||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఏబది తొమ్మిదవ సర్గ.||

||"తత్సర్వం ఉపపద్యతామ్|"||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకోనషష్టితమస్సర్గః||

తత్త్వదీపిక
ఏబది తొమ్మిదవ సర్గ.
"తత్సర్వం ఉపపద్యతామ్"

---

 

"తత్సర్వం ఉపపద్యతామ్"
అంటే "అదంతా చేయబడుగాక".
ఇది ఏబది తొమ్మిదవ సర్గలో హనుమంతుని చివరి మాట.

మరి ముందు ఏబది ఎనిమిదవ సర్గలో కూడా ,
హనుమ లంకలో జరిగిన కథ అంతా చెప్పి చివరిలో
"యన్ అకృతం శేషం"
అంటే చేయబడవలసినది ఏమన్నా మిగిలి వుంటే( శేషం)
అది చేయబడుగాక అని చెప్పాడు కదా.
ఇప్పుడు మళ్ళీ చెప్పడములో విశేషము ఏమిటి అనిపించవచ్చు.
తను చెప్పిన మాట మరచిపోయి మళ్ళీ చెపుతున్నాడా అని కూడా అనిపించవచ్చు.

రైట్ హానరబల్ వి యస్ శ్రీనివాస శాస్రిగారు
ఒక గొప్ప సంస్కృత పండితుడు, గొప్ప రామభక్తుడు.
( ఇంకా చాలా లక్షణాలు వుంటాయి అవి మనకు ఇప్పుడు అనవసరము)
ఆయన మద్రాసు సంస్కృత ఎకాడమీ ఆధ్వర్యములో
రామాయణము మీదా రామాయణములోని ముఖ్య పాత్రల మీద
1944 లో చాలా ఉపన్యాసాలు ఇచ్చారు ఇంగ్లిషు భాషలో.
రామాయణము మీద భక్తివున్నవారు, లేనివారు కూడా అవి వినతగినవి.
ఆయన రామాయణ ఉపన్యాసముల పుస్తకము చదవతగినది.
ఆయన ఉపన్యాసాలలో హనుమంతుడు ఎంత గొప్పవాడో ,
హనుమంతుడుది ఎంత కీలకమైన పాత్రో,
హనుమకి సీతమ్మవారి పై ఎంతభక్తో అన్నీ చెపుతూ
హనుమంతుడికి మతిమరుపు ఎక్కువ అని ప్రతిపాదించి,
దానికి కావలసిన సంఘటనలను విశదీకరిస్తాడు కూడా.
ఈ సర్గ చదువుతూంటే అది నిజమే నేమో అనిపిస్తుంది

ఈ సర్గ మొదటి శ్లోకము
"ఏతదాఖ్యాయ తత్ సర్వం" , అన్నమాటతో మొదలు అవుతుంది.
"ఏతదాఖ్యాయ తత్ సర్వం" అంటే
"లంకలో జరిగినది అంతా" చాలా విశదము గా చెప్పి,
మీరు ఏమి చేయాలో అది ఆలోచించండి అని కూడా చెప్పి,
తరువాత "భూయః" అంటే" మళ్ళీ", "సముపచక్రామ"
మళ్ళీ మాట్లాడడము మొదలెట్టాడన్నమాట.

అంటే హనుమ మనస్సులో ఏదో మెదలుతూ వున్నదన్నమాట.

ఏబది ఎనిమిదవ సర్గలో
జరిగిన కథ అంతా చెప్పాడు.
కాని తనమనస్సులో వున్నమాట చెప్పలేదు.
ఈ సర్గలో అది మనము వింటాము.

సీతాదేవి పాతివ్రత్యము చూసిన హనుమ,
ఆవిడ పాతివ్రత్యానికి అమ్ముడు పోయాడు.

హనుమ చెప్పడములో సీతాదేవి తనశక్తితో
రావణాసురుని దహించ వేయగలదు.
రావణ వధ నిశ్చయమే.
రాముని ద్వారా రావణ వధ నిమిత్తమాత్రమే అని.

ఇది అంతా చెప్పి ,
'రాముని దగ్గరకు సీతమ్మని కూడా తీసుకు వెళ్ళితే మంచిది',
అది ఆలోచిద్దాము అంటాడు.

సీతమ్మ తన చివరిమాటగా చెప్పినది,
" తత్ తస్య సదృశం" అంటే
రాములవారే వచ్చి స్వయముగా సీతను తీసుకు పోవడము
ఆయనకు తగిన కార్యము, అని.

అమాట సీతమ్మ పదే పదే చెప్పిన మాట.
"సీతమ్మని కూడా తీసుకు వెళ్ళితే మంచిది', అని అన్నప్పుడు
సీతమ్మ మాటని హనుమ పూర్తిగా మరిచి పోయాడన్నమాట.

ఈ సర్గలో ఇంకో విశేషము గమినించ వలసినది.
ఇక్కడ హనుమ అంటాడు.
"శీలమాసాద్య సీతాయాః"
అంటే సీతమ్మ శీలము పాతివ్రత్యము చూచి,
తన మనస్సు భక్తితో నిండి పోయినది అని.

అన్వేషణ మొదలు పెట్టినప్పుడు,
వానరులకు రాజ్యము పట్టముగట్టిన
రాముడి భార్యను వెదకడానికి బయలు దేరుతారు.
అది వాళ్ళ ఒప్పందములో చేసుకున్న ప్రతిజ్ఞ.

మొదటిసారి సీతమ్మను చూచి ఇలాంటి సీతను విడిచి
ఎలా ఉండగలుగుతున్నాడని ఆశ్చర్యపోయి,
రాముడి మీద గౌరవము పెరుగుతుంది హనుమకి.

సీతమ్మ కష్టాలు చూస్తూ ,
సీతమ్మ మాటలు విని,
సీతమ్మ మీద గౌరవము పెరుగుతుంది.
సీతమ్మ పాతివ్రత్యము గురించి హనుమ మాటలలో వింటాము

గౌరవము పరిపూర్ణమై భక్తిలోకి మారి,
హనుమ మనస్సు సీతమ్మ పై భక్తితో నిండిపోయినది.
రామకార్యార్థము సీతమ్మని వెదక బయలుదేరిన హనుమ లో
సీతమ్మపై భక్తి పరిపూర్ణత పొందడము సుందరకాండలో చూడతగిన విషయము

ఇంకో మాట.

జయమంత్రములో చెప్పబడిన శ్లోకము

"జయత్యతి బలో రామో
లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో
రాఘవేణాధిపాలితః"

ఆ శ్లోకము ఈ సర్గలో మళ్ళీ వింటాము.
రామలక్ష్మణ సుగ్రీవుల విజయము తథ్యము
అని చాటించి వచ్చాను అని చెప్పే సందర్భములో
ఈ శ్లోకము వింటాము.
ఏ సందర్భములో విన్నాలేక చదివినా
ఆ శ్లోకములో వున్న పటుత్వము మనదే.

ఇక సర్గలో వాల్మీకి మహాముని చెపిన రీతి గా
ఏబది తొమ్మిదవ సర్గలో జరిగినకథ విందాము.

హనుమంతుడు అలాగ లంకలో జరిగిన వృత్తాంతము అంతా చెప్పి
మళ్ళీ ఇంకా ఇలా చెప్పసాగెను.

'రాఘవుని కార్యము సుగ్రీవుని ప్రయత్నములు సఫలము.
సీతాదేవి యొక్క శీలము చూచి నా మనస్సు భక్తితో నిండిపోయెను.
ఆ రాక్షసాధిపుడు మహాతపస్సంపన్నుడు.
తన తపస్సుతో లోకములను దహించివేయగలవాడు.
ఆమెను స్పృశించినప్పటికీ తనతపోశక్తి వలననే అతడు నాశనము అవలేదు.'

'క్రోధముతో మండిపోతున్న జనకుని కూతురు ఏ పని చేయగలదో,
అది అగ్నిజ్వాలలు కూడా చేయలేవు.
కాని ఆమె రాముని అనుమతిలేనిదే ఏ పనీ చేయదు.
జాంబవదాది ప్రముఖుల అనుమతితో
ఇప్పటి వరకు జరిగిన వృత్తాంతము నివేదించితిని'.

'ఇప్పుడు మనము వైదేహి సమేతముగా
రామలక్ష్మణుల దర్శనము చేయుట సముచితము అని భావిస్తున్నాను'.

'నేను ఒక్కడినే రాక్షస బలములతో కూడిన లంకాపురమును
రావణుని కూడా నాశనము చేయగలను.
బలవంతులు విజయకాంక్షగల నిశ్చయమైన మనస్సుగలవారు,
ఆకాశములో ఎగరగలవారు అగు,
మీ అందరితో కూడితే ఇక చెప్పవలసినదేమి?'

'నేను యుద్ధములో అతని సైన్యముతో సహా ,
పుత్రులతో సహా, సహోదరులతో సహా రావణుని వధించగలను'.

'యుద్దములో ఇంద్రజిత్తు చే ప్రయోగింపబడు బ్రహ్మస్త్రము,
ఇంద్రుడు రుద్రుడు వాయువు వరుణు దేవుల అస్త్రములు
చూచుటకు కష్టమైనప్పటికీ
ఆ రాక్షసులందరినీ జయించి వధించెదను.'

'మీ ఆజ్ఞతో నా పరాక్రమము తో వారిని బంధించెదను.
యుద్ధములో నా చేత ప్రయోగింపబడిన నిరంతరమైన శిలావృష్టి తో
దేవతలు కూడా హతులు అవుతారు.
అ రాక్షసుల సంగతి చెప్పనేల'.

'సాగరము తన అవధి దాటవచ్చు.
మందర పర్వతము చలించవచ్చు.
కాని యుద్ధములో జాంబవంతుని ఎవరూ చలింపచేయలేరు.'

'వీరుడైన వాలి సుతుడు ఒక్కడే,
ఆ రాక్షస సమూహములన్నిటినీ నాశనము చేయుటకు చాలును.
పనసుని, నీలుని ఊరువేగమునకు
మందర పర్వతము కూడా చూర్ణమై పోవును.
ఇంక యుద్ధములో రాక్షసుల సంగతి చెప్పనేల.'

'దేవాసుర గంధర్వ ఊరగ పక్షులలో ఎవరు
మందుడు ద్వివిదులతో ప్రతి యుద్ధము చేయగలరు?
ఈ అశ్వినీ పుత్రులిద్దరూ వానర శ్రేష్ఠులు, మహబలశాలురు.
వీరికి ఎదురుగా పోరాడగలవారు నాకు కనపడుటలేదు.'

'వీరు పితామహుని వరముతో ఉత్సాహము కలవారు.
ఈ వానరసత్తములిద్దరూ అమృతము తాగినవారు.
పూర్వము బ్రహ్మదేవుడు అశ్వినీ దేవతలను సంతృప్తి పరచుటకు
వీరు ఎవరిచేతులో చావు లేకుండునట్లు వరము పొందిరి'.

'ఆ వరముచేత మదించినవారై ఆ వానరసత్తముల్లిద్దరూ
దేవతాసైన్యములను జయించి అమృతను సేవించితిరి.
కృద్ధులైన వీరిద్దరూ గుర్రములు రథములు ఏనుగులు కల సైన్యములతో సహా
లంకానగరమును నాశనము చేయగలరు.
మిగిలిన వానరులందరూ అవసరమే లేదు'.

హనుమంతుడు ఇంకా చెప్పసాగెను.

' నాచేత లంకానగరము పూర్తిగాధ్వంసము చేయబడి భస్మము చేయబడినది.
"మహాబలవంతుడైన రామునకు జయము.
మహాబలుడగు లక్ష్మణునికి జయము.
రాఘవుని పాలనలో ఉన్న సుగ్రీవునకు జయము.
వాయుపుత్రుడనైన నేను కోసలరాజు రాఘవుని దాసుడను.
హనుమాన్ అని పేరు గలవాడను"
అని అన్ని చోటలా చాటించితిని'.

'దురాత్ముడైన రావణుని అశోకవనిక మధ్యలో,
శింశుపావృక్షము క్రింద,
ఆ సాధ్వి రాక్ష రాక్షస స్త్రీలచేత చుట్టబడి వున్నది'.

'శోకసంతాపములతో నిండినదై
మేఘములతో కప్పబడిన చంద్రుని వలె వున్నది.
బలదర్పము తో విర్రవీగుతున్న రావణుని గురించి ఆలోచించకుండా,
కరుణకలిగించు స్థితిలో ఉన్నది'.

'పతివ్రత, సుందరమైన కటిప్రదేశము కలది,
నిర్బంధములో ఉన్నది అగు ఆ వైదేహి
మనస్సులో రామునే ధ్యానిస్తూ,
పౌలోమికి ఇంద్రునిమీద అనురాగమున్నట్లు
ఇతర ధ్యాస లేకుండా రామునిపై మనస్సు గలది అయి వున్నది'.

'ఒకటే వస్త్రము ధరించి,
ధూళిచేత కప్పబడి ,
శోకసంతాపములతో దీనముగా వున్న ఆ సీతమ్మ
భర్త హితమునే కోరుకొనుచున్నది'.

'విరూపులైన రాక్షసస్త్రీల బంధములో
మళ్ళీ మళ్ళీ భయపెట్టబడుతూ వున్న సీతమ్మ,
ఎల్లవేళలా భర్తపై చింతనలోమునిగియుండి
నేలపై పడుకొని ఉన్నది'.

'మంచుతో కప్పబడిన పద్మము వలెనున్న
రావణుని నుండి విముఖతతో మరణించుటకు నిశ్చయించుకున్న ,
రాక్షస స్త్రీల మధ్యనున్న సీతను చూచితిని'.

'ఆ లేడిపిల్లకనులవంటి కనులు గల ఆమెకి
అతి కష్టముతో విశ్వాసము కలిగించితిని.
సంభాషణ చేసిన పిమ్మట,
ఆన్నివిషయములు విడమరిచి తెలిసికొని,
రామసుగ్రీవుల మైత్రి గురించి విని ఆమె ప్రీతిని పొందెను'.

హనుమంతుడు ఇంకా చెప్పసాగెను.

' అపరాధముచేసిన ఆ దశకంఠుడు
ఇంకనూ చంపబడలేదు అంటే
దాని కారణము ఆమె యొక్క నియమపాలనా ,
భర్తపై నున్న అచంచల భక్తియే'.

'రాముడు రావణవధకు నిమిత్త మాత్రుడు'.

'ఆ మహానుభావురాలు ఈ విధముగా శోకములో మునిగి ఉన్నది.
ఇప్పుడు చేయవలసిన కర్తవ్యము మనందరము ఆలోచించవలెను'. అని

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఏభై తొమ్మిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||