||సుందరకాండ. ||
||తత్త్వదీపిక- తత్త్వదీపిక- ఇరవరెండవ సర్గ||
||రావణుని బెదిరింపులు||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ ద్వావింశస్సర్గః
తత్త్వదీపిక
రావణుని బెదిరింపులు .
సీత దయాస్వభావముతో మాట్లాడినా చివరిలో రాముని తో మైత్రి చేసికొనబోతే,
ఎక్కడున్నాగాని రాముని బాణములను తప్పించుకు పోలేవు అన్నమాట
రావణుని అహంకారానికి ఒక పెద్దదెబ్బ.
ఇప్పుడు ఇరవరెండవ సర్గలో మనము వినేది రావణుని బెదిరింపులు,
దానికి సీత సమాధానము.
ఆ సీత సమాధానముగా సీతకి అవధి ఇస్తూ రాక్షస్త్రీలకు రావణుడు ఇచ్చిన ఆజ్ఞ.
అదే మనము చూసే కథ.
ఇక వాల్మీకి చెప్పిన మాటలు.
"సీతాయాః వచనం శ్రుత్వా..".
ఆ అహంకారమునకు దెబ్బకొట్టిన సీత వచనములను విని,
రావణుడు ప్రియదర్శనస్వరూపము గల సీతకు అప్రియవచనములతో
ఈ విధముగా ప్రత్యుత్తరము ఇచ్చెను.
"యథా యథా ప్రియంవక్తా
పరిభూతః తథా తథా "
అంటే " ప్రేమికుడు ప్రియమైన మాటలు చెప్పినకొలదీ,
స్త్రీ చేత ఆ ప్రియుడు ఇంకా ఇంకా పరాభింపబడతాడు " అని.
అలా చెపుతూ ,
తన కోరికలే తన కోపాన్ని అదుపులో ఉంచడమువలన
సీత రక్షింప బడుతూ వున్నది అని కూడా అంటాడు.
అలా సీత చెప్పిన మాటలకి వధించ తగినది అయినా ,
"ఏతస్మాత్ కారణాన్న త్వాం ఘాతయామి "
- అంటే ఈ కారణాలవలన అంటే కామజనిత కోరికల వలన నిన్నువధించుటలేదు అని.
మనము చాలాసార్లు కామము క్రోధము ఒకే తోవలో పోవడము చూస్తాము.
ఇక్కడ ఆ కామమే క్రోధాన్ని అదుపులో ఉంచి సీతవధింపబడటల్లేదు అంటాడు రావణుడు.
" ఓ సీతా !నీ పై రేగిన కామము నా క్రోధమును
మంచి సారథి అడ్దదిడ్డముగా పయనిస్తున్న గుఱ్ఱములను అదుపులో పెట్టినట్లు అదుపులోపెట్టినది. మనుష్యులలో కామము ఏ జనులపై ఉండునో వారు శిక్షింపతగిననూ
వారిపై స్నేహము జాలి కలగచేయును.
అందువలన ఓ వరాననా ! వధింపతగిన దానవైననూ
అవమానింపతగిన దానవైననూ
మిధ్యాప్రేమలో మునిగియున్న నిన్నుచంపుట లేదు".
సీతతో ఇలా చెప్పి ఆ రాక్షసాధిపుడు క్రోధముతో కూడిన మాటలతో మళ్ళీ ఇలా చెపుతాడు.
" సీతా ! నేను నీకు ఈ అవధి ఇస్తున్నాను.
ఓ వరవర్ణినీ ! రెండు నెలలు దాకా నా చేత రక్షింపబడగలవు.
ఆ తరువాత నా శయనము అరోహింపుము.
రెండు నెలలు దాటిన తరువాత నన్ను భర్తగా కోరకపోతే,
నిన్ను ప్రాతఃకాలపు ఆహారముగా వంటశాలలో ఉపయోగింతురు."
రాక్షసేంద్రుని చేత ఆవిధముగా భయపెట్ట బడుతున్న ఆ జానకిని చూచి
దేవ గంధర్వ కన్యలు దుఃఖము కలిగిన కళ్ళతో విలపించసాగిరి.
ఆ సీతాదేవిని కొందరు పెదవులతో మరికొందరు కనుసైగలతో ఊరడించిరి.
వారిచేత ఆవిధముగా ఊరడింపబడిన సీత
తనపాతివ్రత్యబలముతో, గర్వముగల హితకరమైన మాటలతో,
ఆ రాక్షసాధిపుడగు రావణుని తో ఇట్లు పలికెను.
"ఓ రావణా ! నీ శ్రేయస్సుకోరుతూ
నిన్ను ఈ గర్హించతగిన కార్యము నుంచి నివారింపగల వారు
ఎవరూ ఇక్కడ లేరుఅని తెలిస్తున్నది.
శచీపతి యొక్క శచిదేవి లాగా ధర్మాత్ముడైన రామునకు భార్యనైన నన్ను
ముల్లోకములో నీవు తప్ప ఇంకెవరూ మనస్సులో కూడా వాంఛించరు.
ఓ రాక్షసాధమ ! అమిత తేజసుడైన రాముని భార్యకి ఇట్టి పాపపు మాటలు చెప్పిన నీవు
ఎటువంటి గతి పొందెదవో"
" మదించిన ఏనుగును యుద్ధములో ఎదిరించిన కుందేలు లాగా,
ఏనుగువంటి రాముని ముందు నీచమైన నీవు కుందేలు వంటి వాడవు.
ఇక్ష్వాకువంశ రాజైన రాముని నిందించుటకు నీకు సిగ్గులేదా?
ఆయన కళ్ళముందర నిలబడగల శక్తిలేని వాడవు.
ఓ దుర్మార్గుడా నన్ను ఎఱ్ఱని కళ్ళతో చూస్తూవున్న
నీ క్రూరనయనములు ఎందుకు భూమిపై పడుటలేదు?
ఆ ధర్మాత్ముడైన రాముని యొక్క పత్నిని,
దశరథుని కోడలిని అగు నన్ను దుర్భాషలాడుతున్న
నీ నాలుక ఎందుకు తెగి క్రిందపడకున్నది?"
అంత కోపముతో మాట్లాడిన సీత ఒక మహాపతివ్రత.
ఆమె తాపస్విని కూడా.
హనుమంతుని తోక అగ్నితో అంటించబడినది అని విని,
"శీతోభవతు హనుమతః" అంటూ అగ్నిని అదుపులో పెట్టిన సీత.
మరి అలాంటి సీత,
"దగ్ధోభవ దశాననా" అంటూ
రావణుని ఎందుకు దహించలేదు అని అనిపించవచ్చు.
దానికి సీత చెప్పిన మాట ఇది.
"అసన్దేశాత్తు రామస్య
తపసశ్చానుపాలనాత్ "
రెండు కారణాలు చెపుతుంది .
ఒకటి తాపస ధర్మము అనుసరించి.
అంటే తపస్సు చేసి సంపాదించిన శక్తి ఆ అధ్యాత్మ మార్గములో ముందు పోవడానికే.
అది ఇంకో దిశలో ఉపయోగించడానికి కాదు.
అలా పుపయోగిస్తే ఆ తపశ్శక్తి క్షీణించుతుంది.
చేసిన తపస్సు వృథా అవుతుంది.
అదే 'తపసశ్చ అనుపాలనాత్' !
రెండవకారణము -
రాముని అనుమతి లేకపోవడము.
రాముడు చేయవలసిన పని ఇంకొకరు చేస్తే
అది రాముని కీర్తికి భంగము అని సీత ద్వారానే వింటాము.
సముద్ర లంఘనము చేయగలిగిన హనుమంతుడు,
రామలక్ష్మణులను తన భుజములపై వుంచుకొని సుగ్రీవుని వద్దకు తీసుకుపోయిన హనుమంతుడు,
ఒక్క క్షణములో సీతని రాముని వద్దకు చేర్చుతాననిన చెప్పిన హనుమంతునికి
సీత చెప్పిన మాట కూడా అదే.
రాముని కీర్తికి అది భంగము అని.
రాముని అనుమతిలేకుండా రాముడు చేయవలసిన పని తనుచేస్తే
అది రాముని కీర్తికి భంగము అని.
సీత ఇంకోమాట చెపుతుంది.
రావణుని వధకోసమే తన అపహరణము జరిగినది అని ,
లేకపోతే రాముని అంతటి వానిదగ్గరనుంచి అపహరించబడడము అనేది కాని పని ,
ఇదంతా విధి అని.
అందుకే రామలక్ష్మణులు లేనప్పుడు దొంగలాగ అపహరించాడు అని రావణుని నిందిస్తుంది.
ఇలా అనిన సీతను బుసలుకొడుతున్న భుజంగములా చూస్తూ ,
సీతను క్షణములో నాశనము చేయగలనని బెదిరిస్తూ,
ఆ రాక్షస స్త్రీలకి రావణుడు ఆజ్ఞ ఇస్తాడు.
"ప్రతిలోమాను లోమైశ్చ
సామదానభేదనైః
అవర్జయతవైదేహీమ్"
అంటే "ఓ రాక్షస్త్రీలారా ! మీరందరూ కలిసి
ఈ జానకీ సీత ఎలాగా నా వశము అగునో ఆ విధముగా చేయుడు.
మంచిమాటలతో గాని సామదాన భేదములతో గాని దండముతో గాని
ఈ వైదేహిని వశము చేసికొనుడు"అని.
ఆ రావణుడు ఇలా కామక్రోధములతో మరల మరల ఆదేశము ఇచ్చి జానకిని భయపెట్టెను.
అప్పుడు ధ్యానమాలినీ అని పేరుగల రాక్షసి త్వరగా ముందుకువచ్చి
ఆ దశగ్రీవుని కౌగలించుకొని ఈ మాటలు చెప్పెను.
" ఓ మహారాజా నాతో క్రీడించుము.
ఓ రాక్షసేశ్వరా! శోభనుకోల్పోయి దీనస్థితిలోవున్న మానవకాంత అయిన ఈ సీతతో నీకేమి పని.
ఓ మహారాజా అమరశ్రేష్ఠమైన నీ బాహు బలములతో సంపాదింప బడిన ఈ దివ్యమైన భోగములు
ఈమెకు రాసిపెట్టి లేవు.
ఓ మహారాజా ! ప్రేమించని దానిని ప్రేమించినచో శరీరతాపమే మిగులును.
కోరినదానిని ప్రేమించినచో శోభనముగా శరీరమునకు ప్రీతి లభించును."
ఆ రాక్షసిచేత ఈ విధముగా చెప్పబడిన రావణుడు,
అప్పుడు నవ్వుకొనుచూ అచటినుండి వెళ్ళిపోయెను.
అప్పుడు ఆ దశగ్రీవుడు భూమిని కంపిస్తున్నట్లు నడుస్తూ
మధ్యాహ్నపు సూర్యుని వలె ప్రకాశిస్తున్న తన భవనమును ప్రవేశించెను.
దేవ గంధర్వ కన్యలు నాగ కన్యలు కూడా
ఆ దశగ్రీవునితో కూడి ఆ ఉత్తమమైన గృహములో ప్రవేశించిరి.
అంటే అప్పుడు మధ్యాహ్నమైనది అన్నమాట.
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది రెండవ సర్గ సమాప్తము.
||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||