||సుందరకాండ. ||
||తత్త్వదీపిక- ఇరువది ఎనిమిదవ సర్గ ||
||యమస్య మూలం !||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ అష్టావింశస్సర్గః
తత్త్వదీపిక
యమస్య మూలం !
యమస్య మూలం అంటే యముడు దగ్గరకు అని.
అది సీత దుఃఖములో అన్నమాట.
ఇలా జీవించడము కన్నా యముడి దగ్గరకు పోవడము మేలు అనే ధ్వని వస్తుంది ఇక్కడ.
రావణునితో "అసంశయం దాశరథేర్నమోక్ష్యసే",
అంటే "దాశరథినుంచి తప్పించుకోలేవు" అని అన్న సీత,
"దీనోవా రాజ్యహీనోవా " అంటే
"దీనుడైనా రాజ్యహీనుడైన ఆయనే నా భర్త నాగురువు " అని అన్నసీత,
రాక్షసస్త్రీలచేత భయపెట్టబడి "అకాలే దుర్లభే మృత్యుః" అని,
"అల్పపుణ్యా" "కృపణా" అని తనను తాను నిందించుకున్న సీత,
తన మనస్సు అదుపులో పెట్టలేకపోతుంది.
"న హి జీవితేః అర్థో" అని అనుకున్న సీత,
త్రిజట స్వప్న వృత్తాంతము విని సంతోషపడినా,
త్రిజట చూస్తున్న శుభసూచకములు సూచించగా వినినా,
తన మనస్సును అదుపులో పెట్టలేకపోతుంది.
అంటే సీత మనస్సు కుదుట పడలేదు.
సీత మనస్సులో చివరికి రావణుడు చెప్పినమాటలే మెదలుతుంటాయి.
అంతేకాదు దగ్గరలో తనవారెవరూ లేకపోవడముతో ,
అరణ్యమధ్యంలో వదిలివేయబడిన బాలకన్యలాగ విలపించెను.
అలా విలపిస్తూ వున్న సీతకి మళ్ళీ అదే ఆలోచనలు వస్తాయి.
"అకాలమృత్యు ర్భవతీతి సంతః" ,
అంటే అకాల మృత్యువు కలగదు అని సంతులు చెప్పినమాట నిజము అని,
"జీవామి కించిత్ క్షణమపి అపుణ్యా" ,
ఈ కష్టాలలో ఒక క్షణము కూడా జీవిస్తున్నాను అంటే ,
ఏమి పుణ్యములేనిదానిని అని,
ఏలాగా చంపబడుతున్నదానిని కాబట్టి ( రావణునిచేత),
ఇప్పుడు తను చనిపోయినా దోషము లేదు అని,
ఇంకా మిగిలిన రెండు మాసములు గడవడము కష్టము అని నిశ్చయించుకుంటుంది సీత.
మళ్ళీ సీత మనస్సు రామలక్ష్మణుల మీద మళ్ళుతుంది.
" మృగరూపములో వచ్చిన ఆ రాక్షసునిచే మోసగించబడి
ఆ మానవేంద్రులిద్దరూ పిడుగుపడి నశించిన రెండు సింహములు లాగా
నా కారణమువలన మరణించిరేమో.
తప్పక ఆ కాలపురుషుడే మృగరూపముధరించి
అల్పభాగ్యముకల నన్ను మభ్యపెట్టి
లక్ష్మణాగ్రజుడగు ఆర్యపుత్రుని,
రామానుజుని కూడా కోల్పోవునట్లు చేసెను".
మళ్ళీ " అనన్యదైవత్వం" అంటే
"ఇంకో దేముడు ఎవరో నన్ను రక్షిస్తాడు అనే ఆలోచనలేకుండా",
"నీమీదనే ధ్యానము ఉంచి,
భూమిమీదనే పడుకొని,
పాటించిన పాతివ్రత్య ధర్మములు విఫలమౌతున్నాయి".
" కలయుట అనే ఆశలేనప్పుడు,
ఇలా కృశించి కళాకాంతులు నశిస్తూ చేసిన పాతివ్రత్యధర్మము అంతా నిరర్థకమే".
ఇవి దుఃఖములో కలిగిన ఆలోచనలు.
ఆ దుఃఖములో తన జడపట్టుకొని, ఆ జడతో,
"శీఘ్రం గమిష్యామి యమస్య మూలం", అంటే
"శీఘ్రముగా యముడి దగ్గరకు పోయెదను" అని అనుకుంటుంది సీత.
అప్పుడు ఆమెకు శోకమును తొలగించు,
ధైర్యమును కలిగించు,
లోకములో ప్రసిద్ధమైనవి పూర్వము సత్ఫలితములను ఇచ్చినవి
అయిన శుభ సూచకములు కనపడెను.
ఇక్కడ "పురాపి సిద్ధాని" అంటే పూర్వము సిద్ధించినప్పుడు
కలిగిన శుభసూచనలు కనపడ్డాయి అని వస్తుంది ధ్వని.
పూర్వము అంటే ఎప్పుడు?
సీత కల్యాణము తరువాత జరిగిన శుభకార్యాలులేవు.
జరగవలసిన , జరగకపోయిన పట్టాభిషేకము శుభకార్యాలలో రాదు.
అంటే వాల్మీ కి చెప్పిన "పురాపి సిద్ధాని" అన్న శుభ సూచనలు ,
సీతారామ కల్యాణము ముందు రాముడు మిథిల వస్తున్న సందర్భములో,
సీతా రామకల్యాణమును సూచిస్తూ సీతకు కనపడిన
శుభసూచకములు అయివుండాలి " అని.
అది రామాయణ శిరోమణి లో వచ్చిన వ్యాఖ్య.
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది ఎనిమిదవ సర్గ సమాప్తము.
|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||