||సుందరకాండ. ||

||తత్త్వదీపిక-ఎభైయ్యొకటవ సర్గ||

||"శక్తో రామో మహాయశాః "||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకపంచాశస్సర్గః||

తత్త్వదీపిక
ఏబది ఒకటవ సర్గ
"శక్తో రామో మహాయశాః"

 

"శక్తో రామో" అంటే ఆ శక్తి గల రాముడు.
ఏమిటా శక్తి ?
"పునరేవా తథా స్రష్టుం"
మళ్ళీ పునసృష్టి చేయ గలశక్తి.
దేనిని పున సృష్టి చేయడము?
"సభూతాన్ స చరాచరాన్ సర్వలోకాన్"
సమస్తభూతములతోనూ సమస్త చరాచరములతో కూడియున్న అన్ని లోకములను
ఒక్కమారు సంహరించి మరల సృష్టించ గలశక్తి కలవాడుట.

ఇది రాముని గురించి హనుమ చెపుతున్నమాటలు.
నిజానికి ఆశక్తి ఎవరిది ?
పరమాత్ముడిది.

జగత్ సృష్టి స్థితి ప్రళయములను చేయువాడు అతడే.
అతడే మహాయశస్సు కలవాడు.
శ్రుతులలో ...
"న తస్యే శే కశ్చన తస్య నామ మహద్యశః"
అంటూ పరమాత్మకు "మహద్యశః" అని పేరుగలదు అని చెప్పబడినది.
ఇక్కడ మహా యశాః అని కూడా అంటూ
అంటే రాముడే ఆ పరమాత్మ అని హనుమ సూచిస్తున్నాడన్నమాట.
అదే ఈ సర్గలో వింటాము

ఇదంతా
' సత్యం రాక్షస రాజేంద్ర" అంటూ,
హనుమ రావణునికి ఈ సర్గలో చెపుతున్న హితబోధ.

ఇక్కడ హనుమంతుని మాటలు వింటున్నప్పుడు ,
రాములవారు మొట్టమొదట ఋష్యమూక పర్వతము దగ్గర హనుమంతుని చూచినప్పుడు
హనుమంతుని గురించి లక్ష్మణునికి చెప్పిన మాటలు,
మళ్ళీ మళ్ళీ చెవులలో వినిపిస్తాయి.

రాములవారు ఇలా అంటారు:
"నానృగ్వేద వినీతస్య నాయుజుర్వేదధారిణః|
నా సామవేద విదుషః శక్యమేవం సుభాషితుమ్||
నూనం వ్యాకరణం కృతమ్ అనేన .. "|

అంటే "నాలుగు వేదములు చదివిన వారు తప్ప,
ఇంకాఎవరూ ఈ విధముగా మాట్లాడలేరు.
ఇతడు వ్యాకరణము కూడా క్షుణ్ణముగా గ్రహించినవాడు.
ఇంతసేపు మాట్లాడినా ఒక్క పొల్లు పోలేదు.
ఇతడు తనమాటలతో నాహృదయము హరించాడు".
ఇది రాములవారి నుంచి హనుమంతునికి లభించిన మొట్టమొదటి బహుమతి.

సుందరకాండలో హనుమ పరాక్రమము, బుద్ధి, జ్ఞానము గురించి చాలా విన్నాము.
హనుమ ఇక్ష్వాకు వంశము గురించి కీర్తించినపుడు,
సీతమ్మకి రాముని గుణములు చెప్పినప్పుడు,
హనుమ వాక్చాతుర్యము మనము విన్నాము.
ఇక్కడ రాముని దూతగా రావణునికి ఇచ్చే సందేశములో కూడా,
మనకి హనుమవాక్చాతుర్యము కనిపిస్తుంది.
ఇక రావణ సభలో హనుమ చేసిన హితబోధ విందాము.

ఆ రాజసభలో బలవంతుడూ వానరోత్తముడు అయిన హనుమంతుడు,
ఆ మహాబలపరాక్రమము గలవాడు అయిన దశాననునితో ఇట్లు పలికెను.

" ఓ రాక్షసేంద్రా నేను సుగ్రీవుని సందేశముతో నీ ఆలయమునకు వచ్చితిని.
వానరాధిపతి సోదరసమానుడు నీ కుశలములను అడుగుచున్నాడు.
సోదర సమానుడు మహాత్ముడు అయిన సుగ్రీవుని వద్దనుంచి వచ్చిన ఈ సందేశము
నీకు ఇహ పరములలో శ్రేయస్సు కలిగించునది.
ధర్మము తో కూడినది.
అది వినుము".

' దశరథుడనే పేరుగల రాజు రథములు ఏనుగులు సమృద్ధిగాగలవాడు.
అతడు లోకబంధువు.
ప్రజలకు తండ్రిలాంటి వాడు.
ఇంద్రునితో సమానమైన తేజము కలవాడు.
ఆయన జ్యేష్ఠపుత్రుడు ప్రియము చేయువాడు, నా ప్రభువు, రాముడనే పేరుగలవాడు.
అతడు మహాతేజము కలవాడు.
ఆ రాముడు ధర్మమార్గమును అనుసరిస్తూ తండ్రి ఆదేశముతో,
వనవాసమునకు తన తమ్ముడైన లక్ష్మణునితో,
తన భార్య సీతతో దండకావనము ప్రవేశించెను'.

'ఆయన భార్య మహాత్ముడైన విదేహమహరాజుయొక్క కూతురు.
ఆమె మహా పతివ్రత.
ఆ పతివ్రత, సీత వనములో కనిపించకుండా పోయినది.
ఆ దేవిని వెతుకుతూ ఆ రాజపుత్రులు
ఋష్యమూక పర్వతప్రాంతమునకి వచ్చి సుగ్రీవునితో కలిసిరి.
ఆ సుగ్రీవుడు వారి సీతాన్వేషణకు ప్రతిజ్ఞాబద్ధుడయ్యెను.
రాముడు కూడా సుగ్రీవునకు వానరరాజ్యము కట్ట బెట్టుటకు ప్రతిజ్ఞాబద్ధుడయ్యెను'.

'అప్పుడు ఆ రాజపుత్రుడు వాలిని యుద్ధములో హతమార్చి
సుగ్రీవుని వానరగణములకు అధిపతిగా స్థాపించెను.
వానరపుంగవుడైన వాలి గురించి నీకు విదితమే.
ఆ వానరుడు రాముని చేత ఒకే బాణముతో హతమార్చబడెను.
వానరాధిపుడు మాటతప్పని వాడు
సుగ్రీవుడు సీతాన్వేషణకు అన్ని దిక్కులలో వానరులను పంపెను'.

" ఓ రాజా !వందల వేలకొలదీ వానరులు సీతాన్వేషణముకై అన్ని దిశలలోనూ
ఆకాశములోనూ పాతాళములోనూ వెదుకుచున్నారు.
ఆ వానర వీరులు కొందరు మహాబలులు.
ఏమీ ఆటంకములులేకుండా శీఘ్రముగా వెళ్ళువారు.
కొందరు గరుత్మంతునితో సమానులు.
కొందరు వాయుదేవునితో సమానులు".

" నేను హనుమంతుడను పేరుగలవాడను.
మారుతియొక్క ఔరసపుత్రుడను.
సీతాదేవి కొఱకై వందయోజనములు విస్తీర్ణముగల సముద్రమును దాటి ఇచటికి వచ్చితిని.
తిరుగుతూ ఉన్న నాచేత నీ గృహములో జనకాత్మజ చూడబడినది.
నీకు ధర్మము తెలిసినదే.
తపస్సు కూడా చేసినవాడవు.
ఓ బుద్ధిశాలీ! నీకు పరస్త్రీలను నిర్బంధించుట తగని పని ".

"బుద్ధిమంతుడైన నీలాంటి వారు ధర్మవిరుద్ధమైన కార్యములు,
నాశనమునకు మూలకారణములగు కార్యములు చేబట్టరు కదా".

"రాముని కోపమును అనుసరించి లక్ష్మణునిచే వదలబడిన శరపరంపరధాటికి
దేవతలు కాని అసురులు కాని ఎవరూ నిలబడలేరు.
ఓ రాక్షసేంద్రా రామునికి అపకారము చేసి సుఖము పొందగలవాడు
ఈ ముల్లోకములలో ఎవరూ లేరు".

" అందుకని త్రికాలహితమైన ధర్మమును అనుసరించు,
నా ఈ మాటలను వినుము.
ఆ నరదేవునకు సీతను అప్పగించుము.
ఎవరికీ సాధ్యముకాని ఈ దేవిని చూడడమనే కార్యమును నేను సాధించితిని.
ఇక పై చేయవలసిన కర్మ రాఘవునిపై వుండును".

"ఈ శోక సముద్రములో మునిగియున్న సీత,
నా చేత చూడబడిన సీత ,
నీ చేత నిర్బంధించబడిన సీత,
ఆమె ఒక ఐదు తలల పాము వంటిది అని నీవు గ్రహించకుండా ఉన్నావు.
విషముతో కూడిన అన్నము తిని జీర్ణించుకొనుట ఎలా సాధ్యముకాదో,
అలాగ సురాసురులకు కూడా ఆమెను బంధములో ఉంచుట సాధ్యము కాదు".

"తపోబలముచే ధర్మకార్యముల పరిపాలనచే,
నీవు పోందిన ప్రాణరక్షణ వరములను నాశనము చేసికొనుట,
నీకు భావ్యము కాదు.
నీ తపోబలముచేత నీవు అవధ్యుడవు అని కల ధైర్యము కూడా సరికాదు .
దానికో కారణము ఉంది.

ఈ సుగ్రీవుడు దేవుడు కాడు. అసురుడుకాడు.
సుగ్రీవుడు రాక్షసుడు కాడు, దానవుడు కాడు. గంధర్వుడు కాడు.
సుగ్రీవుడు యక్షుడు కాడు. పన్నగుడు కాడు.
ఓ రాజా అందువలన నీ ప్రాణము ఎలా కాపాడుకుందువు?"

ఇక్కడ వాల్మీకి హనుమ ద్వారా మనకి ధర్మము అధర్మము గురించి విశదీకరిస్తాడు.

చేసిన అధర్మమునకు ప్రాయశ్చిత్త రూపముగా చేయబడిన ధర్మము,
అధర్మమును ఆపుతుంది.
అందుకే హనుమ సీతామ్మవారిని రామునికి అప్పగించమని ఉపదేశిస్తాడు రావణునికి.
అలా చేయనంతవరకూ ఆ అధర్మ ఫలము అనుభవించవలసినదే.

ధర్మము ధర్మఫలమునే ఇచ్చును.
ధర్మము ఫలమిచ్చుచున్నంతకాలము అధర్మ ఫలము అంటదు.
కాని ధర్మము చేసి సంపాదించిన పుణ్యము,
చేసిన అధర్మమును నాశనము చేయలేదు.
ధర్మ ఫలము అయిన తరువాత
చేసిన అధర్మము యొక్క ఫలము కూడా అనుభవించవలసి వచ్చును.

అదే మాట హనుమ రావణునికి మళ్ళీ చెపుతాడు

"నీచేత ధర్మఫలము పొందబడినది అందులో సందేహము లేదు.
నీవు చేసిన అధర్మముయొక్క ఫలము కూడా త్వరలో పొందెదవు".

"జనస్థానములో రాక్షస సంహారము తెలిసికొని ,
వాలి వధ గురించి తెలిసికొని,
రామ సుగ్రీవుల సఖ్యము గురించి తెలిసికొని
నీవు జయించబడినట్లే అని తెలిసికొనుము.
నేను ఒక్కడినే రథ తురగ గజముల సేనలతో కూడిన ఈ లంకను
నాశనము చేయగల శక్తి కలవాడను.
అందులో సందేహము లేదు".

"రాముడు వానర భల్లూక గణముల సమక్షములో,
సీతను అపహరించిన శత్రువులను నాశనము చేసెదనని ప్రతిజ్ఞ చేశెను.
రాముని కి అపకారము చేసి సాక్షాత్తు పురందరుడు కూడా సుఖముపొందలేడు.
అప్పుడు నీలాంటి వారిగురించి చెప్పనవసరము లేదు".

" నీవు సీత అని ఎవరిని తెలిసికున్నావో,
ఏ సీత నీ నిర్బంధములో ఉన్నదో,
ఆమెను సర్వలంకా వినాశినిగా, కాళరాత్రిగా తెలిసికొనుము.
ఆ సీతా రూపములో నున్న కాలపాశమును నీ మెడకు కట్టుకోకు.
నీ క్షేమము గురించి ఆలోచించుకొనుము".

"సీత యొక్క తేజస్సుతో రాముని కోపముతో దగ్ధమగు
సాట్టప్రాకారములతో కూడిన ఈ నగరము చూడుము.
నీ మిత్రులు మంత్రులు బంధువులు తమ్ములు
పిల్లలూ హితులు భార్యలు భోగములతో కూడిన
ఈ లంకా నాశనమునకు కారణము కాకుము".

"ఓ రాక్షస రాజేంద్ర నేను దూతను వానరుడను.
ప్రత్యేకముగా రాముని దాసుడను.
నా మాటలు సత్యము. వినుము.
మహాయశస్సుగల రాముడు
సమస్త చరాచర భూతములతో కూడిన లోకములను
నశింపచేసి మరల సృష్టించ గల శక్తి కలవాడు".

ఇవి హనుమంతుడు రావణుని ఉద్దేశించి చెప్పిన మాటలు.

ఇక్కడ 'మహాయశాః' అంటూ రాముని యశస్సు కీర్తిస్తూ,
సృష్టిని నశింపచేసి మళ్ళీ సృష్టించగలడని చెపుతూ,
హనుమ రాముడు పరమాత్మయే అని సూచిస్తాడు.

జగత్ సృష్ఠి స్థితి ప్రళయములను చేయువాడు పరమాత్మ.
శ్రుతులలో పరమాత్మ గురించి " న తస్యే శే కశ్చన తస్య నామ మహద్యశః" అని చెపుతూ
పరమాత్మకు "మహద్యశః" అని పేరుగలదు అని చెప్పబడినది.
ఇక్కడ హనుమ మహాయశాః అంటూ రాముడే ఆ "మహద్యశః" అని చెపుతాడు.
శ్రుతులని చదివిన రావణునికి ఈ మాటతో అర్ధమౌతుంది అని హనుమ చెప్పాడన్నమాట.

అటువంటి రామునితో తలపడకూ అంటూ హనుమ ఇంకాచెపుతాడు

"విష్ణువుతో సమానమైన పరాక్రమము గల రాముని తో,
యుద్ధము చేయుగల దేవతల అసురుల యక్షరాక్షస గణములలో గాని
విద్యాధరులు గంధర్వులు సిద్ధులలోనూ కిన్నరులలో గాని
అన్ని భూతములలో అన్నిలోకములలో అన్ని కాలములలో ఎవరూ ఎక్కడా లేరు".

' సర్వలోకములకు ఈశ్వరుడైన రాజసింహుడు రామునితో
ఈ విధముగా అప్రియమైన పని (సీతాపహరణము) చేసిన నీ జీవితము దుర్లభము'.

" ఓ నిశాచరేంద్రా !
దేవులలో, దైత్యులలో, గంధర్వ విధ్యాధరనాగ యక్షులు అందరిలో,
ముల్లోకములకు నాయకుడగు రాముని ముందర యుద్ధములో నిలబడు శక్తి లేదు.
యుద్ధములో రాముడు వధించువానిని రక్షించుటకు
స్వయంభువు, చతురాననుడు అయిన బ్రహ్మకు కాని,
త్రినేత్రుడు, త్రిపురాంతకుడు అయిన రుద్రునకు గాని,
సురనాయకుడు, మహేంద్రుడు అయిన ఇంద్రునకు కాని శక్యము కాదు".

ఇది హనుమంతుని హితబోధ.
ఇక్కడ రాముడు వధించువానిని రక్షించుట
బ్రహ్మ, రుద్ర మహేంద్రులకు సాధ్యముకాదు అని హనుమంతుని మాట.
అంటే దీనిలో విష్ణువుకే ఆ పని సాధ్యము అని .
అంటే ఇక్కడ రాముడే విష్ణువు అని ధ్వని.
రాముడే పరమాత్మఅని.

హితబోధలో హితము వినే స్థితిలో లేని వానికి
హితబోధ బోధకాదు.
వానికి వినపడేవి అప్రియ వచనములే

అలాగ అప్రియమైన హేతుబద్ధమైన హనుమంతుని
నిర్భయమైన మాటలు వినిన రావణుడు
ఆ హనుమంతుని యొక్క వధకు ఆజ్ఞ ఇచ్చెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఏభైయ్యొకటవ సర్గ సమాప్తము.


|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||