||సుందరకాండ. ||

||తత్త్వదీపిక -పదహేడవ సర్గ||

||దర్శన దశలో హనుమంతుడు ||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ సప్తదశస్సర్గః

తత్త్వదీపిక
దర్శన దశలో హనుమంతుడు

భగవద్దర్శనములో నాలుగు దశలు వుంటాయి.
అవి శ్రవణ , మనన , ధ్యాన , దర్శన దశలు.
ఈ సర్గలో హనుమంతుని అన్వేషణలో దర్శన దశ చూస్తాము.

ముందు పదహేడవ సర్గలో జరిగిన కథ క్లుప్తముగా ఇలా చెప్పవచ్చు.

హనుమంతుడు శింశుపా వృక్షముపై కూర్చుని సీతమ్మని చూస్తాడు.
అప్పుడు స్వయముగా నిర్మలమైన ,
కుముదముల సమూహములాగ కాంతివిరజొల్లుచున్న చంద్రుడు
నిర్మలమైన ఆకాశములో నీలమైన ఉదకములో ఈదుచున్న హంసవలె కనిపించెను.

నిర్మలమైన కాంతిగల చంద్రుడు తన చల్లని కిరణములు,
వాటి కాంతులతో పవనాత్మజునికి సహాయము చేస్తున్నాడా అన్నట్లు,
హనుమంతుని సేవించసాగెను.

అప్పుడు ఆ పూర్ణచంద్రునుబోలి ముఖము కల,
భారముగా వుండి నీటిలో మునిగిపోతున్న నావ వలె శోకభారమును మోయుచున్న సీతను
హనుమంతుడు చూచెను.

వైదేహిని చూచుచున్న లక్ష్మీవంతుడైన హనుమంతుడు,
పక్కనే వున్న ఘోరరూపములు కల రాక్షస స్త్రీలను చూచెను.
ఆ రాక్షసుల ఘోర రూపములు అనేక విధములుగా వర్ణింపబడతాయి.
ఆ ఘోరరూపముకల రాక్షస స్త్రీల మధ్యలో సీత వుండెను.

ఆ క్షమారూపము కల,
ఆభరణములేకపోయినప్పటికి అందముగా కల అంగముల తో శోభిస్తున్న ఆ మైథిలిని చూచి
ఆ మారుతికి అత్యంత ఆనందము కలిగెను.
ఆ ఆకర్షణీయమైన కళ్ళు కల ఆ సీతను చూచి హర్షముతో కన్నీళ్ళను విడచెను.
రాఘవునకు నమస్కరించెను.

సీతాదర్శనముతో సంతోషపడిన ఆ హనుమంతుడు
రామునకు లక్ష్మణునకు నమస్కరించి
ఆ చెట్టు ఆకులచాటున దాగి ఉండెను.

అది వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదహేడవ సర్గ జరిగిన కథ.

ఈ సర్గ మళ్ళీ చంద్రుని వర్ణనతో మొదలవుతుంది.

చీకటిలో వస్తువుని దర్శింపచేయువాడు చంద్రుడు.
చంద్రుని గురించి మూడు సార్లు వింటాము.

రెండవసర్గలో "చంద్రోపిసాచివ్య మివాస్య కుర్వన్' (2-57)అంటూ
"ఉత్తిష్టతేనైక సహస్రరశ్మిః" అప్పుడే ఉదయిస్తున్న చంద్రుని గురించి వింటాము.
"మధ్యంగతం అంశుమంతం"(5-1) అంటూ,
ఆకాశమధ్యస్థములో ఉన్న చంద్రుని గురించి ఐదవ సర్గలో వింటాము.
"ప్రజగామ నభశ్చంద్రో"(17-1) అంటూ పదిహేడవ సర్గలో
ఆకాశముయొక్క పరభాగము చేరినట్లు వింటాము.
హనుమంతుని సీతాన్వేషణలో,
చంద్రుడు సచివుడులాగా వెనకాతలే వున్నాడన్నమాట.

భగవంతుని దర్శించుటకు నాలుగు దశలుండును.
అవి శ్రవణము, మననము ధ్యానము దర్శనము అని.

లంకలో సీతయున్నది అని సంపాతి ద్వారా వినినాడు హనుమ.
అది శ్రవణ దశ.
అది కిష్కింధకాండలో చెప్పబడినది.

మిగిలిన మూడు దశలు అంటే మనన , ధ్యాన, దర్శన దశలు,
మనకి సుందరకాండలో చూపబడినవి.

(1) లంకలో ప్రవేశించి సీతమ్మను వెదకవలెనని నిశ్చయించుకొని హనుమ బయలుదేరెను.
ఈ దశలో చంద్రుని వెన్నెలవంటి జ్ఞానము విశదముగా వుండును.
అది మనము రెండవ సర్గలో వినినమాట.
అది మనన దశ.

(2) తరువాత హనుమ లంకను అన్వేషించును .
ఇతర విషయములపై తన ధ్యాసపోకుండా సీతమ్మనే తలచుచూ లంక అంతా తిరుగును.
అప్పుడు "మధ్యంగతం" అంటూ చంద్రుడు ఆకాశములో మధ్యలో నిలచెను అని వింటాము.
ఆచార్యుడొసంగిన ఆత్మ అధ్యాత్మ జ్ఞానముచే
ధ్యానించ వలసిన దానినే ధ్యానించుచూ అన్వేషించెను .
అది ధ్యాన దశ.

(3) దాని తరువాత హనుమ అశోకవనమును ప్రవేశించి సీతమ్మను దర్శించును.
ఇక్కడ "ప్రజగామ నభః చంద్రో" అంటూ చంద్రుడు ఆకాశమున సాగుతూ
పర భాగము చేరినట్లు వర్ణింపబడినది.
ఇది దర్శన దశ.

ఈ మూడు దశలలో జ్ఞానము మూడు విధములుగా వుండును.
మనన దశలో జ్ఞానము విశదమై యుండును.
తరువాత ధ్యాన దశలో జ్ఞానము విశదతరమై యుండును.
తరువాత దర్శన దశలో జ్ఞానము విశదతమమై యుండును.

అలాగ ఆ చంద్రుడు సాచివ్యము చేయుచుండగా
చెట్టు మీద కూర్చునియున్న హనుమంతుడు సీతమ్మ దర్శనము చేసెను.

సీతమ్మపక్కనే అనేకమైన విరూపములు కల రాక్షసస్త్రీలను హనుమంతుడు చూచెను.

వాళ్ళవర్ణన ఇలావుంటుంది.
ఏకాక్షి, ఏక కర్ణ, అకర్ణ, శంఖుకర్ణ, లంబకర్ణ, అతికాయ,
ధ్వస్త కేశి, కేశకంబళధారిణి, లంబోదర,
లంబోష్టి, లంబాస్య, లంబజానుక .
ఇవన్నీ విరూపములే.
ఇందులో మనము వినేది ఏమిటి?

ఆత్మను ఆవరించుయుండు అసుర ప్రవృత్తులే ఆ రాక్షస స్త్రీలు.

ఇంద్రియ ప్రవృత్తులలో అభివ్యక్తమగు ఈ చిత్తవృత్తులనే
భిన్న భిన్న నామములతో మనకి వినిపించడమైనది.
ఆయా ఇంద్రియముల ప్రకోపము అధికముగా వున్నవారిని
ఆయా ఇంద్రియముల విరూప నామములతో వ్యవరింపవచ్చునేమో.
వారందరూ సతతము క్రోధము కలవారై భయముకొలుపుతూ వున్నారుట.

సీతాదర్శనము చేసికొనిన హనుమని మళ్ళీ "లక్ష్మీవంతుడు" అని అంటాడు వాల్మీకి.

ఇక్కడ ఇంకో విషయము వుంది.

సీతమ్మకు ఇందు ప్రయోగించబడిన ఉపమానములు ప్రత్యేకమైనవి.
స్త్రీకి అటువంటి ఉపమానము ఎవరూ ఉపయోగింపలేదు.
ఆ ఉపమానములు స్మృతి, సిద్ధి,ఆశ, బుద్ధి, కీర్తి, పూజ, విద్య, వాక్ , అగ్నిశిఖ.

విద్య, వాక్, కీర్తి మున్నగునవి లక్ష్మీ నామములు.

అట్టి సీతమ్మను చూచి హనుమ మనస్సులో సంతోషించెను.

రామునకు నమస్కరించెను.
సీతను చూడగలిగితిని అని పొంగిపోయెను.
కనులనుండి ఆనంద భాష్పములు రాల్చెను.

ఇదే దర్శన దశలో కలిగే ఆనందము

ఆ దర్శనము చేసిన హనుమంతుడు
ఆ శింశుపావృక్షము యొక్క ఆకు గుబురులలో దాగిఉండెను.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||