||సుందరకాండ. ||
||తత్త్వదీపిక- నలుబది ఐదవ సర్గ||
||"వివిధైశ్చ స్వరైః లంకా నినాద వికృతం తదా|"!||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ పంచచత్త్వారింశస్సర్గః||
తత్త్వదీపిక
నలుబది ఐదవ సర్గ
"వివిధైశ్చ స్వరైః లంకా నినాద వికృతం తదా|"
"వివిధైశ్చ స్వరైః" అంటే అనేక రకము లైన స్వరములతో ,
"లంకా నినాద", అంటే లంక అంతా మారు మోగిందిట.
హనుమంతుడు చేసిన భీభత్సానికి రథాలు తునకలు అయిపొయాయి,
అశ్వాల, ఏనుగుల, సైనికుల, రథికుల హాహాకారాలతో లంక మారు మోగి పోయింది.
అదే ఈ సర్గ లో జరిగిన కథ.
జంబుమాలి హతమార్చబడడముతో
రావణుడు అమాత్య పుత్రులు ఏడు మందిని
హనుమంతుడిని బందీ చేయడానికి ఆదేశిస్తాడు
అలాగ రాక్షసేంద్రునిచే ఆదేశించబడిన ఏడుగురు మంత్రికుమారులు
అగ్నితో సమానమైన తేజస్సుతో విరాజిల్లుచూ
ఆ రాజ భవనము నుండి బయలుదేరుతారు.
ఆ అమాత్యపుత్రులు శ్రేష్టులు.
మహాబలము కలవారు.
ధనుష్మంతులు.
అస్త్ర విద్యను నేర్చుకున్నవారు.
తోటివారికన్నమిన్నగాఉండవలెనని కోరికగలవారు.
వారందరూ బంగారపు జాలీలు కల, ధ్వజములు పతాకములు గల రథములలో వెళ్ళిరి.
పరుగులెత్తే ఆ రథములు, మేఘముల ధ్వనులను పోలిన ధ్వనులను చేస్తూ వున్నాయి.
మెరుపులతో కూడిన మేఘములవలె విరాజిల్లుచూ
అమాత్యపుత్రులు అమితోత్సాహముతో యుద్ధానికి వెళ్ళిరి.
కాని వారి బంధువులు, మిత్రులు , అమాత్య సుతుల తల్లులు
హనుమంతునిచేత కింకరులు హతమార్చబడిరి
అన్నవిషయము తెలిసినవారై చింతాక్రాంతులైరి.
ఆ మంత్రిపుత్రులు ఒకరిపై ఒకరు పోటీపడుతూ
అశోకవనద్వార తోరణము మీద కూర్చునియున్న హనుమంతుని ఎదురుకొనిరి.
రథముల గతితో మేఘ గర్జన చేయుచూ,
వర్షిస్తున్న మేఘములవలె హనుమంతునిపై బాణ వృష్టి కురిపిస్తూ సంచరించిరి.
అప్పుడు ఆ శరపరంపరతో కప్పబడిన హనుమంతుడు
పర్వతరాజము వలె నుండెను.
ప్రచండవేగముతో వెళ్లగల ఆ వానరుడు
ఆ నిర్మలాకాశములో తిరుగుచూ
ఆ వీరుల శరములను రథవేగమును నిర్వీర్యము చేసెను.
ఆకాశములో వుండి ఆ ధనుర్ధారులను ఆటలాడిస్తూ
మేఘముల ప్రభువు వాయుదేవుని వలె శోభించెను.
ఈ వీరుడు ఘోరమైన గర్జనచేయుచూ
ఆ మహాసేనకి భీతి కలిగించునట్లు తిరిగెను.
ఆ శత్రుమర్దనడు కొందరిని చేతితో కొట్టి హతమార్చెను.
కొందరిని పాదములతో, కొందరిని పిడికిలితో, కొందరిని గోళ్లతో సంహరించెను.
ఆ వానరోత్తముడు కొందరిని తన రొమ్ముతో,
మరికొందరిని తొడలతో మధించి వధించెను.
కొందరు అతని సింహనాదము విని భయపడి భూమిపై పడిరి.
అప్పుడు ఆ అమాత్యపుత్రుల సైన్యము అంతా
భయపడినవారై పది దిక్కులలో పారిపోయిరి.
అప్పుడు ఏనుగులు వికృతముగాఘీంకరించెను.
గుఱ్ఱములు నేలపై పడెను.
ముక్కలై పడిన రథముల పైకప్పులు, ధ్వజములు, చత్రములతో
ఆ రణ భూమి నిండిపోయెను.
అప్పుడు "వివిధైశ్చ స్వరైః లంకా నినాద వికృతం తదా|"
అంటే ఆ లంక అంతా అనేక వికృతమైన నాదములతో మారుమోగెను.
అలాగ హనుమ వీరాగ్రేసరులైన ఆ రాక్షసులను హతమార్చి,
ఇంకా ఇతరులతో యుద్ధము చేయవలెననే ఉత్సాహముతో
మళ్ళీ ఆ అశోక వనద్వార తోరణము పైకి ఎక్కి కూర్చొనెను.
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఇదవ సర్గ సమాప్తము
||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||