుండా సీతమ్మకై ఎదురుచూచుచూ కూర్చుని ఉండెను.

అది జరిగిన కథ.

ఆ కథలో మనకు కనపడేది వాల్మీకి వర్ణనలే.

మొదటి శ్లోకములోనే పదమూడవ సర్గలో హనుమ చేసిన ప్రార్థనలను మళ్ళీ మనకి స్ఫురించేటట్లుగా - "స ముహూర్తమివ ధ్యాత్వా"- అంటాడు. ధ్యాత్వా అన్నమాటలో మనకి మళ్ళీ ధ్యానించి ఆ వనములో ప్రవేశించాడు అని స్ఫురిస్తుంది.

అలా ప్రవేశిస్తున్న హనుమంతుడిని వర్ణిస్తూ వాల్మీకి అంటాడు-
"సంహృష్ట సర్వాంగః".
అంటే అన్ని అంగములలో ఆనందము కలిగియున్నవాడు అని.
హనుమంతుడు ఎంతో ఆనందముతో ఉత్సాహముతో ప్రవేశిస్తాడు అన్నమాట.

ఆ వనములో ఎలా ప్రవేశిస్తాడు?
"జ్యాముక్త ఇవ నారాచః"
అంటే లాగి వదిలిన బాణమువలె అ వనములో ప్రవేశిస్తాడు.
ఇది మనకి బయలుదేరేముందు హనుమంతుడు చెప్పిన మాటలు గుర్తుతెస్తాయి.
ఆ మాటలు తనను తాను రామబాణముతో పోల్చుకొని చేపట్టిన కార్యము సాధిస్తాను అని అన్నమాటలు.
ఆ మాటలు ఈ అన్వేషణ అంతిమచరణములో వుందా అని మనకి స్ఫురించే మాటలు.

అక్కడ పక్షులు ఎలా వున్నాయి?
"సుఖప్రసుప్తాన్ విహగాన్"
ఆ పక్షులు హాయిగా సుఖముగా నిద్రించుచున్నాయిట.

ఆ వనములో వృక్షములు హనుమంతుడు దూసుకుపోతూవుంటే
"ముముచుః పుష్ప వృష్టయః"
ఆ వృక్షములు హనుమంతుని మీద పుష్పవృష్టి కురిపించాయిట.

హనుమ ఎలావున్నాడు?
'పుష్పావకీర్ణః శుశుభే హనుమాన్ మారుతాత్మజ"-
పుష్పములతో కప్పబడి హనుమంతుడు శోభిస్తున్నాడుట.
పుష్పములతో నిండిన పర్వతము వలె ఉన్నాడుట.

ఆ పుష్పములతో కప్పబడిన హనుమంతుని చూచి "సర్వాణి భూతాని" ఆన్ని భూతములూ
"వసంత ఇతి మేనిరే"
వసంతఋతువే హనుమంతుని రూపములో వచ్చెనా అని అనుకున్నాయిట.
వసంతం అంటే ఆనందము కలిగించే ఋతువు.
'సర్వాణి భూతాని' అంటే అన్ని భూతములూ కూడా ఆనందములో వున్నాయన్నమాట.

అక్కడ భూమికూడా
"రరాజ వసుధా తత్ర"
అక్కడ భూమికూడా శోభిస్తూవుందిట.
భూమి శోభిస్తూ వున్నదనడములో మనకి తెలిసేది ఆనందమే.

అప్పలాచార్యులవారు తత్త్వదీపికలో రాస్తారు ఆ అశోకవనము మీద:
ఆ వనము పురుషునిచే ఉపభోక్త అయి అంగరాగము చెరిగిపోయి, కేసపాశములు జల్లుకుపోయి , నఖదంతక్షతములతో బడిలి ఉన్న యువతి వలె భాసిస్తున్నదట.
అంటే ఆమె అనందాతిశయములో ఉన్నదన్నమాట.
అంటే ఆ అశోకవనము ఆనందము కలిగిస్తూవున్నదన్నమాట.

ఇలాంటి వర్ణనలు ఇంకా వున్నాయి.
ఇలా వాల్మీకి ప్రతి వర్ణనలోనూ మనకి కలిగించేది కనపడేది అనందము అనందముయొక్క రేఖలు.

అందుకే ఇది ఆనందమయకోశమా అని స్ఫురిస్తుంది.
అదే అశోకవనములో ఆనందమయకోశములో ఉన్న హనుమంతుని కథ.

||ఓమ్ తత్ సత్||
|| ఇది భాష్యమ్ అప్పలాచార్యులవారి తత్త్వదీపికలో మాకు తెలిసిన మాట||
||ఓమ్ తత్ సత్||