||సుందరకాండ. ||
||తత్త్వదీపిక-అరువది ఆరవ సర్గ ||
||"హనుమన్ కథయస్వ మే"||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ షట్షష్టితమస్సర్గః||
తత్త్వదీపిక
అరువది ఆరవ సర్గ
"హనుమన్ కథయస్వ మే"
"హనుమన్ కథయస్వ మే"
అంటే 'హనుమ నాకు చెప్పు' అని.
రాముడు హనుమను అడుగుతాడు.
"మధురమైన,
మధురమైన మాటలు గల,
నా భామిని ఏమి చెప్పినదో
అది చెప్పు"
ఎందుకుట?
ఆ మాటలు వింటే
ఔషధములు తీసుకున్న వాని వలె జీవిస్తాడుట.
సుందరకాండలో ఈ సర్గ అంతా రాముడి మాటలే.
అరువది నాలుగులో ఆయన సమక్షములో జరిగినది కథ.
అరువది ఐదు లో ఆయన అడిగిన ప్రశ్నలు వినిపిస్తాయి.
ఈ సర్గలో రాముడు భాషణ మనకి వినిపిస్తుంది.
సీతమ్మ ఎన్నో కష్టాలలో వుంది
అని హనుమద్వారా విన్న రాముడు,
చూడామణిని చూచి ఇంకా విలపిస్తాడు.
విలపిస్తూ సుగ్రీవుడి తో మాట్లాడతాడు.
మొదటి మాటే వాత్సల్యము గురించి.
వాత్సల్యముగల ధేనువు హృదయము
దూడపైగల ప్రేమతో ఎలా ద్రవిస్తుందో,
అలాగ ఆ చూడామణిని చూచి రాముని మనస్సు ద్రవిస్తుంది.
అదే రాముడన్నమాట.
జీవాత్మ పరమాత్మలకలయికలో
పరమాత్మకు జీవాత్మ పై గల వాత్సల్యమును
ఇది సూచిస్తుంది అంటారు అప్పలాచార్యులవారు.
రాముని మాటలతో రామునికి సీతపై ఉన్న
ప్రేమ మనకి విదితమౌతుంది.
ఇక రాములవారి మాటలను విందాము
' ఏవిధముగా ధేనువు తన దూడను చూడగానే
వాత్సల్యముతో క్షీరమును ద్రవించునో
ఆ విధముగా ఈ మణిరత్నమును చూచి
నాహృదయము ద్రవించుచున్నది.
ఈ మణి రత్నమును విదేహమహరాజు అయిన నా మామగారిచేత
వివాహ సమయములో సీతకు ఇవ్వబడినది.
వివాహ సమయములో సీత తలపై ధరించబడినపుడు
ఆ చూడామణి అత్యధికముగా శోభించెను.
జలమునుంచి ఉద్భవించిన ఈ మణి
సజ్జనులచే పూజింపబడినది.
ఈ మణి ఒక యజ్ఞములో ఆనందభరితుడైన ఇంద్రుని చేత ఇవ్వబడినది.
ఓ సౌమ్యుడా ! ఇప్పుడు ఈ శ్రేష్ఠమైన మణి ని చూచి
తండ్రి గారి దర్శనము,
ఆలాగే పూజ్యుడైన విదేహమహరాజును చూచినట్లు అనిపించుచున్నది.
ఈ మణి నాప్రియురాలైన సీత శిరస్సునందే శోభించును.
దీనిని ఇప్పుడు చూచి నేను ఆమెను పొందితినా అని అనిపించుచున్నది'.
ఓ సౌమ్యుడా హనుమా! దప్పికగలవానికి నీరులాగ
వైదేహి వాక్యములను మరల వినిపించుము.
సీత ఏమి అన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుము.
ఓ సౌమిత్రీ ! వైదేహి లేకుండా
ఈ నీటిలో పుట్టిన మణి ని చూచుటకన్నా దుఃఖము కలిగించునది ఏమి?
ఓ సౌమ్యుడా !హనుమా ! వైదేహి ఒక మాసము జీవించినచో చిరకాలము జీవించును.
నల్లని కనులు గల సీత లేకుండా నేను ఒక క్షణము కూడా జీవించలేను.
ఎక్కడ నా ప్రియురాలు ఉన్నదో ఆ దేశమునకు నన్ను తీసుకొని పొమ్ము.
ఆమె పరిస్థితి తెలిసిన తరువాత ఓక క్షణము కూడా నిలువజాలము.
ఆ సుందరాంగీ, భయపడునదీ అగు సీత
భయంకరులైన ఘోరముగా వుండు ఆ రాక్షసులమధ్యలో ఎట్లు ఉండును?
శరత్కాలచంద్రబింబము లాంటి ఆమె వదనము
నీటితో నిండిన మేఘములతో కప్పబడిన చంద్రునివలె
రాక్షసులచేత చుట్టబడి ప్రకాశించదు.'
'ఓ హనుమా ! ఇప్పుడు సీత ఏమి చెప్పినదో యథా తథముగా చెప్పుము.
ఆ మాటలతో ఔషధము సేవించినవాని వలె జీవించెదను.
మధురమైన మధురముగా మాట్లాడు స్త్రీరత్నము
నా వియోగములో నున్న నా భామిని
ఏమి చెప్పెను?.
అది చెప్పుము".
ఈ విధముగా రామ విలాపముతో వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఆరవ సర్గ సమాప్తము.
|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||