||సుందరకాండ. ||
||తత్త్వదీపిక- ఏబది నాలుగొవ సర్గ||
||""న వానరోsయం స్వయమేవ కాలః|"||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ చతుఃపంచాశస్సర్గః||
తత్త్వదీపిక
"న వానరోsయం స్వయమేవ కాలః|"
ఏబది నాలుగొవ సర్గ
"న వానరోsయం " అంటే
"వీడు వానరుడు కాదు"అని.
వానరుడు కాకపోతే వీడు ఎవడు?
"స్వయమేవ కాలః" అంటే
" స్వయముగా మృత్యువే " అని.
ఇది లంకావాసులు వాళ్లలో వాళ్ళు చెప్పుకుంటున్నమాట.
హనుమ తో యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరికి ఇది విదితమే.
కింకరులు, చైతన్య ప్రాసాద రక్షకులు,జంబుమాలి,
అలాగే అమాత్యపుత్రులు, ఇంకా ఐదుగురు సేనానాయకులు,
వీరందరికి అశోక వన ధ్వంసము తరువాత యుద్ధములో
హనుమ కాలుడు లాగే కనిపించాడు.
ఇప్పుడు లంకావాసులకి కూడా అదే అర్థము అయిందన్నమాట.
అది ఎలాజరిగిందో ఈ సర్గలో వింటాము.
ఈ సర్గలో మొదటి శ్లోకము
"వీక్షమాణః తతో లఙ్కాం కపిః కృత మనోరథః|
వర్థమానసముత్సాహః కార్యశేషమచిన్తయత్||" అని.
అంటే తోకకి నిప్పంటించబడి లంకానగరము అంతా తిప్పబడిన తరువాత,
తన మనోరథమును సాధించినవాడై ,
హనుమ తన పర్వత రూపము వీడి క్షణములో చిన్న రూపము పొంది,
తన బంధములనుంచి విడివడి,
ఉత్సాహముతో మరింత పెరిగినవాడై
లంకానగరమును చూచుచూ
మిగిలిన కార్యక్రమము గురించి ఆలోచించెను.
' ఇప్పుడు నాకు మిగిలిన కర్తవ్యము,
ఈ రాక్షసులకు మరింత సంతాపము కలిగించగలిగినది ఏదో అదే .
వనము ధ్వంసము చేయబడినది.
రాక్షసులు కొందరు హతమార్చబడిరి.
దేశముయొక్క బలగము నాశనము చేయబడినది.
దుర్గవినాశనము మిగిలినది'.
'దుర్గము కూడా నాశనము చేసినచో, చేసిన పరిశ్రమ సుఖకరము అగును.
ఈ కార్యములో కొంచెము శ్రమ తీసుకున్నచో కార్యము సఫలము అగును.
నా లాంగూలములో ప్రజ్వరిల్లుతున్న అగ్నిదేవునకు,
ఈ ఉత్తమమైన గృహములతో సంతర్పణ చేయుట న్యాయము.'అని.
అలా ఆలోచించి ప్రజ్వరిల్లితున్న లాంగూలము కల మహాకపి,
మేఘములలో మెరుపులవలె ఆ భవనాగ్రములలో సంచరించ సాగెను.
ఆ వానరుడు ఉద్యానములను ప్రాసాదములను చూచి
భయము లేకుండా ఒక భవనము నుండి ఇంకొక భవనము తిరిగెను.
వేగములో వాయువుతో సమానమైన మహావేగము కల వానరుడు
ప్రహస్తుని నివేశమున పైకి ఎగిరి అక్కడ నిప్పు అంటించి,
అక్కడనుంచి ఇంకొక మహాపార్శ్వుని గృహముపైకి ఎగిరి
అక్కడ కాలాగ్నితో సమానమైన అగ్నిని రగిలించెను.
ఆ మహాతేజము కల మహాకపి అప్పుడు
వజ్రదంష్ట్రుడు, ధీరుడైన శుకుడు, సారణుని గృహముల పైకి దూకెను.
పిమ్మట ఆ వానర యూధపుడు ఇంద్రజిత్తుని భవనము దహించెను.
అలాగే జంబుమాలి , సుమాలి భవనములను దహించెను.
పిమ్మట రస్మికేతుని భవనము,
అలాగే సూర్యశత్రువు , హ్రస్వకర్ణుడు, రోమశస్యుల గృహములను దహించెను.
అలాగే యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఘోరుడు మున్నగువారి గృహములను దహించెను.
అలాగే హస్తిముఖుని భవనమును దహించెను.
అలాగే కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుల గృహములను దహించెను.
కుంభకర్ణుని భవనము మకరాక్షుని భవనము దహించెను.
యజ్ఞశత్రుని భవనము, బ్రహ్మశత్రుని భవనము దహించెను.
నరాన్తకుడు కుంభుడు , దురాత్ముడు నికుంభుని భవనములు కూడా దహించెను.
మహాతేజోవంతుడగు విభీషణుని భవనము మాత్రము వదిలేసి
క్రమముగా మిగిలిన భవనములను
క్రమము తప్పకుండా ఆ హరిపుంగవుడు దహించెను.
మహాయశోవంతుడైన ఆ మహాకపి
ఐశ్వర్యముతో తులతూగుతున్నవారి వారి గృహములలోని
ఐశ్వర్యమంతా దహించెను.
ఆ వీరుడు అన్నిటినీ దాటి రాక్షసేంద్రుడు రావణుని భవనము చేరెను.
అక్కడ హనుమంతుడు నానారత్న విభూషణములతో విరాజిల్లుచున్న,
మేరు మందర పర్వతములవలెనున్న,
అన్నిరకములుగా మంగళప్రదముగానున్న ముఖ్యగృహములో
తన లాంగూలాగ్రములో ప్రజ్వరిల్లు చున్న అగ్నితో
నిప్పంటించి కాలమేఘములవలె గర్జించెను.
వాయువు కలవడముతో అతి బలవత్తరముగా పెరిగి,
అగ్నికాలాగ్ని వలె జ్వలించెను.
వాయువు సంగమముతో ఆ అగ్ని అతి వేగముగా ప్రజ్వరిల్లెను.
పవనునిచేత ప్రజ్వలింపబడిన ఆ అగ్నిఅచటి భవనములన్నిటిలో తిరిగెను.
బంగారు జాలలు మణిరత్న భూషితమైన
ఆ మహత్తరమైన భవనములు భస్మమై పడిపోయినవి.
తమ గృహములను రక్షించుకొనుటకు పరిగెడుచున్నరాక్షసులు
సంపాదించిన సంపదలను రక్షించుకో లేక, భగ్నోత్సాహము కలవారై
' తప్పక అగ్నియే కపిరూపములో వచ్చినది' అని అనుకొనిరి.
అప్పుడు హాహాకారముల శబ్దములు చెలరేగినవి.
కొందరు పసిబిడ్డలకి పాలు ఇచ్చుచున్న స్త్రీలు
వారి జుట్టు విడిపోయి హాహాకారము చేస్తూ
అగ్నితో చుట్టబడిన భవనములనుండి తోందరలో దూకిరి.
అప్పుడు వారు అంబరమునుండి పడుతున్న సౌదామినులవలె నుండిరి.
ఆ హనుమంతుడు ఆ అగ్నిజ్వాలలకి దగ్ధమౌతున్న భవనముల నుండి
వజ్రములు పగడములు వైడూర్యములధాతువులతో కూడిన
బంగారము వెండి ధాతువులతో కూడిన
ద్రవ్యముల ధాతువులను చూచెను.
ఏవిధముగా అగ్ని, కట్టెలు తృణములతో తృప్తిచెందదో
ఆవిధముగా రాక్షసేంద్రుని రాక్షసులను హతమార్చినా
హనుమంతుడు తృప్తి చెందలేదు.
ఎందరో రాక్షసులు కూల్చబడినా
భూమి కూడా తృప్తి చెందలేదు.
ఆ అగ్నిశిఖలు కొన్ని కింశుకాపుష్పముల వెలుగుతూ,
కొన్ని శాల్మలీపుష్పముల వెలుగుతూ,
కొన్ని కుంకుమ పుష్పముల వెలుగుతూ ప్రకాశించుచున్నవి.
మహాత్ముడైన హనుమంతుని చేత ఆ లంకాపురము
రుద్రుడు త్రిపురమును దగ్ధమొనరించినట్లు దగ్ధము చేయబడెను.
అ భీమపరాక్రమము గల హనుమంతుని చేత
వేగముగా ప్రజ్వలింపబడిన అగ్ని,
వలయాకారముగా పెరుగుతూ
శిఖరాగ్రమున ఉన్న ఆ లంకానగరము పైకి లేచెను.
ధూమములేని ఆ భవనములలో వున్న అగ్ని
వాయువుచేత ప్రకోపింపబడి
రాక్షస శరీరములను దగ్ధము చేయుచూ మరింత పెరిగినవి.
సమస్త లంకానగరమును చుట్టిన
ఆ తేజోవంతమైన ఆ అగ్ని,
కోటి సూర్యుల సమానముగా కనపడెను.
వజ్రాయుధము తో కొట్టబడి
బ్రహ్మాండమంతా విరుగుచున్నట్లు చేసిన శబ్దములు వలె కల శబ్దములతో
ఆ అగ్ని ప్రభవించెను.
ఆ అగ్ని కింశుకాపుష్పపు వర్ణముతో వెలుగుచూ
మిరిమిట్లు కొలిపే కాంతులతో ఆకాశమంతా వ్యాపించినది.
సమస్తము దగ్ధముచేసి మంటలు చల్లారిన పిమ్మట లేచిన పొగలతో
చుట్టబడిన మేఘములు నలువ కలువలవలే ప్రకాశించుచున్నవి.
ధగ్ధమౌతున్న లంకా నగరముచూచి రాక్షసులు ఈ విధముగా తలచిరి.
సమస్త ప్రాణి సంఘములూ గృహములూ వృక్షములతో సహా
ఆ నగరము దగ్ధము అయిపోతూవుంటే,
'ఇతడు వానరుడుకాడు.
వజ్రాయుధధారి దేవతలప్రభువు అయిన ఇంద్రుడుకావచ్చు,
లేక సాక్షాత్తు యముడో వరుణుడో రుద్రుడో అవవచ్చు
లేక కుబేరుడో సూర్యుడో చంద్రుడో అవవచ్చు
లేక స్వయముగా వచ్చిన కాలపురుషుడే అవవచ్చు'.
' లేక సమస్త సృష్టికర్త చతురాననుడైన
బ్రహ్మయే వానరరూపములో
రాక్షససంహారమునకు వచ్చెనా ఏమి ?
లేక అనంతము అవ్యక్తము ఊహకందని మహావిష్ణువు,
రాక్షసులను పూర్తిగా అంతము చేయుటకు
వానరూపములో వచ్చెనా? అని.
ఆ రాక్షసగణములందరూ కలిసి ఒకరికొకరు ఈ విధముగా చెప్పుకొనసాగిరి.
అప్పుడు రాక్షసులు అశ్వములు రథములు నాగులు
మృగములతో పక్షిసంఘముల తో సహా దగ్ధము అవుతున్న,
ఆ లంకా నగరము నుండి రోదన ధ్వనులు పైకి లేచాయి.
' ఓ తాత ! ఓ పుత్రా ! ఓ మిత్రుడా!
భోగించతగిన పుణ్యమైన జీవితము నాశనమైనది'
అంటూ రాక్షసులందరి ద్వారా ఘోరమైన నాదము లేచెను.
అగ్ని జ్వాలలతో చుట్టబడి,
హతులైన యోధులతో,
పారిపోతున్న సైనికులతో
నిండిన ఆ లంకా నగరము
శపింపబడినదా అన్నట్లు ఉండెను.
విషణ్ణులైన రాక్షసులతో నిండిన,
అగ్నిజ్వాలలతో చుట్టబడి దగ్ధమౌతున్న,
స్వయముగా బ్రహ్మ యొక్క ఆగ్రహమునకు గురి అయినదా అన్నట్లు వున్న,
ఆ లంకానగరమును మహాత్ముడైన ఆ హనుమంతుడు సంభ్రమముతో చూసెను.
అత్యంత ఉత్తమమైన వృక్షములతో కూడిన వనములను దహించి,
రాక్షసులను హతమార్చి,
రత్నమాలికలవలె కూర్చబడిన గృహములతో కూడిన లంకను దహించి
ఆ పవనాత్మజుడైన ఆ హనుమంతుడు అచట నిలబడెను.
అ విచిత్రమైన త్రికూట శిఖరముపై నిలబడి
ప్రజ్వలిస్తున్న లాంగూలముతో
ఆ వానరులలో సింహము లాంటి హనుమంతుడు
కిరణములమాలతో ప్రకాశించుచున్న సూర్యునివలె నుండెను.
మహాత్ము డైన ఆ హనుమంతుడు అనేక రాక్షసులను
వృక్షములతో కూడిన వనములను భగ్నముచేసి
రాక్షస భవనములకు నిప్పు అంటించి
మనస్సులో రాముని తలచుకొనెను.
అప్పుడు ఆ వానరవీరులలో ముఖ్యుడైన
మారుతితో సమానమైన వేగము కల
గొప్పబుద్ధిశాలి అయిన సర్వశ్రేష్టుడు అయిన హనుమంతుని
దేవగణములందరూ ప్రశంశించిరి.
ఆ మహాతేజోమయుడైన మహాకపి వనములను ధ్వంసము చేసి
యుద్ధములో రాక్షసులను హతమార్చి
రమ్యమైన లంకానగరము దగ్ధము చేసి రాజించెను.
అప్పుడు గంధర్వులతో కూడిన దేవతలూ సిద్ధులు మహాఋషులూ
ఆ దగ్ధమైన లంకను చూస్తూ అత్యంత విస్మయము పొందిరి.
ఆ మహాకపి వానరలలో శ్రేష్టుడు అయిన హనుమంతుని చూచి,
లంకానగరములోని సమస్తభూతములూ
అతడు కాలాగ్ని యే అని భావించి భయభ్రాంతులైరి.
రాక్షసాధిపతి రావణుని లంకా దహనముతో,
ముని పుంగవులు గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు,
సమస్త భూతములు అత్యంతమైన ఆనందమును పొందిరి.
బాలకాండలో 15 వ సర్గలో రావణుని దుష్చేష్టలవలన
సమస్త భూతములు దుఃఖములో వున్నారని వింటాము.
ఇప్పుడు సమస్త భూతములు ఆనందము పొందిరి అన్నమాటకి
మనము ఆశ్చర్య పడనక్కరలేదు.
ఇదే ఏబది నాలుగవ సర్గ లో మనము వినే కథ.
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఏబది నాలుగవ సర్గ సమాప్తము
|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||