||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఇరువదిమూడవ సర్గ ||

||సామదాన భేద దండోపాయములు||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ త్రయోవింశస్సర్గః

తత్త్వదీపిక
సామదాన భేద దండోపాయములు

సీతారావణ సంవాదము తరువాత , సీతా దేవికి రెండు నెలల గడువు ఇచ్చి, ఆ రావణుడు రాక్షసస్త్రీలందరిని సామదాన భేద దండో పాయములను ఉపయోగించి సీతాదేవిని లొంగ పరుచుకొమ్మని అజ్ఞాపించి వెళ్ళిపోతాడు.

రావణుడు అలాగ అంతఃపురము వెళ్ళిన తరువాత, అ భయంకర రూపములు గల రాక్షస స్త్రీలు సీతా దేవి చుట్టూ చేరి, సీతాదేవి తో పరుషమైన వచనములతో మాట్లాడతారు.

"దశగ్రీవస్య భార్యాత్వం సీతే న బహు మన్యసే".

"గొప్పవాడగు పౌలస్త్యుని భార్య అయ్యే భాగ్యము, ఎందుకు గొప్పగా భావించుటలేదు? అని.

."అరుగురు ప్రజాపతులలో నాలుగవ ప్రజాపతి పులస్త్యుడనబడువాడు.
అతడు బ్రహ్మయొక్క మానసపుత్రుడు.
తేజస్వీ అగు పులస్త్య ప్రజాపతి మానసపుత్రుడు మహర్షి విశ్రవసుడు.
విశ్రవసుడు కూడా ప్రజాపతితో సమానుడు.
అట్టి విశ్రవసుని పుత్రుడు రావణుడు".

ఇవి రావణుని పుట్టు పూర్వోత్తరాలు.

రావణుడు సామదాన భేద దండో పాయములను ఉపయోగించి సీతను లోంగదీసుకోమని ఆజ్ఞాపించాడు. అందుకని ఏకజటా, హరిజటా , ప్రఘసా , వికట అనే పేరులు గల రాక్షస స్త్రీలు ఇప్పుడు రావణుని పుట్టు పూర్వోత్తరాలతో అదే ప్రయోగములో వున్నారు.

వాళ్ళు ఒకరి తరువాత ఇంకొకరు సీత కి నచ్చచెప్పడానికి పూనుకుంటారు.

"యేన దేవా త్రయత్రింశత్ దేవరాజశ్చ విజితాః' |
"ఏవరిచేత ముప్పదిమూడుకోట్ల దేవగణములు వారి అధిపతి జయింపబడెనో అట్టి రాక్షసేంద్రుని భార్య అగుటకు నీవు తగిన దానవు."

ఇది వాళ్ళ లెక్కలో పొగడత.

. "వీర్యమును రేకిత్తంచగల శూరుడు, సంగ్రామములో వెనుతిరగని మహా బలుడు మహాశక్తిమంతుడు అయిన వాని భార్య అవడానికి నీవు ఎందుకు కోరుకోనుట లేదు?

మహాబలవంతుడైన రావణుడు, మహభాగులు వరిష్ఠురాలు అయిన తన ప్రియమైన భార్యను సైతము వదిలి, నిన్ను పొందగోరుచున్నాడు. నానావిధరత్నములతో ప్రకాశిస్తూ వేలాదిమంది ఉన్న తరుణలతో ఉన్న అంతఃపురమును పరిత్యజించి రావణుడు నిన్ను పొందడానికి కోరుచున్నాడు."

ఇది కూడా ఆ రాక్షస స్త్రీల లెక్కలో పొగడత.

" ఎవరైతే యుద్ధములో దేవ గంధర్వ నాగ దానవులని అలవోకగా ఓడించెనో ఆ రాజు నీ పక్కన ఉండడానికి కోరుకొనుచున్నాడు. ఓ అధమురాలా సకలైశ్వర్యాలతో తులతూగు మహాత్ముడగు రాక్షసాధిపతి రావణుని భార్య అగుటకు ఎందుకు ఇష్టపడవు?"

ఆ రావణుడు ఎంతో బలవంతుడు శౌర్యముకలవాడు. అతని భార్య అగుట ఒక ఘనమైన విషయము అని అంటూ , సీతతో "భార్యా భవితుం అర్హసి", అంటే అట్టి రాక్షసునకు భార్య అవడానికి నీకు అర్హత వుంది అంటారు.

అది వాళ్ళ అంధకార మయమైన జ్ఞానము.

ఆ గొప్పతనము చెప్పి , ఇంక రావణుడు అంటే ఎవరికి ఎంత భయమో గూడా వర్ణిస్తారు.

"యస్య సూర్యో న తపతి
భీతో యస్య చ మారుతః"

"ఎవరికి భయపడి సూర్యుడు తన తీక్షణమైన కిరణములను ప్రసరింపడో , ఎవరికి భయపడి మారుతము వీచడో " . సూర్యుడు వాయువుకు భయము.

"ఎవరికి భయపడి చెట్లు పుష్పవృష్టిని కురిపిస్తాయో"
" ఎవరి కోరికపై పర్వతములు మేఘములు జలములను ఇస్తున్నాయో "
అంత ప్రతిభ కల రాక్షసరాజు, రావణుడు.
ప్రకృతిని లొంగ దీసుకున్నవాడన్నమాట.
ప్రకృతిని లోంగ దీసుకొని సద్వృత్తిలో వుండవచ్చు, దుర్వృత్తిలో ఉండవచ్చు.
కాని రావణుడు దుర్మార్గములో ఉన్నవాడు.

ఇలా చెప్పి , ఆ రాక్షసస్త్రీలు చివరికి దండోపాయము కూడా ప్రయోగిస్తారు.
"మంచిగా నీకు చెప్పిన మాటలను వినుము లేకపోయినచో భవిష్యత్తులో నీవు ఉండవు"అని

భగవత్సాక్షాత్కారానికి తపన పడి ముందుకుపోయే మార్గములో అనేక అడ్డంకులు వస్తాయి. అనేక సింహాసములు చూపెట్టబడతాయి. రావణుని పొగడతలు , అటువంటి వాడికి భార్య అవడములో వచ్చే భాగ్యము, అలాంటి సింహాసనాలు. ముముక్షువులు వీటన్నిటికీ అతీతులు.

వాటికి లొంగరు.
వాటికి లొంగకూడదు కూడా.

మనము మొదటి సర్గలో సూర్యుడు వాయువుల గురించి ఇదేమాట వింటాము
"తతాప న హి తం సూర్యం" అని
"శిషేవే చ తథావాయుః" అని.
అక్కడ సూర్యుడు, వాయువు హనుమంతునికి సహయముగా గట్టిగా ప్రసరించరు. వాయువు మెల్లిగా వీస్తుంది.

అలాగే రెండవసర్గలో
" చంద్రోపి సాచివ్య మివాస్య కుర్వన్" అని
హనుమంతుని అన్వేషణలో చంద్రుడు సాచివ్యము చేస్తున్నాడు అని వింటాము.

అంటే మంచి విషయములలో సహాయము చేయగలవాళ్ళు అడగకుండా వాళ్ళంతట వాళ్ళే ముందుకు వస్తారు.

ఇది నిష్కామ కర్మ ఫలితము.

అలా ముందుకు వచ్చే వాళ్ళు కామక్రోధాపేక్ష ఉన్నవాళ్ళకి దూరముగా ఉంటారు.
ఈ సర్గలో అదే మనము వినే ముఖ్యమైన మాట.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువదిమూడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||