||సుందరకాండ ||
||తత్త్వదీపిక ||
||మొదటి సర్గ -ధృతిర్ దృష్ఠిః మతిర్ దాక్ష్యం...
||
||ఓం తత్ సత్||
:
||ఓం తత్ సత్||
తత్త్వ దీపిక
ధృతిర్ దృష్ఠిః మతిర్ దాక్ష్యం .. - మొదటి సర్గలో !
"రామార్థం వానరార్థం చ" రామునికొరకు వానరులకొరకు నిష్కామ కర్మతో ఆకాశంలో పయనిస్తున్న హనుమంతుని సాగరుడు చూస్తాడు.
సాగరుడు ఇక్ష్వాకుకుల సగర మహారాజు అగు సగరునిచే పోషించబడి వృద్ధిచెందిన వాడు.
అందుకే సాగరుడు అనబడ్డాడు.
సాగరునికి ఇక్ష్వాకుకులము వారికి సహాయము చేయాలనిపిస్తుంది.
దానికి కారణము చెపుతాడు.
"కర్తవ్యం అకృతం కార్యం
సతాం మన్యుముదీరయేత్"|
"చేయతగిన చేయవలసిన కార్యము చేయకపోతే
అది పెద్దలకి నిందనీయముగా కనపడును లేక ఆగ్రహము కలుగును".
ఉపకారికి ప్రత్యుపకారము చేయాలి అన్నది లోక నీతి.
అలాగ ఇక్ష్వాకుకులము వారికి సాగరుడు ఉపకారము చేయాలి.
అలా అని సాగరునికి అనిపిస్తుంది. అలా చేయకపోతే తప్పు అని కూడా అనిపిస్తుంది సాగరుడికి
అంటే ఇప్పుడు ఆకాశములో రామునికొరకు,
అంటే ఇక్ష్వాకుకుల తిలకుని కార్యార్థమై వెళ్ళుతున్న వానికి,
అంటే హనుమంతునకు సహాయము చేయాలి.
అలా చేస్తే ఇక్ష్వాకుకులము వారికి సహాయము చేసినట్లే.
అప్పుడు అలా సహాయము చేయడానికి సాగరుడు తనలో దాగి వున్న మైనాకునకు చెపుతాడు. మైనాకుడు పైకి లేచి నిలబడితే,
దానిపై హనుమంతుడు కోంచెము విశ్రాంతి తీసుకొని మరీ వెళ్ళవచ్చును అనే తన ఆలోచన.
అది మైనాకునికి చెపుతాడు.
అలాచెప్పగానే పైకి కిందకి పెరగగల మైనాకుడు,
వెంటనే సూర్యకాంతిలో మెరుస్తున్న బంగారు శిఖరాలతో పైకి పెరిగి నిలబడతాడు సాగరములో.
అలా హఠాత్తుగా కనబడిన మైనాకుడు హనుమంతునికి ఒక అడ్డంకి లాగా కనిపిస్తాడు.
వెంటనే హనుమంతుడు తన రొమ్ముతో ఢీకొని మైనాకుని శిఖరాలని నుగ్గు నుగ్గు చేస్తాడు.
అప్పుడు మైనాకుడు తన మానుషరూపము ధరించి ,
ఇక్ష్వాకుకులానికి సహాయము చేయాలి అనే సాగరుని కోరిక,
అదే కాక తనను హనుమంతుని తండ్రి అగు వాయుదేవుడు రక్షించిన ఉపకారము ,
దానికి ప్రత్యుపకారము చేయవలసిన తన కర్తవ్యము చెప్పి ,
హనుమంతుని తన శృంగములలో విశ్రమించమని కోరుతాడు.
దానికి హనుమంతుడిచ్చిన సమాధానము వినతగినది.
|ప్రీతోస్మి|
కృతం ఆతిథ్యం|
మన్యురేషోపనీయతామ్|
త్వరతే కార్యకాలో మే|
అహః చ అపి అతివర్తతే|
ప్రతిజ్ఞాచ మయా దత్తా|
నస్థాతవ్యం ఇహ అంతరే||"
"సంతోషించితిని|
అతిథ్యము నిచ్చితివి|
పట్టుదలవదలుము|
పనితొందరలో ఉన్నవాడను|
ప్రతిజ్ఞ చేసిన వాడను|
మధ్యలో ఆగరాదు||
ఇది చిన్న మాటలలో , అధిక ప్రసంగము లేకుండా జరిగిన సంభాషణ.
అంటే "బయలు దేరేముందు ప్రతిజ్ఞ ఇచ్చితిని కనక ఆగకూడదు" అని.
అది రామబాణము తో తనను పోల్చుకున్న విషయముతో కలిపిన మాట.
రామబాణము ఆగదు.
తను కూడా ఆగకూడదు.
ఇందులో కవి మనకు లోకనీతి గురించి చెపుతున్నాడు.
మొదలు పెట్టిన కార్యము వదలి ఇంకో పనిలోకి దూరకూడదు.
ఇంకెవరి ఆహ్వానము వున్నా,హనుమంతుని లాగా
దానినుంచి గౌరవప్రదముగా తొలగవలెను.
ఇంకోమాట కూడా వాల్మీకి చెపుతాడు.
"అతిథిః పూజార్హః" అతిథులు పూజనీయులు.
అది ధర్మము.
అతిథిని మించినవాడు జ్ఞానుడు.
అతిథి పూజార్హుడైతే, లోకములో జ్ఞానులు వస్తే ఇంక చెప్పనేల.
అట్టివారు పూజనీయులు అన్నమాట లో సందేహమే లేదు అని .
దీనిలో సంసారమనే సముద్రమును దాటుటకు ఉపక్రమించిన సాధకుడు ఎటువంటి అధ్యవసానము లో ఉండాలో అది అంతా హనుమ వర్ణనలో కవి చెప్పాడు.
అధ్యాత్మికపథములో పయనించువాడు ఇంకేమి ఆధారము లేకుండా భగవంతుడే ఆధారముగా ఆత్మజ్ఞానమునకు భగవత్ప్రాప్తికి ఉద్యమించి సాగడమే ఒక దుష్కరమైన పని.
అదే హనుమంతుడు చేసిన మొదటి దుష్కర కర్మ.
ఆ పథములో ఉండాలి.
ఆ పథములో ఉన్నప్పుడు సత్కారములు పూజలు లభించ వచ్చు.
కాని తన దృష్టి మార్చుకోకుండా అదే పథములో పోవుట రెండవ దుష్కర కర్మ.
అదే మైనాకుని పూజలు అందుకొని ఆగకుండా ముందుకు పోవడములో హనుమంతుడు చేసిన రెండవ దుష్కర కర్మ.
సంసారికి కూడా అదే పథములో పోవగలుగుట రెండవ దుష్కర కర్మ
అలా ఒక పనిలో ఎక్కడా ఆగకుండా సాగుచున్నప్పుడు
విసుగు పొందకుండా ఇంకా ముందుకు పోగలుగుట ఐశ్వర్యము.
మనము ఎదో ఒక మంత్రము తీసుకొని ధ్యానము చేస్తూ ఉంటాము.
ఆ మంత్రము నూటఎనిమిది సార్లు చేసేసరికి ఇక చాలు అయిపొయింది అని ఆగి పోవచ్చు.
అలా కాక అలా ధ్యానములో నిమగ్నుడై ఇంకా ధ్యానము చేయవచ్చు.
అలా ధ్యానములో ఎక్కడా ఆగకుండా ముందుకు సాగగలడమే ఐశ్వర్యము.
అలా రామకార్యార్థమై ఆగకుండా పోగలుగుతున్నాడు కనక హనుమంతుడు ఐశ్వర్యవంతుడు.
అందుకనే దేవతలు (కవి) హనుమంతుని కార్యాచరణ విధానము కొనియాడుతూ
శ్రీమాన్ అంటే శీమంతుడా అని సంబోధిస్తారు హనుమంతుని.
అధ్యాత్మిక పథములో పోతున్నా
శాస్త్రానుసారమైన చేయతగినవి చేయవలసినకర్మలు అనేకము ఎదురు వస్తాయి.
శాస్త్రములో చెప్పబడిన చేయవలసిన చేయతగిన కర్మలు చెడ్డవి కావు.
అవి చేయతగినవే.
కాని ఆ కర్మలు ఆచరించడములో "నేనే నాకోసము" చేస్తున్నాను అనే భావనలేకుండా,
భగవదర్పణము చేసి భగవంతుడే చేయిస్తున్నాడనే భావనతో చేయవలెను.
అలా కోరిక లేకుండా చేసినపుడే ఆ కర్మలు బంధనములు కావు.
ఎప్పుడూ భగవత్పరముగా చేయు కర్మలు బంధములు కావు.
అలా ఆకాశములో పోతున్న హనుమంతుని అడ్డగించడానికి
సురలు సురసని ప్రతిబంధకముగా పంపిస్తారు దేవతలు.
హనుమంతుడు ఎలా జయిస్తాడో తెలుసుకోవడానికి.
అలా అడ్డగించిన సురసకి హనుమంతుడు దోసిలి వగ్గి సగౌరవముగా శ్రీమంతుడిగా
తను నిమగ్నమై ఉన్న రామకార్యము గురించి చెప్పి,
సురసను కూడా సహాయము చేయమని చెపుతాడు.
దానికి సురస ఒప్పక తన నోరు తెరిచి హనుమంతుని ముందర నిలబడుతుంది.
హనుమంతుడు తన శరీరము పెంచుతాడు.
సురస తన నోరు పెంచుతుంది.
ఇలాపెరుగుతూపోతే అంతు లేదని గ్రహించిన హనుమంతుడు
తన శరీరము అంగుష్ఠ మాత్రము చేసి
సురస నోటిలో ప్రవేశించి బయటికి వచ్చి
" దాక్షాయనీ నీ నోటిలో ప్రవేశించితిని.
నమస్కారము.
ఇక వైదేహి ఉన్నచోటుకి పోయెదను" అని చెప్పును.
ఇక్కడ కర్మాచరణలో " నేనూ, నాది" అన్నది హనుమ పెరగడము ద్వారా సూచింపబడినది.
పెరుగుటమాని బుద్ధి ఉపయోగించి తగ్గుట ఆత్మ జ్ఞానము ఎరిగినవాడు ఫలసంగ కర్తృత్వము వీడి కర్మనాచరించుట. అట్టి కర్మ బంధము కలిగించదు.
అదే భగవద్గీతలో చెప్పిన మాట.
"యజ్ఞార్థాత్కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః"
ఈ విధముగా అధ్యాత్మిక మార్గములో ఉన్న మానవుడు అవలంబింపవలసిన విధానము
సురస వృత్తాంతము ద్వారా మనకి వాల్మీకి చెప్పుచున్నాడు.
ఇంకా ముందుకు పోతాడు హనుమంతుడు.
అప్పుడు మనము చూసేది సింహికా వృత్తాంతము.
అది సింహిక హనుమంతుని నీడ హనుమంతునికి తెలియకుండా పట్టుకొని ,
హనుమంతుని కి ప్రయాణములో నిర్బంధము కలిగిస్తుంది.
అధ్యాత్మిక మార్గములో పోవువాడు శాస్త్రములో విహిత కర్మలను ఎలాగ ఆచరించ వలేనో
అలాగే నిషిద్ధ కర్మలను అలాగే పరిత్యజించ వలెను.
నిషిద్దకర్మలకు మనము ఎలా వశము అవుతామో మనకే తెలియదు.
చేయకూడని పనులు చేయబడడానికి మనిషి కి తెలియకుండానే ఆతురతో చేయబడుతాయి.
అదే ప్రశ్న అర్జునుడు కృష్ణుని అడుగుతాడు.
అన్నీ తెలిసి కూడా మనుష్యుడు ఏందుకు పాపము చేస్తాడు?
అందులోనూ ఎవరో ముందుకు తోస్తున్నట్లు ఇంకా ఎంతో ఆతురతో, అని.
అక్కడ కృష్ణుడు మనకి చెపుతాడు.
అది మనలోని ప్రకృతి వలన అని.
ఇప్పుడు సుందరకాండలో చూద్దాము.
నిషిద్ధకర్మలు మనను హింసించు కర్మలు.
సింహిక అనగా హింసించునది.
ఆ నీడ పట్టుకొని లాగిన సింహికా వృత్తాంతము
మనకు నిషిద్ధ కర్మలను ఎలా త్యజించ వలెనో చెప్పును.
నిషిద్ధ కర్మలు మనకు తెలియకుండానే మనని ఆక్రమిస్తాయి.
సింహిక హనుమంతుని అతని నీడ పట్టుకొని లాగినట్లు.
హనుమంతుడు తన జ్ఞానమును ఉపయోగించి
సింహిక గుణములను ఎరిగి ఆ సింహికను హతమార్చెను.
ఇక్కడ సురస సింహిక ఇద్దరూ స్త్రీలే అయినా
సురస విషయములో ఆమె నోటిలో ప్రవేశించి బయట పడి
ఆమె ఆశీర్వాదము పొంది ఉందుకు పోతాడు.
సింహిక విషయములో ఆమె తన నీడను పట్టుకోని లాగుతున్న విషయము గ్రహించి
ఆమె ను హతమార్చి ముందుకు పోతాడు.
అలాగ సముద్రలంఘనములో హనుమంతుడు చేసిన దుష్కరమైన కార్యములు నాలుగు
1 నిరాలంబముగా ఆకాశములో పయనించి లంకను చేరుటకు పూనుకొని ఎగురుట.
2 మైనాకుడు సగౌరవముగా విశ్రాంతి కొరకు మార్గము చేసిననూ దానిని అనుభవించక రామబాణమువలే తన పనిలో పోవుట
3 సురసను ఉపాయముతో జయించుట
4 సింహికను తన బలముతో చంపుట.
ఈ నాలుగు చేయడానికి వాల్మీకి మానవునకు నాలుగు లక్షణములు ఉండవలెను అని చెపుతాడు. అ నాలుగు లక్షణాలు:
1 ధృతి, 2 దృష్ఠి, 3 మతి, 4 దాక్ష్యము.
తన బుద్ధిని ఆత్మ జ్ఞానము వేపే మళ్ళించి
ఫలములపై కోరికలు లేకుండా చేయడానికి
ముఖ్యముగా కావలసినది ధైర్యము. అదే ధృతి.
ఆ ఫలములు లేకపోయినా పరవాలేదు అనే ధైర్యము ఉండాలి.
అప్పుడే నిష్కామకర్మ చేయగలుగుతారు.
ఒకప్పుడు ఒక వేపు మళ్ళగలిగితే మనకు కావలసిన ధనరాశి అందుబాటులో ఉండవచ్చు.
అది అక్కరలేదు అనుకొని
మనము చేయగల నిష్కామ కర్మ ముఖ్యము అని
ముందుకు పోవడానికి చాలా ధైర్యము కావాలి. అదే ధృతి.
సత్కారపూజలకు వశపడకుండా
లాభాలాభములను సమముగా చూడగలిగి ఉండాలి.
అదే మనకి మైనాక దర్శనములో కనపడును.
సత్కారపూజలే కాదు మనకి సుఖము కలిగించె పనులు
ఇతరులకు సహాయపడు పనులు చేయడానికి దూర దృష్ఠి కావాలి.
అదే దృష్టి కలిగి ఉండడము.
విహిత కర్మలను భగవదర్పణము చేసి
భగవంతునికోరకే చేయుట కు కావలసినది బుద్ధి. అదే మతి.
అంటే మనము చేయవలసిన చేయతగిన పనులు చేయడము
ఏ విధముగా ఆలోచించినా అది మంచిదే.
అది మంచిదే అని అనుకోడానికి ,
అలా ఆలోచించ డానికి కావలసింది,
అలాంటి ఆలోచనలు చేయగల బుద్ధి. అదే మతి.
నిషిద్ధకర్మలనుత్యజించడానికి సామర్థ్యత ఉండాలి అదే దాక్ష్యము.
ఈ నాలుగు లక్షణములు కల హనుమ సముద్రము ను లంఘించి లంకను చేరినట్లే ,
అధ్యాత్మిక మార్గములో పోవువాడు
ఈ నాలుగు లక్షణములు కలవాడైతే నిరాటంకము గా తన గమ్యస్థానము చేరును
అని వాల్మీకి ఈ సర్గలో మనకి చెపుతున్నాడు.
అంటే మనము కూడా ఆ నాలుగు లక్షణములు కూడపెట్టడము మంచిది.
అవి మనని అధ్యాత్మిక మార్గములోకి తోయగల శక్తి కలవి
||ఓమ్ తత్ సత్||
|| ఇవి శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీత ద్వారా మాకు తెలిసిన మాటలు||
||ఓమ్ తత్ సత్||