||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఇరువది ఏడవ సర్గ ||

||త్రిజటాస్వప్నము||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ సప్తవింశస్సర్గః

తత్త్వదీపిక
త్రిజటాస్వప్నము

ఈ సర్గలో ముఖ్యమైన ఘట్టము త్రిజట స్వప్నము .

రాక్షస స్త్రీలు, సీత శాపము ఇస్తున్నట్లు అనిన మాటలు విని మరింత కోపముతో సీతను తినేస్తామని భయపెట్టుతూ వుంటే , అది విని ఒక ముసలి రాక్షసి , త్రిజట ,ఇలా అంటుంది.

"ఆత్మానం ఖాదతానార్యా న సీతా భక్షయిష్యథ"
"మిమ్మలిని మీరే తినండి సీతను కాదు", అని.

ఎందుకు? అంటే, తనకి ఒక కల వచ్చిందట.
ఆ కలలో ఏమి తెలిసింది ?

"రాక్షసానాం అభావాయ
భర్తుః అస్యాః భవాయ చ"||

రాక్షసులకు భయము, సీత భర్తకి విజయము సూచిస్తూ వచ్చిన కల అది.

వెంటనే ఆ రాక్షస్త్రీలందరు త్రిజట చుట్టూ చేరి ఆ కల అంతా చెప్పమంటారు.
త్రిజట ఆ కల అంతా చెపుతుంది.

ఆ కలలో "రాఘవశ్చ మయాద్రష్టం" అంటే రాఘవుడిని చూచిందిట.
ఏలాంటి రాముడిని?
"ఆరుహ్య పుష్పకం దివ్యం" - దివ్యమైన పుష్పకవిమానము నెక్కి
"ఉత్తరాం దిశంమాలోక్య జగామపురుషోత్తమః "
ఉత్తరదిశను అనుసరించి వెళ్ళిపోయాడుట, ఆ పురుషోత్తముడు.
అది విజయసూచకము.

అలాగే రావణుడు తనపరివారముతో
"గర్ధభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థితః"
గాడిదను ఎక్కి దక్షిణ దిశగా పయనించాడుట.
అది పరాజయ పలాయన సూచకము.

అందుకని సీతను బాధించకుండా , సీతమ్మని వేడుకోండి అని చెపుతుంది.

ప్రణిపాతా ప్రసన్నాహి
మైథిలీ జనకాత్మజా|
అలమేషాపరిత్రాతుమ్
రాక్షస్యో మహతో భయాత్||

"నమస్కరించిన మాత్రముననే ప్రసన్నమగు సీతమ్మని వేడుకోండి, రాక్షసులకు కలిగే మహత్తరమైన భయము నుంచి ఈమె ఒక్కరితే రక్షింపకలదు" అని.

ఈ శ్లోకములో వాల్మీకి మాతృభావము లక్ష్మీ స్వభావము, సీతాస్వభావము చిత్రీకరించెను.
ఆమెకే ప్రత్యక్షముగా అపరాధము చేసినవారిని కూడా క్షమింప గలిగిన ఔదార్యవతి.
తాను క్షమించడమే కాదు. ఇతరులను కూడా హింసాకార్యక్రమములనుంచి నివారించకల శక్తి కలది.

యుద్ధకాండలో , యుద్ధము అయిన తరువాత, రాక్షస స్త్రీల హింసాకాండను చూచిన హనుమ ,
ఆ రాక్ష స్త్రీల వధకు పూనుకుంటాడు. అప్పుడు సీత చెపుతుంది.
"న కశ్చిన్నాపరాధ్యతి".
"తప్పు చెయని వాడు ఎవరు"?అని చెప్పి , హనుమని నివారించెను.
అది సీతమ్మ మాతృభావము.

త్రిజట తనుచూస్తున్న సీతకు కలగబోతున్న శుభసూచకములను కూడా చెపుతుంది.

"నేను వైదేహి కోరికలు నెరవేరు సూచనలు చూచుచున్నాను.
అలాగే రాక్షస వినాశనము రాఘవుని జయము కూడా చూచుచున్నాను. .
ఈమెకు మహత్తరమైన ప్రియము వినిపించుటకు శకునములు కనపడుచున్నవి.
అమె పద్మపత్రములాంటి ఎడమ కన్ను అదురుచున్నది".

"శుభ సూచకములను సూచిస్తూ దక్షత కల ఈ వైదేహి ఎడమ భజము కంపిస్తున్నది.
ఏనుగు తొండము లాంటి ఏడమ తొడ అదురుతూ రాముని చూచుట సూచించుచున్నది".

అలా రాముని విజయము రావణు ని పరాజయము సూచిస్తూ కనపడే శుభసూచకములను గురించి చెపుతూ ఇంకా ఇలా అంటుంది.

పక్షీ చ శాఖా నిలయః ప్రహృష్టః
పునః పనశ్చోత్తమసాంత్వ వాదీ |
సుస్వాగతాం వాచ ముదీరయానః
పునః పునశ్చోదయతీవ హృష్ఠః||

"ఆ వృక్షశాఖలలో వున్న పక్షి ఇది శోకమునకు తగిన సమయము కాదు అని సూచిస్తూ మళ్ళీ మళ్ళీ ఉత్తమము అయిన సాంత్వవచనములను పలుకుచున్నట్లు ఉంది. రామునకు సుస్వాగతము కూడా పలుకుచున్నట్లు వుంది"

ఈ శ్లోకము "పక్షీ" అన్నమాటలో , "శాఖానిలయః" అనడములో , "ప్రహృష్టః" అనడములో అనేకమైన ధ్వనులు వినిపిస్తాయి.

ఆ చెట్టుమీద శాఖలలో ఉన్న పక్షి, మనకి వినపడే ధ్వని చెట్టు మీదా దాగి ఉన్న హనుమ.
ఆ హనుమ సుందరకాండలో మొదటి శ్లోకము లో చెప్పబడిన ఆచార్యుడు.
రామునికి దూరముగా వున్న సీతకు రాముని సందేశము అందింపవచ్చి, ఇంతవరకు పరిక్షించుచున్న హనుమ మాట్లాడే శుభసమయము ఆసన్నమైనది అన్నమాట.
బ్రహ్మనిష్టుడై ఆచరణముచే పరిపూర్ణూడైన ఆచార్యుడు, జ్ఞాని అగు మహాపరుషుడు "పక్షి"

పక్షి అంటే
పక్షములు కలది పక్షి.
ఇది ఆకాశమున విహరించును
అలా ఆకాశమున పోవుటకు సాధనములు పక్షము లు- రెక్కలు.
ఆకాశమే పరబ్రహ్మము.
ఆకాశమున విహరించుట పరబ్రహ్మమును చేరుట
అ = అంతట పూర్తిగా ; కాశ = ప్రకాశించునది
ఆకాశము అంటే స్వయం ప్రకాశమైనది అదే పరమాత్మ
రెండు రెక్కలతో పక్షి ఆకాశములో సాగునట్లే,
జ్ఞాన కర్మలచే పురుషుడు పరమగతి నొందును అని.

యజ్ఞము దానము తపస్సు అనునవి ఆచరించి,
అంతఃకరణ నిర్మలత్వము పొందినప్పుడే జ్ఞానము అవిర్భవించును.
ఆట్టి జ్ఞానముతో ఆరాధ్యుడగు పరమపురుషుని తెలిసికొని,
పరమపురుషుని సమారాధనరూపముగా కర్మలను ఆచరించూటయే సిద్ధి.

అట్తి జ్ఞాన కర్మలు కలవాడే ఆచార్యుడు.
ఆచార్య శబ్దమునకు నిర్వచనము కూడా అదే.

"ఆచనోతి హి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి
స్వయమాచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే" ||

శాస్త్రార్థములను తెలిసికొని, తను ఆచరించి, ఇతరులచే ఆచరింపచేయువాడే ఆచార్యుడు.
ఆ చెట్టుమీద వున్న "పక్షి" -హనుమ అటువంటి అచార్యుడు.

ఆ పక్షిని - "శాఖానిలయః" అంటారు. ఆ శాఖలలో ఉన్న పక్షి అన్నమాట.

వేద శాఖలే ఇక్కడి శాఖలు.
ఆ వేద శాఖలలో మునిగి వున్నవాడే గురువు - ఆచార్యుడు - అదే హనుమ.

శ్లోకములో శాఖానిలయః ప్రహృష్టః అని చెపుతారు.

ప్రహృష్టః అంటే సంతుష్టమైన హృదయము కలవాడు అని.
అది ఎవరు?
విషయభోగముల కోరికలతో,
వాటిని పొంది లాభాలాభములతో సంతుష్టుడుగా వుండడము కాదు.
సదా భగవద్గుణములనే అనుభవించుచూ ,
ఆ అనుభవముచే కలిగిన ప్రీతితో నిండిన హృదయముకలవాడు సంతుష్టుడు.్
ఎల్లప్పుడూ సంతుష్టుడై వుండాలి.
అలాంటి అనుభవముతో సంతుష్టుడై వున్నవాడే ఆచార్యుడు.

ఆ పక్షి ఏమి చెపుతున్నట్లు వుంది?

"పునః పునశ్చ ఉత్తమ సాంత్వవాది"
మరల మరల ఉత్తమమైన సాంత్వ వచనములను చెపుతూ వున్నట్లు వుంది ఆ పక్షి.
ఆ ఆచార్యుడే ఇలా సాంత్వ వచనములు చెప్పకలిగినవాడు.

ఆ ఆచార్యుడే సాంత్వ వచనములు చెప్ప తగినవాడు.
ఆచార్యుడు భగంతుని చేరుట కష్టముకాదని ,
ఎక్కడ పొందవలెననిన అక్కడనే వుండునని,
ఏమియు సమిర్పింపనక్కరలేదని ,
సర్వ సులభుడని,
ఆచార్యుడు శిష్యునకు సాంత్వవచనముల తో చెప్ప గలిగినవాడు.

అలాంటి ఆచార్యుడు ఏమి చెపుతున్నాడట?

"సుస్వాగతం వాచం ఉదీరయానః"

సు=చక్కగా సంప్రదాయబద్ధముగా
స్వ= తనకు
ఆగతం= వచ్చిన
వాచం = వాక్కును అంటే మంత్రమును
ఉదీరయానః = చెప్పుచున్నాడు.

భగవంతుని నుండి పూర్వచార్య పరంపరలో వచ్చిన మంత్రములను శిష్యులకు ఉపదేశించుచుండును. అది ఆచార్యుని మార్గము. ఎలాగ చెపుతున్నాడు.

"పునః పునశ్చోదయతీవ "
మరల మరల చెపుతున్నాడుట.
శిష్యుడు అపమార్గమునపడకుండా ప్రేరణ చేసేవాడే గురువు.

అట్టి గురువగు "పక్షి" చెట్టుశాఖలలో మరల మరల దుఃఖములో ఉన్న సీతకు శాంత్వ వచనములను చెప్పినట్లు కూస్తున్నాడుట.

అంటే ఈ శ్లోకములో
"జ్ఞానకర్మలు చేయువాడు, విద్యా వినయ సంపన్నుడు, భగవదనుభావ జనిత ఆనందము అనుభవించువాడు,భగవద్విష్యములగు సాంత్వ వచనములు పలుకువాడు, ఆచారపరంపరాప్రాప్తమగు మంత్రములను ఉపదేశించువాడు, సదా శిష్యుని పరిశీలించువాడు , శిష్యానుభవముచే ఆనందించువాడు , గురువుగా ఉండతగినవాడు "

అలాంటి పక్షి ( వానరుడు) ,
అంటే ఆచార్యస్వరూపుడగు హనుమంతుడు చెట్టుపై ఉన్నాడు.
సాంత్వ వచనములను చెప్పుచున్నాడు.
అది శుభ సూచకము.
అదే ఈ స్వర్గ ఆఖరిమాటగా చెప్పబడినది.
ముందున్న ఘటనలను సూచిస్తూ.
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయనములో సుందరకాండలో ఇరువది ఏడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||


|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||