||సుందరకాండ. ||
||తత్త్వదీపిక- ఏబది ఏడవ సర్గ||
||"సర్వథా కృతకార్యోsసౌ హనుమాన్"||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ సప్తపంచాశస్సర్గః||
తత్త్వదీపిక
ఏబది ఏడవ సర్గ
"సర్వథా కృతకార్యోsసౌ హనుమాన్"
"సర్వథా కృతకార్యః" అంటే
"అన్ని విధములుగా కార్యము సాధించినవాడు" అని
ఎవరు కార్యములు సాధించినది?
"అసౌ హనుమన్" అంటే "ఆ హనుమంతుడు"
ఇది ఎవరు చెపుతున్నారు ?
దూరమునుంచి ఆకాశములో ఎగురుతున్న హనుమంతుని గర్జన వినిన,
జాంబవంతుడు చెప్పినమాట.
వానరలు అందరూ సీతాన్వేషణకి సముద్ర తీరమున,
ఆ సముద్రము దాటలేమని నిరాశ పడుతున్నప్పుడు,
హనుమంతుని ప్రేరేపించిన వాడు కూడా జాంబవంతుడే.
జాంబవంతుని ప్రేరణ వలననే హనుమ సాగరము దాటడానికి నిశ్చయించుకున్నాడు.
హనుమంతుడు తిరుగు ప్రయాణములో చేసిన గర్జన తో జాంబవంతుడు కి అర్థమైంది.
"సర్వథా కృతకార్యః " అన్నివిధాల సాధించుకు హనుమ వస్తున్నాడు అని.
జాంబవంతుడికి హనుమ పై ఎంత నమ్మకమో
అది ఇంకో ఉదాహరణతో మనకి తెలిసి వస్తుంది.
యుద్ధకాండలో యుద్ధరంగములో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముతో,
విభీషణుడు హనుమ తప్ప రామ లక్ష్మణులతో సహ
సమస్త వానర సైన్యము దెబ్బతిని మూర్ఛిల్లి పడిపోయారు.
అప్పుడు ఆ రాత్రి హనుమ విభీషణుడు యుద్ధరంగములో
ఎవరు బ్రతికి ఉన్నారో చూడడానికి బయలు దేరుతారు.
ఆ చీకటిలో గాయపడి వున్న జాంబవంతుడు కనిపిస్తాడు.
చీకటిలో చూడలేకపోయినా మాటలతో విభీషణుని గుర్తించి
జాంబవంతుడే అడుగుతాడు.
" హనుమ ఎలాగ వున్నాడు అని".
ఆ ప్రశ్న విని విభీషణుడు ఆశ్చర్యపోతాడు.
ఈ యుద్ధానికి ముఖ్యులు రామలక్ష్మణులు.
ఆ తరువాత ముఖ్యుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు.
వీళ్ళ క్షేమ సమారాచారములు అడగకుండా
హనుమ క్షేమము ఎందుకు అడుగుతున్నాడు అని.
ఆశ్చర్యపోయిన విభీషణుడు జాంబవంతుని అదే ప్రశ్న అడుగుతాడు.
దానికి జాంబవంతుని సమాధానము విన తగినది.
జాంబవంతుడు చెప్పిన మాట ఇది.
"హనుమ బ్రతికి ఉంటే మనము చనిపోతున్నా బ్రతికి బయటపడతాము.
హనుమ లేకపోతే మనము బ్రతికి వున్నా లేనట్టే లెక్క" అని.
అది జాంబవంతునికి హనుమంతుని పై వున్న విశ్వాసము.
అందుకనే హనుమ గర్జన వినగానే,
జాంబవంతుడు నిస్సంశయముగా
హనుమ జయము సాధించాడు అని చెపుతాడు.
హనుమ చేసిన కార్యాలలో చాలా విశేషాలు ఉంటాయి.
ఈ తిరుగు ప్రయాణములో ఇంకో మాట వింటాము.
"పర్వతేన్ద్రం సునాభం చ సముస్పృశ్య వీర్యవాన్"
అంటే దారిలో పర్వతేంద్రియమైన మైనాకుని స్పృశించి మరీ వెళతాడుట.
మొదటి సర్గలో రామకార్యము కొఱకు వెళ్ళుతున్న హనుమ,
"ప్రతిజ్ఞా చ మయా దత్తా "- అంటే ప్రతిజ్ఞచేశాను ఆగను అని చెప్పి,
మైనాకుని ఆతిధ్యము తీసుకోక
ఆతిథ్యము తీసుకొనినట్లే భావింపమని చెప్పి
ముందుకు సాగి పోతాడు.
తిరుగుప్రయాణములో అదే గుర్తు వుంచుకొని,
హనుమ మైనాకుని స్పృశించి మరీ వెళతాడన్నమాట.
అదే హనుమ ప్రత్యేకత.
హనుమ లో ఇంకో విశేషము.
మహేంద్రపర్వతము మీద దిగిన హనుమ,
వానరులకు తన ఘనత వినిపించకుండా
"దృష్టా సీతేతి" ., అంటే సీతమ్మని చూచితిని అని,
సీతమ్మ క్షేమము గురించి క్లుప్తముగా చెపుతాడు.
అదే విని వానరులందరూ సంతోషపడతారు, గంతులు వేస్తారు
ఇది ఎలా జరిగిందో మనము ఈ సర్గలో వింటాము.
ఇక వాల్మీకి రాసిన కథ.
సీత కు నమస్కరించి హనుమ తిరుగు ప్రయాణమునకై
అరిష్ట పర్వతముఎక్కి ఆకాశములోకి ఎగిరెను.
ఈ సర్గ "స చంద్ర కుసుమం రమ్యం" అంటే
చంద్రుడు రమ్యమైన కుసుమము లాగా వున్నాడు అని
హనుమ తిరుగు ప్రయాణ వర్ణనతో మొదలవుతుంది.
అలా ఆకాశములో వాయువేగము తో ఎగురుచున్న హనుమ
ఒక పెద్ద ఓడ సముద్రాన్ని దాటినట్లు,
అవధి లేని సముద్రాన్ని అనాయాసముగా దాటుచుండెను.
ఆ అకాశములాంటి సముద్రములో
చంద్రుడు తెల్ల కలువలాగాను ,
సూర్యుడు కారండవ పక్షి లాగాను,
మేఘాలు పచ్చి బీళ్ళవలెను,
పుష్య శ్రవణ నక్షత్రములు కలహంసలుగానూ,
పునర్వసు నక్షత్రము మహామీనము గానూ,
కుజగ్రహము పెద్ద మొసలిగానూ ,
ఐరావతమే మహాద్వీపముగానూ,
స్వాతీ నక్షత్రము హంసగానూ ,
వాయుతరంగములు జలతరంగములుగానూ ,
చంద్రకిరణాలే చల్లని ఉదకముగనూ
యక్ష గంధర్వ ఉరగములు కలువలూ తామరల లాగానూ విరాజిల్లుతున్నారు.
మారుతాత్మజుడు, శ్రీమాన్ మహాకపి.
ఆ హనుమ తిరుగు ప్రయాణములో ఆకాశములో ఎగురుతున్నాడు.
ఎలా కనిపిస్తున్నాడుట?
ఆకాశమును మింగుతున్నాడా అన్నట్లు,
తారాధిపుని స్పర్శితూ పోతున్నాడా అన్నట్లు,
నక్షత్ర సూర్యమండలములతో కూడిన ఆకాశాన్ని హరిస్తున్నాడా అన్నట్లు,
మేఘసమూహాలను తనతో ఈడ్చుకుపోతున్నాడా అన్నట్లు,
అలాగ కనపడ్డాడుట హనుమ.
ఆ మేఘ సమూహాలలోకి ప్రవేసిస్తూ బయటికి వస్తున్న హనుమంతుడు,
మబ్బుల తో కప్పబడి మరల కనపడే చంద్రుని వలె ప్రకాశించెను.
ధవళవస్త్ర ధారి అయిన హనుమంతుడు
దట్టమైన మేఘములలో దూసుకు పోతూ
అప్పుడప్పుడు కనపడీ కనపడకుండా
మబ్బులచాటునుండు చంద్రుని వలె ప్రకాశించుచుండెను.
ఆ మహాతేజోమయుడైన హనుమంతుడు
పలువురు రాక్షసముఖ్యులను హతమార్చి,
"దాసోఽహం కౌసలేంద్రస్య" అంటూ
రామదాసుడిగా తనపేరుని చాటించుకొని,
లంకానగరమును అస్తవ్యస్తము చేసి,
ఘోరమైన బలముతో రావణునికి వ్యధకల్పించి,
వైదేహికి నమస్కరించి,
తిరుగు ప్రయాణములో మరల సాగరమధ్యము మీద ఎగురుతున్నాడు.
ఆ వీరుడు సముద్రమధ్యములో మైనాకుని స్పృశించి,
ధనస్సునుండి విడువబడిన బాణమువలె
మహావేగముకలవాడై పోసాగెను.
ఆ హరిపుంగవుడు మేఘములతో సదృశమైన
మహేంద్ర పర్వతము సమీపిస్తూ మహానాదము చేసెను.
మేఘగర్జనలాంటి నాదము కల ఆ మహాకపి
తన నాదముతో అన్ని దిశలనూ నింపివేసెను.
ఆ మహేంద్రగిరి ప్రదేశమును సమీపించి
మిత్రుల దర్శన లాలసుడైన హనుమంతుడు మహా నాదము చేసెను.
తన లాంగూలము అటూ ఇటూ తిప్పెను.
సుపర్ణ పథములో పోవుచున్న,
మహా నాదము చేయుచున్న,
ఆ హనుమంతుని నాదముతో
ఆకాశము బద్దలవుతున్నదా అన్నట్లు వుండెను.
ఆ సముద్రముయొక్క ఉత్తర తీరములో,
ముందునుంచే వున్నమహాబలులూ శూరులూ
వాయుపుత్రుని రాకకై ఎదురు చూచుచున్నవారూ
అపుడు ఆ మహత్తరమైన మేఘగర్జనలాంటి ఊరువేగముల శబ్దమును వినిరి.
మహేంద్ర పర్వతము మీద గుమిగూడి యున్న వానరులు
హనుమ రాకకై ఆత్రుతతో ఎదురు చూచుచున్నవారు.
దీనమైన మనస్థితో లో వున్న ఆ వానరులు
వానరేంద్రుని మేఘగర్జన లాంటి నాదము విని,
హనుమద్దర్శన కాంక్షతో ఉత్సాహముకలవారు అయిరి.
హరిశ్రేష్ఠుడైన ఆ జాంబవంతుడు ప్రీతితో నిండిన మనస్సు కలవాడై
అక్కడి వానరులందరితో ఈ విధముగా పలికెను.
"ఈ హనుమంతుడు అన్ని విధములుగా కృతకృత్యుడు.
కృతకృత్యుడు కాని వాని నాదము ఇలాగ వుండదు".
ఆ మహాత్ముని బాహువుల ఊరువుల వేగములతో
జనించిన శబ్దము వినిన వానరులు
సంతోషముతో అక్కడే గంతులు వేయసాగిరి.
ఆ సంతోషముతో హనుమంతుని చూడకోరినవారై
ఒక పర్వతమునుండి ఇంకో పర్వతముకు,
ఒక శిఖరమునుండి ఇంకో శిఖరమునకు ఎగరసాగిరి.
ఆ వానరులు వృక్షముల పైన కొమ్మలను పట్టుకొని ఊగుతూ ,
ఆ కొమ్మలను వస్త్రములవలే ఊపి తమ సంతోషము ప్రదర్శించిరి.
ఆ మారుతి గర్జన పర్వత గుహలలో
గాలితో ప్రతిధ్వనించు శబ్దము వలెనుండెను.
మహామేఘమువలె నున్న,
ఆకాశమునుండి దిగుతున్న,
ఆ మహాకపిని చూసి వానరులందరూ
అందెలు మోడ్చి నిలబడిరి.
అప్పుడు పర్వతాకారము కల హనుమ ,
వృక్షముల తో నిండిన మహేంద్రగిరి శిఖరములో దిగెను.
అమిత ఆనందముతో నిండిన,
రెక్కలులేని మహాపర్వతమువలె నున్న ఆ హనుమంతుడు
అప్పుడు ఆ పర్వత శిఖరముపై నున్న రమ్యమైన సెలయేరులో దిగెను.
అప్పుడు ఆనందభరితులైన ఆ వానరులందరూ
మహాత్ముడైన హనుమంతుని సమీపించి అతని చుట్టూ చేరిరి.
అలా చుట్టుముట్టి వారందరూ పరమానందభరితులైరి.
ఆ వానరులందరూ అతిసంతోషముతో,
సౌఖ్యముగా తిరిగివచ్చిన హనుమంతునికి
పూవులూ ఫలములూ తీసుకు వచ్చి సమర్పించిరి.
అప్పుడు హనుమంతుడు ముందుగా
గురువులు వృద్ధులైన జాంబవదాది ప్రముఖులకు
అంగదకుమారునకు వందనము చేసెను.
ఆ పూజనీయుడైన విక్రాంతుడు .
పూజింపబడినవాడై ,
పూజనీయులను తను పూజించి
సంక్షిప్తముగా " దృష్టా సీతేతి "
అంటే సీతమ్మను చూచితిని అని నివేదించెను.
అప్పుడు హనుమంతుడు వాలిపుత్రుని చేయి పట్టుకొని
ఆ మహేంద్రగిరి మీద రమణీయమైన ప్రదేశములో కూర్చొనెను.
అలా ఆనందభరితుడైన హనుమంతుడు ఆ వానరపుంగవులతో ఇట్లు పలికెను.
"అశోకవనములో నున్న,
అనేకమంది రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న,
ఒకే జడవేసికొని రామదర్శన లాలసతో వున్న ,
ఉపవాసదీక్షలతో కృశించి ఉన్న,
మలినమై వున్న,
నిందతగని జనకాత్మజను చూచితిని" అని.
అప్పుడు సీతను చూచితిని అన్న
మారుతియొక్క మహత్తరమైన
అమృతోపము అయిన
ఆ మాటను విని ఆ వానరులందరూ ఆనందభరితులైరి.
కొందరు మహాబలురు గర్జించిరి.
మరికొందరు నాదము చేసిరి.
మరికొందరు సింహనాదము చేసిరి.
కొందరు కిలకిలారావములు చేసిరి.
మరికోందరు గర్జనలను తమ గర్జనలతో ప్రతిధ్వనించిరి.
సంతోషపడిన కొందరు తమలాంగూలములను పైకెత్తిరి.
కొందరు తమతోకలతో నేలమీద కొట్టి సంతోషము వ్యక్తము చేసిరి.
ఇంకొందరు వానరులు సంతోషముతో శిఖరాగ్రములనుంచి దూకి హనుమంతుని స్పృశించిరి.
అప్పుడు ఆ వానరులందరి మధ్యలో హనుమంతునితో
అంగదుడు సముచితమైన మాటలతో ఇట్లు పలికెను.
" ఓ వానరా ఈ విస్తీర్ణమైన సాగరముని దాటి
మళ్ళీ వచ్చిన నీలాంటి వీరుడు ఎవడూ వుండడు.
అహా ఏమి నీ స్వామి భక్తి .
ఏమి నీ సాహసము.
అదృష్టముకొలదీ నీచేత యశస్విని అగు రామపత్ని చూడబడినది.
అదృష్టముకొలదీ కాకుత్‍స్థుని సీతావియోగ దుఃఖము తొలగిపోవును" అని.
అప్పుడు ఆనందభరితులైన వానరులందరూ
అంగదుని హనుమంతుని జామ్బవంతుని చుట్టూచేరి
పెద్ద పెద్ద శిలలపై కూర్చొనిరి.
ఆ వానరోత్తముని సముద్ర లంఘనము,
సీతా దర్శనము,
రావణునితో జరిగిన సంవాదము గురించి
వినకోరినవారై చేతులు జోడించి కూర్చుండిరి.
ఆ వానరులచేత చుట్టబడి వారి సేవలు అందుకుంటున్న
ఆ అంగదుడు అప్పుడు ఇంద్రునివలె కనిపించెను.
కీర్తిమంతుడైన హనుమంతుడు
అలాగే యశస్సు గల భుజకీర్తులు దాల్చిన అంగదుడు,
ఆసీనులైన ఆ పర్వతము అతి శోభాయమానముగా అలరారుచుండెను.
ఈ విధముగా వాల్మీకి చే రచించబడిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణములో సుందరకాండలో ఏబది ఏడవ సర్గ సమాప్తము.
|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||