||సుందరకాండ ||

||తత్త్వదీపిక ||

||మొదటి సర్గ - రామార్థమ్ వానరార్థమ్ చ. ||


||ఓం తత్ సత్||

తత్త్వ దీపిక
రామార్థమ్ వానరార్థమ్ చ.. - మొదటి సర్గలో !

మొదటి సర్గలో మొదటి శ్లోకములో మనము వినేది - హనుమ భగవదనుగ్రహముతో భగవద్దత్తమైన అంగుళీయకముతో సీతాన్వేషణకు అంటే భగవంతుని నుంచి దూరమైన జీవాత్మను అన్వేషించడానికి బయలు దేరు తాడు.

ఎలా బయలుదేరుతాడు?
అది కూడా మొదటి శ్లోకములో వింటాము.

'చారణా చరితే పథిః" -
అంటే ఆకాశమార్గమున పయనించు చారణులు పోవు మార్గములో.
చారణా అంటే ఋషులు అని కూడా అనవచ్చు.
అప్పుడు చారణా చరితే పథిః అంటే ఋషులు వెళ్ళిన మార్గములో అని అర్థము.

అంటే హనుమంతుడు పూర్వము పెద్దలు అగు ఋషులు వెళ్ళిన మార్గముననే వెళ్ళెను అని.
దీనిలో మనకి వచ్చే అర్థము, శాస్త్రములను చదివినా గాని అనుమానం ఉంటే పెద్దల నడవడి యే అనుసరింపతగినది అని.
ఇదే ఉపనిషత్తులలో కూడా చెప్పబడినది.

"అథ యది తే కర్మవిచికిత్సా వా
వృత్త విచ్చికిత్సా వా స్యాత్
యే తత్ర బ్రాహ్మణాః సమర్శినః అలూక్షా ధర్మకాస్స్యుః
యథా తే తత్ర వర్తేరన్
తథా తత్ర వర్తేథాః"

ఈ ఉపనిషత్తు వాక్యము చదువుతున్నపుడే చాలాభాగము మనకు సులభముగా అర్థమవుతుంది.
"ఎక్కడైన కర్మఆచరణలో సందేహము వున్నా, లేక విషయానుసరణలోకాని సందేహము వున్నా, అక్కడ ధర్మమార్గమున నడచు బ్రాహ్మణులు ఏ విధముగా ప్రవర్తిస్తారో ఆవిధముగా ప్రవర్తింపవలెను అని".

"చారణా చరితే పథిః"" అన్న మాటలో మనకి వినిపించేది ఆ ఉపనిషత్తులమాటే !

ఇక్కడ ఇంకో మాట కూడా వుంది.

చారణా చరితే పథి అంటే ఆకాశమార్గమున అని
ఆకాశ్ అంటే అంతటా సంపూర్ణముగా ప్రకాశించువాడు, అంటే పరమాత్మ.
ఆకాశమార్గమున వెళ్ళుట అంటే- సతతముగా బ్రహ్మనిష్ఠ కలిగి యుండుట.
అలా బ్రహ్మనిష్ఠ కలిగిన వాడే జీవులను తరింపచేయగలడు.
అట్టివాడే ఆత్మ అన్వేషణలో విజయము సాధిస్తాడు.

ఇలా హనుమంతుడు సుందరకాండలో భవదనుగ్రహము కలవానిగా , సాధకునిగా , రామదూత లాగా కనిపిస్తాడు.

అట్టి హనుమంతుడు
దుష్కరం నిష్ప్రతిద్వంద్వం - దుష్కరమైన, సాటిలేని సముద్రము సీతాన్వేషణకై దాటుటకు నిశ్చయించుకొనెను.

ఆ కార్యము నూరు యోజనముల సముద్రము దాటడమే.
నూరుయోజనముల సముద్రమును ఒక్కగంతులో దాటడము అన్నది ఒక దుష్కరమైన పని
సంసార సముద్రమును ఏ ప్రతిబంధముబంధకములు లేకుండా దాటడము కూడా ఒక దుష్కరమైన పనియే.

అలాంటి సముద్రము దాటుటకు "గవాం పతిః ఇవాబభౌ" వృషభరాజము వలె మెడ నిక్క నిటారుగా పెట్టి హనుమంతుడు నిలబడ్డాడుట.

వృషభము ఏది అడ్డొచ్చినా గాని ఆగక ముందుకు దూసుకుపోతుంది. అలాగే హనుమంతుడు కూడా ముందుకు పోవును అని వాల్మీకి అన్నమాట.

అలా తయారుగా వున్న హనుమ (ధీరుడు) .. కొండపై సమతల ప్రదేశములో వైడూర్యము వంటి రంగుగల పచ్చికబయళ్ళలో ముందుకు వెనకకు నడుస్తున్నాడుట. ఇక్కడ ధీరుడుఆన్న పదము హనుమంతునికి వాడబడినది.

పచ్చిక బయళ్ళు అంటే విషయ భోగములు. సంతోషము కలిగించు స్థానములు. కార్యాచరణలో నిమగ్నులైనవారు వాటిలో విహరించున్నప్పటికీ తనమనస్సును ఆ విషయభోగములపై రమించక తన గమ్యస్థానముపై ఉంచవలెను.

ఇక్కడ హనుమంతుని దృష్టి ఆకాశముపై , అంటే ఆకాశమనే పరబ్రహ్మముపై దృష్ఠి కలవాడై ఉండెను.

పచ్చికబయళ్ళపై తిరుగుతున్న హనుమంతుడిని ధీరుడు అనడములో ఇంకో మాట వుంది.
పచ్చికబయళ్ళపై తిరుగుతున్నవాడిని ధీరుడు అనవలసిన విషయము లేదు.
మనము కూడా ఆ పచ్చిక బయళ్ళపై నడవగలము.
కాని ఇక్కడ ధీరుడు అంటే "ధీ" బ్రహ్మజ్ఞానమున, "ర" రమించువాడు అంటే బ్రహ్మజ్ఞానమున రమించు హనుమ కి ఈ పచ్చిక బయళ్లపై నడిచినా అతని నిష్ఠకు భంగము కలగదు అన్నమాట. అంటే హనుమంతుడు అంత నిష్ఠగలవాడన్నమాట.

అలా దుష్కరమైన కార్యము చేపట్టబోతూ తలచి ఎగరబోయే ముందర హనుమంతుడు ఇష్ఠదేవతలకు నమస్కరిస్తాడు.

ఏ కార్యము మొదలెట్టబోతున్నా ముందు సంధ్యావందనము చేయవలెను.
అది మన శాస్త్రములలో చెప్పిన మాట
"సంధ్యాహీనః అశుచిః నిత్యం అనర్హః సర్వకర్మసు"
"శుచిలేని వాడు సంధ్యా హీనుడు అన్ని కార్యములకు అనర్హుడు".

అదే మాటను పాటిస్తూ ఇక్కడ హనుమ సూర్యునకు మహేంద్రునికి తన తండ్రి అయిన వాయుదేవునకు నమస్కరించి తన కార్యము మొదలెడతాడు.

తన కార్యము మొదలెట్టడానికి వాల్మీకి చే వర్ణింపబడిన హనుమ చేసిన పనులలో బాహువులను నిశ్చలముగా నిలుపుట, కటిని ( పొట్టను ) సంకోచింపచేయుట, భుజములను వంచుట , చెవులు తిన్నగా నిలుపుట ఇవన్ని మహేంద్ర పర్వతము మీదనుంచి ఎగరడానికి ముందు తయారవడానికి చేసిన పనులు .

ఈ పనులు కూడా ఇంద్రియముల యొక్క ప్రవృత్తిని నియమము లో ఉంచుటకు చేయబడు సాధనలు, కార్యములు. ఇవి అన్నీ యోగాభ్యాసము చేయువిధానములు.

ఇలా యోగాభ్యాసనము చేసినపుడు శరీరములో స్వేదనము కంపనము కలుగును.
ఇక్కడ హనుమ చేసిన క్రియలతో కొండ కదిలెను. నీరు స్రవించెను
లోపలనున్న రాజస తామస గుణములు అంటే స్వభావములు వెలికి పోయి సాత్విక స్వభావము ఏర్పడును.

హనుమ ఈ పని చేస్తున్నది అంతా ఎవరికోసము?
" రామార్థమ్" "వానరార్థమ్"
రామునికొరకు, వానరులకొరకు.
అలాచెపుతూ కవి చేత హనుమయొక్క నిష్కామ కర్మ చెప్పబడినది.

ఆత్మజ్ఞానమునకూ భగవత్ప్రాప్తి కొరకు ప్రయత్నము చేసేవారు చేసే ప్రతి పని భగవదర్పణము చేసే చేస్తారు. ఏ పని తమ స్వలాభము కోసము చేయరు.

ఇదే మాట మనము అనేక విధములుగా అనేక సందర్భాలలో వింటాము.

మహాపురుషులు భగవత్ప్రీతి కొరకో, లోకక్షేమము కొరకో కర్మ చేస్తారు అని గీత లో చెప్పబడినది.
అలాగే రామునికొరకు వానరుల కొరకు హనుమ చేస్తున్న పనిని చూసినవారందరూ అదే నిష్కామ కర్మ అని భావిస్తారు.

అలా అకాశములో ఎగరడానికి తయారు అయిన హనుమంతుడు సూర్యుడు మహేంద్రుడు తదితర దేవులకు నమస్కరించి- తనతో వున్న వానరులతో ఇలా చెపుతాడు.

"రాముడు వదిలిన బాణము ఎట్లు వాయువేగముతోపోవునో అట్లే నేను రావణుడు పాలించు లంకకు పోయెదను. ఏది ఏమైన సరే పనిపూర్తిచేసికొనియె వచ్చెదను" అని.

అలా వదిలిన బాణానికి స్వతహా శక్తి వుండదు.
ఆ బాణము సంధించి ప్రయోగించిన వాని శక్తియే ఆ బాణమునకు వచ్చును.

రాముడు వేగముతో బాణము లాగి వదలగా,
రాముడు కల్పించిన వేగమే ఆ బాణమునకు కలుగును.
ఆ రామ బాణము మధ్యలో ఆగదు.
ఆ రామ బాణము లక్ష్యము చేరును.

హనుమ తనను ఆ రామ బాణముతో పోల్చుకుంటాడు.
" రామునివేగమే తన వేగముగా,
రాముని శక్తియే తనశక్తిగా భావించుకుంటాడు".
ఆ శక్తి అంతా భవంతునిదే కాని తనశక్తి కాదు అని అనుకుంటాడు.

కర్మసాధనకు, నిష్కామ కర్మకు ఇదే ముఖ్యము.
చేసిన పని తనకోరకై కాక ఇతరులకొరకై చేయవలెను.
చేసిన పని భగవంతునిచే చేయబడినది అనుకోవలెను.
ఆ పని తనే చేసెను , తన చేత చేయబడెను అనే భావము ఉండకూడదు.

హనుమ అలా ఎగిరినప్పుడు ఆ కొండ మీద వున్న చెట్లూ చేమలూ ఆయనతో పాటు ఎగురుతాయి.
బరువైన చెట్లు సముద్రములో పడి మునిగి పోతాయి.
ఆచెట్లనుండి రాలిన పుష్పములు సముద్రములో తేరతాయి.

అలా వెంటబడి ఎగిరిన వృక్షములను బంధువుల వెంట అనురాగముతో వెళ్ళిన బందువులు లాగా,
రాజు వెంట నిర్బంధము చేత వెళ్ళిన సైనికులతో పోల్చడమైనది.

మహాపురుషులు అధ్యాత్మిక మార్గములో పోవునప్పుడువారి దర్శనము చేసి ప్రజలు తమంతట తామే భక్తితో వారిమార్గములో నడవవలెనని ప్రయత్నము చేస్తారు. కొందరు వారి బలగముతో సహా ఫలాపేక్షతో నడుస్తారు.

అలా ఫలాపేక్షతో నడిచేవారు ఆ సముద్రములో పడిన పెద్దవృక్షములు లాంటి వారు.
వృక్షము అనే పదము శరీరమును సూచించును
పుష్పములు జ్ఞానమును సూచించును.

మహాపురుషుల సాంగత్యములో మనకు విషయ సాంగత్యము అంటే ఫలాపేక్ష విడి పోయినట్లుండును.
పూలు రాలిపోయినట్లు అజ్ఞానము రాలిపోవును..

అలా ఎగిరిపోతున్న హనుమంతుడిని సూర్యుడు తపింపచేయలేదు.
తన కిరణములతో. వాయువు అనుకూలముగా వీచెను.
దేవతలు పుష్పవర్షము కురిపిస్తారు.

నిష్కామ కర్మ చేసేవారికి కష్టము అనిపించదు.
సూర్యుడి ఎండ తగలదు.
ఇంకాపైగా సహకారము చేసేవారు కొల్లలుగా పెరుగుతారు వాయుదేవుని చల్లని వాయువుల లాగా
అదే నిష్కామకర్మ మహిమ.

భగవద్గీతలో కూడా అదే వింటాము ( గీత 3-40)

శ్రీభగవానువాచ
నేహాభి క్రమనాశోsస్తి ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||40 ||

ఈ కర్మయోగములో
అభిక్రమనాశః - ప్రారంభించినది నాశనమగుట , నిష్ఫలమగుట లేదు
ప్రత్యవాయో - దోషము
న విద్యతే - లేదు
అంటే నిష్కామ కర్మ మొదలేట్టితే నిష్ఫలమవ్వడము లేదు.
అస్య ధర్మస్య స్వల్పమపి - ఈ నిష్కామ కర్మ కొంచెము చేసిననూ
త్రాయతే భయాత్ - భయము నుంచి రక్షించును.

ఎంత చిన్నపని నిష్కామము గా చెసినా అది జీవుని సంసారభయమునుంచి రక్షించును.
అంటే నిష్కామ కర్మ చేయునివానికి సంసార బంధనముల గురించి భయము తొలగుట ఒక మహత్తర భాగ్యము.

ఈ కర్మయోగానుష్ఠానమునకు అంటే అనుసరించడానికి నిశ్చయముతో కూడిన బుద్ధి ఒక్కటే కావాలి
ఇదే వాల్మీకి హనుమంతుని కార్యముల ద్వారా మనకి చెప్పుచున్నమాట.

||ఓమ్ తత్ సత్||
|| పాఠకులకు మనవి - ఇది భాష్యము అప్పలాచార్యులవారు రాసిన తత్త్వ దీపిక ద్వారా మాకు తెలిసిన మాట.||
|| ఓమ్ తత్ సత్ ||